తెలంగాణలో తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చేదాకా రాజకీయం గ్రామాలకు చేరలేదు. ప్రజల చైతన్యం కూడా అంతంత మాత్రంగానే ఉండేది. తెలంగాణ సాయుధ రైతాంగ పోరాట (1946-51) ఫలితంగా వెట్టి చాకిరీ, దొరల అరాచకాలు కొంత తగ్గు ముఖం పట్టినా ‘బాంచెన్ కాల్మొక్కుత’ అనే పరిస్థితి, దొరల ఆధిపత్యం 1980ల వరకూ కొనసాగింది. నక్సలైట్ ఉద్యమం, రైతు కూలి ఉద్యమాలు గ్రామాల రూపు రేఖలను సమూలంగా మార్చి వేశాయి. దొరలను గ్రామాల నుండి తరిమి కొట్టి వాళ్ళ భూముల్లో ఎర్ర జెండాలు నాటిన సందర్భాలు కూడా లేక పోలేదు. అయితే ఇట్లా నక్సలైట్ల చేత తరిమికొట్టబడడమే ఆధిపత్య వర్గాలకు మేలు చేసింది. నగరాలకు చేరిన దొరలు వివిధ వ్యాపారాల్లోకి దిగి ఆర్థికంగా బలపడ్డారు. అదే సమయంలో గ్రామాల్లోని దళిత, బహుజనులు కొంత స్వేచ్చా స్వాతంత్ర్యాలను అనుభవించి చదువుకొని ప్రభుత్వ ఉద్యోగాల్లోకి ప్రవేశించారు. కానీ చింత చచ్చినా పులుపు చావనట్లు ఆధిపత్య వర్గాలు సామాజికంగా ఎదిగి వచ్చిన దళిత, బహుజనులను గుర్తించడానికి ఏ మాత్రం ఇష్టపడలేదు. ఈ నేపథ్యాన్నంతా కడుపులో పెట్టుకొని రాసిన ఒక మంచి చైతన్య పూరిత కథ ‘చెప్పులు
సమాజ పాదాలు కందకుండా శతాబ్దాలుగా దళితులు చెప్పులు కుడుతూ వచ్చారు. ముఖ్యంగా ఒకనాటి దొరలు, పటేలు, పట్వారీలకైతే చెప్పులు తయారు చేసి ఇంటికి తీసుకెళ్లి మరీ ఇచ్చేవారు. సైజులో ఏమైనా తేడాలు వచ్చినా ఇంటికి తీసుకొచ్చి రిపేరు చేసి మళ్ళీ తీసుకెళ్లి ఇచ్చేవారు. ఈ కథలో కూడా భూమయ్య చెప్పులు తయారు చేసి జీవించే దళితుడు. కానీ మారిన సామాజిక సందర్భంలో చెప్పులు కుట్టడం తగ్గించి ఊళ్లోనే చిన్న చెప్పుల దుకాణం పెట్టుకొని పట్నం నుండి చెప్పులు తీసుకొచ్చి అమ్మేవాడు. అయినా గ్రామంలోని దొరకు మాత్రం ఇప్పటికీ తానే చెప్పులు తయారు చేసి ఇచ్చేవాడు. అట్లా తయారు చేసిన చెప్పులను ఎనిమిదవ తరగతి చదువుతున్న తన కొడుకు పోశాలు చేత దొర ఇంటికి పంపించాడు.
“ఏంది నాయినా స్కూలుకు పొయ్యేటప్పుడు పని చెప్పుతవు. నువ్వు దుకాణమే పెడ్తివి. అవసరం ఉన్నవాళ్ళు దుకాణానికి వచ్చి తీసుకొని పోరా? మనమెందుకు వాళ్ళింటికి పొయ్యి ఇవ్వాలి” అని ప్రశ్నించాడు.
“నీకు తెలియదురా దొరల సంగతి. అన్నీ మనసుల పెట్టుకుంటరు. ఎక్కన్నో చూసి తొక్కుతరు. నా మాట విని ఇచ్చుకుంట పోరా! నువ్వియ్యకపోతే దుకాణం బంద్ చేసి నేనే ఇచ్చి వస్తాను.” అన్నాడు భూమయ్య.
దొరల మాట వినక పోతే ఏం జరుగుతుందో భూమయ్యకు తెలుసు. ఊళ్ళో జరిగిన సంగతులన్నీ కండ్ల ముందు తిరిగాయి.
పది సంవత్సరాలు గడిచి పోయాయి. ఊళ్ళోకి అన్నలొచ్చిండ్రు. దొర ఊరిడ్సిపెట్టిండు. తరువార దొర పరిస్థితి ఏమిటి? విద్యార్థిగా ఉన్న పోశాలు ఏమైండు? తెలియాలంటే మనం కూడా ‘చెప్పులు’ వేసుకొని కథలోకి నడిచి వెళ్ళాల్సిందే.
ఈ కథ నాలుగు దశాబ్దాల కిందటి తెలంగాణ గ్రామ పరిస్థితుల్లోకి తీసుకెళ్తుంది. ఆనాటి గ్రామ సామాజిక వారవరణాన్ని కళ్ళకు కడ్తుంది. దొరల ఆధిపత్యం, దళితుల దీన స్థితి మనల్ని కదిలిస్తాయి. పాముకు కూడా భయపడని దళితుడు దొరను చూసి ఎందుకు భయపడ్తున్నాడు. గ్రామాలను తమ చెప్పుచేతల్లో ఉంచుకోవడానికి దొరలు వేసే ఎత్తుగడలు, కుట్రలు, కుతంత్రాలు అన్నీ బోధపడుతాయి. దళిత, బహుజనులు ఎదగడానికి చదువు ఎలా నిచ్చెనలా ఉపయోగపడ్తుందో చెప్తూనే సామాజికంగా ఎంత ఎదిగినా వాళ్ళ పట్ల దొరల ట్రీట్మెంట్ ఏ మాత్రం మారదని నిరూపిస్తుందీ కథ.
ఒకప్పుడు ప్రభుత్వాధికారులు ఎవరు వచ్చినా దొర ఇంట్లోనే మఖాం. గ్రామ రాజకీయ చక్రం అంతా దొర ఇంట్లోనే తిరిగేది. పాము పడగలా ఉండే దొర గడి చూస్తే ఉచ్చ పడేది. క్రమంగా తెలంగాణ నేల మీద పురుడు పోసుకున్న పలు ఉద్యమాల వల్ల దళిత, బహుజనుల్లో కొద్దిగా మార్పును తీసుకొచ్చాయి. ఆ చైతన్యానికి ఉదాహరణ ఈ కథ.
సరళ శిల్పంలో సాగిపోయే ఈ కథలో ప్రధాన పాత్రలు మూడే. భూమయ్య (దళితుడు), అతని కొడుకు పోచయ్య (విద్యార్థి), ఊరి దొర రాంకిషన్ రావు. భూమయ్య తరతరాలుగా లొంగి ఉండే దళిత మనస్తత్వానికి, పోచయ్య రేపటి చైతన్యానికి, తరాలు మారినా వీడని ఆధిపత్యపు ధోరణికి దొర ప్రతీకలు. ఈ కథలోని మరో అసలు పాత్ర ‘చెప్పులు’. కథంతా చెప్పుల చుట్టే తిరుగుతుంది. కథ చెప్పులతోనే మొదలై చెప్పులతోనే ముగుస్తుంది కూడా.
కేవలం మూడు దృశ్యాలతోనే ముగిసి పోయే ఈ కథలో కనీసం నాలుగు దశాబ్దాల తెలంగాణ సామాజిక చరిత్ర దాగి ఉంది. కాలపు మడతల్లో భూమయ్య పాత్ర కనుమరుగైనా ఇప్పటికీ పోచయ్యలు, రాంకిషన్ రావులు చాలా మంది మన కళ్ల ముందు కదలాడుతారు. కేవలం నాలుగు పేజీల ఈ చిన్న కథలో రచయిత చెప్పిన విషయాల కన్నా, చెప్పని సంగతులే అనేకం ధ్వనిస్తాయి. డా. బి. ఆర్. అంబేద్కర్ దూర దృష్టి, రాజ్యాంగ ఫలాలు కింది కులాలకు అంది వచ్చిన తీరు చాలా ఉన్నతంగా చిత్రింపబడింది. సహజమైన సంభాషణ, వాతావరణ చిత్రణ మనల్ని గ్రామాల్లోకి తీసుకెళ్తాయి. తెలంగాణ కథా చరిత్రలో ఈ కథ ఒక మైలు రాయి.
ఈ ‘చెప్పుల’ను మన చేతికిచ్చింది సాహిత్య ప్రపంచంలో ‘జింబో’గా పిలువబడే మంగారి రాజేందర్. సిరిసిల్ల జిల్లా వేములవాడకు చెందిన జింబో ఉమ్మడి రాష్ట్రంలోని పలు జిల్లాల్లో సీనియర్ సివిల్ జడ్జిగా పనిచేశారు. ఆ సమయంలో ఎన్నో కీలక కేసులను పరిష్కరించారు. 2014-2018 మధ్య తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ (TPSC) సభ్యులుగా పని చేసి పదవీ విరమణ పొందారు.
1977 నుండే సాహితీ సృజన చేస్తున్న జింబో ఇప్పటి దాకా కొన్ని వందల కథలు, కవితలు, న్యాయ సంబంధ వ్యాసాలు రాశారు. రూల్ ఆఫ్ లా, జింబో కథలు, మా వేముల వాడ కథలు, ఓ చిన్న మాట, కథలకి ఆవల (అనువాద కథలు) అనే కథల పుస్తకాలను వెలువరించారు. మరికొన్ని కథా సంపుటాలు వెలువడాల్సి ఉంది. ‘హాజిర్ షా, రెండక్షరాలు, లోపలి వర్షం, చూస్తుండగానే.. వీరి కవితా సంపుటాలు. ఇవేగాక తెలుగులో న్యాయ పాలన, అందరి భాష అనే భాషా సంబంధ పుస్తకాలను కూడా వెలువరించారు.
వీరి సాహిత్య కృషికి ఎన్నో అవార్డులు పొందారు. యూట్యూబ్ ఛానల్ ద్వారా సుమారు 125 తన స్వీయ కథల్ని ఇప్పటి కంప్యూటర్ తరానికి వీలుగా చదివి వినిపించారు. ఓ రచయిత ఇలా ఇన్ని కథల్ని యూట్యూబ్ ఛానల్ లో చదివి వినిపించడం బహుశా ఇదే మొదటి సారి. ఈ కథ మొదటి సారిగా 20 జనవరి 1995లో ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ప్రచురింపబడింది.
*
“” చిన్నప్పుడు నేను కళ్ళారా చూసిన అనుభవాలు గుర్తు చేసిన ఈ కథ విశ్లేషణ చాలా బాగుంది. మీరు కూడా బహుషా ఇలాంటి దృశ్యాలు చూసుండవచ్చు. జింబో గారి సాహిత్యం నాకు పరిచయముంది. మీకు ధన్యవాదాలు….
90 వ దశకంలో విన్న చూసిన కొన్ని యదార్థ సంఘటనలు గుర్తుకొచ్చాయి మాస్టర్ మీ కథ వలన….చాలా బాగా గుర్తు చేస్తూ వర్ణించారు….
చాలా మంచి విశ్లేషణ సార్. మీకు అభినందనలు .
యండమూరి వీరేంద్రనాథ్ గారి…..రచన నాటిక… ” కుక్క ” గుర్తుకొచ్చిందండి … జంబో గారి కథ చెప్పులు ….సెంట్రల్ థీమ్ ….తెలంగాణా ఆరోజులలో పఠేల్సు, పట్వారీల, దొరల తీరులు….దళితుల జీవనవిథానలు …నీ బాంచెను…కాల్మోక్తా …అనేవారు…దొరల కనుసన్నల్లో మెలగాలి…వాళ్ళ ఆగడాలకు అతీ గతీ వుండేదికాదని వినికిడి, చదివాను చాలా కథలు, చూసా నాటికలు, నాటకాలు,..తిరుగుబాటురావడంతో దొరల తలరాత తిరగబడింది,,,ఇది సత్యం ఇదే అవసరం…మీ విశ్లేషణకూడా ఆకట్టుకుందిసార్ ! జంబోగారికథలు మళ్ళీ చదవాలనిపించిందిసార్ !జడ్జి గ చెసినవారు ఇంత నిశిత పరిశీలనతో తను ఓ వ్యక్తిగ సామాజిక స్పుృహతో , భాద్యతతో, ఔన్నత్యతో ఇటువంటి ఇతివృత్తంఎంచుకుని …తన ప్రవృత్తిని వేన్నోళ్ళ చెప్పుకోతగ్గట్టుగరాసారు..మీరు ఆ కథా విశ్లేషణను అంతే చక్కగరాసారండి.
చెప్పులు కథా విశ్లేషణ బాగుంది. కథా నేపథ్యం బాగా వివరించారు. మమ్మల్ని చెప్పులు వేసుకుని నడిపించారు.
The analysis of the short story CHEPPULU by Dr Veldandi Sridhar, brings in the social and political aspects of the Society in middle twentieth century in Telangana region.
The feudalistic social order,illteracy, poverty and privations were the hallmarks of our exploitative caste centric pecking order….is still seen in our society in subtle forms…. A sociological postmortem by Dr Veldandi Sridhar is excellent.
చెప్పులు కథా సమీక్ష అద్భుతం. కథలో ఆయువు పట్టుకొని చూపారు. రచయిత జింబో గారికి, కథా విమర్శకులు వెల్డండి గారికి అభినందనలు
ఇరవయ్యో శతాబ్ధం మధ్యలో తెలంగాణాలో నక్సలైట్ల చేత గ్రామాల నుండి తరిమికొట్టబడినా నగరాలకు చేరిన దొరలు వివిధ వ్యాపారాల్లోకి దిగి ఆర్థికంగా బలపడి, ఆధిపత్య వర్గాలుగా ఎదిగి వచ్చి సామాజికంగా, ఆర్ధికంగా, రాజకీయంగా వెనుకబడిన సమాజం లోని అట్టడుగువర్గాలైన దళిత, బహుజనులపై తమ ఫ్యూడల్ ఆధిపత్యాన్ని చెలాయించిన నేపధ్యంగా జింబో గారు ( జడ్జి మంగారి రాజేందర్ గారు ) రాసిన ” చెప్పులు ” కథను అద్భుతంగా విశ్లేషించి పరిచయం చేసిన డా. వెల్డండి శ్రీధర్ గారికి నెనర్లు.
నీ చెప్పులు కథ అందించిన వెల్దండి శ్రీధర్ సార్ కి ధన్యవాదాలు. ఈ కథలో నాలుగు తరాలకు సంబంధించిన అణచివేతలు, అన్యాయాలు, దొరల దాష్టీకాలను కళ్ళకు కట్టినట్లు రచయిత చూపెట్టాడు. దొరల కనుసన్నల్లో సామాన్యుల బతుకులు ఎంత చితికిపోయ్యావో, ఊరంతా పడగ నీడ కింద బ్రతికే మనుషుల గురించి చెప్పాడు. రచయిత ఒక జడ్జి (కొన్నిసార్లు తీర్పు ఇచ్చే సందర్భాల్లో దొరలు చేసేవి దుర్మార్గాలు అని తెలిసినా రాజ మార్గం ద్వారా వారికి అనువుగా తీర్పులు రావడం చూసి చలించిపోయాడేమో అనిపిస్తుంది. దొరలది న్యాయం కాదని తెలిసినా సామాన్యుని నోటి నుండే అన్యాయం అయిపోతున్న బ్రతుకులను చూసి తన జీవిత వాస్తవ సంఘటనల నుంచి ఈ కథను రాసి ఉంటాడు. చివరికి కథలో అక్షరం ఆయుధమై సామాన్యుని పాలిట కిరీటమై గెలిపించిందని రచయిత తన ఉద్దేశాన్ని వెల్లడించాడు. రచయిత అక్షరం చేసిన మార్పు నిశితంగా గమనించి ఉంటాడు. నేటికి కూడా కొన్ని గ్రామాలలో దొరల దొడ్లకే బానిసలై బ్రతుకుతున్నా కుటుంబాలు లేకపోలేదు. అక్షరం ఆయుధమై వారి సంకెళ్లను తెంచే రోజులు వస్తాయి. ఇంతటి మంచి కథలు రాసిన రాజేందర్ సార్ గారికి, మాకు అందించిన శ్రీధర్ సార్ కి కృతజ్ఞతలు.