ఆమె ఇల్లు

డాక్టర్ సూర్యతేజతో నా పెళ్ళి అలా  రద్దయిపోతుందని ఎవ్వరూ అనుకోలేదు. అసలు నేనే అనుకోలేదు. అయితే సూర్యా అదంత తేలిగ్గా తీసుకోలేదు. మధ్యాహ్నం సూర్యుడిలా మండి పడ్డాడు. నన్ను నానా మాటలూ అన్నాడు.

నేను ఆ రాత్రి సూర్యాని వొదిలేసి మొదలు పెట్టిన పరుగు మా అపార్ట్‌మెంటుకొచ్చేవరకూ ఆపలేదంటే నమ్మండి. ఆ మర్నాడే మా పెళ్ళి కేన్సిల్ అని అతనితో, మా అమ్మతో, మా స్నేహితులతో చెప్పేసాను. తొందరపడ్డానేమో అని నా మనసు పీకిన మాటా నిజమే. ఐతే, ఆ పెళ్ళి కేన్సిల్ చేసిన తరవాతే నా ఊపిరి మళ్ళీ నాకు తిరిగొచ్చినట్టయింది. అసలు కథ మొదటినించీ చెప్పుకొస్తాను.

అసలు ఎవరైనా దయ్యాలూ భూతాలున్నాయని నమ్ముతారా? నేనయితే నమ్మేదాన్ని కాదు. ఇప్పుడు నమ్ముతానో లేదో చెప్పడం కష్టం. కానీ సమస్యంతా మాటిమాటికీ నాక్కనిపించే  యమున దయ్యంతోనే వచ్చింది. మరయితే యమున బ్రతికే వుంది. చచ్చిపోయిన వాళ్ళు దయ్యాలవడం విన్నాం కానీ బ్రతికున్నవాళ్ళు దయ్యాలవడం ఎక్కడన్నా విన్నామా? మరి నేను చూసింది మనిషీ కాక దయ్యమూ కాక మరేమిటి? అయ్యో! మొదట్నించీ చెప్తానని మళ్ళీ మధ్యలోంచే కథ చెప్తున్నట్టున్నాను. నిజంగా మొదట్నించి చెప్తాను.  నాలుగయిదేళ్ళ క్రితం సంగతి!

***

ముప్పై దాటి రెండేళ్ళు కావొస్తూ వుండడంతో అమ్మతోపాటు నాకూ ఇక పెళ్ళవుతుందన్న ఆశ సన్నగిల్లుతూ వున్న రోజులు. ఇంట్లో అమ్మా, నేనూ ఇద్దరమే.  అమ్మ చెప్పి చెప్పీ అలిసిపోయి వదిలేసింది. అన్నయ్యకి నాకు పెళ్ళవకపోవడమే బాగున్నట్టుంది, ఆ సంగతే ఎత్తడు.

ఇరవైకీ పాతికకీ మధ్యలో సమయమంతా చార్టర్‌డ్ అకవుంటెన్సీ పరీక్షలతో గడిచిపోయింది. ఆ తరవాత మంచి ఉద్యోగం సంపాదించుకోవడం, దాన్లో నిలదొక్కుకోవడమూ ఐపోయి తల పైకెత్తి చూసేసరికి ముప్ఫై రానే వొచ్చాయి. నాతోటి వాళ్ళందరికీ పెళ్ళిళ్ళయి ఇద్దరేసి పిల్లలు కూడా పుట్టారు. నాకు సంబంధాలు చూసే ఓపికా, తీరికా ఎవరికీ లేవు. అమ్మ చేసే పనికన్నా, పెట్టే గోలే ఎక్కువ. నాకు నేనే సంబంధాలు  చూసుకోవడానికి ఏదో మొహమాటం. అటువంటి రోజుల్లో క్రితం సంవత్సరం ఒక స్నేహితురాలు మాధురి కూతురి నాలుగో పుట్టినరోజు పార్టీలో కలిసాడు డాక్టర్ సూర్య తేజ.

అతనూ నాలానే చదువూ, కెరీర్ ధ్యాసల్లో పడి పెళ్ళి నిర్లక్ష్యం చేసాడు. ఇప్పుడు నలభైకి చేరువలో వున్నాడు. అతనికి ఎవరూ నచ్చటం లేదట. అతన్ని నాకు పరిచయం చేయడానికే ఆ పార్టీకి పిలిచనట్టుంది మాధురి. లేకపోతే చిన్న పిల్లల పార్టీకి నన్ను పిలవడం ఏమిటి, అనుకున్నా ఆ తరవాత.

ఆ రోజైన పరిచయం మెల్లమెల్లగా పెద్దదయింది. అందుకు అతని ఉత్సాహంతో పాటు నా ప్రోత్సాహమూ వుందని ఒప్పుకుంటాను. అతనితో మాట్లాడుతూ వుంటే టైమూ, ప్రపంచమూ తెలియదు. తప్పు, తప్పు. సూర్యాతో మనం మాట్లాడడమంటూ వుండదు, అతను చెప్తూ వుంటే వినడం తప్ప. అవడానికి డాక్టరైనా, ఈ భూమ్మీద అతనికి తెలియని సబ్జెక్టు లేదేమో అనిపిస్తుంది.

