“ ఆ … నా గోదారిగంగ …”

ముందు రోజు మధ్యాహ్నం రెండింటి కల్లా కాశీ కి చేరడం … ఒక సూర్యాస్తమయాన్ని , ఒక సూర్యోదయాన్ని ఘాట్ లలో గడపటం … విశ్వనాథుని దర్శనం … ఒక రోజు ప్రయాగ రాజ్ కుంభమేళా … మర్నాడు పేకప్… ఇదీ ప్లాన్ !

అయితే ఎయిర్ ఇండియా వాడి దెబ్బకి మధ్యాహ్నం రెండింటికి అనుకున్నది వారణాసి విమానాశ్రయంలో దిగేసరికి రాత్రి తొమ్మిది అయింది.  విమానాల్లోనే పరవస్తు లోకేశ్వర్  “ సిల్క్ రోడ్డులో సాహస యాత్ర “ చదివేశాను.

ఎయిర్పోర్ట్ నుంచి  మా హోటల్ ‘డివైన్ డెస్టినేషన్ ‘ కి పాతిక కిలోమీటర్లు.  ఆలయానికి , ఘాట్లకి దగ్గరలో ఉంటుందని పాత నగరంలో బుక్ చేశాం !

మా కార్ ఎయిర్పోర్ట్ నుంచి బయటపడిన కొద్దిసేపటికే వీధులన్నీ  కోలాహలంగా ఉండటం గమనించాం. ట్రాక్టర్ ట్రైలర్స్ మీద మిరుమిట్లు గొలిపే లైట్ల వెలుగులో నృత్య రూపకాలు ప్రదర్శిస్తూ చాల గుంపులు ఎదురయ్యాయి. అప్పటికే ఆలస్యమైందనే కంగారు, వాటిలో ఏదొక గుంపులో చేరిపోదామనే కోరికని బలవంతంగా ఆపేసింది. కుంభమేళా వల్ల నగరం జనాలతో నిండిపోయింది. పోలీసుల అడ్డంకులని దాటుకుంటూ ఎలాగో మా డివైన్ డెస్టినేషన్ చేరుకునేసరికి 10:30 అయింది. చిన్న సందులోని హోటల్. కుంభమేళా కాకపోతే రాత్రికి రెండువేలకి మించి ఉండదు. మేము నెలరోజుల ముందు బుక్ చేసుకోవడం వల్ల ఐదువేలకి వచ్చింది. అప్పటికప్పుడు కావలిస్తే పదివేలట!

ఆలస్యమైనందుకు బాధపడకుండా రాత్రంతా వారణాసి వీధుల్లో తిరగాలని నిర్ణయించుకున్నాం.

వీధులు కిక్కిరిసి ఉన్నాయి. మధ్యాహ్నం బెంగళూరు ఎయిర్పోర్ట్ లాంజ్ లో తిన్న ఆహారం , తాగిన బీరు రెండూ ఆవిరి కావడంతో ఆకలి మొదలైంది. రోడ్డుపక్క హోటల్ లో దూరాం. పూరీల్లా ఉన్న కచోరీలు ‘వారణాసి స్పెషల్’  అని తెచ్చాడు. దానితో బాటు ఒక జిలేబీ!

దశాశ్వమేథ్ ఘాట్ మా హోటల్ నుంచి 800 మీటర్లు మాత్రమే! రాత్రి పదకొండు దాటినా ఘాట్లన్నీ జనాలతో కిటకిట లాడుతున్నాయి. అయితే స్నానాలు చేయనీయడం లేదు.

రంగురంగుల పడవలు గంగ ఒడ్డు కి వడ్డాణంలా అమరాయి. కాలేజీ కుర్రోళ్ళు గిటారు వాయిస్తూ హిందీ పాటలు పాడుకుంటున్నారు. పాట ఆగినప్పుడల్లా చుట్టూ చేరిన జనం చప్పట్లు కొడుతున్నారు . శరీరమంతా బూడిద పూసుకున్న సాధువులు గంజాయి కొడుతూ  దారిన పోయే వాళ్ళని ఆశీర్వదిస్తున్నారు . వాళ్ళు నాగసాధువులా!

“ ఈ ప్రపంచంలో ఎవరికన్నా దేవుడు కనబడతాడంటే అది నాగసాధువులకే! భంగో, గంజాయో,కనీసం ఒక క్వార్టర్ మందో లేకపోతే ఈ అన్యాయపు ప్రపంచం అందంగా కనిపించదు. యు నో ! బ్యూటీ ఈజ్ గాడ్ !! నీకు నువ్వు అందంగా కనబడాలన్నా కొంచెం పడాలి. అప్పుడే మనం  దేవుడు … అప్పుడే మనం మనకేమీ సంబంధం లేనివాళ్ళని కూడా ఆశీర్వదించగలం “ చౌదరి గాడి మందోపదేశం!

మణికర్ణిక ఘాట్ వరకూ నడుచుకుని వెళ్దామని బయలుదేరాం . నది ఒడ్డున నడుచుకుంటూ వెళ్ళడమే ! గుట్టలుగా పేర్చి ఉన్న కట్టెలు ! కాలుతున్న శవాలు !! అదే మణికర్ణిక ఘాట్ . ఇరవై నాలుగు గంటలూ కట్టెలు కాలుతూనే ఉంటాయి.

పరవస్తు లోకేశ్వర్ తన కిర్గిజ్ స్తాన్ యాత్రలో చింగీజ్ ఐతమాతోవ్ కి ఇచ్చిన ప్రాముఖ్యతను గురించి రాస్తూ ‘మన దేశంలో కవులకి రచయితలకి అలాంటి గౌరవం లేదు . మనం వాళ్ళని చూసి నేర్చుకోవాల్సింది చాలా ఉంది ‘ అంటారు.

నిజమే ! అయితే అలా ఎందుకు ? మణికర్ణిక ఘాట్ లో కాలుతున్న శవాన్ని చూస్తే అకస్మాత్తుగా తట్టింది.

కళ కేవలం సాధనతో వచ్చేది కాదు. బహుశా జన్మతః వచ్చేది. కళాకారుని గొప్పదనం కళలో ఉంది కానీ వ్యక్తిలో లేదు. బహుశా అందుకేనేమో చాలామంది కళాకారులు వ్యక్తిగతంగా నిరాశపరుస్తారు. గుర్తించాల్సింది వ్యక్తులు ప్రపంచానికి ఇచ్చిన మంచిని కానీ వ్యక్తుల్ని కాదేమో! చనిపోయిన తర్వాత వ్యక్తులకి ఎటువంటి అదనపు విలువా లేదని ఈ దేశం ఎప్పుడో గుర్తించిందా! అందుకే స్మారక చిహ్నాలకి ఈ దేశంలో అంత ప్రాముఖ్యత లేకుండా పోయిందా !

“ రామ్ నామ్ సత్య హై!” ప్రతీ పది నిమిషాలకీ ఒక శరీరం వస్తూనే ఉంది. పాడెని మోసే ఆ నలుగురు తప్ప ఎవరూ లేరు. బహుశా చనిపోయేముందు కాశీ ఆశ్రమాల్లో మరణం కోసం ఎదురు చూసే వాళ్ల శవాలు కావచ్చు.  వారి బంధుగణం వారిని మర్చిపోయి ఉండొచ్చు. ఏడుపులు లేవు. అత్యంత సాధారణంగా ఎక్కడినుంచి వచ్చామో అక్కడికే పోతున్నారు. మనసుకి ఏదో తెలుస్తోంది! జన్మరాహిత్యం అంటే మరో జన్మ లేకుండా పోవడం కాదు! ఈ జన్మకి సంబంధించిన వాసనల నుంచి విముక్తి !! బహుశా ‘ది బ్రిడ్జస్ ఆఫ్ మాడిసన్ కౌంటీ ‘ లో ఫ్రాంచెస్కా తాను చనిపోయిన తర్వాత దహనం చేయమనింది అందుకేనేమో! చనిపోయిన తర్వాతైనా బంధాలను వదిలించుకుని తన ప్రియుడిని చేరుకోవాలనుకుంది.

తిరిగి తిరిగి రూమ్ కి వచ్చేసరికి ఒంటిగంటన్నర! దారిలో విశ్వేశ్వరుని గుడి దగ్గర  జనాలు క్యూ కట్టడం చూసాం . వారు తెల్లవారు ఝామున గుడి తీసే వరకూ అక్కడే ఉంటారట!

నాతో వచ్చిన మిత్రుడు నాలుగున్నరకి లేచి గుడికి బయలుదేరాడు. దర్శనానికి ఎంత సమయం పడుతుందో తెలియదు. దర్శనం ఆలస్యమైతే ఘాట్ దగ్గర సూర్యోదయాన్ని కోల్పోతాను. కొంచెం సేపు పడుకుని ఘాట్ ల దగ్గరికి వెళ్ళాలని మళ్లీ ముసుగు తన్నాను. అయితే తొందరగా దర్శనం అయిపోతే!  ఇంత దూరం వచ్చి దర్శనానికి వెళ్ళకుండా తిరిగి వెళ్లడం! విశ్వమంతా వ్యాపించిన వాడిని గుడికెళ్ళే చూడాలా ! క్యూ లో నిలబడటానికి బద్దకించే వాడి ఎస్కేపిస్ట్ లాజిక్ ! ఇప్పటికి ఇదే కరెక్ట్!

ఆరింటికల్లా దశాస్వమేధ ఘాట్ కి చేరాను. ఘాట్ అంతా గంగా స్నానాలు చేసే జనాలతో కోలాహలంగా ఉంది . బ్రాహ్మలు గజిబో లాంటి వాటిలో పిండ ప్రధానాలు చేస్తున్నారు. మూడొందల రూపాయలకు ఘాట్లన్నీ చూపించేలా బేరమాడుకుని ఒక పడవ ఎక్కేసాను. ఆ పడవంతా నిండేసరికి అరగంట పైనే పట్టింది. ఒక్కొక్కడికి ఒక్కో రేటు. కొంతమంది వంద రూపాయలకే బేరమాడుకోగలిగారు.

మర పడవ ఒక్కో ఘాట్ చూపిస్తూ మెల్లగా వెళుతోంది. వలస పక్షులు పడవలని చుట్టుముట్టడం చూసాను. సైబీరియన్ గల్స్! శీతాకాలంలో గడ్డకట్టుకు పోయిన ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తాయట! పడవలో వాళ్ళు వేసే ఆహారం కోసం కొన్ని వందల పక్షులు పడవ చుట్టూ లయబద్దంగా నృత్యం చేస్తున్నాయి. వాటి విన్యాసాల మధ్య దేవుని దర్శనానికి వెళ్లలేదనే నా బెంగ తీర్చడం కోసమేమో! తూర్పు దిక్కుని ఎరుపెక్కిస్తూ విశ్వనాధుని దర్శనమయ్యింది! అప్రయత్నంగా రెండు చేతులు జోడించాను. సూర్యోదయానికి బంగారు రంగులో మారిన పరిసరాలు ,  గంగమ్మ నన్ను అలౌకిక స్థితిలోకి నెట్టాయి. గుండెల్లో బిస్మిల్లా ఖాన్ షెహనాయి–

పడవదిగి వస్తుంటే ఎవరో తెలుగులో అరుస్తున్నారు. “అదిగో గోదారి ..”

మా గోదారోళ్ళు అయ్యుంటారు. ఈ దేశంలో చాలామందికి నీళ్లంటేనే గంగ! మా గోదారోళ్లకి మాత్రం గంగైనా గోదారే!

ఏ నదైనా సముద్రం వైపే! ఏ భాషైనా భావం కోసమే!! ఏ మతమైనా దేవుని కోసమే! ఇదే నిజం !

“ అలా కాకపోతే”

“ ఆ .. నా గోదారి”

( మేము గోదారి అనే పదం రకరకాలుగా వాడతాం ! ‘ఆ … నా గోదారి … ‘ అంటే ‘ నామొహం ‘ అని అర్థం . ) 

*

శ్రీధర్ నరుకుర్తి

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కళ కేవలం సాధనతో వచ్చేది కాదు. బహుశా జన్మతః వచ్చేది. కళాకారుని గొప్పదనం కళలో ఉంది కానీ వ్యక్తిలో లేదు. బహుశా అందుకేనేమో చాలామంది కళాకారులు వ్యక్తిగతంగా నిరాశపరుస్తారు. గుర్తించాల్సింది వ్యక్తులు ప్రపంచానికి ఇచ్చిన మంచిని కానీ వ్యక్తుల్ని కాదేమో!..noted.

  • చాలా బాగా రాసారండి,మాకు గోదారి అంటే అంతే ప్రాణం. ఈ మధ్యనే కాశీ కూడా చూసాము. అన్ని కళ్ళకు కట్టినట్లు రాశారు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు