ఆనందం, ఆత్మీయత కలిస్తే “ఆహ్వానం” లక్ష్మి గారు!

హ్వానం పత్రిక మొదలైనప్పుడే ఆ పత్రిక కారణంగానే ఎస్. ఎస్. లక్ష్మిగారు ఆహ్వానం లక్ష్మిగారిగా మా జీవితాల్లోకి వచ్చారు. ఆమె జీవితంలోకీ, కుటుంబంలోకీ మమ్మల్ని చేయి పట్టుకొని నడిపించుకు వెళ్లారు.

పత్రికకు కావలసిన ప్రకటనల కోసం ఆమె ప్రతి నెలా హైదరబాద్ వచ్చేవారు. కుటుంబరావు, లక్ష్మీగారూ స్కూటర్ మీద ఎండా వానా లెక్కచేయక పదింటి నుంచి సాయంత్రం వరకూ తిరుగుతూనే వుండేవారు. వచ్చిన ప్రకటనలకంటే స్నేహాలు ఎక్కువ. మా ముగ్గురి మధ్యా స్నేహం ఎక్కువ. మునిపల్లె రాజుగారు, కె. సదాశివరావుగారు, జయప్రకాష్ నారాయణ గారు ఎందరో సహాయం చెయ్యాలని చూశారు. కానీ, మంచి పత్రిక ఆర్థికంగా నిలదొక్కుకోవడం కష్టమనే విషయం ఆమెకు క్రమంగా అర్థమైంది. అర్థమైనా ఆ పత్రికని ఎలాగోలా నిలబెట్టాలని  శక్తంతా ధారపోశారు.

రచయితలందరికీ ఆహ్వానం ఆత్మీయమైంది. వంక పెట్టడానికి వీలులేని పత్రిక. లక్ష్మిగారి వ్యక్తిత్వం ఏమిటో ఆహ్వానం పత్రిక చదివితే  తెలుస్తుంది. ఒక్క సంచిక చాలు. ఒక్క మంచి కథ సంచికలో ప్రచురించినప్పుడు ఆమె ఆనంద పారవశ్యం చూడాలి. అలాంటి ఆనంద క్షణాలను పంచుకునే అదృష్టం నాకూ, కుటుంబరావుకీ పుష్కలంగా దక్కింది. అల్లం రాజయ్య గారి “అతడు” కథ ప్రచురించి, “ఎంత గొప్ప కథండీ!” అంటూ వెలిగిపోతున్న ముఖంతో ఆపకుండా పదినిమిషాలు మాట్లాడి, నన్ను ఆలింగనం చేసుకున్న లక్ష్మిగారి స్పర్శ, ఆమె సంతోష తరంగాలు ఇంకా నన్ను ఆవరించే వున్నాయి. అలాంటి సంతోషం, ఒక మంచి కథనో, కవితనో, వ్యాసాన్నో కనుగొని, దానిని ప్రచురించటం వల్ల తన జన్మ సార్థకమైందన్నట్టు ఉప్పొంగే సాహిత్య పిపాసి గురించీ, తెలుగు సాహిత్య ప్రేమికురాలి గురించీ చాలా తక్కువే తెలుసేమో తెలుగు ప్రజలకు- తెలుసుకోవాల్సిన మనిషి ఆమె. తన గురించి తన ఆత్మీయులకు తప్ప మరెవరికీ తెలుపుకోవాలనే తహతహలేని మనిషి ఆమె. కానీ, తన వంటి ఆత్మీయులూ, అభిరుచులూ, ఆసక్తులు కలవారు కలిస్తే వారిని దగ్గిరకు తీసుకునే మనిషామే.

ఆహ్వానం పత్రిక ఆమెకు ఎంతో ఆనందాన్నీ, గర్వాన్నీ ఇచ్చింది. ఆ పత్రిక ఆగిపోయినప్పుడు కలిగిన విషాదాన్ని నిబ్బరంగా భరించిన గుండె దిటవు ఆమెది. ఆ పత్రిక ఇచ్చిన ఆనందపూరితమైన స్మృతులను నెమరు వేసుకుంటూ చిన్నపిల్లలా నవ్వుకోగల వివేకమామెది. ఆమె స్నేహం మా ఇద్దరి జీవితాల్లో ప్రత్యేకమైంది. అన్ని విషయాలూ పంచుకునేవాళ్లం. అన్నట్టూ, పత్రికలన్నీ ప్రచురించటానికి భయపడిన/ ప్రచురించటానికి ఇష్టపడని నా కథ “అయోని”ని అందిన వెంటనే ప్రచురించిన సాహసి. వివాదాస్పదమైన నా మరో కథ “భిన్న సందర్భాలు” కూడా ఆహ్వానంలోనే ప్రచురితమైంది.

మా స్నేహంలో ఎన్నో జ్నాపకాలు. చలంగారి గురించీ, సంజీవదేవ్, భుజంగరాయ శర్మ, బాలబంధు గారి గురించీ ఆమె మాటలతో పగళ్లూ రాత్రులూ కరిగిపోయేవి. ఇన్ని ఆనందాలకు దూరమై బతుకుతున్న మూర్ఖపు మనుషుల గురించిన జాలితో కరిగిపోయే దయగల మనిషామె. ఎంత సున్నిత మనస్కయో, ఎంత భావుకురాలో అంత చైతన్యం, తెగువా, సాహసం కూడా గల మనిషామె. సముద్రతీరంలో గడిపిన బాల్య స్మృతుల దగ్గిరకు మమ్మల్ని నడిపించుకు వెళ్ళేవరకూ ఆమె ఊరుకోలేదు. ఆ ఊరు, ఆ సముద్రం, ఆ ప్రాంతాలూ చూపించారు. మళ్ళీ బాల్యాన్ని అనుభవించారు మా కళ్ళముందు- తన ఇష్టాలన్నీ ఎంతో ఇష్టంగా పంచుకొని, వాటిని మనమూ అంతే ఇష్టంగా అనుభూతించేవరకూ శాంతించేవారు కాదు.

సంగీతమైనా, సాహిత్యమైనా రసభరితమైనవే ఆమెకి నచ్చేవి. చిత్రలేఖనమూ అంతే. ప్రపంచ ప్రసిద్ధ చిత్రకారులంతా ఆమె మునివేళ్ళ మీద ముద్దుగా కొలువుతీరేవారు. ఆమె కన్నులలోని ఆరాధనలో సేదదీరేవారు. సంగీత, సాహిత్య, చిత్రలేఖనాలే కాదు, రుచులను కూడా చాలా ఇష్టంగా ఆస్వాదించేవారు. చేపల పులుసుని వండడంలో ఆమెని మించింవారు కుటుంబరావుకి తెలియదు. వాళ్ళింటికి మేం వెళ్ళినా, మా ఇంటికి ఆమె వచ్చినా కుటుంబరావు కోసం చేపల పులుసు వండేవాళ్లు. ఆ విషయాలన్నీ వాళ్ళు మాట్లాడుకుంటే వుంటే నేను శ్రోతని. మామిడిపళ్లు, తాటి ముంజెలు, ఇలా చెప్పుకుంటూ పోతే ఆమె ఆహారాభిరుచులు కూడా ఎంత నాణ్యంగా వుంటాయో చెప్పలేం. ఆమె ప్రమాణానికి ఒక్క పిసరు తగ్గినా కూడా ముఖం చిట్లించేవారు.

మేం మరో ఇద్దరు స్నేహితులు ఛాయా, బీనాలతో కలిసి చేసిన కులూ మనాలి, కాశ్మీరు ప్రయాణాలు మరపురానివి. హిమాలయాలు మీ వల్ల చూడగలిగాను అని మనఃస్ఫూర్తిగా ఆనందించారు. గుర్రమెక్కి హిమాలయపు లోయలూ, కొండలూ నిర్భయంగా తిరిగిన ఆమెకి చిన్న ఆరోగ్య సమస్య అంతే అంతులేని భయం. ఆ భయమే ఆమెని తీసుకెళ్లిపోయింది.

మా మీద ఆమెకెంత నమ్మకమంటే, చిన్నబ్బాయి రాజా వివాహ బాధ్యత మాకు అప్పగించింది. మీరు సమర్ధంగా చేయగలరు అని తాను తెరవెనక సూత్రధారి అయింది. ఒకరికొకరం అయిన జీవన సందర్భాలు ఎన్నో ఇవాళ కళ్ల ముందు నిలిచి కన్నీళ్లు కార్పిస్తున్నాయి.

మొన్న ఫిబ్రవరిలో ఆమెని చూసినప్పుడు ఇంత అనారోగ్యం పాలయ్యారేమిటి అనిపించినా, తప్పకుండా రెండు మూడు నెలల్లో కోలుకుంటారనుకున్నాను. రెండు నెలల్లో శెలవు తీసుకుంటారనీ, ఆనంద శాంత సామ్రాజ్యానికి లక్ష్మిలా తరలివెళ్లిపోతారని అనుమానం కూడా రాలేదు.

అందరూ వెళ్ళేవారే. ఎలా జీవించారన్నదే ముఖ్యం. ఆమె ఉత్తమాభిరుచులతో, సజ్జన సాంగత్యంతో, తనకు ఇష్టమైన పనులు మాత్రమే చేస్తూ, ఎక్కువ వింటూ, తక్కువ మాట్లాడుతూ, సదా చిరునవ్వులతో అందంగా, ఆనందంగా జీవించింది. అంతకంటే కావాల్సిందేముంది?!

మిమ్మల్ని తలచుకొని నలుగురం కూచుని, నవ్వుతూ మాట్లాడుకుంటాం లక్ష్మీగారూ!

*

ఆహ్వానం ప్రారంభ సంచిక  చదవండి!

సౌజన్యం: బంగారు రామాచారి

ఓల్గా

7 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ఓల్గా, ఆహ్వానం పత్రిక ప్రారంభమైనప్పటినుంచి మీరు స్నేహపరిమళాలను, అందాలను అందరూ కలిసి అనుభవించారు. మీరు ఇక్కడ రాసిన ప్రతిఒక్క అక్షరం ఆమె నోటిద్వారా ఎన్నో సార్లు విన్నాను.ఆమెను రెండు మార్లె కలిసే భాగ్యం నాకు. మీ అందరి పరిచయం, కలిసే భాగ్యం ,అంతేనా సాహిత్యం , సంగీతం, చిత్లలేఖనం వీటి తలుపులు తెరిచింది. అనుభవించండి, ఆనందించండి అంటూ. Whatsapp group లొ ఎవరు ఏ మంచి విషయం పెట్టినా షేర్ చేసేవారు. ఆహ్వానం పత్రిక ద్వారా సాహితీ ప్రపంచంలొ చిరస్థాయిగా నిలిచిపోయారు. సృష్టి లొ తీయనిది స్నేహమేనంటూ స్నేహితుల మనస్సుల్లో స్నేహపరిమళాలను అందించి చిరంజీవి అయ్యారు!!! లక్ష్మి ఎప్పుడూ మీతో మా అనురాగంతో మేమూ ఉంటాం! మీరు భౌతికంగానే మాతోలేరు. మా మనస్సుల్లో ఎప్పుడూ ఉంటారు, ఉన్నారు.❤️❤️❤️🙏🙏🙏

  • నేను ఆహ్వానం క్రమం తప్పకుండా కొని చదివిన పాఠకుడి ని.
    మంచి పత్రిక. రచయితలకు ప్రోత్సాహం అందించిన లక్ష్మి గారికి నివాళి

  • ఓల్గా, ఆహ్వానం పత్రిక నుంచి స్నేహ సౌరభాలను,అందాలను అనుభూతి చెందారు. మీరు రాసిన ప్రతి విషయమూ ఆమె నాకు చెప్పారు. ఎప్పుడు చెప్తూఉండేవారు.నేనె చాలా ఆలశ్యంగా ఆ తోటలోకి వచ్చాను.అయినా ఎంతో చవిచూశాను. నేను మరువలేనివి.ఆమె భౌతికంగా లేరు.ఆమె అందరి మనసుల్లో ఆహ్వానం లక్ష్మి లాగా నిరంతరం చిరంతనం. !❤️❤️❤️🙏🙏🙏

  • ఓల్గా గారి నోట్ ద్వారా లక్ష్మి గారు మన మధ్యలేరన్న విషయం తెలిసి చింతిస్తున్నాను. అప్పట్లో దిల్లీలో నివసించే మాకు ఆహ్వానం గురించి తెలిసి వెంటనే చందా కట్టాము. మొదటినుండి చివరివరకు చదివాము. సైన్సు విషయాలపై వ్యాసాలు రెగ్యులర్ గా రాస్తానంటే వెంటనే ఓ‌కే చేశారు. అలా కొన్ని వ్యాసాల్ని మాసపత్రిక్కి రాసాను. నా కథ “తెలుగుకు సమాధి” కథ ఆహ్వానంలో (మార్చి 1995) వేసి ప్రోత్సహించారు. అన్ని మంచి పత్రికలు ఎన్నో అవస్థలకి లోనై చరిత్రలో కలిసిపోయినట్టుగా, ఆహ్వానం కూడా కనుమరుగైంది. లక్ష్మి గారు ఎంత బాధపడ్డారో ఓల్గా వ్యాసం ద్వారా తెలిసింది. ఒక్కసారైనా కలుసుకోనందుకు బాధగా ఉన్నా, ఆమె నడిపిన పత్రికలో నా రచనల్ని చూసుకొన్నందుకు కాస్త ఊరటగా ఉంది. ఆహ్వానంలో వచ్చిన మంచి కథల్ని మరోసారి చదివినపుడల్లా లక్ష్మి గారు తప్పక గుర్తుకొస్తారు. అలా ఆవిడ మన మధ్య జీవిస్తూనే ఉంటారు. టి. సంపత్ కుమార్, నిర్మల్ (తెలంగాణ)

  • మీ నివాళి లో లక్ష్మీ గారిని మళ్ళీ కళ్ళు ముందు నిలిపారు.

    • నేను కాకినాడలో ఉద్యోగం చేస్తున్న రోజుల్లో యస్.లక్ష్మి గారితో పరిచయం. ప్రముఖకవి, విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావుగారితో కలిసి లక్ష్మిగారి ఇంటికి తరచుగా వెళ్ళేవాళ్ళం. ఎన్నో సాహిత్య పరమైన విషయాలు చర్చించుకునేవాళ్ళం. రామారావుగారు, లక్ష్మిగారు ఆత్మీయంగా మాట్లాడేవాళ్ళు. వారం రోజుల కిందట లక్ష్మిగారు ఎందుకో గుర్తొచ్చారు. బహుషా ఈవార్త వినడానికేమో. చాలా ఏళ్ళయింది ఆమెను చూసి. చూద్దామన్నా, ఆహ్వానిద్దామన్నా ఇప్పుడు ఆమెలేరు, ఆమె జ్ఞాపకాలుతప్ప. ఆహ్వానం లక్ష్మిగారికి నా నివాళి.

  • చొక్కరతాతారావు,కవి,రచయిత-6301192215,విశాఖపట్నం. says:

    కాకినాడలో నేను ఉద్యోగం చేస్తున్న రోజుల్లో యస్.లక్ష్మిగారు సాహిత్యపరంగా పరిచయం. ప్రముఖకవి,విమర్శకులు అద్దేపల్లి రామమోహనరావుగారితో కలిసి వాళ్ళ ఇంటికి తరచుగా వెళ్ళేవాళ్ళం. రామారావు గారు,లక్ష్మిగారు ఆత్మీయంగా మాతో మాట్లాడేవారు. లక్ష్మిగారితో
    సాహిత్యపరమైన విషయాలు చర్చించుకునేవాళ్ళం. నాకవిత ‘ఆ కాసేపు నన్ను బతకనివ్వండి’ ఆహ్వానం పత్రికలో ప్రచురించారు. వారంరోజుల కిందట ఎందుకో లక్ష్మిగారు గుర్తొచ్చారు. బహుషా ఈవార్త వినడానికేమో. చాలా ఏళ్లయింది ఆమెను చూసి. చూద్దామన్నా ఆమె ఇప్పుడు లేరు, ఆమె జ్ఞాపకాలు తప్ప. లక్ష్మిగారికి నా నివాళి.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు