ఆశించని ప్రతిఫలం

అర్చన ఫైన్-ఆర్ట్స్ అకాడెమీ & శ్రీ శారద సత్యనారాయణ మెమోరియల్ ఛారిటబిల్ సొసైటీ సంయుక్తంగా నిర్వహించిన కధల పోటీలో రెండో బహుమతి కథ

కాలచక్ర భ్రమణానికి  కారకుడైన సూర్యుడు, కాలమానముతో తనకేమి సంబంధం లేనట్లు నంగనాచిలా నీరెండలో మినుకు

మినుకుమంటున్నాడు.సమయం ప్రొద్దున పదిగంటలు .ఎండ తీవ్రత ఎక్కువగా లేకపోవడంవల్ల వరెండా తలుపు తెరుచుకుని తోటలోకి వచ్చినిలబడింది మిసెస్ .పద్మావతి జగన్నాధం.తోటమాలి  చెంచులయ్య పొద్దునేవచ్చి తోటలో కలుపు తీసి చెట్లకు

నీళ్లు పెట్టి వెళ్ళాడు.పద్మావతి చెట్లవైపు పరకాయించి చూసింది.విరగబూసినపువ్వులు తమ నెత్తావితో ఆమెను పలకరించాయి. ఎంతో ప్రేమతో పెంచుకున్న తోట ,ఎంతో శ్రద్దగా దగ్గరుండి కట్టించుకున్న తులసి కోట,ఎన్నో సాయింత్రాలు తాను భర్తతో

పంచుకున్న క్షణాలకు సాక్షీ భూతంలా నిలబడివున్న ఊయల తనవైపు ఆర్తితో చూస్తున్నాయనిపించిందిఆమెకు .ఏం చేయను నేను నిమిత్త మాత్రురాలిని అన్నట్లు నిర్లిప్తంగా వాటివైపు  చూసి ఆమె మళ్ళీ ఇంట్లోకి వచ్చేసింది. సామాన్లన్నీ ప్యాక్ చేసిన

అట్టపెట్టెలతో హాలంతా నిండిపోయి వుంది.  రూములన్నీ కాళీచేయబడి బోసిపోతున్నాయి. “ఇదిగో ఇక్కడే కదూ మొట్టమొదట కలర్_టీవీ తెచ్చి ఫిక్స్ చేసింది,ఇదిగో ఇక్కడే కదూ పెద్దాడు ఇంగ్లీషులో తక్కువ మార్కులు తెచ్చాడని తాను కొట్టింది,ఇదిగో ఈ పూజగదిలోనే కదూతాను భర్తతో కలసి ప్రతి  సంవత్సరము సత్యనారాయణ వ్రతం చేసింది, ఇదిగో ఈ మూలేకదూ_పెద్దాడు స్కూల్ ఫస్ట్ వచ్చాడని నాన్నగారు_మనవడికి వాచ్ తెచ్చిస్తే తనకూ వాచ్ కావాలని చిన్నాడు అలిగికూర్చొని అన్నం  తినకుండా మారాం చేసింది , ఇలా ఆమె ఒక్కో సంఘటనా గుర్తుచేసుకుంటూ ఇంట్లో అక్కడక్కడా

కాసేపు నిలబడిపోయింది . “జీవితంలో రిటైర్మెంటు అన్నది అతి సహజంగా వచ్చే పరిణామం పద్మా.దాన్ని ఆనందంగా ఆహ్వానించాలిగాని ఏదో జీవితం

తలక్రిందులైపోతున్నట్లు తల్లడిల్లిపోకూడదు,సరేనా.”అంటూ ప్రోద్దున తనను_సముదాయించిన భర్త మాటలు

జ్ఞాపకమొచ్చాయి ఆమెకు.

“ నేను మీలా స్థితప్రజ్ఞురాలిని కాదులెండి “ అంది పద్మావతి, జగన్నాధం అన్న మాటలకు బదులుగా . “బలే దానివే పద్మా నువ్వు ! ఉద్యోగరీత్యా ఈ వూరొచ్చాను .ఏదో అన్నీ కలిసి రావడంతో ఉద్యోగంలో ఉన్నత స్థాయికి ఎదగ

గలిగాను. ప్రభుత్వమిచ్చిన ఈ క్వార్ట్రస్ లో జీవించాను, జీపు , జవాన్లు లాంటి కంఫోర్ట్స్ అనుభవించాను , పిల్లల్ని పెంచి పెద్ద

చేసుకున్నాను, ఇప్పుడు మిగిలిన జీవితానికి కావలసిన భత్యాన్నికూడా ప్రభుత్వం దగ్గర వసూలు చేసుకుని సొంతవూరికి

తిరిగి వెళుతున్నాను. నేను చాలా సీదాసాదా మనిషిని  మాత్రమే .నేనెలా స్థితప్రజ్ఞుడిని అవుతాను?”అంటూ నవ్వేశారు

జగన్నాధంగారు .”సరేలెండి , మీరు ఋషితుల్యులు . ఈ ఊరితో, ఈ ఇంటితో ,ఇక్కడ ఉన్నమనుషులతో మనకున్న

అనుబంధం,_ఆత్మీయతలు లాంటివి మీకు చాలా అల్పమైన విషయాలుగా   కనిపిస్తాయి .“అంటూ ఉడుక్కుందిపద్మావతి .

అంతేకాదు జగన్నాధం ఉద్యోగ విరమణ సందర్బంగా ఇంజనీరింగ్ అస్సోసియేషన్ ఏర్పాటు చేసిన విందుకు కూడా తాను రాననినిరాకరించింది ఆమె.  “నువ్వు రాకుంటే ఏం బాగుంటుంది పద్మా , చైర్ పర్సన్స్ , నా సబోర్డినేట్స్ అందరూ వాళ్ల వాళ్ల  భార్యలతోబాటువస్తున్నారు .నువ్వు రాకుంటే వాళ్ళేమైనా అనుకుంటారు” , అన్నారు జగన్నాధం గారు . “గత పదిరోజులుగా ఆ అస్సోసియేషన్ ఈఅస్సోసియేషన్ అంటూ మీ వాళ్ళు  చేసిన సన్మానాలకు , విందులకు మనమిద్దరం  హాజరు అవుతూనే వున్నాం కదండీ , ఈ రోజెందుకోనాకు మనసు చికాగ్గా వుంది , మీరెళ్ళి రండి . నేను ఇంట్లో వుంటాను “అని చెప్పేసింది పద్మావతి.

ఇది ఆమె ఈ ఇంట్లో ఉంటున్న ఆఖరి రోజు . రేపటినుంచి సొంత ఊర్లో సొంత ఇంట్లో కొత్త జీవితం ప్రారంభం .అదైనా ఎన్ని రోజులు గడుస్తుందో తెలియదు . పిల్లలు పిలిస్తే మరో దేశానికో మరో ఖండానికో వెళ్లాల్సి ఉంటుంది . జీవితంలో ఏదీ స్థిరం కాదన్న

జ్ఞానోదయం జీవితచరమదశలో మాత్రమే తెలియరావడం మానవుడు పరిపక్వదశకు చేరుకున్నాడనడానికి నిదర్శనమేమో !

ఇదేమాట ఆమె  ఒకసారి  జగన్నాధంగారితో అన్నప్పుడు పక్కున నవ్వేశారు ఆయన . “పరిపక్వత , చరమదశ అంటూ జీవితానికి ఫులుస్_స్టాప్_పెట్టకు పద్మా, నిజానికి మన జీవితం రేపటినుంచే ప్రారంభం.అంటే  ఏ బాదరబందీ లేకుండా మనకోసం మనం బ్రతికే_కాలమోస్తున్నదన్నమాట ,తెలిసిందా !“అన్నారు ఆయన పద్మావతి చేతిని తన చేతిలోకి తీసుకుంటూ .  అవునవును  , నా కొచ్చే ప్రతిసందేహానికి  ఈయనగారి దగ్గర  జవాబు సిద్ధంగా  ఉంటుంది ?

అనుకుంది  పద్మావతి మనసులో  భర్త అన్న మాటలు గుర్తుకొచ్చి .

 

ఆలోచనలో పడిన ఆమెకు సమయం ఎలా గడచిపోయిందో తెలియలేదు. సరిగ్గా పన్నెండు గంటలకు  ఆఫీసు ఫోను మ్రోగడంతో వెళ్లిరిసీవరు చేతిలోకి తీసుకుంది .

“మేడం ఎందుకిలా చేశారు . విందుకు మీరు రాకపోవడం ఏమిటి .ఇలా మీరు మమ్మల్ని డిసప్పోఇంట్  చేస్తారని మేము అనుకోలేదు మేడం“ గడగడా  మాట్లాడుతున్నది మిసెస్ రాగమాధురి అని గ్రహించడానికి ఎంతోసేపు పట్టలేదు పద్మావతికి .

“అరరే . మిమ్మల్ని డిసప్పోఇంట్ చేయాలన్నది నా ఉద్దేశం కాదు మాధురి . నాకే  కాస్త వొంట్లో నలతగా వుంది . అందుకే రాలేక పోయాను”అంది ఆమె నొచ్చుకుంటూ .

“వొంట్లో నలతగా ఉందా! మరిచెప్పరేం . మేమంతా ఉన్నదెందుకు, వుండండి , పది నిమిషాల్లో మేమక్కడ ఉంటాము . మీకు లంచ్ కూడాప్యాక్ చేసి తెస్తాము . మీరు దేనికి ఇబ్బంది పడకండి “అంది మాధురి కాల్ కట్ చేస్తూ .

పద్మావతికి ఉసూరుమనిపించింది .సాధారణంగా నైతే ఆమెకు ఈ రాబోతున్న మహిళా బృందంతో కాలక్షేపం చేయడం

సంతోషమే , కానీఈ రోజు ఆమె మనస్థితి దీనికి భిన్నంగావుంది . ఏది ఏమైనా వాళ్ళందరూ తన భర్త క్రింద పనిచేసిన ఆఫీసర్స్ భార్యలు . చివరి సారిగా తనకు వీడ్కోలు  ఇవ్వడానికి వస్తున్నారు . కాదనడం ఎంబాగుంటుంది అనుకుంది .

 

అన్నట్లుగానే మరో పావు గంటలో  మరో ముగ్గురు స్నేహితురాండ్లతో కలసి ఇంట్లో  ప్రత్యక్షమైపోయింది మిసెస్  రాగమాధురి .

 

“నమస్తే మేడం , ప్యాకింగ్ పనంతా కంప్లీట్అయినట్లుంది .ఇంకా ఏమైనా పెండింగ్ ఉంటే చెప్పండి , నేను, మావారు వచ్చి హెల్ప్ చేస్తాము” అంది మిసెస్ రాధారాణి హాల్లో పరిచినట్లున్న పాకింగ్స్ ను చూస్తూ .

 

“సామాన్లను ప్యాక్ చేసేపని అంతా అయినట్లే రాధారాణి, అందుకు నేనే మాధురికి థాంక్స్ చెప్పాలి.వాళ్ళాయన నిన్న నలుగురు ఆఫీస్అబ్బాయిలను వెంటపెట్టుకుని వచ్చి రాత్రంతా దగ్గరుండి సామాన్లన్నీ ప్యాక్ చేయించి వెళ్లారు.” అంది పద్మావతి మాధురి వైపు కృతజ్ఞతగాచూస్తూ .

 

“అలాగా మేడం ,  మావారు కూడా రావాలనుకున్నారు . కానీ ఆయనకు నిన్న నైట్ షిఫ్ట్ ఉండడంవళ్ళ రాలేక పోయారు “అంది రాధారాణి కొంచెం బాధగా .

“కానీ మీవారు నిన్న పొద్దున  మావారు వద్దన్నా వినకుండా   ట్రాన్స్ పోర్ట్ ఏజెన్సీ  దగ్గరకు వెళ్లి వెహికల్ బుక్ చేసి అడ్వాన్స్ కూడా యిచ్చివచ్చారంట . మా వారు చెప్పారు .ఇందుకు నేను నీకూ థాంక్స్ చెప్పాలి రాధారాణి “అంది పద్మావతి ఆమె వైపు ఆత్మీయంగా చూస్తూ .

“సరేలెండి మేడం ,ఇలాంటి కబుర్లతో కడుపు నిండదు కానీ  ముందు కాస్తా ఎంగిలి పడండి “అంది నీరజ భోజనం ప్లేట్ ను

పద్మావతి చేతికిఅందిస్తూ .

“థాంక్స్ నీరజా “ అంది పద్మావతి ప్లేటు చేతిలోకి తీసుకుని నవ్వుతూ.

“ఒంట్లో బాగాలేదన్నారు , ఏమైంది మేడం మీకు” అంది మిసెస్ శాంత కుమారి మంచి నీళ్ల గ్లాసును ఆమె పక్కనుంచుతూ .

“ఏం లేదు శాంతా , పది రోజులుగా విందులకు, సన్మానాలకు తిరిగి తిరిగి అలసిపోయాను”.  అంది  పద్మావతి భోజనానికి

ఉపక్రమిస్తూ .

“ఐతే మీ అనారోగ్యానికి మేమే కారణమంటారు” అంది రాధారాణి నవ్వుతూ .

“అవును మరి “ అంది పద్మావతి కూడా నవ్వుతూ. మిగతా నలుగురు ఆమెతో జత కలిపారు .

భోజనం ముగించి చేయి  కడుక్కోవడానికి వాష్ బేసిన్ దగ్గరకు వచ్చిన  పద్మావతి వెనకవచ్చి      నిలబడింది  రాధారాణి .

“మేడం నేను అడిగింది ఏమైంది” అంది మెల్లగా

“మీవారి ప్రమోషన్ విషయమే కదా రాధా , చెప్పాను . ఆయన విన్నారు . కానీ నీకు తెలుసుగా ఆయన ఆఫీస్  విషయాలలో నేను ఎక్కువగా తలదూర్చనని “అంది పద్మావతి .

“మేడం, మావారి అప్రైజల్ లో చైర్మన్ గారు ఎక్సలెంట్ వేస్తే చాలు .  మీరు చెబితే ఆ పని జరుగుతుంది మేడం “ అంది రాధారాణి మరింతగొంతు తక్కువ చేసి .

సరే అన్నట్లు  చూసి పద్మావతి హాల్లోకి వచ్చేసింది .

“మేడం , మీ తోటలో నాకు కావలసిన మొక్కలేమైనా ఉన్నాయా అని చూడాలని వుంది” అంది మాధురి.

“దానికేం భాగ్యం వెళదాం పద “అంది పద్మావతి .

ఇద్దరు తోటలోకి వెళ్లి నిలబడ్డారు .

రెండు మూడు మొక్కలు చేతిలోకి తీసుకుని పద్మావతి దగ్గరకొచ్చి నిలబడింది రాగమాధురి .

“మేడం మా అమ్మాయి ఫోటో మీ అబ్బాయికి చూపెట్టారా , అబ్బాయి ఏమన్నాడు , అమ్మాయి నచ్చిందా”  అంది .

 

“పెండ్లి సంగతి ఎత్తితేనె వాడు కయ్యి మంటున్నాడు  మాధురి , అన్నకు యిప్పుడేకదమ్మా పెళ్లయింది, నేనిప్పుడే చేసుకోను అంటున్నాడు. వాడు రెండు మూడేండ్లు పెండ్లి చేసుకునేటట్లు లేడు  “అంది పద్మావతి .

“పిల్లలు అలాగే చెబుతారు మేడం, మనమే వాళ్లకు నచ్చజెప్పాలి , పిల్లలకు ఒకరికొకరు నచ్చారంటే మేము రెండేండ్లు

ఆగమన్నా ఆగుతాము“అంది రాగమాదురి .

పద్మావతికి ఏం చెప్పాలో తోచలేదు , “కావలసిన మొక్కలు తీసుకున్నావు కదా మాధురి, ఇక లోపలి వెళడాం పద “ అంటూ వెను తిరిగిందిఆమె . అయిష్టంగానే

మాధురి ఆమెను అనుసరించింది . పద్మావతికి మనసు మరింత వికలమైపోయింది . వీళ్ళు తనకోసమొచ్చారా లేక తననుండి ఏదో లబ్ది పొందడానికొచ్చారా అన్న సందేహం ఆమెను కలచివేసింది .

“ఏమిటి మాధురి, మేడం ను ఎండలో తిప్పిస్తున్నావు “అని మాధురితో అని పద్మావతి వైపు చూసి “మీరు రండి మేడం

యిలా కూర్చోండి”_అంది శాంతకుమారి సోఫాలో జరిగి కూర్చుంటూ . ఆమె చేతిలోని వెడ్డింగ్ కార్డు ను చూసి “ఎవరికి శాంతా పెండ్లి” అంది పద్మావతి సోఫాలోకూర్చుంటూ.

“మా అబ్బాయికి మేడం , మీరు_మీ ఊరెళ్లినా ఈ పెండ్లి కోసం మళ్ళీ ఈ ఊరు తప్పక రావాలి” అంది శాంత కుమారి

పత్రిక _తో బాటు గిఫ్ట్ కవర్ నుకూడా ఆమె చేతికిస్తూ .

“ఏమిటి శాంతా ఏముంది ఈ కవర్ లో “అంటూ తెరిచి చూసింది పద్మావతి. అందులో వున్న పట్టు చీరను చూసి “అరే ఇదేమిటి శాంతా ,పత్రిక ఇవ్వు చాలు , మళ్ళీ ఈ పట్టు చీర  ఎందుకు?” అంది ఆమె కవర్ తిరిగియిస్తూ .

“ఉంచండి మేడం , మా అభిమానానికి గుర్తుగా ఉంచుకోండి “అంది శాంతకుమారి .

పద్మావతి అవును కాదన్న లోపే మాధురి ఆ చీరనందుకుని దాని నాణ్యతను పరిశీలించ సాగింది . మిగతా యిద్దరి కండ్లు కూడా  ఆ చీరమీద పడ్డాయి . శాంత కుమారి  తిరిగి ఇలా ప్రారంభించింది . “మీకు ఈ వూర్లో ఒక ప్లాట్ వుంది కదూ మేడం . దాన్ని మీరు అమ్మాలనుకుంటున్నారటగా ,   . దాన్ని మరెవ్వరికోఇవ్వకండి . నాకు , మావారికి ఆ ప్లాట్ కొనుక్కోవాలని వుంది . మీ కిష్టమైతే  మీరు మా అబ్బాయి పెళ్లి  కొచ్చినప్పుడు రీజిస్ట్రేషన్ పనులు కూడా కానిచ్చేయొచ్చు “ అంటూ పద్మావతి బదులు కోసం ఆగింది ఆమె .

“అసలు మేము ఆ ప్లాట్ ను ఇప్పుడు అమ్మాలనుకోవడం లేదే “అంటూ ఏదో చెప్పబోయింది పద్మావతి .

“ఏమిటి మేడం కొన్ని సామాన్లు ఆ మూల సపరేట్ గా ఉంచారు ,వాటిని ప్యాక్ చెయ్యలేదా”అంది నీరజ చీరను పక్కన పెట్టి   హాల్ కార్నర్  లోవున్న కొన్ని థింగ్స్ ను చూపెడుతూ .

పద్మావతి వాటిని చూసింది .”ఇక్కడ మనం వాడని కొన్ని సామాన్లను వుంచాను పద్మా , తోటమాలి చెంచులయ్యను  గాని ,

పనిమనిషి రాములమ్మను గాని పిలిచి_వాటిని_తీసుకెళ్ళమని చెప్పు“అని జగన్నాధం గారు  అనడం గుర్తొచ్చి “ అవా, వాటిని తోటమాలికి  గాని పనిమనిషికి  గాని ఇవ్వాలని సపరేట్ గా ఉంచాము “అంది .

“మై గాడ్  , మీరింత అమాయకులైతే ఎలా మేడం . లాప్ టాప్ , రేడియో ,టేబుల్ ఫాన్స్ , కుర్జీలు లాంటి విలువైన వస్తువులను ఆ లో క్లాసు_మనుషులకు ఇస్తారా ! ఇలాంటి వస్తువులు వాడడం అలాంటి మురికి మనుషులకు ఏం తెలుస్తుంది మేడం “

అంది నీరజ .

“అవును మేడం , అలాంటి లోక్లాస్ వాళ్ళను మీరు నమ్మకండి . పేదరికాన్ని అడ్డుపెట్టుకుని మనదగ్గర విలువైన వస్తువులు కాజేయాలని  చూస్తారు వాళ్ళు” అంటూ మిగతా ముగ్గురు నీరజాతో జతకలిపారు .

పద్మావతి పరిస్థితి ముళ్ళమీద కూర్చున్నట్లుగా అయింది .ఆమె మనస్థితితో తమకేమీ సంబంధం లేనట్లు, తక్కువ జాతివాళ్ళ ఆశపోతుతనాన్ని గురించి తీవ్రంగా చర్చించుకో  సాగారు నలుగురు స్నేహితురాళ్ళు . ఆ తరువాత గంట సేపు వాళ్ళక్కడున్నా వాళ్ళ మాటలలో ఎక్కువగా_పాలుపంచుకోలేక పోయింది పద్మావతి . వెళ్ళేటప్పుడు  “ఫ్రిజ్ , టి వి లాంటి వస్తువు  లేమైనా  అమ్మేయాలను కుంటే నాకు చెప్పండి మేడం_నేను వాటిని ఆఫ్ రేటుకు కొనుక్కుంటాను,మా అమ్మాయి కొత్త కాపురానికి అవి పనికొస్తాయి “అంటూ తాను కూడా హై క్లాస్ వ్యక్తి నే అని నిరూపించుకుంది  నీరజ .

***

సాయింత్రం ఆరు గంటలు.   సామాన్ల నెక్కించిన లారీతో బాటు వెనక కారులో ఊరికి బయలుదేరారు జగన్నాధం దంపతులు . ఆఫీసు_బలగమంతా వచ్చి వీడ్కోలు ఇవ్వగా అందరిదగ్గరా సెలవు తీసుకుని ముందుగా కారులో ఎక్కి కూర్చున్నారు

జగన్నాధం గారు . పద్మావతిమాత్రం తటపటాయిస్తూ నిలబడి పోయింది .

“ఏమిటి పద్మా , ఏమాలోచిస్తున్నావ్, కారెక్కు” అన్నారు జగన్నాధం గారు .

“ఈ చెంచులయ్య ఎక్కడికి వెళ్ళాడండి , మధ్యాహ్నం నుంచి చూస్తున్నాను అతని కోసం . మనం  ఊరెల్లుతున్నామని  తెలిసి కూడా అతడు_ఎక్కడికి వెళ్లినట్లు . చూసి చూసి చివరకు మీరివ్వమన్న వస్తువులను పనిమనిషి రాములమ్మకే ఇచ్చేశాను” అంది పద్మావతి అన్యమస్కరంగా కారులో ఎక్కి కూర్చుంటూ .

“సరేలే పద్మా, అతనికేదో ముఖ్యమైన పనే పడుంటుంది. లేకుంటే ఎందుకు రాడు” అన్నారు  జగన్నాధం గారు.దంపతులిద్దరూ కారులోకూర్చోవడంతో   కార్ స్టార్ట్ చేసాడు డ్రైవర్ . కారు  రెండు ఫర్లాంగులు ముందుకెళ్ళగానే రోడ్డు పక్కన చేతులాడిస్తూ నిలబడివున్న వ్యక్తిని చూసి  “డ్రైవర్ , ఒక్కనిమిషం కారాపు “అని , “పద్మా , అదిగో చెంచులయ్య!” అన్నారు జగన్నాధంగారు .

“ఏమైపోయావు చెంచులయ్య , ఎక్కడికి వెళ్ళావు “అంది పద్మావతి కారు దిగి .

గబగబా నడచి రావడం వళ్ళ  చెంచులయ్య వొళ్ళంతా చెమటలు కారుతున్నాయి . అతని చేతిలో వున్న పెద్ద సూటుకేసును చూసి “ఎక్కడికివెళ్లి వస్తున్నావు  చెంచులయ్యా” అని జగన్నాధం గారు కూడా కారు  దిగారు.

“క్షమించండయ్యగారు ,మీరు ఈ ఊరు వదలి వెళుతున్నారు కదా ,అందుకే మీ కోసం ఏమైనా తీసుకు రావాలని బజారుకు

వెళ్లాను . ఇదిగోఈ సూటుకేసు బేరమాడి తీసుకురావడానికి యింతసేపైంది . మీరెళ్ళి పోయారో ఏమోనని బయపడిపోయాను . ఇదిగో యిది తీసుకోండి . నాగుర్తుగా మీ దగ్గరుంచండి “అన్నాడు చెంచులయ్య గసపోసుకుంటూ .

“ఏమిటి నీ పిచ్చి చెంచులయ్యా , ఇంత పెద్ద సూటుకేసు  ఎందుకు కొన్నావు . ఇంత విలువైన వస్తువు గిఫ్ట్ గా ఇవ్వమని ఎవరు చెప్పారు నీకు“అన్నారు జగన్నాధం గారు కాస్త కోపంగా . “నీకు మేమేం చేశామని మాకింత ఖరీదైన కానుకను  ఇస్తున్నావు చెంచులయ్యా” అంది  పద్మావతికూడా బాధగా .

“తీసుకోండమ్మా , మీరు మాకిచ్చిన అభిమానం తో పోలిస్తే యిది ఏపాటిది” అన్నాడు చెంచులయ్య సూటుకేసును ఆమె చేతికిస్తూ .

జగన్నాధం గారు ఒక్క నిమిషం చెంచులయ్య వైపు తేరిపారా చూసి మనసులో ఏమనుకున్నారో ఏమో “తీసుకో పద్మా ప్రేమతో ఇస్తున్న దేనినీ_వద్దనకూడదు”. అన్నారు.పద్మావతి సూటుకేసు తీసుకుని డ్రైవర్ చేతికిచ్చి డిక్కీలో ఉంచమంది .                  జగన్నాధం గారు జోబీ లో చేయి వేసి చేతికొచ్చిన డబ్బు తీసి చెంచులయ్య చేతిలో ఉంచుతూ “ఇది వుంచు చెంచులయ్యా

నీ మనవరాలిపెండ్లికి పనికొస్తుంది” అన్నారు . చెంచులయ్య నోరు తెరిచి ఏదో చెప్పబోయి  గొంతు గద్గదమవడంతో ఆగిపోయాడు . మరో రెండు నిముషాల్లోకారు నెమ్మదిగా  కదిలింది .

*****.              ******

మరుసటి నెల జగన్నాధం దంపతులు మళ్ళీ ఆవూరొచ్చారు . అయితే వారొచ్చింది  స్టార్ హోటల్  లో అత్యంత ఆడంబరంగా జరిగిన శాంతకుమారి కొడుకు పెండ్లికి కాదు .అదే ముహుర్థానికి  రాములవారి  గుడి లో , పున్నమి చంద్రుని నీడలో అతి  సామాన్యంగా జరిగిన చులయ్య మనవరాలి పెండ్లికి ! చెంచులయ్య  ఆనందానికి అవధుల్లేవు . ఆశించని ప్రతిఫలమేదో అతనికి దొరికినట్లయింది !

*

మధురాంతకం మంజుల

మధురాంతకం మంజుల వృత్తిరీత్యా ఉపాధ్యాయిని. ప్రసిద్ధ రచయిత మధురాంతకం రాజారం గారి కుమార్తె. స్వతహాగా సాహిత్యం పట్ల ఆసక్తి, అభిలాష ...రచనల దిశగా అడుగులు వేయించాయి.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు