1.
ఓడ అక్కడే
ఉండిపోతుంది
కదలికలు నాతో పాటు వచ్చేస్తాయి
నది పారుతూనే ఉంటుంది
తరంగాలు నా వెనువంట వచ్చేస్తాయి
ఇప్పుడు నాలోపల
ఎన్ని ప్రవాహాలో చెప్పలేను
మన తొలి కరచాలనం
నుంచి ఇప్పటి దాకా ప్రయాణిస్తున్న
నావల తో
అంతర్వాహిని నిండిపోయింది
ఒక్కో నావ ఒక్కో జ్ఞాపక దీపం
నీ నవ్వు ఒక తారా తీరం
ఓ నా సముద్రమా
నిన్ను నా ప్రేమ తో నింపేయ్యడానికి
ఎన్ని నదులు నాలోంచి నీలోకి
పారుతున్నాయో తెలుసా?
నీ నిండుదనం కోసం
నేను నీలోకి జీవనతడితో పయనిస్తూనే ఉన్నాను
యుగయుగాలుగా ….
2
“నీ వద్ద ఏమున్నాయి?” నాకు చెందినవి అనడిగాను
“నా ముంగురులను సవరించే నీ వేలి స్పర్శ,
నా మెడ మీద నువ్వొదిలే ఊపిరి పరిమళం
నీ ప్రాణంలో జీవితంలా కొట్టుకులాడే నా ప్రతిబింబం”
అన్నదామే!
3
నువ్ళెళ్ళిపోయావు-
నీ నవ్వు
మాత్రం నింగి పై నెలవంకయ్యింది
నేను నడుస్తున్నంత మేరా
నాతో పాటు కదులుతూ ఉంది
వెన్నెల వసంతం నాపై కురిపిస్తూనే
ఉంది
నేను నిదురించడానికి
ఉపక్రమిస్తానా
నా తలగడగా మారి తల
నిమురుతుంది
కలతన్నదే లేని జీవితానికి
కన్నతల్లిగా మారావు కదా!
నా కదలికల
కాలాన్ని కవిత్వంగా మలుస్తున్న
ప్రియతమా!
4.
రోజుల్ని ప్రేమించడం
పరిసరాల్ని ఆదరించడం
సహచరులతో సఖ్యతగా ఉండడం
ఓహ్
ఎన్ని సుగుణాలు నీవి?
చూడగానే సలాం చేయాలనిపించే
ముఖం
ఒక్క భృగుటీ ముడిపడని
నుదుటి ఆహ్లాదం
ఆగాగు
అక్కడికే వస్తున్న
జీవితం లో పోరాటం భాగం అయిపోయింది నీకు –
నాతో వచ్చేసాక,
ఏ భౌతిక వనరు పై కోరిక ప్రదర్శించని
నీవు
ఒక్క ప్రేమ పంచడం కోసం పుట్టటం ఏమిటీ?
ఏ సమాజ నియయం ఇదీ!!
నా ఆకలి కి నీ ఆకలి జత కాలేదు
నా కష్టానికి నీ కష్టం అడ్డుపడిపోతుందెప్పుడూ?!
పక్క కూడా సరిగా లేని లోగిలిలో
నీ చేయి నా తలగడగా మారి నీలోపలికి
చంటిపాపనై ఒదిగిపోని రాత్రి లేదెప్పుడూ!?
ఖాళీ గిన్నెల్లో ఎండమావులు
కదులుతున్నపుడు
నా చూపు మీదికి నీ అభయహస్తం సీతాకోకచిలుక లా వాలిపోతుంది
నా కంటి కోసకి కన్నిటి బరువు తెలియకుండా చేస్తుంది
ఎక్కడ నుండి వచ్చిందీ నీకింత ధైర్యం
అప్పుడెప్పుడో ఫ్రాన్స్ ను కాపాడిన
జోన్ ఆఫ్ ఆర్క్ నువ్వు నా ప్రాణానికి
నీ నుంచి చాలా
నేర్చుకోవాలి ఈ ప్రపంచం
ప్రేమించడం, త్యాగం
తెలియని ప్రతి శూన్యహృదయం లో
తోటలను పుష్పించగల
సేద్య కళకి పట్టపురాణీ
నా జీవన వీణ మీద మోహనాన్ని వినిపిస్తున్న
సువాణీ…
నీకు నేను నాకు నువ్వు
జీవితం చెట్టు పై జంట పక్షులమై
ఇలా మిగిలిపోయాం
యుగయుగాలుగా…
ఒక్కో నావ ఒక్కో జ్ఞాపక దీపం