1970వ సంవత్సరమంతా గొప్ప ఉత్సాహాల, ఉద్వేగాలతో నిండిన సంఘటనల సమాహారం. జనవరిలో శ్రీశ్రీ షష్టిపూర్తికి విశాఖ ప్రయాణం, ఆ తర్వాత కొద్ది రోజులకు విప్లవ రచయితల సంఘానికి(విరసం) నిర్దిష్ట రూపం, శ్రీశ్రీకి ఉత్తరం రాసి నేను సభ్యురాలిని అవుతానని చెప్పటం, ఆ తర్వాత అక్టోబర్‌లో ఖమ్మంలో జరిగిన విరసం మొదటి మహాసభలకు వెళ్లి అక్కడ మహారచయితలందరినీ చూడటం, వినడం. ఊపిరి తీసుకునే వ్యవధానం లేకుండా గడుస్తున్న కాలం.
1969లో శ్రీకాకుళంలో ఉద్యమంలో పోలీసు కాల్పుల్లో మరణించిన నా ఎస్ఎఫ్ఐ మిత్రుల కోసం కార్చిన కన్నీళ్లు, ‘ఇప్పుడు ఉత్సాహాలు, నెత్తురు కాల్వలు’ అయ్యాయి. విరసం ఆవిర్భావం తర్వాత రచయితల మీద నిర్బంధం పెరిగింది. విప్లవ రచయితలను అరెస్టు చేయడం, విప్లవ కార్యకర్తలను అరెస్టు చేయడం, శ్రీశ్రీ కవిత్వంలో చదువుకున్న ‘చెరసాలలు, ఉరికొయ్యలు’ నాకు దగ్గరగా వచ్చాయి. రచయితల భావప్రకటనా స్వేచ్ఛ గురించి మాట్లాడటం, ప్రజలతో ఆ అన్యాయం గురించి చెప్పి, సంతకాల సేకరణలో వారి మద్దతు కూడగట్టటం నా కార్యక్రమాలలో ఒకటయింది. అప్పటికి పైగంబర కవిగా కవిత్వం రాశాను. కవితలు తప్ప ఇంకేమైనా రాయాలని గానీ, రాయగలనని గానీ అనుకోలేదు.
కానీ జైలు, నిర్బంధం, నా సహచరులు – ఇది నా నిత్యజీవిత ఆలోచనలలో భాగమవటంతో, ఏదో ఒకటి రాయకపోతే ఊపిరాడని స్థితి వచ్చింది.

అప్పుడు మొదటిసారి కథ రాశాను. నా మొదటి కథ ‘జైలుగది ఆత్మకథ’.
జైలుని అప్పటికి నేను దూరం నుంచి తప్ప చూడలేదు. కానీ ఆ వస్తువుగా అనుకోకుండా నాకు కథ రాయాలనిపించింది. ఆ గది గోడలకు మనసు, ఆలోచనా ఉంటే… మనలాగే స్పందించగలిగితే, తన దగ్గరకు వచ్చే మనుషులను గమనించి, అర్థం చేసుకోగలిగితే అన్న ఊహను కథగా మలచాలనిపించింది. ఒక చైతన్యరహితమైన వస్తువు ద్వారా చైతన్యపూరితమైన ఆలోచనలు చేయించడం నిజానికి కవిత్వ పద్ధతే. నిజానికి ఒక కవిత రాయొచ్చు. కానీ చాలా పెద్ద కాన్వాసు. ఇరవై ఏళ్ల వయసులో దీర్ఘకావ్యం రాయాలనే ఆలోచన రాలేదు. వచ్చినా దానిని నిర్వహించగలనా అని సందేహం కలిగేది. కానీ కథ మాత్రం ఒక్కసారిగా రాయగలిగాను. ఆ కథ కవిత్వ ధోరణిలోనే ఉంటుంది.
‘జైలుగది ఆత్మకథ’ రాసి ఒక పరీక్షకు సిద్ధమవుతున్న విద్యార్థినిలా ‘సృజన’ మాసపత్రికకు పంపాను. ఆ పరీక్ష పాసయ్యాను. సృజనలో అది అచ్చయ్యింది. హైదరాబాదులో విప్లవ రచయితల సంఘం రెండో మహాసభల నాటికి ఆ కథ సృజనలో వచ్చినట్లు గుర్తు. ఆ సభలలో పెద్ద, చిన్న రచయితలందరూ ఆ కథ బాగుందని నాతో చెప్పటం, నేను ‘హమ్మయ్య!’ అనుకుని నిట్టూర్చటం నాకు గుర్తు. ఆ రోజుల్లోనే విప్లవ నేపథ్యంతో మరో కథ ‘అరుణతార’లో రాశాను. అయితే, ‘జైలుగది ఆత్మకథ’ 2008 వరకూ నా కథాసంకలనాలలోకి రాలేదు. విప్లవ రాజకీయాల నుంచి ఫెమినిస్టు రాజకీయాలలోకి వచ్చిన తర్వాతనే నేను విరివిగా కథలు రాశాను. ‘రాజకీయ కథలు’ స్త్రీల శరీర రాజకీయాల గురించి రాసిన కథలు. ‘మృణ్మయనాదం’ కథాసంకలనంలోగాని నా మొదటి కథకు చోటు దొరకలేదు. ఆ కథా సంకలనం ఆవిష్కరణ సభలో నా మొదటి కథలోని కవిత్వం గురించి సి.నారాయణరెడ్డి గారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. కవి గనుక ఆయన దానిని గుర్తించారనుకుంటాను.
‘జైలుగది ఆత్మకథ’ 1970, 1971 నాటి పరిస్థితుల వల్లా, వాటితో నాకున్న సంబంధం వల్లా రాసిన కథ. 1975(?)లో భూమయ్య, కిష్టాగౌడ్‌లను ప్రజాస్వామ్య, పౌరహక్కుల కార్యకర్తలందరి నిరసనల మధ్య ఉరి తీయటం మన చరిత్రలో ఒక విషాద జ్ఞాపకంగా ఇప్పటికీ మిగిలే ఉంది.
‘జైలుగది ఆత్మకథ’ చదివినప్పుడల్లా వాళ్లిద్దరూ గుర్తొచ్చేవారు. కన్నబిరాన్ గారు, వసంత్ గారూ చాలాసార్లు భూమయ్య, కిష్టాగౌడ్‌ల ఉరితీతను ఎలాగైనా ఆపాలని, ప్రయత్నిస్తూ ఆ రోజు రాత్రి, అర్ధరాత్రి వరకూ మిత్రులతో కలిసి జైలు బయట గడిపిన ఉద్రిక్త క్షణాల గురించి చెప్పేవారు. ఇప్పటికీ ఈ జైళ్లు, ఆ మనుషులు, ఆ పరిస్థితులు, అక్కడి కథలు, కన్నీళ్లు, ఉత్సాహాలూ అలాగే ఉన్నాయి. అప్పటికంటే క్రూరంగా ఉన్నాయి.
మేరీ టేలర్ నుంచీ, మొన్నమొన్నటి వరకూ నిజమైన జైలు జీవితం గురించి రాశారు. ఇంకా చాలామంది రాస్తారు. మానవులు కనుగొన్న అత్యంత మానుష, నాగరీక పద్ధతుల్లో శిక్షా పద్ధతి ఒకటి.(నేను సరిగానే రాశాను. మీరు సరిగ్గానే చదివారు). ఆ శిక్షా పద్ధతుల్లో జైలుశిక్ష క్రూరత్వం గురించి ఆలోచించవలసింది ఎంతో ఉంది. మనుషులలో తప్ప మరే ప్రాణులలో ఈ నాగరికత ఉన్నట్టు నాకు తెలియదు.
‘జైలుగది ఆత్మకథ’ ఇప్పటికీ ప్రాసంగికత ఉన్న కథ. అది నా మొదటి కథ కావటం ఆనాటి రాజకీయ పరిస్థితుల వల్ల , వాటితో నాకున్న చైతన్యపూరితమైన సంబంధం వల్ల.
*
కథ ఇక్కడ చదవండి. జైలుగది ఆత్మకథ_ఓల్గా_సృజన (మాసం)_19711101_015821_కథానిలయం
చాలా గొప్ప వ్యాసం. ఆ జ్ఞాపకాలు చదవుతుంటే ఉద్వేగంగా అనిపించింది.
ఓల్గా అనుకోకుండా అకస్మాత్తగ్గా మాతమ్ముణ్ణి కలుసుకోవడం చాలా బాగుంది. మీ మొదటి కథ నేపథ్యంలో మీరు వాడిని కలుసుకోవడం ఇంకా బాగుంది.
ఎంత ఆలోచించీ ఇన్ని వేల సంవత్సరాల మానవ నాగరికతలో దీన్ని మించిన సంస్కరణాగతమై కరుణాత్మకమైన శిక్షాసంస్కృతిని సభ్యసమాజం కనిపెట్టలేకపోవడమే పెద్ద విషాదం