ఆయనొక విప్లవ తపస్వి

నిద్రాణ నిశీథిని మానిసి మేల్కాంచినాడు

ఒళ్లు విరిచి కళ్లు తెరిచి ఓహో అని లేచినాడు

కటిక చీకటుల చిమ్మెడు కారడవిని పయనించు

నిజ జఠరాగ్ని జ్వాలలు నింగినంత లేపినాడు

ఈ కవితను రాసిన వ్యక్తి ఎవరో కాదు మాజీ ప్రధాని  పి.వి. నరసింహారావు. 1972 ఆగస్టు 15న స్వాతంత్ర్య రజతోత్సవాల సందర్భంగా  అర్థరాత్రి ఆంధ్రప్రదేశ్  ముఖ్యమంత్రిగా  ఆయన అసెంబ్లీలో చేసిన కవితాగానమిది.

ఇదొక సుదీర్ఘ కవిత. అర్థరాత్రి స్వరాజ్యం  వచ్చినప్పుడు నిద్ర లేచిన భారతీయుడి హృదయ గానం.

ఆ మేల్కొన్న మనిషి ఎవరు?

యుగయుగాల అన్యాయం నగుమోముల దిగమ్రింగగ

సాంధ్యారుణ రౌద్ర క్షితిజ ముఖుడై చెలంగినాడు.

వాడొక విప్లవ తపస్వి

పి.వి. వర్ణించిన భారతీయుడు సామాన్యుడని, ఆకలితో దహించుకుపోతున్నాడని, అన్యాయాన్ని సహించలేక రుద్ర రూపం దాల్చిన విప్లవ తపస్వి అని స్పష్ఠంగా అర్థమవుతుంది. ఎక్కడ విప్లవం, ఎక్కడ తపస్సు.. విప్లవ తపస్వి అనేదే ఒక విరోధాభాస.

ఆ సామాన్యుడిది ‘మోడువడిన కాయం. బువ్వకు నోచని జనగణముల వెతల బరువు మోసిన వాడు.’. అని పి.వి. ఆ కవితలోనే స్పష్టం చేశారు.

స్వాతంత్రం  వచ్చి 25 సంవత్సరాలైనప్పటికీ  ఆ సామాన్యుడికి న్యాయం జరిగిందా? లేదు అని పి.వి. స్పష్టం చేశారు. దేశ విభజననూ విమర్శించారు.

పావు శతాబ్దము పొడుగున పాలకులు, అర్భకుల మధ్య

విభజన వికృతమై పోవగ, బావురుమనే జీవితాలు..

అటు సమృద్ది, ఇటు దైన్యము

అటు పెంపు, ఇటు హైన్యము

ఒకరు మింటికెగర, అసంఖ్యాకులింకిరి భూతలమున..

ధర్మకర్తలే ధన కర్తలుగా మారిపోయినారు..

ఒక ముఖ్యమంత్రిగా ఉంటూ మన పాలకులను విమర్శించడం ఎంత ధైర్యం? మన దేశ విభజనే వికృతం అయిందనే సాహసం ఎలా వచ్చింది? సంపద కొందరి చేతుల్లో ఉండిపోతే అసంఖ్యాకులు అణగారిపోయారు. ప్రజల బతుకులకు హామీ ఉండాల్సిన పాలకులు తామే సొమ్ము చేసుకున్నారని చెప్పడంతోనే ఆయన ఎంత అంతరాంతరాల్లో ఆవేదన చెందారో అర్థమవుతుంది.

ఇప్పటికైనా పరిస్థితి మారుతుందా? లేక ఎడారిలో నీటికోసం అన్వేషణలా మారుతుందా? అని ఆయన ప్రశ్నించారు. .

ఈ నిద్రాణ నిశీథిని

ఈ నీరవ వాయుతరంగిణిలో ఒరపిడివడి

దొర్లిన భావ విస్ఫులింగములు వెలుగులు నిచ్చునా?

అటులని విశ్వసించునా పథికుడు?

మృగతృష్ణ జలమును జలమని నమ్మి చనిన ఆ చిర పిపాసి

శీతోదక సేవనమున సేద దీరునా నేటికి?

తనవి భావ విస్ఫులింగములని ఆయన స్పష్టీకరించారు. భూమి దానవ గ్రహమైపోతోందని బాధపడ్డారు. చివరకు అద్భుతమైన ఆశావహ వాక్కులతో ఆయన కవిత ముగుస్తుంది.తనను తానొక చైతన్య ప్రవాహం అని ఆయన చెప్పుకున్నారు.

చిన్న అలకు ఒడ్డు దూరమున్నదన్న చింత ఏల?

జీవితాత్మకు ఎన్నడు బ్రహ్మము

చేరుదునన్న సందియమేల?

నేనొక చైతన్యోర్మిని

నిస్తుల ప్రగతి శకలమును

ఈ నిద్రాణ నిశీతి మహిత జాగృతి పుంజముగ

వెలుగుటయే నా తపస్సు

వెలిగించుట నా ప్రతిజ్ఞ!

పి.వి. నరసింహారావుకు పాండిత్యం, భాషాపరిజ్ఞానంతో సరిసమానంగా చైతన్యవంతమైన, కవికి అవసరమైన భావోద్వేగాలున్నాయని ఈ ఒక్క కవిత చదివితే అర్థమవుతుంది. బహుశా ఆ భావోద్వేగంతో ఆయన ఆంధ్రప్రదేశ్ లో భూసంస్కరణలు ప్రవేశపెట్టినందుకే ముఖ్యమంత్రి పదవి కోల్పోయినట్లనిపిస్తుంది.

చాలా కాలం తర్వాత తాను  ప్రధానమంత్రి  పదవిలో ఉన్నప్పుడు పి.వి.కి తాను రాసిన కవిత గుర్తుకు వచ్చినట్లుంది. అసెంబ్లీలో పనిచేసిన నగ్నముని (కేశవరావు)కు ఒక రోజు పి.వి. ఓఎస్డీ ఎవిఆర్ కృష్ణమూర్తి నుంచి ఫోన్ వచ్చింది. ‘1972 ఆగస్టు 15న అర్థరాత్రి పి.వి.గారు చదివిన కవిత కాపీ దొరుకుతుందా?’ అని .. నగ్నముని అసెంబ్లీ రికార్డులు అంతా వెతికారు కాని దొరకలేదు. చివరకు ఆ రోజుల్లో వచ్చే ఆంధ్ర జనత పత్రికలో ఈ కాపీ సంపాదించి పి.వి.కి పంపించారు. ఈ విషయం నగ్నముని నాకు తర్వాత రోజుల్లో చెప్పారు.

పి.వి. రాజకీయనాయకుడైనప్పటికీ ఆయన జీవితం లో సాహిత్యం అంతర్లీనంగా ప్రవహిస్తూ వచ్చింది. ఆయన కాలంలో రకరకాల సామాజిక ధోరణులు ఆయనను ప్రభావితం చేశాయి. 1950వ దశకంలో  విశ్వనాథ సాహిత్యం, సంప్రదాయ ధోరణులు ఒకవైపు, సామ్యవాద సాంగత్యం మరో వైపు ఉన్న రోజులవి.  పి.వి. పాములపర్తి సదాశివరావు కలిసి కాకతీయ అనే పత్రిక నడిపేవారు.   వరంగల్ లో తెలంగాణతాత్విక కవిగా గుర్తింపు పొందిన గార్లపాటి రాఘవరెడ్డి హిందీ కవిత్వంలోని మార్మిక ఛాయావాదాన్ని  వారికి  పరిచయం చేశారు.  సాంస్కృతిక సామ్రాజ్యవాదం మీద పోరాడినందుకే విశ్వనాథ ఆయనకు నచ్చి ఆయన వేయిపడగలు నవలను హిందీలో అనువదించారని ఆయన అభిమానులు అంటారు.

రాజకీయనాయకుడుగా తన చుట్టూ ఉన్న దుర్మార్గాలను చూసిన పి.వి. లో ప్రతిఘటనా స్వరం అడుగడుగునా కనిపిస్తుంది.  ‘అల్ల కర్ణాట కరాట కీచకులకు అమ్మ త్రిశుద్దిగ నమ్ము భారతీ..’ అని చెప్పిన పోతన,  ధిక్కార స్వరాల్ని వినిపించిన కాళోజీ నారాయణ రావు, దాశరథిలను అభిమానించారు. విదేశాంగ మంత్రిగా ఉన్నపుడు ఆయన 1982 మార్చిలో  వరంగల్ లో జరిగిన పోతన  భాగవత పంచశతి ఉత్సవాల నిర్వహణకు చేయూత నిచ్చారు.  చరిత్ర గురించి చైతన్యం ఉండాలంటూ రాజులను గౌరవించే కాలంలోనే పోతన వారిని అథములని నిరూపించాడనీ, ఆ నిరసన భావం అలవాటుగా ఓరుగల్లు మిగిలి ఉందనీ, కాళోజీ, దాశరథి ఇందుకు ఉదాహరణ’ అని ఆయనఈ సందర్భంగా అన్నారు.   ఢిల్లీకి వెళ్లినా ఆయన కాళోజీని, ఆయన కవితల్ని మరిచిపోలేదు. పారిశ్రామిక వేత్తల సమావేశంలో ప్రసంగించినా కాళోజీ కవితలను ఉటంకించారు. కాళోజీకి పద్మభూషణ్ పురస్కారాన్నిచ్చి తన అభీష్టాన్ని తీర్చుకున్నారు.

పి.వి. రచనలు లోపలి మనిషి (ఇన్ సైడర్), గొల్లరామవ్వ, మంగయ్య అదృష్టం మూడూ సామాజిక,రాజకీయ పరిణామాలపై విశ్లేషణలే. గొల్ల రామవ్వ నిజాం వ్యతిరేక పోరాటంలో వీరుడికి ఆశ్రయం ఇచ్చిన ఒక దేశభక్తురాలి కథ. సామాన్యుల భాగస్వామ్యం లేకపోతే ఏ విప్లవమూ జరగదని ఈ కథ స్పష్టమైన సందేశం ఇస్తుంది. తాను ఆశ్రయమిచ్చిన యువకుడు ఇద్దర్ని చంపాడని తెలుసుకున్న ముసలవ్వ ఇంకా ఇద్దరు మిగిలారని వ్యాఖ్యానించడం పి.వి. లో ఉన్న విప్లవభావజాలానికి నిదర్శనం. నిజాం వ్యతిరేక పోరాటంలో పాల్గొన్న అనుభవం ఉన్న పి.వి.  సామాన్య ప్రజల మనోభావాల్ని అద్భుతమైన శైలిలో అభివర్ణించారు. ఆయన నవల ‘లోపలి మనిషి’ 1950 నుంచి1980లో జరిగిన భారత దేశ సాంఘిక, రాజకీయ, ఆర్థిక పరిణామాల్ని చిత్రించింది. అవకాశ వాద రాజకీయాలు, పదవులకోసం కుట్రలు, వెన్నుపోట్లు, ప్రజల డబ్బుల్ని స్వాహా చేయడం, ఒక నిజాయితీ గల వ్యక్తిలో జరిగిన అంతర్మధనం, అంతర్గత తిరుగుబాటు ఇందులో కనిపిస్తుంది.  ముఖ్యమంత్రులు ఢిల్లీ పీఠం ముందు సామంతరాజులయిపోయారన్న ఆవేదనా కనిపిస్తుంది.

‘మనం ప్రాచీన పదజాలం నుంచి శబ్దాల్ని మాత్రమే తీసుకున్నామనుకుంటాం. కాని మాటలతో పాటు వాటి ఆలోచనలు కూడా మనలో ప్రవహిస్తుంటాయి. ఆ విధంగా రాచరికం, రాజుగారి పట్ల భక్తి  విధేయతలు సామూహిక చేతనలో జీర్ణించుకుపోతాయి..’  అని లోపలి మనిషిలో పి.వి. చేసిన వ్యాఖ్యల గూడార్థం ప్రగాఢమైనది. మన భారత దేశం ఇప్పుడా భావదాస్య క్రమంలోనే ప్రయాణిస్తుట్లనిపిస్తుంది.

విదేశాంగమంత్రిగా ఉన్నప్పుడు ఆయన అనేక సందర్భాల్లో భారత దేశ సాంస్కృతిక ఔన్నత్యం గురించి అద్భుతమైన ఉదాహరణలతో  వివరించారు.  కాల్పనివాద యుగం నుంచి పశ్చిమ యూరప్ పై భారత దేశ సాంస్కృతిక ప్రభావం, కాళిదాసు రచించిన అభిజ్ఞాన శాకుంతలం, మేఘ సందేశం లో కవితాత్మ,  నీషే, దాస్తోవిస్కీ, టిఎస్ ఇలియట్, హెచ్ జి  వెల్స్ లంటి వారిపై ప్రాచీన భారత కవిత్వం ప్రభావం గురించి  అనర్గళంగా ప్రసంగించారు.

హిందీ సాహితీవేత్తల్లో ప్రేమ్ చంద్, మహదేవి వర్మ ఆయనకు ఎంతో ఇష్టులు. ప్రేమ్ చంద్ నేటికీ ఒక సామాజిక అవసరంగా ఆయన అభివర్ణించారు.  మహాదేవి వర్మకు జ్ఞానపీఠ ప్రదానం చేసినప్పుడు ఆయన ఆమె మార్మిక  కవితల్ని ఉటంకిస్తూ ఆ వెల్లువలో తానే కొట్టుకుపోయారు. ఆమె ఛాయావాద కవితల్లో మార్మికత గురించి వివరించారు. ఆమె కవిత్వం తనలో అనిశ్చితత్వాన్ని దూరం చేసిందన్నారు.  ‘మూగవాడు మిఠాయి తిన్నట్లు కొందరికి అనుభూతి ఉన్నా అభివ్యక్తి సామర్థ్యం ఉండదు’. అన్నారు.  పంజాబీ కవయిత్రి అమృతా ప్రీతమ్ కు జ్ఞానపీఠ పురస్కారాన్ని  ప్రదానం చేస్తూ ఆమె అద్భుత కవితల్ని ఉటంకించారు.  యు. ఆర్ అనంతమూర్తికి జ్ఞానపీఠ పురస్కారం ప్రదానం చేసినప్పుడు కన్నడ సాహిత్య గొప్పతనం గురించి, యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అనువాద నవల ‘యయాతి’ను ఆవిష్కరించినప్పుడు మరాఠీ సాహిత్య వైశిష్ట్యం గురించి అమోఘంగా వివరించారు..

‘దక్షిణాదిన సూఫీతత్వం ఎందుకు కనపడదు? ఒక ఉద్యమంగా ఎందుకు వ్రేళ్లూనుకోలేదు? ఛాయావాదం ఛాయలు దక్షిణాదిలో ఏవీ ’ అని కూడా కెఎం జార్జి సంపాదకత్వంలో వెలువడిన ఆధునిక సాహిత్య సంకలనం ఆవిష్కరణలో ప్రశ్నించారు.   కబీర్ కూ వేమనకూ ఎంతో తేడా ఉన్నదని చెప్పారు.

‘సాహిత్యం గీతం నుంచి పద్యం వైపు, కావ్యం నుంచి గద్యం వైపు, జనసాధారణం నుంచి వరిష్టులవైపు పయనించింది. ‘ అని ఆయన యార్లగడ్డ రచించిన హిందీ సాహిత్య చరిత్రకు రచించిన ముందుమాటలో అన్నారు.  సూఫీతత్వం కేవలం ఖురాన్ నుంచే జన్మించిందని ఇస్లాం విద్వాంసులు సైద్దాంతీకరించినప్పటికీ, భారత దేశం చేరిన తర్వాత దానికో నూతన స్వరూపం ఏర్పడిందని పి.వి. విశ్లేషించారు.

మరాఠీ నుంచి ‘పి.వి. పన్ లక్షత్ కోన్ ఘెటో’ నవలను అబల జీవితం పేరుతో అనువదించారు. దీన్ని కేంద్ర సాహిత్య అకాడమీ ప్రచురించింది. సమాజంలోని మూఢాచారాలు, బాల్య వివాహాల వల్ల చిన్నప్పటి నుంచీ మరణించే దాకా అడుగడుగున ఘర్షణలు పడుతూ, హింసను ఎదుర్కొన్న యమున అన్న స్త్రీ విషాద జీవిత గాథ ఇది. ఈ నవల ను చదివిన వారెవరైనా చలించకుండా ఉండలేరు. పి.వి. కూడా చలించినందువల్లే దాన్ని అనువదించాలని నిర్ణయించి ఉంటారు.స్పానిష్ నవలా రచయిత గాబ్రియెల్ గార్షియా మార్క్వెజ్ రచించిన వన్ హండ్రెడ్ ఇయర్స్ ఆఫ్ సాలిట్యూడ్ ను ఇంగ్లీషులో చదివి పి.వి. దాని స్పానిష్ మూలాన్ని తెప్పించుకుని చదివారు. ఆ తర్వాత మార్క్వెజ్ రచించిన లవ్ ఇన్ ద టైమ్ ఆఫ్ కలరా కూడా చదివారు.’ఇంగ్లీషులో కన్నా స్పానిష్ భాషలో చదివితే ఇంకా మంత్రముగ్దులమైపోతాం..’ అన్నారు.

కవి, నవలా రచయిత, కథా రచయిత, అనువాదకుడు, సాహితీ విమర్శకుడు, బహుభాషా కోవిదుడు  అయిన పి.వి. నరసింహారావు కు సమయం ఉంటే ఇంకా ఎన్నో రచనలు చేసి ఉండేవారు.

( ఈ నెల 27న ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు చేతుల మీదుగా ఆవిష్కృతమైన  ‘పీవీ –విప్లవ తపస్వి’

పుస్తకంలోంచి) 

కృష్ణుడు

వారం వారం ఆంధ్రజ్యోతి దినపత్రికలో ఢిల్లీ నుంచి కాలమ్ రాసే ఎ. కృష్ణారావు, అడపా దడపా కవితలు రాసే కృష్ణుడూ ఒకరే. జర్నలిస్టుగా 34 సంవత్సరాల అనుభవం ఉన్న కృష్ణుడు కవి, సాహితీ విమర్శకుడు కూడా. ఇండియాగేట్, నడుస్తున్న హీన చరిత్ర పేరుతో రాజకీయ వ్యాసాల సంకలనాలు వెలువరించిన కృష్ణుడు ఇంకెవరు, ఉన్నట్లుండి, ఆకాశం కోల్పోయిన పక్షి అనే కవితా సంకలనాలను వెలువరించారు.

5 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సాంఘీక సంక్షేమ రంగంలో చిత్తశుద్ధి, నిజాయితీ కలిగిన అధికారులుగా పేరున్న,
    యుగంధర్, కేఆర్ వేణుగోపాల్, ఎస్ ఆర్ శంకరన్ లాంటి అధికారులకు సమిచిత స్తానం ఇచ్చిన నాయకుడు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు