ఆమె నిర్ణయాలు  

కారైకల్ బీచిలో, సాయం సంధ్యా సమయంలో స్నేహితురాలుతో కలిసి తీరికగా నడుస్తున్నహేమ చటుక్కున ఆగి, యిలా అంది.

” చూడు సౌజన్యా, అలలు ఉవ్వెత్తున ఎగసి పడి తీరాన్ని చేరి మెల్లగా వెనక్కి జారుకుంటాయి. మన సమస్యలు కూడా అంతే. వస్తాయి, పోతాయి. ఒక నాడు సునామీ ఈ ప్రాంతాన్ని నాశనం చేసింది. ఈ రోజు యెవరైనా చెప్తే తప్ప తెలియదు. క్రొత్త ఆశలతో, తిరిగి వూపిరి పోసుకుని, నూత్నఅందాలతో ఈ వూరు   వెలిగి పోతోంది. ఇక్క డి ప్రజలు, నాయకులు దుఃఖం నుంచి బయటకు వచ్చి, బుద్ధితో ఆలోచించి, శ్రమించడం వల్ల యిదంతా సాధ్యమైంది.”

సౌజన్య హేమ చేతిని అందుకుని మృదువుగా నొక్కి,” నీ మాటలతో ఏకీభవిస్తున్నాను. కానీ ప్రేమను సమస్యగా యెందుకు చూస్తున్నావు?” అని అడిగింది.

“ఆలోచించు. మన దృష్టి చదువుపైనా, గ్రేడ్స్ పైనా వుండాలా  లేక ప్రేమా, కౌగలింతల పైనా?”

“చదువు పైనే అనుకో. కానీ ప్రేమించుకుంటూ మంచి గ్రేడ్స్, మంచి వుద్యోగం సాధించిన వాళ్ళు కూడా వున్నారు కదా?”

” నాకలా యిష్టం లేదు. అది రిస్కుతో కూడిన పని. ఒకరిద్దరి అనుభవాల్ని, ఆదర్శంగా తీసుకోవడం కరక్టు కాదు. ప్రేమించడం క్షీర సాగర మధనం లాంటిది. ఒకరికి విషం దక్కితే, మరొకరికి అమృతం దక్కుతుంది. నేను చాన్స్ తీసుకోలేను” అని దృఢంగా చెప్పింది హేమ.

హేమ వాదనను నిరాకరిస్తూ సౌజన్య ప్రశ్నించింది ” అంటే, మనసుని నిద్రపుచ్చాలా లేక చంపేయాలా?”

” మనసు. అది మనకు లక్ష్యాలకు విరుద్ధంగా కోరికల వెంట బడితే నిద్రపుచ్చాలి. వంచకులను అభిమానిస్తే చంపేయాలి. ఇదే నేను చిన్నతనంలో నేర్చుకున్న పాఠం. అదే నేను చేసిన ప్రమాణం.”

* **

పుదుచెర్రీ లోని కారైకల్ పట్తణంలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్  టెక్నాలజీలో బీ. టెక్  ఆఖరి  సంవత్సరం  విద్యార్ధిని హేమ.  గత సెమెస్టరునుండి, ఆమె సహవిద్యార్ధి రవి, ఆమెను ప్రేమ పేరుతో విసిగించడం ప్రారంభించాడు. ఇంతకన్న పెద్ద సమస్యను ఆమె, ఇంటర్ చదువుతుండగా యెదుర్కోంది. ఆమె తండ్రి, యిల్లు వదిలి వెళ్ళిపోయాడు. మగవాడి కామ లాలస, వ్యామోహం, కాఠిన్యం అన్నీ వెళ్ళిపోయిన తండ్రిలో చూసింది. అదే సమయంలో, మొదలు నరికిన చెట్టులా కూలిపోకుండా నిలబడిన తన తల్లిలో, ఆత్మ విశ్వాసం, ధైర్యం, అనంతమైన ప్రేమ చూసింది. ఆ రోజే ఆమె రెండు నిర్ణయాలు తీసుకుంది. మొదటిది, జీవితంలో తన తల్లిలా గొప్ప స్థాయికి యెదగాలని. ఆ లక్ష్యంతోనే బీటెక్ కంప్యూటర్స్ యెంచుకుని, తల్లి డైరెక్టరుగా వున్న ఆ సంస్థలోనే జాయినయ్యింది.

ఆమె రెండవ నిర్ణయం, మగవాడి ఆకర్షణకు దూరంగా వుండాలని.  మగవాడిని నమ్మి, వ్యామోహంలో పడకూడదని అమె ధృఢంగా నిశ్చయించుకుంది. అనాదిగా మగవాడి అహంకారానికి ఆడది బలి కావడానికి కారణం ఆడదాని బలహీనత. నేటి నాగరిక ప్రపంచంలో పరిస్థితులు అందుకు భిన్నంగా లేవు. మగవాడిని ఆకర్షించే విధంగా అరకొర బట్టలు వేసుకోవడం, అలంకరణకోసం బ్యూటీ పార్లర్ల చుట్టు తిరగడం, ఇవన్నీఆమెకు అసహ్యంగా అనిపించాయి. ఏ రోజు ఆడది శరీరాన్ని కాకుండా తన మేధస్సుని  ప్రేమిస్తుందో, మనస్సుతో గాక బుద్ధితో ఆలోచిస్తుందో ఆనాడే ఆమెకు స్వేచ్చ, ప్రగతి సాధ్యమని అర్ధం చేసుకుంది.

ఆమె తీసుకున్ననిర్ణయాలకు పరీక్షా కాలం వచ్చినట్లుంది. అమె మొదటగా ఒక సమస్యను తన విద్యాలయంలో, మరింకో సమస్యను ఇంటి దగ్గర యెదుర్కోవలసి వచ్చింది.

***

డైరెక్టర్ ఆఫీసు గది వద్ద సందడి నెలకొని వుంది. హేమ సందర్శకుల గదిలో కూర్చుని వుంది. ఆమె మనసు ప్రశాంతంగా వుంది. సమస్య వచ్చినప్పుడు, గాభరా పడాల్సిన అవసరం లేదని జీవితం ఆమెకు నేర్పింది.

డైరెక్టర్ ఆఫీసు గది లోపల అధ్యాపకుడు వరదరాజన్, ఆ రోజు వుదయం సంఘటన డైరెక్టరుకు వివరిస్తున్నాడు.

” కాంటీన్ గోడ పైన ఒక అసభ్య చిత్రం వుందని, ఒక విద్యార్ధి చెప్పిన వెంటనే వెళ్ళాను మేడం!  మీకు చూపించడం కోసమని ఫోటో తీసి, ఆ తర్వాత దగ్గరుండి, దానిని తుడిపించేసాను. ఇదిగో చూడండి” అంటూ ఫోన్ ఆమె చేతికి యిచ్చాడు. ఒక యువకుడు, ఒక యువతి పెదవులపై, ముద్దు పెడుతున్న దృశ్యం, దాని క్రింద,  రవి, హేమ అన్న పేర్లు.

డైరెక్టర్ కల్యాణి గుండె కలుక్కుమంది. హేమ ఆమె కూతురు. తన భావాలను ఇతరులు గుర్తించకుండా, జాగ్రత్త పడుతూ, గంభీరస్వరంతో  అడిగింది.” ఆ చిత్రం గీసిన వ్యక్తి యెవరో తెలిసిందా?”

” సెక్యూరిటీ దూరం నించి చూసాడు. అతను పరుగున వచ్చేలోగా, ఆ కుర్రాడు మాయమయ్యాడు” అని బదులిచ్చాడు వరదరాజన్.

” రవిని విచారించారా?”

” ఇక్కడే వున్నాడు మేడం! తనకు తెలియదంటున్నాడు” అని అతను చెప్తూండగా మరొక అధ్యాపకుడు ఈశ్వరన్ లోనికి వచ్చి,” మేడం, రవి స్నేహితులని విచారిస్తే, ఈ పని చేసింది, రవి స్నేహితుడు వెంకట్  అని చెప్పారు. వెంకట్ జాడ లేడు. రవిని అడిగితే అన్ని విషయాలు తెలుస్తాయి” అన్నాడు,

” రవి బాగా అభిమానించే టీచర్లు యెవరు?  స్టూడెంట్సుని కనుక్కుని చెప్పండి” అంది కల్యాణి.

పది నిమిషాల తర్వాత వరదరాజన్ వచ్చి ” అఖిల మేడం, సుబ్రమణి సార్! ” అని చెప్పాడు

” అయితే వాళ్ళిద్దరితో రవిని ఇక్కడికి తీసుకు వచ్చి, మీరు మీ పని చేసుకోండి” అని ఆదేశించింది కల్యాణి.

పది నిమిషాల తర్వాత, కల్యాణి యెదుట అఖిల, సుబ్రమణి లతో పాటు రవి హాజరయ్యారు. అధ్యాపకులని తన ప్రక్కన కూర్చోమని, రవిని యెదుటనున్నకుర్చీలో కూర్చోమంది కల్యాణీ.  ఆమె ముఖం ప్రసన్నంగా వుంది. కోపం, బాధ, వంటివి లేశమాత్రం కూడా కనబడక పోవడం చూపరులకు ఆశ్చర్యం కలిగించింది.  రవిని చూస్తూ, “రవీ, ఇదంతా యేమిటి? ఎందుకిలా జరిగింది? చెప్పు. ఇక్కడ నీకిష్టమైన టీచర్లున్నారు.  నీకు సహాయం చెయ్యాలన్నదే మా తాపత్రయం!” అని అనునయంగా అడిగింది కల్యాణి.

” ఫైనల్ ఇయర్లో వున్నావు. ఇంకో మూడు నెలల్లో వుద్యోగాలిచ్చే కంపనీలు వస్తాయ్. ఇప్పుడీ పనులేమిటి? ” వ్యాకుల స్వరంతో, మృదువుగా అడిగింది అఖిల.

నిన్నటి వరకు ఒక మంచి విద్యార్ధిగా పేరున్న తను, ఈరోజిలా ఒక అపరాధిలా, ఒక ప్రశ్నార్ధకంలా మారడం, కేవలం స్వయంకృతమే అని అనుకున్నాడు రవి.  చెమ్మగిల్లిన కనులతో తలవంచుకున్నాడు.

ఇంతలో ” సారీ మేడం,  నేనే వెంకట్. లోపలికి రావచ్చా?“  అని గుమ్మం దగ్గర ఒక యువకుడు నిలబడి అడిగాడు. అతడిని లోనికి రాకుండా అటెండర్ ఆపుతున్నాడు.

” రా వెంకట్! నీ కోసమే చూస్తున్నాము. వచ్చి కూర్చో” అని పిలిచింది కల్యాణి.

అటెండర్ ప్రక్కకు తప్పుకోగా, వెంకట్ లోనికి వచ్చి రవి ప్రక్కనే కూర్చుని “జరిగినది మొత్తం మీకు చెప్తాను మేడం, దయచేసి మమ్మల్ని క్షమించండి” అని చేతులు జోడించాడు.

” మేడం తల్లి లాంటివారు కాబట్టి పిలిచి, కూర్చోబెట్టి మాట్లాడుతున్నారు. వేరొకరైతే,  మిమ్మల్ని  క్లాసులకు రాకుండా సస్పెండ్ చేసే వారు. దాచకుండా విషయం చెప్పు” అంది అఖిల కొంచెం కోపంగా.

” అలాగే మేడం! రవి పోయిన సంవత్సరమే హేమకి తన ప్రేమ తెలియచేసాడు. కానీ హేమ నో చెప్పింది  , ‘నా లక్ష్యం లక్షరూపాయల ఉద్యోగం తెచ్చుకోవడం, ప్రేమ, గీమా అంటూ నా మూడ్ పాడు చేయ్యొద్దు అని  కరాఖండిగా చెప్పింది. దాంతో రవి నిరాశతో, మనసు చెడగొట్టుకుని పరీక్షలలో తక్కువ గ్రేడ్ తెచ్చుకున్నాడు. ఈ విషయం నేను హేమకు చెప్పి, రవితో మాట్లాడమని  కోరాను.”

అఖిల, వెంకట్ మాటలకు అడ్డు తగిలి, ” ఇందుకా లాస్ట్ సెమెస్టర్లో తక్కువ మార్కులు వచ్చింది. రవీ, ఎన్నిసార్లు చెప్పాను నీకు. ముందు చదువుకో, సమస్యలేమున్నావుంటే, తర్వాత చూసుకోవచ్చని.   అప్పుడే నువ్వు, నాకీ సంగతి చెప్పివుంటే, ఇలా జరిగేది కాదు” అంది బాధపడుతూ.

వెంకట్ తన ఫోన్ తీసి, ఒక వీడీయో చూపించాడు. రవిని కలిసి హేమ మాట్లాడిన సన్నివేశం.

” హేమా! ఒక్క మాట,  ప్రేమ కాకపోతే, కనీసం యిష్టం అని చెప్పు, ప్లీజ్  !” అని రవి ఆమె కభిముఖంగా నిలబడి వేడుకుంటున్నాడు

ప్రశాంతమైన వదనంతో హేమ,”తల్లి తండ్రుల ఆశలకు విలువ లేదా? వాళ్ళు మనం బాగా చదువుకోవాలని ప్రతి పైసా మనకోసమే దాచి యిస్తుంటే, నీకు ఆడపిల్ల ప్రేమ ముఖ్యమైందా?  మనం ఒక మంచి డిగ్రీ,  ఒక మంచి వుద్యోగం, సాధిస్తే, మనం హాయిగా జీవిస్తామన్ననమ్మకంతో వాళ్ళు నిశ్చింతగా వుంటారు. నేను మళ్ళీ చెబుతున్నా! నాకు నా లక్ష్యమే ముఖ్యం, దయచేసి నువ్వు కూడా బాగా చదువుకో. నువ్వు ఎన్నిసార్లు అడిగినా నా నిర్ణయం మారదు” అని ముందుకు కదిలింది..

” ఇది రికార్డ్ చెయ్యాలని నీకెందుకనిపించింది?” అడిగింది అఖిల

” నేను కాదు మేడం, హేమ స్నేహితురాలు సౌజన్య చేసింది. ఆమే నాకు పంపింది. చదువు పూర్తయ్యే వరకు, ఇది మీ దగ్గర వుంచండి, అని మెసేజ్ పెట్టింది” అన్నాడు వెంకట్. ఆ తర్వాత మొబైల్ ప్రక్కన పెట్టి, వెంకట్ చెప్పడం కొనసాగించాడు.

” హేమ అలా అని వెళ్ళిపోవడంతో రవి కృంగిపోయాడు. నాకు హేమ మీద కోపం వచ్చింది.

ఆ కోపంలో నా బుద్ధికి తట్టిన ఆలోచన ఈ చిత్రం. ఇలా చేస్తున్నట్లు రవికి కూడా తెలియదు. ఉదయం నాకర్ధమైంది తెలివి తక్కువ పని చేసానని. హేమను కలిసి సారీ చెప్పాను. ఆమె మీకు అన్నీ చెప్పి క్షమాపణ కోరమంది. అందుకే వచ్చాను. క్షమించండి”  అని చేతులు జోడించి నమస్కరించాడు.

” ఒక అమ్మాయిని ప్రేమిస్తే, ఆమె కలలు, ఆమె ఆకాంక్షలు తెలుసుకుని, ఆమెకు సహాయ పడాలి. నీవు  తోడుంటే, ఏదైనా సాధించవచ్చునని అనుకున్నప్పుడు ఆ అమ్మాయి నీ కోసం, నీ దగ్గరకి పరుగెత్తుకుని వస్తుంది. హేమ లాంటి అమ్మాయి కావాలంటే,  నీవు చాలా కష్టపడాలి. యెదగాలి ” అని హితబోధ  చేసింది అఖిల.

సుబ్రమణి మౌనంగా ఆలోచిస్తూండడం గమనించిన కల్యాణి, ” ఏమిటి ఆలోచిస్తున్నారు?” అని అడిగింది.

సుబ్రమణి, “హాస్టల్లో గంజాయి సరఫరా అవుతోందని విన్నాను. నిన్నరవి వెంకట్,  గంజాయి తీసుకున్నారు. వాళ్ళ చూపులు గమనించండి.  రవి అయోమయంగా చూస్తున్నాడు,  వెంకట్ చూపులు స్థిరంగా లేవు” అన్నాడు. ఆ మాటలకు కల్యాణి వులిక్కిపడింది. ఒక్క నిమిషం ఆలోచించింది. ప్రేమ  , గంజాయి సరఫరా రెండు వేరు వేరు విషయాలు. ప్రస్తుతానికి ప్రేమ సంగతి ముగిద్దామని నిర్ణయించుకుంది. ఎదురుగా తలవంచుకుని కూర్చున్న విద్యార్ధుల్ని చూస్తూ,

” మీరిద్దరూ క్షమాపణ పత్రం వ్రాసి ఆఫీసులో యివ్వండి. బాగా చదువుకోండి. మీకే సమస్య వున్నా అఖిల మేడం లేక సుబ్రమణీ సారుని కలవండి. ఇంక మీరు వెళ్ళవచ్చు” అంది కల్యాణి.

రవి, వెంకట్ వెళ్ళిపోయాక అఖిల, “థాంక్స్ మేడం. మీరు క్షమాగుణంతో వ్యవహరించిన తీరు మాకు ఆదర్శం” అంది సవినయంగా.

హేమ నా కూతురు కాబట్టి, మంచి పేరుకోసం  నేను వుదాసీనంగా వ్యవహరించానా, అని లోన మధన పడుతున్నా, పైకి నవ్వుతూ. “హేమ ఈ పనివల్ల బాధపడలేదని తెలిసింది కాబట్టి, మనమీ నిర్ణయం తీసుకోగలిగాము. అయినా ఒక సారి హేమను పిలిచి విచారిద్దాము,  మీరొక పది నిమిషాలు వుండండి.  ఇంతలో టీ తీసుకోండి” అంది కల్యాణి.

హేమ వచ్చింది. “ఎక్స్యూజ్ మి మేడం” అని తలుపు దగ్గర నిలబడింది.

” కమిన్” అని కూచోమని  కుర్చీ చూపించింది కల్యాణి.

” కాంటీన్ గోడపై చిత్రం గురించి విచారణకు పిలిచాము. నువ్వు ఫిర్యాదు చేయలేదెందుకు?”

” అందులో యేముంది మేడం? అంతకన్నా వికారమైన బొమ్మలు గీస్తారు మగపిల్లలు. చదువు తక్కువ, పిచ్చి పనులెక్కువ. వీటి గురించి ఆలోచించడం టైం వేస్ట్. అందుకే ఫిర్యాదు చేయలేదు” అని నిర్భయంగా చెప్పింది హేమ.

” ఒక ఏడాది నుంచి రవి, నీ వెంటపడుతున్నాడు గదా! ఆ విషయం మా కెవరికీ చెప్పలేదెందుకు?  కొంచెం తీవ్రమైన స్వరంతో అడిగాడు సుబ్రమణి.

” సర్! ఇది కాలేజిలో జరిగే సాధారణ విషయమని చెప్పలేదు. ప్రతి సంవత్సరం, ఎవరో ఒకరు వెంటపడడం, అమ్మాయిలు కాదనడం జరుగుతూనే వుంటుంది. కానీ ఇలా జరగడం, అందులో నేనుండడం,  దురదృష్టం” అంది హేమ నిర్భయంగా.

” నువ్వు మాకు ముందే చెప్పివుంటే, అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి బాగా చడువుకునేలా చేసి వుండేవాళ్ళం, ఈ సంఘటన జరిగేది కాదు” అంది అఖిల.

” సారీ మేడం! నేను ఆ కోణంలో ఆలోచించలేదు” అంది హేమ వినయంగా.

”  ఏదైనా నువ్వు ఒక లక్ష్యంతో చదువుకుంటున్నందుకు మాకెంతో  సంతోషంగా వుంది. నీకు నా అభినందనలు. మీరేమంటారు సుబ్రమణి?  ” అంది అఖిల

” ఇలాంటి సంఘటనలలో, ఆడపిల్లలు కన్నీళ్ళతో వచ్చి, కంప్లైంట్ చేస్తారు. ఇదంతా సిల్లీ అని తీసిపారేసిన నిన్ను చూస్తే, గర్వంగా వుంది. కానీ ఒక విషయం గుర్తుంచుకో. ఒక వ్యవస్థలో వున్నప్పుడు, నీకెదురైన సమస్యను నువ్వు తెలియచెబితే, అది అందరిదీ అవుతుంది.  అందరూ కలిసి చిన్న పామునైనా పెద్దకర్రతో కొట్టాలి. ఆల్ ది బెస్ట్”  అన్నాడు సుబ్రమణి.

” ఇంక నీవు వెళ్ళ వచ్చు. అవసరమనిపిస్తే అఖిల మేడం లేదా సుబ్రమణి సారుని కలిసి మాట్లాడు ” అంది కల్యాణి.

హేమ వెళ్ళిన తర్వాత,   కల్యాణి అనుమతితో అఖిల, సుబ్రమణి వెళ్ళిపోయారు.

***

కూతురి వ్యక్తిత్వం, లక్ష్య సాధన పట్ల ఆమెకున్ననిబద్ధతను  చూసిన కల్యాణి ఆనందానికి అవధులు లేవు.  అయితే హేమ మనసును గాయపరిచి, ఆమెను ఒక సాధకురాలిగా చేసినది  ఒక విషాద సంఘటన అన్న విషయం ఆమెను బాధించింది.  సరిగ్గా  ఆరేళ్ళ క్రితం, ఇంకొక స్త్రీని కోరుకుని, ఆమె భర్త సుకుమార్, ఆమెను, అప్పుడే యింటరు క్లాసులోకి అడుగు బెట్టిన కూతురిని కాదనుకుని వెళ్ళిపోయాడు.

ఆ రోజు జరిగిన సంభాషణ,  జ్ణాపకాల తెరలు తీసుకుని,   అప్పుడప్పుడు కంటి ముందు నిలబడుతూనే వుంది.

” మీరు నన్ను కాదనుకుని వెడుతున్నారు. అది మీ యిష్టం. అభ్యంతరం లేకుంటే  కారణం చెప్పండి.” అంది కల్యాణి.

”  ఇదిగో ఇదే.  నువ్వు అందరి ఆడవాళ్ళలా కాదు. ఇంకొకరైతే, ఏడ్చి రాగాలు పెడతారు.  నీలో ఆడతనం తక్కువ. గంభీరంగా వుంటావు. ఎంత సేపు చదువు, పని.  ఒక సరదా లేదు, సరసం లేదు. అందుకే ఒక మామూలు ఆడదాన్ని చూసుకున్నాను” అన్నాడు సుకుమార్.

అతని నిందారోపణ విన్న కల్యాణికి,  పెళ్ళికి ముందు ఆమె  తల్లి చెప్పిన మాటలు గుర్తుకు వచ్చాయి.

” చూడమ్మా! నీది మీ నాన్న పోలిక. హుందాగా, గంభీరంగా వుంటావు.  అందుకు తోడు కంటి అద్దాలు.  చదువు, చదువు అని డిగ్రీలతో పాటు కళ్ళజోడు తెచ్చుకున్నావు.  నీ విద్యార్ధులు నిన్ను మెచ్చుకోలుగా గౌరవంగా చూస్తారు. మంచిదే, కానీ  పెళ్ళి చేసుకొనే వాడు అలా చూడడు . అందుకని కాస్త సిగ్గు పడటం,  తలవంచుకుని మాట్లాడడం చెయ్యి. పెళ్ళయ్యాక, మొగుడు చెయ్యేస్తే, విసుగ్గా చూడకు. మగవాడికి ఒక అహంకారం వుంటుంది. తన స్పర్శ, తన ముద్దు, తన కౌగిలింతలతో ఆడది పులకరించి, మైమరచిపోతుందని.  కలిగిన కలగక పోయినా అలాంటి భావాలు చూపించు. అణుకువగా మసులుకో.  పుస్తకాలు ప్రక్కన పెట్టి, నాలుగు సినిమాలు చూడు. ”

కల్యాణీ తల్లి మాటలు గౌరవించింది. మూడ్ వున్నా లేకున్నా,  వేళా పాళా లేకుండా అతడి కోరికల కనుగుణంగా జీవించింది. ఒక  బిడ్డను కంది. అటు వుద్యోగంలో వరుసగా  ప్రమోషన్లు తెచ్చుకుని ఒక సంస్థకు డైరెక్టరయ్యింది.  అధికారం, కారు, బంగళా, నౌకర్లు, పెద్దలతో పరిచయాలు.  బహుశా వీటివల్ల  అతని అహం దెబ్బ తింది. ఫలితంగా, ఇన్నాళ్ళ తన బానిసత్వానికి అర్ధం లేకుండా పోయింది.

” మన  కూతురి సంగతి” కూతురికి అతడు చేస్తున్న అన్యాయం అతనికి తెలియచెయ్యాలని అడిగింది

” నువ్వున్నావుగా. డబ్బు, హోదా అన్నీ వున్నాయిగా.  చదివించి, పెళ్ళి  చేసి పంపించు” అన్నాడు విసురుగా.

కల్యాణి మారు మాట్లాడలేదు. అతను తన సామాను తీసుకుని వెళ్ళిపోయాడు.  తల్లి తండ్రుల మధ్య   జరిగినదంతా మేడ మెట్ల మీద నిలబడి చూస్తున్న హేమ,  తల్లి దగ్గరకు వచ్చి,” పోయింది పీడ. హాయిగా, స్వేచ్చగా వుండమ్మా” అంది.

కల్యాణి ఆశ్చర్యంగా చూసింది కూతురి వైపు.

” నువ్వు యేడవకు. నేనూ యేడవను. ఆయన వున్నా లాభం లేదు.వెడితే వచ్చిన నష్టమూ లేదు. కొన్నేళ్ళ తర్వాత తిరిగి వస్తే, భర్త అని నువ్వు లోనికి రానిస్తావేమో, నేను ఆయన ముఖం కూడా చూడను. నా నిర్ణయానికి వ్యతిరేకంగా చేస్తే, నాకు నువ్వు కూడా వద్దు”  అని గట్టిగా చెప్పి మేడ మీదికి వెళ్ళిపోయింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు తండ్రి ప్రస్తావన రానివ్వలేదు.

ఇలాంటి బంగారు తల్లిని దూరం చేసుకున్నాడు సుకుమార్. నిజంగా దురదృష్టవంతుడు” అని కల్యాణి జాలి పడింది.  ఆ రోజు  సుకుమార్ కు తెలియదు. తన నిర్ణయం మారినా హేమ నిర్ణయం మారదని,

***

ప్రేమ సమస్య ఒక దారికి వచ్చిందనుకుంటూ, సాయంత్రం ఆరు గంటలకు ఇంటికి వచ్చిన హేమకి మరో పరీక్ష యెదురైంది.  ప్రవేశ ద్వారం దగ్గర నిలబడి కల్యాణి, ఒక పురుషునితో మాట్లాడుతోంది. అతడు తన కన్నతండ్రి  సుకుమార్ అని గుర్తించిన ఆమెకు చిర్రెత్తుకొచ్చింది.  కొద్ది దూరంలో ఆగి వారి సంభాషణ వినసాగింది.

“ఎలా వున్నావు?  పాప యెలా వుంది” ఆప్యాయత వొలబోస్తూ అడిగాడు సుకుమార్

” బాగున్నాను. హేమ బి.టెక్ నాలుగో సంవత్సరం. రాంక్ స్టూడెంట్” అని కల్యాణి గంభీరంగా చెప్పింది.

” మీ ఇద్దరిని ఒక సారి చూడాలనిపించింది” అన్నాడు సుకుమార్.

” నన్నుచూసావు. హేమ అదిగో కాలేజ్ నుంచి  వచ్చింది” అంది కల్యాణి.

సుకుమార్ కూతురిని సంతోషంగా పలకరించాడు.

” బాగున్నావా అమ్మా!”

అప్రసన్నంగా వున్న హేమ ముఖంలో, కటుత్వం చోటు చేసుకుంది.

” ఓ! సుకుమార్ గారు, ఇలా వచ్చారేం? నీకు అణగి మణగి వున్నమా అమ్మను అవమానించావు. నీ ప్రేమ కోరుకునే కూతుర్ని, నన్ను వదిలేసావు. తెలుసుకో.  ఇది జీవితం. సినెమా కాదు. కన్నీళ్ళతో నాన్నాఅని నిన్ను కౌగలించుకోవడానికి. కామంతో పశువులా కుటుంబాన్ని వదిలి వెళ్ళిన  నీ వారసత్వం, నీ నీడ నాకొద్దు.  పోయి ఎవరితో వుంటావో వుండు.  రా అమ్మా!” అని కల్యాణీని తీసుకుని లోపలికి వెళ్ళి తలుపులు వేసేసింది హేమ.

“కూతురి నిర్ణయమే నా నిర్ణయం” అని అనుకుంటూ కల్యాణి ఒక నిట్టూర్పు విడిచింది.

***

” హేమా! నీ స్నేహితురాలిగా ఒక మాట చెప్తున్నాను.  నీ నిర్ణయాల వెనుక మగద్వేషం వుంది. ఇలా వుండడం నీకు మంచిది కాదు. మారాలి నువ్వు” వేడుకోలుగా అంది సౌజన్య.

హేమ నవ్వుతూ అడిగింది ” నీ కలా యెందుకనిపించింది” .

“రవి మంచి వాడు, నువ్వెలా చెప్తే అలా వినేవాడు.  అతడిని కాదన్నావు.  మీ నాన్న. ఏదో నిన్ను చూడాలని వచ్చాడు. గేట్ దగ్గరే ఆయన్ని తిట్టి పంపించేసావు. రేపు నీ పెళ్ళి, మీ నాన్న లేకుండానే చేసుకుంటావా?”

“ఇంతకు ముందు చెప్పాను. మళ్ళీ చెప్తున్నాను. మంచి వుద్యోగం వచ్చేదాకా, నవమన్మధుడు వచ్చినా, బిలియనీర్ వచ్చినా, నేను చెప్పేది నో. నా కాళ్ళ మీద నిలబడిన తర్వాతే, ప్రేమా, పెళ్ళి. ఇందులో ద్వేషాలు, ఆవేశాలు లేవు. ఆలోచనే వుంది. నా లక్ష్యం పట్ల నిబద్ధత  వుంది. నేను కాదన్నానని,  రవి యేదైనా ఆఘాయిత్యానికి పాల్పడితే, నా మీద పోలీసు కేసు అవుతుంది. ఆ భయంతోనే, నిన్ను మా సంభాషణలను రికార్డ్ చేయమన్నాను.  ఇంక నా నాన్న. ఆయన యిప్పుడు నాకు పరాయి వ్యక్తి. నా మనసు, అమ్మ మనసు ముక్కలు ముక్కలు, చేసిన వ్యక్తికి, నా పెళ్ళి చేసే గౌరవాన్నెలా ఇమ్మంటావు?  నా ప్రతి నిర్ణయం వెనుక వున్నది స్త్రీ జాతి ఆత్మాభిమానం, నా సామర్ధ్యం వల్ల్ల ఇనుమడించిన ఆత్మవిశ్వాసం”

మనం తీసుకునే ప్రతి నిర్ణయం మన జీవితానికి ఒక నిచ్చెన మెట్టుకావాలని యువత గ్రహించి నిర్ణయాలు తీసుకోవాలని ప్రొఫెసర్ అఖిల తరచూ చెప్పే మాటలు గుర్తుకు వచ్చాయి సౌజన్యకు. ఆమె మనసు తేలిక పడింది. నిస్సందేహంగా, సుస్పష్టంగా హేమ చెప్పిన సమాధానాలు ఇప్పుడు సౌజన్యకి భయం కలిగించడం లేదు. సముద్రపుటలలలా ఆమె నిర్ణయాలు వెనక్కి జారిపోవు. సునామీను తట్టుకుని యెదిగిన నగరంలా,ఆమె ప్రగతి పథంలో సాగిపోతుంది.

*

సి. ఎస్. జీ. కృష్ణమాచార్యులు

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు