ఆమె అంటున్నది ‘నేను సైతం” అని.
ఏమిటి నువ్వు సైతం ప్రపంచాగ్నికి సమిధనొక్కటి ఆహుతిస్తున్నావా?
“కాదు కాదు. నేను సైతం పురుషస్వామ్యానికి సమిధనౌతున్న దానిని” అని ఆమె అన్నది.
మరి సమిధవి కదా మరి ఇప్పుడెందుకు నోరు విప్పుతున్నావు?
“సమిధలా కడతేరిపోకూడదని!”
****
గాయమంటే ఆమె చర్మం మీద చేసేదేనా? గాయమంటే నెత్తురొచ్చేదేనా? చర్మం మీద గాయాలే నొప్పి పుట్టిస్తాయా? ఒక ఇబ్బందికరమైన చూపు దుస్తుల లోపు దేహాన్ని స్కాన్ చేస్తున్నప్పుడు, ఒక జుగుప్సాకరమైన కదలిక ఏకాంత సమయానికి చెందిన శరీర భాగాల్ని తడిమినప్పుడు మనసుకి కూడా గాయమౌతుంది. ప్రతి అవాంఛనీయ స్పర్శ కనిపించని బ్లేళ్ళతో హృదయానికి చేసే గాయమే. బాధతో వచ్చే కన్నీళ్ళు రక్తం కన్నా చిక్కనైనది.
****
నిజమే. బతకటానికి, తనని తాను నిరూపించుకోటానికి, జీవితానికి ఒక సార్ధకతని సంతరించిపెట్టడానికీ ఆమెకి ఇప్పుడు ఎన్నో రంగాలు. ఎన్ని రంగాలు ఆమెకి అవకాశాలు కనిపిస్తున్నాయో అన్ని రంగాలూ ఆమెని శారీరికంగా, మానసికంగా వేటాడే వేదికలే. ఇదేం దేశమో! వీళ్ళేం పురుషులో! ఆ మనిషిలో మనసునో, మేధనో, కళనో, ప్రతిభనో కాక ముందస్తుగా అవయవాలు వెతుక్కుంటారు. ఆటో డ్రైవింగ్ దగ్గర నుండి మెట్రో రైలు వరకు, ఇంట్లో మెయిడ్ దగ్గర నుండి మిలటరీ ఇంజినీరింగ్ వరకు, అంగన్వాడీ సెంటర్లో ఆయా దగ్గర నుండి అంతర్జాతీయ విద్యా కేంద్రాల్లో ప్రొఫెసర్ వరకు, సినిమాల్లో వాంప్ నుండి హీరోయిన్ వరకు, మోడలింగ్ రంగంలో స్టెయిలిస్ట్ దగ్గర నుండి బ్రాండ్ అంబాసిడర్ వరకు, వైద్య రంగంలో ఏ.ఎన్.ఎం. దగ్గర నుండి సర్జన్ల దాకా, పోలీసుల్లో హోంగార్డ్ నుండి ఐజీల దాకా, క్రీడల్లో జిల్లా స్థాయి నుండి అర్జున అవార్డు దాకా, …ఇలా ఎన్నో రంగాల్లో స్త్రీలులు ప్రభవిస్తున్నారు. స్వాతంత్ర్యానంతర కాలంలో జాంబవంతుడి అంగలతో స్త్రీలు దూసుకెళ్ళలేని రంగమంటూ లేదు. వాళ్ళు వదిలిపెట్టిన రంగమూ లేదు. కానీ ఈ పరిస్తితికి ఎన్ని అగచాట్లు? స్త్రీవాదం, సంస్కరణవాదం, విప్లవవాదం, స్త్రీల ప్రవేశాన్ని అనివార్యం చేసిన ఆధునిక కాలపు పోకడలు, మార్కెట్ మాయాజాలం, వినిమయవాదం…చోదక శక్తులు ఎవరైతేనేం? ఏదైతేనేం? స్త్రీలు కష్టపడ్డారు. తమ ఉనికికి ఒక విలువని సాధించుకున్నారు. విషాదం ఏమిటంటే ఇన్ని చేసినా, ఎన్ని సాధించినా వాళ్ళు లైంగికంగా స్త్రీలుగానే చూడబడుతున్నారు. స్త్రీలు స్త్రీలు కాకుండా పోతారా అన్న అతి తెలివి ఆలోచనలు చేయకపోతే వాళ్ళు మనుషులుగా సాధించిన ఘనత అర్ధమవుతుంది. పురుషులెంతటి మనుషులో స్త్రీలు కూడా అంతే మనుషులు అన్న జ్ఞానం చాలా ముఖ్యం. కానీ చిత్రం స్త్రీలు ఒక వక్ర, అశ్లీల లైంగిక కోణం నుండే చూడబడుతున్నారు. పని ప్రదేశంలో పనే జరగాల. కానీ పని ప్రదేశంలో కాముకత్వమే పెచ్చరిల్లుతున్నది.
ఇక్కడ రెండు బాధాకర విషయాలు ప్రస్తావించుకోవాలి. ఒకటి ఆశావహులైన స్త్రీల పట్ల లైంగిక దుష్ప్రవర్తన. రెండోది అంతకంటే ముఖ్యంగా వారి అవకాశాలను హరించి, కెరీర్ని దెబ్బకొట్టి, భవిష్యత్తుని నాశనం చేయటం!
****
అతడు వచ్చినట్లే ఆమె వస్తుంది నీ ముందుకి. ఆమె గాయనో, నటో, క్రీడాకారిణో…ఎవరైతేనేం, నీ దగ్గరకొస్తే నువ్వామెలో ప్రతిభని చూసి, ఒక అవకాశం ఇవ్వటానికి బదులుగా నీ మదపు కళ్ళల్లో కామం పుసులు కక్కుతుంటుంది. నీ చేతులు ఆమె అనుమతి లేకుండానే ఆమెని తడుముతాయి. అవకాశం ఇచ్చే వంకని అవకాశంగా మలచుకొని నువ్వామె శరీరం మీద జెండా ఎగరేయాలనుకుంటావు. ఈ దేశంలో రోడ్ల మీద డ్రెయినేజి గుంతల నుండే కాదు, పురుషాధిక్యపు అశ్లీల మెదళ్ళ నుండి కూడా దుర్వాసనల మురుగు బైటికొస్తుంది. ఆ కంపు భరించలేక ఆమె బైటకి పరిగెత్తొచ్చు. లేదా అవకాశం కోసం ముక్కు మూసుకొని భరించనూ వచ్చు. ఆమెకి రావలసిన అవకాశాల్ని గుప్పిట పట్టుకొని బ్లాక్మెయిల్ చేసే కొంతమంది నీ బోటి ఎదవలేమంటారంటే “ఆమెకి తన శీలమంటే అంత గౌరవమున్నప్పుడు అవకాశాల్ని వద్దనుకోవచ్చు కదా” అని. కానీ నీ నీచత్వానికి లొంగలేక అవకాశాల్ని కోల్పోయి, నిస్పృహలో మునిగిన వాళ్ళకు ఏం చెబుతావు? ఆమె శరీరానికి, ఆమె అవకాశాలకి ముడేసిన నీ దౌష్ట్యం సంగతేమిటసలు? నీ ముందు దాకా రావటానికి ఆమె ఎన్నో ఆంక్షల సుడిగుండాల్ని తప్పించుకొని, విలువల అగడ్తల్ని దాటుకొచ్చి నీ ముందు నిలబడగానే మరి నువ్వేమో “నాకేంటంటూ” గదుముతావు. ఇష్టం లేకపోతే మంచాన్ని మించిన ఉరికొయ్యలేదు వ్యక్తిత్వానికి. అవాంఛిత కౌగిలిని మించిన అవమానం లేదు. నీ బ్లాక్మెయింగ్ కి ఆమె లొంగనన్నా లొంగాలి లేదా అప్పటివరకు చేసిన ప్రయాణానికి ఒక ముగింపునివ్వాలి. ఈ బండరాతి వ్యవస్థలో నువ్వో గులకరాయివై ఆమె నుదుటికి తగులుతూనే వుంటావు. నీకు కనబడుదులే కానీ నీ చొక్కా మీద ఆమె రక్తపుబొట్లు ఎన్నో పడ్డాయి ఇప్పటికే. ఒక్కో అనుభవం కనిపించని ఒక్కో రక్తపు చుక్క. ఒరే రక్తపిపాసీ! నీకు లొంగినా, లొంగకున్నా నీ పంటిగాట్ల తాలూకు నొప్పి జీవితాంతం వెంటాడుతుంది. అంతేకాదు ఆమె పైకెదిగినా, ఎదగకున్నా కామంతో స్తంభించిన నీ కనుగుడ్లు ఆమెని ఎప్పుడూ వెన్నాడుతూ వుండొచ్చు.
****
మంచికో చెడుకో ప్రపంచమంతా ఒక కుగ్రామమైపోయిన సందర్భంలో సోషల్ మీడియా విజృంభించి అద్దంలో ప్రతింబింబలా ఒక భ్రాంతియుత వాస్తవంలో సత్య వాస్తవాన్ని చూపిస్తూ, ఎప్పటికప్పుడు కీ పాడ్ మీద అక్షరాలు నొక్కటం ఆలస్యం! వేలాది, లక్షలాది మంది చుట్టూ గుమిగూడి, క్రిక్కిరిసినట్లు జనసందోహం! స్పందనలు, వాద ప్రతివాదాలు, హృదయం పగిలిపోతున్నట్లు భావోద్వేగాలు వెల్లువెత్తుతున్నాయి. ఎక్కడో ఒక మూల కూర్చొని నిమిషాల్లో ఖండాంతరాలకి సమాచారాన్ని పంపించొచ్చు. ఉయ్యూరు నుండి ఉగండా దాకా, వెనిజులా నుండి వెనిగండ్ల దాకా బంతిని తంతే గోల్ పోస్టులో పడ్డట్లు మెసెంజర్లో ఎవరినైనా చేరొచ్చు. పొద్దున్నే తలుపులు తెరవగానే ఇంటి ముందు న్యూస్ పేపర్, పాల పాకెట్లు పెట్టి వుంచినట్లు సోషల్ మీడియా ఓపెన్ చేయగానే నోటిఫికేషన్లు. ఒక “హలో” కి వంద హలోల ప్రతిధ్వని! భావ వినిమయమే కాదు సమాచార సరఫరా కూడా వెల్లువ నుండి విస్ఫోట స్థాయికి చేరింది.
సోషల్ మీడియా కొందరికి రసానుభూతుల కాలక్షేపమో లేక వినోదసల్లాపమో కావొచ్చుగాక! కానీ కొందరికది అభిప్రాయాల్ని వ్యాప్తి చేసుకోటానికి వేదిక. భావోద్వాగాల ప్రసార భూమిక. సోషల్ మీడియా స్నేహాన్ని వ్యాపారంగా మలచుకునేవారు కొందరైతే, సమాజం పట్ల కరుణతో, బాధ్యతతో, ముందుతరాల పట్ల ప్రేమతో ఒక మంచి ఆలోచనల, ప్రవర్తనల సమాజం కోసం వాడుకునే వారు మరికొందరు. అలాంటివారు కొందరు ఒకరికొకరు కూడబలుక్కొని “నేను కూడా లైంగిక క్షతగాత్రినే” అని మెల్లగా చెప్పుకోవటం నుండి ఒక సామూహిక నినాదమై, ఒక రణభేరిలా మోగింది. చివరికి అది “మీ టూ” (నేను కూడా….) అనే రెండు మాటల చురకత్తుల యుద్ధమైంది. ఈ దెబ్బకి అనేక ప్రముఖ మగ కుర్చీల కూసాలు కదిలిపోయాయి. “యెస్ బాస్” అంటూ నిలుచుండే ఆమె “ఇదిగో ఇతగాడే. వీడే!” అంటూ నలుగుర్నీ కేకేసి మరీ తన వేటగాడిని చూపిస్తున్నది. అంతేకాదు అతగాడిని మీడియా చౌరస్తాల్లోకి బరబరా ఈడ్చుకొచ్చి పట్టపగలు అతని ముఖాన్ని అందరికీ చూపిస్తున్నది. రాయబడని వేదనాత్మక చరితలకి, సమాధి కాబడ్డ ఆక్రోశాలకి ప్రాణప్రతిష్ట చేస్తున్నది. అతడి పాపం ఎప్పటిదైనా కావొచ్చు కాక! ఒక చెడ్డ అనుభవం గుర్తొచ్చినప్పుడల్లా వేదననే కలగజేస్తుంది. ఆమెకి గుర్తున్నంత కాలం అతను నేరస్థుడే. అందుకే ఎప్పటి తప్పులకో ఇప్పుడు శిక్ష పడాలన్న డిమాండ్!
మన దేశంలో నానా పటేకర్, వైరముత్తు, అర్జున్ నుండి కేంద్రమంత్రి అక్బర్ వరకు నడిబజారుకి ఈడ్వబడ్డారు. అంతర్జాతీయంగా కూడా ప్రకంపనాల నుండి భూకంపం దాకా “మీ టూ” వెల్లువెత్తింది. కానీ చిత్రం “అవును. నేను తప్పు చేసాను” అని ఒక్క గార్దభ సుతుడూ ఒప్పుకోలేదు. నిజాన్ని అంగీకరించటానికి వాళ్ళేమన్నా అమాయక జంతువులా? మనుషులాయే! (క్షమించాలి గార్దభోత్తములులారా ఈ మానవాధములను మీతో పోల్చి మీ జాతి నామమును దుర్వినియోగపరిచినందులకు!) వేటగాళ్ళందరూ కెవ్వుమంటున్నారు. గొల్లుమంటున్నారు. గగ్గోలు పెడుతున్నారు. ప్రతివాడూ కుట్ర సిద్ధాంతం వల్లెవేసేవాడే. కోర్టు కేసుల పేరుతో బ్లాక్మెయిల్ చేస్తున్నారు. ముందు వ్యంగ్యంగా మాట్లాడిన అమితాబ్ వంటి వారు ఇప్పుడు శాంతివచనాలు, సూక్తిముక్తావళిలు ప్రవచిస్తున్నారు.
ఇందులో కొన్ని అబద్ధాలుండొచ్చునని ఆడిపోసుకునేవారూ తక్కువేం కాదు. నేం, ఫేం పోయినవారే, వెలుగులోకి రాలేనివారే ఈ ఆరోపణలు చేస్తున్నారని మెటికలు విరుస్తున్నారు. అందరూ శాకంబరీ మాత భక్తులే. కానీ చేపలబుట్టే గల్లంతైపోయింది. పని ప్రదేశంలో అసలు పురుషుడు స్త్రీని వేధించనే వేధించడా? వేధిస్తాడేమో కానీ ఆరోపణలు ఎదుర్కుంటున్నవారు మాత్రం పాపం పసివారేనట! కానీ నిజం ఒప్పుకునే మానవసుతుడేడి? ఎక్కడా కానరాడే! గొప్ప గొప్ప కళాకారులు, పండితులు, సృజన శీలురు, క్రీడాకారులు, మేధావులు, రాజనీతి వేత్తలు, సంగీతకారులు, సాహితీవేత్తలు…ఎవరైతనేం! గుడ్లగూబ కళ్ళతో, తోడేలు వాసన కొడుతూ…..!
ఎవరో కొంతమంది పురుషులు కూడా చాలా ఇబ్బంది పడ్డారట. నిజంగా స్త్రీలు అంత స్వేఛ్ఛగా ఆలోచించగలిగితే కాదనలేనంత నైతికవర్తనులా మన మగానుభావులు? ఎంతమాట. ఎంతమాట! ప్రతి పురోగామీ ఉద్యమానికి కౌంటర్ ఉద్యమం అసాధారణమేమీ కాదు కదా.
****
“మీ టూ” వర్గపు స్త్రీల గురించిన చర్చ కూడా వుంది. వీళ్ళ గురించి కొన్ని ప్రశ్నలు కూడా వున్నాయి. వీళ్ళెవ్వరూ గ్రామీణపేదలు కారు. బడుగు వర్గాల స్త్రీల కష్టాలు తెలిసిన వారూ కారు. పైగా అధిక శాతం మంది ఆర్ధికంగా ఉన్నత వర్గాలకి చెందిన వారు. వీళ్ళేమైనా ఏనాడైనా అట్టడుగు స్థాయిలలో పనిచేసే శ్రామిక మహిళలకి చేయూతనిచ్చారా? తామున్నామని భరోస ఇచ్చారా? మీడియా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన వారిపై అత్యాచారాలకి, అకృత్యాలకీ ఈ “మీ టూ” మహిళలు స్పందించారా? ఈ ఆరోపణ నిజమే కావొచ్చు. వీళ్ళ ఉద్యమ పరిధిలోకి ఇంటి పనిమనుషులు, రోజువారీ కూలీలు, నిరక్షరాస్యులు, పార్ట్ టైం స్వీపర్స్, కాంట్రాక్ట్ లేబర్లు వంటి మార్జినలైజ్డ్ సెక్షన్స్ కి చెందిన స్త్రీలు రాలేరు. అయినప్పటికీ “మీ టూ” పోరాటం ప్రజాస్వామిక హక్కుల దృష్ట్యా గొప్ప ఉద్యమమే. మధ్య తరగతి ఆ పై వర్గాలకు చెందిన స్త్రీల ఆత్మఘోష ఇది. స్త్రీ విద్య వల్ల ఎదిగే సమాజంలో ఈ చైతన్యం అత్యవసరం. అనివార్యం కూడా! నిండారా ఆహ్వానిద్దాం.
****
“ముదితల్ నేర్వగరాని విద్య గలదే ముద్దార నేర్పించినన్?” అన్నది చిలకమర్తివారి ఓ పాత మంచి నానుడి.
“ముదితల్ జయించగరాని రంగమ్ము గలదే వెంటాడి వేధించకుండెనన్?” ఇది అత్యాధునిక మహిళల అతి మంచి మాట!
*
|
“ముదితల్ జయించగరాని రంగమ్ము గలదే వెంటాడి వేధించకుండెనన్?” ఇది అత్యాధునిక మహిళల అతి మంచి మాట!
సంఘటిత అసంఘటిత మహిళా కార్మికులపై జరుగుతున్న ఈ లైంగిక వేధింపు కు ఎన్నో సంవత్సరాల చరిత్ర ఉంది ..ఎలాయినా పనిచేసి పొట్టనింపుకొనే ముఖ్యంగా ఆడవాళ్లు ప్రత్యేకించి పనిచేసే రంగాల్లో ఇది చాల మామూలు విషయంగా పరిగిణింప బడుతూ వచ్చింది పాలిచ్చే బిడ్డలతో పనికొచ్చిన తల్లుల స్తన్యపు మారకలనుకూడా ఆబగా చూసి ఆమెను ప్రలోభపెట్టి బిడ్డపాలను కూడా తాగే మదాంధులున్న ఈ మృగ ప్రవృత్తి..అన్నిరంగాల్లో కొంచం తేడాతో అటు ఇటుగా ఒకేలా ఉంటుంది భూస్వాములు తాపీమేస్త్రీలు లాంటివారు పల్లెల్లో అయితే బ్యూరోక్రాట్స్ రాజకీయనాయకులు చిన్న చితక ఉద్యోగులు ఎవ్వరు దీనికి మినహాయింపు కాదు ఎక్కడో ఉంటారు తప్పనిసరిగా సంస్కరణవాదులు వారెప్పుడు బాధిత పక్షానే ఉంటారు ఉన్నది ఉన్నట్లు నిర్భయంగా మనసుకు సమస్యను హత్తుకొనేలా వ్రాసిన అరణ్య కృష్ణకు మనస్ఫూర్తిగా అభినందనలు తెలుపుతూ ఏకీభవిస్తున్నాను ప్రకటించిన సారంగా పత్రికకు కూడా హ్యాట్సాఫ్ .
Thank you Aruna garu!
This is “Me Too” exclusive by Aranya Krishna ji..Previously, not able to understand this “Me too” (I am not feeling shy) as my office is not holding such kind of abuses and discriminations. I am working in a multinational company, I usually do not get time to read the newspaper or interested to watch those repeated telecasts of 24/7 news channels.
But, after reading this great post, I must admit that Aranya Krishna ji took much interest and trouble to make everyone understand this “Me Too” concept.
Great work Sir!
Thank you so much Geeta Vellanki garu!
స్త్రీలయెక్క సమస్యలను గుర్తించి నిష్పక్షపాతంగా సమస్యను విశదీకరించారు. అభినందనలు… ధన్యవాదాలు సర్.
ఎందరో బాలబాలికలు కూడా యుక్తవయసుకు రాకమునుపే ఆకలి చూపులకు, లైంగికవేధింపులకు బలౌతున్నారు.
అసలు అమ్మాయిగాపుట్టటమే శాపమౌతుందా అన్నంతగా వేదన చెందుతున్నారు.
అంగాగమూ వెతికే కళ్ళు… అవకాశంకోసం కాచుకునే చేతులూ… అడుగడుగునా మేకతోలేసుకునే ఉంటున్నాయి.
బిడ్డగా ఉన్ననాడే బుద్ది చెప్పేవారు ఉంటే కాస్తయినా సమాజం లో స్త్రీ పరిస్థితి బావుండేదేమో…
ఎక్కడినుండో ఊడిపడ్డట్టు అమ్మ కూడా అందలాలెక్కించి అతడిని అతడిలోని పురుషాధిక్యపు అహంకారాన్ని పెంచి పోషించే దిశల్లోనే పెంపకాలు పున్నాయి.
చిన్ననాటినుండీ మార్పు అవసరం.
ఏ వర్గానికి చెందిన మహిళ అయినా వారి వారి పరిదిలో బయటికి కనపడని వేదింపులకు గురికాబడుతున్నారు.
కనపడని కన్నీటిని గుండెల్లో మోస్తూ బతుకు బండిని ఈడ్చే వాళ్ళే అనేకం.
మార్పు అమ్మానాన్నల నుండీ, మొదలై బిడ్డల ఆలోచనలు చైతన్యవంతమైన సమాజానికి నాంది కావాలి.
అప్పుడయినా పక్కింటి ఆడపిల్లను కూడా మన ఇంట్లో అక్కగానో, చెల్లిగానో చూడగలరేమో..
మనసు గాయాల్ని చూడగలగటం చాలా గొప్పవిషయం సర్.
ఆగాయాల వేదనలన్నీ మీరు మనసుకు హత్తుకునేలా చెప్పారు. నేటి సమాజంలో పెరిగిన అనేక ఆనవాళ్ళు మహిళల కన్నీటి గా మిగులుతున్నాయి.
అరణ్యకృష్ణ గారూ అభినందనలండీ.
Thank you so much Yamini garu!
Thank you so much Geeta Vellanki garu!