అమ్మతనం నుంచి, అణుశక్తిదాకా, కవిత్వం నుంచి ప్రపంచ యుద్ధాల దాకా, అనర్గళంగా, సోదాహరణంగా, సాధికారికంగా రకరకాల కోణాలనించి విశ్లేషించి ఒక విషయాన్ని అరటి పండు వొలిచి పెట్టినట్టు మనకి వివరించగలడు. చదరంగం ఆటల్లో నాలుగే ఎత్తుల్లో ప్రత్యర్థిని మట్టి కరిపించే ఆటగాళ్ళుంటారని విన్నాను. ఎవరైనా తన అభిప్రాయాల్తో విభేదిస్తే వాళ్ళ నోరు నాలుగే వాక్యాల్లో మూయించగలడు సూర్య. అసలు సూర్య ఒక విషయం గురించి తన అభిప్రాయం చెప్పాక అతనితో ఏకీభవించడం తప్ప మనమింకేమీ చేయలేము. ఆ వాక్చాతుర్యమూ, సెన్సాఫ్ హ్యూమరూ, అందమైన రూపమూ, వాటికే నేను తలలోతు ప్రేమలో పడిపోయాను.

అయితే, అందులో కూడా ఒక విశేషం వుంది. ఎవరైనా అతనితో విభేదించి, వాదన పొడిగించారనుకోండి, అప్పుడతను వారివంక గంభీరంగా, కళ్ళు పెద్దవి చేసి అదొకలా చూస్తాడు. అప్పుడు ఆ విభేదించిన మనిషికి తనకి తనే పురుగులా అనిపించడం మొదలవుతుంది. భూమి అక్కడికక్కడే రెండు ముక్కలయి, తనని లోపలికి లాక్కుంటే బాగుండన్న ఆశా పుడుతుంది. మొత్తం మీద అదోక పీడకల లాటి అనుభవమైపోతుంది. అందుకే కాబోలు ఎవరూ అతని అభిప్రాయాలని ఖండించి బ్రతికి బట్ట కట్టడం చూడలేదెవరూ.

అదలా వుంచితే, ఆ తరవాత ఆరు నెలల్లో అతను పెళ్ళి ప్రసక్తి తేగానే రెండో ఆలోచనలేకుండా సరేనన్నాను. నిజానికి అతను నన్ను పెళ్ళి చేసుకుందామా అని అడగలేదు. మేమిద్దరం పెళ్ళాడబోతున్నట్టు నాతో చెప్పాడంతే. నేను సంతోషంతో తలూపాను.

నా స్నేహితులైతే నా అంత అదృష్టవంతురాలు ఈ భూమ్మీద లేనే లేదని తీర్మానించేసారు. ఆ మాట నిజమేనని నాకూ, అమ్మకీ కూడా అనిపించినమాటా నిజం. మంచి కార్పొరేట్ ఆస్పత్రిలో పెద్ద డాక్టరు, విశాలమైన స్వంత ఇల్లూ, అత్త మామలూ, ఆడపడచుల బెడద లేని కాఫురం.

అలా ఇద్దరమూ పార్కులూ, సినిమాలూ చుట్టబెట్టేస్తున్న రోజుల్లో ఒక రోజు యమున గురిని చెప్పాడు సూర్య. యమున అతనికి ఇంతకు ముందు నిశ్చయమై, పెళ్ళి రద్దు చేసుకొని వెళ్ళిపోయిన మళయాళీ అమ్మాయి. నర్సు ట్రైనింగ్ అయి ఒక చిన్న నర్సింగ్ హోంలో పని చేసేదట. సూర్య ఇంతకుముందున్న ఫ్లాటు పక్క ప్లాటులోనే తన స్నేహితురాలితో కలిసి వుండేది యమున. వాళ్ళిద్దరి పరిచయం అలా జరిగిందన్నమాట.

అసలు సూర్య లాటి పెద్ద డాక్టరూ, తెలివైనవాడూ, అందగాడూ తనలాటి మామూలు అమ్మాయిని పెళ్ళి చేసుకోవాలనుకోవడమే గొప్ప. ఈ విషయం చుట్టూ వున్న వారికర్థమైనట్టు యమునకర్థమైనట్టు లేదన్నాడు సూర్య. తన ప్రవర్తనలో, మాటల్లో ఏ మాత్రం కృతజ్ఞత కనబడేది కాదట. తన నర్సుద్యోగమే చాలా గొప్పదన్నట్టు మాట్లాడేదట. పెళ్ళి నిశ్చయం చేసుకున్నాక తనున్న ఫ్లాటు వొదిలేసి ఇప్పుడు తనుంటున్న ఈ విశాలమైన బంగళా కొన్నాడట సూర్య.

సూర్య మాటల్లో –

“ఇంటికి కావాల్సిన సామాన్లు కొనడానికి షాపింగ్ చేద్దాం రమ్మంటే టైం లేదనేది, మనీషా! బోడి నర్సుద్యోగానికి టైం లేకపోవడమేంటి సిల్లీ జోక్ కాకపోతే! అసలు తనని ఉద్యోగం మానేయమన్నాను. ఆ నర్సింగ్ హోం వాళ్ళిచ్చే గొర్రె తోక జీతానికి తనని తాను అంత స్ట్రెస్ చేసుకోవడమా అన్నాను. నువ్వే చెప్పు, దాన్లో ఏమైనా తప్పుందా? నేను బోలెడు డబ్బు సంపాదిస్తున్నాను. అది ఖర్చు పెట్టుకుంటూ హాయిగా పిల్లల్నీ నన్నూ చూసుకుంటూ వుండమన్నాను. అదిగో ఆ రోజునుంచి కొంచెం మూడీగా అయిపోయింది. ఉద్యోగం మానలేదనుకో.

ఇద్దరం కలిసి ఆదివారాలు షాపింగ్ చేసేవాళ్ళం ఇంటి సామాను కోసం. అసలు ఆడవాళ్ళకి షాపింగ్ అంటే ఎంత సరదా వుండాలి? ఏమీ లేదు. ఏదో పోగొట్టున్నట్టు ఏడుపు మొహం పెట్టుకుని వుండేది. ఒకరోజు నాకనుమానం రానే వొచ్చింది, అసలు ఈ అమ్మాయికి ఈ పెళ్ళి ఇష్టం లేదేమో అని. కానీ నేనే నవ్వుకున్నాను. నాలాటి భర్త తనకి ఎన్ని జన్మలెత్తితే దొరకాలి? ఇష్టం లేకపోయే ఛాన్సే లేదు. అలవాటైన లైఫ్ స్టైల్ వొదిలేసి కొత్త స్టైల్‌కి అడ్జస్ట్ కావాలంటే ఆడపిల్లకి ఆ నెర్వెస్‌నెస్ సహజమే అని ఆ ఏడుపు మొహాన్ని పట్టించుకోవడం మానేసాను.

ఒక ఆదివారం బయట లంచ్ చేసి, మధ్యాహ్నం ఇంటికి కావాల్సిన కర్టెన్లూ, కొంచెం వంటింటి సామాన్లూ కొనుక్కొని కొత్త ఇంట్లోకి వెళ్ళాం. నేను పైన పని వాడితో కర్టెన్లవీ పెట్టిస్తున్నాను. యమున కింద కిచెన్లో సామాను సర్దుకుంటూ కిందే వుండిపోయింది.

“యమునా, కొంచెం కాఫీ పెట్టిస్తావా” అని పైనించే అడిగాను. పైకి కాఫీ తెచ్చిచ్చింది. పనబ్బాయి కర్టెన్లు బిగించి డ్దబ్బు తీసుకొని వెళ్ళిపోయాడు. ఒక అరగంటాగి కిందికి వెళ్ళి చూద్దును కదా, తనేం చేస్తుందనుకున్నావ్? ఫ్రిజ్జుకీ, గోడకీ మధ్య నక్కి కూర్చోని వుంది. చేతులతో మొహం కప్పుకోని వుంది. జడుసుకున్నాను. మెల్లిగా బయటికి తీసుకొచ్చి కూర్చోపెట్టాను. ఏమయిందని అడిగితే ఎంతడిగినా చెప్పలేదు. కాసేపాగి లేచి వెళ్ళిపోయింది. ఒకే, ఒప్పుకుంటాను, తనడిగిన లేత రంగులు కాకుండా కొంచెం ముదురు రంగు కర్టెన్లు తెచ్చాను. అవైతే రూమంతా చీకటిగా వుండి నిద్ర బాగా పడుతుందని నా అభిప్రాయం. సరే, దాని గురించి కొంచెం వాదన జరిగింది కూడా. అంత మాత్రానికే అలా జీవితం తగలబడిపోయిన దానిలా డ్రామా చేయాలా?

మళ్ళా రెండు వారాల తర్వాత ఒక రాత్రి డిన్నర్కెళ్ళాం. ఆ రోజు తన పేషెంటు ఎవరి గురించో చెప్తోంటే కొట్టిపారేసాను. అందులో తప్పేముందో నాకైతే అర్థం కావటంలేదు. నువ్వే చెప్పు. మందుల గురించి తనకి ఎక్కువ తెలుస్తుందా నాకా? ఐనా చెప్పేది వినకుండా మూర్ఖంగా వాదిస్తూంటే ఆ మాటే కొంచెం ఘాటుగా అన్నాను. అంతే, ఇక మళ్ళీ మౌనం. ఓ సరదా కబుర్లు లేవూ, ముచ్చట్లు లేవూ. తనని తన ఫ్లాటు దగ్గర దిగబెట్టి నేను ఇంటికెళ్ళిపోయాను.

మర్నాడు తన ఫ్లాట్‌మేట్ ఆందోళనగా ఫోన్ చేస్తే వెళ్ళాను. ఈ సారి సోఫాకీ గోడకీ మధ్య నక్కి కూర్చుంది. అసలు అంత ఇరుకు స్థలాల్లో ఆ అమ్మాయి ఎలా పడుతుందో మరి! ఏమిటని అడిగితే, ఏదో అర్థం కాని భాషలో ఆ పెద్ద పెద్ద కళ్ళేసుకోని అంతకంటే పెద్ద డైలాగులు. ఒక్క ముక్క అర్థం అయితే ఒట్టు. అది మళయాళం అట. యమున పరిచయం అయి అప్పటికి యేడాది కావొస్తున్నా నాకొక్క మళయాళం మాట కూడా తెలియదు. అసలా భాషే అందం చందం లేని భాష. ఏదో డబ్బాలో గులకరాళ్ళేసి ఆడించినట్టు. అందుకే యమునతో ఒకసారి చెప్పా కూడా, ఇంట్లో తెలుగో లేకపోతే ఇంగ్లీషోనని.

ఎనీహౌ, ఆ రోజు కూడా ఎలాగో తనని బయటికి తీసుకు రాగలిగాను. కానీ ఎందుకో ఈ పెళ్ళి ఎలా జరుగుతుందోనని భయం పట్టుకుంది నాకు. అందులోనూ స్నేహితులతోనూ, ఇంట్లోనూ అందరికీ చెప్పేసాను మా పెళ్ళి గురించి. మా కజిన్స్ చాలా మందికి నాకేదైనా సమస్య వొస్తే బాగుండని మహా ఇదిగా వుంది. అందుకే ఎలాగో తనకి సర్ది చెప్పి ఈ పెళ్ళి సజావుగా జరిపించుకోవాలని నిశ్చయించుకున్నాను. ఎలాగూ పెళ్ళైతే అంతా నా ఇష్టమే కదా. నాలుగు రోజులు ఓపిక పడితే చాలనుకుని వున్నానా?

ఒకరోజు తన ఫ్లాట్‌మేట్ రోజీ ఫోన్ చేసి, “ఎంద సుర్యేట్టా, యమునా చేచ్చి కేరళ పోయి. నిండె వివాహం కేన్సిళ్,” అని చెప్పేసరికి మతిపోయింది. నేను వాళ్ళ ఫ్లాట్ చేరుకునేసరికి తమ వూరు వెళ్ళిపోయింది. మర్నాడు ఫోన్ చేసి పెళ్ళి రద్దని చెప్పింది. నాకు కేరళ వెళ్ళి తనని ఒప్పించే ఓపికా తీరికా లేక వొదిలేసాను. అదీ జరిగింది మనీషా. నా తప్పేమైనా వుందేమో చెప్పు. నీకు ముందే ఇదంతా తెలియడం మంచిదని చెప్తున్నాను. ” చెప్పి రెండు గ్లాసుల మంచి నీళ్ళు తాగాడు సూర్యా. నాకైతే సూర్యా తప్పేమీ కనబడలేదు. యమునకే ఏదో సైకలాజికల్ డిజార్డర్ అనుకొని ఆ విషయం గురించి ఆలోచించడం మానేసాను. యమున ఫోటో కూడా తన మొబైల్ ఫోన్లో చూపించాడు సూర్యా.

******************

ఆ తరవాత శనివారం నేనూ సూర్యా మధ్యాహ్నం రెస్టారెంట్‌లో భోజనం చేసి సూర్య ఇంటికెళ్ళాం.

పెళ్ళయ్యాక నేనూ అక్కడికి నా సామాను తీసికెళ్ళాలి కాబట్టి ఒకసారి ఇల్లు చూస్తే, నా సామాను ఎంత తెచ్చుకోవాలో ఏదేది ఒదిలేయాలో ఒక ఐడియా వొస్తుందని తీసికెళ్ళాడు సూర్య.

తను కాసేపు పడుకుంటానని సూర్యా బెడ్ రూంలో కెళ్ళాడు. నేను ఇల్లంతా తిరుగుతూ ఏ సామాను ఎక్కడ పెట్టుకోవాలో, ఇల్లంతా ఎలా సర్దుకోవాలో ఆలోచిస్తూ కూర్చున్నాను.

కొంచెం సేపటి తరవాత కాఫీ పెట్టుకోవానిపించి వంటింట్లో కెళ్ళాను.  పాలు తీద్దామని ఫ్రిజ్ దగ్గరకెళ్ళి చూసి కొయ్యబారిపోయాను. అక్కడ ఫ్రిజ్జుకీ గోడకీ మధ్య ముడుచుకొని కూర్చోనుంది యమున. మోకాళ్ళల్లో తల పెట్టుకోని జుట్టంతా మొహం మీద పడుతూ, అచ్చం దయ్యం లాగే! భయంతో కెవ్వుమన్నాను. నా కేకకి తలెత్తి చూసింది. ఆ పెద్ద పెద్ద కళ్ళల్లో ఏదో దైన్యం, దిగులు. మళ్ళీ కెవ్వు కెవ్వు మని అరుస్తూనే వున్నాను.

నా కేకలకి లేచి కింది కొచ్చాడు సూర్యా.

“ఏమయింది మనీషా?”

“అక్కడ యమున కూర్చోనుంది,” గడ గడా వొణుకుతూ ఫ్రిజ్ వైపు చూపించాను.

“యమునా? ఆర్ యూ మేడ్? ఇక్కడ యమున ఎందుకుంటుంది?” విసుగ్గా అడిగాడు.

“అవును, యమున ఇక్కడ ఎందుకుంటుంది? అయినా ఫ్రిజు పక్కనే కూర్చొని క్లియర్ గా కనిపించింది సూర్యా!”

“డోంట్ వరీ! అలిసిపోయి మనసు ఏదేదో భ్రమలకి లోనవుతుంది. అంతే. పద, నిన్ను మీ ఇంటిదగ్గర దింపేస్తాను.” మాట్లాడకుండా అతని వెంట ఇంటికెళ్ళిపోయాను. అతనూ చిరాగ్గా దారంతా ఒక్క మాటకూడా మాట్లాడలేదు.

*********

నేను ఆ ప్రసక్తి మళ్ళీ సూర్య దగ్గర ఎత్తలేదు, కానీ ఇంకో మూడు నాలుగు సార్లు యమున దయ్యాన్ని చూసాను. కనబడ్డ ప్రతీ సారీ నేను భయంతో కొయ్యబారిపోయేదాన్ని. సూర్యా ఇంట్లోనే, అలాగే ఫ్రిజ్జుకీ గోడకీ మధ్య ఇరుక్కొని కూర్చోని! కొంచెం విచిత్రమైన విషయమేంటంటే, ప్రతీ సారీ నేను సూర్యాతో సరదాగా గడిపి, ఇద్దరం భవిష్యత్తు గురించి కలలు కన్న తరవాతే జరిగేది.

నాకు నిజంగా ఏదో మతి భ్రమణం లాటిది కలిగిందేమో అని నాకే అనుమానం మొదలైంది. అయితే, మిగతా అన్ని విషయాల్లో నేను మామూలుగానే వున్నాను. ఆఫీసు పనిలో, అమ్మని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళడం, దేన్లోనూ ఎటువంటి పొరపాట్లూ జరగలేదు. కాబట్టి నాకు మతి భ్రమణం లాటిదేదీ లేదని నిర్ధారించుకున్నాను.

మరి నాకు ఇలా మాటి మాటికీ యమున రూపం ఎందుకు కనిపిస్తుంది? దయ్యమా అంటే, ఆమె వాళ్ళ వూళ్ళో హాయిగా బ్రతికే వుంది. మరి ఆ రూపం ఎవరిది, ఎందుకు కనిపిస్తుందినాది భ్రమా కాదూ, ఆమె రూపం నిజమూ కాదు. ఎలా సాధ్యం?

ఆ రోజుల్లో ఒక  పత్రికలో చదివాను. కొంతమందికి మానసిక శక్తితో తమని తాము  వేరొక చోటికి ప్రొజెక్టు చేసుకునే సామర్థ్యం వొస్తుందట. బహుశా యమునకి కూడా ఆ సామర్థ్యముందేమో!  అందుకే ఈ ఇంట్లోకి తనని తాను ప్రొజెక్టు చేసుకుంటుందేమో. కానీ ఎందుకు?

కొంచెం ఆలోచన తరవాత అనిపించింది నాకు, బహుశా యమునకి నేను ఈ ఇంట్లో వుండడం ఇష్టం లేదేమో. ఎంతైనా, ఈ ఇంట్లో తనూ సూర్యా కలిసి వుండాలని ఆశపడింది. అవన్నీ వొదిలేసుకుంది. బహుశా ఈ ఇంటిని నా నుంచి కాపాడుకుంటూందేమో!

మరైతే జీవితాంతం యమున రూపం నన్ను వెంటాడుతుందా? ఆ ఆలోచనకే భయం పుట్టింది. అసలు ఈ ఇంట్లో ఉండకుండా మేమిద్దరం ఇంకో ఇంట్లోకి మారిపోతే సరి.  ఏదైతే అదే అయింది, పెళ్ళయ్యాక ఈ ఇంట్లో వుండను. అలా నిశ్చయించుకున్నాక కొంచెం హాయిగా నిద్ర పట్టింది

ఆ పై శనివారం సూర్యాని కలిసినప్పుడు మెల్లగా ఆ బంగళా అమ్మేసి సిటీకి దగ్గర్లో ఒక మంచి ఫ్లాట్ కొనుక్కుందామని అన్నాను. నేననుకున్నట్టే సూర్యా కొట్టిపారేసాడు.

“ఆ ఇంటికోసం బోలెడంత డబ్బు ఖర్చు చేసాను మనీషా. ఇప్పుడు ఇల్లు అమ్మేస్తే మనకి చాలా నష్టం వొస్తుంది.”

“అయితే ఇల్లు అమ్మొద్దు. అద్దెకి ఇచ్చేద్దాం. మనం ఇంకో మంచి ఫ్లాట్ అద్దెకి తీసుకుందాం..”

“పిచ్చిగా మాట్లాడొద్దు మనీషా. ఊరికి దూరంగా వుండే ఆ ఇంటికి వొచ్చే అద్దె కంటే ఫ్లాట్ అద్దె చాలా ఎక్కువ. మనం పెట్టుకోలేం. డబ్బుకి ఇబ్బంది పడాల్సొస్తుంది. ”

చాలా ఆశ్చర్యపోయాను. పెద్ద కార్పొరేట్ ఆస్పత్రిలో చాలా యేళ్ళ నించి డాక్టర్‌గా ఉద్యోగం చేస్తున్న డాక్టర్ సూర్య తేజాకి డబ్బు సరిపోకపోవటమా? ఆ విషయమే అడిగాను. కొంచెం నసిగాడు సూర్యా.

“అంటే, అదీ, నాకు కొంచెం అప్పులున్నాయి మనీషా. అవన్నీ నెల జీతంతో తీరుస్తున్నాను. అవన్నీ పోను జీతం పెద్దగా మిగలటంలేదు!”

ఈసారి ఇంకా షాకయ్యాను.

“అప్పులా? నీకేం అప్పులు? ఎందుకైనవి?”

“అబ్బా! ఏదో చిన్న చిన్న అవసరాలకి చేసినవేలే. ఇంకా పెళ్ళవనే లేదు, అప్పుడే జీతం లెక్కలడుగుతున్నావే!”

సిగ్గుపడ్డాను. నిజమే, ఇప్పుడు పాత సంగతులెందుకు? ఐతే, “అతను కొంచెం భారీ ఖర్చు మనిషి” అని ఒక స్నేహితురాలన్నమాట నిజమేనన్నమాట. సరే, ఆ సంగతలా వుండనీ అనుకున్నా.

“అయినా పర్వాలేదు సూర్యా! నాకు జీతం బానే వొస్తుంది. ఫ్లాటుకి అద్దె చెల్లించినా మనం కంఫర్టబుల్ గానే వుంటాం.” మళ్ళీ ఉత్సాహం తెచ్చుకొని అన్నాను. ఈసారి అతనేమీ అనలేదు కానీ, అతని చూపు చూసాడు. మొహం గంభీరంగా, పెదిమలు బిగపట్టి, కళ్ళు పెద్దవి చేసి, మంచుగడ్డలాటి చూపు. “ఇక వాదన ఆపెయ్”, గట్టిగా చెప్పింది మనసు.

“నీ డబ్బుతో కుటుంబం నడవటం నాకెన్నటికీ ఇష్టం వుండదు మనీషా! ఇంకెప్పుడూ అటువంటి మాటలనకు.” మౌనంగా లంచ్ బిల్లు చెల్లించి లేచి వెళ్ళిపోయాడు.

ఏం చేయాలో తోచక అలాగే కూర్చుండిపోయాను. ఆ ఇంట్లో వుంటే యమున రూపం (దెయ్యమో, భ్రమో ఏదో ఒకటి) నన్ను అలాగే వెంటాడడం ఖాయం. ఆ ఇల్లు మారడం సూర్యా పడనివ్వడు.

ఇక ఒకటే మార్గం. ఈ పెళ్ళి రద్దు చేయడం.

ఆ మాటే సూర్యాతో ఆ పైవారం రాత్రి ఇద్దరమూ రెస్టారెంట్లో భోజనం చేస్తూండగా అన్నాను.

“నాకెందుకో పెళ్ళంటే భయంగా వుంది సూర్యా. ఈ పెళ్ళి నాకు ఇష్టం లేదు. పోనీ ఈ పెళ్ళి మానేద్దామా!” జంకుతూనే అన్నాను. విచిత్రంగా చూసాడు నావైపు.

“అమ్మాయిలకి ఆ మాత్రం భయం కలగడం సహజమేలే మనీషా. ఆ భయాన్ని పట్టించుకోకు.” అసహనంగా అన్నాడు.

“ఏమో సూర్యా. నాకేదో భయంగా, మనం సుఖంగా బ్రతకలేమేమో అని అనుమానంగా వుంది. నేను ఈ పెళ్ళి గురించి ఇంకొక్కసారి ఆలోచించుకోవాలి. ” ఈ సారి నసుగుతున్నట్టు కాక కొంచెం ఖచ్చితంగా అన్నాను.

అతని మొహంలో రంగులు మారాయి. ఆ తరవాత ఆకాశం నా మీద విరిగిపడ్డట్టైంది. అతని తిట్లూ, కోపం, ఏదో ముసుగు తీసేసినట్టు. ముందు తెల్లబోయాను. అతను కనీసం నాకెందుకు భయం వేస్తుందో కూడా అడగలేదు. పోనీ కొన్నాళ్ళు ఆగుదామనైనా అనలేదు.

ముందుగా నన్నూ, నా తలి తండ్రులనూ, వాళ్ళ పెంపకాలనూ నానా మాటలన్నాడు. నాకూ కొంచెం కోపం రావడం మొదలైంది, కానీ నన్ను నోరెత్తనిస్తేగా! నా అంత తెలివి తక్కువ దౌర్భాగ్యురాలు ప్రపంచం మొత్తం మీదా వుండదట. అక్కణ్ణించి మొదలైన దుర్భాష, నాలాటి డబ్బు సంపాదిస్తున్నామన్న అహంకారం తలకెక్కిన ఆడవాళ్ళందరి దగ్గరా వొచ్చి ఆగింది.

“ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళి కాకుండా వున్న అమ్మాయిలో ఏం లోపం వుందో అని కూడా ఆలోచించకుండా నిన్ను పెళ్ళాడడానికి ఒప్పుకున్నా చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి,” అని అంటూండగా ఇక ఇతని నీడ  కూడా భరించలేను, అని నా బాగు తీసుకొని ఆ రాత్రి అక్కణ్ణించి పరిగెత్తి వచ్చేసాను. అప్పటికే ఆ రెస్టారెంట్లో అందరూ మా వంక వింతగా చూడసాగారు.

ఆ రాత్రి అసలు నిద్ర పట్టలేదు. నిజంగా పొరబాటు చేస్తున్నానా? ఎవరైనా డాక్టరుకు చూపించుకోనా? కానీ ఈ పెళ్ళి జరిగాక రోజూ యమున దయ్యాన్ని చూస్తూ వుంటే నాకు పిచ్చెక్కటం ఖాయం. దయ్యం మాట అటుంచితే, అసలతనికా కోపం యేమిటి?

ఆ కోపమూ, ఆ కోపంలో ఎర్రబడి ముందుకు పొడుచుకొస్తున్న కళ్ళతో, పై పైకొస్తూ, చూపుడు వేలితో నా ముందు ఆడిస్తూ, పళ్ళు పటపటలాడిస్తూ, చదువూ సంస్కారం ఏమీ లేనివాడిలా నోటికొచ్చినట్టు అరుస్తూ వున్న అతని మొహం తలచుకుంటే నా జన్మలో ఎప్పుడు కలగనంత భయం వెన్నులోంచి పైకి జరజరా పాకింది.

ఇంట్లో ఫోన్ మోగింది. అప్పుడు జరిగింది నేనూహించని సంఘటన!

“బహుశా సూర్యానేమో,” అంది అమ్మ. అంతే, ఒక్క ఉదుటున నేను మంచం మీదినుంచి లేచి, మంచానికీ గోడకీ మధ్య వున్న స్థలంలో ఇరుక్కుని కూర్చొని మోకాళ్ళలో తల పెట్టుకుని నక్కి కూర్చున్నాను. అలా ఐదు నిమిషాలు కూర్చున్నాక కానీ, తెలివిలోకి రాలేదు.

వెంటనే నేనున్న పరిస్థితి చూసుకోని నివ్వెరపోయాను. ఎందుకలా నా ఇంట్లో నేనే భయపడి ఒక మూలకి నక్కి కూర్చున్నాను? ఏమయింది నాకు? ఆ ఇరుకులోంచి బయటికొచ్చి నాలుగడుగులు వేసి ఇల్లంతా తిరిగొస్తే కానీ నాకు మళ్ళీ ఊపిరాడలేదు.

****************

ఆ మర్నాడే నిర్భయంగా మా పెళ్ళి రద్దయిందని అమ్మకీ, స్నేహితులకీ చెప్పేసాను. ఎందుకని ఎవరడిగినా సమాధానం చెప్పలేదు, నవ్వేసి ఊరుకున్నా.

“మీ పెళ్ళి రద్దయిందని సూర్యా నీ గురించి మహా ఛండాలంగా మాట్లాడుతున్నాడు మనీషా,” అని ఒకరిద్దరు స్నేహితులు నా దగ్గర చెప్పినా, మనసుకెక్కించుకోలేదు. అతన్ని పెళ్ళాడితే, రోజూ నేను మంచం పక్కన నక్కి కూర్చోవాల్సి వచ్చేది. ఆ రాత నుంచి నన్ను తప్పించటానికే యమున అలా కనపడిందేమో. యమున తన ఇల్లు కాపాడుకోవడానికి కాదు, నన్ను ఆ ఇంటినుంచి కాపాడడానికి నాకు కనబడేది! ఆ విషయం అర్థమయ్యాక ఆ పెళ్ళి రద్దయినందుకు నేనెప్పుడూ విచారించలేదు.

ఎప్పుడైనా వీలు చూసుకొని కేరళ వెళ్లి యమునని చూసొస్తే బాగుండని అనిపిస్తోంది. కానీ, మా ఆయనకి ఏమని చెప్పను? పైగా రెండేళ్ల పసివాణ్ణేసుకొని కేరళ ఏం వెళ్తాం? అందుకే వదిలేసాను.

సూర్యాని ఆ తరవాత చూసింది లేదు, కానీ అతన్ని గురించి స్నేహితులు అవీ ఇవీ కబుర్లు చెప్తూ వుంటారు. అతను ఆ బంగళా లోనే వున్నాడట. చాలా మంది గర్ల్ ఫ్రెండ్సు మారినట్టున్నారు కానీ ఎవరూ పెళ్ళిదాకా వెళ్ళలేదెందుకో మరి!

*********************

(Based on Alison Lurie’s Ilse’s House)

అమెరికన్ రచయిత్రి  Alison Lurie రచించిన Isle’s house అనే కథకు ఇది నేను వ్రాసిన స్వేచ్ఛానుసరణ.  ఈ కథను సాధారణంగా హారర్ అంశంతో కూడిన హాస్య కథ కింద పరిగణిస్తారు. ఐతే, నాకు  ఈ కథలో హారరూ, హాస్యమూ కంటే వైవాహిక సంబంధంలో ఆధిపత్య ధోరణి (ఆ ధోరణి ప్రదర్శించేది ఆడైనా, మగైనా కావొచ్చు) వల్ల భాగస్వామి మానసిక స్థితిపైన సున్నితంగా చేసే వ్యాఖ్యానం లాగనిపించింది. 1926లో జన్మించిన ఆలిసన్  Foreign Affairs అనే నవలకి 1984లో పులిట్జర్ బహుమతి అందుకున్నారు. డిసెంబరు 2020 లో మరణించారు. పది నవలలూ, ఒక కథా సంకలనం ఆవిడ రచనలు.

శారద (బ్రిస్బేన్)

9 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఎంతో ఆసక్తి తో చదివి౦ంచినా చివరకు నిరాశగా అనిపించింది. అనువాదం కాబట్టి ఏమీ అనలేము….
    డా. లక్ష్మీ రాఘవ

    • నమస్కారం లక్ష్మి గారూ,
      కథ మీకెందుకు నిరాశ కలిగించిందండీ? ముగింపు నచ్చలేదా? I am curious now 🙂
      ధన్యవాదాలు
      శారద

      • ముగింపే నండి. కేరళా వెళ్ళి యమునను చూసి ఉంటే బాగుండేదేమో అనిపించింది.

  • “ఇన్నేళ్ళొచ్చినా పెళ్ళి కాకుండా వున్న అమ్మాయిలో ఏం లోపం వుందో అని కూడా ఆలోచించకుండా నిన్ను పెళ్ళాడడానికి ఒప్పుకున్నా చూడు, నన్ను నేను చెప్పుతో కొట్టుకోవాలి,”
    ‘నీ చెప్పుతో కొట్టుకుంటావా? నా చెప్పు తీసి ఇవ్వనా?’ అని అడిగి ఉండాల్సింది.

    • అవునండీ. ఆ మాత్రం తెగింపూ, ఆత్మ గౌరవం వుండాలి.
      శారద

  • ఇది హారర్ కథా కాదు. హాస్యము కాదు. పచ్చి నిజం. ఒక అహంకార పూరిత మూర్ఖుడైన పురుషుడి ఆధిపత్య ధోరణి, ఆ ‘ఇరుకు’ మనస్తత్వం లో ఇమడలేక, తమ ను తాము కాపాడుకునే స్త్రీల కథ. అతని సంకుచిత ప్రవర్తన ని అర్ధం చేసుకున్న వారు అక్కడ నుండి బయటపడగలిగారు. కానీ ఎందరో గృహిణులు ‘ఫ్రిజ్ వెనుకా, మంచమూ గోడ సందు’లో నక్కి, మనసును నొక్కి పెట్టి, నోటిని బిగబట్టి బ్రతుకుతున్నారో!
    మంచి కథ. చాలా బాగుంది.

    • అవును సుశీలగారూ. నాకూ సరిగ్గా అలాగే అనిపించింది.
      ధన్యవాదాలు

      శారద

  • Bagundi sharada. Pellante mana deshamlone vichala vidiga dabbu kharchu chesi sidhamaypotunnaru. Kaanee bhayapade yuvatha kooda perigaru. Oka swatantramayna jeevitham alavatayyaka, badhyatha adjustment, kalisi bathakadam, pyga Inka conservative bhasha, dhorani alochanalu, veetini bharinchadam adapillalaku kastamgane untondi.

  • చాలా బాగుంది. ఇటువంటి సూర్యాలు తరచూ మనకి ఎదురవుతూ ఉంటారనేమో బాగా relate అవుతాం కథకి. అనువాదం అయినా హాయిగా సరళంగా సాగింది.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు