ఆ నలుగురు

పేకాటకే కాదు.  స్మశానానికి తీసుకెళ్ళి బొంద పెట్టడానికి కూడా నలుగురు కావాలి.  ఆంధ్రప్రదేశ్ ని సజీవంగా పాతేసే విషయంలో “ఆ నలుగురు” ఈ నలుగురేనేమో!

క్కడ ఇప్పుడొ చతుర్ముఖ పారాయణం నడుస్తున్నది. నలుగురు ఆటగాళ్ళ చేతుల్లో పేక ముక్కల్లోని జోకర్ ఒక్కటే. అదే “ఆంధ్రప్రదేశ్”. చేతిలో జోకర్ ముక్క వున్న ఆనందాన్ని అణచుకొని మరీ బాధాతప్త మనస్కుల్లా నటించటానికి పాపం తెగ ఇబ్బంది పడుతున్నారు ఆ నలుగురు.

ప్రజలు ఎంత సంక్షోభంలో వుంటే రాజకీయం అంత రసకందాయం అవుతుంది.  సామాజిక పరిస్తితులు ఎంత అల్లకల్లోలంగా వుంటే రాజకీయులు అంతగా బలపడుతుంటారు. ప్రజా సంక్షోభమే రాజకీయుల సంక్షేమం. ప్రజల అల్లకల్లోలమే, ఆందోళనలే రాజకీయుల నిరంతర సిరి, తరగని గని. నిజం చెప్పాలంటే రాజకీయం అంటే దొంగ పోరాటాలు, దొంగ ఏడుపులు, దొంగ నాటకాలు, దొంగ ప్రేమలు రంగరించిన ఓ గజదొంగాత్మక కళ! వాళ్ళే సంక్షోభాలు సృష్ఠిస్తారు. వాటికి వ్యతిరేకంగా వాళ్ళే ప్రజల తరపున గగ్గోలు పెడుతుంటారు. తమలో తామే ప్రజల కోసం ఘర్షణ పడుతున్నట్లు నటిస్తుంటారు. ఒకరి మీద ఒకరు ఉత్తుత్తినే అరుచుకుంటారు. ప్రజల్ని విడతీస్తుంటారు. తమ ప్రయోజనాల్ని మాత్రం సమిష్ఠిగా కాపాడుకుంటుంటారు.  ఎప్పుడు కావాలంటే అప్పుడు వాళ్ళల్లో వాళ్ళే, వాళ్ళతో వాళ్ళే గొడవపడనూగలరు లేదా కలసిపోనూగలరు. అవసరమైతే పాత వేషగాళ్ళే కొత్త వేషాలేసుకొని రాగలరు. సిచుయేషన్ డిమాండ్ చేయాలే కానీ వాళ్ళే కొత్త వేషగాళ్ళనీ పుట్టించగలరు. సరి కొత్త బేరగాళ్ళనీ రంగం మీదకి నెట్టనూగలరు.

ఆంధ్ర ప్రదేశ్ ఇప్పుడు ఆధునిక రాజకీయ నాటక రంగస్థలం.

రాజనీతి శాస్త్రం వేరు, రాజకీయం వేరు.  రాజ్యమూ, దాని ప్రజానుకూల స్వభావము, రాజ్యానికి ప్రభుత్వాలకీ మధ్యనున్న అవిభాజ్య సంబంధము; చట్టం, రాజ్యాంగం ద్వారా ప్రజల పట్ల ప్రభుత్వ బాధ్యతలు; పాలకుల, నాయకుల నైతిక విలువలు, జవాబుదారీతనం….ఇదంతా తరగతి గదులకే పరిమితమైన పాఠ్యపుస్తకాల్లోని నాలుగు మంచి మాటలంతే. ఈ పుణ్యభూమి మీద ఏనాడూ రాజనీతి శాస్త్రం నుండి తాత్వికంగా బైటికొచ్చిన రాజకీయం ఏనాడూ నడయాడలేదు. భయ భక్తులు నటిస్తూ నలుగురూ దండవెట్టే పురాణాల సరసన జాతీయ రాజ్యాంగాన్ని చేర్చేసేది భారత్ రాజకీయం. ఇక్కడి రాజకీయం చట్టాల్ని గౌరవించదు. మాటలకి విలువిచ్చుకోదు. చట్టాలకు కట్టుబడదు. రాజకీయం మీడియాని గౌరవించినంతగా ప్రజలకి గౌరవమివ్వదు. కొంతమంది బలిసిన వ్యక్తులకి సాగిలపడుతుందే కానీ ప్రజల్ని లెక్క చేయదు.  భారతీయ ప్రజాస్వామ్యంలో ప్రజలంటే ఎవరు? ఓటర్లు. అంతే.

అందుకే నిండు పార్లమెంటులో చేసిన వాగ్దానాల్ని చెత్త బుట్టలో వేసినా వాళ్ళని నిలదీసే వాళ్ళు లేరు.

నిలదీస్తున్నట్లు అరుస్తున్నంత వాళ్ళందరూ డ్రామా ఆర్టిస్టులే. స్వీయ ప్రయోజన బేరగాళ్ళే. ఎవరికి వాళ్ళు తమ ఏడుపే నికార్సైనది అని బుకాయిస్తున్నారు. చచ్చిపోయిన దూడ పొట్టలో గడ్డి కుక్కి తల్లి ఆవుని లాక్కెళ్ళటం చాలా సార్లు రోడ్ల మీద చూస్తుంటాం.  అసలు పుట్టీ పుట్టక ముందే చచ్చిపోయిన “ప్రత్యేక హోదా” అనే దూడ పొట్టలో దొంగ పోరాటాల గడ్డి కుక్కి నలుగురు ఆ నాలుగు వైపులకి ఆంధ్రప్రదేశ్ అనే ఆవుని లాక్కెళుతున్నారు.

అందరూ గోవుల గోపన్నలే. కానీ దూడకి న్యాయంగా మిగలాల్సిన పాలని పొదుగు కోసి తాగే దొంగలే!

పార్లమెంటులో ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కోసం పంచెలు పైకెగ్గట్టి మరీ డిమాండ్ చేసిన వారే “ఇప్పుడు నీకు బే.  నీ అబ్బకీ బే” అంటున్నారు.  పంచ పాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలా ముగ్గురని చెప్పి రెండు వేళ్ళు చూపించి పలక మీద ఒకటి రాసి చూపించినట్లు ప్రత్యేక పాకేజీ అని, దాని కోసం రాష్ట్ర ప్రభుత్వం అది చేయలేదు, ఇది చేయలేదు అని చివరికి ఆంధ్రప్రదేశ్ నెత్తిన జెల్ల కొడుతున్నారు. ఏం చేసినా, ఎన్ని నిధులిచ్చినా ఇక్కడ అధికారంలోకి వచ్చే ప్రసక్తి లేదు కాబట్టి ప్రభుత్వ నిధుల్ని ఇక్కడెందుకు “పెట్టుబడి” పెట్టాలనే “బనియా” లెక్కలు మొదటి ఆయనకుండొచ్చు.

అంతర్జాతీయ స్థాయిలో “అమరావతి” కామెడీ డిజైన్లు, అభివృద్ధి ప్రణాళికల ఊహాచిత్రాలు, అవగాహన ఒప్పందాల వీధి నాటకాలు, దావోస్ లో పాలకూర పప్పు వాణిజ్య విందులుతో విసిగిపోయిన ప్రజల్ని మళ్ళీ మోసం చేయటానికి ఇంతకుముందు తామే కొట్టి పారేసిన “ప్రత్యేక హోదా” ఇప్పుడు ఓ గొప్ప సెంటిమెంటుగా, పసుప్పచ్చని ఆలోచనగా రెండో ఆయనకి అక్కరకొస్తున్నది.

అసలు ఆంధ్రప్రదేశ్ అనే లడ్డు తన తండ్రి నుండి తనకే దక్కాలని పాపం అల్లల్లాడిపోయాడు ఆ బిడ్డడు.  పైగా సీబీఐ కేసులు.  “ఓదార్పు యాత్రలు” చేసాడు.  కనిపించిన ముసలీ ముతకాని రిస్కులు చేసి ముద్దులు కూడా పెట్టుకున్నాడు.  కానీ లడ్డుని మరొకాయన “అసలీ లడ్డు తయారు చేసిందే నేను.  ఈ లడ్డు కోసం నేను నేను చాలా కష్టపడ్డాను” అంటూ కొట్టుకుపోయాడు.  ఇప్పుడీ “ప్రత్యేక హోదా” కూడా ఓ లడ్డూ లాంటి అవకాశాన్ని “ఓదార్పు యాత్రికుడు” గా ఘనకీర్తి పొందిన మూడో ఆయనకిచ్చింది.

వెండితెరమీద ఆరడుగులు కాకపోతే పదడుగుల బుల్లెట్టో అయిన నాలుగో ఆయన చేగువేరాని కాషాయ కళ్ళద్దాలతో చూస్తూ, ప్రజలకి అరచేతి మధ్య వేలు చూపించిన తన అన్నకి జరిగిన కాల్పనిక ద్రోహానికి పగ తీర్చుకుంటానని గాద్గదిక స్వరంతో హెచ్చరిస్తూ  రాజకీయ పరిణతిలో “ఆరడగుల దూది బుల్లెట్టు” గా పేరు పడ్డప్పటికీ రాజకీయానికి కావలిసింది నటనే కదా, ఆ కళలో తనకు పుష్కలంగా అనుభవం వుంది కాబట్టి అసలు వీళ్ళందరి కంటే తనే “ప్రొఫెషనల్ నటుడు” కాబట్టి తనకే ఇది భలే మంచి బేరం అని అనుకుంటున్నాడు. పైగా ఎవరో ఒకరి దర్శకత్వంలో నటించటానికి అలవాటుపడ్డ ప్రాణం కదా, ఇప్పుడు కూడా ఆయన వెనుక ఒక దర్శకుడు వున్నాడని కొందరంటారు.

పేకాటకే కాదు.  స్మశానానికి తీసుకెళ్ళి బొంద పెట్టడానికి కూడా నలుగురు కావాలి.  ఆంధ్రప్రదేశ్ ని సజీవంగా పాతేసే విషయంలో “ఆ నలుగురు” ఈ నలుగురేనేమో!

*

అరణ్య కృష్ణ

24 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చక్కని విశ్లేషణ. అయితే పౌరులుగా నిర్లిప్తత తో ఉండలేం. రాజకీయుల్ని వ్యభిచారులతో పోలిస్తే, ఎవరు తక్కువ ప్రమాదరమైన రోగాన్ని అంటిస్తారో వాళ్ళ దగ్గరికి వెళ్ళాలి. ఈ విషయంలో మన అభిప్రాయాలు మన ‘విలువల’ను బట్టి ఉంటాయి.

    • దుర్మార్గుల్ని అభాగ్యులతో పోల్చలేం సార్! దుర్మార్గుల్ని బహిష్కరిస్తే నష్టం వారిదే. మనది కాదు. సైద్ధాంతిక ఘర్షణని గౌరవించొచ్చేమో కానీ నిజంగా విలువలనేవి వున్నవాళ్ళు రాజకీయంలో ఏ రకమైన దుర్మార్గాన్ని ఒప్పుకోరు. కానీ ఇక్కడ ఆ నలుగురికి దోపిడీ భావజాలాలే తప్ప ప్రజానుకూల సైద్ధాంతిక పునాదులు లేవు.

  • అరణ్య కృష్ణ గారు! సారంగా లో ‘కొంచెం నీరు- కొంచెం నిప్పు ‘ శీర్షిక కింద మీరు రాసిన మొదటి ఆర్టికల్ బాగుంది. ఇలాగే అన్ని సామాజిక, రాజకీయ సమస్యలని విశ్లేషించండి.

  • చాలా బాగా రాశారు ,మరిన్ని కొత్త ఆర్టికల్స్ కోసం ఎదురు చూసేలా వుంది
    అరణ్య కృష్ణ గారు…

  • చాలా బాగా విడమరిచి చెప్పారు ప్రస్తుత స్థితిని.మంచి శీర్షిక…విశ్లేషణ.

  • రాష్ట్ర ప్రయోజనాలకంటే పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ దొంగాటవల్ల తేటతెల్ల మఔతోంది

  • రాష్ట్ర ప్రయోజనాలకంటే పార్టీలకు రాజకీయ ప్రయోజనాలే ముఖ్యం అనేది ఈ దొంగాటవల్ల తేటతెల్ల మఔతోందని చక్కగా విశ్లేషించారు

  • తూటాలు పేల్చేశారు కదా…
    చాలా నిర్మొహమాటంగా సమకాలీన రాజకీయాల్ని విమర్శించారు…
    మీ నుండి మరిన్ని ఇలాంటి ఆర్టికల్స్ ని ఆశిస్తూ

  • అరణ్య క్రిష్ణ గారు…! జరుగుతున్న పరిణామాలపై మంచి రాజకీయ విశ్లేషణ చేశారు. ” కొంచెం నీరు – కొంచెం నిప్పు ” మంచి టైటిల్. ప్రజలు ఎంత అయోమయంలో ఉంటే రాజకీయ నాయకులు అంత అద్భుతమైన రక్తి కట్టంచ గలరు. సంక్షోభ సమయాన్ని వారి క్రియేటివిటిని బట్టి ఉపయోగించుకుంటారు.

  • అరణ్య క్రిష్ణ గారు…! జరుగుతున్న పరిణామాలపై మంచి రాజకీయ విశ్లేషణ చేశారు. ” కొంచెం నీరు – కొంచెం నిప్పు ” మంచి టైటిల్. ప్రజలు ఎంత అయోమయంలో ఉంటే రాజకీయ నాయకులు అంత అద్భుతమైన రక్తి కట్టంచ గలరు. సంక్షోభ సమయాన్ని వారి క్రియేటివిటిని బట్టి ఉపయోగించుకుంటారు.

  • చాల బాగా ఆవిష్కరించారు . మీ అనుమతితో షేర్ చేయగలను.

  • రాజకీయాల్లో కనిపించే చిన్న విషయాల వెనుక పెద్దవేవో జరుగుతుంటాయని అంటారు. ఆ చూపుని అలవాటు చేస్తున్న మీ విశ్లేషణ బావుంది. Thank you!!

  • ఏం చెప్పాలో ఎలా చెప్పాలో అర్థం కావడం లేదు. సిగ్గేస్తోంది బాధేస్తోంది కోపం వస్తోంది అసహ్యం వేస్తోంది ఏం జరుగుతుందో తెలిసినా ఏమీ చేయలేక పోతున్నందుకు ఏడుపు కూడా వస్తోంది.

  • Excellent. Precise but created a scope to understand the situation.
    I believe in what you demonstrated.

  • చాలా బాగుంది..
    ఈ మధ్యకాలంలో మిమ్మల్ని సామాజిక విశ్లేషకుడిగా ఎక్కువ అభిమానిస్తున్నాను..
    మీ శీర్షిక నేను వేసిన బొమ్మతో రావడం ఆనందంగా ఉంది????

  • Good political analysis. This article reflects present situation of the Andhra Pradesh. Everyone should think once before they vote. Thanks for the valuable article sir…

  • వెరీ సెటైరిక్ అండ్ రియలిస్టిక్ .నైస్ తో రీడ్ అండ్ అబ్లె తో రీడ్ ఇన్ ఆ ఫాస్ట్ ఫ్లో .నైస్ తో రీడ్ ఆర్టీసీ అఫ్ యువర్ టీపీకాలిటీ .ఐ రెయూస్ట్ యు తో గివె యువర్ సోలుషన్స్ అల్సొ తో ది problems ,సైన్స్ అర్ ఆ సీరియస్ థింక్er.గుడ్ డే ,సర్ .

    • ధన్యవాదాలు సార్! అటు తెలుగులో కానీ లేదా ఇంగ్లీషులో కానీ కామెంటు పెడితే బాగుంటుంది.

  • నలుగురు దొంగలపై విశ్లేషణ చాలా బావుంది సమకాలీన రాష్ట్ర రాజకీయ అసలు ముఖచిత్రా
    న్ని చూపించారు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు