‘అక్కలకెన్నో కష్టాలున్నయని గుర్తొచ్చినప్పుడు నేను దళంల భర్తి గావాలెననుకున్న. అన్నలు సదువు కున్నోళ్లు గదా, నేను దళంల వోతె నాక్కుడ నేర్పుతరేమో అని ఆలోశించిన. దళంల వోతె రాజకీయం నేర్చుకోవచ్చుగదా అనుకునేదాన్ని. నేర్చుకొని జనాల్ను ఒందికట్టు జేసి శత్రువులను ఓడిరచి మా గరీబోళ్ల రాజ్యం గెలవాలె…. ఎన్ని తిప్పలొచ్చినా లడాయి యిడ్సివెట్టొద్దని గట్టిగ అనుకున్న. లడాయిలనే పానమిస్తనని ‘కిరియ’ జేసిన….
మొబైల్ అకడమిక్ స్కూల్‌లో అప్పుడప్పుడే చదువు నేర్చుకుంటున్న రజితను ఏదైనా రాయమని అడిగితే రాసిన కథనం ఇది.. దండకారణ్యం నుండి వెలువడే ఝంకార్ పత్రికలో వచ్చిన కథ ఇది. ‘వియ్యుక్క’లో ఇది ఒక కథ ` మహిళలకు సమస్యలున్నయ్, సమస్యలు పోవాలంటే సంఘంలో చేరాలె, చదువుకోవాలె, రాజకీయాలు నేర్చుకోవాలె, నేర్చుకొని పీడితప్రజలను ఏకం చెయ్యాలె. ప్రజాశత్రువును ఓడించాలె… ఓడిస్తే పేదోళ్ల రాజ్యం వస్తది. పేదోళ్ల రాజ్యం కోసం చేసే పోరాటంలో ప్రాణాలైనా ఇస్తానని ప్రతిజ్ఞ చేస్తున్న….. పోరాటక్రమాన్నంతా మూడుముక్కల్లో చెప్పింది. మొత్తం కథ ఇంతే. ఇది ఒక వియ్యుక్క కథ. ‘వియ్యుక్క’ అంటే గోండిభాషలో వేగుచుక్క అని అర్థం. ‘వియ్యుక్క’ పేరుతో ‘విరసం’ ప్రచురిస్తున్న ‘అజ్ఞాత రచయిత్రుల కథాసమయం’ అనే కథల సంపుటంలో ఇటువంటి కథలు ఎన్నో. సమసమాజ స్థాపన కోసం జరిగే పోరాటంలో వేగుచుక్కలై దారి చూపుతున్న సాయుధ మహిళలు తమ అనుభవాలను, పోరాటాలను చరిత్రలో రికార్డు చేయడం కోసం చేసిన ప్రయత్నాలను, సాహిత్య కృషిని ఒక్కచోటకు చేర్చి సంకలనంగా కూర్చి ఆరు సంపుటాలుగా వెలువరిస్తున్నది విరసం.
గత నాలుగు దశాబ్దాల (1980`2023) విప్లవోద్యమంలో అంటే సిపిఐ ఎంఎల్ పీపుల్స్‌వార్ పార్టీ ఏర్పడిన 1980 నుండి అది 2004 రెండుపార్టీల విలీనంతో మావోయిస్టుపార్టీగా కొనసాగుతున్న నేటి వరకు 52 మంది అజ్ఞాత మహిళలు రాసిన 282 కథలను సేకరించిన కృషి సంపాదకురాలు బి.అనూరాధది. అరుణతార, మహిళామార్గం, మాతృక వంటి ప్రముఖ పత్రికలే కాకుండా దండకారణ్యంలో, ఈస్ట్ డివిజన్‌లో వెలువడిన తూర్పుకనుమ, పోరుమహిళ, విప్లవి, ఝంకార్ , విప్లవ మహిళ వంటి పత్రికలను, విడి విడిగా వెలువడిన కథాసంకలనాలను ఎన్నింటినో తూర్పారబట్టి కుప్పజేసిన ఈ కథలపంట తెలుగు సాహిత్య చరిత్రకే ప్రమాణంగా నిలుస్తుందని ఈ కథలు చదివినవారికెవరికైనా అర్థమవుతుంది. మహిళలు రాసినవి కనుక మహిళా కోణమే ఎక్కువగా కనిపించినా వీటిలో ఈ రచయిత్రులు తడిమిన విషయాలు చాల విస్తారమైనవి. ఆదివాసీ మహిళ ఆచార కట్టుబాట్ల నుంచి మొదలుపెట్టి దళజీవితం, దళాల్లో చదువు, సహచర్యం, పిల్లల సమస్య, పితృస్వామ్యం, కులవివక్ష, అత్యాచారాలు, నిర్బంధం, ధిక్కారం, జైలుజీవితం, సామాన్యప్రజల సాహసాలు, మిలిటరీ చర్యలు, ఎన్‌కౌంటర్ సంఘటనలు, అమరత్వం… వరకు వస్తువు పరంగా అధ్యాయాలుగా విభజించారు.
బుజ్జి పసికందుగున్నప్పుడే తండ్రి చనిపోయిండు. ఆదివాసీ జీవితంలోని కష్టాల కడగండ్ల మధ్యనే పెంచిన తల్లి ఆదివాసీ ఆచారాల ప్రకారం ఆరేండ్ల బిడ్డను నానమ్మ దగ్గర వదిలేసి పుట్టింటికి పోయింది. చిన్నాన్న చిన్నమ్మలతో వ్యవసాయపనుల్లో చేరింది బుజ్జి. పదేండ్ల వయసుకే నాటువేయడం, నాగలి దున్నడం నేర్చుకుంది. లేతచేతులు కాయలుగాస్తే కష్టాన్ని ఓర్చుకోడానికి పాటను తోడుగా తెచ్చుకున్నది. అమ్మ ప్రేమకు దూరమై, ప్రేమలేని జీవితం ఎవరికోసం అనుకుంటున్న బుజ్జికి దళంలో అన్నయ్యల అక్కయ్యల ప్రేమ పరిష్కారంగా కనపడింది. షావుకార్ల దోపిడి నుంచి… సామ్రాజ్యవాద దోపిడి వరకు అర్థం చేసుకున్నది. దేవుడిపాటలు పాడే గొంతు జనం గుండెలచప్పుడును వినిపించింది ` సాయుధ జననాట్యమండలి కమాండర్‌గా అమరురాలైన ఆదివాసీ జర్తావెంకటలక్ష్మి కథ ఇది. వెంకటలక్ష్మి సర్వనామం. రజిత, వెంకటలక్ష్మిల జీవితాలను ప్రపంచానికి తెలపడమే అయితే అది విప్లవోద్యమ చరిత్ర మాత్రమే అవుతుంది. ఆ జీవితాల నుండి, అట్టడుగు ఆదివాసీ ప్రజల, మహిళల ఆలోచనా స్థాయి, మేధస్సు పరిణతి చెందిన క్రమం రచనల్లో ప్రతిఫలించడం వల్ల ఇది గొప్ప కల్పనాసాహిత్యంగా మన ముందుకు వస్తున్నది.
1970ల చివరలో, 80లలో ఎక్కువగా అనువాద సాహిత్యం.. ముఖ్యంగా చైనా సాహిత్యం విప్లవాభిమానులకు ప్రేరణనిచ్చేదిగా ఉండేది. కాల్పనిక సాహిత్యంలో ‘లాంగ్‌మార్చ్’ చైనా కథలు, ‘నా కుటుంబం’ ‘ఉప్పెన’ , ‘విముక్తి’ , ‘తండ్రులూ కొడుకులూ’ .. ఆ తర్వాత బొలీవియా మహిళ ‘మా కథ’, మేరీటైలర్ ‘భారతదేశంలో నా జైలుజీవితం’…. జననాట్యమండలి పాటలతో సమానంగా విద్యార్థి యువకులను ఉత్తేజితులను చేసిన రచనలివి. అల్లం రాజయ్య ‘కొలిమంటుకున్నది’, ‘అగ్నికణం’, సాధన ‘అడవిలో అన్నలు’ వచ్చేంతవరకు కూడా మేం కొత్తగా వచ్చే విద్యార్థులతో చదివించే రచనలు అవే వుండేవి. లాంగ్‌మార్చ్ చైనా కథల్లో ప్రజావిముక్తి సైన్యం లాంగ్‌మార్చ్ చేస్తున్న క్రమంలోనే, నడుస్తూ…. ముందువాళ్ల వీపుకు పలక కట్టి వెనక నడుస్తున్నవాళ్లు అక్షరాలు దిద్దుకునే వారని చదువుకున్నం…. సరిగ్గా అదే దృశ్యం మనకు విప్లవోద్యమంలో దళజీవితంలో ఈరోజు కనిపిస్తుంది. ‘కా.విక్రమ్ పాఠశాల’ అని రాసిన బోర్డు చెట్టుకు వేలాడుతుంటుంది. ఎనమిదిమంది మహిళలు, నలుగురు మగ కామ్రేడ్స్ విద్యార్థులుగా ఉంటారు. ఇద్దరు టీచర్లు.. ఒక ప్రిన్సిపల్‌ను పెట్టుకుంటారు. పౌరశాస్త్రం, భూగోళం, లెక్కలు చెప్తారు. రోజూ గంటసేపు తెలుగు ఎట్లాగూ ఉంటుంది. సైన్సులో మానవ పరిణామం చెప్తూ వుంటారు ` కమాండర్ వచ్చి కిట్లు సర్దుకోమంటుంది. స్థావరం మార్చాలి. ప్రయాణంలో విద్యార్థుల్లో ఒకరికి మలేరియా వస్తుంది. 104 డిగ్రీల జ్వరం. అయినా రెండోరోజే లేసి నడుస్తారు. ‘ముందు నడుస్తున్న వాళ్లు కాషన్ ఇవ్వడం, ఫైర్ చెయ్యడం, క్రాంతి తనని కిందికి లాగడం, సంగీతకి అర్థం అయ్యేలోగానే రెండువైపుల నుండి హోరాహోరీ కాల్పులు మొదలైపోయాయి..’ ` షహీదా రాసిన ‘చదువు’ కథలో దండకారణ్యం లోని లాంగ్‌మార్చ్ కనిపిస్తుంది మనకు.
‘మనిషి జ్ఞానం మనిషి బతుకును తెలుసుకోడానికి, మెరుగుపరచడానికి ఉపయోగపడాలని అక్క చెప్పింది’ అంటాడు అనాథ ఆదివాసీ బాలుడు సుక్రు. మిలీషియా అక్క ఆ పిల్లలకు వాళ్లు ఏరుకొచ్చే రాళ్లు, గింజలతో కూడికలు, తీసివేతలు చెప్తుంది. కుంకుడుకాయలు, తేనె అమ్మేటప్పుడు తూకం వేయడం చూపిస్తుంది. షావుకార్ల దొంగ తూకాలను కనిపెట్టడానికి` ఎంత బరువు సరుకుకు ఎంత డబ్బులు వస్తాయో చెప్తుంది. సాంఘికశాస్త్రం చదువులో ప్రపంచ పటంలో రమణసింగ్ సర్కార్ ఎక్కడ కొలువైందో చూపిస్తుంది. ‘ప్రపంచ దేశాలన్నిటిని కొట్టుకుతిని బతుకుతున్న పెద్దపులి అమెరికా ఎక్కడ ఉందో అక్క చెప్పింది.’ అంటాడు భానుమతి రాసిన ‘కొత్తచదువు’ కథలో సుక్రు. ‘చదువు రానివారు ఉద్యమాన్ని ఎట్లా గైడ్ చేస్తారు’ అని బైటనుండి వచ్చిన ప్రశ్నకు జవాబుగా ` దళంలో పాఠశాలల గురించి చెప్తూ ` కళ్లముందే జరుగుతున్న అన్యాయాన్ని ప్రశ్నించడానికి గొంతు కలపలేని ‘చదువుకున్నవారి’కి చూపించడానికి ` ఇతరుల కష్టాలు తమవిగా చేస్కున్న ‘చదువురానివారు’ రాసిన కథలను తన కిట్టులో భద్రంగా దాచిపెట్టి తెచ్చి మనముందుంచుతుంది ` తాయమ్మ కరుణ.
మొబైల్ స్కూళ్లే కాకుండా …సాహిత్య పాఠశాలలు నిర్వహించి ‘విప్లవోద్యమంలో గన్ను పట్టి పోరాడుతున్న వారికి పెన్ను విలువను తెలిపి, ప్రతి ఒక్కరికి ఒక తెల్లకాగితం ఇచ్చి తప్పనిసరిగా ఏదైనా రాయాలని ప్రోత్సహించడం వల్ల బైటసమాజం ఊహించలేనంత స్థాయిలో ఇవాళ దండకారణ్యంలో సాహిత్య సృజన జరుగుతున్నది. సంకలనకర్త అనూరాధ అన్నట్టు ‘దండకారణ్య రచయితలు’ అని సింబాలిక్‌గా వాడుతున్నాం. విప్లవోద్యమం అంటే దండకారణ్యానికి చెందినదే కాదు, నల్లమల, పల్నాడు, రాయలసీమ, ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ, ఆంధ్రా ఒరిస్సా బార్డర్ కమిటీ అన్ని ప్రాంతాల గురించి, అర్బన్ జీవితం గురించిన కథలు దీంట్లో ఉన్నాయి. విప్లవోద్యమ అవసరాలు ఎక్కడికి పంపితే అక్కడికి పోయి ఆ భాష నేర్చుకొని అక్కడి సమస్యలను రాసిన కథలున్నాయి. ఉదాహరణకు ఆలూరి లలిత రాసిన మరాఠీ పట్టణ స్త్రీల కథలు.
‘విప్లవోద్యమంలోకి అడుగు పెట్టడమంటేనే కుటుంబం అనే పితృస్వామిక వ్యవస్థ నుంచి బైటపడి సమష్టి జీవితంలోకి అడుగు పెట్టడం. ఇక్కడ మహిళలు తమ జీవితంలోకి తొంగిచూసుకోవడం మొదలు పెడతారు’ అని అనురాధ రాసినట్లు తమలోకి తాము తొంగిచూసుకోవడం వల్ల ` తాము చేస్తున్న పని చాల ప్రత్యేకమైనదని గుర్తించడం వల్ల ` మహిళలు తమ అనుభవాలను బహిర్గతం చేయాలనే సంకల్పంతో సాహిత్య సృజన చేస్తున్నారు. వియ్యుక్క మొదటి సంపుటిలో ఇచ్చిన వరుసక్రమం చూస్తే మొదటిది ఆదివాసీల ‘రీతి రివాజుల సంకెళ్లు’. దళ జీవితం, చదువు, సహచర్యం, అమ్మతనం, మిలిటరీ జీవితం, సామాన్యప్రజల సాహసాలు, నిర్బంధం, జైలు కథలు, సల్వాజులుం, అమరత్వాలు ` ఇట్లా విప్లవోద్యమమే వస్తువుగా ఉన్నవి మొదటి మూడు సంకలనాల్లో వస్తాయి.
‘అంత పెద్ద ఫైరింగ్ నుండి ఎట్ల తప్పుకున్నవు బిడ్డా?’ జీరబోయిన గొంతుతో అడిగింది తల్లి. …‘నేనెప్పుడూ ఫైరింగి చూడలేదు కదా ఏం చేయాలో తోచలేదు. మెల్లగా వరిచేండ్ల దూరిన. చేను ఇంత ఎత్తుంది. తుపాకీ పట్టుకొని వంగుకుంట వచ్చుడు కష్టమని తుపాకీని ఒకచోట దాచిపెట్టిన. దూరంగా వచ్చేసిన…’. తండ్రి మొహం గంభీరంగా మారిపోయింది. ‘ఏందీ తుపాకీ ఇడిసిపెట్టి ఒచ్చినవా? అయినా నువ్వు తుపాకి ఎందుకు పట్టుకున్నవ్? ఏమన్న సంబురానికి పట్టుకున్నవా, కొట్లాడెతందుకు పట్టుకున్నవా? పోలీసులు కనబడంగానే కొట్లాడాలె గద’ అన్నాడాయన. ‘తుపాకి ఏమన్న ఆటబొమ్మనా బిడ్డా, ఉత్తగనే పట్టుకొని తిరిగేటందుకు. దానితోని ఫైరింగు జేసుడు మంచిగ నేర్చుకోవాలె గద’ తండ్రిలా కోపంగా కాకుండా, అనునయంగా చెప్పింది తల్లి. ` ఆసిఫా రాసిన ‘విప్లవంలో ఒక తల్లీ తండ్రీ’ కథలో ఈ సంభాషణ చదివితే ‘విప్లవ మొలకలు’ మిలీషియా గా అడవంతా ఎట్లా విస్తరిస్తున్నాయో అర్థమవుతుంది.
పోలీసులు యువకులందర్నీ ఊరిమధ్యలో కుప్పచేసి, రక్తాలు కారేట్టు కొట్టిన దాంట్లో తమ కొడుకు కూడా ఉన్నా, తమ ఇంటిని పోలీసులు కాలబెట్టినా తమ దగ్గరున్న ఎర్రజెండాలను మాత్రం పాలిథిన్ కవర్లో పెట్టి బాయిదగ్గర భద్రంగా దాచి, నారాయణపట్నంలో భూములు ఆక్రమించినప్పుడు ఎగరేసిన ఆదివాసీ జంట గురించి ‘ఎర్రజెండా’ కథలో రాస్తుంది శ్వేత. కోరాపుట్ పోలీస్‌స్టేషన్ మీద దాడి, కరువుదాడులు, సోమ్లానాయక్ కోవర్ట్ ఆపరేషన్… మైలురాళ్ల వంటి ప్రతీ సంఘటనను రచనగా మలిచినతీరు ఈ రచయిత్రులకున్న బాధ్యతను తెలియజేస్తుంది. దళంలోని వాళ్లంతా కొందరు ఎపిటికి వెళ్లి శత్రువుకు దొరికిపోయి, కొందరు ఫైరింగ్‌లో అమరులయి ఒక్కతే మిగిలిపోయినా, కాళ్లకు చెప్పులు కూడా లేకుండా ఊరూరు తిరిగి, ప్రజల దగ్గర తలదాచుకొని, ఇన్‌ఫార్మర్ చేతికి చిక్కి తప్పించుకొని, పోలీసుల కళ్లుగప్పి కొండలు గుట్టల మీద పరుగులు పెట్టి, తండ్రి, అన్న వచ్చి తీసుకుపోతామన్నా, వాళ్లకు నచ్చచెప్పి… పంపించి, తుప్పలల్లో , గుట్టలలో తిరుగుతూ చివరికి దళాన్ని కలుసుకున్న శ్యామలది నల్లమల ఏరియాలోని కొల్లాపూర్ దగ్గర గ్రామం. శ్యామల దళంలో కలిసిందని తెలిసి ఆమె అన్న బాలస్వామిని మంటల్లో వేసి సజీవదహనం చేసారు ఆ ఊరి భూస్వాములు. గిరాయిపల్లి గిరిజ రాసిన ఈ ‘వస్తావా నేస్తమా’ కథ ఒక యదార్థ సంఘటన. తర్వాత శ్యామల కూడా అమరురాలయింది.
‘విప్లవ ప్రజాసంఘాలకు వ్యతిరేకంగా బ్రాహ్మణవాద హిందూత్వసంఘం అంటుమొక్క మొలిచింది’ అని యామిని రాసిన ‘కర్తవ్యం’ కూడా ఒక ఏరియాలో జరిగిన సంఘటనే. భజరంగ్‌దళ్‌ను అడ్డు పెట్టుకొని క్రిస్టియన్ ఆదివాసీల ఇళ్లపై దాడి చేయడం, ఎన్నో కుటుంబాలను గ్రామబహిష్కరణ చేయడం రాజకీయ ఆధిపత్యం కోసమే అని చెప్తుంది ఈ కథలో రచయిత్రి.
రచయిత్రులలో షహీదా, మిడ్కో, తాయమ్మ కరుణ, బి.అనూరాధ, పద్మకుమారి తెలుగు సాహిత్య ప్రపంచానికి చిరపరిచితులు. నలభై ఏళ్లుగా దండకారణ్య ఉద్యమ గమనంలో భాగమైన మైనా, నిత్య, సుజాత ల కథలు సంకలనాలుగా కూడా వచ్చాయి. ఆదిలాబాద్ డివిజన్ సెక్రటరీగా పనిచేసి అమరురాలైన ఎల్లంకి అరుణ రచనలు ‘ప్రణీత సవ్వడి’ పేరుతో ప్రచురితమయ్యాయి. సంకలనాలుగా రాకపోయినా అరుణతారలో ఎక్కువసార్లు కనిపించిన పేర్లు జీవని, యామిని. ఇందులో ఒక్క కథ రాసిన రచయిత్రుల నుండి చేయితిరిగిన వారి కథల వరకు ఒక్కసారిగా చదివితే శిల్ప పరమైన తేడాలు ఏవీ పెద్దగా కనిపించవు. దళంలో చదువు నేర్చుకుని రాసిన వాళ్ల కథ కూడా వస్తువుపరంగా ఎంత ప్రభావవంతంగా ఉంటుందంటే చాలా కథలు మనను చదివినంతసేపు గెరిల్లాలుగా మార్చేస్తాయి. ముఖ్యంగా ఫైరింగ్, ఎన్‌కౌంటర్ సంఘటనలను చిత్రించిన కథలు ఎంత అద్భుతమైన శైలిలో సాగుతాయంటే ` ప్రశాంతమైన అడవి ఒడిలోనో లేదా పీడిత ప్రజల నీడలోనో లిప్తపాటు కాలం విశ్రమించిన గెరిల్లాల గుండెల్లో ‘ఢాం’ అని పేలిన తుపాకి శబ్దం మనం వినగలుగుతాం. గుట్టబోర్లలో దబ్బున కింద పడుకొని పొజిషన్ తీస్కున్న పద్మక్క క్రాలింగ్ పొజిషన్‌లో పోతూ ఛాతీకింద ఏదో తడిని గుర్తించి ఒక్క నిముషం ఆగి, మళ్లీ కాషన్ ఇస్తూ ముందుకు పోతున్న దృశ్యమంతా కళ్లకు కడుతుంది గజ్జల సరోజ ‘సాహసిక యోధురాలు’ కథలో.
భారతి కథ కౌకొండ గుట్టల్లో జరిగిన ఫైరింగ్ సంఘటన ` ‘చంద్రగిరి అమరత్వం’ మైదాన ప్రాంతంలో జరిగిన యుద్ధకాండ. వరంగల్ జిల్లాలో కౌకొండ గుట్టల్లో జరిగిన భారీ ఎదురుకాల్పుల సంఘటన భారతి స్వానుభవం. ‘విజయకు నడుములో తూట దిగగానే కిందపడి ‘నన్ను కాపాడండి అనకుండా, ‘అన్నా నేను రాలేను, నా తుపాకీని తీసుకొని మీరు వెళ్లిపోండి’ అంది. గుట్టల చుట్టూ ఫైరింగ్ జరుగుతోంది, వేలమంది పోలీసులు. విజయను వదలివెళ్లక తప్పలేదు. వెంటనే మరో కామ్రేడ్ కుమారస్వామి అమరుడయ్యాడు. గుట్ట ఎక్కుతూ ఉంటే ఆర్‌కె గార్డ్ కోర్నేల్… తర్వాత ఐలన్న…. ఒక్కో కామ్రేడ్‌ను వదిలి గుట్టపైకి చేరుకున్న దళానికి ప్రకృతి కాపాడుకుందన్నట్టుగా ఒక దోనె కనపడింది. దళమంతా దోనెలోకి దిగింది. దోనె పై వరకు వచ్చిన శత్రువు దోనెలోపలికి ఆటో ఫైరింగ్ చేసాడు. బాంబులు లోపలికి వదులుదాం అన్న వాడి మాటలు వినపడుతున్నాయి… ఆ పరిస్థితిలో దోనెలో ఒక పగలు, రాత్రీ దళం ఎంత ఉద్రిక్త వాతావరణంలో ప్రాణాలు ఉగ్గబట్టుకొని గడిపి, బైటపడి తిరిగి ఎట్లా ప్రజలదగ్గరికి చేరిందో… భారతి మినిట్స్ లాగా ఒక్కో క్షణాన్ని రికార్డ్ చేసింది ….
‘చంద్రగిరి అమరత్వం’, మిడ్కో రాసిన ‘ఉక్కుకోట’, రెండూ కూడ నిజంగా అద్భుతమైన డాక్యుమెంటరీలు. ఎందుకంటే అవి కథలు కావు, కల్పనలు కావు… అవి వాళ్ల వీరోచితమైన సాహసాలు, కదనరంగంలోని కవాతులు. ఉక్కుకోట అనంగనే మళ్లీ లాంగ్‌మార్చ్ కథల్లోని ‘నిజమైన ఉక్కుకోట ఏది’ కథ ముప్పై ముప్పైఐదు ఏళ్ల తర్వాత కూడ గుర్తుకొస్తున్నదంటే సాహిత్యానికున్న ప్రభావం అర్థమవుతుంది.
దక్షిణతెలంగాణా నిజామాబాద్ సిర్నాపల్లి ఏరియాలో ఒక ఇంట్లో మకాం వేసిన దళంపై పోలీసుల దాడి జరిగింది. పొద్దున ఏడు గంటలకు మొదలై సాయంత్రం వరకు దాదాపు 12 గంటలు జరిగిన ఫైరింగ్‌లో ఆరుగురు దళసభ్యులు అమరులయ్యారు. కమాండర్ స్వామి ఫైరింగ్ చేస్తూనే చాకచక్యంగా తప్పించుకొని ప్రజల్లో కలిసిపోయాడు. ఆ ఫైరింగ్ సంఘటన, తర్వాత ప్రజలు అతడిని కాపాడుకున్న తీరు మొత్తాన్ని దృశ్యీకరిస్తుంది మిడ్కో. ప్రజాయుద్ధ వీరులను ప్రజలే కాపాడుకుంటారు ‘రక్షణ వలయం’లో రజితను కాపాడుకున్నట్టు. ‘చేపలను నీళ్లు రక్షిస్తాయి. పార్టీని ప్రజలు కాపాడుకుంటారు’ అని రాస్తుంది చాడ విజయలక్ష్మి ఒక కథలో. ఒక గ్రామీణ మహిళ డెలివరీబెడ్ మీద నొప్పులు పడుతూ తన వీపు వెనక ఒక కామ్రేడ్‌ను పడుకోబెట్టుకొని కాపాడిన నిజమైన సంఘటనను ‘ప్రజలే ఉక్కుకోట’ కథలో చిత్రించింది విజయలక్ష్మి అలియాస్ కరుణ. ఇటువంటి ఇంకా ఎన్నో సంఘటనలు ‘సామాన్యుల సాహసాలు’ విభాగంలో ఉన్నాయి. తప్పులు అందరూ చేస్తారు, త్యాగాలు మాత్రం కొందరే చేయగలరు. త్యాగాలు చేసే విప్లవకారులు కూడా పాతభావజాలాన్ని పూర్తిగా వదిలించుకోకపోవడం వల్ల ప్రజలపట్ల తప్పులు జరుగుతుంటాయి. వాటిని చాలా తీవ్రమయినవిగా గుర్తించి పార్టీ తీసుకున్న ప్రోగ్రామ్ ‘దిద్దుబాటు’ క్యాంపెయిన్‌ను నిజాయితీగా రికార్డు చేసారు ఈ విప్లవకారులు.
ఈ మొత్తం రచనలలో, ఇన్ని విభాగాలలో ప్రత్యేకంగా చెప్పుకోవలసినది ‘ధిక్కారమైన దుఃఖం’ అధ్యాయం. ఉద్యమంలో అమరులయిన వారి కోసం వారి బంధువుల, మిత్రుల దుఃఖం, వారిని చివరిచూపు చూసుకొని సగౌరవంగా అంత్యక్రియలు జరపడానికి వారు పడే ఆవేదన, వారి జ్ఞాపకాలను పదిలపరుచుకోవడానికి పడే ఆరాటం… అన్నీ జరిగినవి, జరుగుతున్నవీ. పద్మకుమారి రాసిన రాసిన కాదు, చేసిన ‘ప్రయాణం’ ను పరిచయం చేయడానికి, అంచనా వేయడానికి మన భాష సరిపోదు.
ఛత్తీస్‌ఘడ్ బీజాపూర్ దగ్గర జరిగిన ఎన్‌కౌంటర్లో అమరుడైన సాంబిరెడ్డి భౌతికకాయాన్ని ఇంటికి తెచ్చుకోవడానికి అతని కుటుంబంతో కలిసి బీజాపూర్ బయల్దేరుతారు అమరుల బంధుమిత్రులు. భద్రాచలం, భానుప్రతాప్‌పూర్, జగ్దల్‌పూర్‌ల మీదుగా 700 కి.మీ. పైగా ప్రయాణం. ఛత్తీస్‌గఢ్ మొదలైనప్పటినుంచి ప్రతి ఊర్లో బేస్‌క్యాంపులు. సాల్వాజుడుం గూండాలు, సిఆర్‌పిఎఫ్ పోలీసులు ` అంబులెన్స్‌లో బయల్దేరిన వీళ్లను వాహనాల మీద వెంబడిస్తుంటారు … హఠాత్తుగా పక్కనుండి వెహికిల్ మీద లైట్లు వేస్తుంటారు. ఎక్కడా ఆగడానికి లేదు, చీకటి పడి దారి తెలవక పోలీసులనే అడుగుదామని పోలీసుస్టేషన్ ముందుకు వెళ్లిన మహిళలను చూసి నక్సలైట్లే అన్నట్లుగా స్టేషన్ మొత్తం అలర్ట్ అయిపోతుంది. ఇంక అటునుండి ఫైరింగ్ జరుగుతుందేమో అన్న బీభత్స వాతావరణంలో పరుగెత్తివచ్చి వ్యాన్ ఎక్కుతారు. తీరా మృతదేహాలవద్దకు చేరుకున్నాక మృతుడి అన్న, వదినలు ఒకపక్క ఏడుస్తూ ఉంటే బాగా కల్లుతాగి ఉన్న సాల్వాజుడుం కార్యకర్తలు వినితట్టుకోలేని బూతులతో, చేష్టలతో మీదిమీదికొచ్చి బెదర గొడుతుంటారు. ఉబ్బిపోయి పురుగులు పట్టి , తెచ్చుకోవడానికి వీలులేని స్థితిలో ఉన్న మృతదేహానికి అక్కడే అంతిమసంస్కారం జరిపిస్తారు బంధుమిత్రులు. దుఃఖంతో పూడుకపోయిన గొంతుతో జోహార్లు చెప్తూ, వెళ్లినవాళ్లందరూ సాంబిరెడ్డి మృతదేహం పై తలా పిడికెడు మట్టి వేస్తారు. ‘వదిన ‘రాజేశ్వరి మరో పిడికెడు మట్టి తీసి అంతదూరంలో ఉన్న పోలీసుల మీద చల్లింది. నేలమీద అరచేతులతో చరిచింది’.
తర్వాత తిరుగుప్రయాణంలో కూడా చిక్కటి అడవి, చీకటి. ఎటువైపు కిలోమీటరు వెళ్లినా పోలీసుక్యాంపుకే చేరుకునే పరిస్థితి. ఇంక ప్రయాణం చెయ్యలేక ఒక ఊరిలో కొంచెం సేపు ఊపిరి పీల్చుకుందామని ఆగి అరుగులమీద కూచుంటే టార్చ్‌లైట్లు మొఖాలమీద పడ్తున్నాయి. పక్కనే తాళ్లగూడెం పోలీసు క్యాంపు. అక్కడ బిఎస్‌ఎఫ్, సిఆర్‌పిఎఫ్ జవాన్లు కంచె దగ్గరికి వచ్చి పొజిషన్ తీస్కొని ఉంటారు అని చెప్తారు ఆ ఇంటివాళ్లు. ఇంక వేకువ కోసం చూడడం తప్ప చేసేదేం లేదు…
మొదటి మూడు సంకలనాలలో ఉన్న ఈ కథలన్నీ సాయుధ విప్లవోద్యమం కథావస్తువుగా ఉన్న కథలే. ఇతర సామాజిక సమస్యలను, జనరల్ విషయాలను చర్చించినవి కూడా 134 కథలు రాబోయే 3 సంకలనాల్లో ఉన్నాయి. పితృస్వామ్యం, కులవివక్ష, హిందూత్వ దాడులు, అత్యాచారాలు, లొంగుబాట్లను, మానసిక సంఘర్షణలను చిత్రించిన ` ఈ 52 మంది రచయిత్రులలో సాహిత్య వాతావరణంలో పెరిగినవాళ్లు ఏ ఇద్దరో ముగ్గురో ఉండొచ్చు. ప్రజలపట్ల ప్రేమ, సామాజిక బాధ్యత, నక్సల్బరీ వెలుగులో నడిచిన ఆచరణ, సామాజిక చలనాన్ని వీక్షించిన తీరు వీళ్లను రచయితలుగా మార్చింది. ఇంత విస్తారమైన జీవితం గురించి, రాజకీయ, ఆర్థిక, సామాజిక, సాంస్కృతిక రంగాల్లో సమూలమైన మార్పుకోసం జరుగుతున్న ఉద్యమ గమనం గురించి రికార్డు చేసిన రచయిత్రులు అభినందనీయులు. ఉద్యమకారులు కూడా అయిన ఇంతమంది రచయిత్రులు ఇన్ని కోణాలను ఆవిష్కరించిన ఈ కథల్ని కేవలం సాహిత్యంగా మాత్రమే చూడలేం. ఇది చరిత్ర రచన కూడా. అయితే వీటిని విడి విడిగా చదివినప్పుడు మనదృష్టి కొంత రూపం మీద ఉంటుంది. విభిన్నమైన వస్తువులు గల ఈ రూపాలన్నీ ఒకదగ్గర గుదిగుచ్చబడి సమగ్ర చరిత్ర రూపు కట్టినపుడు, వీటిలోని సారం పాఠకులకు సరిగ్గా అందుతుంది. అల్లం రాజయ్య చెప్పినట్టు ప్రతికథలో స్థలకాలాలు, రక్తమాంసాలు వున్న మనుషులు ఉంటారు. వాళ్లు స్పృశించిన జీవిత కోణాలకు ఒక ఆకృతినిచ్చి చరిత్రలో రికార్డు చేసే బాధ్యతను తలకెత్తుకున్న సంపాదకులను, విప్లవ రచయితల సంఘాన్ని కూడా అంతే స్థాయిలో అభినందించాలి.
నాలుగు దశాబ్దాల ఉద్యమ గమనాన్ని, చరిత్రను సృజనాత్మకంగా మన ముందుంచిన ఆలివ్‌గ్రీన్ అక్షరాల కవాతు ‘వియ్యుక్క’కు రెడ్‌శాల్యూట్.
*
తెలుగు సాహిత్యానికీ సాహిత్య చరిత్ర నిర్మాణానికీ గొప్ప చేర్పు వియ్యుక్క . విప్లవోద్యమ ఆచరణలో స్త్రీ వేగుచుక్క.
చాలా మంచి సమీక్ష
chakkati parichayam
saadhikara sameeksha