ఆరున్నర దశాబ్దాల తరవాత ఇప్పటికీ అదే కథ!

“కవులు తమ కలంలోని బలాన్ని నా కొరకే వినియోగించేటట్లు శాసించాను. నా శాసనాన్ని ధిక్కరించిన వారికి రాజ్యం నుండి బహిష్కరించాను. ఎంతకూ పట్టు వీడక ప్రజానీకంలో విప్లవం లేవదీయ ప్రయత్నించినవారికి శ్రీకృష్ణ జన్మ స్థానాలు శాశ్వత నివాసాలుగా బహూకరించి తృప్తి పరచాను. ఒక్క కవులకేగాదు, గాన, నాట్య, చిత్ర, శిల్ప కళల్లాంటి అరువదినాలుగు కళాపూర్ణులకు గూడా ఇదే చేశాను. ప్రతి స్వరంలో నా కీర్తి రవళించాల్సిందే. ప్రతి చిత్రంలో నా అంగాల రంగు తొంగి చూడాల్సిందే… నిత్యం ప్రజలకు ప్రభువును అర్చించాలని హెచ్చరించాను.”

రచయితలు ప్రతి పక్షం వహించాలని, పీడితుని వైపు నిలబడాలని, బాధితుని చేతిలో ఆయుధాలుగా మారాలని నమ్మిన రచయితలు అన్నీ కాలాల్లో, అన్నీ యుగాల్లో  ఉన్నారు. దీనికి విరుద్ధంగా ప్రభు భక్తిని ప్రదర్శిస్తూ, భజన గ్రూపులో చేరిపోయి ‘అప్పడుపు కూడు’ తిని అంగరంగ వైభోగంగా జీవితాన్ని  అనుభవించేవారు కూడా అన్నీ కాలాల్లో ఉన్నారు. ఈ రెండు వర్గాల మధ్య ఇంత భేదమెందుకు? అంటే కళ కళ కోసమా? సమాజం కోసమా, ఎవరి మెప్పునైనా పొందడానికా  అనే దాని విషయంలో క్లారిటీ లేక పోవడమే అనిపిస్తుంది.

రాజ్యానికి వ్యతిరేకంగా ప్రజా సమూహాలను కదిలిస్తూ వారిలో  ఆలోచించే చైతన్యాన్ని రగిలిస్తూ, ఉద్యమాలను నిర్మిస్తూ రాసే ప్రతి అక్షరం సమాజం కోసమేనని నమ్మి రాజు ఆగ్రహానికి గురై జైలు శిక్ష పడిన ఒక ఖైదీ, ప్రజా కంటకుడిగా మారి ప్రజల అసంతృప్తికి గురై యుద్ధ సమయంలో కూడా ప్రజా మద్ధతు లభించక మరో రాజు చేతిలో ఓడిపోయి బంధీగా తేబడి జైలులో పెట్టబడిన మరో ఖైదీ (ఒకప్పటి రాజు) ‘ఇద్దరు ఖైదీలు’ జైలులో మాట్లాడుకుంటున్నారు.

ఇద్దరు ఖైదీలు చదవండి:

ఒకప్పటి రాజు: మా తండ్రిగారు చనిపోతూ మన వంశ కీర్తిని కాపాడు నాయనా! అని చెప్పి పోయాడు. ప్రజలకు ఏ ఇబ్బంది కలగకుండా అన్నీ సౌకర్యాలు కల్పించినన్ని రోజులూ ఎవరూ మా తండ్రిగారిని జ్ఞాపకం చేయలేదు. వెంటనే కొన్ని సౌకర్యాలు తగ్గించి, కొన్ని పన్నులను పెంచాను. మరుసటి దినం నుంచి “పోయిన రాజు గారే ధర్మాత్ములు” అనే మాటలు వినబడ్డాయి.

మా తాతగారి కాలంలో “కవులందరూ ప్రకృతి శోభల్ని, దైవిక శక్తుల్ని, కనీ వినీ యెరుగని కథల్ని చిత్రిస్తూ తమ కావ్యాలనల్లారు. ఆయన పాత కాలం మనిషి కనుక సరిపోయింది. మా నాన్నగారు కవుల పంథాను మరల్చారు. ప్రజలకు ప్రభువును మించిన దేవుడే లేడు. ప్రభువే సృష్టి. సృష్టే ప్రభువు. అలాంటప్పుడు తమను విడిచి దేని పైనో కల్లబొల్లి కథలల్లుకోవటం దేనికని తమ పైనే వారి కావ్యాల్ని వ్రాయమని కవులను నిర్దేశించారు… కావ్యానికి గౌరవం కావలసిన కవి ప్రభువు యొక్క కార్యకలాపాల్ని కావ్య వస్తువుగా రచించటం అవశ్యం. దీనిని పాటించని వారు తన కవితను ఏ గోడలకో, మూఢులకో వినిపించుకోవాల్సిందే. అయినా కొందరు జ్ఞాన శూన్యులు ఈ నిబంధనను ధిక్కరించి తమ పోకడలే తాము పోయారు.

కాని నా కాలంలో మాత్రం ఇటువంటి అవకతవకలకేమీ తావివ్వ లేదు. కవులు తమ కలంలోని బలాన్ని నా కొరకే వినియోగించేటట్లు శాసించాను…. ఇంత చేసినా మూఢ ప్రజానీకం నా ఆశయాల నర్థం చేసుకోలేక పోయింది. కొందరు జ్ఞాన శూన్యులు అక్కడక్కడ అల్లరులు రేగించ పూనుకున్నారు. కవులు ప్రబంధ, పౌరాణిక శైలి వ్రాయటం చేతగాక భావకవిత్వమనీ, అభ్యుదయ కవిత్వమనీ పేర్లు పెట్టి కల్ల మాటలతో ప్రజలను పిడికిటిలో బిగించ సమకట్టారు. పురాతన కళను సాధించటం శక్తికి మించినదగుట వల్ల, తమ పిచ్చి గీతలకు రూపాలు కల్పించి బీద ప్రజలను వాటిలో చూపి, రాచరికానికి వైరుద్ధ్యంగా బంధిపోటు దొంగలను తయారు చేసి ఆ ముఠాలకు ‘సామ్యవాద ప్రజా సంస్థ’ అనే బురఖా తొడిగించి విడిచారు.”  ఈ చర్య వలన ప్రజలందరూ నాకు వ్యతిరేకంగా మారి పోయిన సందర్భంలో శత్రు రాజు ఒకడు ఇదే అదనుగా నా మీద దండయాత్ర చేయడం వలన వాని చేతికి చిక్కి ఇలా జైలుకు వచ్చాను అన్నాడు.

ప్రజానాయకుడు: “మేము ప్రతిష్ఠ, అప్రతిష్ఠ, ముక్తి, భక్తి ఇత్యాది ఆముష్మిక విషయాలలో ఏ మాత్రమూ జోక్యం కలిగించుకోము. గతాన్ని మరిచి, ప్రస్తుతాన్ని తలంచి భవిష్యత్తులోకి చూస్తాం. మ కర్తవ్యం అవిరామ కృషి. తత్ కృషి ఫలితాన్ని ఏ సహస్రాంశమో మేమనుభవిస్తాం. మిగిలినదంతా ఎవరో అనుభవిస్తారు. అడుగైనా కదల్పకుండా మూడు పూటలా మెక్కుతున్నారు కదా! అని అక్కసు పడము.

ఎవరో సాటి సోదరులు బ్రతికి పోతున్నారని తృప్తిపడతాము.. చేతగానితనం మాత్రం కాదు. ప్రపంచంలోని ప్రతి వింతనూ మేం కల్పించాం. తాజ్ మహల్ ను మేం నిర్మించాం. కోహినూరును మేం వెదికి తెచ్చాం. ఒకటేమిటి? అన్నీ ప్రపంచంలో ఏవేవైతే గొప్పలుగా పరిగణింపబడుతున్నాయో వాటికన్నింటికీ మూల పురుషులం మేమే. అయినా కొందరు వాటి పై తమ నామాల్ని స్వోత్కర్షకై చెక్కుకున్నారు. మేమేమీ అడ్డు పెట్టలేదు. ఎవరి పేరైతేనేం? కావాల్సింది లోక కళ్యాణం.

మా కెప్పుడూ కంటి నిండా నిద్ర లేదు. కడుపు నిండా కూడు లేదు. ఒంటి నిండా గుడ్డా లేదు. దానికై మేమెన్నడూ వగవలేదు. ప్రజానీకం సౌకర్యానికి పునాదులు వేసి సువిశాల హర్మ్యాలు నిర్మిస్తూ పోయాం. అది మా ధర్మం. కళాకారుల్ని మేమెప్పుడూ ఫలానాది చేయమంటూ నిర్బంధించలేదు. వారు వారికి తోచిన త్రోవలు త్రొక్కారు. కళకు హద్దులు గీయటం భగవంతునికి ద్రోహం చేయటమని మా అబిప్రాయం. గద్యమైనా, పద్యమైనా భావ ప్రకటనమే ముఖ్యమని ఒప్పుకున్నాము. ఎటువంటి గీతలైనా సరే సహజత్వాన్ని చిత్రించగలిగితే అదే కళంటూ ఆమోదించాము.         హృదయాలు మాట్లాడుకునే భాషకు అసలు నుడులే యుండవు. అంతమాత్రాన అది అర్థరహితమైందని అనలేము. మనోఫలకాలపై శాశ్వతంగా చిత్రించుకునే చిత్తరువులకు గీతలు, రంగులు అవసరమే కావు. అయినా వానిలో సహజత్వం లోపించిందనుట పొరపాటు. ఊహాగానాలతో కారు మేఘాల నీలి అంచుల మీద చేసే నృత్యాన్ని కళల్లో జమకట్టకుండా ఉండలేము. మొత్తానికి తమ కళను సార్థకత, సౌమ్యత, ప్రత్యేకత కావాలనుకున్న వారంతా మా జీవితాల్ని తమ కళల్లో రూపెత్తించారు. మేము వారిని కోరలేదు.”

ఇట్లా ఉండగా ఎవరో తాను రాజునంటూ తలెత్తాడు. మేము సరేనన్నాము. ఎందుకంటే “అతడు ప్రదర్శించిన కొన్ని యుక్తులు మాపై మత్తుగా పని చేసినయి. తన తెలివి తేటలతో మా కొఱకు స్వర్గానికి దారి కడతానన్నాడు. మా ముఖాలు ఏదో క్రొత్త ఆశతో జేవురించినయి. అవునంటే, ఔనన్నాం. అతడు సౌఖ్యం కావాలన్నాడు. ఇచ్చాం. అందరూ తన చెప్పు చేతల్లో ఉండాలన్నాడు. హేతుబద్ధమైన మాటలన్నిటినీ పాటిస్తున్నాము. ఆ విధంగా సాగింది కొన్నాళ్లు. అతని ప్రాభవం వేళ్ళు తన్నింది.” ఇలా కొన్ని రోజులు సాగిన తరువాత అతడు ప్రజలకు ‘ఇక్కట్లనే ఇనాం’గా ఇవ్వసాగాడు. అప్పుడు ఏం చేద్దామని ఆలోచించాం. నిద్ర మత్తులో ఉన్న ప్రజలను మేల్కొల్పాలనుకున్నాం. ఆ సందర్భంలో కవులు వైతాళికులయ్యారు. అతనికి తగిన శాస్తీ చేయాలని, అతడిని నిలదీయాలని అనుకున్నాను. కాని నేను అతడిని చేరలేక పోయాను. “రాజ్యంలో జరుగుతున్న రాపిడికి మూలం నేనేనంటూ నన్ను బంధించి ఈ ఇనుప సంకెళ్లతో బిగించాడు.” అని చెప్పాడు.

తనను బంధించిన రాజు ఇతడేనని ఆ నాయకునికి, తన రాజ్యం కూలి పోవడానికి ఉద్యమాన్ని నడిపిన ప్రజా నాయకుడు ఇతడేనని ఆ రాజుకు ఎప్పటికీ తెలియదు. చివరికి ఏమైంది? ప్రజా సముద్రం ఉప్పొంగి జైలు గోడలు  బద్దలు  కొట్టబడి ఆ ప్రజా నాయకుడు ప్రజా క్షేత్రంలోకి వచ్చాడా? ఆ రాజును క్షమా బిక్ష పెట్టి వదిలేశారా? అనేది కథ చదివితే తెలుస్తుంది.

తెలంగాణ కథా సాహిత్యంలోనే కాదు తెలుగు కథా సాహిత్యంలోనే వస్తు పరంగా, శైలి పరంగా, శిల్ప పరంగా ఇదొక గొప్ప కథ.

ఈ కథ రాయబడి దాదాపు ఆరున్నర దశాబ్దాలు (1954) అయ్యింది. అయినా ఇప్పటికీ ప్రాసంగికత కోల్పోకుండా తళతళ మెరుస్తోంది. రైతులను ఈ పంటే వేయమని శాసించినట్టు రచయితలను ఈ విధంగానే రాయమని నిర్దేశించడం ఎంత మూర్ఖత్వమో ఈ కథ ముక్కు మీద గుద్ది మరీ చెప్తుంది. పాలకులకు, ప్రజానాయకులకు, ప్రజలకు, కవులు, రచయితలకు ఈ కథ ఒక మేనిఫెస్టో అంటే అతిశయోక్తి కాదు. ఎన్ని యుగాలైనా ఈ కథ పాతబడదు.  రచయిత ముందు చూపును, ప్రజా పక్షపాతాన్ని పట్టి చూపుతుంది.

అధికారంలో ఉన్నప్పుడు విర్రవీగద్దు ఎందుకంటే జీవితం చదరంగంలాంటిది. ఆట ముగిసిన తర్వాత గెల్చిన రాజు, ఓడిన రాజు, గెల్చిన సైన్యం, ఓడిపోయిన సైన్యం రెండు బలగాలు ఒకే బాక్స్ లో ఉండాలి. అధికారం కోసమో, ధనం కోసమో ఇంకా మరో లాలూచి పనుల కోసమో నియంతృత్వంగా పాలిస్తే చివరికి ఎంతటి రాజుకైనా ఏ గతి పడుతుందో కళ్ళకు కట్టేలా చెప్పాడు కథకుడు. ప్రశ్నను బంధించి, పశుబలంతో అధికారాన్ని నిలుపుకోవాలనుకునే పాలకులకు ఇదొక గుణపాఠం.

ఏ ఎండకు ఆ గొడుగు పట్టే రంగు రంగుల ఛత్రిగాళ్లను బోనులో నిలబెట్టే కథ. రచన పాలకులకు ఆహ్లాదాన్ని అందించడానికి కాదు. సమాజాన్ని కదిలిచడానికి. ప్రజా రచయితలకు, నాయకులకు ప్రజలు తమ గుండెల్లో గుడి కడుతారని ఈ కథ నిరూపించింది. ఇప్పుడున్న ఈ దేశ సమకాలీన పరిస్థితులకు ఈ కథ ఒక షాక్ ట్రీట్మెంట్. వాక్యాన్ని వ్యంగ్యంతో నడిపించడం వల్ల కథకు చాలా బలం చేకూరింది. వ్యక్తి స్వేచ్చను కలగని దాని కోసం ఎంతో దూరమైనా పోవడానికి సిద్ధం చేస్తుందీ కథ.

ఇంతటి అద్భుతమైన కథను ఎవరు రాశారా? అని ఆలోచిస్తున్నారా? ఎవరికీ తల వంచని నిటారు వ్యక్తిత్వంగల మనీషి డా. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి (1932-2017). బుద్ధిజీవులను చైతన్యపరిచే సాధనంగా, వాస్తవ జీవిత చిత్రణ, కుటుంబ వ్యవస్థలో వస్తున్న అనేక మార్పులు, మానవ సంబంధాలు, మనిషి లోపలి పొరల్లో నిక్షిప్తమై ఉన్న లోతైన భావాలను విపులంగా వ్యాఖ్యానించే పరికరంగా కథను వినియోగించుకున్న డా. వల్లపురెడ్డి బుచ్చారెడ్డి మహబూబ్ నగర్ జిల్లా పెబ్బేరుకు చెందినవారు. వీరు  బహుగ్రంథ కర్త. ‘మధురవాణి విలాసము-సంశోధనాత్మక విమర్శనము’ మీద ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆచార్య బిరుదురాజు రామరాజు పర్యవేక్షణలో Ph. D. చేశారు. ప్రసిద్ధ ప్రాచీన ఉర్దూ కవుల గజళ్లను కొన్నింటిని ‘ముక్తగీతికలు’ (1972) పేర అనువాదం చేశారు. మధువు గురించి ఉర్దూ మహాకవులు రాసిన వాటిని తెలుగులో అనువాదం చేసి ‘మధుగీత’ (1986)గా వెలువరించి డా. సి. నారాయణరెడ్డి చేత ‘కవితా మాధ్వీక పానప్రియుడు’ అని ప్రశంసిపబడ్డాడు.

సంకుసాల నృసింహ కవి విరచిత ‘కవికర్ణ రసాయనం’లోని కొన్ని ఎంపిక చేసిన పద్యాల మీద నరసయ్య సరస కవిత (1986) అనే వ్యాసం రాశారు. మణికుల్య వ్యాసాలు వెలువరించారు. 1974లో పురుషకారి కేశవయ్య రచించిన ‘ నిరోష్ఠ్య ఉత్తర రామాయణం’ను 1980లో చింతలపల్లి వీర రాఘవయ్య కృతమైన ‘మధురవాణీ విలాసం’ను, ‘దాశరథి చరిత్ర’ను పరిష్కరించి సంశోధిత ముద్రణగావించారు. ఇవేగాక శ్రీ కాళహస్తీశ్వర శతకానికి విలువైన వ్యాఖ్యానం రాశారు. ఇది ఎంతో మంది  పండితుల మెప్పును పొందింది. మరెన్నో గేయాలు, గేయ నాటికలు కూడా రాశారు. 1954లో ‘విద్యుల్లత’, 1960లో ‘ఉదయభాను’ పత్రికలకు సంపాదకులుగా ఉన్నారు.

కొంత కాలం ‘పురోగామి’ పత్రికకు కూడా సంపాదకులుగా వ్యవహరించారు. ఇదంతా ఒక వైపైతే  1954-1960 మధ్య సుమారు 52 కథలను రాశారు. ఇంకా కొన్ని కథలు అసంపూర్తిగానే ఉండిపోయాయి. 2015లో వీరి సమగ్ర సాహిత్యం రెండు సంపుటాలుగా వెలువడింది. వీరి కథల్లో ఒక కలికితురాయి ‘ఇద్దరు ఖైదీలు’. ఈ కథ మొదట 17 డిసెంబర్ 1954లో తెలుగు స్వతంత్ర లో అచ్చయ్యింది.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కథ మరియు మీ విశ్లేషణ చాలా అద్భుతంగా ఉన్నాయి.ఈ కథ నిజంగా అధికారంతో విర్రవీగే పాలకులకు చెంపపెట్టు.ప్రజాక్షేత్రంలో బ్రతికే కవులకు,కళాకారులకు ఎప్పటికీ తిరుగుండదు.ప్రజా పక్షాన కాకుండా పాలకుల పక్షాన ప్రభువుల మెప్పుకోసం పనిచేసే వాళ్ళు కళాకారులే కాదు.అద్భుతమైన కథని రాసిన బుచ్చారెడ్డి గారికి ఆ కథను మాకు తెలిసేలా చేసిన మరియు విశ్లేషణను అందించిన మిత్రులు శ్రీధర్ గారికి ధన్యవాదాలు.

  • చాలా వివరణాత్మక వ్యాసం ఇది. చాలా మందికి తెలియని చాలా విషయాలు తెలియజేశారు శ్రీధర్.అభినందనలు
    రామా చంద్రమౌళి

  • మీ విశ్లేషణ ద్వారా తెలియని విషయాలు కూడా తెలుసుకోగలుగుతున్నము. అద్భుతంగా విశ్లేషించారు సార్.

  • ఆయన కథా, మీ విశ్లేషణా రెండూ బాగున్నాయి
    ఇంత మంచి కథను వెలికి తీసినందుకు మీకు అభినందనలు. 💐💐💐💐💐💐💐

  • Sincere thanks to the “Saaranga” and Dr Sridhar for bringing the most valuable but hidden stories of the past decades!
    The review not only exposing the greatness of the story but also making it to read. Thank you.

  • డా.వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి కథ బాగుంది .అలాగే ఈ కథను మీరు విశ్లేశించిన విధానం బాగుంది సర్ ఇలానే ఇంకా మంచి మంచి కథలను విశ్లేషించాలని కోరుకుంటూ మీకు ధన్యవాదాలు.

  • రాజ్యస్వబావాలు అప్పడు ఇప్పుడూ ఏ మార్పులు రాలే అదేవిధంగా కవుల పరిస్థితి కూడ అంతే.ఈ సందర్భంలో పెద్దలు వల్లబ్ రెడ్డి బుచ్చారెడ్డి 1954లో రాసిన “ఇద్దరు ఖైదిల కథ ” ను వెల్దండి శ్రదరన్న చక్కగా విశ్లేషించారు.అన్నకు అభినందనవందనాలు👌👌💐💐

  • మట్టి కలిసేను కోట పేటలు, పదం పద్యం పట్టి నిలిచెను కీర్తుల పకీర్తులు.. అంటూ దాచేస్తే దాగని సత్యాలను…. అట్టడుగున కనిపించని కథలు వెలికి తీసే పని శ్రీధర్ చిక్కగా చేస్తున్నారు.

  • ఇప్పుడు అవసరమైన కథ ఇది. ప్రజల పక్షం లేని కళ ఐనా, పాలకుడు ఐనా కథలో ముగింపు లాగే అంతర్ధానం అవక తప్పదు

  • ఒక గొప్ప వస్తువు కలిగిన కథను వెలికితీసి పరిచయం చేసిన శ్రీధర్ గారికి ధన్యవాదాలు!
    అలనాటి రాజుల కాలంనాటి నియంతృత్వ పోకడలు ఈ ప్రజాస్వామ్యంలో కూడా కనబడతనే ఉన్నయి.
    కథలో ప్రజలలో కలిగిన అభ్యుదయం వల్ల నియంత అంతం జరిగింది.
    కాని ఇప్పుడు ఆ ఆశ కనుచూపు మేరలో లేదు.
    బొక్కలకు ఆశపడే మేధావులు, బిచ్చగాళ్ళుగా మారే జనం ఉన్నంత కాలం చల్తీకా నామ్ గాడీ!

  • ఇద్దరు ఖైదీలు కథ అద్భుతంగ వుంది సార్ .ఇప్పటి వ్యవస్థ కు ఈ కథ ఎలా మార్గదర్శనం చేస్తుందొ బాగ వివరించారు సార్ .కవుల రచనలు ఎవరి పక్షం ఉండాలో కథలో భాగంగ వివరించిన తీరు చాలా బాగుంది సార్ .వల్లపురెడ్డి బుచ్చారెడ్డి గారి గురించిన పరిచయం తెలుసుకున్నాను సార్ .

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు