“గత పాతికేళ్లుగా మనం చదివిన స్కూల్ లైబ్రరీలోని తెలుగు పుస్తకాలు చదివినవాళ్ళు లేరుట. తీసేస్తున్నారని తెలిసి కొంచం సొమ్ము ఇచ్చి కొనేసాను” అంటూ విశ్వం నుండి మెసేజ్. ఒక్క నిమిషంపాటు కెరటంలా ఎగిసిన సంతోషం కాస్తా ఆ ఒక్కటి గుర్తుకు వచ్చి చప్పున వెనక్కితగ్గింది. దడుపు జ్వరం తగిలినట్లు మనసు శరీరం రెండూ ఒణికాయి.
‘ఇప్పుడెలా? ఈ ఆపద గట్టెక్కడం’ అనుకుంటూ ఆఫీసు పనికి హడావిడిగా ముంగింపు చెప్పేసి నేను వెళ్ళేసరికి – ఉచిత గ్రంథాలయం కాంపౌండ్ నుండి ట్రక్కొకటి వెళ్లిపోతోంది. లోపల హాలు నిండా పేర్చివున్న అట్ట డబ్బాల మధ్య దివిటిలా వెలుగుతున్న మొహంతో నిల్చునివున్నాడు విశ్వం. చుట్టూ చూస్తే నాకు తల గిర్రున తిరిగినంత పనైయింది. సుమారు ఓ రెండొందల పైగా వుంటాయి డబ్బాలు. నలభై ఏళ్ల తరువాత ఇలా వీటిని చూడాల్సి వస్తుందనుకోలేదు. తేరుకుని నీరసంగా అడిగాను “ఇప్పుడెందుకురా ఈ పాత పుస్తకాలు?”.
నానుంచి ఇలాంటి వ్యతిరేకత ఊహించివుండడు. దాంతో కోపంగా “పాత పుస్తకాలా! అదేంట్రా శ్రీను అలా అనేసావ్! లైబ్రరీ పెట్టి మూడు నెలలు కాలేదు. మంచి సాహిత్యం కావాలి కావాలి అంటూ నాతో పాటు నువ్వూ ఆరాటపడుతున్నావు కదా! ఊహించని పెన్నిధి దొరికిందని నేను సంతోషిస్తుంటే… అదేం మాట?” అన్నాడు.
“మంచి సాహిత్యమే కానీ మరీ పా… తవి కదా! రీప్రింట్ కోసం చూడాల్సింది”.
“మతిపోయిందిరా నీకు?! కొద్దిపాటి ప్రముఖులవి తప్ప తిరిగి ముద్రణ ఎక్కడ జరుగుతోంది? నాకు తెలిసి అందులో ఎన్నో ఇప్పుడు దొరికే ప్రసక్తే లేదు”.
సమస్యని కళ్ళ ముందు పెట్టుకుని ఇప్పుడు వీడితో తర్కం అనవసరం. “పుస్తకాలన్నీ ఇచ్చేసారా? కొంత మటుకేనా?”.
“కొన్ని మరీ పాడైనాయని చెప్పారు. కానీ అన్నీ ఇమ్మనమని చెప్పాను. వచన కావ్యాలనుండి బాలల సాహిత్యం వరకూ అన్నీను. అందులో ప్రముఖమైనవైతే రెండో, మూడో కాపీలుట. వాటి మంచిచెడులు బయటకి తీసాక మనం చూసుకోవచ్చు. స్కూల్లో తెలుగు టీచరుగారుట! శ్రద్దగా రచయతల వారిగా పెట్టేల్లో సర్దించారని చెప్పారు. ఈ రోజు ఆవిడ సెలవుట. కలసి ధన్యవాదాలు చెప్పుకుందామంటే కుదరలేదు”.
ప్రతి పుస్తకం ఇచ్చేసారా? దేవుడా! ఇన్ని వందల పుస్తకాలలో పేరు తెలియని ఆ ఒక్క పుస్తకం వెతికి పట్టుకోవాలి. ఇప్పుడు వీటి గురించి తెలిస్తే రాఘవ, మురళి, సంధ్యారాణి, రమాదేవి, కరుణాకర్, చందూ… అమ్మో అందరూ వచ్చి పడిపోతారు. కంగారు అణుచుకుంటూ అడిగాను. “సంధ్యారాణికి తెలుసా? రాఘవకి, ఇంక కరుణా వాళ్ళకి చెప్పావా?”.
వాడి మొహంలోకి తిరిగి నవ్వొచ్చిచేరింది. “లేదింకా ఎవరికి చెప్పలేదు. సంధ్య వాళ్ళ అన్నయ్య కొడుకు పెళ్ళి పనులంటూ ముందే వెళ్ళిందిగా! రేపు పెళ్ళిలో కలిసినప్పుడు చెబుతాను. వీటినిలా వదిలేసి పెళ్ళికి వెళ్ళాలని లేదనుకో. కానీ మా బావమరిది ఊరుకోడు”.
నా మనసు చకచకా ఆలోచించసాగింది. రేపు శనివారం. సెలవు పెట్టేస్తాను. ఆదివారం ఎలాగూ సెలవే. విశ్వం పెళ్లి నుండి సోమవారం వరకు రాడు. “వాళ్ళెవరికీ చెప్పకు అప్పుడే. నువ్వు నిశ్చితంగా పెళ్ళికి వెళ్ళు. రేపు శని ఆదివారాల్లో నేను వీలైనంత వరకూ తీసి సర్దేస్తాను. వాళ్ళందరిని ఒకేసారి పిలిచి ఆశ్చర్యపరుద్దాం”.
“అలా అన్నావు బావుంది. రా! ఇప్పుడే ప్రారంభిద్దాం” అంటూ ఓ డబ్బాని ముందుకు లాక్కున్నాడు.
“ఆగాగు నేను తీసి ఇస్తాను. నువ్వు అలమారాల్లో అమర్చుకో” అంటూ ఆ డబ్బాని మళ్ళీ నా దగ్గరికి లాక్కొన్నాను. పిల్లికి చెలగాటం… ఈ సామెతిక్కడ సరిపోదేమో! ప్రస్తుత పరిస్థితిలో నేను ఎలుకనన్న సంగతి వీడికి తెలియదుగా! “ఇంతకీ ఎంత సమర్పించుకున్నావేమిటీ?” అడిగాను డబ్బా తెరుస్తూ.
“ఏదో నేనివ్వగలిగింది ఇచ్చాను. అయినా ఇంత మంచి సాహిత్యానికి విలువ కట్టేవాళ్ళమా మనం?!”.
మంచి సాహిత్యమే – కానీ ఏ స్థితిలో వుంది ఇప్పుడు? చేతిలోకి తీసుకున్న మొదటి పుస్తకంతోనే తెలిసిపోయింది. వెలసి పోయిన ఇటుక రంగు అట్టతో – గోధుమ రంగుకి మారిన కాగితాలు – అంచుల దగ్గర ఆ రంగు చిక్కనై మరకలు తేలింది. “నారాయణరావ్” అంటూ వాడి చేతిలో పెట్టాను.
“ఆహా! భలే ప్రారంభం! ఇంక వరుసపెట్టి బాపిరాజుగారివే”.
“ఆ! ఇదిగో హిమబిందు… గోనగన్నారెడ్డి… కోనంగి… తుఫాను… జాజిమల్లి…” అంటూ ముందూ వెనుకా ఒకసారి తెరచి చూసి వాడి ముందు పెట్టసాగాను.
“ఈ రోజుల్లో మానవ బాంబుల్లా రాజుల కాలంలో విషకన్యలని ప్రత్యేకంగా పెంచి శత్రువులపైనా ప్రయోగించేవారుట!”.
వాడి చేతిలోని హిమబిందుని లాగి తక్కినవాటిపైన పెట్టి బారిష్టర్ పార్వతీశం చేతిలో వుంచాను.
మొక్కపాటి, పిలకా గణపతిశాస్త్రి, పాలగుమ్మి, గోపీచంద్, రావిశాస్త్రి, తెన్నేటి హేమలత, బుచ్చిబాబు, చాసో… నవలలూ, కధా సంకలనాలు… ఒక్కొకరివి బయటకి తీసి ముందు వెనుకలు చూస్తూ నేనైతే చకచకా ఇస్తున్నానే కాని విశ్వం మాత్రం ఒక్కో పుస్తకం దగ్గర ఆగిపోతున్నాడు. ఆగి పలవరిస్తున్నాడు.
“అసమర్థుని జీవయాత్ర, చివరకు మిగిలేది… అబ్బా! చలం పుస్తకాలు మన స్కూల్లో నిషిద్ధం కాని, లతాసాహిత్యం వుంచారు. నువ్వేమైనా చదివావ ఆవిడవి? ఇంకో మూడు వందల ఏళ్లయినా లతా, చలంలాగా ఎవరైనా వ్రాయగలరా అసలు?”.
“వ్రాయలేరు. ఎందుకంటే అప్పుడు తెలుగు చదివే వాళ్ళు కానీ, వ్రాసేవాళ్ళు కానీ వుండరు”. విశ్వం నా మాట వినిపించుకోలేదు. తన ధోరణిలో తానున్నాడు. ప్రతి పుస్తకాన్ని అపురూపంగా అందుకుని చూస్తూ వాటి గుణగణాలని నాతో మొదటిసారి చెపుతున్నట్లు ముచ్చటిస్తున్నాడు.
నవలలు అందులో గ్రాంధికంలో వ్రాసిన వాటి జోలికంత వెళ్ళకపోయినా కథలంటే నాకూ ఇష్టమే. ఇందులో ఎన్నో ఎంతో ఇష్టంగా చదివినవే. కానీ ఎందుకో ఇవేవీ నన్ను విశ్వంని కదిలించినట్లు కదిలించటం లేదు. అందుకు ‘ఆ ఒక్కటి’ కూడా కారణం కాదని నా మనసుకు తెలుస్తోంది. అసలివేవీ అవే పుస్తకాలంటే నమ్మకం కలగటం లేదు. రంగులు వెలసిపోయి ఇంత బరువుగా మబ్బుగా ఇవేనా అవి? వేలితో కదిపితే సీతాకొకచిలుకలవలే రెపరెపలాడుతూ – హత్తుకుని తీసుకెళ్ళే అమ్మాయిల గుండెలపైన గువ్వపిట్టలల్లే కువకువలాడిపోతూ – ఎన్ని హొయలు పోయేవి?
“రావిశాస్త్రిలాంటి మనిషి మళ్ళీ పుడతాడా అసలు? పాలగుమ్మి, చాసో, కొడవటిగంటి… ఆహా! వీళ్ళందరిని, వాళ్ళిచ్చిన సంపదని మరచిపోయి ఎందుకురా మనకీ బ్రతుకులు?”.
తీరికగా వాడు చేస్తున్న ఈ ప్రసంగాలతో నాకు కోపం, చిరాకు రెండూ పెరుగుతున్నాయి. “మనకి అనకు. మనం తప్ప ఇంకెవరయినా చదువుతారా ఈ పుస్తకాలు? ఈ తరం వాళ్ళకోసం నా ఈ ఉచిత గ్రంథాలయం అంటూ నువ్వు ప్రకటించుకున్నా సరే – ఈ తరం కాదు కదా మన తరం కూడా ఎవరూ చదవరు. ఇదంతా అనవసరపు శ్రమ”.
మామూలుగా కంగున మ్రోగే వాడి కంఠం సాహిత్య సంభాషణ కొచ్చేటప్పటికి మెత్తబడి పోతుంది. “ఈ తరం ఆ తరం అంటూ లేదురా శ్రీను! ఇది మన జాతి సంపద! అందులో ఎవరి అభిరుచి వాడిది. ఆసక్తి వుండాలి అంతే! మన మురళిగాడు ఇప్పటికీ తిక్కనవారి పద్యకావ్య రసాస్వాదన తప్ప మరో ప్రపంచం తెలియకుండా వుంటాడా! ‘అట జని కాంచె…’ అంటూ ఆ వొక్క కావ్యం దగ్గరే ఆగి పోయినవాళ్ళు వున్నారు. కేవలం కొత్తగా వచ్చే సాంఘిక సాహిత్యం మాత్రమే చదువుతామని చెప్పేవాళ్ళు వున్నారు. మన తరం తరువాతి తరం అమ్మాయి సుస్మిత – ఒకేఒక్క పుస్తకంతో సరిపెట్టుకోమని ఎవరైనా సంకెళ్లేస్తే గాథాసప్తశతి ఒక్కటి చాలు అంటుందిగా!”.
డబ్బాలోనుంచి తీసిన కాశీ మజిలీ కథల బైండు పుస్తకాలు తిరగేస్తూ చెప్పాను. “నాకు తెలిసి పుస్తకాలు బోలెడు సేకరించి చదివే తీరికలేదనో మరో కారణమో చెప్పేవాళ్ళే ఎక్కువ. మేమంతా చదవడం కన్నా ఒకప్పుడు చదవడం ఇష్టం అన్న భావననే ఎక్కువ ప్రేమిస్తున్నామేమోననిపిస్తుంది. అందుకే నాలాంటి వాళ్ళ చదువు ఫేసుబుక్ పోస్టులకే పరిమితమైపోయింది”.
“నీతో వాదన ఎందుకు కానీ అక్కడ డబ్బా పైన చరిత్రాత్మక రచనలు అని వ్రాసి వుంది చూడు. ఇలా అందుకో! ముందు అవి చూద్దాం”.
“అదేం కుదరదు. గడియారం ముల్లులా ఎడమ నుండి కుడికి వెళ్తున్నాను. నువ్వు మధ్యలో ఇంకేవో చూస్తానంటే కుదరదు”.
విశ్వం నాకేసి బతిమాలాడుతున్నట్లు చూసాడు. “నీకు తెలియదురా శ్రీను! నేను తిరిగి చదవాలని అనుకునేవి అందులో చాలా వున్నాయి. నోరిగారు మల్లారెడ్డి నవలలో కవి ఎఱ్ఱన పాత్రని మలచిన పద్దతి నాకు భలే ఇష్టం. నన్నయ్య, తిక్కన రచనల నుండి ప్రేరణ పొంది అతగాడు భారత రచనలోకి దిగిన తీరు తిరిగి చదవాలని నా కోరిక. అలా రాజులకి కవులకి మధ్య సమకాలీన చరిత్ర తీసుకుని దానికి కల్పన జోడించి వ్రాయడం ఎంత అద్భుతం అసలు. సృజన అంటే అది కదా! మల్లాది వసుంధర వ్రాసిన రామప్పగుడి నవలలో శిల్పి రామప్పకి స్ఫూర్తి రుద్రమదేవి అంటే నమ్ముతావా నువ్వు?”.
మరో పుస్తకాన్ని వాడి చేతిలో పెడుతూ కుతూహలంగా చూసాను.
“గణపతిరుద్రదేవుల పరిపాలనలో రుద్రాలయనిర్మాణంలో ప్రధానశిల్పి యువకుడైన రామప్ప. ఎవరూ లేని ఏకాంతసమయంలో వచ్చిన రుద్రమదేవిలో తన ఊహాసుందరిని చూస్తాడు. ఆ సౌందర్యరాశి ఎవరో, ఎక్కడి నుండి వచ్చి వెళ్ళిందో అతడికి తెలియదు. మరోసారి పురుష రూపంలో వచ్చిన ఆమెని ఆ యువతి తాలూకు తమ్ముడని అనుకుంటాడు. గొప్ప ఆరాధనతో అతడు చెక్కిన రతీదేవి, ఏకవీరాదేవి, గజలక్ష్మి, పార్వతిదేవి, మహిషాసురమర్ధని – అలా ప్రతి శిల్పం ఆమె రూపురేఖలని అద్దుకుంటాయి”.
ఇదే విశ్వం ప్రత్యేకత! ఎప్పుడో చదివిన విషయాలు ఇప్పటికీ కళ్ళకి కట్టినట్లు చెబుతాడు. “చివరికి తెలుస్తుందా ఆమె ఎవరని?”
వాడు నా ప్రశ్న వినకుండా చేతిలో పుస్తకానికేసి చూసి “ఓహో! శ్రీకాంత్” అంటూ కెవ్వున అరిచాడు. “ఈ శరత్ సాహిత్యం అంతా దొరికిందని సంధ్యకి చెప్పకుండా వుండడం చాలా కష్టంరా! ఇక్కడ వుంచనిస్తుందో? ఇంటికే పట్టుకు రమ్మంటుందో?! ”
ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాను. కాలు తిమ్మిరి పెట్టిన స్పృహ కూడా అప్పుడే తెలిసింది. మాటల్లో పడి కొట్టుకుపోతూ నేను పుస్తకాన్ని తిరగెయ్యకుండానే వాడి చేతిలో పెడుతున్నాను. వీడిని ఇక్కడి నుండి త్వరగా పంపించాలి. “రేపు పొద్దున్న పెళ్ళికి వెళ్ళాలిగా. ఇంక నువ్వు ఇంటికి వెళ్ళు! నేను చూసుకుంటానులే” అన్నాను.
ఓసారి ఫోన్ చూసుకుని “అమ్మో! సంధ్యనుండి రెండు మెసేజులు. చూడనేలేదు” అంటూ లేచాడు. వాడిని సాగనంపి తిమ్మిరి పట్టిన కాలుపైన కాస్త నీళ్ళు చల్లి చుట్టూ చూసాను. ఏ డబ్బాలో వుందోకదా! అనుకుంటే ఎక్కడాలేని నీరసం వొచ్చింది. చీకటిపడి – లోపలా బయటా కూడా సద్దుమణిగి – నా గుండె చప్పుడు నాకే వినిపిస్తోంది.
శరత్ రచనలతో నిండి వున్న ఆ డబ్బాని తిరిగి ముట్టుకోవాలనిపించలేదు. అమ్మాయిల ఆరాధ్య రచయత కాబట్టి వాళ్ళచేత ఆహా! అనిపించుకోవడానికి అప్పట్లో కొన్ని చదివానే కానీ – పురుషపాత్రలకి బలహీనతలు భగ్నప్రేమలు అంటకట్టి అన్యాయం చేసాడని ఎక్కడో కోపం కూడా వుంది.
తప్పదు కదా అని శరత్ పుస్తకాలు ఓ సారి తిరగేసి సర్దేసి స్థిమితంగా కూర్చుని మరో పెట్టె తెరిచాను. వరుస పెట్టి మరిన్ని బెంగాలీ అనువాదాలు. చోఖేర్ బాలి, పడవ మునక, గోరా… టాగోర్ రచనలు – అన్నీ అస్తవ్యస్తంగా వున్నాయి. మొఘల్ దర్బార్ కుట్రలు, దుర్గేశనందిని, నవాబు నందిని, ఆనంద్ మఠ్…
బంకించంద్ర ఛటర్జీ రచన దుర్గేశనందిని – ముందు వెనుకల అట్టలు ఊడి దీనస్థితిలో వుంది. పాత చందమామలలో చిత్ర వేసిన అందమైన బొమ్మలతో చదివిన కథ ఇప్పటికీ మనసులో తాజాగావుంది. కళ్ళు మూసుకుంటే మేలిముసుగులో రాజకుమారి తిలోత్తమ చిత్రం అందంగా ప్రత్యక్షమయ్యింది.
అలాగే మూసి వుంచిన కళ్ళ ముందు ఆనాటి మా పాఠశాల, గ్రంథాలయం వచ్చి నిలిచాయి. నాకు నెమ్మదిగా అర్థమవసాగింది. నా జ్ఞాపకాలు కేవలం ఈ పుస్తకాలతో ముడిపడి లేవు. ఆనాటి వాతావరణం – స్నేహితులతో పంచుకున్న ఆ జీవితం. ఎత్తయిన ఆ గ్రంథాలయం భవంతి, విశాలమైన గదులు, అడుగడుగునా వుండే నిశ్శబ్దం హెచ్చరికలు. అవి మాటలకే కానీ, అమ్మాయిల కిలకిలలకి – వారితో మా చూపుల సందేశాలకి కాదే! అద్దాల అల్మారాలలో నుండి తొంగి చూస్తూ ఊరించే పుస్తకాలు. అవి పరిచయం చేసిన కొత్త ప్రపంచాలు – అన్నీ కలగలసి కలిపించిన అందమైన స్వాప్నిక వాతావరణం.
ఛ! వీటిని తీసుకుని విశ్వం చాలా తప్పు చేశాడు. ఇన్నాళ్ళు మనసులో పదిలంగా వున్న అందమైన అనుభూతి కాస్తా చెదరిపోయింది. సమయం చూస్తే ఒంటిగంట. దీపం తీసేసి, తలుపులు దగ్గరగావేసి తాళం వేస్తుండగా వినిపించింది, ‘పారా హుషార్!’ అంటూ హెచ్చరిక. తాళం వేసినంత మాత్రాన ఈ జాతి సంపద నిజంగా భద్రంగా వుందా?!
* * * * * * * * *
మరునాడు ఉదయం తలుపులు కిటికీలు తీసి అప్పటివరకూ జరిగిన పని ఓసారి అంచనా వేసిచూస్తే నిన్న రాత్రి ఓ పాతిక శాతం పని అయినట్లు అనిపించింది. పర్వాలేదు ఇంకా రెండు రోజులు వుంది.
ఎలాంటి భావోద్వేగాలకి లొంగకుండా పనిచెయ్యాలని కూర్చున్నానే కానీ – తీయడమే తడువు సోవియట్ అనువాదాలు బయట పడ్డాయి. అడవిలో ఇళ్ళు, టాల్ స్టాయ్ పిల్లల కథలు, ఛుక్ గెక్ అన్నదమ్ముల కథ, నొప్పి డాక్టరు… ఎక్కడాలేని ఉత్సాహం వచ్చింది. తిరిగి చదవడం అంటూ చేస్తే వీటితోనే మొదలు పెడతాను.
బాలల సాహిత్యాన్ని అలమారాల్లోకి చేర్చి కూర్చోగానే రష్యన్ మహారచయతలు వరస పెట్టి బయటకి రాసాగారు. దోస్తోవిస్కీ, పుష్కిన్, చెకోవ్, మాక్సిం గోర్కీ… ‘ప్రపంచ వ్యాప్తంగా మహా రచయతలందరూ వ్రాయని వస్తువంటూ వుందా అసలు? అంతర్ సంఘర్షణల నుండి – అడవులనుండి – అంతరిక్షం వరకూ… ఏది వదలిపెట్టలేదే!’ అంటూ చెవి పక్కన కూర్చుని విశ్వం చెపుతున్నట్లేవుంది.
తలుపు గడియ టకటకామని కొడుతున్న చప్పుడికి తలతిప్పిచూశాను. గుమ్మలో ఓ అపరిచిత నవ్వుతూ నిల్చునివుంది.
“నమస్తే! మీరు నిన్న మా స్కూల్ గ్రంథాలయం తాలూకు తెలుగు సాహిత్యమంతా తెచ్చుకున్నారుట. నేను అక్కడ తెలుగు టీచర్‌ని. చూసి వెళ్దామని వచ్చాను”.
‘మహాతల్లీ! ఈ సమయంలోనే రావాలా?!’ అనుకుంటూ “ఆ! రండి! లోపలికి రండి!” అంటూ ఆహ్వానించి – కూర్చోమని చెప్పి – నిన్న పుస్తకాలు తెచ్చింది నేను కాదని నా స్నేహితుడు విశ్వం అని చెప్పాను. ఆవిడ నిన్న స్కూలుకి రాకపోవడంతో వాడు ధన్యవాదాలు చెప్పడం కుదరకపోయిన విషయంకూడా చెప్పాను.
ఆవిడ నవ్వి” నేనే మీ స్నేహితుడికి ధన్యవాదాలు చెప్పుకోవాలి. వీటితో నాకు పాతికేళ్ళ అనుబంధం. ఇంత అపురూపమైన సాహిత్యం, ఏ రద్దీవాడి చేతిలో పెట్టేస్తారో అని దిగులు పడిపోయాను” అంది.
ఈవిడే అడ్డుపడకపోతే వీటి ప్రస్తుత రూపురేఖలకి స్కూల్ వాళ్ళు ఆ పనే చేసేవాళ్లేమో?!
“మీరు మాత్రం! ఎంత సాహిత్యాభిమానూలు కాకపోతే ఇంత పొద్దున్నే వచ్చి ఇవన్నీతీసి అమర్చుకుంటున్నారు చెప్పండి? వీలైనంతవరకూ రచయతల పేర్లు, అనువాదకుల పేర్లు డబ్బాలకి కుడి వైపు పై అంచున వ్రాసాను. చూసారా?”.
నా దారిన నేను పుస్తకాలు బయటకి తీస్తూ లేదన్నట్లు తల వూపాను.
“రష్యన్ అనువాదాలు కానిస్తున్నారు. వీటి పక్కన ఈ పాతిక డబ్బాలు ఆంగ్ల సాహిత్యం తాలూకు అనువాదాలు. వాటినానుకుని ఈ నలబై డబ్బాలలో సంస్కృతం నుండి తెలుగులోకి తెచ్చిన అనువాదాలు. వాసవదత్త, కాదంబరి, ముద్రారాక్షసం, మేఘసందేశం… ఇంకా పద్యకావ్యాలు, వచనకావ్యాలు… ఒక్కటేమిటీ – మహాభారతం , రామాయణం నుండి, దేవి భాగవతం వరకూ సమస్తమూ వున్నాయి”.
ఆవిడ చెపుతున్న ఆ డబ్బాల సంఖ్యే నాకు తలపైనా టంగుటంగుమని కొట్టినట్లు వినిపిస్తోంది.
“ఇదిగో ఈ వరుసంతా చరిత్రాత్మక రచనలు. చరిత్రాత్మక రచనలు విశ్వనాథవారు కూడా చేసారు కానీ వాటిని వీటిలో కలపలేదు. మహానుభావుడు! ఆయనవన్నీ ప్రత్యేకం! వేరు డబ్బాలలో పెట్టించాను. కొన్నయితే రెండు నుండి మూడు కాపీలు”.
ఈవిడ డబ్బా వాసన చూసి అందులో ఎవరి రచనలు వున్నాయో చెప్పేలావుంది. నేను చెయ్యాల్సిన పని మర్చిపోయి, తలెత్తి, అటూ ఇటూ గిరగిరా తిరుగుతున్న ఆవిడనే చూస్తుండి పోయాను. ఆవిడ వరుస పెట్టి చూస్తూ, వెతుకుతూ “ఇదిగో ఇక్కడున్నాయి శ్రీపాదవారివి, విశ్వనాథవారివి. వీరి పక్కన ఇదిగో తెలుగులో వచ్చిన బాలలసాహిత్యం…” అంటూ ఆగి ఊపిరి పీల్చుకుంది.
చూస్తుంటే ఈవిడ ఇప్పుడిప్పుడే ఇక్కడి నుండి కదిలేలా లేదు. నేనోసారి గొంతు సవరించుకుని చెప్పాను. “వీటిపైన మీకున్న అభిమానం ఎలాంటిదో తెలుస్తోంది. మా గ్రంధాలయం తలుపులు మీకోసం ఎప్పుడూ తెరిచేవుంటాయి. మీరు ఎప్పుడు కావాలంటే అప్పుడు వచ్చి చదవడానికి తీసుకోవచ్చు”.
నా మాటలకి ఆవిడ పకపకా నవ్వింది. “చదవడమా? ఒక్కొక్కటి రెండు మూడు మార్లు చదివినవే. నచ్చినవైతే లెక్కకు మించినన్ని సార్లు. చదవాలన్న కుతూహలం వున్న మీలాంటి వాళ్ళ చేతిలో పడ్డాయి. నాకంతే చాలు. నేనింక వెళ్ళాలి మరి” అంటూ కదిలింది.
హమ్మయ్యా! అనుకుని – సాగనంపే ఉద్దేశ్యంతో నేను లేచి వెనకే నడిచాను.
గుమ్మం దాకా వెళ్ళిన ఆవిడ అంతలో చటుక్కున వెనక్కి తిరిగింది.”ఎన్నెన్ని సార్లు చదివానో అనుకుంటే గుర్తుకు వచ్చింది. మీకో తమాషా అయిన సంగతి చెప్పాలి. భ్రమరవాసిని నవల ఆఖరి పేజీలలో ఎవరో అజ్ఞాతప్రేమికుడు సంధ్యారాణి అన్న అమ్మాయికి రాసిన ప్రేమలేఖ కూడా ఆ నవల చదివిన ప్రతిసారి చదివాను” అంటూ చిరునవ్వు నవ్వింది.
నా మొహంలోకి రక్తం జివ్వున పాకి వచ్చింది. గుండె ధడ్ ధడ్ ధడ్ మంటూ కొట్టుకోసాగింది. బల్ల మీద అందుబాటులో కనిపించిన పుస్తకం ఆఖర్లో వున్న ఓ తెల్ల కాగితంలో వ్రాయడమైతే వ్రాసానే కానీ చించి ఇవ్వడానికి ధైర్యం చాలలేదు. మర్నాటికి టెంతుక్లాసు ప్రిపరేషన్ పరీక్షలంటూ అన్ని పుస్తకాలు అల్మారాలలో చేర్చి తాళాలు వేసారు.
“అసలేమికథ! ఏమి కల్పనండీ! అందులోనే సమాంతరంగా నడిచే ఓ రెండు కథనాలు! ఆహా! మరో లోకంలోకి ప్రయాణం చేయిస్తుంది కదా!” అంటూ ఆవిడ గుమ్మం దాటేసింది.
నేను గుండెదడ, కంగారూ అణుచుకుంటూ – మొహం వీలైనంత అమాయకంగా పెట్టి “ఎవరు వ్రాసారు మేడమ్ ఆ నవల? గుర్తుకురావడం లేదు?” అన్నాను.
ఆవిడ వెనక్కి తిరిగి నాకేసి ఓసారి విచిత్రంగా చూసి, అంతలో గమ్మత్తుగా నవ్వేసి – “మీకో సూచన ఇస్తాను. సుళువుగా ఇట్టే పట్టేస్తారు. దిండు క్రింది పోక చెక్క! భ్రమరవాసినిలో ప్రేమలేఖ!” అంటూ వెళ్ళిపోయింది.
నా తల గిర్రున తిరిగింది. ఈవిడసలు తెలుగు మాస్టరా? లేక క్విజ్ మాస్టరా? ‘దిండు క్రింది పోకచెక్క?!’ – అయినా అదేం క్లూ? కనీసం పుస్తకం పేరు తెలిసింది అంతే చాలు! మనసు కుదుటపర్చుకుని రెట్టింపు ఉత్సాహంతో మరో డబ్బా ముందుకు లాక్కున్నాను.
* * *
భలే. సాహిత్య డిటెక్టివ్ వర్కు.
Lol, నిజమే, చదవడం కన్నా చదవాలనే అభిలాష ఎక్కువ.