ఆ పాప పెరట్లో ఆడుకుంటోంది.
“చూడు, నీ కోసం ఏం చేశానో,” అంటూ గుప్పిట విప్పి చూపించింది. వేళ్లకి తొడుక్కునే ఫింగర్ పపెట్. ఫెల్ట్ గుడ్డ ముక్కలతో ముచ్చటగా కుట్టబడ్డ నల్ల మచ్చల తెల్లావు బొమ్మ.
“వీడి పేరు మిస్టర్ మూ. నచ్చాడా?”
పాప బదులు కోసం ఎదురు చూస్తున్నట్లు ముఖం పెట్టింది. క్షణంలో ఆ ముఖం విప్పారింది.
“ఇంద. తీసుకో,” అంటూ చెయ్యి చాపింది.
అయితే, అందుకోటానికి అక్కడెవరూ లేరు. ఆ పాప ఎదురుగా ఉందల్లా ఓ పాత రాతి అరుగు – ఖాళీగా.
అంతలో, పాపకో అనుమానమొచ్చింది. మిస్టర్ మూని తన మిధ్యాస్నేహితుడికి అప్పగించటం అంత తెలివైన పని కాదేమోననిపించింది.
“మొన్న మిస్ పిగ్గీని పోగొట్టినట్టు, మిస్టర్ మూని కూడా పోగొట్టవుగా?” అంది, అపనమ్మకం మోమంతా నింపుకుని. క్షణమాగి, “ఎందుకైనా మంచిది. నావద్దే భద్రంగా దాస్తాలే,” అంటూ చెయ్యి వెనక్కి తీసుకుంది. రెండు చేతుల్లోనూ మిస్టర్ మూని పొదివిపట్టుకుని గుండెకి హత్తుకుంది.
అప్పుడే – ఇంట్లోంచి అమ్మ పిలుపు వినపడింది, “ఆన్నీ, ఆడుకుంది చాలు, ఇక రా. నీకు చెప్పిన పని అక్కడే వదిలేశావు.”
పాప తల తిప్పి అరచి చెప్పింది, “వచ్చేస్తున్నా అమ్మా. ఇంకొక్క నిమిషంలో వచ్చేస్తున్నా.”
—————
కేథరిన్ చాలా హడావిడిగా ఉంది. ఈ సమయంలో ప్రతి పనిదినమూ ఆమె ఇలా హడావిడిగానే ఉంటుంది. ప్రస్తుతం ఆమె ఓ పక్క దేనికోసమో వెదుకుతూ, మరో పక్క సెల్ ఫోన్లో మాట్లాడుతోంది.
“ఏదో ఒకటి చెయ్యండి డాక్టర్. అమ్మ పరిస్థితి రోజు రోజుకీ దిగజారిపోతోంది.”
“ఎందుకలా అనుకుంటున్నారు?” అవతల నుండి భావరహితమైన గొంతుతో డాక్టర్ ప్రశ్న.
“ఎందుకంటే … మామూలుగానైతే అమ్మకి ఆరేడు తరాల చరిత్రలు జ్ఞాపకముంటాయి. కానీ ఈ మధ్య చాలా విషయాలు మర్చిపోతోంది,” అంటోండగా గదిలో ఓ మూల కుర్చీకి తగిలించున్న హ్యాండ్‌బ్యాగ్ కేథరిన్ కళ్లబడింది. దాన్నందుకుని భుజాన తగిలించుకుని గదిలోంచి బయటికొచ్చింది. అదో చిన్న నడవా. ఇంట్లో మిగిలిన గదుల్ని కలుపుతుంది.
“అల్జీమర్స్‌తో బాధపడేవారికి అది సహజమే,” ఫోన్లో డాక్టర్ వివరణ.
“ఏదో వేరే లోకంలో ఉన్నట్లుండటం, తనలో తానే మాట్లాడుకోవటం … అదీ సహజమేనా?” కేథరిన్ విసురుగా అడిగింది.
“ఏం మాట్లాడుతుంది?” డాక్టర్ ఆమె విసురు వినిపించుకోలేదో, విన్నా పట్టించుకోలేదో, మొత్తానికి తన ధోరణిలో అభావంగా అడిగాడు.
కేథరిన్ బదులీయకుండా నడవా ఆ చివరనున్న గది వద్దకి నడిచింది. లోపలంతా చిందరవందరగా ఉంది. బొమ్మలు, దుప్పట్లు, దిండ్లు గదంతా గందరగోళంగా విసిరేయబడున్నాయి. తలుపు దగ్గరో ఊదారంగు స్కూల్‌బ్యాగ్ సిద్ధంగా ఉంది. దానిపై పసుపు రంగులో, చిన్న పిల్లల చేతిరాతతో, పెద్ద పెద్ద అక్షరాలతో ‘ANNIE’ అని రాయబడుంది.
పళ్లు కరచిపట్టి ముందుకి వంగి స్కూల్‌బ్యాగ్ అందుకుని భుజాన వేసుకుంది కేథరిన్. తర్వాత ఫోన్లో –
“సారీ డాక్టర్. తర్వాత మాట్లాడతాను,” అని చెప్పి బదులు కోసం ఎదురు చూడకుండా ఫోన్ పెట్టేసింది.
—————
ఆ వృద్ధురాలు మంచం అంచున కూర్చుని ఏదో గొణుక్కుంటోంది. ఈ మధ్య ఆమె రోజంతా ఇదే పనిలో ఉంటోంది – నిద్రించేప్పుడు తప్ప. గత మాసమే ఆమెకి డెబ్భయ్యేళ్లు నిండాయి, కానీ ఆ తనువులో మరో దశాబ్దపు వార్ధక్యం అదనంగా కనిపిస్తోంది. ఆమె వంటి నిండా ముడతలే. తూర్పుదిక్కునున్న కిటికీ నుండి ఆమె దేహమ్మీద వాలుతోన్న ఉదయ సూర్యుడి కిరణాలు ఆ ముడతల సాయంతో చారలు చారలుగా నీడలు పరుస్తున్నాయి. అవి ఎండిపోయిన పంట కాలువలని తలపిస్తున్నాయి.
ప్రస్తుతం ఆ వృద్ధురాలు ఒక చిన్న భరిణ ఒడిలో పెట్టుకుని దాని అంచులు తడుముతూ గొణుగుతోంది. అదో కొయ్యతో చెయ్యబడ్డ భరిణ. దాన్నిండా అందమైన దంతపు నగిషీలు పొదగబడున్నాయి. ఆ భరిణ ఘన గతానికి మిగిలిన జ్ఞాపకాలవి. వృద్ధురాలి ఒంటిమీది నీడలకి, ఈ నగిషీల ధవళ జాడలకి మధ్య పోలికేదో పొడగడుతోంది.
గది తలుపు వద్దనుండి కేథరిన్ లోపలకి తొంగిచూసింది. ఆమె భుజాన హ్యాండ్‌బ్యాగ్, స్కూల్‌బ్యాగ్ వేలాడుతున్నాయి.
“వెళ్లొస్తానమ్మా. జాగ్రత్తగా ఉండేం?” కేథరిన్ కేకేసి చెప్పింది.
వృద్ధురాలు తన లోకంలో తానుంది.
“అమ్మా?” కేథరిన్ స్వరం పెంచి పిలిచింది.
వృద్ధురాలు మెల్లిగా తలతిప్పి చూసింది. గొణగటం ఆపేసింది.
“ఆఫీస్‌కి వెళ్తున్నా. మందులు వేసుకున్నావా?” కేథరిన్ అడిగింది.
వృద్ధురాలు బదులీయకుండా భావరహితంగా చూస్తూ ఉంది.
కేథరిన్ నిట్టూరుస్తూ గదిలోకి అడుగుపెట్టింది. ఆమె చూపు మంచం పక్కనున్న బల్లమీద పడింది. దాని మీద నీటితో నింపిన చిన్న లోటా, ఆ పక్కనే ఒక మాత్రల డబ్బీ కనిపించాయి. అవి రెండూ ఒకే చేత్తో తీసుకుని తల్లికేసి చాచిందామె.
“అమ్మా, ఈ రోజుకి నేనిస్తున్నా తీసుకో, ప్లీజ్. రేపట్నుండీ తప్పకుండా ఆన్నీ ఇచ్చేట్లు చూస్తాగా.”
వృద్ధురాలు ఉలకలేదు. ఇంకా భావరహితంగానే చూస్తోంది.
కేథరిన్ కళ్లతో బతిమిలాడింది మరో సారి. మళ్లీ అదే బదులొచ్చింది అట్నుండి. ఇక ప్రయత్నించటం నిరర్ధకమని అర్ధమయిందామెకి.
“సరే, నీ ఇష్టం. నిన్ను బతిమిలాడి ఒప్పించే తీరిక లేదు నాకు,” అంటూ విసుగ్గా లోటా, మాత్రల డబ్బీ బల్లమీద పెట్టేసింది. లోటాలోంచి కొన్ని నీళ్లు తొణికి బల్లపై పడ్డాయి.
“కనీసం భోజనమన్నా సమయానికి చెయ్యి. అన్నీ డైనింగ్ టేబుల్ మీద సిద్ధంగా ఉన్నాయి. లంచ్ టైముకి మోగేలా అలారం పెట్టాను,” అని చెబుతూ కేథరిన్ బయటికి నడిచింది.
వెళ్లిపోతున్న కూతుర్ని వెనకనుండి చూస్తూ వృద్ధురాలు కాసేపలాగే ఉండిపోయింది. తర్వాత ఆమె ధ్యాస మళ్లీ ఒళ్లోని భరిణ మీదకి మళ్లింది. ఏదో గొణుగుతూ భరిణ అంచుల్ని బొమికెల్లాంటి వేళ్లతో ఓ సారి తడిమి, జాగ్రత్తగా దాని మూత తెరిచింది. దాన్లోనుండి నున్నగా తళతళలాడుతోన్ని గోళీలాంటి గుండ్రటి వస్తువొకటి రెండు వేళ్లతో భద్రంగా పట్టుకుని బయటికి తీసింది. కళ్ల దగ్గరికి తెచ్చి కాసేపు పరీక్షగా చూసి మళ్లీ భరిణలో పెట్టేసింది. తర్వాత నాలుగంగుళాల చెక్క బొమ్మనొకదాన్ని బయటికి తీసి పరీక్షించింది. చేతబడుల్లో వాడే దిష్టిబొమ్మలా ఉందది. అర నిమిషం పాటు దాన్ని అటూ ఇటూ తిప్పి చూశాక లోపల పెట్టేసింది.
తర్వాత భరిణలోంచి చూపుడు వేలు పొడవున్న మొండికత్తిని బయటికి తీసింది.
—————
‘ఇంకాసేపట్లో నాకోసం మమ్మీ వచ్చేస్తుంది’ అనిపించింది పెరట్లో ఆడుకుంటోన్న ఆన్నీకి హఠాత్తుగా. తల్లి కవళికల్నే కాకుండా ఆమె కదలికల్ని కూడా ముందే పసిగట్టగలిగే అమోఘమైన శక్తి ఆ అమ్మాయికుంది. తనొస్తే చీవాట్లేసి తీసుకెళ్లిపోతుంది. ఆలోగా చేసేయాల్సిన ముఖ్యమైన పనొకటి మిగిలిపోయింది.
“అది మనిద్దరి మధ్య రహస్యం. ఒట్టేయ్, ఎవరికీ చెప్పనని?” అంటూ చెయ్యి చాపింది – చిటికెన వేలు తప్ప అన్ని వేళ్లూ మడిచి. తర్వాత ఆ చేతిని గాల్లో పైకీ కిందికీ ఆడించింది – పింకీ ప్రామిస్ చేస్తున్నట్లు నటిస్తూ.
అప్పుడే – ఆన్నీ ఊహించినట్లే – కేథరిన్ పెరట్లో అడుగు పెట్టింది. చేతిగడియారంలో సమయం చూస్తూ, “ఆన్నీ,” అని పిలిచింది విసుగ్గా.
ఆ పిలుపు పట్టించుకోకుండా, చిన్న గొంతుతో తన మిధ్యామితృడికి హెచ్చరికి జారీ చేసింది ఆన్నీ, “ఒట్టు తీసి గట్టు మీద పెట్టావంటే చూస్కో …”
“ఆన్నీ,” తల్లి పిలుపు మళ్లీ వినపడింది – ఈ మారు కాస్త గట్టిగా.
ఆన్నీ త్వరత్వరగా హెచ్చరిక పూర్తిచేసింది, ” … నిన్ను నమ్మటం మానేస్తాను. నీమీదొట్టు.”
“ఆంజెలీనా … ఉన్న ఫళాన రా ఇక్కడికి,” వెనకనుండి తల్లి ఉరిమింది – ఆన్నీ అసలు పేరు ఒత్తి పలుకుతూ. అలా పిలిచిందంటే ఆమెకి కోపమొచ్చిందని.
“మళ్లీ రేపొస్తా. సరేనా? టాటా,” అంటూ ఆన్నీ లేచి తల్లి దగ్గరికి పరిగెత్తింది.
కూతురు తన దగ్గరికి చేరేలోపు కేథరిన్ కాస్త చల్లబడింది.
“పొద్దున్నే అమ్మమ్మ మందులు వేసుకునేలా చూడటం నీ పని కదా ఆన్నీ. ఇలా నిర్లక్ష్యం చేస్తే ఆమెకి ప్రమాదం కాదూ?” అంది కాస్త శాంతంగా.
“సారీ మమ్మీ,” అంది ఆన్నీ నేలచూపులు చూస్తూ.
“నువ్వు తప్ప మరెవ్వరు మందులిచ్చినా ఆమె వేసుకోదని మర్చిపోకు,” గుర్తు చేసింది కేథరిన్.
“ఎందుకు మమ్మీ … అమ్మమ్మ నేనిస్తేనే తీసుకుంటుంది?” అంది ఆన్నీ తలెత్తి తల్లిని చూస్తూ.
“నువ్వు అచ్చం తనలానే ఉంటావు కదా. అందుకు.”
తనని, అమ్మమ్మని పక్కపక్కనే ఊహించుకుంది ఆన్నీ. ఇద్దరి మధ్యా పోలికలు కనిపెట్టటానికి ప్రయత్నించి విఫలమయింది. కానీ ఆ విషయం తల్లితో అనలేదు.
“నీకిచ్చిన పని మళ్లీ ఎప్పుడూ మర్చిపోవుగా?” అంది కేథరిన్ ఆన్నీ కళ్లలోకి సూటిగా చూస్తూ. మర్చిపోనన్నట్లు తలూపిందా అమ్మాయి.
“అన్నట్లు – ఆన్నీ … నీకిప్పుడు పదేళ్లు. ఇమాజినరీ ఫ్రెండ్స్‌తో ఆడుకునే వయసు కాదిది. వాళ్లని వదిలేయాల్సిన సమయమొచ్చింది,” అంది కేథరిన్ – ఇందాకటిదాకా ఆన్నీ ఆడుకున్నవైపుకి తల పంకిస్తూ.
ఆన్నీ అందమైన ముఖాన్ని విచారపు మబ్బొకటి కమ్మింది. “అలాంటి ఫ్రెండ్స్ ఉంటే తప్పా మమ్మీ?” అంది బెంగగా.
చటుక్కున ముందుకొంగి ఆన్నీ భుజం పట్టుకుని, “లేదు … లేదు ఆన్నీ. అది తప్పేం కాదు. చిన్నప్పుడు నాకూ ఒక ఇమాజినరీ ఫ్రెండ్ ఉండేవాడు. ఒక వయసు దాటాక అలాంటి స్నేహితులతో మనకి అవసరం ఉండదు. అంతే,“ అంది కేథరిన్ అనునయంగా. కూతుర్ని చూస్తే జాలేసిందామెకి. కానీ తప్పదు, కొన్ని సార్లు తల్లులు ధృడంగా ఉండాల్సిందే.
ఆన్నీని వదిలి నిటారుగా నిలబడి మళ్లీ చెప్పింది కేథరిన్, “నేననేదేమంటే ఆన్నీ … నీకు నిజం ఫ్రెండ్స్ కూడా అవసరమని.”
ఆన్నీ బదులీయకుండా తల్లి ముఖంలోకి చూస్తూ ఉండిపోయింది. అప్పటికి ఆ విషయం వదిలేయాలని నిర్ణయించుకుంది కేథరిన్. “సరే, ఇక వెళ్దాం పద. లేకపోతే నువ్వు స్కూలుకి, నేను ఆఫీసుకి ఆలస్యమైపోతాం,” అంటూ స్కూల్‌బ్యాగ్ ఆన్నీకి అందించింది.
—————
పెరట్లో ఓ మూలనున్న సిమెంట్ అరుగుమీద ఆసీనులైన యువకులిద్దరూ తల్లీకూతుళ్ల సంభాషణ సాంతం మౌనంగా వీక్షించారు.
స్కూల్‌బ్యాగ్ వీపున మోసుకుంటూ తల్లి వేలు పట్టుకుని పెరట్లోంచి వెళ్లిపోతోన్న ఆన్నీని చూస్తూ “ఎంత ముద్దొస్తోందో … నీ పాప,” అన్నాడు ఆ యువకులిద్దర్లోనూ పెద్దవాడిలా కనిపిస్తోన్నతను. రఫాయెల్ అని పిలవబడేవాడతడు. పాతికేళ్ల వయసువాడిలా కనిపిస్తున్నాడు, కానీ అతని అసలు వయసెంతో చెప్పటం కష్టం. ఆ వయసులోనే పుట్టి అప్పటుండీ అదే వయసులో ఇరుక్కుపోయినట్లున్నాడు.
రెండవ యువకుడు తలూపాడు. అతడూ రఫాయెల్ చూస్తున్నవైపే చూస్తున్నాడు. జిమ్మీ అని పిలవబడతాడతడు. రఫాయెల్ కన్నా చిన్నవాడిలా కనిపిస్తున్నాడు.
“నాకూ ఒకప్పుడో పాప ఉండేది. నీ పాపంత ముద్దుగానూ ఉండేది,” అన్నాడు రఫాయెల్ మళ్లీ.
జిమ్మీ తలతిప్పి రఫాయెల్‌ని చూశాడు. “’ఉండేది’ అంటే … ఏమయింది?” అన్నాడు.
“పెరిగి పెద్దదయింది. నేనున్నానని నమ్మటం మానేసింది,” అన్నాడు రఫాయెల్.
జిమ్మీ కళ్లు పెద్దవయ్యాయి. “అదెలా సాధ్యం? నిన్ను సృష్టించిందే ఆమె కదా!” అన్నాడు ఆశ్చర్యంగా.
రఫాయెల్ మెల్లిగా జిమ్మీవైపు తిరిగాడు. “అదంతే సోదరా. వాళ్లకి మన అవసరం లేని రోజొకటొస్తుంది. అందరికీ తప్పని రోజు. నీక్కూడా వస్తుందా రోజు, హెచ్చరిక లేకుండా,” అన్నాడు.
ఈ ఊహించని వార్త జిమ్మీని పిడుగులా తాకింది. అతను కాసేపు స్థబ్దుగా ఉండిపోయాడు. తేరుకున్నాక నోరుతెరిచాడు, “అలాంటి ఉనికి ఊహించలేకపోతున్నా! అదెంత పరమార్థరహితమైన పరిస్థితి!”
కొద్ది క్షణాల మౌనం తర్వాత మళ్లీ అన్నాడు జిమ్మీ, “నేనేం చెయ్యాలి … ఆ తర్వాత?”
“ప్రశ్న – నువ్వు ఏం చెయ్యాలనేది కాదు; ఏం చెయ్యకూడదనేది,” రఫాయెల్ బదులిచ్చాడు.
జిమ్మీ అర్ధం కానట్లు చూశాడు.
“తను నిన్ను మరచినా, నువ్వామెని విడువకు,” వివరించాడు రఫాయెల్. “తనకి మళ్లీ ఏదోనాడు నీతో అవసరం పడకపోదు. ఆ రోజు కోసం ఎదురు చూడు. అందాకా … ఆమె జీవితంలో అడుగడుగునా నీడగా తోడుండు. అదే నీ ఉనికి పరమార్ధం. అదే నువ్వు చెయ్యాల్సింది … ఆ తర్వాత.”
—————
వృద్ధురాలు భరిణ నుండి ఏదో బయటికి తీసి పరీక్షించి లోపల పెట్టేయబోతూ ఆగిపోయింది. దానికేసి కాసేపు దీక్షగా చూసింది. ఆమె నొసలు ముడిపడ్డాయి. శ్వాస భారమయింది. ఊహించని ఉద్వేగమేదో అలముకొంది. వణుకుతోన్న అరచేతిలో ఆ వస్తువునుంచుకుని పరికించి చూసింది.
ఆమె గుండెలోతుల్లో ఎక్కడో జ్ఞాపకమొకటి గుచ్చుకుంది. గుంటలు పడ్డ ఆమె కళ్లు గుండ్రంగా విచ్చుకున్నాయి. పెదాలు విడిపడి ఆమె ప్రమేయం లేకుండానే ‘ఓహ్’ అనే శబ్దం వెలువడింది.
ఆమె అరచేతిలో పవళించి నవ్వుతున్నట్లు చూస్తున్నాడు మిస్టర్ మూ!
తరాలనాటి ప్రమాణం తన మనసులో మారుమోగింది, “… నా వద్దే భద్రంగా దాస్తాలే.”
వృద్ధురాలు మిస్టర్ మూని రెండు చేతుల్లో భద్రంగా పొదివిపట్టుకుని కళ్లు మూసుకుంది.
—————
రఫాయెల్ జిమ్మీతో మాట్లాడటం అర్ధాంతరంగా ఆపేసి చటుక్కున ఇంటివైపు తల తిప్పాడు. అతని చూపు తూర్పుగది కిటికీ మీద వాలింది. అటు చూస్తూ అతను నిట్రాటలా నీలుక్కుపోయాడు. ఇదంతా చూస్తూ జిమ్మీ కలవరపడ్డాడు. చేత్తో రఫాయెల్‌ని కదిలించబోయాడు. అయితే ఆ అవసరం లేకుండానే రఫాయెల్ తేరుకున్నాడు. కలలో ఉన్నట్లు, తనతో తాను చెప్పుకుంటున్నట్లు, గొణిగాడు:
“నా పాపకి నా అవసరం వచ్చింది. వెళ్లాలి … వెంటనే వెళ్లాలి.”
మరుక్షణం రఫాయెల్ మాయమైపోయాడు.
పెరట్లో జిమ్మీ ఒక్కడే మిగిలాడు – నోరు తెరుచుకుని చూస్తూ.
—————
వృద్ధురాలు మిస్టర్ మూని గుండెకి హత్తుకుని మౌనంగా కూర్చుని ఉంది. మూతపడి ఉన్న ఆమె కనురెప్పల మాటునుండి నీళ్లు ధారగా కారిపోతున్నాయి.
సప్తస్వరాలు ఏకమైన నిశ్శబ్దం ఆవరించిన ఆ గదిలో పొగమంచు తెరొకటి రూపం పోసుకుంది. అది క్షణాల్లో రఫాయెల్ ఆకారం తీసుకుంది.
“ఆన్నీ,” అని పిలిచాడు రఫాయెల్ మంద్రంగా.
వృద్ధురాల్లో చలనం లేదు.
రఫాయెల్ ముందుకొంగి మళ్లీ పిలిచాడు, ఈ సారి ఆమె పూర్తిపేరుతో.
“ఆన్ మేరీ”
ఆమె మెల్లిగా కళ్లు తెరిచింది.
తెరిచి – అతడిని చూసింది … అరవయ్యేళ్ల తర్వాత మొదటిసారిగా.
అబ్బురం, సంబరం ఆ ముదుసలి ముఖంలో ముద్దుగా ముప్పిరిగొన్నాయి.
ఆన్నీ రెండు చేతులూ ముందుకి చాచి దోసిలితో మిస్టర్ మూని రఫాయెల్‌కి అందించింది.
Waiting for Short Movie Sir 👍