ఆయన నేర్పిన విలువలుంటాయ్!

మా మాస్టారు వెళ్ళిపోయారు.

బహుశా అత్తూయీ అత్తూయీ అంటూ గారాబంగా పిలిచే పద్మిని గారి దగ్గరకే వెళ్ళి వుంటారు. ఉంటారేమిటి? అక్కడికే వెళ్ళారు. మాతో అబద్ధం చెప్పారు. ఆయన 75వ పుట్టిన రోజు జూన్ 1 న  మేం శిష్యులం జూమ్ మీటింగు పెట్టి ఆయనతో మాట్లాడాం. మాస్టారూ మీరు నూరేళ్ళు బతకాలంటే అదేమిటీ మా యోగా టీచర్ 150 సంవత్సరాలు బతుకుతానని అంటోందిగా అన్నారు పకపకా నవ్వుతూ. ఎవడు బతుకుతాడులే మూడు ఏభైలు, మా మాస్టారు తప్ప అని మేమూ నవ్వేశాం.

ఆయనకు మీటింగులంటే ఇష్టముండదు. పొగడ్తలు అసలు గిట్టవు. ఆయన కోడలు కీర్తి..మేమూ గూఢుపుఠాణీ చేసి ఎలాగోలా ఆయన్ని జూమ్ లోకి దింపాం. శిష్యులం ఆయన గురించి ఏదేదో మాట్లాడి ఆయనతో ఎన్నో అనుభవాలను గుర్తుచేసుకున్నాం. మా రాజీ నూటికో కోటికో  పుడతారు..మా దేవుడు మీరే మాస్టారూ అని రెండు మూడు వాక్యాలు పాడింది. శిష్యులతో స్నేహితుడిలా వుండడం, కష్టసుఖాలలో పాలుపంచుకోవడం, తలకు మించిన సహాయమైనా అది చేసే తీరడం ఆయన సహజ లక్షణాలు. అందుకే మిత్రులం ఆయన గురించి సహజంగానే పొగుడుతూ చెప్పాం.  మార్నాడు నాకు ఫోన్ చేసి, మూర్తిగారూ నాకేమనిపించిందంటే, నాకు గుడ్డలూడదీసి రోడ్డు మీద ఊరేగించారనిపించింది. అన్నారు. అని ఒకటే నవ్వు. కీర్తి కండూతి తెలీదు. పొగిడించుకోవడం అసలు ఇష్టముండదు. మళ్ళీ ఏదో గుర్తొచ్చినట్టు,  అన్నట్టు మూర్తిగారూ, ఆ శిఖామణి గారు ఏదో చెప్పారే, నా  మీద మీ అందరి జ్ఞాపకాలతో ఒక పుస్తకం  తీసుకురావాలని, ఈ పనికి ప్రసాదమూర్తే పూనుకోవాలని, దయచేసి  మీరు అలాంటి పని చెయ్యొద్దు. నాకు ఎంత మాత్రం ఇష్టం లేదు. మనమంతా స్నేహితులం అంతే. ఇలా ఆయన అనే సరికి సరేలెండి అన్నాను. అంత నిర్మొగమాటం మనిషి. అంత మొండి ఘటం.

             ఈ మొండి ఘటం అసలు రూపాన్ని ఆయన మరణంలో చూశాము.

పద్మిని గారు క్యాన్సరుతో వెళ్ళిపోయిన కొద్దికాలానికే ఆయనకు కూడా క్యాన్సరు డిటెక్టు కావడం అందరికీ ఆశ్చర్యం. ఎన్నడూ ఒక మాత్ర కూడా వేసుకుని ఎరగని వ్యక్తి, 75 సంవత్సరాల వయసులో 35ఏళ్ళ కుర్రాడిలా హుషారుగా వుండే వ్యక్తి, ఎందుకిలా అకస్మాత్తుగా అయింది? అంటే దానికి ఆయన ఇలా మెసేజ్ చేశాడు. ‘’నా సిగరెట్లు అలవాటే కారణం, నో రిగ్రెట్స్, నో ఫోన్ కాల్స్, నో విజిటర్స్, నో మెసేజెస్, ఐ వాంట్ టూ గో సైలెంట్లీ.’’ ఇదీ ఆయన మెసేజ్. ఆయన చనిపోయే ముందు ఆత్మీయులకు చూసుకునే అవకాశం కూడా లేదంటే లేదని  తేల్చి చెప్పేశాడు. కన్న  కూతురిని, అమ్మలాంటి అత్తగారు కృష్ణాబాయి గార్ని కూడా చూడ్డానికి రానీయలేదు. నేను మీకు ఏ రూపంలో తెలుసో అదే రూపాన్ని గుర్తు పెట్టుకోండని ఆయన ఆఖరి ఆదేశం. ఇక దాన్ని మాస్టారి కుటుంబ సభ్యులు తూచా తప్పక పాటించారు. అంతేనా కనీసం చివరి చూపుకైనా  అవకాశం ఇస్తారా అంటే, నో అన్నారు. అది ఆయన చివరి వార్నింగ్. ఆస్పత్రిలో ఆయన డెడ్ బాడీ డొనేట్ చేశాకనే తన మరణ వార్తను వెల్లడించమని చెప్పారు. అది కూడా అందరికీ కాదు, కొందరి పేర్లు మాత్రమే ఆయన రాసిచ్చాడు. అలా మా మాస్టారు మాకు చివరి చూపు కూడా దక్కకుండా చేసి ఒంటరిగా మౌనంగా నిశ్శబ్దంగా వెళ్ళిపోయాడు. ఈ ఒక్క ఘటన చాలు కదా, ఆయనెంత మొండివాడో చెప్పడానికి.  

ఆయన తన జీవితంలో నమ్మిన ప్రతి విషయంలోనూ అలాగే వ్యవహరించాడు.

       నేను 1982లో ఆంధ్రాయూనివర్సిటీలో ఎం.ఏ.తెలుగులో చేరాను. ఆయన ఆధునిక సాహిత్యాన్ని బోధిస్తున్నారు. మల్లెపువ్వులాంటి లాల్చీ పైజామా, పల్చటి షోలాపూర్ చెప్పులు పెదాలపై ఎప్పుడూ నవ్వూ, నిటారుగా నడవడం, అప్పటి ఆయన రూపంలో కొన్ని జ్ఞాపకాలు. తర్వాత ఎప్పుడో టక్ చేయడం మొదలు పెట్టినట్టున్నారు.శిష్యుల్ని కూడా ఏమండీ అనేవారు. అందరి పేరు చివరా గారు మామూలే. క్లాసులో మాస్టారే గాని, క్లాసు బయట గొప్ప స్నేహితుడు. అప్పటికే శిఖామణి నా సీనియర్. మాస్టారితో చనువుగా వుంటూ చెట్టు కింద కూర్చుని మామ్మ దగ్గర టీ తాగేవారు. నెమ్మదిగా నేనూ అలవాటయ్యాను. ఆధునిక కవిత్వాన్ని  స్పెషలైజేషన్ తీసుకుని ఆయనకు మరింత చేరువయ్యాను. పాఠాల సందర్భంగా ఆయన  జీవితానుభవాలు, అనేక విషయాలు, రాజకీయాలపై విమర్శలు, నీతి నియమాలు, నిజాయితీ, నిక్కచ్చితనాలు, ఇలా అనేకం దొర్లేవి. మాస్టారులో ఉన్న అసలు సిసలు ఉత్తమ మానవుడి రూపం కొంచెం కొంచెం నాకు స్పష్టమవుతూ వచ్చింది. అలాగే నేనూ దగ్గరయ్యాను. దేన్నయినా నిర్మొగమాటంగా విమర్శించడం, నచ్చితే అమాంతం కౌగలించుకోవడం, కడుపులో ఏదీ దాచుకోకపోవడం, పకపకా నవ్వడం ఇలాంటివి అనేక మంచి లక్షణాలు మాస్టారి నుంచి నేర్చుకోవాల్సినవి. కానీ అవంత సులువుగా అబ్బే లక్షణాలు కాదు మరి. కవిత్వం ఎప్పుడూ తాజాగా వుండాలని, కొత్తగా వుండాలని, మనకు గొప్ప కవులు లేరని ( శ్రీశ్రీలాంటి వారిని మినహాయించి) అంటూ వుండేవారు.అలాగే ఆయన క్రమక్రమంగా తెలుగు సాహిత్యానికి దూరమై పాశ్చాత్య సాహిత్యాన్నే ఎక్కువగా చదవడంలో నిమగ్నమయ్యారు.

               రాజీతో  నా ప్రేమ వివాహం విషయంలో మాస్టారి సాయం ఎప్పటికీ మర్చిపోలేను. రాజీకి నాకు వివాహానికి కులం,మతం అన్నీ అడ్డు వచ్చాయి. అటూ ఇటూ పెద్దలు ఒప్పుకోలేదు. ఆమె ఇంటి వద్ద వుండగా విషయం పొక్కిపోయింది. అంతే కట్టడి మొదలు. ఒకరోజు బ్యాగు సర్దుకుని విశాఖ వచ్చేసింది. మాస్టారి ఇంట్లో రెండు మూడు నెలలు ఉంది. అప్పుడు మాస్టారి సహచరి, ప్రముఖ వైణికురాలు పద్మిని గారు కన్న తల్లిలా చూసుకుంది. మాస్టారు సరేసరి. ఆ ఇల్లంతా ఒక సోషలిస్టు సమాజంలోని కుటుంబంలా వుండేది. తుమ్మల వేణుగోపాల్ గారు, కృష్ణాబాయి గారు, చలసాని ప్రసాద్ గారు, ఇంటికి వచ్చీపోయే రావిశాస్త్రిలాంటి ప్రముఖులు అంతా ఒక స్వప్నలోకంలా వుండేది. బయటి ప్రపంచంలో అలాంటి వాతావరణం నేనెక్కడా చూడలేదు అంతకు ముందు. అందరూ ఎంతో ఆత్మీయంగా మమ్మల్ని పలకరించేవారు. ఆ పరిచయంతోనే మాస్టారి మామగారు తుమ్మల వేణుగోపాల్ రావుగారు అల్జీమర్స్ వ్యాధికి గురైనప్పుడు ఆయన మీద బతికిన క్షణాలు అని  ఒక కవిత రాశాను. అది ఆంధ్రజ్యోతిలో అచ్చయింది. దాన్ని తర్వాత మో ఇంగ్లీషులోకి  అనువాదం చేశారు.    ఒకరోజు రాజి వాళ్ళ పెద్దన్నయ్య వచ్చి ఇంటికి తీసుకు వెళ్ళిపోయాడు. మీకు పెళ్ళి చేస్తామని అబద్ధం చెప్పి, మాటల కోసం నన్ను నూజివీడు రమ్మన్నారు. మాస్టారు కూడా వచ్చారు. మాటల మధ్య కోపతాపాలు పెరిగాయి. రాజీని కొట్టడం మొదలు పెడితే నేను అడ్డు వెళ్ళాను. నాకూ బాగానే తగిలాయి. మాస్టారు అడ్డం పడ్డారు. ఆయన మొహం చూసి వదిలేశారు. సంవత్సరం గడువు పెట్టారు. ఈ లోగా నో లెటర్స్ అన్నారు. అంతా మరో మరో చరిత్ర సినిమా కథ. మళ్ళీ ఎప్పుడైనా వివరంగా చెప్తాను. మాస్టారు ఆ సమయంలో నన్నెంతో ప్రేమగా ఆదరించి స్నేహంగా ప్రోత్సహించి నాలో ధైర్యాన్ని నింపారు. ఆ కుటుంబం, మాస్టారు లేకపోతే నా పెళ్ళి సాధ్యపడేదే కాదు. నేను మర్చిపోయినా మాస్టారు ఆ విషయాలెప్పటికీ మర్చిపోలేదు. నూజివీడు నుంచి తిరిగి విశాఖ వచ్చినప్పుడు అత్తలూరీ నీకు దెబ్బలు పడలేదా అని పద్మిని గారు ఒకటే ఆటపట్టించారు. ఆ సంగతులన్నీ ఇప్పటికీ కలిసినప్పుడు గుర్తుచేసుకుని నవ్వుకుంటాం.

               నేను బీహారులో ఉద్యోగ రీత్యా ఉన్నప్పుడు అప్పుడప్పుడూ ఉత్తరాలు రాసుకునే వాళ్ళం. మధ్యలో నేనూ మాస్టారూ కొంతకాలం బిజీ అయ్యాం. కానీ ఉత్తరాలు,ఫోన్లు నడుస్తూనే వుండేవి. ఆయన 2006లో రిటైరైన తర్వాత ఎక్కువగా మాట్లాడుకోవడం మొదలు పెట్టాం. మాస్టారు రిటైరైన సందర్భంగా నేను విశాఖ రెండో సముద్రం అని ఒక కవిత రాశాను. అది నా రెండో కవితా సంపుటిలో వుంది. ఆ కవితను మాస్టారు చాలా భద్రంగా దాచుకుని  చాలా మందికి చూపించేవారు. మాస్టారి ద్వారానే నా కవిత్వం కొందరు ప్రముఖుల చేతుల్లోకి  కూడా వెళ్ళింది. శివసాగర్ గారికి మాస్టారే నా ‘ మాట్లాడుకోవాలి పుస్తకాన్ని ఇచ్చారు. ఒకసారి విశాఖ నుంచి శివసాగర్ నాకు ఫోన్ చేసి గంట సేపు మాట్లాడారు. మాస్టారు నన్ను మొహం మీద ఎప్పుడూ మెచ్చుకోలేదు గాని ఎవరి నోటి నుంచైనా నా గురించి విని ఆనందించేవారు. ఫలానా వారు ఇలా అన్నారండీ అని ఫోన్ చేసి మరీ చెప్పేవారు. నా గురించి, శిఖామణి గురించి అప్పుడప్పుడూ మాస్టారు మెచ్చుకోలుగా చెప్తారని ముకుందరామారావు గారు మొన్న అన్నారు.

        ఆయన ఎవరినీ అంత తేలిగ్గా మెచ్చుకోరు. నచ్చని చిన్న పని చేసినా వారెంతటి వారైనా అగ్గి కురిపించాల్సిందే. అందుకే ఆయనకు  కొందరు దూరమయ్యారు. నా అరవయ్యవ పుట్టినరోజు,01.08.19న సాహితీ మిత్రులతో ఒక గేదరింగ్  పెట్టాను. ఆయనకు సభలంటే గిట్టదని ముందు చెప్పలేదు. ఒక రోజు ముందు చెప్పాను. భలే వారే నేను రాకుండా ఎలా వుంటానని హుటాహుటిన వచ్చేశారు. వచ్చి చివరలో కూర్చుంటానని మొండి పట్టుపట్టారు. కాదు మీరు వేదిక మీద కూర్చోవాలి అని నేను పట్టు. అప్పుడు సభలాంటిది కాదు గానీ కేవలం నా సెలెక్టెడ్ పోయెమ్స్, నా మీద ప్రముఖులు రాసిన ముఖ్యమైన వ్యాసాలతో ఒక పుస్తకం, నా తొలి కథాసంపుటిని పెద్దల చేతుల మీదుగా ఆవిష్కరింపజేశాను. ప్రశంసలు, ప్రసంగాలూ మాత్రం వద్దనుకున్నాను. కేవలం నా పుట్టిన రోజు అభినందనలు మాత్రమే. సభ నడిపిన మా అమ్మాయి అలా ఆంక్షలు ముందే పెట్టింది. మొత్తానికి మాస్టారు వేదిక మీద కూర్చున్నారు. అందరితో పాటూ తానూ అభినందించే టైమ్ వచ్చింది. తాను ఏమీ నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడకుండా పాబ్లో నెరుడా కవిత ఒకటి చదివి కూర్చున్నారు. You start dying slowly అని మొదలవుతుంది ఆ కవిత. అదే మాస్టారు నాకిచ్చిన సందేశం అని దాన్ని నేనే తెలుగులో అనువదించి ఆయనకు పంపితే సంతోషించారు. You start dying slowly ,If you do not travel. If you do not read,If you do not listen to the sounds of life, If you do not appreciate yourself you start dying slowly అంటూ అద్భుతంగా సాగుతుంది ఆ కవిత. తర్వాత సభానంతర సభలో పద్యాలూ రాగాలూ పాటలూ ఆ కోలాహలం అంతా చూశారు. రెండు రోజుల తర్వాత ఇంకా ముసలి జంబూకాలనే వేదికల మీద ఎందుకు కూర్చోబెడతారండీ అని మొట్టికాయలు వేశారు.

అవార్డులూ సత్కారాలు సన్మానాల ముందు మాటలూ పనికిరాని పాచి ప్రసంగాలూ పాచి రాతలూ ఆయనకు గిట్టవు. వాటి కోసం పాకులాడే పెద్దల గుడ్డలూడదీసే వ్యాసాలు రాశారు కథల్లాగా. గత నలభై ఏభైఏళ్లుగా తాను చూస్తున్న అసహ్యకర సాహితీ వాతారణాన్ని అంతా నిరసిస్తూ తన వెటకారాన్నీ వ్యంగ్యాన్నీ జోడిస్తూ ఇటీవలనే ఆయన సరస్వతీ బజారు అనే పుస్తకాన్ని వదిలారు. అది చదివితే సాహితీలోకంలో వుంటున్న వారంతా కొద్దోగొప్పో  భుజాలు తడుముకోవలసిందే. కొందరైతే పేర్లుండవు కాబట్టి బతికిపోయారు. పెద్దపెద్ద తలకాయలు సిగ్గుతో చితికిపోయేవి. అభ్యంతరం చెప్పే విషయంలో నన్నూ శిఖామణినీ కూడా శిష్యులని వదిలిపెట్టలేదు.

     కులం మతం వర్గం అనే విషయాల్లో ఆయనకు చాలా ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. కులాధిపత్య వ్యతిరేక పోరాటం పట్ల సానుకూలత చూపారు. ఆధిపత్యకులాల వారి అహంకారాన్ని నిరసించారు. కొద్దిగా కుల వాసన తగిలిందంటే చాలు పక్కన పెట్టేసేవారు. ఎవరో ఇద్దరు మిత్రులు ఒకసారి మనకులం అదీ ఇదీ అన్నందుకు వారిని జీవితంలో తిరిగి చూడలేదు. ఆధిపత్య కులాల వారు కులసంఘాలు  పెడితే దుర్మార్గం  అంటారు. అందుకు ఆయన ప్రాణ మిత్రులనే వదులుకున్నారు. మద్దూరి నగేష్ బాబు కవిత్వం చూసి మాస్టారు పొంగిపోయి అతనికి ప్రేమ లేఖ రాశారు. దాన్ని నగేష్ తన వెలివాడలో ముందు వేసుకున్నాడు. ఇటీవల సోలోమోన్ విజయకుమార్ మునికాంతపల్లి కతలు పుస్తకం గురించి నేను చెప్తే, తెప్పించుకుని అనేక సార్లు ఫోన్ లో ఆ కతలు ప్రస్తావించి ఒకటే మెచ్చుకున్నారు. ఆయనకు నచ్చాలంతే. తెలుగులో వెల్చేరు నారాయణ రావు రాసిన విమర్శ గ్రంథమంటే ప్రాణప్రదం. తిలక్ మీద మీ పరిశోధన గ్రంథాన్ని ఎందుకు ప్రచురించలేదంటే తెలుగులో విప్లవాల స్వరూపం అనే వెల్చేరు గ్రంథాన్ని చదివాక రాస్తే అలా రాయాలండీ అందుకే వదిలేశాను అన్నారు. లక్ష్మీనరసయ్య కవితా నిర్మాణ పద్ధతులు వంటి పుస్తకాలంటే కూడా  ఆయనకు ఇష్టం. లక్ష్మీనరసయ్యను చాలాసార్లు నాదగ్గర మెచ్చుకున్నారు. గత ఆరేడేళ్లుగా మాస్టారూ నేనూ చాలా  ఎక్కువగా మాట్లాడుకున్నాం. గొప్ప గొప్ప  పుస్తకాలు ఆయన నాకు  పరిచయం చేశారు. కొన్ని స్వయంగా పంపారు.  కొన్నింటి మీద నేను రివ్వూ లు కూడా రాశాను. మాస్టారు ఏం చదువుతున్నారు అని తెలుసుకున్నాక ఆయన ఎటువంటి వాటికి పొంగిపోతారు, ఎటువంటి వాటిని చీదరించుకుంటారు అర్థం చేసుకున్నాను.

మంచినే వెదుక్కుంటూ ఆయన వెళ్ళారు పుస్తకాల్లో. చెత్తను చదవడమే మానేశాడు. ఇది నేను ఆయన నుంచి నేర్చుకున్నాను.  చివరి సంవత్సరాలలో ఆయన వద్దకు తరచూ నా ప్రయాణాలుండేవి. పద్మిని గారు అనారోగ్యంగా ఉన్నప్పుడు కొన్నిసార్లు  వెళ్లాను. కృష్ణాబాయిగారు, కొడుకు రాహుల్, కోడలు కీర్తి, కూతురు  అజంతాలను కూడా దగ్గరగా చూశాను. కాంతివంతమైన వ్యక్తిత్వంలో  అందరూ ఒకే మూసలో ఉంటారు. ప్రజాస్వామికంగా చర్చలు, నిరసనలూ మామూలే. బయట నుంచి వచ్చిన కోడలు కీర్తి కూడా ఆ కుటుంబం కోసమే ప్రత్యేకంగా తయారుకాబడిందా అనిపిస్తుంది. ఆయన ఆమెను మెత్తని వెలుగు అనేవారు. అంతే మెత్తని మానవి ఆమె.  అందుకే ఆయన చివరి కోరికను మన్నించి కూతురూ కోడలూ మా చివరి కోరికను నిర్దాక్షిణ్యంగా పక్కన పెట్టారు.

      ఆయన రిటైరయ్యాక వచ్చిన బెనిఫిట్లన్నీ పేద విద్యార్థుల చదువుకోసం వినియోగిస్తానంటే ఇంట్లో ఎవరూ అభ్యంతరం  చెప్పలేదు. ఆయన సాయంతో ఎందరో పెద్ద చదువులు పూర్తి చేసుకుని మంచి మంచి ఉద్యోగాల్లో వున్నారు. వాళ్ళు మాస్టారిని కలుసుకుంటానికి వస్తుంటారు. ఆ విషయం మా రాజీని ఎంతో కదిలించింది. అప్పటి నుండీ రాజీ కూడా కొందరు విద్యార్థులకు నిరంతరం సాయం చేయడం  మొదలుపెట్టింది. జీవితాన్ని బోధించారు. విలువలు నేర్పారు. సంపదలు, ఆడంబరాలకు వ్యతిరేకంగా బతికారు. క్యాన్సర్ డిటెక్టయిన తర్వాత మాత్రం ఇక ఈ ప్రపంచంతో నా పని అయిపోయిందనుకున్నారు. మౌనంలోకి వెళ్లిపోయారు.

పద్మిని గారు నవ్వుతూ పాటలు పాడుతూ అందరినీ కలిసి వెళ్ళిపోయింది. మాస్టారు మాత్రం నిశ్శబ్దంగా వెళ్ళాలనుకున్నారు. చివరగా ఒక మెసేజ్ ఆయనకు కోడలు ద్వారా పంపాను. ‘’మాస్టారూ  మోరీతో మంగళవారాలు  అనువదించారు కదా, మోరీ చివరి రోజుల్లో తన శిష్యుడికి ఇచ్చిన అవకాశం నాకెందుకు మీరివ్వకూడదు?’’ అని. అది విని ఆయన నవ్వకున్నారంట అంతే. ఆయన ఈ మధ్య తన పుస్తకాలన్నీ వేటపాలెం లైబ్రరీకి ఇచ్చి కొన్ని పుస్తకాలు నాకోసం ఉంచానని చెప్పారు. మా రాజీ రిటైర్మెంటు ఫంక్షన్ కి  రావాలని ఆయనకు బలంగా వుంది. కరోనా కారణంగా రాలేకపోయారు. తన కోసం ఒక చీర కొన్నారట. ఎలా ఇవ్వాలా అని ఫోన్ చేసినప్పుడల్లా ఒకటే ఆత్రం పడేవారు.  అయితే మేం కూడా మీకు బట్టలు తీసుకువస్తాము అని అంటే అలాంటివి నాకిష్టం వుండవు కదా అన్నారు. మరి మాకెందుకు అంటే, అది నా ముచ్చట లెండీ అని నవ్వేశారు. బతికిన క్షణాలు, ఆయనతో గడిపిన క్షణాలే గొప్పవి.

మా మాస్టారు లేకుంటే ఏమైంది, ఆయన నేర్పిన బతుకుందిగా, అలా ఆయన మాతోనే వుంటారనుకుంటున్నా. చివరి రోజుల వరకూ దశాబ్దాలుగా ఆయన,  నేనే కాదు, నాలాంటి చాలా మంది శిష్యులతో నిరంతరం టచ్ లోనే వున్నారు. నిరసన కవిగా ఆయన్ని ఇప్పుడంతా చెప్తున్నారు నిజమే నిరసన ఆయన నిలువెల్లా  వుంది. కానీ అంతకు మించి మానవత్వం సరసన నిలిచే మానవీయ మహోపాధ్యాయుడుగా శిష్యులందరికీ ఎప్పటికీ గుండెల్లో నిలిచిపోతారు. చెప్పాలంటే చాలా విషయాలున్నాయి. పూర్తిగా  ఆయన గురించి ఎప్పటికైనా రాస్తాను.

*

ప్రసాద మూర్తి

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గుండె తడిసిపోయింది ప్రసాదమూర్తి గారూ . మీ అంత కాకపోయినా నాకూ వారి కుటుంబంతో కొంత అనుబంధం ఉంది. నేనెరిగిన అతి తక్కుక మాట్లాడే అతి తక్కువ మందిలో అతడొకరు .

  • అక్షరాల మనసుతో నివాళి అంటే ఇంతేనేమో .,
    ప్రసాద మూర్తి గారూ – గిజుభాయ్ చిన్నారి పుస్తకానికి ముందు మాట రాసిన అత్తలూరి గారిని దాదాపుగా 20 ఏళ్ల క్రితం మొదటి సారి కలిశాను .,
    నాకు చాలా చాలా ఇష్టమైన పదాలు అవి ….
    తర్వాత రెండు సార్లు కలిసి మాట్లాడుకున్నాం .,
    మోరీతో మంగళవారాలు ., సరస్వతీ బజార్ – చాలా మంది మిత్రులకు ఇచ్చి చదివించడం – –
    ఇవన్నీ ఇవాళ గత జ్ఞాపకాల్లోకి అనుకుంటే …..
    చాలా కష్టంగా ఉంది .,

  • నాకు వీరు తెలీదు కానీ ఎంత మహోన్నతమైన మనిషి 🙏. వారి జ్ఞాపకాలను పంచి కళ్ళు తడి చేసారు. ఆ నెరుడా కవిత అనువాదం వుంటే పంచుకుంటారా…

  • ఒక ఉదాత్తమైన మానవుని ప్రయాణం…
    ధన్యవాదాలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు