ఆధిపత్యాన్ని ధిక్కరించే ‘వెలి’

తెలంగాణలోని దొరల దోతులు తడిసే కథ ఇది. తెలంగాణ నేలలోనే ధిక్కారం, మొండితనం, ప్రశ్నించేతత్వం ఉన్నాయని చాటి చెప్పే కథ.

తెలుగు సాహిత్యంలోనే అత్యధిక కథలు (1250) రాశారు డా. కాలువ మల్లయ్య. తొలినాళ్ళ నుంచి బడుగు, బలహీన, తాడిత, పీడిత వర్గాలవైపు నిలబడి ఒక దళిత దృక్పథంతో, బహుజన దృక్పథంతో కథలు రాస్తున్న విలక్షణ కథకులు కాలువ మల్లయ్య. స్త్రీల జీవితాలపైనా చాలా బలమైన కథలు రాశారు. కథలతో పాటు అనేక నవలలు కూడా రాశారు. ‘భూమి పుత్రులు’, ‘బతుకు పుస్తకం’, ‘ఊరంటే’, ‘సాంబయ్య చదువు’, ‘మాట్లాడే బొమ్మలు’, ‘దుఃఖం’, ‘నీ బాంచెన్ కాల్మొక్త’, ‘అస్పృశ్య కోయిల’ వంటివి కొన్ని మాత్రమే. ‘యుద్ధభూమి’, ‘ఆంబోతు’, ‘ఈ భూమి నాది’, ‘దొరగారి గడి’ లాంటి కథలెన్నో కాలువ మల్లయ్య పేరు చెప్పగానే గుర్తుకొస్తాయి. ఏ రచయిత రాయనన్ని సామాజిక కోణాల్లో కాలువ మల్లయ్య కథలు కనిపిస్తాయి. గ్రామీణ ప్రాంతాల్లో అమాయక ప్రజలపై ఆధిపత్యాన్ని చలాయిస్తున్న వర్గాలపై దుడ్డుకర్ర లాంటి గొప్ప తిరుగుబాటు కథ ‘వెలి’. ఈ కథ మొదట 1983 జనవరిలో సృజన మాస పత్రికలో ప్రచురింపబడింది.

అదొక మారుమూల పల్లెటూరు. అక్కడి ప్రజల అమాయకత్వాన్ని ఆసరాగా తీసుకొని కొన్ని ఆధిపత్య వర్గాలు వాళ్ళ మీద అధికారం చలాయిస్తుంటాయి. ఓ రోజు ‘అంబటాల్ల’కు ఆ ఊరి సర్పంచ్ భూంరావు దొర ఒక గద్దె మీద కూర్చొని ఉన్నాడు. అతనికి ఒక పక్క పోలీస్ పటేలు, మరో పక్క పట్వారీతో పాటు మరికొంత మంది ఊరి పెద్ద మనుషులు కూడా కూర్చొని ఉన్నారు. గద్దె కింద కొంత మంది తెనుగోళ్లు కూర్చొని ఉన్నారు. అక్కడే తెనుగోళ్ల కుల పెద్ద కూడా దొంగ చూపులు చూస్తూ కూర్చున్నాడు. అక్కడే ఉన్న వేప చెట్టును పట్టుకొని అదే ఊరికి చెందిన, అదే కులానికి చెందిన నర్సయ్య విచారంగా నిల్చున్నాడు. నర్సయ్య కూతురు మల్లవ్వ కూడా తన ఆరేళ్ళ కొడుకుని పట్టుకొని కిందికి ముఖం వేసుకొని కూర్చొని ఉన్నది. అదే ఊరికి చెందిన రాజయ్య అనే యువకుడు కూడా నిర్లక్షంగా కొంత మంది తన స్నేహితులని వేసుకొని కూర్చున్నాడు. రాజయ్య ముఖంలో దేన్నైనా ఎదుర్కోగలననే ధీమా ఉంది. అసలు పంచాయితీ ఏమిటంటే నర్సయ్య కూతురు మల్లవ్వ రాజయ్య అనే యువకునితో ప్రేమగా ఉండి ‘కాలుజారి’ పెళ్ళికి ముందే కడుపు తెచ్చుకుంది. “అయ్యా! కలీగం (కలియుగం) మునిగిపొమ్మంటే మునిగిపోదా యిగ. ముండబొడ్లు కడుపులు జేసుకుంటే ఆనలు గొట్టుమంటే ఎట్లగొడుతయ్. దొర గిదీనికి పెద్ద శిచ్చే ఎయ్యాలే. లేక పోతే అన్నాలమైపోతది అన్నడు కుల పెద్ద. అయినా నర్సయ్య జవాబు చెప్పలేదు. ఏం జవాబు చెప్పన్నా అని గుణాయించుకుంటున్నడు. తర్వాత పట్వారి, ఊరి దొర కుచ్చి కుచ్చి అడిగినా నర్సయ్య ఏం సమాధానం చెప్పలేదు.

“నువ్వేం జెప్పకుంటే మేం జెప్పిందానికొప్పుకుంటావురా? మల్ల మాట్లాడద్దు మరి” అన్నడు పట్వారి.

అప్పుడు నర్సయ్య లేచి “గట్లెట్లయిద్ది బాంచెన్! కాని గిండ్ల ఏం తప్పుందో నాకయితే తెల్తలేదు” అన్నడు.

నర్సయ్య అన్న మాటలు వినగానే దొరతో పాటు, అక్కడున్న పెద్ద మనుషులు “సెప్పుతోని కొట్టనుండే గాడిది కొడుకును” అని కోపానికి వచ్చిండ్రు. ఒక పెద్ద మనిషి మాత్రం “నిజమే దొర మల్లిని రాజిగానికి మారుమానం ఇత్తనన్నదేనాయే. నర్సిగానికెల్లక లగ్గం సేయలేదు. ఇంతల్నే పోరాగాండ్లు ‘కాల్జారిండ్లు’. ఆళ్ళకాళ్ళకు అంటగడ్తే అయిపాయే” అన్నడు. ఇది నిజమో కాదో కావాల్నంటే రాజిగాన్ని అడుగుండ్రి అని నర్సయ్య అన్నా పట్టించుకోలేదు. ఎట్లాగైనా నర్సిగాని దగ్గర దండుగ తీయాలని దొర ఆలోచిస్తున్నాడు. పైగా కావురం మాటలారా అని నర్సిగాన్నే తిట్టిండు. అక్కడే ఉన్న రాజయ్యకు ఆవేశం కట్టలు తెంచుకుంటుంది. కానీ స్నేహితులు ఆపుతున్నారు.

చివరికి నర్సయ్య “కాద్దొర నాకు తెల్వక అడుగుత మేమ్మేం గంగలవడిసత్తం. మేమ్మీకు పిరాజ్జెయ్యలేదు గదా. ఎందుకు బాంచెన్ మమ్ముల కాల్చుకతింటరు. మా సందాన మమ్ముల బతుకనియ్యరు. కడుపయ్యింది నా బిడ్డకు, కడుపుజేసినోనికి పెండ్లామే లేదాయే. అల్లిద్దరికి లగ్గం నిచ్చయమే ఆయే. ఇంక గీళ్ళందరు, గీ పంచాతులన్నెందుకో సముజైతలేదు” అన్నడు కోపంగా. ఇది విని పట్వారి, పోలీసు పటేలు, ఇంకొంత మంది పెద్ద మనుషులు నర్సిగాన్ని తలో మాట అన్నరు. రాజిగానికి ఆవేశం ఆగలేదు. మేం తప్పుజేసుకుంటే మేమ్మేం సూసుకుంటం నడుమ మీకేందుకని అడిగిండు. ఈ మాటల్తోని అందరూ ఖంగు తిన్నరు.

అందరి మాటలు విని దొర “నర్సిగా ఇసోంటియి ఇడిసిపెడితే కట్టు లేకుంట పోతది. నిన్ను కులం నుంచి వేలేస్తున్నం. నీ ఇంటికి సాకలోడు, మంగలోడు బందు. కులపోల్లుగూడ రారు. అచ్చినోనికి ఇన్నూరు రూపాయల దండుగ” అన్నడు. ఈ తీర్పు అక్కడున్న దొర తాబేదార్లకు తప్ప ఏవరికీ నచ్చలేదు. రాజయ్య కళ్ళు చింత నిప్పులయ్యాయి. నర్సిగాడు అక్కడున్న పెద్దమనుషులందరి కాళ్ళు మొక్కిండు. దొర కనికరించి సరే పోరా! వెయ్యి రూపాయలు దండుగ కట్టి కులంలకు రా! తర్వాత మల్లిని రాజిగానికి ఇచ్చి పెండ్లి చెయ్యి అని చివరి తీర్పు ఇచ్చిండు. ఇది విన్న రాజయ్యకు ఆవేశం ఆగలేదు. “ఎందుకు దొర దండుగ్గట్టాలే. ఐదు నూర్లు పెద్ద మనుషులకు, ఐదు నూర్లు కుల పోల్లు కల్లుదాగుతే పోయిన కులమెట్లత్తది? కల్లుతోని అచ్చే కులం పోతేందుంటెంది? ఏం తప్పు జేసినమని ఎయ్యి రూపాయలియ్యాలె? ఎవడో నీ బాంచెగాడు మాకు తెల్వకుంట పిరాజ్జేత్తే మాకేంది? ఆన్నే కట్టుమను దండుగ. మేమేం తప్పుజేయలేదు” అన్నడు ఆవేశంగా. ప్రజల్లో కలకలం బయలుదేరింది. రాజిగాడు చెప్పింది నిజమే. ఏం తప్పు సేయనపుడు దండుగెందుకు గట్టాలె. అది ఆడు పెండ్లిజేసుకుంటనన్నంక నడుమ గీ దొరేంది?” అనుకున్నరు. పెద్ద మనుషుల ముఖాల్లో రక్తం లేదు. ఇదే తప్పు మీ బిడ్డలు చేస్తే తప్పు గాదు. మేం జేస్తే తప్పా? అని నిలదీసిండు రాజిగాడు. “మీ కులాలు మీ దగ్గర్నే ఉంచుకోండ్రి. రెక్కల కట్టం మీద బతికే మాకు ఏ కులమైతే ఏంది? ఏ ఊరైతెంది? ఏ కులంలున్నా, ఏ ఊళ్ళున్నా, ఏ పట్నంలున్నా మేం రెక్కలనమ్ముకునే బతుకాలె. గట్లాంటప్పుడు నీకు దండుగ్గట్టి కులంలకు అచ్చుడెందుకు? ఈ ఊరు గాకుంటే ఇంకో ఊరు. ఎక్కడున్నా మా కట్టం మాదే. ఐనా ఇక్కన్నే, ఈ ఊళ్ళెనే తలకాయెగిరేసుకుంట బతుకుత. ఎవ్వలడ్డమత్తరో, ఎవ్వలెలేత్తరో సూత్త” అని నర్సయ్య దిక్కు తిరిగి రా మామా! అణిగిమణిగి ఉన్నా కొద్దీ గిట్లనే సవారిజేత్తరు” అనుకుంట మల్లిని చెయ్యి పట్టుకొని తీసుకు పోయిండు.

తెలంగాణలోని దొరల దోతులు తడిసే కథ ఇది. తెలంగాణ నేలలోనే ధిక్కారం, మొండితనం, ప్రశ్నించేతత్వం ఉన్నాయని చాటి చెప్పే కథ. రచయిత డా. కాలువ మల్లయ్య బహుశా ఏదైనా వాస్తవ సంఘటన ఆధారంగా ఈ కథ రాసి ఉండవచ్చు. 1980ల దాకా తెలంగాణలో ప్రజల నిరక్షరాస్యతను, పేదరికాన్ని, అమాయకత్వాన్ని ఆసరాగా చేసుకొని ఆదిపత్య కులాలు అధికారాన్ని చలాయించాయి. సమాంతర పోలీస్ స్టేషన్లను, సమాంతర ప్రభుత్వాలను నడిపించాయి. నిమ్న వర్గాల ప్రజలు, బహుజనులు చిన్న తప్పు చేసినా పెద్ద శిక్షలు వేసి దండుగలు వేయడం చాలా సాధారణ విషయం. ఇంకా అమానుషంగా కులంలో నుంచి వెలి వేసి తమ శాడిజాన్ని చాటు కోవడం కూడా సాధారణ విషయమే. అయితే కొంత చదువుకున్న, చైతన్యం ఉన్న కొత్త తరం యువకులు వచ్చి దొరలకు ఎదురు నిలిచే సరికి దొరలు తోక ముడిచి అక్కడి నుంచి జారుకోవడమో, లేదా ఎదురు తిరిగిన యువకుల మీద చాటు మాటుగా దెబ్బ తీయడమో చేసేవారు. ఇట్లా కొన్ని తరాలు నలిగి పోయాయి. తెలుగు దేశం ప్రభుత్వం అధికారం లోకి వచ్చి రాజాకీయ చైతన్యం కాస్త కాస్త పల్లెలకు పాకడం మొదలయ్యాక పరిస్థితిలో కాస్త మార్పు కనిపించడం మొదలైంది.

కథలో కాలువ మల్లయ్య వాడిన భాష తెలంగాణ ఆత్మను పట్టి చూపుతుంది. చాలా సహజ సిద్ధమైన గ్రామీణుల భాషను ఉపయోగించడం వల్ల మల్లయ్య భాషా పరిశీలనా శక్తి బయట పడుతుంది. సంభాషణలను రాయడంలో, వాతావరణాన్ని సృష్టించడంలో, కథను నడిపించడంలో చూపిన నేర్పు రచయిత పరిణతిని చూపెడుతుంది. కథంతా సర్వసాక్షి కథనంలో సాగి, శిల్ప పరంగా పెద్దగా ప్రయౌగాలు ఏమీ కనిపించవు కానీ పాఠకుడు కథలో పూర్తిగా లీనమౌతాడు. ఆయా పాత్రల్లో పాఠకుడిని ప్రవేశపెట్టి రచయిత మిన్నకుంటాడు. ఎంత సాంకేతిక యుగంలో బతుకుతున్నామని అనుకుంటున్నా ఇంకా కొన్ని పల్లెల్లో అక్కడక్కడ ఆధిపత్య కులాలు కింది కులాల వారిని లేదా ఆ కులం వారే ఏదో కుటుంబాన్ని వెలి వేశారని పత్రికల్లో చదువుతుంటే “ఏమి మారెను ఏమి మారెనురా..” అనే గోరేటి వెంకన్న పాట గుర్తుకు రాక మానదు. ఈ కథ ఒకప్పటి తెలంగాణ వాస్తవ పరిస్థితికి, గ్రామీణుల ధైన్యానికి అద్దం పట్టిన కథ. ఏ ఆధిపత్య పీడన నుండి, దౌర్జన్యాల నుండి తెలంగాణ ఎదిగి వచ్చిందో ఇప్పటి తరం తెలుసుకోవాల్సిన కథ. గ్రామీణులంతా ఎవని నాలుగు మెతుకులు వాడు తినడానికి మనం ఏం చేయాలో కూడా ఒక కర్తవ్యాన్ని బోధించే కథ.

         *

 

 

 

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

2 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Any how the history is cyclic … the people of TELANGANA suffered inhumanly under Mullahic Islamic in the form of brutal conversions, and under the Feudal elements of the lowest rung of the Hindu caste society..ie Velamas and Reddys who are the hunnish Shoedross..in 80s , with the Advent of Telugu Desham establishment.. the lower Shoedross were emancipated from the fellow brutal Shoedross… but the intellectual?????? TELANGANA society sought to get back to it’s Rich???? Heritage of Feudal cum gadi ethos back under the Mullahic Islam and Velamas…. and the result is perfect blend between MIM and TRS to resurrect Islamic and Gadi days back with a bang… what’s the relevance and significance of Progressive writers and writings….??

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు