ఆమెది ఒక బలవంతపు నిష్క్రమణ!

నాకు తెలిసిన జగతి ఒక విశ్వ ప్రేమికురాలు. గొప్ప భావుకురాలు. ఆంగ్ల, తెలుగు, హిందీ క్షుణ్ణంగా తెలిసిన, చదవగల, రాయగల విద్వత్ పరురాలు.

పందొమ్మిదో శతాబ్దపు చివరి అంకంలో తెలుగు సమాజంలోకి సంస్కరణ ప్రవేశించిందంటారు. నాడు  సంస్కరణ తెచ్చిన కులాలను చరిత్రలో నిలబెట్టడానికి తారీకులు, దస్తావేజులతో ఇప్పటి చరిత్రకారులు చర్చకు సిద్దంగా ఉంటారు. ఒక క్రమబద్దమైన మేధో చర్చలో వాళ్ళను నిలబెట్టడమే లక్ష్యంగా సంప్రదాయ వామపక్ష శిబిరం మొదలు… అల్ట్రా లెఫ్ట్ దాకా ఒకే లైన్ మీద ఉంటూ చర్చను సజీవంగా ఉంచే ఒక పరంపరను ప్రోది చేసుకున్నారు. అయితే ఆ సంస్కరణ స్త్రీ స్వేచ్ఛ గురించి, పితృస్వామిక బందిఖానా, విముక్తికి తోడ్పడ్డ యోచనాపరులు తమ వివేచనతో, తమ ఆలోచనలతో, రాతలతో, కూతలతో ఈ మార్పుకి చేయూతనిచ్చారంటారు. చర్చ స్త్రీ ఇల్లు, కౌటుంబిక బందిఖానా నుంచి బయటపడే క్రమం చుట్టూ విద్య, పునర్వివాహం, కన్యాశుల్కం ఇత్యాది ఆచారాల మీద తిరుగుబాటు. ఆ తిరుగుబాటు మూలంగా ఎంత మంది స్త్రీలు విముక్తం అయ్యారు? జనాభాలో ఆ విముక్తుల సంఖ్య ఎంత? అనే చర్చ ఎవరూ చేయరు. దళిత బహుజన కులాలలో మారుమనువులాంటివి తరాలుగా ఉన్నాయి. ఆ పని కోసం వాళ్ళకు యుగకర్తల అవసరం లేదు. ఇలా చర్చ చేస్తే ఎన్నయినా చెప్పొచ్చు. ఒకటి మాత్రం నిజం. సవర్ణ నిర్మిత చరిత్ర కేవలం ఆయా కుల పురుషుల, స్త్రీల వీరోచిత గాథల చర్విత చరణం. అందులో ఆ ఫెరిఫరల్ బయట ఉన్న నూటికి ఎనభై శాతం మహిళకు అక్కర లేని చరిత్రను మోస్తున్నారు.
పందొమ్మిది వందల అరవై డెబ్బైలలో ఆ సంస్కరణ మరింత ముందుకు వెళ్లి దిగువ మధ్య తరగతి, దళిత బహుజన జీవితాల్లోకి వచ్చింది.  ఆ అనుసరణ ఒక రకంగా ఈ సమూహాలకి ఒక కల్చరల్ షాక్. ఆ షాక్ నుండి తెరుకోవడానికి జూపాక సుభద్రలా-పైట నా బొచ్చె మీద ఉండే బొంత పేగు కాదు -దానికి అగ్గివెట్టి నేను ఎక్కడ  ఆగం కాను– అనే వ్యక్తీకరణ కొంత మంది మాత్రమె చేశారు. ఈ నేపథ్యంలోనిదే ఇటీవల బలవన్మరణం పొందిన జగతి కన్నీటి బ్రతుకు. ఆమెది ఒక బలవంతపు నిష్క్రమణ.
ఐదేళ్ల కింద జగతి బిడ్డకు ఎఫ్లూ లో మాస్టర్స్ సీట్ వచ్చింది. అప్పుడే ఆమె బిడ్డ దీపు పరిచయం. వాళ్ళ నాన్నతో దీపు ఎఫ్లూకి వచ్చింది. ఆ ఇద్దరూ ఎంతో హుందాగా అనిపించారు నాకు. ఎగువ మధ్యతరగతి కుటుంబం. ఆధునికత ముందుగా రాజవీధుల నుండి శూద్ర వాడల మీదుగా వెలివాడల కు వచ్చింది. దాని అనుసరణ కొందరికి విముక్తి, మరికొందరికి విషాదం మిగిల్చింది. మైదానంలో రాజేశ్వరి మధ్యతరగతి ఆడవాళ్ళ జీవితాలలో అలజడి లేపింది. ఇక్కడే అన్ని సమస్య‌లూ బయలుదేరాయి.  ఆధిపత్య కులాల ఆడవాళ్ల వీర్యపు వర్షాలు, చెరుకుగడల తీపులు, కుందేటి కొమ్ములు, లేబర్రూమ్ నొప్పులు రాసుకున్నా.. బొట్లు చేరిపేసుకున్నా,పైటలు తగలేసుకున్నా సాహిత్య ప్రపంచం హర్షించింది. అందులో విప్లవాన్ని కలగన్నది. ఇక్కడే ఒక విషాద చారిక ఉంది. ఆధిపత్య సవర్ణ స్త్రీలు త‌మ‌కు నచ్చిన విధంగా బ్రతికే వెసులుబాటు, సోషల్ మెకానిజం పెట్టని గోడలుగా వాళ్ళను కాపాడుకున్నాయి. కాపాడుకుంటాయి కూడా.  ఆధిపత్య కులాల్లో ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది?  చావకుండా బ్రతుకుతూ నరక కూపంలో ఉన్న ఎంతో మందిని చూసా. ఈ ఏటికి ఎదురీదే క్రమంలో విజయాలు, వైఫల్యాలు అన్ని గడపలలో ఒకే రకంగా లేవు.
బాగా చదువు కున్న తండ్రి, సంగీతం సాహిత్యంలో అభిలాష ఉన్న తల్లి జగతికి దొరికారు. గారాబంగా పెరిగిన ఆమె తన ప్రాధమిక విద్యను విజ‌య‌న‌గ‌రంలో చ‌దువుకున్న‌ది. ఆంగ్ల సాహిత్యంలో డిగ్రీ చేసింది. పన్నెండు ఏళ్లకే మెట్రిక్, పద్నాలుగు ఏళ్లకే పియుసి చ‌దివిన ఆమె… మాస్టర్స్ లో గోల్డ్ మెడలిస్ట్. ఫిలాసఫీ, సోషియాలజీ, సైకాలజీ కూడా చ‌దివి… మధురై కామరాజు విశ్వవిద్యాలయం నుంచి అరబిందో సాహిత్యం మీద పరిశోధన చేసిన ఆమె నిత్య విద్యార్ధి. మొదట తానే లిటిల్ హర్ట్స్ పేరుతో ఒక స్కూల్ పెట్టినట్టు ఇంటర్వ్యూ లో చెప్పుకుంది. త‌రువాత ఒక కళాశాలలో ఆంగ్లము, తత్వ, మనో విజ్ఞానశాస్త్రము అంశాలు బోధించిన ఆమె పూర్తి గా సాహిత్యానికే పరిమితం అయి రెండు రాష్ట్రాలలోనూ సాహిత్య బంధుగణాన్ని పొందింది. కానీ ఆమెలోని అలజడి ఎవరూ అంచనా వేయలేకపోయారు.
బాల్యం నుండి ప్రోది చేసుకున్న స్వేచ్ఛ‌ ఫలితమో, ఆదర్శాల పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆధునిక స్త్రీ జీవితమో… అది ఆమె స్వాభావికంగా పొందినదో లేదా అనుసరించినదో చెప్పలేము. కానీ అనేక సునామీలు, సుడిగుండాలలో విలువల పేరుతో వెక్కిరించిన సమాజాన్ని… ధిక్కరించి నడిచింది. కుటుంబ ‘విలువల కోసమో, కన్న వాళ్ళ ఆకాంక్షలకోసమో ఆమె జీవితంలో ఒక తంతు జరిగింది. ఆ తంతు నుండి బయట పడి మరొక జీవితాన్ని ఎంచుకుంది. ఇక్కడ ఆ ఎంపిక దిశగా నడిచిన నడక  మంచా చెడా అనే చర్చ అవసరం లేదు. నడిసొచ్చిన త్రోవ పట్ల ఈసడింపు ఆమెను ఆపలేదు . ఆమె ఆమెలా బ్రతికింది. బ్రతికే ప్రతి క్షణాన్ని ఆస్వాదించినట్టే కనిపించింది.
ఆ ఎంపిక మూలంగా ఒనగూరిన శూన్యాన్ని కార్యకారణ సంబంధాలను గ్లోరిఫై చేసే పుణ్యాత్ముల కుంచిత మాటలు నాకు ఇబ్బంది అనిపించాయి. ఆ ఎంపికలో ఆమె ఎన్ని కస్టాలు పడ్డదో దగ్గరి వాళ్లకు తెలుసు, మాయాజలతారులాంటి మాటల మాయలో ఆమె నలిగి పోయింది అనే విషయాన్ని ఒక విషాదం జరిగాక కానీ తెలుసు కోలేక పోయింది. తాను ఎంత భ్రమలో బ్రతికిందీ, తాను ఎంత అబద్ధపు పరదాల మధ్య కునారిల్లిందో ఎంత మందికి తెలుసో కానీ నాకు తెలుసు. ఇంకొంత మందికి తెలుసు. తన సహచరుడు పోయాడు అని తెలిసిన వెంటనే గుండె పగిలేలా ఏడ్చింది. పరామర్శల ఫోన్ కాల్స్‌ వద్దు అని అందరినీ వేడుకుంది. ముఖ్యంగా జాలి చూపుతూ  అయ్యో ఎలా బ్రతుకుతావ్ అని మధ్య తరగతి మాటల శూలాలు ఆమెను బాగా గాయపర్చాయి.
నాకు తెలిసిన జగతి ఒక విశ్వ ప్రేమికురాలు. గొప్ప భావుకురాలు. ఆంగ్ల, తెలుగు, హిందీ క్షుణ్ణంగా తెలిసిన, చదవగల, రాయగల విద్వత్ పరురాలు. ఉపాధ్యాయ శిక్షణ రంగం అధ్యాపకురాలు, మంచి అనువాదకురాలు. ఇంకా మంచి వక్త, సాహిత్య నాయకురాలు. మొజాయిక్ కు మేథో నిట్టాడి. ఆమె సాహిత్యం బాగా చదువుకున్నది. వేస్ట్ లాండ్ మీద సాధికారంగా మాట్లాడ గలదు. తెలుగు నుండి ఆంగ్లం, హిందీ, అటు నుంచి ఇటు.. ఇటునుంచి అటు అవలీలగా చేయగలదు. ఆమె రాసింది చాలా. అచ్చులో బయటకు వచ్చింది వీసమంత. ఆ రాసిన రాతలు ఎలా దుర్వినియోగం అయ్యాయో నాలాంటి వాళ్లకు తెలుసు. జగతి ఒక పొరపాటు చేసింది. నమ్మి దగ్గర అయిన చోట బ్రతుకుకు కనీస బరోసా ఉందా లేదా అనే లెక్కలు వేసుకోలేదు. కానీ ఆమె జీవితంలోకి వ‌చ్చిన వ్య‌క్తి మూలంగా (ఎవరి జీవితంలోకి ఎవరు వచ్చినా) జరిగిన నష్టం పూడ్చలేనిది. రేపు ఇద్ద‌రిలో ఎవరికి ఏదయినా అయితే, ఒక్కసారి జీవితంలో శూన్యం ఆవరిస్తే.. తరవాత ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కానీ తాను నమ్మినవాడు…  కులం, బ్రతుకు, సామాజిక హోదా, కుటుంబ రక్షణ అన్నీ సరి చూసుకునే బయటకు వచ్చాడని ఈ పిచ్చితల్లికి తెలియదు. ఎటుగూడీ అబద్ధపు లెక్కల్లో ఆమె బ్రతుకే పాము నోటికి చిక్కింది.
ఆ చివరి మూడు నెలలు మాత్రమె ఆమెకు ఓదార్చే ఒక బుజం కావాల్సి వచ్చింది.
దీపు బెంగళూర్ లో ఉండడం, నేను జగతికి అందుబాటు లో లేకపోవడం ఇద్దరినీ ఒకదగ్గరకు చేర్చే చొరవ నాకు ఉన్నా నేను చేయలేక పోయా ఇందులో నా తప్పు కూడా ఉంది. అయినా ఆమె చివరి అంకం దీపు తండ్రి చేతుల మీదుగా జరగడం ఆయన సంస్కారం. ఆమె నమ్మిన వ్యక్తి నేను పోతే ఆమెకు కనీస భద్రత ఉండాలి అని ఆలోచించని ఆధిపత్య తెంపరితనం గురించి ఎవరూ మాట్లాడడం లేదు అదే నా బాధ. ఇప్పుడు జరిగిన అనర్ధం పోస్ట్ మార్టం చేయడం బాలేదు. నాకు తెలిసిన జగతి గురించి బయటకు చెప్పడం కొందరిని ఇబ్బంది పెట్టినా చెప్పాల్సిన బాధ్యత నాకు ఉంది అని ఈ రెండు మాటలు.
ఆరు నెలల కింద నగ్నమునికి అజో విభో ఫౌండేషన్ వాళ్ళు పురస్కారం ఇచ్చిన సందర్బంగా  తెనాలి లో జరిగిన స‌మావేశంలో రామ్స్ మాట్లాడాడు. తెనాలి దుర్గ, మువ్వ, వేణు, నగ్నముని, అంతా ఒకే హోటల్లో ఉన్నాము. ఆరోజు రాత్రి చివరి విందు అయ్యాక వాళ్ళిద్దరికీ వీడ్కోలు పల‌కడమే జగతితో చివరి మాట‌. ఎక్కడ ఎప్పుడు కలిసినా.. అరే సీతా.. అంటూ భుజం మీద చేయి వేసి – పరిశోధన ఎంత వరకు వచ్చిందని అడిగే ఆమె…
అరే డాక్టర్… మా మరదలిని ఎప్పుడు పరిచయం చేస్తావ్ అన్నది చివరి మాట.
చూస్తుండగానే జగతి లేని విశాఖ, తల్లి లేని మా దీపు. నాకు అంతా శూన్యం అనిపించింది. ఇంతకు మించి ఆ పిచ్చి ప్రేమికురాలి గురించి ఏమి రాయాల‌న్నా అక్షరాలు మొరాయిస్తున్నాయి. రెస్ట్ ఇన్ పవర్ జగతి.
చివరిగా ఒక మాట… కాల బిలాలలో మెరిసే నక్ష‌త్రం యారాడ కొండ మీద వెలిగే లాంతరులా… నువ్వెప్పుడూ ఉంటావు.
‘జగతి మైదానాల ఆదర్శపు బ్లాక్ హోల్ లో మాయం అయిన ఒక నక్షత్రపు తునక’
జగతి తమ్ముడు
డా. గుఱ్ఱం సీతారాములు

గుర్రం సీతారాములు

పుట్టెడు పేదరికంలోంచి వచ్చి, కష్టపడి చదువుకొని, ప్రతిష్టాత్మకమైన ఇఫ్లు నుంచి డాక్టరేట్ అందుకున్న బుద్ధిజీవి గుర్రం సీతారాములు. సామాజిక సాంస్కృతిక పోరాటాల మీదా, ప్రతిఘటన రాజకీయాల మీద సునిశితమైన అవగాహన వున్న కల్చరల్ క్రిటిక్-- బహుశా, తెలుగులో ఆ భావనకి సరైన నిర్వచనం అతనే.

14 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చచ్చిపోయిన మనుషుల చావుకు కారణాలు వెతకడం/అడగడం శీల హననం అని కొత్తగా జగద్ధాత్రి ఐచ్చికహత్యతో తెలుసుకున్నాను.

    ఆమె అస్తిత్వాన్ని రామతీర్థ కి కుదిస్తూ, ఆధునిక సతిని గురించి మాట్లాడిన మాటలు ఫెస్బుక్ వేదిక మీద అనేకం చూశాను. ఆమెకి తనదైన అస్తిత్వం ఉన్నది. అది రామతీర్థకి ముందూ, తరువాతా కొనసాగింది. ఈ మాటా, ఆమె సాహిత్య జ్ఞానం, విద్వత్ గురించి రాసిన వాళ్ళు అరుదు.

    ‘ఆమె కృషిని గురించి వ్యాసాలు రావాలి… ఆమె మరణానికి కారణాలు, కారకులు కాదు.’ అని కొత్త సూత్రీకరణలు చేస్తున్నారు. కృషిని గురించిన వ్యాసాలు ఎలాగూ వస్తాయి. ‘మరణానికి కారణాలు, కారకుల’ గురించి వద్దు అనడం ఎట్లా సరైనదో రాసినవాళ్లకే తెలియాలి. “రామతీర్థ సంస్మరణ సభలో జగద్ధాత్రిని రామతీర్థ బిడ్డ వేదిక మీదే కొట్టింది.” ఆ తరువాతే అప్పటిదాకా ఉన్న ఇంటిని వొదిలి కొత్త ఇంటికి మారింది. ఆ అవమాన భారంతోనే చనిపోయింది. అటూ రామతీర్థ బిడ్డ కొట్టినా, సొంత బిడ్డ దూరమైనా జగద్ధాత్రిని బాధితురాలు అనొద్దు అంటే ఎట్లా? ఆమె మరణానికి కారణాలు, కారకుల్ని వెతకొద్దు అంటే ఎట్లా?

    ఆమె మరణానికి కారణం, కారకుల్ని సీతా వెతికే ప్రయత్నం చేసినట్టున్నాడు. అందుకే తన నివాళి వ్యాసంలో “ఆమె జీవితంలోకి వ‌చ్చిన వ్య‌క్తి మూలంగా (ఎవరి జీవితంలోకి ఎవరు వచ్చినా) జరిగిన నష్టం పూడ్చలేనిది. రేపు ఇద్ద‌రిలో ఎవరికి ఏదయినా అయితే, ఒక్కసారి జీవితంలో శూన్యం ఆవరిస్తే.. తరవాత ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు. కానీ తాను నమ్మినవాడు… కులం, బ్రతుకు, సామాజిక హోదా, కుటుంబ రక్షణ అన్నీ సరి చూసుకునే బయటకు వచ్చాడని ఈ పిచ్చితల్లికి తెలియదు. ఎటుగూడీ అబద్ధపు లెక్కల్లో ఆమె బ్రతుకే పాము నోటికి చిక్కింది.” అని రాసుకున్నాడు.

    ఆ వ్యక్తి (రామతీర్థ) సాహితీ కిరీటం, నేపథ్యం పడిపోతుంది ఈ విషయాలు బయటికి వస్తే అనే ఒకే ఒక్క కారణం తప్ప ఇంకేమీ కనపడటం లేదు. ఆమె శీలం గురించి అనే ఎమోషనల్ మాట వెనకాల మా రామతీర్థను ఎలాగైనా కాపాడుకోవాలి అనే ధృడ సంకల్పమే కనపడుతుంది. నిన్న సుభద్రక్క ఒకమాట రాసింది. “పై కులాల మహిళలు స్వేచ్ఛాయుత జీవితాన్ని అనుభవించినన్నాళ్ళు అనుభవించి, అణగారిన కులాల పురుషులతో సజావుగా బతుకుతున్నారు. ఈ సజావులు అణగారిన మహిళలకు జరగట్లే” అని.

    శీలాలు అనేదే బేఖార్ కాన్సెప్ట్ అనే వాళ్లే రామతీర్థను కాపాడుకునేందుకు జగద్ధాత్రి శీలాన్ని అడ్డేసి చర్చను జరగకుండా ఆపే ప్రయత్నం చేస్తున్నారు.

  • తన‌ స్వేచ్ఛా జీవితపు అమాయకత్వాన్ని అర్థం చేసుకున్న దీపు తండ్రి గొప్ప సంస్కారం ఎప్పటికీ నిలిచిపోతుంది .తనని నమ్మి వచ్చిన వ్యక్తి కి కనీస భద్రత ఇవ్వలేని స్వార్థపూరిత అగ్రవర్ణపు తెంపరితనం మిగిలే ఉంటుంది. ఆమె ఈ స్వార్థానికి గల రెండో పార్శాన్ని చూడలేకపోవడమే బాధాకరమైన విషాదం.

  • అంతర్జాతీయ మహిళా దినోత్సవం, స్రీ జనోధ్ధరణల గురించి జరుగుతున్న సభలు , సంతర్పణల సంధర్భంలో…. ఎంత మంది స్త్రీలు విముక్తం అయ్యారు? ఏ వర్గం స్త్రీలు విముక్తం అయ్యారు? దళిత బహుజన కులాల, సమాజం అట్టడున ఉన్న బడుగు వర్గాల స్త్రీల విముక్తం ఏ స్థితిలో ఉందీ అంటూ కొన్ని మౌలిఖ ప్రశ్నలను లేవదీసారు కామ్రేడ్ రంగాజి ( రంగనాయకమ్మ గారు ) కూడా ఓ వ్యాసంలో డా. గుర్రం సీతారాములు తమ్ముడూ!

    టి.ఎస్. ఇలియట్ “ వేస్ట్ లాండ్ “ మీద సాధికారంగా మాట్లాడగల ( It’s the journey that matters, not the arrival – T. S. Eliot ) జగతి తల్లి నిష్క్రమణ ఓ విరాగి తీసుకునే అంతిమ నిర్ణయం …. దాన్ని నేను అర్ధం చేసుకోలేను, ఆమోదించలేను.

    ” కాల బిలాలలో మెరిసే నక్ష‌త్రం యారాడ కొండ మీద వెలిగే లాంతరులా… నువ్వెప్పుడూ ఉంటావు ” జగతి అక్కా అంటూ ఆక్రోశించిన తమ్ముడూ! నీ నివాళి ఆటుపోట్ల హోరుకు చెలియలికట్ట దాటి, చెంపలమీద చారికలు చేసిన కొన్ని ఉప్పునీళ్లతో నీ పాదాలు కడగాలని ఉన్నా …. నాకా అర్హత లేదు.

  • ” అన్నీ మరణించాల్సిందే ” ( All Things Will Die )

    ఆంగ్ల మూలం : ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్
    తెలుగు సేత : జగద్ధాత్రి

    స్పష్టంగా నీలి నది సాగుతూ మొగుతోంది
    నా కంటి కింద ;
    వెచ్చగా , వెడల్పుగా దక్షిణ గాలులు వీస్తున్నాయి

    అటు ఆకాశం లో
    తెల్లని మబ్బులు ఒక దాని తర్వాత ఒకటి వరుసగా కదులుతున్నాయి ;
    ఈ మే మాసపు ఉదయాన ప్రతి హృదయం ఆనందం తో స్పందిస్తోంది
    పూర్తిగా ఆనందంతో ;
    అయినా అన్నీ మరణించక తప్పదు.
    సాగే వాగు ఆగిపోతుంది ;
    తేలే మబ్బులు నిలిచిపోతాయి ;
    హృదయ స్పందన ఆగిపోతుంది ;
    ఎందుకంటే అన్నీ మరణించాల్సిందే ;
    అన్నీ మరణించాలి
    రాదిక వసంతం మరి రానే రాదు .

    ఓ , అహమా !
    మృత్యువు ద్వారం వద్ద వేచి ఉంది సుమా
    చూడండి! మన మిత్రులందరూ పిలుస్తున్నారు
    తాగి ఆనందంతో చిందులేసేందుకు .
    మనల్ని పిలిచారు — మనం వెళ్ళాలి తప్పక .
    దిగువగా , బాగా కిందన
    చీకటిలో మనం వాలాలి .
    సంతోషపు కేరింతలన్నీ ఆగిపోయాయి
    పికము కల కూజితం
    ఇక వినబడనే బడదు ,
    గాలీ కొండా కూడా నిశ్శబ్దమే ఇక.

    ఓ ధు:ఖమా !
    ఆలకించు ! మృత్యువు పిలుస్తోంది
    నీతో మాటాడుతుంటే
    నా దవడ జారిపోతోంది ,
    ఎర్రని బుగ్గ పాలిపోతోంది
    బలమైన ఎముకలు పడి పోతున్నాయి
    వెచ్చని నెత్తురుతో మంచు కలసి పోతోంది
    కను పాపలు నిలిచిపోతున్నాయి
    తొమ్మిది సార్లు మోగుతోంది సాగే మృత్యు ఘంటిక ;
    ఆనంద మనస్కులారా , ఇక వీడ్కోలంటూ .

    పురాతన ధాత్రి
    ఒకనాడు జన్మించింది
    అందరికీ తెలిసినట్టుగానే ,
    చాలా కాలం క్రితం
    ఈ పురాతన ధరణి మరణించాల్సిందే .
    కనుక వేడి గాలులను రేగనివ్వండి ,
    నీలి కెరటాలను తీరం తాకనివ్వండి ;
    ఎందుకంటే ప్రతి ఇరు సంధ్యలూ
    ఇక నీవు చూడలేవు
    శాశ్వతంగా.
    అన్నీ జన్మించినవే
    ఏవీ తిరిగి రావు మరల
    ఎందుకంటే జన్మించినవన్నీతప్పక మరణించాల్సిందే

  • ఆ వ్యాసం నాకు సరిగా అర్థం కాలేదు, భావసంక్లిష్టతతో పాటు, నాకు బోధపడని చిత్కళ వంటి syntactical వాక్య విన్యాసం కారణంగా (సందేహాల నిడివిని సారంగ కామెంట్ బాక్స్ ఓపలేకపోతోంది కాబట్టి ముక్కలుగా ముందుంచుతున్నాను).
    “అయితే ఆ సంస్కరణ స్త్రీ స్వేచ్ఛ గురించి, పితృస్వామిక బందిఖానా, విముక్తికి తోడ్పడ్డ యోచనాపరులు తమ వివేచనతో, తమ ఆలోచనలతో, రాతలతో, కూతలతో ఈ మార్పుకి చేయూతనిచ్చారంటారు.”
    – syntax విరగడం వల్ల అన్వయానికి అందని ఈ వాక్యాన్ని ముందు ఉన్న పేరాలోని భావంతో బేరీజు వేసుకొని ఎవరైనా బోధపరిస్తే బాగుణ్ణు.
    అంతకంటే కొరకరాని కొయ్య తర్వాతి వాక్యం:
    “చర్చ స్త్రీ ఇల్లు, కౌటుంబిక బందిఖానా నుంచి బయటపడే క్రమం చుట్టూ విద్య, పునర్వివాహం, కన్యాశుల్కం ఇత్యాది ఆచారాల మీద తిరుగుబాటు.”
    “ఆ తిరుగుబాటు మూలంగా ఎంత మంది…… నూటికి ఎనభై శాతం మహిళకు అక్కర లేని చరిత్రను మోస్తున్నారు”.
    – చరిత్రలో యుగకర్తలుగా project కాబడుతున్న అగ్రవర్ణ, బ్రాహ్మణ సంస్కర్తల కంటే ముందే, వారి అవసరం లేకుండానే, మారు మనువులు ఉన్నందువల్ల ఎప్పుడో విముక్తమయ్యారు- 80 శాతం ఉన్న దళిత బహుజన స్త్రీలు, అని కదా గుఱ్ఱం చెప్పదల్చుకున్నది; అటువంటి నేపథ్యంలో,
    “పందొమ్మిది వందల అరవై డెబ్బైలలో ఆ సంస్కరణ మరింత ముందుకు వెళ్లి దిగువ మధ్య తరగతి, దళిత బహుజన జీవితాల్లోకి వచ్చింది”- అంటాడేమిటి? పందొమ్మిదో శతాబ్దపు చివరి అంకంలో తెలుగు సవర్ణ సమాజంలోకి సంస్కరణ ప్రవేశించేనాటికే దళిత బహుజన స్త్రీకి అది అభ్యాసం, ఆచారం, అనుభవం అని కదా అన్నాడు; మరి ఆ తర్వాత వందేళ్ళకి 1960, 70 లలో కొత్తగా వచ్చిందేమిటి? రావడమే కాకుండా అది ‘కల్చరల్ షాక్’ ఎందుకయ్యింది. 1960లలో వచ్చిన ఆ కల్చరల్ షాక్ నుంచి ఆ షాక్ తగిలిన తర్వాత 50 ఏళ్ళకి వచ్చిన జూపాక సుభద్ర కవిత్వం తేరుకునేలా ఎలా చేసింది?
    ఇలా ఒకదాని మీద ఒకటి దొంతర్లుగా సందేహాలు పేరుకుపోతుంటే, “ఈ నేపథ్యంలోనిదే ఇటీవల బలవన్మరణం పొందిన జగతి కన్నీటి బ్రతుకు.” – అంటాడు ఆమె తమ్ముడు- గుర్రం సీతారాములు! ఇంతకీ ఆ నేపథ్యం ఏమిటి? ఆ నేపథ్యానికి జగతి కన్నీటి బ్రతుకుకీ సంబంధం ఏమిటి?

  • “ఐదేళ్ల కింద జగతి బిడ్డకు ఎఫ్లూ లో మాస్టర్స్ సీట్ వచ్చింది. అప్పుడే ఆమె బిడ్డ దీపు పరిచయం. వాళ్ళ నాన్నతో దీపు ఎఫ్లూకి వచ్చింది. ఆ ఇద్దరూ ఎంతో హుందాగా అనిపించారు నాకు. ఎగువ మధ్యతరగతి కుటుంబం.”
    “ఆధునికత ముందుగా రాజవీధుల నుండి శూద్ర వాడల మీదుగా వెలివాడలకు వచ్చింది. దాని అనుసరణ కొందరికి విముక్తి, మరికొందరికి విషాదం మిగిల్చింది”- ఇంతకీ శూద్ర వాడలలో ఉండి ఆధునికతని అనుసరించిన జగతికి విషాదాన్ని మిగిల్చిందనా గుర్రం అభిప్రాయం? అతనికి ఎంతో హుందాగా కనిపించిన ఆ ఎగువ మధ్యతరగతి సుఖ సంసారాన్ని ఆధునికతకి బలిపెట్టకుండా ఉండవల్సిందా జగతి?
    “మైదానంలో రాజేశ్వరి మధ్యతరగతి ఆడవాళ్ళ జీవితాలలో అలజడి లేపింది. ఇక్కడే అన్ని సమస్య‌లూ బయలుదేరాయి.”
    నిజమే, 1920-30లలో చలం మీద దాడి అదే కదా!
    “ఆధిపత్య కులాల ఆడవాళ్ల వీర్యపు వర్షాలు, చెరుకుగడల తీపులు, కుందేటి కొమ్ములు, లేబర్రూమ్ నొప్పులు రాసుకున్నా.. బొట్లు చేరిపేసుకున్నా, పైటలు తగలేసుకున్నా సాహిత్య ప్రపంచం హర్షించింది. అందులో విప్లవాన్ని కలగన్నది.”- syntax కొంకర్లు తిరిగినా కవిభావం అర్థచేసుకోవచ్చు.
    “ఇక్కడే ఒక విషాద చారిక ఉంది. ఆధిపత్య సవర్ణ స్త్రీలు త‌మ‌కు నచ్చిన విధంగా బ్రతికే వెసులుబాటు, సోషల్ మెకానిజం పెట్టని గోడలుగా వాళ్ళను కాపాడుకున్నాయి. కాపాడుకుంటాయి కూడా.”
    – అంతకుముందు, వ్యాసం మొదల్లో 80 శాతం దళిత బహుజన మహిళలు మారుమనువులతో తమ ఇష్టం వచ్చినట్టు బతుకుతున్నారని అన్నట్టు గుర్తు!!!???
    “ఆధిపత్య కులాల్లో ఒంటరితనంతో ఆత్మహత్య చేసుకున్న వాళ్ళు ఎంతమంది? చావకుండా బ్రతుకుతూ నరక కూపంలో ఉన్న ఎంతో మందిని చూసా.”
    – అగ్రకులాల్లో ఆడవాళ్ళు ఆత్మహత్య చేసుకోవడం తక్కువేనని, వాళ్లు చావకుండా నరక కూపాల్లో మగ్గుతున్నారని అంటున్నాడా గుర్రం. అయితే అటువంటి నరక కూపాల్లో మగ్గే కంటే, అగ్ర కుల స్త్రీలు చావాలంటాడా?

  • తర్వాతి పేరా జగద్ధాత్రి తల్లిదండ్రులు, వారి స్థితిగతులు, ఆమె బాల్యం, చదువు, డిగ్రీలు, ఉద్యోగం, తర్వాత పూర్తిస్థాయిలో సాహిత్యానికి అంకితం కావడం.
    “రెండు రాష్ట్రాలలోనూ సాహిత్య బంధుగణాన్ని పొందింది. కానీ ఆమెలోని అలజడి ఎవరూ అంచనా వేయలేకపోయారు.”
    – ఏమిటా అలజడి, బహుశా తమ్ముడిగా గుర్రం అంచనా వేశాడా? అంచనా వేస్తే ఎప్పుడు వేశాడు? ఆ అలజడి ఎప్పట్నుంచో ఉందని గ్రహించాడా? లేక గుర్రం పరిచయం అయినప్పుడే incidentally ఆమెలో అలజడి మొదలైనట్టు అతను గ్రహించాడా?
    “బాల్యం నుండి ప్రోది చేసుకున్న స్వేచ్ఛ‌ ఫలితమో, ఆదర్శాల పేరుతో ఇంట్లోకి వచ్చిన ఆధునిక స్త్రీ జీవితమో… అది ఆమె స్వాభావికంగా పొందినదో లేదా అనుసరించినదో చెప్పలేము. “- అమ్మో… ఏమిటిది? ఈ చిన్న వాక్యం ఎక్కడ మొదలయ్యింది? ఎక్కడ ముగిసింది? ఏం చెబుతోంది?
    “కుటుంబ ‘విలువల కోసమో, కన్న వాళ్ళ ఆకాంక్షలకోసమో ఆమె జీవితంలో ఒక తంతు జరిగింది.”
    – ఆ తంతు ఫలితమేనా గుర్రం పైన గ్లోరిఫై చేసిన- “హుందాగా అనిపించిన ఎగువ మధ్యతరగతి కుటుంబం”?!
    “ఆ తంతు నుండి బయట పడి మరొక జీవితాన్ని ఎంచుకుంది…”
    “ఆ ఎంపిక దిశగా నడిచిన నడక మంచా చెడా అనే చర్చ అవసరం లేదు…”
    “ఆ ఎంపిక మూలంగా ఒనగూరిన శూన్యం…”
    “ఆ ఎంపికలో ఆమె ఎన్ని కస్టాలు పడ్డదో దగ్గరి వాళ్లకు తెలుసు” (ఆమెలో అలజడిని ఎవ్వరూ అంచనా వేయలేదని పైన అన్నట్టు గుర్తు)
    “మాయాజలతారులాంటి మాటల మాయలో ఆమె నలిగి పోయింది అనే విషయాన్ని ఒక విషాదం జరిగాక కానీ తెలుసు కోలేక పోయింది.”
    – ఏ విషాదం అది? 2019 జూన్ లో రామతీర్థ మరణం తర్వాత తెల్సుకుందా?
    “తాను ఎంత భ్రమలో బ్రతికిందీ, తాను ఎంత అబద్ధపు పరదాల మధ్య కునారిల్లిందో ఎంత మందికి తెలుసో కానీ నాకు తెలుసు.” (పైన విషాదం జరిగాక మాత్రమే జగతికి తెలిసింది గానీ, ఆమె భ్రమల్లో బతుకుతున్న విషయం మాత్రం గుర్రంకి ముందే తెలుసు- అంతేనా?)

  • “నాకు తెలిసిన జగతి ఒక విశ్వ ప్రేమికురాలు. గొప్ప భావుకురాలు. ఆంగ్ల, తెలుగు, హిందీ క్షుణ్ణంగా తెలిసిన, చదవగల, రాయగల విద్వత్ పరురాలు. ఉపాధ్యాయ శిక్షణ రంగం అధ్యాపకురాలు, మంచి అనువాదకురాలు. ఇంకా మంచి వక్త, సాహిత్య నాయకురాలు. మొజాయిక్ కు మేథో నిట్టాడి. ఆమె సాహిత్యం బాగా చదువుకున్నది. వేస్ట్ లాండ్ మీద సాధికారంగా మాట్లాడ గలదు. తెలుగు నుండి ఆంగ్లం, హిందీ, అటు నుంచి ఇటు.. ఇటునుంచి అటు అవలీలగా చేయగలదు…”
    – ‘నాకు తెలిసి ‘ అని ఒక ముందస్తు clause ద్వారా ఆ సమాచారానికి ఉన్న పరిమితులు చదువరులకి నిజాయితీగా నివేదించుకున్నాడు కాబట్టి, ఇందులో dispute ఏమీ లేదు.
    ఇక వ్యాసంలో మిగతా భాగం – పూర్తిగా వ్యక్తిగత స్నేహబాంధవ్యాల తలపోత.
    ఆమె జీవితంలోకి వ‌చ్చిన వ్య‌క్తి మూలంగా జరిగిన నష్టం పూడ్చలేనిది. రేపు ఇద్ద‌రిలో ఎవరికి ఏదయినా అయితే, ఒక్కసారి జీవితంలో శూన్యం ఆవరిస్తే.. తరవాత ఏమిటి? అనే ప్రశ్న ఉత్పన్నం కాలేదు.”
    “ఆమె నమ్మిన వ్యక్తి నేను పోతే ఆమెకు కనీస భద్రత ఉండాలి అని ఆలోచించని ఆధిపత్య తెంపరితనం గురించి ఎవరూ మాట్లాడడం లేదు అదే నా బాధ.”- ఇది కూడా నిజాయితీగా చెప్పుకున్నాడు గుర్రం.
    అతనొక LIC పాలసీ తీసుకొని, ఆమెని నామినిగా పెట్టి ఉన్నట్టయితే, లేదా కొంత ఆస్తి ఆమె పేరిట సమకూర్చి ఉంటేనో… (జగతి ఆశించినవి బహుశా అవే అని అనుకుంటున్నాడు కాబట్టి ) గుర్రం సీతారాములుకి అసలు ఎవ్వరితోనూ పేచీ ఉందేది కాదనుకుంటా.

    • నా వ్యాసాన్ని ఖండ ఖండాలుగా, ఒడ్డు, పొడవు, రూప, సారాల గురించి ఎంత చర్చ అయినా చేయవచ్చు. ఎదుటి వ్యక్తి అభిప్రాయం పట్ల నాకు గౌరవం. ఇటువంటి సూచనల వల్ల అటువంటి తప్పులు పునరావృతం చేయను అని హామీ ఇస్తూ.

      “ఆమె నమ్మిన వ్యక్తి నేను పోతే ఆమెకు కనీస భద్రత ఉండాలి అని ఆలోచించని ఆధిపత్య తెంపరితనం గురించి ఎవరూ మాట్లాడడం లేదు అదే నా బాధ.”- ఇది కూడా నిజాయితీగా చెప్పుకున్నాడు గుర్రం.
      అతనొక LIC పాలసీ తీసుకొని, ఆమెని నామినిగా పెట్టి ఉన్నట్టయితే, లేదా కొంత ఆస్తి ఆమె పేరిట సమకూర్చి ఉంటేనో… (జగతి ఆశించినవి బహుశా అవే అని అనుకుంటున్నాడు కాబట్టి ) గుర్రం సీతారాములుకి అసలు ఎవ్వరితోనూ పేచీ ఉందేది కాదనుకుంటా.
      ఒక మనిషి బలవంతపు నిష్క్రమణకు కారణం కేవలం ఆర్థికం మాత్రమే కాదు ఇంకా చానా అంశాలు ఉంటాయి అది మీకు తెలియక కాదు . సరే సంశయిస్తూ నే నాలుగు లైన్ లు రాసుకున్నా . మీకు వాక్యాలు విడదీసి తిరగ దీసి మరగ దీసి చివరకి నాకు ఎవరితో పేచీ ఉండదు అని తెల్చాక ఇక చర్చ అనవసరం. కాకుంటే
      చచ్చిన వాడి కళ్ళల్లో ఏలు పెట్టి కెలకడం అంటే ఓహో నున్నా నరేష్ లాంటి వాళ్ళు ఇలా ఉంటారు అనుకున్నా. మీకు అసలు సమాధానం ఇవ్వాల్సిన అవసరమే లేదు కారణం ఈ నున్నా నరేష్ అనే ఆయన ఎవరు ? ఏంటి ఆయన రాజకీయాలు? ఈ పేరు నేను మొదటి సారి విన్నాను అయినా ఇంతగా జగతి చావుని LIC పాలసీ లెవల్ కి తీసుకొని పోయిన సదరు వ్యక్తికి
      ఇలా సమాధానం చెప్పాలి అనిపించింది.
      ఒకడు అలా వాగు పక్కన ఏరుక్కుంటూ ఏదో తింటున్నాడట, అరె బాబు అది తప్పు అలా తినకూడదు అంటే “అవసరం అయితే అందులో అద్దుకొని తింటా నీకేమయినా అభ్యంతరమా అన్నాడట’ కచ్చితంగా ఒక చావు సందర్భంగా ఏమి మాట్లాడ కూడదో అవి రాసి ఆమె బ్రతుకుని పాలసీ లెవల్ కి కుదించిన వ్యక్తికీ వాగు పక్క దొడ్డికి పోయే వాడి మానసిక స్థితికీ తేడా లేదు అని అర్ధం అయ్యింది.
      ఇంతకు మించి ఒక్క వాక్యం రాసి కూడా నా సమయాన్ని వృధా చేసుకోవడం ఇష్టం లేదు.

      చివరిగా నా వ్యాసం మీద ఇంత పోస్ట్ మార్టం చేసిన వ్యక్తి ఏదన్నా విలువైన పని చేసుకుంటే బాగుండేది అని చెబుతూ, సదరు మనిషి పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పత్రిక లో పనిచేసి పాలన మారాక కొలువు ఆపాడని తెలిసింది. (అది ఆయన వ్యక్తిగతం) ఆ పత్రిక చదివి చెప్పిన వాళ్ళు అన్న మాట ఇక్కడ చెప్పాలి అనిపిస్తోంది. చంద్రబాబు నాయుడి కి అర్థం అయిన నున్నా నరేష్ వాక్యం జగన్ కు ఎందుకు అర్థం కాలేదో అనే అంశం మీద ఒక సిద్దాంత గ్రంధం రాసి పాలకులను మురిపించి మెప్పించి జగన్ ద్రుష్టి లో పడి ఆంధ్రప్రదేశ్ పత్రిక పూర్వపు కొలువులో కుదురుకోవాలి అని ఆశిస్తూ.. సారంగ కూ సారంగ సంపాదకులకూ ఒక నమస్కారం చేస్తూ .. ఇంతటి మానవీయమైన మనుషుల మధ్య నా లాంటి పిపీలికం అవసరమా అనుకుంటూ సారంగ లో ఇదే నా చివరి వాఖ్యం అని చెబుతూ, తానూ తన వారసులకోసం, వారి భద్రత కోసం అయినా ఒక LIC పాలసీ తీసుకోవాలి అని …

      • డియర్ డా. గుర్రం సీతారాములు!

        1. నేను పెట్టిన నాలుగు కామెంట్లలో చివరిదానికి మాత్రమే రిప్లయ్ ఇవ్వడాన్ని ‘evasive tactics’ అనీ, ‘కప్పదాటులు వేయడ’మనీ అంటారు.
        2. జగద్ధాత్రి మీద మీ నివాళి వ్యాసం – నాకు అర్థం కాలేదన్నాను: మీరు ఏమి చెప్పదల్చుకున్నారో సరిగా చెప్పలేకపోయారు- అని మాత్రమే కాదు నా అభియోగం. అసలు ఏమి చెప్పదల్చుకున్నారో కూడా మీకు అవగాహన లేదని.
        3. ఈ వ్యాసానికి మాత్రమే పరిమితమై చెప్పాలంటే- మీ అవగాహనలేమిని, అయోమయాన్నీ దాచుకునేందుకు సరిపడా భాష కూడా లేదు, వాక్యాల్ని అల్లే నేర్పు గానీ, వ్యక్తీకరించే నైపుణ్యం గానీ మీకు లేవు.
        4. “చచ్చిన వాడి కళ్ళల్లో ఏలు పెట్టి కెలకడం అంటే ఓహో నున్నా నరేష్ లాంటి వాళ్ళు ఇలా ఉంటారు అనుకున్నా… ” – ఇటువంటి చర్చనీయ కారుణ్యాంశాన్ని కవచంగా ధరించి, చర్చ పీకనొక్కి, ప్రత్యర్థి మీద దొంగదాడి చేసే ఎత్తు. ఆ మాటకొస్తే- జగద్ధాత్రి బలవన్మరణానికి పూర్వం, మరణానంతరం తమ్ముడిగా మీరు అందించిన ఆసరా కంటే, స్నేహితుడిగా నేను అందించిన మద్దతు ఎక్కువ.
        5. “ఈ నున్నా నరేష్ అనే ఆయన ఎవరు ? ఏంటి ఆయన రాజకీయాలు? ఈ పేరు నేను మొదటి సారి విన్నాను”
        – మీరు రాసిన పొంతనలేని వాక్యశకలాలకీ, తలాతోకా లేని పేరాలకీ మీ వివరణ చెప్పడానికి నున్నా నరేష్ తెలియాల్సిన అవసరం లేదు. కానీ, నేను తెలియదంటూ మీరు అబద్ధమైనా చెబుతుండాలి, లేదా మీకు స్మృతినాశం (amnesia) అనే రుగ్మత అయినా ఉండిఉండాలి.
        i) 2013లో మీరు EFLUలో చదువుతున్నప్పుడు, శ్రీరాములు అనే దళిత విద్యార్థిని డా. మీనాక్షీ రెడ్డి అనే ప్రొఫెసర్ వేధించడం, అతన్ని హాస్టల్ నుంచి గెంటేయడానికి నోటీసులు ఇచ్చినప్పుడు, మిగతా మీడియా మీనాక్షి రెడ్డి ప్రెస్ నోట్ కి మాత్రమే పరిమితమైనప్పుడు, నేనప్పుడు పనిచేస్తున్న The Hans Indiaలో దళిత విద్యార్థికి అనుకూలమైన రిపోర్ట్ రాసాను(దానికి డా. మీనాక్షి రెడ్డి మా ఎడిటర్ కి నోటీసు పంపించారు కూడా). ఆ రిపోర్టు రాయడానికి నేను వచ్చినప్పుడు నన్ను EFLUలో రిసీవ్ చేసుకుంది, ‘నరేష్ అన్న పెద్ద రైటర్, నీ తరఫున రాయడానికి వచ్చాడు..’ అంటూ శ్రీరాములుతో చెప్పింది, విద్యార్థి నాయకులకి పరిచయం చేసింది కూడా మీరే.
        ii) http://bit.ly/2lPkbVS – నా యీ ఫేసుబుక్కు పోస్టులోకి మీదైన అవగాహనారాహిత్యంతో మీరు పెట్టిన కామెంటు మీద జరిగిన చర్చలో “నున్నా సర్ నాకు తెలియని మనిషి కాదు” (http://bit.ly/2ma8ERf)” అని మీరే అన్నారు.
        ఇప్పుడు నరేష్ నున్నా పేరు మొదటిసారి వింటున్నా అంటున్నారు????!!
        6. “సదరు మనిషి పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పత్రిక లో పనిచేసి పాలన మారాక కొలువు ఆపాడని తెలిసింది.”
        – ‘పనిచేసిన ఆంధ్రప్రదేశ్ పత్రిక లో పనిచేసి…’ – ఏఏ పీహెచ్డీలతో వస్తున్నాయి ఇటువంటి వాక్యాలు??
        “చంద్రబాబు నాయుడి కి అర్థం అయిన నున్నా నరేష్ వాక్యం జగన్ కు ఎందుకు అర్థం కాలేదో అనే అంశం మీద ఒక సిద్దాంత గ్రంధం రాసి”, జగన్ కంటే చంద్రబాబు బాగా అర్థం చేసుకుంటాడన్న తీర్మానాల సిద్ధాంత గ్రంథం ప్రస్తుత పాలకుడైన జగన్ దృష్టిలో పడేలా చేస్తే మురిసి, మెచ్చుకుంటాడా?- ఏఏ అధ్యయనాల వల్ల కలుగుతున్నాయి సామీ… ఇంతోటి జ్ఞానాలు?
        మీ దృష్టిలో విలువైన పనో కాదో తెలియదు గానీ, ‘ఆంధ్రప్రదేశ్’ కు ముందే 24 ఏళ్ళు జర్నలిస్టుగా పనిచేశాను (‘ఆంధ్రప్రదేశ్’ తర్వాత కూడా బైట పనిచేస్తున్నాను). చంద్రబాబుకి ఎంతో వ్యతిరేకంగా రాసిన వాక్యాలు (వ్యాసాలు) అర్థమయ్యి కూడా నన్ను కోరి కొలువులోకి తీసుకుంది చంద్రబాబు ప్రభుత్వం. కాబట్టి, పాత కొలువులో కుదురుకోవడానికి నేనెవర్నీ మెప్పించి… మురిపించాల్సిన అవసరం లేదు.

  • మీ వ్యాసంతో జగతి గారి బలవన్మరణంపై జరుగుతున్న దాడికి కొంత అడ్డుగోడ నిర్మించారు సార్. ఏదయినా జరిగాకే మనం ఆ మనుషుల గురించి ఆలోచిస్తాం. ఆ బలహీనతను అధిగమించడం కష్టమే ఈ దొర్లాడుతున్న బతుకులలో. నిబ్బరాన్ని అందరికీ చెప్పి తను ఇలా పారిపోవడం చాలా విచారకరం. ఎవరి జడ్జిమెంట్ వారికున్నా తన తీర్పు తానే రాసుకున్బ ఆమె తన కోర్టులో ఓడిపోయిన న్యాయమూర్తి కావడం దురదృష్టం.

  • ముఖపుస్తక మిత్రురాలు జగధ్ధాత్రి గారి బలవన్మరణం చాలా విషాదాన్ని మిగిల్చింది….ఎందరికో అది ఒక పాఠంలా మిగిల్చి తాను వెళ్ళిపోయింది…

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు