ఆమెకి రెక్కలిచ్చిన జేబురుమాలు!

దాదాపు వందేళ్లకిందటే ఒక పురుషరచయిత చదువుకుంటూ కొత్తగా రెక్కలువిప్పుకుంటున్న స్త్రీల కథ చెప్పడం ఆశ్చర్యమే!

బాపూ గారి సినిమా ముత్యాలముగ్గో, గోరంతదీపమో గుర్తులేదు. అందులో ముళ్లపూడివారి మాట ఉంటుంది. “ఆడదాని మనసు అద్దం లాంటిది. పెళ్లయ్యేదాకా ఎవరి ప్రతిబింబం పడ్డా పెళ్లికాగానే భర్త మొహం తో ఫోటోగా మారిపోతుంది” అని
   అప్పుడు చిన్నతనం లో ఇది గొప్ప డైలాగ్ అని అందరం మురిసాం. ఇప్పుడాలోచిస్తే అలా ఆడదాని మనసును భర్త ఫోటోతో ఫ్రేము చేసి గోడకు కొట్టిన మేకుకి తగిలించేస్తేనే గాని దాని జబ్బుకుదరదు. లేదా అది దార్లోకి రాదు అని అర్ధమేమో అనే కుశంక కలుగుతోంది
పాపం బాపూ గారూ సాక్షాత్తూ శ్రీరామచంద్రుడి భక్తులు కనుక మగవారిని అంటే తమ భర్తలను ఆవిధంగానే భార్యలు కొలుచుకుంటారని భావించి (అలా ఉంటే అలాగే కొలుచుకోవచ్చు. కానీ అలా ఎందుకుంటారు. కానీ చాలా మంది భార్యలు భర్తలు ఎలా ఉన్నా తప్పక కొలుచుకోవలసి వస్తుంది ) అలాంటి ‘పటం డైలాగ్’ రాయించుకుని ఉంటారు. లేదా స్త్రీలపట్ల ఆయనకున్న గౌరవం వల్ల కూడా కావచ్చు.
బుర్రావెంకట సుబ్రహ్మణ్యం గారి జేబురుమాలు కథ నిన్న రాత్రి మళ్లీ చదివినప్పుడు ఆ డైలాగ్ తాలూకు పాత ముక్కవాసన బాగా తెలిసి వచ్చింది.
నిజానికి ఈ కథ నేను చాలా ఏళ్లలో చాలా సార్లే చదివాను కథ నాకు అపసవ్యంగా అర్ధమయి ఆయనమీద కొంచెం కోపంగా ఉండేది. కానీ ఇది తెలుగు కథాసాహిత్యం లో పేరు పొందిన కథ. ప్రసిద్ధ సంకలనాల్లో వచ్చిన కథ. రచయిత పేరు చెప్పగానే అందరూ ఈ కథే చెప్తారు. కానీ నాకు వేరే దృష్టితో చదవడం వల్ల ఇది కాక ఈయనే రాసిన ‘పారిస్’ అనే కథ నచ్చేది.
కానీ నిన్న ఉన్నట్టుండి ఈ జేబురుమాలు కథ లోని ప్రతీకాత్మకత ఏమిటో తోచగానే ఆ రోజుల్లోనే ఆయన ఇంత అభ్యుదయాత్మకమైన కథ రాసినందుకు ఆశ్చర్యం కలిగింది.
ఆంధ్రప్రదేశ్ గవర్నమెంటు లో అడ్వకేట్ జనరల్ గా పనిచేసిన ఈ రచయిత చాలా తక్కువ కథలు రాసినా వీటిలో గొప్ప పనితనం కనిపిస్తుందని సాహితీవేత్తలు చెప్పే మాటకు ఈ జేబురుమాలు కథే ఉదాహరణ
పద్మిని కి పద్ధెనిమిది ఏళ్లు ఉండొచ్చు. ఓ క్రేప్ గుడ్డను అంచులు నగిషీ పని చేసి జేబురుమాలుగా కుట్టబోవడం తో కథ మొదలుపెడతాను బుర్రా వారు.
రెండేసి ఏళ్ల వ్యవధి లో ఆమెకు ముగ్గురు యువకులు పరిచయం అవుతారు. మొదటి యువకుడు మేనత్త కొడుకు చిట్టిశాస్త్రి.
అతనికి పద్మిని అంటే చాలా ఇష్టం. కానీ ఆమె చెన్నపట్నం వెళ్లి పెద్దచదువు చదవబోతోంది. తనకా స్తోమత లేదు. కానీ తన ప్రేమ ప్రకటించకుండా ఉండలేడు. జాగ్రత్తగా దాచుకున్న డబ్బులతో ఆమెకిష్టమైన పుస్తకం కొని బహుమతిగా ఇస్తాడు.
ఆమె అతనికి తిరిగి ఏదైనా ఇవ్వాలని భావించి పోనీ ఈ జేబురుమాలు కుట్టి ఇస్తానంటుంది. అతను ఆనందపడినా వద్దులే నువు ఇస్తాననడమే చాలు ఇచ్చినట్టే అంటాడు
 రెండేళ్లతర్వాత రెండో యువకుడు లక్ష్మీకాంతం చెన్నపట్నం లో కళాశాలలో ఆమెకు సహవిద్యార్ధి.అప్పుడు ఆమె జేబురుమాలు రెండో అంచు కుడుతో ఉంటుంది.
తిరిగి ఇంచుమించు అదే సంభాషణ.
ఆమెకు లక్ష్మీకాంతం మీద స్పష్టమైన ఇష్టమే. అతనికీ అంతే. కానీ అది ఎంతవరకూ వెడుతుందో లేదా తీసికెళ్లాలో అనే స్పష్టత ఇరువురికీ లేదు. అతనూ ఆమెకు ఓ విలువైన బహుమతి ఇస్తాడు. దానికామె తిరిగి ఏమివ్వను అని ఈ జేబురుమాలు నిన్ననే తీసాను రెండోవేపు కుడుతున్నాను  మిగతా రెండువేపులా పూర్తిచేసి నీకే ఇస్తానంటుంది. కానీ అతను కూడా “ఇవ్వకపోయినా ఫర్వాలేదు ఇచ్చినట్టే భావిస్తాను.” అంటాడు. ఆమె తీసుకోమని ఎంత చెప్పినా అతను అదే అంటాడు
మరో రెండేళ్ల తర్వాత మధుసూదన్ అనే వారిద్దరి సహవిద్యార్ధీ, రచయితా, మరీ ముఖ్యంగా ఆమెకు అభిమాన రచయితా ఆమెకు దగ్గరౌతాడు.
 చదువులు అయిపోయాయి గానీ అతను పై చదువులకు విదేశాలకు వెళ్లాలనుకుంటున్నాడు. ఇద్దరికీ ఒకరినొకరు వదిలి దూరమవ్వాలని లేదు.
కానీ అతనికి పై చదువుమీద ఉన్న కాంక్ష ఎక్కువ. అదే జయించింది. ఆమె కు అతను తన పుస్తకం ఇస్తే ఆమె అతనికి మూడవ వేపు కుట్టబోతున్న జేబురుమాలు బహుమతిగా ఇస్తానంటుంది. అతనూ అదే మాట అంటాడు. అంతమాటన్నావు ఇచ్చినట్టే అని.
లేదు నేను పూర్తిచేసి నీకు నువ్వున్న చోటికి పంపుతానంటుంది. మధుసూదన్ కి ఆమె ప్రేమ తెలిసినా అతని దృష్టి ఆమె మీద కన్న తన పై చదువులమీదే ఉంది. అందుకని “నేనివ్వబోయో జేబురుమాలు ఎప్పుడూ నీ జేబుని అలంకరించే ఉండాలి సుమా” అంటే ” మరి చాకలికి వేసినప్పుడో” అని సరదాగానే పరిహాసం చేస్తాడు.
మధుసూదన్ విదేశాలకు వెళ్లిన రెండేళ్లకి ఆమెకు వేరే అతనితో పెళ్లి అవుతుంది. అయిన వారం రోజులకి మళ్లీ జేబురుమాలు ఆమె నాలుగో అంచు కుట్టడానికని బయటకు తీసింది.
భర్త వచ్చి చూశాడు. ఏమిటంటే మిగిలిన వారికి చెప్పినట్టే దీన్ని క్రేప్ డిషైన్ అనో క్రీప్ డిజైన్ అనో  అంటారంది. మిగిలిన వారు విని ఊరుకున్నారు. కానీ ఈ భర్త వెంటనే ఏం క్రీప్ డీషైన్ అని లేదా క్రేప్ డిజైన్ అని ఎందుకనకూడదు అని అడ్డుపడతాడు
అంతేకాదు ఫలానా ఆవిడతో మాట్లాడి స్నేహం పెంచుకో ఆవిడ నలుగురిలో మెలిగే టప్పుడు అందరినీ ఆకర్షించే చిట్కాలు నేర్పుతుంది అంటాడు. అవన్నీ నా కెందుకు అంటే నా భార్యకు అవన్నీ అవసరం అంటాడు.
కానీ పద్మిని “ఆమె తనకు నచ్చలేదంటుంది. లోకం అంతా తనకేసే చూస్తున్నట్టూ, తనకేసే చూడాలన్నట్టూ ప్రవర్తిస్తుంది. నాకు నచ్చదామనిషి” అంటుంది.
“చిన్న చిన్న చమత్కారచేష్టలతోనే మనిషి రాణించడం, రాణించకపోవడం బయటపడుతుంది. తంటాలు పడి శ్రధ్ధగా నేర్చుకుంటేనే గాని ఆ చేష్టలు పట్టుబడవు. ఊరికే సిగ్గుపడిపోయి అందరివెనకా గోడకి జార్లబడి నుంచుంటే ఏం లాభం. ఆవిడ దగ్గర నేర్చుకుంటే ఆవిడని మించిపోతావ్ “అంటాడు
భర్తగా ఆమె మీద ఎంత జులుం చెయ్యాలో అదంతా మర్యాదపూర్వకంగానే చేస్తాడు.
చివరకు ఈ జేబురుమాలు ఏమిటంటాడు. త్వరగా కుట్టమంటాడు. అందరికీ చెప్పినట్టే నాకు ఇలాంటి కుట్లు అల్లిక పట్ల ఓపిక తక్కువ ఏదో సరదాకి మొదలుపెట్టాను అంటుంది
అదేం కుదరదు త్వరగా పూర్తిచేసెయ్. రేపు పార్టీకి వెళ్లేటప్పుడు దాన్ని జేబుమీద అలంకరించుకోవాలి. సాయంత్రం నేను వచ్చేసరికి పూర్తి చేయాలని ఆర్డర్ వేసి వెడతాడు. అలాగే ఆవిడ తో స్నేహం చేసి ఆ తళుకు బెళుకు విద్యలన్నీ నేర్చుకు తీరాలి అని ఆజ్ఞాపించి వెడతాడు కథ అయిపోయింది. ఆమె సమాధానం లేకుండానే కథ అయిపోయింది
జేబురుమాలును ఆమెకు ప్రతీక గా తీసుకుంటే కథ స్పష్టం. ఆమెను ప్రేమించిన వారుగానీ ఆమె ప్రేమించినవారుగానీ జేబురుమాలు అందంగా కుట్టి ఇస్తానన్నా అంత మాట చాలు ఇవ్వకపోయినా ఫరవాలేదన్నారు
తీరా భర్త నాకే ఇవ్వాలి అన్నాడు.
మీకు బహుమానం గా ఇస్తే నాకేమిస్తారు అంది.
అంటే నీకు నేను మొగుడునవ్వడమే బహుమానం వేరే బహుమానాలెందుకు అన్నాడు. పైగా దాని మీద నా పేరు కుట్టి ఇవ్వాలి. రేపు సాయంత్రం పార్టీలో అందరి ముందూ దీన్ని ప్రదర్శించాలి. అంటాడు. భార్య కూడా తన అదుపులో ఉండి ప్రదర్శనకు పనికొచ్చేవస్తువు అతనికి. అంటే ఆ చదువుకున్న భర్తకు చదువుకున్న భార్య అనమాట.
“కానీ ఆమె రేపు మీతో నాకు రావాలని లేదండీ” అంది.
మళ్లీ మొదలుపెట్టకు. రేపు నువ్వు రాక తప్పదు. ఆ జేబురుమాలు గురించి బధ్ధకించకు. తప్పకుండా తయారుగా ఉండాలి… రేపు రాత్రి వాళ్లందరిమధ్యా దాన్ని పైకితీసి చూపించి ఈ నగిషీపనంతా ప్రత్యేకం నా కోసం నువ్వు కష్టపడి చేసేవని వాళ్లందరితోటీ చెప్పొద్దు మరీ….. ఏమంటావు.
అని ఆమె సమాధానం కోసం ఆగకుండా ఆఫీసుకు వెళ్లిపోతాడు
ఇప్పుడు బాపూ గారు చెప్పిన  ‘భర్తమొహం భార్యమనసు అనే అద్దం లో పడి ఫోటో గా మారి’ గోడకు ఎలా వేలాడుతుందో అర్ధమవుతోంది కదా
కానీ భార్య మొహం అలా భర్తమనసనే అద్దం లో పడి… అనలేదు సినిమా రచయిత. గడుసువాడు.
కథలో మరో అంశం. పద్మిని కి పెళ్లికి ముందే ముగ్గురు స్నేహితులు ఉండడం, వారు ఆమెను జ్ఞాతంగానో, అజ్ఞాతంగానో ఇష్టపడడం, ఆమెకూడా దాన్ని కాదనలేకపోవడం, ఎంతో కొంత వారి వైపు మొగ్గడం అన్నది.
మోహిత అనే అమ్మాయి తొమ్మిదో చంద్రుడు అని కథ రాసింది ఈ మధ్య. చిన్ననాటినుంచి ఎంతమంది అబ్బాయి లు తనను వలచి వలపించబోయారో చెప్తూ. ఆమె తీసుకున్న కథావస్తువు నాకు ఆశ్చర్యాన్ని కలిగించింది. ఆమె సాహసానికి అబ్బుర పడ్డాను
కానీ దాదాపు వందేళ్లకిందటే ఒక పురుషరచయిత చదువుకుంటూ కొత్తగా రెక్కలువిప్పుకుంటున్న స్ర్తీల జీవితాల్లో ఇలాంటి పురుషుల ప్రవేశాలు, పలు పరిచయాలు, పలుప్రేమసందర్భాలూ జరగడం లో వింత గానీ అపకీర్తి గానీ లేదని అవి సహజసిధ్ధమన్నట్టు  గా రాసేడు. ఇదీ ఆశ్చర్యమే.
కానీ ఇందులో ఎవరైనా సరే భర్త పోస్ట్ లోకి గనక వస్తే ఆ జేబురుమాలు వంటి ఆమెను ప్రదర్శన వస్తువుగా చేయడానికీ, ఇంకా ముక్కుచీదుకోడానికి కూడా వెనకాడరని నిరూపించేడు బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారు
ఇన్ని రోజులు నేను ఆ పద్మిని ప్రవర్తన లో లోపాలు వెతుకుతూ అలా రాసినందుకు రచయితను నిందిస్తూ కథ చదివేను. కానీ నిన్న మాత్రం జేబురుమాలు పద్మిని కి ప్రతీక అనుకో గానే కథ తాలూకు పజిల్ విడిపోయింది.
అంతేకాక అందరిలాగే నాకూ పెళ్లికి ముందు ఏ అమ్మాయి జీవితంలోనూ మరొక మగ పురుగు వాసన తగిలిఉండకూడదన్న మూర్ఖపు పట్టు నాకు తెలీకుండా ఉందేమో. ఇలాంటి పట్టు వల్లనే ఈ కథ నాకు అపసవ్యంగా అర్ధమైనట్టుంది.
 అలా ఉండకపోవడం ఆదర్శం కావచ్చు. నేనూ అంగీకరిస్తాను పురుషుడికి కూడా అలానే వివాహానికి ముందు స్త్రీ స్పృహ తగలకుండా ఉండాలని.
ఒక పురుషుడికి ఒకే స్త్రీ, ఒక స్త్రీ కి ఒకే పురుషుడు అన్నది గొప్ప ఆదర్శం అని చలంగారు అంటారు. మనుషులు ఎంతో చిత్తసంస్కారం పొందిన తర్వాత సాధించవలసిన ఆదర్శమది అని కూడా అంటారు.
కథారసజ్ణులు, వేత్తలు కథ చదివి మరోమారు చర్చిస్తే మరిన్ని అందాలు, లోతులూ తెలుస్తాయేమో ఈ కథలో.  ఈ సారి శేఫాలికల ద్వారా విమర్శకులను జేబురుమాలు కథా చర్చకు ఆహ్వానిస్తూ…
*

వాడ్రేవు వీరలక్ష్మీ దేవి

12 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • సుబ్రమణ్యం గారి జేబురుమాలు కథ గురించి మీ పరిచయం బాగుంది మేడం..కథ కోసం నాలుగు వైపులా ఇచ్చారు కానీ ఒక ఆడాలసెన్స్ పిల్లలు నలభై మందిని హీరో,హీరోయిన్ వర్షిప్ తో చూసినా ఆశ్ఛర్యమ్ లేదు.ఇప్పటి దాకా వాళ్ళ ప్రపంచం లో వాళ్ళు ఒక్కరే.ఇప్పటి నుండే ఇంకొక జెండర్ ని తమ లోకి ఆహ్వానిస్తూ మనసు అడ్డం లో వాళ్లకు నచ్చిన గుణాలనో,రూపాంనో,ఊహించుకుంటూ ఉండటం సహజం అలా లేక పోతే వాళ్ళు ఆ వయసుకు తగినట్లు ఎడగనట్లే.ఆడపిల్లలు నాన్న లాగా ఉండేవారు కావాలి అని,మగ పిల్లలు తమ ఆమ్మ లాగా కన్సర్న్ గా ఉండాలి అనిన్నుకోవడం కూడా చూస్తూ ఉంటాము.కొందరికి ఈ క్రష్ అనేది లోపించినా తరువాత జీవితం లో ఎవరైనా నచ్చితే ఆ శూన్యాన్ని వారితో నింపుకుంటారు.ఇదంతా వర్చ్యువల్.అయితే నిజ జీవితపు హద్దు దాటి రాకూడదు.సైకాలజిస్ట్ మీకు నచ్చిన పేర్లు వ్రాసి వాటిలో ఒక్కరిని మాత్రమే కోరుకో మంటే,తల్లి తండ్రులను కూడా కొట్టేసి జీవిత భాగస్వామి ని ఉంచుతాము.వాళ్ళు మనపై హక్కు తీసుకు.టు నారు అంటే మనకు హక్కు ఇచినట్లే.ఇది బాపు గారు చెప్పినట్లు సహజం.తప్పు పట్టక్కర్లేదు.

  • జేబురుమాలు –
    బుర్రా వెంకట సుబ్రహ్మణ్యం గారి క‌థ‌ను ప‌రిచ‌యం చేసినందుకు ధ‌న్య‌వాదాలు.
    నిజంగా షాకింగే. ఇపుడు స్మార్ట్ గ్యాడ్జెట్స్ ట్రెండ్ అయినా.. జేబురుమాలు క‌థ ఇంకా నిత్య‌నూత‌న‌మే.
    ధ‌న్య‌వాదాలు మేడమ్‌

  • కనబడని పదును ఈ క్రేప్ రుమాలుది. ఎప్పటికప్పుడా తాజా డిజైన్ నిలుపుకోవలసిరావటం కనబడనేరాదు కదా మరి. పద్మిని ప్రయత్నం కనబడదు , దాని వెనుక ఒత్తిడి కనబడదు…

    *గోరంత దీపం లో అత్తారింటికి వెళ్ళే పిల్లతో తండ్రి అన్నమాటలు ముతకవీ నొప్పి పెట్టేవీ కూడా.

  • ‘ జేబురుమాలు ‘ కథని దూరదర్శన్ వాళ్ళు  ( సప్తగిరి ) అరగంట నిడివితో చిత్రీకరించారు. ఈ మధ్యనే మళ్ళీ ప్రసారం చేస్తే చూశాను. 

  • కథ గురించి మీ దృష్టి కోణంలో వచ్చిన మార్పుని బాగా చెప్పారు. ముత్యాల ముగ్గు సినిమాలో మీరు ఉదహరించిన డైలాగ్ సారాంశం ఆ సినిమాలో సందర్భానికె కాదు, ఇప్పటి, రాబోయే కాలానికి కూడా ఉనికిలో ఉంటుందనుకుంటాను. మహిళ పురుషుడి సొంత ఆస్తి కాదన్న భావన/ఆచరణ ఉన్నంత వరకు ఉనికిలో ఉండవచ్చు.

    నాకు సినిమా మీద చర్చ చేసే ఉద్దేశం లేదు. కానీ 1970-75 మధ్య నడిచిన ‘జీవనాడి‘ నెల సాహిత్య పత్రికలో ’సినిమా పాటలలో స్త్రీలు’ అనే వ్యాసం గుర్తొచ్చింది.

    జేబు రుమాలు కథా కాలానికి నేటికీ స్త్రీ పురుష సంబంధాలలో విప్లవాత్మక మార్పులు వచ్చాయి. అయినా ఈ కథ ఇప్పటికి, రాబోయే కాలానికి ప్రాతినిధ్య కథే. ముత్యాల ముగ్గు సందర్భాలు గతమవుతుతుంటాయి.

  • కథ చదివి ఇక్కడకు వచ్చాను.మీరు చెప్పినట్లుగా బుర్రావారు అభ్యుదయం అప్పుడే చూపించారు.గొప్పకథ ని ఇంకా గొప్పగా ప్రెజెంట్ చేశారు మీరు .అభినందనలు

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు