రమేశ్ నాయుడు – ఈ పదం నా చెవులకు ఓ అద్భుతంలా తోస్తుంది. నా ఊహాలోకంలో ఆయనో స్వర శిల్పిగా సాక్షాత్కరిస్తారు. తన వేలి చివరల నుంచి సంగీతాన్ని అలలుగా విసిరేస్తారు. ఆ తీపి అలజడికి ఉక్కిరిబిక్కిరై తేరుకునేలోపే మాయమైపోతారు. నా మటుకు నాకు రమేశ్ నాయుడు అంటే ఇంతే! ఆయన కలా నిజమా అన్న సందేహం వస్తుందొక్కోసారి. ఆ మరుక్షణమే ఆయన వదిలిపోయిన స్వర నిధులు గుండెలో మార్మోమోగుతాయి. ఆయన నిజం, ఆయన సంగీతం నిజం అని నొక్కి చెబుతాయి.
***
గుండెను లాలించి మత్తులో ఓలలాడించే melodies సృష్టించాలంటే రమేశ్ నాయుడు తర్వాతే ఎవరైనా. మాధుర్య ప్రధానమైన పాటలే కలకాలం నిలుస్తాయని గట్టిగా నమ్మేవారాయన. ఈ విషయంలో తనను సాలూరివారు బాగా ప్రభావితం చేశారని ఓ ఇంటర్ వ్యూలో చెప్పుకొచ్చారు. ఎట్టి పరిస్థితుల్లోనూ సాహిత్యానికే బాణీలు కట్టేవారు. అందుకే ఆ పదాల సొగసు చెక్కు చెదరదు. భావం నేరుగా మనసును తాకుతుంది. చాలా మంది స్వరకర్తలు చెవులకు హాయినిచ్చే పాటలు కూర్చుతారు. కానీ రమేశ్ నాయుడి పాటలు చెవులను, మనసును కూడా దాటొచ్చి ఆత్మను కదిలిస్తాయి.
అదేంటో రేడియోలో announcers రమేశ్ నాయుడు పేరు చెబితే వినడమే తప్ప నిన్న మొన్నటిదాకా విడిగా ఎక్కడా ఆయన గురించి విన్నది లేదు. మిగతా సంగీత దర్శకులకు వచ్చినంత గుర్తింపు ఆయనకు రాలేదేమో అనిపిస్తుంది. చిన్నపాటి పరిశోధన చేసి ఆయన గురించి కొంత సమాచారం రాబట్టగలిగాను.
పసుపులేటి రమేశ్ నాయుడు 1933లో నవంబర్ 25న కృష్ణాజిల్లా కొండపల్లిలో జన్మించారు. తెలుగు కంటే హిందీ సినీ గీతాలే ఆయన్ని ఎక్కువగా ప్రభావితం చేశాయి. అందుకే హిందీ సినిమాల్లో గాయకుడు కావాలన్న కోరికతో ఇంటి నుంచి పారిపోయి బొంబాయి చేరుకున్నారు. కొన్నాళ్లు ఢక్కాముక్కీలు తిన్నాక BR చోప్రాను చేరుకోగలిగారు. అప్పుడాయన కొన్ని రచనలకు బాణీలు కట్టమన్నారు. నాయుడు గారు వెంటనే బాణీలు కట్టేసి చోప్రాను ఆశ్యర్యపరిచారట. దీంతో చోప్రా HMV కంపెనీకి ఆయన్ను రికమెండ్ చేశారు. ఇలా 14 ఏళ్ళ వయసులోనే నాయుడు గారు HMV కంపెనీలో orchestration and music instrumentationలో train అయ్యారు. 16 ఏళ్ళ వయసులోనే “బంద్వల్ పహీజా” అనే ఒక మరాఠీ సినిమాకి సంగీతం అందించారు. ఆ టైంలోనే ప్రముఖ గాయని షంషాద్ బేగం HMV స్టూడియోకి వచ్చారు. ఆవిడ పాడబోయే పాట ట్యూన్ చేసేది 16 ఏళ్ళ రమేశ్ నాయుడే అని తెలుసుకుని ఆశ్యర్యపోయారు. ఆయన చేయగలరా అని సందేహించారు. కానీ ఆయన చక్కటి ట్యూన్ ఇచ్చి షంషాద్ బేగం మెప్పు పొందారు. ఎందుకనో ఆ పాట ఆవిడ పాడలేకపోయినా ఆవిడ ఆశీస్సులు మాత్రం నాయుడు గారితో ఉండిపోయాయి.
హిందీలో రమేశ్ నాయుడు చేసిన ఏకైక సినిమా 1954లో వచ్చిన “హామ్లెట్”. ఈ సినిమా పెద్దగా ఆడకపోవడం ఆయన్ను నిరాశపరిచింది. ఆ తర్వాత ఆరోగ్య కారణాల వల్ల రమేశ్ నాయుడు మద్రాసు వచ్చేశారు. 1957లో ప్రముఖ నటి సి. కృష్ణవేణి నిర్మించిన “దాంపత్యం” సినిమాకు సంగీతం అందించారు. అదే ఆయనకు తొలి తెలుగు చిత్రం. ఆ తర్వాత 1959లో “మనోరమ” సినిమా కోసం హిందీ గాయకుడు తలత్ మెహమూద్ తో ఏకంగా నాలుగు పాటలు పాడించారు. కానీ పేరు వస్తున్న టైంలో కలకత్తాకి మకాం మార్చారు. అక్కడ ఓ బెంగాలీని పెళ్ళి చేసుకున్నారు. అక్కడే పదేళ్ళ పాటు బెంగాలీ, నేపాలీ, ఒరియా సినిమాలకు పని చేశారు.
మళ్ళీ 1972లో “అమ్మ మాట” సినిమాతో తెలుగులో ఆయన 2nd innings మొదలైంది. ఈ సినిమాలో ఎంత బాగా అన్నావు, ఎప్పుడూ మీ పాఠాలంటే పాటలు evergreen hits. ఇక LR ఈశ్వరి పాడిన మాయదారి సిన్నోడు పాట గురించి చెప్పేందేముంది. సినారె రాసిన ఈ మత్తెక్కించే పాటను రమేశ్ నాయుడు అంతే గమ్మత్తుగా స్వరపరిచారు.
1973లో హీరో కృష్ణ నిర్మించిన “దేవుడు చేసిన మనుషులు” సినిమాలో విన్నారా అలనాటి వేణుగానం ఎంత హాయిగా ఉంటుందో మసక మసక చీకటిలో అన్న ఐటమ్ సాంగ్ అంత కవ్విస్తుంది.
రాజశ్రీ పాటల రచయితగానే మనందరికీ తెలుసు. కానీ ఆయన సంగీత దర్శకత్వమే కాదు సినిమాలకు కూడా దర్శకత్వం వహించారు. 1975లో ఆయన డైరెక్ట్ చేసిన “చదువు-సంస్కారం” సినిమాకి రమేశ్ నాయుడు సంగీతం అందించారు. ఇందులోని దీపానికి కిరణం నా all-time favouritesలో ఒకటి.
రమేశ్ నాయుడు సంగీత ప్రయాణాన్ని గొప్ప మలుపు తిప్పింది తెలుగు సినిమాకే మూల స్తంభాల్లాంటి ముగ్గురు దర్శకులు! వారే- దర్శక రత్న దాసరి నారాయణరావు, హాస్య బ్రహ్మ జంధ్యాల, గిన్నిస్ బుక్ లో చోటు సాధించుకున్న విజయ నిర్మల! ఈ ముగ్గురి సినిమాలకు ఎక్కువగా music compose చేయడమే కాదు వాళ్ళు దర్శకత్వం వహించిన మొదటి సినిమాలకు స్వర కల్పన చేసిన ఘనత కూడా రమేశ్ నాయుడిదే.
దర్శకరత్నతో రమేశ్ నాయుడు అనుబంధం 1972లో వచ్చిన “తాత మనవడు” సినిమాతో మొదలైంది. దర్శకుడిగా దాసరికి ఇది మొదటి సినిమా. ఇందులో రమేశ్ నాయుడు కూర్చి, రామకృష్ణ పాడిన అనుబంధం ఆత్మీయత అంతా ఒక బూటకం అనే పాట ఇప్పటి తరం కూడా పాడుకుంటోంది. 1974లో దాసరి దర్శకత్వంలోనే వచ్చిన “రాధమ్మ పెళ్ళి” రమేశ్ నాయుడికి మంచి పేరు తెచ్చి పెట్టింది. ఆడది కోరుకునే వరాలు అని జానకమ్మ పాడిన మెలోడీ మనసుకు హాయినిస్తే, అయ్యింది రాధమ్మ పెళ్ళి అంటూ రమేశ్ నాయుడే స్వయంగా పాడిన title song ఆర్ద్రతతో మనసును బరువెక్కిస్తుంది.
1976లో బాలచందర్ గారి “అపూర్వ రాగంగళ్” అనే తమిళ సినిమాను తెలుగులో “తూర్పు పడమర”గా తీశారు దాసరి. తమిళ పాటల్నేయథాతథంగా వాడకుండా కొత్త బాణీలు కట్టే స్వేచ్ఛనిచ్చారు. స్వరములు ఏడైనా అంటూ సి. నారాయణరెడ్డి గుప్పించిన తాత్వికతను రమేశ్ నాయుడి బాణీలో అంతే చక్కగా పలికించారు సుశీలమ్మ. అలాగే ‘శివరంజని నవరాగిణి’ అంటూ సినారె రాసిన క్లిష్టమైన సాహిత్యానికి శివరంజని రాగంలో ఆయన చేసిన స్వర కల్పన అటు మాస్ ని ఇటు క్లాస్ ని ఆకట్టుకుంది. ఈ పాటకు కొనసాగింపుగానే 1978లో దాసరి “శివరంజని” సినిమా తీశారని చెబుతారు. “శివరంజని” పాటల గురించి వేరే చెప్పాలా? జోరు మీదున్నావు తుమ్మెదా అంటూ కల్యాణి రాగంలో కమ్మగా సాగే పాటను సుశీలమ్మ పాడారు. నాలుగే నాలుగు వాయిద్యాలతో ఇంత గొప్ప స్వర ముత్యాన్ని సృష్టించడం బహుశా ఆ స్వర బ్రహ్మకే చెల్లిందేమో! దాసం గోపాలకృష్ణ జానపద రీతిలో రాసిన పదాలకు నాయుడు గారు చేసిన స్వర రచన సాలూరి రాజేశ్వరరావునే సమ్మోహనపరిచిందట. నవమి నాటి వెన్నెల నీవు వెన్నెలంత మెత్తగా అనిపిస్తుంది. సందమామ వచ్చాడమ్మా అంటూ చందమామలా చల్లగా తాకే పాట, అభినవ తారవో లాంటి పాటలు రమేశ్ నాయుడి పనితనానికి మచ్చుతునకలు.
1977లో వచ్చిన “చిల్లర కొట్టు చిట్టెమ్మ” తెలుగు సినిమా చరిత్రలో ఓ ప్రభంజనం. దాసం గోపాలకృష్ణ రాసిన నాటకాన్ని అంతే అద్భుతంగా తెరకెక్కించారూ దాసరి. ఈ సినిమాలో తల్లి గోదారికే ఆటుపోటుంటే అంటూ సినారె గుండెకు హత్తుకునేలా రాసిన పాటకు తన గొంతుకతో కొత్త ఊపిరి పోశారు రమేశ్ నాయుడు. గాయకుడిగా ఆయనకు నంది అవార్డు తెచ్చి పెట్టిందీ పాట. ఇక సినారె రాసి, జానకమ్మ పాడిన సువ్వీ కస్తూరి రంగా ఎంత హాయిగా ఉంటుందో సుశీలమ్మ పాడిన సుక్కల్లో పెద సుక్క అంతగా హృదయాన్ని బరువెక్కిస్తుంది. చూడు పిన్నమ్మ అనే కొంటె పాట ఎంత trend create చేసిందో వేరే చెప్పాలా? ఇదే సినిమాలో దాసం గోపాల కృష్ణ రాసిన చీటికి మాటికి చిట్టెమ్మంటే అనే సరదా పాట కూడా నాకు బాగా నచ్చుతుంది. బహుశా ఇక్కడి నుంచే రమేశ్ నాయుడు, దాసం గోపాలకృష్ణకు జత కుదిరిందేమో! నాయుడు గారు స్వరపరిచిన తర్వాతి సినిమాల్లో చాలా పాటలే రాశారాయన.
1979లో దాసరి డైరెక్షన్ లో వచ్చిన “కల్యాణి” ఒక మాస్టర్ పీస్. అందులో దాసం గోపాలకృష్ణ రాసిన గుబులు పుట్టిస్తావు అనే పాటలో నాయుడు గారు ఒకే సాహిత్యాన్ని రెండు బాణీలతో పలికించి గొప్ప ప్రయోగం చేశారు. ఇందులోనే నవరాగానికి నడకలు వచ్చెను, లలిత కళారాధనలో లాంటి పాటలు చిరస్థాయిగా నిలిచిపోతాయి.
1982లో దాసరి, రమేశ్ నాయుడు కాంబినేషన్ లోనే వచ్చిన సినిమా “జయసుధ”. నాయుడు గారికి బాగా నచ్చిన రాగాల్లో ఒకటైన కల్యాణిలో కంపోజ్ చేసిన టైటిల్ సాంగ్ లో ప్రణయ కావ్యమున ప్రథమ పంక్తివో అంటూ సినారె చిక్కటి పదాలతో చక్కటి కవితలల్లారు. ఇదే సినిమాలో తేలికైన మాటలతో హాయిగా సాగిపోయే గోరువెచ్చని సూరీడమ్మా అన్న పాటంటే నాకు చాలా ఇష్టం.
1983లో దాసరి, రమేశ్ నాయుడు, ANR కాంబినేషన్ లో రెండు గొప్ప సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి- బహుదూరపు బాటసారి! ఇందులోని మేఘమా నీలి మేఘమా అనే దాసరి రచనకు సుశీలమ్మ తన గొంతుకతో ప్రాణం పోశారు. ఇక రెండో సినిమా తెలుగు సినీ దారుల్లో మరిచిపోలేని మైలురాయి. అదే మేఘ సందేశం! పాటల తేనెపట్టు లాంటి ఈ సినిమాలో ఒక్కో పాట ఒక్కో మకరందపు చుక్క. ఆకులో ఆకునై పాట వినని తెలుగువారుండరేమో! కృష్ణశాస్త్రి కవితను రమేశ్ నాయుడు ఇలా అద్భుతంగా మలిచారు. చిన్నప్పుడు రేడియోలో ఈ పాట వస్తుంటే ఆ కాసేపు కాలం ఆగిపోతే బావుండు అనిపించేది. ఇక దేవులపల్లి వారే రాసిన ముందు తెలిసెనా ప్రభూ, సిగలో అవి విరులో, శీతవేళ రానీయకు లాంటి పాటలు, వేటూరి విరచించిన నిన్నటి దాకా శిలనైనా లాంటి స్వర ముత్యాలు, రాధికా కృష్ణా, ప్రియే చారుశీలే వంటి జయదేవుని అష్టపదుల గురించి ఎంత చెప్పినా తక్కువే. పాడనా వాణి కల్యాణిగా అంటూ మంగళంపల్లి బాలమురళీకృష్ణ పాడిన పాట ఆయనకు శాస్త్రీయ సంగీతంతో సమానమైన పేరు తెచ్చి పెట్టింది. వేటూరి రాసి, జేసుదాస్ పాడిన ఆకాశ దేశాన రమేశ్ నాయుడికి జాతీయ అవార్డు తెచ్చి పెట్టింది. దీంతో పాటు ఆయన్ను వరించిన రెండు నంది అవార్డులూ దాసరి సినిమాలకే రావడం విశేషం.
1973లో వచ్చిన “మీనా” విజయ నిర్మల దర్శకత్వం వహించిన తొలి సినిమా. ఈ సినిమా విజయంలో రమేశ్ నాయుడు స్వరపరిచిన పాటలది కీలక పాత్ర. మల్లె తీగ వంటిది మగువ జీవితం ఎంత హాయిగా ఉంటుందో పెళ్ళంటే నూరేళ్ళ పంట అంత విషాదాన్ని పలికిస్తుంది. శ్రీరామ నామాలు శతకోటి అన్న పాట సుతిమెత్తగా మనసును మీటుతుంది.
1974లో విజయ నిర్మల దర్శకత్వంలో వచ్చిన “దేవదాసు” కమర్షియల్ హిట్ కాకపోయినా ఆరుద్ర రాసిన పాటలు, వాటిని రమేశ్ నాయుడు స్వరపరిచిన విధానం జనాన్ని ఆకట్టుకున్నాయి. ఈ సినిమాలో పొరుగింటి దొరగారికి అన్న పాట వింటే ఎక్కడలేని ఉత్సాహం వస్తుంది నాకు.
ఇక 1979లో వచ్చిన “హేమాహేమీలు” ANR, కృష్ణ మెయిన్ రోల్స్ లో విజయ నిర్మల డైరెక్ట్ చేసిన యాక్షన్ మూవీ. ఇందులోని నీ కోల కళ్ళకు నీరాజనాలు అనే పాట హాయిగా సాగిపోతుంది. ఏ ఊరు ఏ వాడ అందగాడా క్లబ్ సాంగే అయినా మెత్తగా తాకుతుంది.
1981లో జంధ్యాల దర్శకత్వంలో వచ్చిన మొదటి సినిమా “ముద్ద మందారం”. రెండు లేత మనసుల మధ్య పుట్టిన ప్రేమ కథకు ముద్దుకే ముద్దొచ్చే, అలివేణీ ఆణిముత్యమా, నీలాలు కారేనా లాంటి పాటలు మరింత వన్నె తెచ్చాయి. ఈ సినిమా అటు జంధ్యాలకు, ఇటు రమేశ్ నాయుడికి గొప్ప పేరు తెచ్చి పెట్టింది.
జంధ్యాల, రమేశ్ నాయుడు, వేటూరి కాంబినేషన్ లో “ముద్ద మందారం” మొదలుకొని “అహ నా పెళ్ళంట” వరకు ఎన్నోఆణిముత్యాలు మెరిశాయి. వేటూరి సొగసైన పదాలు రమేశ్ నాయుడు అందమైన బాణీల్లో ఒదిగి దర్శక బ్రహ్మ ఫ్రేములో జీవం పోసుకున్నాయి.
కళాతపస్వి ప్రేరణతో జంధ్యాల తీసిన సినిమా “ఆనంద భైరవి”. “మేఘసందేశం”తో అల్లంత ఎత్తుకు చేరుకున్న రమేష్ నాయుడు “ఆనందభైరవి”తో తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నారు. ఈ సినిమాలో ఆయన ఆనంద భైరవి రాగంలో పాట కడితే, వేటూరి అందమైన ఆ మాటను వదిలిపెడతారా? పిలిచిన మురళికి అంటూ మువ్వలా మోగే పాటలో పల్లవిలోనే ఆనంద భైరవి రాగానికి చోటిచ్చేశారు. నెమ్మదిగా సాగే ఆనంద భైరవి రాగంలో ఇంత వేగంగా పాటను కూర్చడం గొప్ప ప్రయోగమని చెబుతారు. ఆ ప్రయోగానికి బాలు, జానకమ్మల యుగళం ఎంతందం తెచ్చిందో!
రమేశ్ నాయుడి ఆఖరి సినిమా కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన “స్వయంకృషి”. ఈ సినిమాలో పారా హుషార్ అంటూ హుషారెత్తిస్తారు, సిగ్గూ పూబంతి అంటూ సిగ్గుల మొలకలేయిస్తారు. ఇక సిన్నీ సిన్నీ కోరికలడగా అయితే జానకమ్మ గొంతులో హాయిగా సాగిపోతుంది. రమేశ్ నాయుడు, సిరివెన్నెల సీతారామశాస్త్రి కాంబినేషన్ లో వచ్చిన అతి తక్కువ సినిమాల్లో ఇది చెప్పుకోదగ్గది.
“స్వయంకృషి” సినిమా సాధించిన ఘన విజయం చూడకుండానే రమేశ్ నాయుడు 1987 సెప్టెంబరు 3న, 54 ఏళ్ళ వయసులోనే సుదూర స్వర తీరాలకు తరలిపోయారు. ఆయన సంగీతం సమకూర్చిన తెలుగు సినిమాలు వందకి మించవు. ఆయన మరికొంత కాలమున్నా… మొదటి నుంచి తెలుగు సినిమాలకే పరిమితమైనా, మన పాటల దశ, దిశ మరోలా ఉండేదేమో! ఎందుకో ఆయన్ను తలుచుకున్నప్పుడల్లా కన్నుతెరిచి చూసేలోగా నిన్నలలో నిలిచావు అన్న మాటలే పదే పదే గుర్తొస్తుంటాయి.
*
చాలా బాగా రాశారు.
అరుదైన ఆణిముత్యం రమేష్ నాయుడి గారి విలువైన సమాచారం ఇచ్చారు చాలా చక్కని విశ్లేషణ శాంతి గారికి ధన్యవాదాలు 🙏
Excellent compilation & tribute to Sri Ramesh Naidu Garu💐