ఇంతలా ముసురుకొచ్చి
గుండె ముందు కూచుంటే
యక్షుడిలా ఎన్ని కవితలు కురిసిపోతావో
అనుకుంటా కదా
ఎండ మాటా పాటా లేకుండా
రేయీ పగలూ తెలియనీకుండా
మండించి వెళ్ళిపోయింది
మునుపటి నీ ఊసులతో పచ్చ పూల తంగేడునై
నీ తడి కౌగిళ్ల గుంపులతో వస్తావని
అనుకుంటూ రాలిన పూల నలుగుతో సిద్ధమైతే
నీవిలా ఆశలే రేకెత్తిస్తున్నావ్
ఎన్ని మాటల చినుకుల్లో
సనసన్నగా తడుపుతావనుకుంటా కదా
కొమ్మ కొమ్మనూ తాకి ప్రతి ఆకునూ తడిపి
ఆశ్చర్యాన్నో ఆశనో నింపుతావనుకుంటే
గర్జిస్తూ భయపెట్టి
రేపటి దాకా మళ్ళీ ఆగమంటావ్
పచ్చి మట్టి నీ దేశ దేశాల కబుర్ల జల్లులతో తడిసి
పరిమళించాలని ఎన్ని కలలు కంటోంది
ఇక నీ సందేశాలు గర్జనల్లో విన్నా కానీ
నువు వచ్చి కురిసి నా ముందు నిలువు
నన్ను మళ్ళీ ఓ పచ్చని పులకింతని చెయ్
*
బావుంది
ధన్యవాదాలండీ
బ్యూటిఫుల్ సర్