నా పరిచయాలు చాలా మటుకు బెజవాడతోనే మొదలవుతాయి. నిజానికి శ్రీరమణ గారి కలయిక కూడా అక్కడే మొదలవ్వాలి. కాకపోతే, కొంచెం వెనక్కి వెళ్ళాలి ఖమ్మం దాకా-
ఆంధ్రజ్యోతిలో ఇంకా చేరకముందే శ్రీరమణకి సంబంధించిన పుక్కిటి “పురాణా”లు (పురాణం గారి ద్వారా ప్రసారమయ్యే అనేక రకాల విషయాలకు నేనే ఆ పేరు పెట్టాను సరదాగా!) ఖమ్మందాకా చేరాయి 1980 ల ప్రాంతంలో- అప్పటికి ఆంధ్రజ్యోతిలో శ్రీరమణ పేరడీలూ, హాస్య విన్యాసాలూ మా రోజువారీ కబుర్లలో గిరికీలు కొడుతున్నాయి. శ్రీరమణ పదాలూ, వాక్యాలూ కొన్ని బట్టీ కొట్టేసి, మేం ఖమ్మం వీధుల్లో షికార్లు కొట్టేవాళ్లం. అప్పుడప్పుడూ బెజవాడ వచ్చినప్పుడు శ్రీరమణ కథలు ఇంకొన్ని విని, ఆయన విన్యాసాల గ్లామర్ పెరిగేది.
ఆంధ్రజ్యోతిలో చేరకముందే వారపత్రికలో నాచేత ఏదో వొకటి రాయించేవాళ్లు పురాణంగారు. అట్లా, అనుకోకుండా వొక సారి ఆయన ఆఫీసులో కూర్చున్నప్పుడు వొక పుస్తకం తీసి, “ఇది మీరు కంఠతా పట్టేయ్యాలి!” అన్నారు. ఆవిధమ్ముగా శ్రీరమణ బెజవాడ రోజుల కంటే నాలుగేళ్ళు ముందే నాలోకంలోకి నవ్వుల పల్లకీ కట్టుకొని వచ్చేశారు.
అప్పటికి సాహిత్యం అంటే మా అందరికీ సూపర్ సీరియస్ వ్యవహారం. ఖమ్మం రాజకీయ సాంప్రదాయంలో సాహిత్యాన్ని ఆయుధంగా మాత్రమే కొలిచే నిబద్ధత మా సొంతం. రాజీపడితే శ్రీశ్రీనైనా, చెరబండరాజునైనా రవంత క్షమించలేని కఠినం మా మార్గం. అసలు సిసలు కవిత్వాన్ని గురించి ఇస్మాయిల్ గారితో హోరాహోరీ పోరాడుతున్న కాలం. అప్పుడు శ్రీరమణ రాక నిజంగా బోలెడు రిలీఫ్. చలం, శ్రీశ్రీ, కృష్ణశాస్త్రి సరే, అప్పటికే విశ్వనాథ, రావిశాస్త్రి, ముళ్ళపూడి, సంజీవదేవ్, వేగుంట మోహన ప్రసాద్ లాంటి వాళ్ళ వచన శైలి మీద ప్రత్యేకమైన ఇష్టమేదో వుండేది కాబట్టి, వాళ్ళ వచనాలని సరదాగా ఆటపట్టించే శ్రీరమణ మీదా ఇష్టం వుండేది.
మోహన ప్రసాద్ గారు ఆ రోజుల్లో రెండు రకాల వచన రచయితల్ని గురించి చెప్పేవారు- చక్కగా చెప్పే వాళ్ళు, తిక్కగా చెప్పే వాళ్ళు. ఈ తిక్కగా చెప్పే వాళ్ళ మీద మాకు మరీ ఎక్కువ ఇష్టమే వుండేది. కాబట్టి, శ్రీరమణ తిక్కని వాక్యాలు తిన్నగా మా కబుర్లలోకి వచ్చేసేవి. విపరీతంగా నచ్చేసేవి. పురాణం గారు అన్నంత యమా సీరియస్సుగా కాదు కానీ, కొంచెం కంఠతా పట్టే అలవాటూ వుండేది.
శ్రీరమణ గారిని వ్యక్తిగతంగా కలవడం మాత్రం ఆంధ్రజ్యోతిలోనే- అంటే 1984 ప్రాంతాల్లో అనుకుంటే- మా స్నేహానికి కొన్ని దశాబ్దాలు ఎప్పుడో నిండిపోయి వుండాలి. ఆంధ్రజ్యోతి దినపత్రికలో నాకు ఎడిట్ పేజీ, ఆదివారం అనుబంధం అప్పజెప్పిన కొత్తలో చాలా మందితో రాయించడం వొక ఎత్తు అయితే, రకరకాల శైలీ విన్యాసాలుండే రచనలు ఉత్పత్తి చేయాలనే వొత్తిడి ఇంకో ఎత్తు. దేవీప్రియ గారు ఇంకా జ్యోతిలోకి రాకముందూ, ఇంకా చెప్పాలంటే రన్నింగ్ కామెంటరీలాంటివి కొత్త వొరవడిగా ఏర్పడకముందే అలాంటివి రాయించాలని ఆంధ్రజ్యోతిలో వొక ప్రయత్నం జరిగింది.
అట్లా వరసగా రాస్తున్న కాలంలో శ్రీరమణ గారు ఆంధ్రజ్యోతి ఆఫీసుకి రావడమూ,ఆ సాయంత్రం మేం నవోదయ బుక్ హౌస్ లో కలవడమూ – అక్కడితో కబుర్లు ఆపడం ఇష్టం లేక బీసెంటు రోడ్డులో నడుచుకుంటూ వెళ్లడమూ—అదీ ఆయనతో నా మొదటి కలయిక. రచనలకు సంబంధించిన కిటుకులు చెప్పడంలో ఆయన దిట్ట. అదేమీ పెద్ద రహస్యమనే ఫీలింగ్ తో కాకుండా చాలా అలవోకగా చెప్తూ వెళ్ళడం ఆయన శైలి.
ఆయన అప్పటికే ఆంధ్రజ్యోతి లో నా సటైర్లు చదివి వున్నారు. చాలా నిక్కచ్చిగా వొకే మాట ఆయన గుండెలోంచి పెల్లుబికినట్టు వచ్చింది . “ఈ పత్రికా రచన అనే వ్యామోహంలో పడకండి అస్సలు! మీలోపల సృజనాత్మకత ఏ కాస్త వున్నా, అది కొడిగట్టిపోతుంది” అన్నారు. అంత నిర్మొహమాటంగా అప్పటివరకూ ఎవరూ నాతో వొక్క మాటా అనలేదు. నండూరి గారు విమర్శ పెట్టినా, చాలా మృదువుగా వుండేది. పురాణంగారి జోకుల మధ్య ఆయన తిట్టినా అదేమీ అనిపించేది కాదు. శ్రీరమణ గారి పద్ధతి వేరు. కచ్చితంగా ఆయన తన అనుభవంలోంచి ముక్కుసూటిగా మాట్లాడుతున్నారని నాకు అర్థమైంది. అప్పుడు ఆయన ఇంకో మాటన్నారు: “అది తప్పించుకోడం కోసమే ఆంధ్రజ్యోతి నించి బయటపడ్డానేమో వొక విధంగా” అని-
అది నిజమే అనిపించింది. ఆంధ్రజ్యోతిలాంటి చోట ఎప్పుడూ ఏదో వొక అసైన్మెంట్ క్రమం తప్పకుండా వుండేది. వాటిల్లో కొన్ని నచ్చుతాయి, కొన్ని నచ్చవు. నచ్చేలా వున్నా, పెద్దవాళ్లని వొప్పించడం కష్టంగా వుండేది. శ్రీరమణగారికి అలాంటి చేదు అనుభవాలు చాలా వున్నాయని తరవాత తరవాత వివిధ సందర్భాల్లో ఆయన మాటల వల్ల అర్థమయ్యేది.
ఈ విధంగా నేను ఆంధ్రజ్యోతి నుంచి ఎన్ని నేర్చుకున్నానో, శ్రీరమణ గారి నించి కూడా కొన్ని నేర్చుకున్నాను. “పత్రికలో వున్నప్పుడు ప్రతీదీ రాయాల్సి వస్తుంది. ప్రతీదీ మనం రాయలేం. ఆ మాట గట్టిగా అనలేము. అక్కడే conflict మొదలవుతుంది,” అని ఇంకో సందర్భంలో- అప్పటికి నేను ఆంధ్రజ్యోతి నించి బయటపడుతున్న రోజుల్లో- అన్న మాట కూడా బాగా గుర్తుంది.
దూరంలో వుండడం వల్ల చివరిరోజుల్లో ఆయనతో కబుర్లు కుదర్లేదు. కానీ, ఇన్నేళ్లుగా ఆయనతో నేనూ కల్పనా ఎప్పుడూ ఏదో వొక మిషతో మాటలు కలుపుతూనే వున్నాం. బెజవాడ వదిలి, హైదరాబాద్ వచ్చిన తరవాత శ్రీకాంత శర్మగారూ, శ్రీరమణ ఇద్దరూ ఆంధ్రప్రభ వరపత్రికలో బాధ్యతలు తీసుకున్నప్పుడు తరచూ కలుసుకోవడం, భోజనాలు చేయడం- రాతలూ, అన్నిటికంటే పెద్ద కోతలూ – అంటే “ఇది రాద్దాం, అది రాద్దాం” అనుకోడాలూ- ఏళ్ల తరబడి సాగాయి. అమెరికా వచ్చాక కూడా ఈ ప్రవాహం ఆగలేదు. సారంగ పత్రికలో “రెక్కల గుర్రం” శీర్షికతో ఆ అనుబంధం అంతర్జాలం దాకా, సుదీర్ఘ టెలీఫోను సంభాషణల దాకా అల్లుకుంది. 2012 లో నేను ఇండియా వచ్చినప్పుడు టీవీ 9 మా ఇద్దరినీ కూర్చోబెట్టి కబుర్లు చెప్పించింది. దురదృష్టవశాత్తూ, ఆ వీడియో ఇప్పుడు అందుబాటులో లేదు. ఇంకా బాధించే విషయం: మా ఇద్దరినీ స్టూడియోకి పిలిచిన అరుణ్ సాగర్, ఆ సంభాషణకి సమన్వయం చేసిన యాంకరూ ఇప్పుడు లేరు. ఇక శ్రీరమణ గారు కూడా లేరు!
వొక రచయితగా శ్రీరమణ గారి ప్రయాణాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి అన్న విషయంలో వీలైనంత స్పష్టత రావడానికి నాకు చాలా కాలం పట్టింది. ముళ్ళపూడి గారు ఇంకేదో సందర్భంలో అన్నట్టు- ఆయన నవ్వు నరం మహా స్ట్రాంగ్! ఆయనది హ్యూమరసం పొంగిపొర్లే వ్యక్తిత్వమే. అందులో అనుమానమేమీ లేదు. కానీ, కొంచెం లోతుగా ఆలోచిస్తే, రచయితగా ఆయనది సత్యం శంకరమంచి గారి దారి అనిపించిన సందర్భాలు అనేకం వున్నాయి. సత్యం శంకరమంచి అంటే మా ఇద్దరికీ బోలెడు ప్రేమ కాబట్టి ఈ మాట అనడం లేదు. ఏవిధంగా చూసినా, ఆయన ఎన్ని ప్రక్రియల్లో పనిచేసినా, శ్రీరమణ గారి అంతస్సుని పట్టిచ్చేవి ఆయన రాసిన ఆ గుప్పెడు కథలే. పత్రికల్లో పనిచేయడం వల్ల ఆయనలోపలి ఆ కథకుడు కొంచెం అరుదైపోయాడు కానీ, ఆయన ఏ కథ చదివినా – ఇదిగో ఇక్కడ కదా శ్రీరమణ వున్నాడు-అనుకున్న సందర్భాలు చాలా వుండేవి. ఆ మాట ఆయనతో కూడా చెప్పాను. “మనం వృత్తి పీడితులమండీ!” అన్నారు వొక సారి ఆయన.
ఆ పదంలో వొత్తిపెట్టిన బాధ చాలా వుంది. కొన్ని కారణాల వల్ల పైకి చెప్పుకోలేని వ్యథా వుంది. శ్రీరమణ గారు పేరడీల నుంచి హాస్య శీర్షికల దాకా రంగుల రాట్నంలో అన్ని వెలుగులూ అన్ని మలుపులూ మనకి చూపించారు. నిజమే, కానీ- వాటిల్లో ఆయన చాలా బహిర్ముఖిలాగా కనిపించడమూ నిజమే. అతిమామూలు సంభాషణల్లో కూడా ఆయన చాలా సార్లు అట్లాగే అనిపిస్తారు గాని- ఆయన తీవ్రమైన అంతర్ముఖుడని బలంగా అనిపించిన సందర్భాలు చాలానే వున్నాయి. మరీ సూత్రీకరిస్తున్నానని మీరు అనుకోకపోతే, అంత అంతర్ముఖుడు కాబట్టే, అంత బలమైన కథలు ఆయన రాయగలిగారని అనుకుంటూ వుంటాను. కథలోని కీలకమైన విషయాల మీద ఏకాగ్రతతో దృష్టి నిలిపి, వాటిని చివరంటా అదే ఫోకస్ తో నిలబెట్టుకోవడంలో ఆ బలం కనిపిస్తుంది.
మరీ ముఖ్యంగా- కథలో వివరాలు పొదగడం అంటే శ్రీరమణ గారి నించే నేర్చుకోవాలి. “మిథునం” కథ మీద చాలా మందికి చాలా అభ్యంతరాలున్నాయి కానీ, వొక్క విషయంలో మాత్రం అందరూ వొక్క మాట మీద నిలబడవచ్చు. “బంగారు మురుగు” కంటే కూడా “మిథునం”లో శ్రీరమణ గారు ఇచ్చిన వివరాలు- అవి వ్యక్తుల గురించి కావచ్చు, ప్రదేశాల గురించి కావచ్చు- మనసు మీద ముద్రపడిపోతాయి. ఇదే లక్షణం ఆయన పేరడీల్లో ఇంకో రూపంలో కనిపిస్తుంది. ఎందుకంటే, విశ్వనాథ నుంచి మోహన ప్రసాద్ దాకా ఆయన రాసిన పేరడీలు చదివితే, ఆ detailing అనితరసాధ్యమే కదా అనిపిస్తుంది. ఆ రచయితల వాక్యాల్నీ, పదాల్నీ, విరుపుల్నీ, చరుపుల్నీ ఎంతో వివరంగా గమనిస్తే తప్ప, వొకటికి పదిసార్లు చదివి, మననం చేసుకొని వుంటే తప్ప అవి కుదరవు.
శ్రీరమణ గారు వొక విచిత్రమైన కాలంలో రచయితగా వ్యక్తమయ్యారు. అటు రావిశాస్త్రి కవితాత్మక వచనం, ఇటు పురాణం వ్యంగాత్మక శైలీ, మధ్యలో పెద్దిభొట్ల వంటి వారి ప్రశాంత గంభీరమైన వాక్యాలూ. ఇంకో వైపు తాత్వికమైన ఛాయలతో మెరుస్తున్న వడ్డెర చండీదాసూ, మధ్యలో సంచలనాలు సృష్టిస్తున్న యండమూరీ – తెలుగు సాహిత్యాన్ని పట్టి కుదిపేస్తున్న కాలంలో వచ్చిన రచయిత నిలదొక్కుకోవడం అంటే నల్లేరు మీద నడక కానే కాదు. ఇంకో వైపు నించి నరుక్కొచ్చి, ఇంకో రకమైన వాక్య ప్రవాహాన్ని సమకూర్చుకుంటే తప్ప సాధ్యం కాదు. ఆ విషయం శ్రీరమణ గారికి బాగా తెలుసు. ఆ విధంగా ఆయన చాలా conscious artist. తన దారి ఎటు పోతుందో తెలిసిన బాటసారి. అంతగా conscious గా వుండడం వల్లనే ఆరోగ్యం కుదురుగా వున్నంతవరకూ ఆయన విరమణ లేదు. రాస్తూనే వున్నారు. రాసిన ప్రతీదీ ఎవరికి చేరుకోవాలో వాళ్ళతో ఆయన కనెక్షన్ తెగిపోలేదు.
అందుకే ఆయన బాటలో ఇంకో అడుగు పడదు. ఆయన్ని అనుకరించే వాక్యాలకి ఆ పదునూ రాదు! శ్రీరమణ శ్రీరమణే!
*
కొసమెరుపు:
కొద్ది కాలం కిందట మా ఇద్దరి మధ్యా ఇది చివరి ఈలేఖ:
శ్రీరమణ గారి నుంచి వొక ఖాళీ ఈమైల్ అందింది. అందులో నిజంగా ఏమీ లేదు. ఏమిటా అని నేను దానికి సమాధానం రాశాను : “శ్రీరమణ గారూ, ఇది ఖాళీగా వుంది. రాయడానికి చాలా ఎక్కువ సంగతులుండడం వల్ల ఖాళీ పుట పంపించారా?!”
శ్రీరమణ గారి నుంచి:
“నాకు ఏ పాపం తెలియదు, Any way మీరు లైన్లోకి రావడం సంతోషం శ్రీకాంత్ శర్మగారి పై మీ article చదివాను, బాగుంది. కల్పనకి శుభాకాంక్షలు.”
ఆ తరవాతి ఎక్కువ సంభాషణలు whatsapp లో జరిగినవే!
చిత్రం: మహమ్మద్ గౌస్
బాగుంది
సత్యం శంకరమంచి శ్రీరమణ ఇత్యాదులు భాషమీదా భావనమీదా జీవితంమీదా సాధికారతతో రాసారు..అందుకే వారి రచనలు తరాలను దాటి నిలవగలుగుతున్నాయి.
కానీ తమకు తెలిసిన, ఇష్టసడిన జీవితాల విలువలను ఆబ్జెక్టివ్ గా తరచిచూసి అవి నిగ్గుతేలాకే తమరచనల్లో వ్యక్తపరిచారా లేదా అన్నది సాహితీ వశ్లేషకులు పరిశీలించి నిర్ధారించవలసిన విషయం
పరిచయ వాక్యాలు అవసరం
నిజమే. శ్రీరమణ సాహిత్యం లోకి అడుగు పెట్టే , కలం పట్టే సమయం లో ఉద్దండులు ఏలుతున్న కాలం. వారి శైలిని ఒడుపుగా పట్టుకుని పేరడీ గారడీ చేస్తూ, నొప్పించకుండా ఒప్పిస్తూ , తన కలం పాళీ కి పదును పెడుతూ, తన అడుగు ని బలంగా వేసారు. పత్రికల వారినీ, పాఠకుల్ని కబుర్లు తో, కథలతో మైమరిపించారు. మిధునం అంటే రెండు కాదు, ఒకటే. అదే అద్వైతం . అది శ్రీరమణే !
నవ్వుల పల్లకిలో ఎక్కిన క్షణాలను , శ్రీ రమణ గారి వ్యక్తిత్వాన్ని గొప్పగా ఆవిష్కరించారు సార్
Excellent tribute to a great writer👏👏👏
Excellent parichayam of Ramana Garu. I only read Mithunam.