విజయనగరం మహారాజా మహిళా కళాశాలలో 70-72 బేచ్ లో నేను బీయస్సీలోనూ , విజయవాహినీదేవి బియ్యే లోనూ సహాధ్యాయులం. అందుచేత మొదటి రెండేళ్ళు ఇంగ్లీష్, తెలుగు క్లాసుల్లో మాత్రమే అన్ని గ్రూపుల విద్యార్థినులం కలిసే వాళ్ళం. అటెండెన్స్ పిలిచినప్పుడు విజయవాహినీదేవి పేరు నన్ను ఆకర్షించేది. ఆ అమ్మాయి ఎందువలనో ఆలస్యంగా కాలేజీలో క్లాసులకు హాజరైంది.కుతూహలంగా ఆమెకోసం ఎదురుచూసి తీరా ఆ అమ్మాయిని చూసి అవాక్కయ్యాను.వంకరముఖంతో,పైకి వుబికిన కనుగుడ్లతో, బొంగురు గొంతుతో మరుగుజ్జు అమ్మాయిని విజయవాహినీదేవిగా చూసాను.
ఆ అమ్మాయి కాలేజీలో హాస్టల్ లో వున్నా స్నేహితులతో కలిసేది కాదు.ఇంగ్లీష్, తెలుగు క్లాసుల్లో ఎవరి గ్రూప్ వారితో వాళ్ళే కూర్చోవడంతో విజయవాహిని ఎదురైనప్పుడు హలో చెప్పడమో,ఒక పలకరింపు చిరునవ్వు విసరటమో తప్ప స్నేహం లేదు .అది నన్ను ఎప్పటికప్పుడు కించపరుస్తూనే వుండేది. కథలో రాసిన సినీమాహాల్ సంఘటన కూడా ఆ నాటి అనుభవమే. దానినే కథగా మలిచాను. నేను రాసిన “పరాజిత” కథలో అపరాజిత పాత్ర విజయవాహినీదేవే.
నాకు అక్షరాలు రాయటం రాకముందే అక్కయ్య నాకోసం పంపిన సోవియట్ లాండ్ బొమ్మల పుస్తకాల నాటినుండి ఎదుగుతూ నేను తెలుగు సాహిత్య పుస్తకాలపురుగునే అయ్యాను. పెద్దక్క పి.సరళాదేవీ, చిన్నన్నయ్య కొడవంటి కాశీపతిరావూ కథకులు కావటంతో కథాసాహిత్యం విపరీతంగా చదివేదాన్ని.కాలేజీ మాగజైన్లో రాయటమే కాక కథలు కొన్ని రాసినా చదువు అశ్రద్ధ చేస్తున్నానని ఇంట్లో కోప్పడతారని కథల్ని పుస్తకాలు కింద దాచేసేదాన్ని.
1967లో వచ్చిన కుటుంబరావుగారి కురూపి నవల చదివిన తర్వాత కథానాయిక అందాలరాశిగా, సకల సద్గుణరాసిగానే వుండాలా అనే ఆలోచన నాకు కలుగుతూ వుండేది.అందువల్ల నా సహాధ్యాయిని చూసి ” పరాజిత” కథని రాసాను. కానీ పోష్టు చేయలేదు.

స్వాతి మాసపత్రిక ప్రారంభసంచికలో గౌరవసంపాదకులుగా శీలా వీర్రాజుగారి పేరు చూసి ఆయన రచనల గురించి దేవి పేరుతో కొన్నాళ్ళు వీర్రాజుగారికి కలం స్నేహంగా ఉత్తరాలు రాయడం, తదనంతరం వీర్రాజుగారికి నేను తన మేనమామ కూతుర్నే అని తెలిసి వివాహం చేసుకుంటానని ఉత్తరంలోనే అడగటం జరిగింది.మేనత్త మేనమామ పిల్లలమే అయినా అప్పటికే సుమారు పది పదిహేను ఏళ్ళుగా మా రెండు కుటుంబాల మధ్య సయోధ్య లేదు. నా సాహిత్యమోహం వలన మళ్ళా కలవటం జరిగింది.
ఆ సందర్భంలో మాఇంటికి వచ్చిన వీర్రాజుగారికి అప్పటికే రాసిన నా కథల్ని చూపించాను.అందులో మూడు కథల్ని ఎంపిక చేసి పత్రికలచిరునామాలు ఇచ్చి పోష్టు చేయమని చెప్పారు.ఆ విధంగా 9-10-1970 పొలికేక వారపత్రికలో కొడవంటి సుభద్రాదేవి పేరుతో నా మొదటి కథ ప్రచురితం అయ్యింది.
సెకెండియర్లో నా వివాహానంతరం విజయనగరంలోనే వుండి నా డిగ్రీ చదువు పూర్తి చేసుకొనే 1972లో హైదరాబాద్ వచ్చాను. నాకు వివాహం అయ్యిందనే విషయం అందులోనూ ఒక ప్రముఖ రచయితతో నాటకీయంగా జరగటం మా కాలేజీలో ఒక సంచలనం కలిగించింది.ముఖ్యంగా సభావివాహం జరగటం వలన కుతూహలంతో మా వివాహానికి లెక్చరర్లు కూడా వచ్చారు. వివాహానంతరం కాలేజీకి వెళ్తే అందరూ నన్ను ఓహీరోయిన్లా చూసి అభినందించారు.ఆ సందర్భంలో విజయవాహిని కూడా అభినందించింది.నా వివాహానికి ముందేరాసిన “పరాజిత” కథలో సుమకి పెళ్ళికానుకగా అపరాజిత “కురూపి” నవల పంపటం కల్పించాను.
మొదటికథే నాకు మంచిపేరు తెచ్చింది. వీర్రాజుగారు వివాహ ఆహ్వానపత్రిక ఇచ్చినప్పుడు ఒకరిద్దరు “ఆ మధ్య పొలికేక లో కథ చదివాను ఆ అమ్మాయేనా?” అని తనని అడిగారని చాలా సంబరంగా చెప్పటం మర్చిపోలేను. రచయితల తొలికథలను పరిచయం చేస్తున్న కె వి ఎస్ వర్మ గారు 2023 ఆగష్టు సంచికలో నా కథ “పరాజిత”ను పరిచయం చేసారు.
త్వరలో ప్రచురితం కాబోతున్న నా సమగ్ర కథల సంపుటికి కాత్యాయని విద్మహేగారు రాసిన ముందుమాటలో ప్రత్యేకంగా ఈ కథను ప్రస్తావిస్తూ “అందమే ఆనందం, ఆనందమే జీవిత మకరందం” వంటి పాటలు అందంలేని వాళ్లకు ఆనందం, జీవితం లేనట్లే అని చెప్పకనే చెప్తుంటాయి. నిజానికి శారీరక వైకల్యాన్ని, ఆకారాన్ని, రంగును, జుట్టును, కట్టు బొట్టును బట్టి స్త్రీ పురుషులెవరినైనా అవమానపరచటం బాడీషేమింగ్గా ఈనాడు అందరికీ తెలిసిందే. అది గౌరవంగా జీవించటానికి మనుషులకు ఉన్న ప్రాధమిక హక్కుకు భంగకరం అన్న చైతన్యం ఈ నాటిది. ఆ క్రమంలోనే బాడీషేమింగ్కి వ్యతిరేకంగా సామూహికచైతన్యంతో ఉద్యమాలు నిర్మించబడటం వర్తమానవాస్తవం. ఆ దిశగా పెంచుకోవాల్సిన సంస్కారాల గురించిన ఆకాంక్ష అర్థశతాబ్ది క్రితమే (1970) సుభద్రాదేవి వ్రాసిన అపరాజిత కథలో ప్రతిఫలించటం ఆశ్చర్యకరం.”అని ప్రశంసించారు.
హైదరాబాద్ వచ్చాక ఇంట్లో కవిత్వం వాతావరణం ఉండటం,ఉమ్మడి కుటుంబంలో కథ అల్లటానికి కావలసినంత సావకాశం సమకూర్చుకోలేక కవిత్వంలోకి వచ్చియాభైఅయిదేళ్ళ సాహిత్య జీవితంలో పదకొండు కవిత్వపుస్తకాలు తెచ్చినా,కథని మాత్రం వదిలేయలేదు . అప్పుడప్పుడు రాసిన కథలు మూడు సంపుటాలుగా వచ్చాయి.
*
Add comment