పద్మావతి గారు చక్కటి కవిత్వమే కాదు, కథలు కూడా రాస్తారు. అవును రాస్తారు. పైగా ఈ రెండు చందమామలు (2025) రెండవ సంపుటి. కొత్త వేకువ (2020), మెతుకు వెలుగులు (2023) కవితా సంపుటులు ప్రచురించిన మధ్య కాలంలో 2021 లో కురిసి అలసిన ఆకాశం పేరిట మొదటి కథల సంపుటి వచ్చింది. పద్మావతి ఏ పుస్తకానికీ ఆవిష్కరణ సభ కూడా పెట్టినట్టు మనకి గుర్తుకురాదు. ఆర్భాటము కన్నా నమ్ముకున్న కృషి చేసుకుంటూ వెళ్ళడమే పద్మావతి పద్దతిగా (style) ఆమె పేరు పొందారు. ఆమె కవిత్వం అందరికీ తెలుసు. మరి ఆమె కథలో ? అవీ పరిచయమే. కానీ ఎవరివైనా కథలకి కవితలకి ఒకే ప్రమాణాలు నిర్వచించుకోవడం సరి కాదు గనుక ఆమె కథలు కవితలతో ఎక్కడ వేరు పడతాయి అని ఆలోచించవలసి ఉంటుంది. ఈ కథలు సవివరంగా ఒక కొత్త జీవిత చిత్రణ చేస్తాయి. పాత్రోచిత సంభాషణలుంటాయి. దృక్పధ ప్రమేయం ఉంటుంది. అయితే కవిత్వంతో పోలిస్తే కథల విస్తృతి పెద్దది. పద్మావతి కథా రచయిత్రిగా తన సృజన విస్తృతిని ఎంత విశాలం చేసుకున్నారో ఈ కథలు చెబుతాయి.
పెద్దింటి గృహప్రవేశాల్లోనో పెళ్ళిళ్ళప్పుడో అక్కడ పనుల్లో సహాయం చేసినవారిని కడుపునిండా భోజనం చేయకుండా అవమానపరిచే వాళ్ళ గురించి ‘ఆత్మాభిమానం’ అన్న కథ ఉంటుంది. చదువుకునేప్పుడు దేశభక్తి నూరి పోసిన మేష్టారు స్వదేశం వీడి విదేశాలకు రావడానికిగల కారణాలు చెప్పిన కథ విలయం. ఈ కథలో ఒక గుంతలు పడ్డ రోడ్డు వల్ల తన పెద్ద కొడుకుని కోల్పోయిన తండ్రి పాత్ర మన దేశంలో వేళ్ళూనికుని ఉన్న పౌర నిర్లక్ష్యం, అవినీతి గురించి మాట్లాడుతుంది. బోధించిన ఆదర్శాలు ఆచరించలేని అశక్తతకు ఏవి కారణాలవుతున్నాయో ఈ కథ చాలా సున్నితంగా చర్చిస్తుంది.
భార్యా భర్తల మధ్య బంధం ఒక తొలగించిన అవయవంతో ముడిపడి ఉంటుందా ? బ్రెస్ట్ కాన్సర్ సోకిన స్త్రీ అంతరంగాన్ని ‘రెండు చందమామలు’ చాలా ఉదాత్తంగా ఆవిష్కరిస్తుంది. తన పిల్లలకి పాలు పట్టే అనుభూతికి దూరమయ్యాననే దిగులు ఒక పక్కైతే, భార్యని ఒక భోగ వస్తువుగా, తనని కేవలం సంతోషపెట్టేందుకేనని భావించే భర్త మరొక పక్క. భర్తకి ఆమె తన పక్కన కేవలం సెక్సీ వ్యక్తి మాత్రమే. ఆమె చర్మం రంగు, ముఖ కవళికలూ అతనికి గర్వకారణాలు. ఈ కథ స్వయంసిద్ద అన్న కథా సంకలనంలో చోటు సంపాదించుకున్న కథ. కాన్సర్ బారిన పడి మానసికంగా కృంగిపోతున్న మహిళల పట్ల స్వార్థపు మగవారి ఆలోచనా సరళిని ఈ కథ ప్రతిబింబిస్తుంది. శాంతి అనే పాత్ర వైద్యపరంగా తనకొచ్చిన కష్ట కాలంలో ఎంత ధైర్యంగా నిలబడిందీ, తనలాంటి ఆడవారినెలా ఆదుకునేట్టు మారిందీ ఈ కథాంశం. భర్త డబ్బు ఇస్తాడు కానీ, సహచరుడవ్వలేకపోతాడు. ఈ సున్నితమైన విషయాన్ని పద్మావతి చాలా చాకచక్యంగా నిర్వహిస్తారు. ఎంతో గొప్ప కథ. ‘స్త్రీలు భూదేవతలు. సూర్య చంద్రులు రెండు స్థనాలైనవాళ్ళు’ అంటాడొక చోట ప్రముఖ కవి పాపినేని శివశంకర్. ఏమిటీ వాక్యానికి అర్థం అని నన్ను ఆలోచనలో పడవేసింది గానీ పద్మావతి కథ నిమ్మళపరిచింది. కథకీ కవితకీ ఒక సామంజసమైన అర్థాన్ని వెతుక్కోవడంలో ఉండే ప్రయాస ఇలాంటప్పుడు తెలిసి వస్తుంది. అదొక ప్రయాణం. అంతే.
ఇలా ఒకట్రెండు కథలు చూశాక మనకి ఒకటి అర్థమవుతుంది. పద్మావతి తన కథలకు ముఖ్యమైన ఆవరణాన్ని మధ్యతరగతి జీవితాల్లోంచి ఏర్పాటు చేసుకుంటారు. ఇవి అట్టడుగు వర్గాలకన్నా కాస్త పైస్థాయి లో బ్రతికే మనుషుల కథలు. తండ్రీ కొడుకుల మధ్య గల అనుబంధాన్ని చిత్రించిన కథ తరం తరం నిరంతరం. ‘నాన్నలందరూ ఇలాగే ఉంటారు’ అనే తాత మాటలు ఒక మనవడిలో తెచ్చిన మార్పు ఈ కథాంశం. ఎలా ఉంటారో ఈ కథ చదివి తీరాలి. మనుషుల మధ్య ఉండే సంబంధాల గురించి పద్మావతిగారికి అవగాహన ఉంది. ఆమె చూపు ఎలా ఉందీ అన్నది ఆలోచిస్తే అందులోంచి ఒక బెత్తం పట్టుకున్న హెడ్మాష్టరు కనిపిస్తాడు. కథలకు ఒక నిర్దిష్టమైన ప్రారంభాలు లేకపోయినా, తప్పనిసరిగా నిర్ణయాత్మక ముగింపును కలిగి ఉండటం అందుకు ఒక కారణం. అంటే ప్రతి కథలోనూ రచయిత్రి తన దగ్గర ఒక పరిష్కారం చూపెడతారు. రహస్యం లేదు. గుప్పిట విడిపోతుంది. అదేదో మంచి వైపు నడిపించడమే ఉద్దేశ్యంగా రచయిత్రి రాస్తున్నట్టు మనకి తెలిసిపోతుంటుంది. దాన్ని అవలక్షణంగా చెప్పడం లేదు నేను. ఈ తెలిసిపోవడం కథాశిల్పాన్ని నిర్ణయాత్మకం చేయడం ఇక్కడ ఆలోచించవలసిన విషయం. పాత్రలు వాస్తవిక స్వభావం కలిగి ఉండి కథనంలో జీవం ఉన్నప్పుడు కృతకతకు ఆస్కారం లేదు. పద్మావతి అందుకు చేసిన కష్టం ఈ కథల్లో మనకు కనిపిస్తుంది. సంఘటనల సమాహారం కాకుండా కథలో ఒక వాతావరణం సృజించబడటం మంచి విషయం. అది లేకపోతే పాఠకుడు మమేకం కాలేడు. పద్మావతి చదివే వాళ్ళని తనతో నడిపించగలుగుతారు. కానీ కథనంలో మరికొంత ఆసక్తికర శైలి కావల్సిఉంది.
టైటిల్ కథ వంటిదే, తరతరాల చరిత్రలో కథ. వంటిదే అంటే అలాంటి ఆలోచనల చుట్టూ తిప్పే కథన్నమాట. ఆ కథలోలాగా కాకుండా ఈ కథలో భర్త భార్య రోజువారీ పనుల్లో చాలా సహాయం చేస్తాడు. అందుకు అతని నిరుద్యోగికత కారణమయినా ఆ న్యూనత కన్నా ఆమె పని పంచుకోవడమే ప్రధానంగా ఉంటుంది. అందుకు అతని తల్లి కూడా సమర్థిస్తుంది. చాలా చిత్రమైన కథ. అసంభవం కాదు కానీ పద్మావతి మనల్ని ఒప్పించడంలో పాటించిన నేర్పు చెప్పుకోదగ్గది. ఒక కథలో స్త్రీకి విలువనివ్వని మగవాడు, మరొక కథలో అందుకు భిన్నమైన వ్యక్తి. ఈ వ్యత్యాసాన్ని రచయిత్రి తన దృక్పధ స్పష్టతలోంచి చెప్పడం మనం గమనించాలి. ఇవి వ్యక్తిగత కోణాల్లోంచి మొదలై ఒక విశేష విశాల విషయంలోకి నెట్టి వేస్తాయి. ఔరా అనిపిస్తుంది.
ఫెమిస్టులనదగ్గవారి రచనల్లో పురుషాధిక్య స్వభావచిత్రణతో బాటు వాటికి విరుగుడును చెప్పడం ఉంటుంది. అది విషయ స్పష్టతకు గుర్తు. పి సరళాదేవి మొదలు వోల్గా, కుప్పిలి పద్మ, సత్యవతి వంటివారి దాకా స్త్రీల అణచివేత, బాధ, నిర్బంధం, హింస వంటి విషయాలు చర్చకు పెట్టాయి. కథ చెప్పే ధోరణిలో వ్యంగ్యమూ, సునిశిత హాస్యమూ ఎంత సహాయకారులో ఈ కథలూ తెలియజెప్పాయి. పద్మావతికి హాస్యచతురత కలసివచ్చిన లక్షణం. పాత్రల స్వగతంలో ఈ స్వభావ నిరూపణ చాలా చోట్ల ఉంటుంది. సుహాసిని నవ్వు, నీటి బరువు, ఆకాశమంత వంటి కథల్లో ఇది కొంత గమనించవచ్చు. దృక్పధ మూలానికి అవరోధం రాకుండా ‘నలుపు తెలుపు’ ‘ఆకాశానికో నక్షత్రం’ వంటి కథలు నడిపిన తీరు బాగుంటుంది. స్త్రీలలో ఉండే సహాయపడే గుణం ఎలా అభాసుపాలైందో లలిత పాత్ర చెబితే, అత్తగారిపట్ల ఉండాల్సిన సహనశీలత గురించి ఆకాశానికో నక్షత్రంలో వసుధ పాత్ర తెలియచెబుతుంది.
ఈ కథలు వర్తమాన స్త్రీ జీవిత పార్శ్వాలను అర్థం చేసుకోవడానికి ఉపకరిస్తాయి. వేగవంతమైపోయిన ఆధునిక సామాజిక వ్యవస్థతో ఒక కుటుంబానికి ఉండవలసిన సామరస్యాన్ని సూచిస్తాయి. ఆలోచింపజేస్తాయి. బాహ్యరూపం కన్నా స్త్రీపై అంతర్గత దాడిని చాలా గొప్పగా చిత్రిస్తాయి. ఇది రచయిత్రి మానసిక పరిణితికి చిహ్నంగానే భావించాలి. కానీ ఈ ధోరణి ఫెమినిస్టు కథలు సామాజికంగా స్త్రీ పై వస్తున్న అనేక ఒత్తిళ్ళను తనదైన మార్గంలో చిత్రీకరించే సాహసం చేస్తాయి. నవీన ప్రభావాలను చర్చకు పెట్టడంలో సూత్రప్రాయ ప్రయత్నం ఉంది. మరింత లోతులకు వెళ్ళవలసిన అవసరం ఉంది. స్వానుభవ పరిధిలోంచి ఈ కథలు ఎక్కువగా నిర్మితమవుతాయి. కనుక పద్మావతి కవితలు చదివిన వారికి చాలా చోట్ల ఈ కథల్లో ఆమె ఏం చెప్పదలుచుకుందీ ముందే తెలిసిపోతుంది. ఆ నష్టాన్ని (?) నివారించుకోవడానికే కథా శిల్పాన్ని మరింత పదును పెట్టవచ్చుననిపించింది. సన్నివేశాన్ని బట్టి సంభాషణలు మరింత సహజంగా, భాషాపరంగా (ఇంగ్లీషు కలవకుండా) మరింత నవ్యంగా చూసుకోవచ్చును. కవిత్వ భాషకీ కథా భాషకీ కూడా తేడా ఉంటుంది. అది గ్రహించడం అసాధ్యం కాదు. ఆ శైలీ భేదానికి కాలం కూడా కారణమవుతుంది. ఒకే కాలంలో అన్ని ప్రక్రియలపై శైలి పరమైన ఒకే ప్రభావం ఉండకపోవచ్చు.
పద్మావతి సాహిత్య వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవడంలో ఈ కథలెంతగానో ఉపయోగపడతాయి. ఆమెలో ఉన్న ధీర గుణానికి ఈ కథలు సాక్ష్యాలు. నిక్కచ్చితనానికి నిదర్శనాలు. ఈ కథల్లో సారవంతమైన పచ్చదనం ఉంది. ఆ ఆశపై ప్రసరించిన దేదీప్యమానమైన వెలుగులున్నాయి.
రెండు చందమామలు (కథలు) : పద్మావతి రాంభక్త పేజీలు: 128, ప్రతులకు: 9966307777, ధర:150/-
Add comment