1
“ఆ రోజు ప్రసంగాలు సరే. మీతో కూర్చుని మాట్లాడడమే చాలా హాయిగా అనిపించింది. అప్పటిదాకా పరోక్షంగా తెలిసిన సన్నిధానమే కొంచెం జెంటిల్మన్. ప్రత్యక్షంగా చూసిన సన్నిధానం మరీ. ఓ పది నిమిషాలు గౌతమీ పాతకెరటాల్లో కాళ్ళు తడుపుకొని, కూర్చుని చదువుకునేంత సమయం లేకున్నా చూసి అయినా ఆనందిద్దామని అక్కడకు వచ్చాను. ఆ పదినిమిషాలు ఎటు పోయాయో తెలియదు. పదిగంటలైనా చల్లగా జారిపోవచ్చన్న భయంతో ఇక లేచి నిలబడ్డాను. రెండు గంటలు మాట్లాడుకున్నా ఆ రోజు మీతో మాట్లాడుకోవాల్సింది చాలా మిగిలిపోయింది. అసలేమీ మాట్లాడలేదనుకుంటాను.”
ఈ వుత్తరం నేను సన్నిధానం గారికి ఆగష్టు 28, 1987 న రాసినట్టు ఇప్పుడు కచ్చితమైన సాక్ష్యం వుంది. ఎందుకంటే, ఆ ఉత్తరాన్ని ఆయన తన చేతిరాతలో మళ్ళీ రాసి పెట్టుకున్నారు కనుక. ఇది చాలా గమ్మత్తయిన అలవాటే. నచ్చిన ఉత్తరాల్ని ఒకటికి పదిసార్లు చదువుకుంటాం. కానీ, తిరగ రాసి పెట్టుకోవడం ఆశ్చర్యం. ఎందుకంటే, నాకూ ఈ అలవాటు వుంది కనుక. కానీ, నేను ఉత్తరాల్ని కాదు, చదివిన రచనలోని కొన్ని పేరాలకు పేరాలు మళ్ళీ నా చేత్తో రాసి పెట్టుకునేవాణ్ణి. ఆ రోజుల్లో బెజవాడ వెళ్ళినప్పుడల్లా కొత్త పుస్తకాలతో పాటు అందమైన నోట్ పుస్తకాలు కొనుక్కొని వచ్చే పిచ్చి ఒకటి వుండేది. నేను ఖమ్మం వెళ్ళినప్పుడల్లా మా ఇంట్లో పుస్తకాల మధ్య అలాంటి నోట్ పుస్తకాలు కొన్ని దొరుకుతూ వుంటాయి ఇప్పటికీ. నోట్ పుస్తకాలే కాదు, కొందరు స్నేహితులు రాసిన అపురూపమైన ఉత్తరాలు కూడా.
అసలు ఉత్తరాలు రాసుకునే ఆ అలవాటుని మనం ఎక్కడ ఎలా పోగొట్టుకున్నాం?
తెలియదు. తెలిసినా ఇప్పుడు అదొక బాధ. అదొక గతం. అదొక గతస్మృతిలోంచి రాలే నెమలీకల వాన. ఇందులో రెండు బాధలున్నాయి- ఒకటి: అసలు స్నేహితులని మాత్రమే కలవడానికి యింకో వూరు ప్రయాణం కట్టడం! రెండు: తిరిగివచ్చీ రాగానే ఆ స్నేహితులకి మళ్ళీ ఉత్తరాలు రాసుకోవడం. ఇవి రెండూ ఇప్పుడు వేరే రూపం దాల్చినా, ఆ అనుభవంలోని తీయదనం మాత్రం లేదనే అనిపిస్తోంది.
2
నాకు తెలిసీ ఆ 1987 లో నేను రాజమండ్రి వెళ్లింది సన్నిధానం గారిని కలవడానికి కాదు. అప్పుడే ఆంధ్రజ్యోతిలో చేరిన మిత్రుడు సతీష్ చందర్ ఏదో సభ కోసం నన్ను అక్కడికి పిలిపించాడు. నాతోపాటు ఖాదర్ బాబాయ్ ని కూడా! అప్పటికే నాకు రాజమండ్రితో పరోక్ష బంధం గట్టిగానే వుంది. అప్పటికింకా కంజిర మిత్రులు ఒక బృందంగా ఏర్పడలేదనుకుంటాను. ఆ తొలినాటి స్నేహం తరవాత కంజిర సాహితీ మిత్రులుగా మారింది. కేవలం కవిత్వం బంధంగా వాళ్ళతో నా స్నేహం కుదిరింది. ఆ తరవాత అది అనేకవిధాలుగా బలపడింది. నేను రాజమండ్రి వెళ్లకపోయినా నామాడి శ్రీధర్, వొమ్మి రమేశ్ బాబు, శశి- వీళ్ళతోపాటు చాలా తరచుగా ఎమ్మెస్ బెజవాడ వచ్చి, నాతో బందర్ రోడ్డు చుట్టూ తిరిగే వాళ్ళు. ఏలూరు రోడ్డులో పుస్తకాల షాపుల చుట్టూ ప్రదక్షిణలు చేసేవాళ్లం. అప్పుడు నాది ఏకాకి జీవితం కాబట్టి, ఏదో ఒక మెస్ లో కలిసి తినే వాళ్ళం. కానీ, కబుర్లు గంటల తరబడి సాగేవి. ఈ కబుర్ల మధ్య కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ, పతంజలి శాస్త్రి, సన్నిధానం గార్ల ప్రస్తావనలూ, అనుభవాలూ పదేపదే వచ్చేవి.
అంటే, రాజమండ్రిలోకి అడుగు పెట్టడానికి ముందే ఆ అందరి గురించి ట్రైలర్లు వేసేవాళ్ళన్న మాట. దాంతో రాజమండ్రి వెళ్ళి, సన్నిధానం గారిని మొదటిసారి సన్నిధానం గారిని కలిసినప్పుడు అది మొదటి సారి అని అనిపించనే లేదు. ఆయనకి కూడా అదే అనుభూతి కలిగిందంటే, మా కంజిర మిత్రులు ఏమేం చెప్పి వుంటారో వూహించుకోవచ్చు.
రాజమండ్రి వెళ్ళడం అంటే మూడు సందర్శనలు తప్పనిసరి. ముందుగా గోదావరి తీరం మీద సంచారం జరిగే తీరాలి. రెండు గౌతమీ గ్రంథాలయంలో కనీసం పుస్తకాలు తిరగెయ్యాలి. అక్కడ కొలువైన సన్నిధానం గారిని చూడాలి. ఇవన్నీ రమేశ్, శ్రీధర్, శశి వెంట వుండగా జరిగేవే. ఒక గుంపుగా వెళ్ళే వాళ్ళం. గుంపుగా తిరిగే వాళ్లమన్న మాట. సన్నిధానం గారితో కూర్చోడం అంటే అది అనేక కాలాల్ని తిరగదోడడం. పేర్లు వినడమే తప్ప ప్రత్యక్షంగా కలిసే అవకాశం ఏమాత్రం లేని పెద్దల్ని తలచుకొని, వాళ్ళ జ్ఞాపకాల్లో తడిసి ముద్దయి పోవడమే!
సన్నిధానం గారిని కలవడం అంటే ఒకేసారి వివిధ యుగాల సమ్మేళనం. ఎన్ని వందల పద్యాలు అనర్గళంగా ప్రవహిస్తాయో, అన్నేసి వందల వచన కవితలూ అంతే వేగంగా దూసుకొస్తాయి. అంతకంటే ఎక్కువగా పూర్వ, మధ్య కాలీన, ఆధునిక సాహిత్యవేత్తల గురించి అంత కళ్ళకి కట్టినట్టు చెప్పేవాళ్లు మనకి తక్కువ. ఇంతా చేస్తే, సన్నిధానం గారి స్వయంగా ఎన్నో రచనలు చేశారు. కానీ, ఆయన నోటంట కనీసం వాటి ప్రస్తావన వుండదు. స్వయంగా కవీ రచయితా అయిన వాళ్ళకి ఇది ఎంత కష్టమో చెప్పక్కర్లేదు. వినయం అనేది బయటికి కనిపించేది కాదనీ, అది లోపలినించి పాదుకునే లేదా వేళ్లూనుకునే వృక్షమని ఆయన్ని చూస్తే, వింటే అర్థమవుతుంది.
సన్నిధానం గారి రచనల్ని ఒకసారి దగ్గిర పెట్టుకొని కేవలం ఆ ముఖచిత్రాల వరకే చూసినా, ఆయన ఆలోచనల విస్తృతి రచనల్లోకి ఎంతగా అల్లుకుపోయిందో తెలుస్తుంది. ఒక వైపు సృజన, మరో వైపు పరిశోధన- వీటన్నీటితో పాటు కవిపరిశోధక మిత్రులతో (వారిలో కొందరిని ఆయన గురువుగా భావించినా సరే) కొనసాగించిన ఆత్మీయమైన ఉత్తరాల పరంపర- ఇవన్నీ కొన్ని వేల పేజీల వరకూ వుంటాయి. ఆయన హిందీ నుంచి తెలుగులోకి అనువాదం చేసిన “నలదమయంతుల కథ” ఎనభై వేల ప్రతులు అమ్ముడుపోయిందంటే ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఇక తెలుగులో మొట్టమొదటి అచ్చు పుస్తకం ‘నూరు జ్ఞానవచనాలు’ (1747) పునర్ముద్రించడం పరిశోధన కృషికి గుర్తు. పదిహేడో ఏట మొదలైన ఆయన సాహిత్య సృష్టి ఎప్పుడూ కుంటుపడలేదు. నెమ్మదించలేదు. గోదావరీ ప్రవాహమై కొనసాగుతూనే వుంది.
ఎనిమిది పదుల వయసు దాటాక కూడా ఒక పద్యం వినిపించేటప్పుడు ఆయన స్వరంలోని ఆ పదునూ, ఆ ధారణా తగ్గలేదు. సాహిత్యం పట్ల ఎంతో మమకారం వుంటే తప్ప సాధ్యపడని విద్య అది. వీటన్నీటికీ మించి సన్నిధానం గారి మిత్రసంపద నాకు అబ్బురంగా అనిపిస్తుంది. మరీ ముఖ్యంగా, కొత్తపల్లి సత్యశ్రీమన్నారాయణ గారి పట్ల ఆయన ప్రేమ ఇప్పటికీ నాకు స్ఫూర్తిగా అనిపిస్తుంది. మిగిలిన రాజమండ్రి మిత్రులతో వయోపరిమితుల్లేకుండా ఆత్మీయంగా కొనసాగుతూనే వుంది.
3
ఆంధ్రజ్యోతి ని వదిలిపెట్టి నేనూ సతీశ్ చందర్ ఇతర మిత్రులు ఆంధ్రభూమికి చేరుకున్న తరవాత నేను నిర్వహించిన “అక్షరం” సాహిత్య పేజీలో ఆయన “ఒక మంచి పద్యం” శీర్షిక రాస్తూ వుండేవారు. ప్రతి వారం ఆయనకి నచ్చిన ఒక పద్యాన్ని తీసుకుని, ప్రతిపదార్థం ఇచ్చి, కొంత వ్యాఖ్య చేసే వారు. సాహిత్య పేజీలు పద్య సాహిత్యాన్ని దాదాపూ మరచిపోయిన ఆ కాలంలో ఈ శీర్షిక మంచి ప్రశంసలు అందుకుంది. ఇప్పటికీ ఫోన్ చేస్తే సన్నిధానం గారు ఆ పద్యాల్లో కొన్నీటిని హాయిగా వినిపిస్తారు. అదొక మంచి అనుభవమే.
ఆ శీర్షిక నిర్వహిస్తున్న కాలంలో సన్నిధానం గారు ఒక సారి ఆంధ్రభూమి కార్యాలయానికి వచ్చారు. నాతో కొద్దిసేపు మాట్లాడిన తరవాత ఆయన ఆఫీసు అంతా కలయతిరుగుతూ ఎవరి కోసమో వెతుక్కుంటున్నారు. ఆ వెతుకులాట చాలా సేపు సాగిన తరవాత ఆయన్ని నేను మళ్ళీ పిలిచాను. “సన్నిధానం గారూ, ఎవరికోసం వెతుకుతున్నారు?” అని అడిగాను. “అఫ్సర్ గారిని కలవాలండీ. ఆయన కోసమే ఇంత దూరమూ వచ్చాను” అన్నారు ఆయన.
అప్పుడు నా సమాధానం ఏమై వుంటుంది?!
“ఇప్పటిదాకా మీరు మాట్లాడింది అఫ్సర్ తోనే కదా!?” అన్నాను నవ్వుతూ.
ఆయన వెంటనే నన్ను కావిలించుకొని, “అమ్మయ్య! అయితే నేను వచ్చిన పని అయిపోయింది!” అన్నారు.
చాలా కాలం ఉత్తర ప్రత్యుత్తరాలే కాబట్టి నా రూపం ఆయన మనసులో సరిగా ముద్రించుకోలేదనుకుంటా. ఈ అనుభవం ఇప్పటికీ మా రాజమండ్రి మిత్రులు సరదాగా తలచుకుంటారు. సన్నిధానం గారు ఆ తరవాత ఎప్పుడూ నన్ను మరచిపోలేదు మరి!
*
Add comment