“ప్రపంచానికి ఒక కొత్త అశక్తత సమస్య అయి కూర్చుంది. దీని వల్ల కుటుంబసంబంధాలు గట్టిపడిపోతున్నాయి. సంభాషణలు స్పష్టంగా, స్వచ్ఛంగా అయిపోతున్నాయి. సామాజిక వ్యవహారాలు చాలావాటికి అర్థం లేకుండా పోయి వాటిని వదిలేయాల్సి వస్తోంది. ఎవరి గురించి వాళ్ళు అభ్యసించటం తప్పనిసరి అవుతోంది – తర్వాత అటువంటి జనమంతా కలిసి ఇంకాస్త మెరుగైన ప్రపంచాన్ని నిర్మించగల సూచనలు నాకు కనిపిస్తున్నాయి. ఇవన్నీ ‘Autism’ లక్షణాలటండీ, ఏం తప్పు ఉందంటారు ఇందులో? నాకూ ఈ అశక్తతే ఉన్నందుకు నాకు సంతోషం.”
ఈ Autism లో కూడా Synaesthesia అనే మరొక సమస్య ఉంది ఆయనకి. అది ఇట్లా – సామాన్యంగా ఒక ఇంద్రియం గ్రహించే జ్ఞానాన్ని వేరే ఇంద్రియాలు కూడా పసిగట్టటం. ఉదాహరణకి – ధ్వనికి రంగులుండటం, రంగులకి పరిమళం ఉండటం. బాగా చిన్న వయసులోనూ కలలు కనేప్పుడూ దాదాపుగా మనందరికీ ఉండే జ్ఞానం ఇది – కళాకారులలో ప్రాణంతో ఉండేదీ, వాళ్ళు సంఘానికి ఒదగకుండా అడ్డుపడే గుణాలలో ఒకటీ కూడా.
తన Autism ను అంతర్ముఖ వికాసంగా దర్శించిన ఆ ప్రత్యేకమైన మనిషి, Patrick Jasper Lee – ఒక రొమానీ. అంటే జిప్సీ. తన నేపథ్యం వల్ల, పరంపరాగతం గా – వచ్చిన జ్ఞాన ప్రపంచానికి పంచిపెట్టటం ఆయన ఉద్దేశం.
రెండవ ప్రపంచ యుద్ధకాలం లో యూదుల holocaust గురించి అందరికీ తెలుసు. ఆ కాలం లో అంత క్రూరంగానూ వధించబడిన జాతి మరొకటి ఉంది. అప్పుడే కాదు – అంతకు ముందూ ఆ తర్వాతా కూడా తీవ్రమైన వివక్షనూ ద్వేషాన్నీ ఎదుర్కొన్న ఆ జాతి ‘ రొమానీ.’ ఒకానొక కాలం లో ఈజిప్ట్ నుంచి వచ్చామని చెప్పుకున్నందుకు వాళ్ళని జిప్సీ లు అనేవారు. నిజానికి వారి మూలాలు భారతదేశపు వాయవ్య భాగం లో ఉన్నాయి. 2016 లో అధికారికంగా వాళ్ళని ‘భారతీయ వలస సంతతి’ గా గుర్తించారు.
13 వ శతాబ్దానికి ముందు పుట్టినదేశాన్ని వదిలివెళ్ళారు – మహమ్మద్ గజనీ యుద్ధ ఖైదీలుగానో, ఇరాన్ రాజు అడిగితే గాయకులుగానో – వివరం ఇదమిత్థం కాదు. తిరిగి మాతృదేశానికి ఎందుకు రాలేదో కూడా సరిగ్గా తెలియదు. కానీ ఏడెనిమిది వందల ఏళ్ళపాటు వాళ్ళు తమ సంస్కృతినీ భాషనీ వదల్లేదు – అవన్నీ వాళ్ళు నివసించిన యూరోప్ దేశాల పద్ధతికి విరుద్ధం. నిజానికి , పూర్తిగా అట్లాగనీ అనలేము – అక్కడి ‘pagan’ తెగల పద్ధతికీ వీళ్ళ తీరుకీ పోలికలున్నాయి.
కొత్త మతం ప్రవేశించిన తర్వాత కూడా, చాలా శతాబ్దాల పాటు – బాహాటం గానో చాటు మాటుగానో యూరోప్ లో ఆ పాత సంప్రదాయాలు కొనసాగాయి . కానీ మధ్య యుగాలు ఆధునిక కాలం లోకి మారినప్పుడు చెలరేగిన అసహనం హద్దూ పద్దూ లేనిది. అందులోంచే ‘Witch Hunt’ లు, రొమానీ లని వేటాడటం. రెండవది పూర్తిగా నశించలేదు. జెకోస్లోవేకియా లో – వారి జనాభాను తగ్గించేందుకు, 1973 నుంచీ మొదలెట్టి బలవంతపు కుటుంబ నియంత్రణా శస్త్ర చికిత్సలు చేశారు రొమానీ స్త్రీలకి. 1989 లో గాని ఆ విషయం బయటపడలేదు. ఇప్పటికీ ఇటలీ లోనూ మరొకచోటా వారి పట్ల కార్పణ్యం సజీవం గా ఉంది; ఎన్ని శిఖరాగ్ర సమావేశాలు జరుగుతూ వస్తున్నా.
1990 లలో హారీ పోటర్ విజయం తర్వాత fantasy పుస్తకాలు విరివిగా వెలుగు చూశాయి. కొన్నిటిలో సూటిగానూ మరింకొన్నిటిలో ఏటవాలుగానూ రొమానీ ల ప్రసక్తి ఉండేది – వాళ్ళకీ magic కీ చాలా’దగ్గర’ కనుక. అంతర్జాలం తెరుచుకున్నాక – మనలాగే కనిపించే వాళ్ళ రూపురేఖలు ఆసక్తి కలిగించేవి. అక్కడా అక్కడా ఏదో తెలుసుకుంటూ ఉన్నా – ఒక సాధికారమైన పుస్తకాన్ని కొన్ని నెలల కిందట చదివాను. 320 పుటలనీ ఒక్క రోజులో పూర్తి చేయగలిగాను – అంతలా ఆ రచయిత నన్ను లాక్కు వెళ్ళిపోయారు. ఆయనే, పైన చెప్పినవారు. రొమానీ సంప్రదాయాల చివరి చిగురులలో ఒకరు. బలమైన చిగురు- అందుకు ఆనందం.
ఏ పుస్తకం చదివినా అందులో చెప్పినదంతా నేను అంగీకరిస్తేనే నచ్చినట్లు అన్న పంతం నాకు ఉండదు. యోచనకి లోతూ వైశాల్యమూ ఇవ్వటం సాహిత్యం పని. నిర్ధారణ మన ఇష్టం. నావరకూ అయితే నిర్ధారణ కూడా అవసరం పడదు. ఇందులోని భావధార – భారతీయ దృక్పథానికి అనుకూలం గానూ, ఇంకా చెప్పాలంటే విశ్వనాథ సత్యనారాయణ గారి ‘వేయిపడగలు’ లోని దుఃఖానికి సమీపంగానూ – ఉండటం నన్ను ఆకర్షించింది, ఒప్పుకుంటాను.
కాని, ‘మరిహ వెనక్కి వెళ్ళలేం’ అనే నైరాశ్యం నుంచి ‘నాలుగడుగులు ఆ వైపుకి వేద్దాం’ అనే ఉత్సాహాన్ని కలిగించింది కనుక కూడా ఈ పుస్తకం నాకు విలువైనది.
ఇప్పటి అస్తవ్యస్తపు ఎదుగుదలలో, భౌతిక మానసిక కాలుష్యాల మధ్యని – నిరాడంబరమైన రొమానీ తాత్వికత కి తప్పకుండా ప్రాసంగికత ఉంది. మొత్తాన్నీ వ్యాఖ్యానించటం అయేపని కాదుగానీ రచయిత చాలా అక్కర తో చెప్పిన కొన్ని మాటలని చేరవేయటం నా బాధ్యత అని తోచింది.
పుస్తకం పేరు “We Borrow The Earth : An Intimate Portrait Of The Gypsy Folk Tradition And Culture.” భూమిని మనం అరువు తీసుకుంటాం, అవసరం మేరకు, మనం ఉన్నంతకాలం. నేల అచ్చం గా ఎవరిదీ కాదు, ఎప్పటికీ.
కళ్ళ రంగునీ దేహపు చాయనీ బట్టి విలువకట్టే పాశ్చాత్య సమాజం ముందు నిలుచుని ఆయన ప్రకటించారు – ”నన్ను బయటినుంచి చూసి నేను యోగ్యుడినా కాదా అని నిర్ణయించేయకండి . చెబుతూన్నదాన్ని వినండి, అందులో విషయం ఉందనిపిస్తే అప్పుడు తేల్చుకోండి.”
నూతనమైన వాటికి మోకాలు అడ్డుపెట్టటం మూఢత్వమని అనిపిస్తే , పాతదాన్నంతా బద్దలు కొట్టేసి తీరాలన్నది ఒక ఉన్మాదం. దాని వలని నష్టాలని రచయిత ఆగ్రహం గా, ఆవేదనతో – తలచుకుంటారు.
“అనూచానం గా వస్తున్న దేనికీ ఆ కొత్త మతపు దృక్పథం లో చోటు లేకుండా పోయింది. స్థానికం గా ఉన్న ప్రతిదాన్నీ కత్తిరించి సరిచేసి ఇమిడిస్తేనేగాని ఏవీ నిలవలేకపోయాయి – అట్లా ఇమడనివన్నీ శాశ్వతంగా ‘నిషిద్ధం’ – సొంత ఉనికి ఉన్న ప్రతిదీ, (వేరే రకమైన) పరలోకం తో కాసింత సంబంధం ఉన్న ప్రతిదీ కొత్త నియమాలకి లోబడి పలుచనయిపోవలసి వచ్చింది.”
ఒక పురాతన సంస్కృతి అర్థం కావాలంటే ముందు దాని పట్ల గౌరవం ఉండాలి. పేరాశకు పోకుండా అవసరానికి మించి దాచుకోకుండా ఉండటమంటూ ఒకటి ఉంటుందనే ఊహ లేనిదే రొమానీ లు ఏమిటో తెలిసిరారు. ప్రాచీనమైన తెగలు ప్రకృతిని గుర్తించే పద్ధతి వేరుగా ఉంటుంది, నిజానికి వాళ్ళని వాళ్ళు గుర్తించుకునే పద్ధతే వేరు. అంతంత కాలం నుంచీ ఆ తెగలు అట్లాగే ఎట్లా జీవించగలుగుతున్నారనే ప్రశ్నకి ఒకటే సమాధానం – వాళ్ళకి మార్పు అవసరం కాలేదు గనుక. మార్పు ఉండి తీరాలన్నది ఇప్పటి మాట.
ప్రపంచం చోటు చాలకుండా కిక్కిరిసిపోయి ఉంది. ముందుకి వెళ్ళగలగటం అంటే ‘వెనక్కి’ మరలటమే. అసలు తాళం చెవి అక్కడే ఉంది. వెతికితే దొరుకుతుంది. కాకపోతే ఆ నిజాలు తెరుచుకోవటానికి మనమూ నిజమైన ఉద్దేశాలతో ఉండాలి – సరైన ‘password’ తో.
దురదృష్టవశాత్తూ మనం చుట్టూరా ఉద్వేగాల క్షేత్రాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటాం. ‘నా ఇష్టం. నా మానాన నన్ను వదిలేయి’ అనేస్తాం. మన తోటి మనుషులు దీన్ని బేషరతుగా ఒప్పేసుకుంటారు. జంతువులూ చెట్లూ అట్లా అనలేవు, వాటికి ప్రకృతి నిబంధనలు పూర్తిగా వర్తిస్తాయి. వాటికి మన ఆవేశాలను బదిలీ చేయటం మొదలెట్టామా, పాపం వాటి అయోమయానికి అంతు ఉండదు.”
మనుషుల్లో ఒక లయతప్పిన తనం – చిత్రమైన మనస్తత్వం మొదలై, రచయిత లెక్క ప్రకారం 6000 ఏళ్ళు. మానవపరిణామశాస్త్రం ప్రకారం అది నియోలిథిక్ యుగపు విప్లవం. ఆటవికుల తెగలు అంతరించటం ప్రారంభమైంది – ఈజిప్ట్, సుమేరియన్ నాగరికతలు ఉద్భవించాయి.[హిందూ కాలమానం ప్రకారం అవి ద్వాపరయుగం చివరిరోజులు. కలి మొదలై 5100 యేళ్ళ చిల్లర.]
“పోటీ తత్వం పెరగటం, విధ విధాలైన విజృంభణలు. సంఘపు చట్రం చెదిరింది, అంతవరకూ జీవిస్తున్న సమాజం పరిధిలో లేని విషయాలను మీదవేసుకుని అవలంబించటం అవసరమైంది. గాయాలు ఏర్పడినాయి – మరింక మానుపట్టలేదు. [రచయిత ఇక్కడొక ఆసక్తికరమైన ప్రతిపాదన చేస్తారు – నియోలిథిక్ యుగానికి ముందు దయ్యాలు ఉండేవి కావట. వినగానే నవ్వు వచ్చినా, దయ్యాలయేందుకు అవసరమయే సంక్లిష్ట మనస్తత్వాలకి అంతకుముందర ఉనికి లేదని ఆయన అభిప్రాయం.]
అతి సహజమైన, పురాతనమైన మేధని కోల్పోయిఉండటమే అసలు సమస్య. ఒక పెద్ద వంతెన దాటి మరొక చోటికి చేరాము, ఆ దాటటం లో జ్ఞాపక శక్తి పూర్తిగా పోయింది. ఒకప్పటి ప్రపంచం లో జీవితం ఎట్లా ఉండేదో గుర్తే లేకుండా. ప్రస్తుతం జీవిస్తున్న దేశకాలాలకు అనుగుణం గా ఉన్న అంతఃకరణ ను మాత్రమే మనం ఉపయోగిస్తాము. అట్లా లేదనిపించేదాన్ని బలవంతంగా తుడిచివేస్తాము – అది అనారోగ్యం.”
అనవసరమైన సామాను పోగేసుకోకుండా తేలికగా ప్రయాణించటం జిప్సీల సూత్రం. అనుభవాలని మొదలంటా ఆనందించగలగటం (ఇప్పుడు చెప్పే mindfulness) వాళ్ళ శక్తి. జీవజాలంతో సహానుభూతి వాళ్ళ భద్రత. నృత్యమూ సంగీతమూ వాళ్ళ ఆటవిడుపు లు. వాళ్ళ కి ఇహమే ప్రధానం, పరం గురించిన ఆరాటం ఎక్కువ ఉండదు . ఆ లోకానికి దారి సులువేననీ దానివెంట పితృ దేవతలు తమ కోసం దిగివస్తుంటారనీ యథాలాపంగా నమ్ముతారు. వాళ్ళ వేరే దేవతలందరూ కూడా ఇహలోకయాత్రకే ఎక్కువ సహాయాలు చేస్తుంటారు. ఎంత తీసుకోవాలో ఎట్లా తీసుకోవాలో, నొచ్చుకోకుండానొప్పించకుండా ఉండగల నియమనిబంధనలు ఏర్పడి ఉన్నాయి. పారంపర్యంగా వస్తూన్నవాటిని తరచకుండా పాటిస్తూ పోవటం వాళ్ళ సౌలభ్యం.
ఈ మధ్య ఎక్కువగా వినిపిస్తున్న Touchwood అనే మాట రొమానీలది. దురదృష్టం సంభవించకుండా వాళ్ళు Oak చెట్టు ని ముట్టుకుంటూ ఆ మాట అనేవారు. వృక్షాలకి రొమానీ ల సంస్కృతి లో చాలా ప్రాముఖ్యం. అయితే వాటికి పూర్తి గా స్వతంత్రమైన ఉనికి ఉందని వాళ్ళ విశ్వాసం. మనుషుల ‘పెంపకం’ చెట్లకి అవసరం లేదనేది ఇంకా గట్టి గా నమ్ముతారు. అసలు ఒక వృక్షాన్ని దాని అనుమతి అడగకుండా స్పృశించట మే మర్యాద కాదని రచయిత అంటారు. ఎట్లా అడగాలి అనుమతిని? మనసులోనే. మనసు తోనే. ఆ అతి పురాతనమైన భాష ప్రాణులందరినీ కలుపుకుపోయే ప్రవాహం – కొంత ప్రయత్నంతో అందులోకి ప్రతివారూ ప్రవేశించవచ్చు. ఇదేదో fancy గా అనుకునే ముందు J. C. Bose దగ్గరనుంచీ నిన్నటి Olivier Van Aken వరకూ వెతికి తెలుసుకోవలసి ఉంది. ఇవేవీ నిరూపించబడని కాలం నుంచే ”చెట్లకి మనిషి లోపలి చీకట్లని పీల్చుకునే శక్తి ఉంటుంది” అని రొమానీ లు నమ్ముతూ వస్తున్నారు. మనకి ప్రత్యేకంగా సాయం చేసేందుకో, మూలికగా సేవించేందుకో – వాటి అనుజ్ఞ అడగాలి. మనకి ఆహారం కాబోతున్నందుకు జంతువులకు కృతజ్ఞతలు చెప్పాలి, వాటి ఆత్మలకు సద్గతి కోరాలి.
భారతదేశంలో ‘ధర్మకర్త’ అనే మాట ఒకటి ఉంది. ప్రపంచం లో మనిషి స్థానం ఏమిటన్నది రచయిత చెబుతూ ఉంటే అది జ్ఞాపకం వచ్చింది. ఏ మనిషీ దేనికీ అధికారిగా ఇక్కడికి రాలేదని గ్రహించగలిగితే…
రొమానీ లకి ఆరుబయళ్ళు కావాలి. అక్కడే వాళ్ళ గుడారాలు, కొంతకాలపు నివాసాలు. ఆ భూముల యజమానులు చూసీ చూడనట్లు ఊరుకునేవారు. పారిశ్రామిక విప్లవం తర్వాత, సరిహద్దులు బిగిసిపోవటం మొదలైనాక – రొమానీలకి స్థిర మైన ఆవాసాలు ఏర్పరచుకోక తప్పని స్థితి వచ్చింది – చాలా చాలా అయిష్టంగా. మొదట సంచరించిన, తర్వాత ‘స్థిరపడిన’ ప్రాంతాలను బట్టి రొమానీ లలో వేరే వేరే తెగలున్నాయి.
మధ్య యుగాలలో రొమానీ లు వాళ్ళు ఈజిప్ట్ నుంచి వచ్చామనీ శపించబడ్డామనీ క్రైస్తవ యాత్రికులు గా ఏడేళ్ళపాటు సంచరిస్తే అది తీరుతుందనీ అబద్ధం చెప్పేవారు. తమ పైని దాడులని నివారించుకునేందుకు ఆ అసత్యం. The Great Gypsy Lie. నిజానికి బయటి సమాజాన్ని వాళ్ళు గుర్తించేవాళ్ళు కాదు. వాళ్ళ సొంత పేర్లు వేరే, బయటికి చెప్పుకునేవి వేరే. కొత్త మతం ప్రకారం పెళ్ళిళ్ళు చర్చ్ లలో , వాళ్ళ సంప్రదాయ వివాహాలు విడిగా. నేల ని సొంతం అనుకోవటం కన్నా రొమానీ లకి పెద్ద అబద్ధం లేదు – దాని ముందు ఏదైనా చిన్న అబద్ధమే. ‘సొంతం’ అనేదాన్ని గుర్తించకపోవటమే రొమానీ లను దొంగలుగా నేరగాళ్ళు గా తీర్మానించేందుకు కారణమయింది.
రొమానీ భాష కి పంజాబీ, మార్వారీ భాషలతో దగ్గరి సంబంధం ఉంది. కొన్ని సంస్కృత శబ్దాలు దాదాపు యథాతథం గా ఉంటాయి. పురుషుడిని ‘ర్రోమ’ అనీ స్త్రీని ‘ర్రొమ్న’ అనీ అంటారు. సంస్కృతం లో రమణుడు అంటే భర్త. రమణి అనే మాట తెలిసిందే కదా. డబ్బు ని ‘దోష్’ అంటారు, తప్పు అన్న అర్థం లోనే. పెళ్ళిళ్ళు, శ్రాద్ధకర్మలూ, శుభ్రతా అశౌచం- అన్నీ విలక్షణంగా ఉంటాయి. ప్రమాదం లేని జబ్బులకి చికిత్స చేసేవారుగా, జ్యోస్యాలు చెప్పేవారుగా, రక్ష లు కట్టేవారు గా, చిన్న చిన్న వస్తువులు అమ్మే బేరగాళ్ళుగా – జీవించేవారు. పొలం పనుల కాలంలో శరీరశ్రమ చేసేవారు.
రొమానీ ల కి ఆచారాలున్నాయి, వాటిని హాస్యం చేసుకోవటమూ ఉంది. ధ్యానానికీ గాంభీర్యానికీ సంబంధం ఉండక్కరలేదనేది వాళ్ళ నమ్మకం. చాలా శక్తులున్న, తంత్రాలుతెలిసిన మంత్రవేత్త ని ‘చొవిహానో’ అంటారు- అతని కార్యక్రమాలు జరుగుతూ ఉండగానే జనం నవ్వుతుంటారు. నవ్వచ్చు, ఎంత మాత్రం తప్పులేదు వాళ్ళకి.
దుష్టశక్తులూ రుగ్మతలూ వాటి స్వభావం అర్థమయేవాళ్ళ జోలికి రావని నమ్ముతారు – అవి మనిషి కన్నా బలమైనవేమీ కావు…ఆ మాట వాటికి చెప్పేస్తే అవి వేరే దారి చూసుకుంటాయి. రొమానీ ల చికిత్స లో – వచ్చిన జబ్బో మరొకటో తనకి చెందదని తెలుసుకోవటం చాలా ముఖ్యం. ఆ వ్యాధి నో రుగ్మత నో ‘విడి’ గా గుర్తించి దాని వెంటపడి తరుముతాడు చొవిహానో – కొన్నిసార్లు, మరొక లోకపు అంచుల వరకూ.
ఆ అధోలోకం ఒకటి ఉంది – అక్కడ అన్నిటికీ బలం హెచ్చు. భావనలు, ఆలోచనలు, ఇంద్రియస్పందనలు – అన్నిటికీ. ఒకే ఒక్క తలంపు తో ముక్కలైపోవటం సాధ్యం, తగలబడిపోవటం సాధ్యం. అక్కడికి వెళ్ళకుండా తప్పించుకోవటం కూడా వాళ్ళ చేతుల్లోనే – ఎవరూ వాళ్ళపైన తీర్పులు చెప్పరు. వాళ్ళది simple arithmetic, తెలియని ఏ x factor ఉండదు.
Imagination అనే మాటను పదే పదే ఉపయోగిస్తారు రచయిత. మన తర్కశాస్త్రం లో అది ‘అనుమానం’ (ఊహించి తెలుసుకోవటం).
“వాటంతట అవి వచ్చే స్ఫురణ లని అణిచిపెట్టకుండా ‘నిండు’ గా జీవించే ప్రయత్నం చేస్తున్న ప్రతివారిలోనూ ఆ ‘చొవిహానో’ శక్తులు ఎన్నో కొన్ని ఉండనే ఉంటాయి.” – అంటారు.
Patrick Jasper Lee నవలలు కూడా రాశారు. రచయిత, ఉపన్యాసకుడు, బోధకుడు, చికిత్సకుడు- ఈ అన్ని స్థాయిలలోనూ పనిచేస్తుంటారు. We Borrow The Earth కి రెండవ భాగం పేరు Coming Home To The Trees.
“అడవులని తిరిగి ఎదగనివ్వటం పనికివస్తుంది, అది ఒక ఆరంభం. పాతకాలపు గంధర్వలోకాలు ఎక్కడికీ పోలేదు, అడవుల్లోనే నిద్రపోతుంటాయంతే. మత్సరం లేకపోతే, నాగరికత పట్టకపోతే, కబళించేయాలని అనుకోకపోతే – అవి కనిపిస్తాయి. వాటికి భౌగోళికమైన చిరునామాలు అవసరం లేదు.”
*
ఎప్పటిలాగే మీ ది అని చెప్పేలాగా
ధన్యవాదాలండీ
“అనూచానం గా వస్తున్న దేనికీ ఆ కొత్త మతపు దృక్పథం లో చోటు లేకుండా పోయింది. స్థానికం గా ఉన్న ప్రతిదాన్నీ కత్తిరించి సరిచేసి ఇమిడిస్తేనేగాని ఏవీ నిలవలేకపోయాయి – అట్లా ఇమడనివన్నీ శాశ్వతంగా ‘నిషిద్ధం’ – సొంత ఉనికి ఉన్న ప్రతిదీ, (వేరే రకమైన) పరలోకం తో కాసింత సంబంధం ఉన్న ప్రతిదీ కొత్త నియమాలకి లోబడి పలుచనయిపోవలసి వచ్చింది.”
ఒక పురాతన సంస్కృతి అర్థం కావాలంటే ముందు దాని పట్ల గౌరవం ఉండాలి. పేరాశకు పోకుండా అవసరానికి మించి దాచుకోకుండా ఉండటమంటూ ఒకటి ఉంటుందనే ఊహ లేనిదే రొమానీ లు ఏమిటో తెలిసిరారు. ప్రాచీనమైన తెగలు ప్రకృతిని గుర్తించే పద్ధతి వేరుగా ఉంటుంది, నిజానికి వాళ్ళని వాళ్ళు గుర్తించుకునే పద్ధతే వేరు. అంతంత కాలం నుంచీ ఆ తెగలు అట్లాగే ఎట్లా జీవించగలుగుతున్నారనే ప్రశ్నకి ఒకటే సమాధానం – వాళ్ళకి మార్పు అవసరం కాలేదు గనుక. మార్పు ఉండి తీరాలన్నది ఇప్పటి మాట…. ‘‘
అద్భుతం అండీ…
పాట్రిక్ జాస్పర్ లీ వెబ్ సైట్…. http://www.patrickjasperlee.com/
ధన్యవాదాలండీ
”నన్ను బయటినుంచి చూసి నేను యోగ్యుడినా కాదా అని నిర్ణయించేయకండి . చెబుతూన్నదాన్ని వినండి, అందులో విషయం ఉందనిపిస్తే అప్పుడు తేల్చుకోండి.” _/\_ మరో బలమైన అంశం మీ నుంచి!! TQQ so much for the beautiful review note Mam
మైథిలి అబ్బరాజు గారూ, అయాన్ రాండ్ గురించి మీరు వినేవుంటారు. ఆవిడ అమెరికాలో మూలవాసులైన ఇండియన్ల (నేటివ్ అమెరికన్) జాతి నిర్మూలనను సమర్థించింది. అంత క్రూరత్వాన్ని సమర్థించే ఆవిడ ఆబ్జెక్టివిజమ్ మరియు ఇండివిడ్యువలిజం తత్త్వానికి క్రమంగా పెరుగుతున్న ప్రాచుర్యం భయం కొల్పుతూవుంది. ఇక్కడ ఆవిడ పరమభక్తుడు, కార్పొరే్ మీడియా ఫ్లెష్ ట్రేడర్ మరియు పర్వర్టెడ్ పింప్ అయిన రామగోపాలవర్మకున్న ఫాలోయింగ్ ప్రమాదకరమైన స్థాయిలో పెరిగిపోతూవుంది. ఈ నాగరికతా ఉత్థాన బుల్ డోజర్ పదఘట్లనలలో ఇక గిరిజనుల, మూలవాసుల స్వరం వినేదెవరు?
అయాన్ రాండ్ భీకర వ్యాఖ్యలు…
The real Ayn Rand quote about the Indians (Native Americans)
https://www.youtube.com/watch?v=EAka-tA5Ojw
Ayn Rand is the patron saint of the libertarian Right. Her writings are quoted in a quasi-religious manner by American reactionaries, cited like Biblical codices that offer profound answers to all of life’s complex problems (namely, just “Free the Market”). Yet, despite her impeccable libertarian bona fides, Rand defended the colonization and genocide of what she called the “savage” Native Americans — one of the most authoritarian campaigns of death and suffering ever orchestrated.
“Any white person who brings the elements of civilization had the right to take over this continent,” Ayn Rand proclaimed, “and it is great that some people did, and discovered here what they couldn’t do anywhere else in the world and what the Indians, if there are any racist Indians today, do not believe to this day: respect for individual rights.”
https://www.salon.com/2015/10/14/libertarian_superstar_ayn_rand_defended_genocide_of_savage_native_americans/
థాంక్ యూ రేఖా..
Excellent. .mam
ధన్యవాదాలు పద్మ గారూ
ధన్యవాదాలు మైథిలి గారు. మంచి పుస్తకం పరిచయం చేసారు. రొమానీ కీ మన భాష లకి సామ్యం మీ పరిశీలన అనుకుంటాను. బాగుంది.
ధన్యవాదాలు !! ఆ పరిశీలన అంతర్జాలం ఆధారంగానే నండీ..
మీరు ఎంచుకునే అంశం పూర్తిగా చదివేదాకా ఊరుకోదుగా!! కొత్త విషయాలు చాలా తెలుసుకున్నాను…best wishes అండీ