ఆలోచన – మనకి మిత్రువా, శత్రువా?

దైనా వింటున్నా, చూస్తున్నా, చదువుతున్నా, ఏదో ఒక విషయం, స్పార్క్ కలిగిస్తుంది. తట్టిలేపుతుంది, లేదా చెంప మీద కొట్టినట్లు చేస్తుంది. అలాగే ఈ మధ్య ‘నరుడి బ్రతుకు నటన ‘ అనే చిత్రం చూస్తున్నప్పుడు, అందులో డి. సల్మాన్ అనే పాత్ర హీరో తో చెప్తాడు.

‘ఆలోచిస్తే బ్రతకలేం ‘ అని. అది నిజమే కదా కారు నడుపుతూ వెళ్తే ఎవరైనా వచ్చి గుద్దేస్తారేమో అనే ఆలోచన వచ్చింది అంటే అసలు కారు నడపలేము.  ఆలోచన మనిషిని నడిపించే ఒక శక్తి. అది ముందుకు తీసుకెళ్లగలదు, అలాగే వెనక్కి లాగగలదు.

“ఆలోచిస్తే బ్రతకలేం” అనే మాట లోతుగా అర్థం చేసుకుంటే, కొన్ని ఆలోచనల వల్ల మనిషి నిజంగానే బ్రతకలేని పరిస్థితికి చేరుతాడు. అవి అతన్ని చుట్టుముట్టి, మనోధైర్యాన్ని దెబ్బతీసి, ముందుకు వెళ్లే మార్గాన్ని మూసేస్తాయి. మనసులో ఊహించుకునే అనేక అడ్డంకులు, భయాలు, అపార్థాలు – ఇవన్నీ కలసి మనిషిని నిస్సహాయుణ్ని చేస్తాయి.

అది అలా ఉంచితే, ఏదైనా ఆలోచించి చెయాలని చెప్తారు. మరి దీనికి సమ తూకం ఎక్కడ? మనిషి ఆలోచనల ఆది అంతం ఎక్కడ? మరి అది ఒక్కటే ఇప్పటి కృత్రిమ టెక్నాలజీకి, మనిషికి తేడాని నిలబెడుతున్నది. కానీ ఇదే ఆలోచన సరైన దిశగా వెళ్లినప్పుడు, అది మన జీవితాన్ని వెలుగులు నింపగలదు. మనం మనలోపల ఏమి ఆలోచిస్తున్నామో, దానిపైనే మన భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది. ఒకే సమస్యను రెండు రకాలుగా చూడచ్చు. ఒకరు దాన్ని తన ఎదుగుదలకు అడ్డంకిగా భావిస్తే, మరొకరు అదే సమస్యను కొత్త అవకాశంగా చూస్తారు. అందుకే, ఆలోచనలను నియంత్రించడం ఎంతో అవసరం.

మనలో చాలామంది గతాన్ని గుర్తుచేసుకుంటూ,  “అప్పుడలా జరిగి ఉండకూడదు,” లేదా “ఆ మాట చెప్పి ఉండకూడదు,” అనుకుంటూ బాధపడుతూ ఉంటారు. మరికొందరు భవిష్యత్తుపై ఆందోళన చెందుతూ, “రేపు ఏమవుతుందో?” అని తలమునకలవుతారు. కానీ ప్రస్తుత క్షణాన్ని ఆస్వాదించకుండా, తగిన నిర్ణయాలను తీసుకోకుండా, బ్రతకడం కూడా ఓ విధంగా బ్రతకకపోవడమే అవుతుంది.

అయితే, ఏ ఆలోచనలు మనకు మేలు చేస్తాయి? ఏవి మనని ముందుకు నడిపిస్తాయి? స్వీయవిశ్వాసాన్ని పెంచే, ఆశాజనకమైన ఆలోచనలు ఎప్పుడూ మనల్ని విజయానికి చేరుస్తాయి.

“నేను ఇది సాధించగలను” అనే ధైర్యం, “నా ప్రయత్నం వృధా కాదు” అనే నమ్మకం, “ఏ తప్పు జరిగినా, నేర్చుకోవడానికి అవకాసమివ్వాలి” అనే దృక్పథం –

ఇవన్నీ మన ఆలోచనలను సమర్థంగా మలచగలవు. దీన్ని టాక్ పాసిటివ్ టు యువర్‌సెల్ఫ్ అంటే మన గురించి మనం మనతో ఆశాజనకంగా మాట్లాడుకోవటం. ఎవరో చెప్తే మనకి కలిగే సంకల్పం కొంచెం మాత్రమే. 1930ల కాలంలో, రష్యన్ మనస్తత్వవేత్త లెవ్ వైగోట్స్కీ పిల్లలు బొమ్మలతో మాట్లాడే సంభాషణలు వారి అభివృద్దికి పనిచేస్తుందని గమనించారు. అలాగే మనతో మనం మాట్లాడుకునే సమయంలో కూడా అచ్చంగా బయటకి మాట్లాడినపుడు కంఠనాళంలో చిన్న కండరాల కదలినట్లుగానే జరుగుతుందని గమనించాడు.  “వైగోట్స్కీ సోషల్ కల్చరల్ తియరీ ” ప్రకారం ఇలా అంతర్గత సంభాషణ అనేది ఒక ఆరోగ్యకరమైన విధానంగా చెప్పబడుతుంది.  1990లలో, న్యూరోసైంటిస్టులు అతని అభిప్రాయాన్ని ధృవీకరించారు; మనం బిగ్గరగా మాట్లాడేటప్పుడు సక్రియంగా ఉండే మెదడు ప్రాంతాలు, అంతర్గత భాషణ సమయంలో కూడా సక్రియంగా ఉంటాయని చూపించడానికి వారు న్యూరోఇమేజింగ్‌ను ఉపయోగించారు.

ప్రతి రోజు మనం ఏమి ఆలోచిస్తున్నామో గమనించాలి. ఆ ఆలోచనలు మాకు మేలు చేసేవేనా, లేక మనల్ని నీరసంగా, నిస్సహాయంగా మార్చేవేనా? మనం చెడు ఆలోచనలకు బందీలం కాకూడదు. అవసరంలేని భయాలు, అనవసరమైన ఆందోళనలు మనలో రాకుండా చూసుకోవాలి. ఒకవేళ వచ్చినా, అవి మనపై ప్రభావం చూపనివ్వకూడదు. ఆలోచనల్ని నియంత్రించడం నేర్చుకోవాలి.

ఆలోచన మనిషికి గొప్ప ఆయుధం. దాన్ని ఏ విధంగా ఉపయోగించాలో తెలిస్తే, అది మన విజయానికి మార్గదర్శిగా మారుతుంది. కాని దాన్ని అదుపులో పెట్టుకోలేకపోతే, అదే మన మనోధైర్యాన్ని తక్కువ చేసి, ముందుకు సాగే దారిని మూసేస్తుంది. అందుకే, మనం ఎప్పుడూ మెలుకువగా ఉండాలి. మన ఆలోచనలే మన భవిష్యత్తుని తీర్చిదిద్దుతాయి!

*

విజయ నాదెళ్ళ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు