ఉదయాన్నే
ఉత్సాహపు పచ్చ జెండాల్లా ఊపడానికి
రెండు చేతులున్నా
వీధుల్లో గులకరాళ్ళను తంతూ
గంతులేసే కుర్ర కాలువలయ్యే
రెండు కాళ్ళున్నా
లేనివేవో తలుకుంటూ
నిత్యం జీవితాన్ని
నిందిస్తూనే ఉంటావా?
‘సున్నా’ లా ఉన్నచోటే ఊగిసలాడే
నిరాశా లోలకమా!
‘టోర్సో’గా పుట్టినా
వైకల్యాన్ని ధిక్కరించిన
ఆ ధీరుణ్ణోసారి తలెత్తి చూడు!
బడిలోని తొలి రోజులు
అల్లరి మూకలై వెంటబడి ఏడిపించినా
అవమానాలు
ఆలోచనల నిండా చీకట్లు గుమ్మరించినా
బతుకింతేలే అని చతికిలపడలేదు!
చినుకు పిలుపువిని
చిగురించే విత్తనంలా
గెలుపు గాథల స్పూర్తి ఉలితో
బతుకు శిలను చెక్కుకున్న శిల్పి తను
కన్నీళ్లను రెప్పల కింద దాచి
గెలుపు శిఖరాలను ఢీకొట్టిన
కడలి కెరటమతడు
మొండెంకు అతుక్కున్న చిన్న పాదంతోనే
మొండిగా ఆంటకాలతో
ఫుట్ బాల్ ఆడుకున్నాడు
సమస్యల అలలమీద సర్ఫింగ్ చేసాడు
గేలి చేసిన నోళ్ళే ఈలలు వేసేలా
గెలిచి చూపించిన సంకల్పం అతడు
నిక్కమైన ఆ పట్టుదలకు పెట్టిన పేరు
‘నిక్ వుజిసిక్’
గెలివడం గొప్ప కాదు
గెలిపించడమేతన జీవిత లక్ష్యం చేసుకున్న
వ్యక్తిత్వ వికాస పాఠమతడు
అవరోధాలకు తలవొంచే
కుంటిసాకుల ప్రపంచమా!
కళ్ళారా చూడు చెవులారా విను
ఆ చిరునవ్వులు విజయ కేతనాలు!
పెదాల కదలికలు గొప్ప ప్రేరణా వాక్యాలు!!
(నికోలస్ జేమ్స్ వుజిసిక్ ఆస్ట్రేలియాకు చెందిన ఒక ప్రేరణ కలిగించే వక్త. ఇతను ఫొకొమీలియా అనే రుగ్మత కారణంగా కాళ్ళు, చేతులు లేకుండానే పుట్టాడు.
వుజిసిక్ మొదటి పుస్తకం “లైఫ్ వితౌట్ లిమిట్స్” రాండం హౌస్ ద్వారా 2010లో ప్రచురితమైనది. ఇది 30 భాషలలో అనువాదమయింది.)
Thank you so much.
హృదయ పూర్వక ధన్యవాదములు
ఎలాంటి అంగవైకల్యం పీడిస్తున్నా ఆత్మస్థైర్యం ఆయుధంగా విజయతీరాలకు చేరిన నికోలస్ ప్రేరణగా అద్భుతమైన కవితని అందించారు.బాగుంది. అభినందనలు భాయ్..