రాసే పదాల్లోనూ పలికే మాటల్లోనూ
ఒంపుకున్న సాంద్రత ఎక్కడిదీ?
ఈ పానశాల పేరు భువి అని కదూ నువ్వు చెప్పిందీ?
తారకల కాంతిభారాన్ని మిణుగురు
దేహంలో పొదిగిన కరస్పర్శ ఎంత సున్నితమైందీ?
సీతాకోకచిలుకలు పుష్పాలను మోయగలిగితే?
పెళపెళ రావాలకు చినుకులు తగిలి చల్లబడితే!?
భూమి పెదాలపై నదుల ప్రవాహాలను సృష్టిస్తే?
దాని దేహం మహాసముద్రమైతే?
ప్రకృతి పాఠశాలలో పంచభూతాలను
ఉపాధ్యాయులను చేసి
బతుకు పాఠాన్ని చెప్పిస్తున్నదెవరూ?
కఠిన శిలల మౌనాన్ని
బద్దలుకొట్టి సంగీతం పలికే శిల్పాన్ని చెక్కిన చేయ్యేది?
ఎక్కడిదీ కవన వసంతం గాన శోభ?
కాకులు కోకిలలు ఒకే గూడు లోంచి
పాటలల్లుతుంటే చెట్లాకులు
ప్రేక్షకుల్లా వాహ్వాలందిస్తున్న
కవన సభలా ఉంది కాదా ఈ లోకం?
ఎవరి పదాల్లో అయినా అల్లా పలుకుతున్నాడు!
నబీ దారి తెరుచుకున్న వెలుతురు ధార లో
నడుస్తూ కనిపిస్తున్నాడు!!
అసలు మనిషే ఒక కాంతి రేఖ!
అహ్!
కాంతి రేఖ ఇంకో కాంతి రేఖ కు జన్మనిస్తున్న
కాలగర్భంలో ఉనికి కణానికి పురుడుబోసే శక్తినిచ్చిందెవరూ?
ఇన్ని గ్రహాల్లో భూ గ్రహానికే ఊదా రంగునీ,
పచ్చదనాన్ని
పరిచయం చేసినదెవరూ?
రాజ ప్రసాదాలు ఒదిలి సాధారణమే
అసాధారణమై
యుధ్ధాల్లో రాటుదేలిన నిటారుతనపు నడుమును
ఒంగి ఒదిగిపోయేట్టు చేసిన ఘనత ఎవరిదీ?
నమాజును సమానత్వపు వరుసగా మార్చి
ఒక్క అజా పిలుపు కు
పొలోమనీ చేరిపోతున్న జనాన్ని చూసి
నింగిలోకి దువాలను పావురాలను చేసి ఎగరేస్తున్న మినారు
కళాత్మకత ఎవరు నిలబెట్టినదీ?
జహాపనా!
వారంతా నీ నామాన్ని జపం చేస్తున్నారు,
నీ మజార్పై నుదురు ఆనించి ఏదో కోరుకుంటున్నారు,
కడు పేదల పెదవులు పలికే ప్రతి మాటలో
కవిత్వం ఒలుకుతున్నది-
ఖవ్వాలీ గా ఖసీదాగా రూపుదిద్దుకుంటున్న వేళ
విశ్వమో ముషాయిరా కదా!
****
నిశ్చలనం
నా జ్ఞాపకాలన్నీ మంచుపొగలా
కాలపు నది మీద ఎగురుతున్నాయి!
ఎదురుచూపనే యాత్రలో
ప్రవహించే కాలమే వాహకం కదా!?
క్షణాలన్నీ వలసలో
తప్పిపోతున్న విహంగాలౌతున్నాయి!!
పీడకలల గబ్బిలాలు
ఘడియల ఆయుష్షు ను పీల్చేస్తున్నాయి!
తడిని లోపలికి ఇంకనీయని
వర్షపు ధార దేనికి సంకేతం!?
పెళపెళరావపు బొమ్మజెముళ్ళు నింగిని గాయపరిచినప్పుడంతా
నది మీద మంచుతెరలా పరుచుకున్న మౌనం బద్దలౌతుంది కానీ
గాలిలో శబ్ద తరంగాలు
ప్రయాణించని స్థితిని ఏమనాలి?!
నేనెప్పుడు చివరిగా శ్వాస పీల్చుకున్నానో
గుర్తులేదు,
అది అప్పటి నుండి బయట
పడే మార్గాన్ని మరిచిపోయి లోపల్లోపలే తాచ్చాడుతున్నది,
నా చూపు నువ్వెళ్ళిన
దిక్కులోనే దిగబడి పోయిన పురా గడియారం!
దాని ప్రతి కదలికా నిశ్శబ్ధం!!
నన్ను అస్తమానమూ పలకరిస్తూనే,
నా ప్రతిస్పందనకు ఎదురుచూస్తూనే-
నీటి అలలూ, వాటిలో చేపలూ,
నీ పలవరింతలో స్థాణువైపోయిన నాలో
కదలికల కోసం కాచుకొని ఉన్నాయి!
అందరికీ తెలిసనట్టే-
కదలికలు లేని నా దేహం లోపల
హృదయం ఎవరి కోసం చలనం లో
ఉన్నదో…
నీకూ తెలుసా?
ఉనికి కణానికి పురుడు పోసే శక్తి నిచ్చెందెవరు
Thank you 🙏