ఆ అనుభూతులు శాశ్వతం!

యాత్రా స్మృతి – 8

దయం 11:15కి కనక్ చౌన్రీ చేరుకున్న మేము బేగ్స్ రూమ్లో పడేసి వెంటనే ట్రెక్ కు   బయలుదేరాం. ఈ ఆలయంలో కుమారస్వామికి వెన్న రాస్తారు. దీని వెనుక ఒక కథ ఉంది. వినాయకుడు, కుమారస్వామిల మధ్య గణాధిపత్యానికై జరిగిన పోటీలో కుమారస్వామి పరాజయం పాలయ్యాక ఎంతో కోపంతో రగిలిపోతూ నెమలితో సహా వచ్చి ఈ పర్వతంపై వాలాడట. అప్పుడు ఆ కోపాన్ని చల్లార్చడానికి వెన్న పూసారట. అందుచేత విగ్రహానికి వెన్నపూత ఉంటుంది.

ఉదయం 11:30 ప్రాంతంలో ట్రెక్ మొదలుపెట్టే సమయానికే ఆకాశంలో మేఘాలు కమ్ముకోవడం ప్రారంభం అయ్యాయి. స్థానికంగా ఉండేవారు ఎక్కువగా దర్శనం కోసం, వారి కొన్ని మొక్కులు తీర్చుకుందికి ఇక్కడికి తరచుగా వస్తుంటారు. చుట్టుపక్కల చిన్న చిన్న ఊళ్ళలో ఉన్న స్కూల్ పిల్లలు ఎక్స్కర్షన్ కోసం బస్సుల్లో వచ్చేరు. మే, జూన్ నెలల్లో అయితే బయట నుండి సందర్శకులు ట్రెక్కింగ్ కోసం ప్రత్యేకంగా వస్తారట. మొత్తానికి మేము బయలుదేరే సమయానికి మనుషుల హడావిడి బాగానే ఉంది.

ఆ పర్వతం మీద ఉన్న ఆలయానికి వెళ్లే దారి మొదట కాస్త రాతి పలకలతో ఉన్నా తర్వాత ఉన్నదంతా అడవి మధ్యలో నుంచి ఉన్న ఎగుడు దిగుడుల మట్టి దారే.

ఓ పక్క లోయ మరోపక్క రోడో డెండ్రాన్ చెట్లతో పాటు ఎన్నో రకాల చెట్లు. స్థానికులు గ్రామ దేవతగా వనదేవతని పూజిస్తారు. చెట్లను దేవతగా భావించి ముత్తైదువులకు సమర్పించినట్టుగా భావించి గాజులు, కుంకుమ, అద్దం, దువ్వెన వంటివి ఆ చెట్లకు అలంకరిస్తారు. దారంతా అటువంటి చెట్లు చాలా కనిపించాయి. చెట్ల మధ్య నుండి హిమాలయ శిఖరాలు కనిపిస్తున్నాయి గాని బాగా మేఘాలు ఉండడం వల్ల స్పష్టంగా లేవు. సుమారు రెండు గంటల నడక తర్వాత ఆలయం దరిదాపులకు చేరుకున్నాం. మరో అరగంటలో చేరుకుంటాం అనగా  చిన్న చిన్న షాపులు కనిపించేయి.ఏవో తినడానికి, పూజా సామాగ్రి అమ్ముతున్నారు. అక్కడే ఓ ధర్మశాల కూడా ఉందట.

ఈ రెండు గంటల్లో వాతావరణం చాలా మారిపోయింది. విపరీతమైన చల్లటి ఈదురుగాలులు, ఉరుములు. ఎప్పుడైనా వర్షం వస్తుందేమో అనిపించింది. ఆ పర్వతం చివరన కోవెల ఉన్న దృశ్యం చూడవలసిందే నిజంగా. శూన్యంలో వేలాడుతున్నట్టు ఉంటుంది. దర్శనం చేసుకున్నాం. అక్కడి నుండి చూస్తే చుట్టూ నాలుగు వైపులా దూరంగా హిమాలయ శిఖరాలే. మాటల్లో చెప్పలేని అనుభూతి నిజంగా అవన్నీ చూడడం. ఆ తరువాత గుడి వెనక భాగానికి నడుచుకుని వెళ్ళాం. అప్పటికే అందరూ వెను తిరిగి వెళ్ళిపోతున్నారు. గుడి వెనుక వైపు, క్రిందికి మెట్లు ఉండి ఒక సన్నటి దారి ఉంది. ఒక్క మనిషి మాత్రమే నడిచేంత. అటు ఇటు అగాధమే. దారంతా రాళ్లతో మెట్లలా ఉంది. ఆ దారి వెంట ఓ 10 నిమిషాలు నడిచి వెళితే చివరన కాస్త విశాలమైన ప్రదేశం. అక్కడ వరకు వెళ్లి తనివి తీరా అంతా చూసాం. కారు మబ్బులు కమ్మి ఒకలాంటి చీకటి అలుముకుంది. చుట్టూ హిమాలయ పర్వతాలు… అటు ఇటు అగాధం… హోరుమని విసిరేసేటంత గాలి… ఏదో శూన్యంలో నిలబడ్డామనే అనుభూతి కలిగింది. అక్కడ ఎంత సేపు ఉన్నా తనివి తీరదు కానీ వర్షం పడితే మట్టి దారంట దిగడం కష్టం అని బయలుదేరాం అప్పుడే అనుకున్నాం… రేపు ఉదయం ఎలా అయినా ఆ హిమాలయ శిఖరాలను సూర్యోదయ వేళలో చూడాలి అని. తిరిగి సుమారు మూడున్నర ప్రాంతంలో రూమ్ కి చేరుకున్నాం. టీ తాగి విశ్రాంతి తీసుకుని రాత్రి త్వరగా భోజనం ముగించి నిద్రపోయాం.

ఉదయం త్వరగా లేచి ఐదున్నర అయ్యే సరికల్లా మళ్లీ రెండవసారి కార్తీక్ స్వామి దర్శనం కోసం బయలుదేరాం. రెండుసార్లు ఈ ట్రెక్కింగ్ చేస్తాం… చేయగలం అని మేము అస్సలు అనుకోలేదు. తుంగనాథ్ అంతలా అలసిపోయిన మాకు ఎక్కడినుండి ఓపిక వచ్చిందో తెలీదు. అంతా ఆ ప్రకృతి మహిమే అనిపించింది. ఈసారి మాత్రం దారిలో మరెవ్వరూ లేరు. ఇంకా తెల్లవారలేదు పక్షుల అరుపులు మాత్రం వినిపిస్తున్నాయి. చెట్ల మధ్య నుండి కనిపిస్తూ చంద్రుడు. మా దృష్టంతా ఆ చెట్ల మధ్య నుండి కనిపిస్తున్న హిమాలయ శిఖరాలపైనే. ముందు రోజు మేఘాల వల్ల ఏమీ సరిగా కనిపించలేదు. ఇప్పుడు వాతావరణం బావుంది. వెలుగు వస్తే చాలు. మెల్లగా సమయం ఆరున్నర అవుతోంది అనగా పర్వతాల వెనుక నుండి వెలుగు రేఖలు కనిపించడం మొదలైంది. ఆ అందమైన దృశ్యాన్ని చూడాలని ఆగిపోయాం. పర్వత శిఖరాల వెనుక నుండి సూర్యుడు ఒక్కసారిగా బయటకు వచ్చేసరికి ఆ కాంతి ఎదురుగా ఉన్న చౌకంభ శిఖరం మీద పడి ఓ వింత బంగారు రంగులో మెరిసిపోయింది. హిమాలయాలను సూర్యోదయ వేళల్లో చూడాలి. ఆ అందమే వేరు. తుంగనాథ్ లోను, ఇక్కడ కూడా మాకు ఆ అదృష్టం దక్కింది .తనివి తీరా ఆ దృశ్యాన్ని చూసి ముందుకు వెళ్లాం. కోవెలకు ఎనిమిది గంటల ప్రాంతంలో చేరుకున్నాం. నిన్నటి వాతావరణం ఎంత అలజడిగా ఉందో ఈరోజు అంత ప్రశాంతం. చుట్టూ ఉన్న మంచు పర్వతాలు బంగారు రంగు పూసుకున్నట్టు మెరుస్తున్నాయి. అక్కడే చాలాసేపు ప్రశాంతంగా ఇద్దరం ఉన్నాం. దర్శనం చేసుకుని తిరిగి పది గంటలకు కిందకి చేరుకున్నాం.

ఈ మా ఉదయం ప్రయాణంలో వెళుతున్నప్పుడు గానీ, తిరిగి వస్తున్నప్పుడు గానీ ఒక్క మనిషి అలికిడి కూడా లేదు. ఇంచుమించుగా పూర్తిగా దిగిపోయాక అప్పుడు ఒకరిద్దరు ఎదురయ్యారు. ప్రకృతిని ప్రశాంతంగా చూడాలి అంటే పక్షుల్లా ఇలా సూర్యోదయానికి ముందే బయలుదేరాలి. అప్పుడే ఆ సూర్యోదయాలు, ఆ అందాలు మన మనసులో నిలిచిపోతాయి. తిరిగి మేము కిందకు చేరుకునే సమయానికి పేపర్ డిస్ట్రిబ్యూషన్ వ్యాన్ వస్తోంది. మా హోం స్టే కేర్ టేకర్ ముందుగా చెప్పి ఉంచడం వల్ల మా కోసం వాళ్లు కాస్త సేపు వేచి ఉన్నారు. రూమ్ ఖాళీ చేసి మేము ఋషికేశ్ కు రుద్ర ప్రయాగ మీదుగా ప్రయాణానికి సిద్ధం అయ్యాం. ఆ విధంగా ఒకరోజు తర్వాత ఋషికేశ్ చేరుకున్నాం.

మా యాత్ర ఇక్కడి నుండే ప్రారంభమైంది తిరిగి తిరిగి మళ్లీ అదే గంగ వద్దకు చేరుకున్నాం.

మా జీవితంలో ఈ యాత్ర ఓ మర్చిపోలేని అనుభవం. మనసు పొరల్లో ఆ అనుభూతులు ఎప్పుడూ శాశ్వతం.

*

స్వాతి పంతుల

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు