ఆదివాసీ జీవితాలపై ‘అడవిలో వెన్నెల’

సామాజిక తత్త్వవేత్త, తెలంగాణా రాష్ట్ర తొలి బి. సి. కమీషన్ ఛైర్మన్ గా ఇటీవలనే పదవీ విరమణ పొందిన బి. ఎస్. రాములు (బేతి శ్రీరాములు) శతాధిక గ్రంథ కర్త. కళాశాల విద్యార్థి దశ నుండే పలు ఉద్యమాల్లో క్రియాశీలకంగా పాల్గొన్నారు. 1985లో పెరిగిన నిర్బంధం వల్ల కొన్ని ఏండ్లు రహస్య జీవితం గడిపారు. ఇప్పటి దాకా 175కు పైగా కథలు రాశారు. పాలు, చదువు, స్మృతి, మమతలూ- మానవ సంబంధాలు, వేపచెట్టు, తేనెటీగలు, బతుకు పయనం వంటి కథల సంపుటాలు వెలువరించారు. ఆరు నవలలు, కొన్ని వందల సిద్ధాంత వ్యాసాలు, సాహిత్య వ్యాసాలు, తెలంగాణా వ్యాసాలు రాశారు. బతుకు పోరు వంటి నవలలు ఆయనకి బాగా పేరుతెచ్చాయి. జ్ఞానం పుట్టుక, బీసీలు ఏంచేయాలి, నేనెవరు, గతితర్కతత్వ దర్శన భూమిక, బహుజన తత్వం, ప్రేమంటే ఏమిటి?, భౌతిక వాద ప్రాపంచిక దృక్పథం, బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థి యువజనులారా! వంటి తాత్విక గ్రంథాలు, భారతీయ సమాజం నేటి రాజాకీయ పరిణామాలు, రాజ్యం-ప్రజలు, సామాజిక న్యాయం అంటే ఏమిటి, బీసీలు సాధికారికత వంటి రాజకీయ సామాజిక గ్రంథాలు, కన్యాశుల్కాన్ని ఎలాచూడాలి, సాహిత్య చరిత్రను కొత్తచూపుతో ఎలా తిరగరాయాలి? పాట పుట్టుక, దళిత సాహిత్య చరిత్రను ఎలా అధ్యయనం చేయాలి, సాహిత్యంలో సమాజ అన్వేషణ, అంబేడ్కరిజం సోషలిజం వంటి గ్రంథాలెన్నో రాశారు. సమగ్ర సామాజిక కథ, కథలబడి – కథా సాహిత్య అలంకార శాస్త్రం, కథా రచన పాఠాలు, తెలంగాణ కథకులు కథన రీతులు వంటి రచనలు కథ లక్షణ శాస్త్ర పుస్తకాలు రాశారు.

ప్రత్యేక తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొని ఉద్యమ భావజాల వ్యాప్తికి సుమారు ఇరవై పుస్తకాలు వరకు ప్రచురించారు. 1992లో వ్యవస్థాపక అధ్యక్షులుగా ఆంధ్రప్రదేశ్ దళిత రచయితల కళాకారుల మేధావుల ఐక్య వేదిక స్థాపించారు. 1990లో విశాల సాహిత్య అకాడమీని ప్రారంభించి పుస్తక ప్రచురణ, సాహిత్య సభల, కథా రచన శిక్షణా శిబిరాల నిర్వహణ చేస్తూ యువ రచయితలకు పురస్కారాలను అందిస్తూ ప్రోత్సహిస్తున్నారు. వీరి సాహిత్యంపై పలు విశ్వవిద్యాలయాల్లో పరిశోధనలు జరిగాయి. ఇంకా జరుగుతున్నాయి. వీరి రచనలకు పలు అవార్డులు లభించాయి. తెలంగాణ సామాజిక పరిణామంలోని అన్ని మలుపులను కథలుగా మలుస్తున్న బి. ఎస్. రాములు కలం నుండి జాలు వారిన ఇప్ప పూవు వంటి గిరిజన కథఅడవిలో వెన్నెల. ఈ కథ మొదట 1984 అక్టోబర్ లో అరుణతార మాస పత్రికలో లో ప్రచురింపబడింది. ఈ కథకు 1984లోనే కొ.కు. స్మారక కథా పురస్కారం లభించింది.

మైదాన ప్రాంత ప్రజలు అడవి మీద ఆదివాసీల మీద కన్నేసి అక్కడి వనరులను, గిరిజనుల శ్రమను దోచుకోవడం స్వాతంత్ర్యం కన్న ముందు నుండే ప్రారంభమైంది. నిజాం ప్రభువులాంటి వారు హైమండార్ఫ్ వంటి గిరిజన జీవితాల మీద పరిశోధన చేసిన పరిశోధకుల సిఫారసుల మేరకు కొన్ని చట్టాలు, కొన్ని పథకాలు అమలు పరిచినా అవి మారుమూల గిరిజన గూడేల దాకా చేరడంలో విఫలమవడంతో చెలరేగిన గిరిజనుల అసంతృప్తి శాంతి భద్రతల సమస్యగా పరిణమించింది. కాగితాల మీద గణాంకాల్లో కనిపించిన అభివృద్ధి వాస్తవ జీవితాల్లో కనిపించకపోవడం దశాబ్దాలుగా చూస్తూనే ఉన్నాం. గిరిజనుల అమాయకత్వం, నిరక్షరాస్యత, పేదరికం, నాగరిక ప్రపంచానికి దూరంగా ఉండడం, వైద్య సదుపాయాలు లేకపోవడం ఇలా ఎన్నో సమస్యలతో నిత్యం చీకటి కూపంలో జీవించే ఆదివాసీల బతుకుల మీద తెలంగాణ నుండి చాలా తక్కువ కథలే వచ్చాయి. వీటిలో బి. ఎస్. రాములు రాసిన ‘అడవిలో వెన్నెల’ కథ మణిపూసలాంటిది.

ఆదివాసీల జీవితాన్ని, పోరాటాన్ని జమిలీగా చిత్రించిన ఈ కథలో కథానాయకుడు యిస్రూ. యిస్రూ జీవితం చుట్టే అనేక సమస్యలు నిత్యం ఆరిపోని నెగడులా మండుతాయి. తన చిన్నప్పుడు ఓసారి మేకల్ని అడవిలో వదిలేసి చేపలు పడుతూ కూర్చున్నాడు. అవి ఎటు పోయింది చూసుకోలేదు. ఇంతలో ఫారెస్ట్ అధికార్లు మందకు మంద కొట్టుకుపోయి కట్టేసుకున్నారు. “తన తండ్రి పోయి కాళ్ళు మొక్కినా వదల లేదు. చివరికి నాలుగు ప్రాణం పెట్టిన మేకల్ని దండుగ కింద లాక్కొని మిగతా వాటిని దయతో వదిలిపెట్టారు.” అప్పటి నుంచి యిస్రూ జీవితంలో ఫారెస్టు అధికారుల దోపిడి ఒక భాగం అయిపోయింది. దీన్ని ఎలా ఎదిరించాలో యిస్రూకు అంతు పట్టేది కాదు. పెరిగి పెద్దై పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని కన్నాక భార్య పుండుతో చనిపోయింది. అసలే చలి కాలం. అప్పుడే కాలుకు పుండు అయింది. మూల్గే నక్క మీద తాటి పండు పడ్డట్టు అప్పుడే ‘నెలసరి’ రావడంతో ప్రత్యేక పాకలో నీల్గి నీల్గి ఆ నొప్పితోనే చనిపోయింది. ఓసారి చేపలు పట్టుకొని పాకకు చేరే సరికి పాకంతా చిందరవందరగా ఉంది. కొడుకు ఏసును ఫారెస్ట్ అధికార్లు బాగా కొట్టి గుంజకు కట్టేశారు. అంబలి కుండను తన్ని దాచుకున్న సారాయినంతా తాగి కూర్చున్నారు. రిజర్వు ఫారెస్ట్ లో మేకలు మేసినందుకు వాటిని జప్తు చేసినట్టు చెప్తారు. ప్రతి యేటా మామూళ్లు ఇస్తున్నా ఇదేమిటని ఆశ్చర్యపడుతాడు ఇస్రూ. ఫారెస్ట్ ఆఫీసర్ మారినప్పుడల్లా ఇదే తంతు. మోకాళ్ళ మీద నిలబడి బతిమిలాడినా వాళ్ళు కనికరించరు. “నాన్నా వీళ్ళు మనల్నెందుకు కొడుతున్నారు? ఏం తప్పు చేశామని” అడుగుతాడు ఏసు. పోతూ పోతూ యాభై రూపాయల జరిమానా వేస్తారు.

రెండు రోజుల్లో కట్టక పోతే జొన్న చేను కూడా దక్కదని చెప్పి పోతారు. యాభై రూపాయల జరిమానా ఎలా కట్టాలో తెలియక బిత్తర పోతాడు యిస్రూ. “రేపటి నుండి కంక బొంగు కొట్టండి. ఈ జూర్మాన అందులో కోసుకుంటాం” అంటారు. పేపర్ మిల్లు నడవడానికి కంక బొంగు సరఫరా కావాల్సిందే. అట్లా అడవిని నరికి వ్యవసాయ యోగ్యం చేసికొన్న భూముల్ని పైసా ఖర్చు లేకుండా గొండుల్నుంచి ఆక్రమిస్తారు ఫారెస్ట్ అధికారులు. అక్కడ కలప బొంగు ప్లాంటేషన్లు ప్రారంభిస్తుంది ప్రభుత్వం. అలా పోడు వ్యవసాయం తరిగిపోయి ఎప్పటి కప్పుడు నిరాశ్రయులైన గోండులు స్థిర వ్యవసాయం చేసుకోవడానికి నెట్టివేయబడ్డారు. అలా అడవి నరికి వ్యవసాయం మొదలు పెట్టి రెండు మూడేళ్లు దున్ని రాళ్ళేరి పంట తీస్తూ మంచి భూమిగా తయారు చేసే సరికి ఫారెస్ట్ అధికారులో, దొరలో ఆ భూమి తమదని వస్తారు. వారిని యధాపూర్వ స్థితికి నెట్టి వేస్తుంటారు.”

ఈ పుల్లర కట్టకుండా ఉండడానికి నెగడు చుట్టూ కూర్చొని ఎన్నో సార్లు సమావేశాలు పెట్టుకుంటారు. కానీ వాళ్ళకు ఏ మార్గమూ కనిపించదు. దసరాకు అహిరి మహారాజ్ కు మంచి మేకను కానుకగా ఇస్తాడు యిస్రూ. అహిరి మహారాజ్ ఎప్పటి లాగే ఫారెస్ట్ అధికారుల పీడ వదిలిస్తానని, మళ్ళీ తననే ఎన్నికల్లో గెలిపించాలని ఉపన్యాసం ఇస్తాడు. ఇది యిస్రూని ఏ మాత్రం సంతృప్తి పర్చదు. మహారాజ్ ఏటా లడాయి చేస్తున్నా అనే అంటున్నాడు. తమ బతుకులు మాత్రం అలాగే ఉన్నాయి.” అని బాధ పడుతాడు. లకింబాయితో కొడుకు ఏసుకు పెళ్లి చేసి నాలుగు మొద్దులు కొట్టి కొత్త పాక వేసినందుకు అక్రమంగా కలప కొట్టారని ఫారెస్ట్ అధికార్లు కేసు పెడతామంటారు. చివరికి కుర్దు (గ్రామ పెద్ద) తలా బస్తా చొప్పున జొన్నలిప్పిస్తానని కేసు లేకుండా చేస్తాడు. “దొర బస్తా, దసరా పండుక్కోసం తీసుకున్న ముతక ధోతుల జత కింద బస్తా జొన్నలు కొలుచుకున్నాడు షావుకారు. విందు సందర్భంగా ఇచ్చిన నూనె, ఉప్పు చిల్లర కొసం మరో బస్తా కొలిచాడు. ఇంకా రెండు బస్తాల జొన్నలు మాత్రమే మిగిలాయి. ఇందులోంచే విత్తనాలకి కొన్ని ఉంచుకోవాలి. మిగిలినవి మళ్ళీ పంట చేతికొచ్చేదాకా ఏ మూలకి సరిపోవు. ఇట్లా పండిన పంటను తలా ఇంత దోచుకుపోవడంతో ఏడ్వడానికి కూడా కళ్ళలో తడి లేదు ఇస్రూకు.

ఆదివాసీల జీవితం ఇంత దుర్భరంగా సాగిపోతుంటుంది. ప్రభుత్వాలు చాలా సంక్షేమ పథకాలు ప్రవేశపెడుతున్నా అవి వాళ్ళ గడప దాకా పోవు. “కంట్రోల్ సరుకులు వగైరా దొరలు, షావుకార్లు, సర్పంచులు పైపైనే కాజేస్తారు. గ్రామాల దాకా చేరవు.” అందుకే వాళ్ళకు తెల్ల బట్టల వాళ్ళంటే భయం. ఇంత చీకటి బతుకుల్లోకి అన్నలు తుపాకి అనే టార్చి లైట్ పట్టుకొని వచ్చారు. ఏసు, మోతి, లకింబాయి తుపాకీని ఎగాదిగా చూస్తారు. దీనితోని అడవి జంతువులనే కాదు మనుషులను కూడా చంపవచ్చని తెలుసుకొని ఆశ్చర్యపోతారు. వాళ్ళకు తమ చీకటి జీవితాలకు ఏదో ‘కొత్త దారి’ దొరికినట్లు తోస్తుంది.

కథ వెన్నెలలాగా సుతిమెత్తగా ప్రారంభమై చివరికొచ్చేసరికి ఎరుపు రంగు పులుముకుంటుంది. ఆదివాసీల జీవితాలు అడవిగాచిన వెన్నెలలాగా మనకు తెలియకుండానే ఏ కుట్రలకో కూలిపోతున్నాయి. వాళ్ళ జీవితాల్లో వెన్నెల ఎప్పుడు పర్చుకుంటుంది. అడవిలోకి విప్లవం ప్రవేశిస్తే తప్ప మార్గం లేదా? అడవిని, అక్కడి క్రూర మృగాలను, ఆదివాసీలను నరుక్కుంటూ పోతే చివరికి ఏ రేఖ మీద ఆగుతాం? ఇలా చాలా ప్రశ్నల్ని సంధిస్తుంది ఈ కథ. కథలోని మరో గొప్ప విశేషమేమిటంటే ఆదివాసీ జీవిత సంఘర్షణతో పాటు కథకుడు చేసిన వాతావరణ చిత్రణ మనల్ని కథలో ఉండనీయదు. ఇస్రూ వెంట మనం కూడా ఏ ఆదివాసీ గూడేనికో వెళ్లిపోతాం. అక్కడి మడుగులోని చేపపిల్ల లాగానో, భయం భయంగా ఎక్కడికో జారుకునే తాబేలులాగానో, వెన్నెలగానో మారి పోయి అక్కడ అదృశ్యంగా సంచరిస్తుంటాం. లకింబాయి అందంతో పాటు ప్రకృతి కూడ మనల్ని ఎంతగానో ఆకర్షిస్తుంది. అదే సమయంలో ఫారెస్ట్ ఆఫీసర్ల దౌర్జన్యాలు, దొరల దోపిడీలు, అకిన్ మహారాజ్ ఉదాసీనత, కుర్దూ మెత్తదనం భయకంపితుల్ని చేస్తుంది. తునికి ఆకు తెంపటంలో, కాగితం పరిశ్రమకు కంక బొంగు కొట్టి అడవిని చదును చేయడంలో జీవితాలు రాలిపోతాయి. అజ్ఞానం, చైతన్య రాహిత్యం వల్ల ఎంత నష్టపోతామో తెలిసి వచ్చి రక్తం ఉప్పొంగుతుంది.

బి. ఎస్. రాములు కథల్లో ఈ కథ ఒక వెన్నెల పుష్పం. ఎందుకంటే ఆయన రాసిన మిగతా చేనేత వృత్తి కథలు, దళిత కథలు, విప్లవ కథలు, మానవ సంబంధాల కథలు, ప్రపంచీరణ కథలలాంటివి కొద్దిగా దృష్టి పెడితే మరో కథకుడెవరైనా రాయవచ్చు. కానీ ఈ కథ రాయాలంటే మాత్రం ఆకులో ఆకుగా మారి, కొమ్మలో కొమ్మగా ఇమిడిపోయి ఏ పేరు తెలియని పక్షిలాగానో అడివంతా నిశితమైన చూపుతో తిరిగితేగాని సాధ్యం కాదు.

కథ చెప్పడానికి ఎంచుకున్న శిల్పం కూడా ఆదర్శప్రాయం. వర్తమానం – గతం అనే టెక్నిక్ లోనే కథంతా సాగుతుంది. కానీ ఎక్కడా మనం ఆ విషయాన్ని పసిగట్టలేము. చాలా సులభంగా గతంలోకి, అంతే సులభంగా వర్తమానంలోకి తీసుకువెళ్ళి, తీసుకు వస్తాడు కథకుడు. సరళ శిల్పంలో సాగిపోయే కథ. కథలో వాడిన “మట్టి పెనం మీద దోరగా కాల్చిన జొన్న రొట్టెలా ఆకాశం వెచ్చగా ఉంది. ఆరబోసిన విప్పపూల వాసనలా వెలుగు వ్యాపిస్తోంది. కర్రలో అక్కడక్కడ నిలిచిన నీటి చుక్కలు నీటిలో మెరిసే చందమామ చేపల్లా కనిపిస్తున్నాయి. ఎంత మబ్బుపడ్డా తూర్పు కొండలలోని పెద్ద దేవునికి క్రమం తప్పకుండా దండంబెడుతోంది పొద్దు లాంటి ఉపమానాలు కథకు కవిత్వపు పరిమళాన్ని అద్దాయి. ఈ తరంలో యిస్రూ బలవంతులకు, బలీయమైన పరిస్థితులకు లొంగిపోయిన పాత్ర అయితే, గూడెం బతుకుల్లోకి రేపు రేపు ఒక వెన్నెల కిరణాన్ని ప్రసరింపజేసే భవిష్యత్ విప్లవ వీరుడు ఏసు. ఈ విషయం కథలో ఎక్కడా వాచ్యంగా చెప్పడు కథకుడు. అలాగే మోతి, లకింబాయి ముఖాల్లో కూడా రేపటి విప్లవ వీరుల అంకురాలు తొంగి చూస్తాయి. ఆదివాసీల సంస్కృతితో పాటు రేపటి తుడుం దెబ్బ ధ్వనిని మన గుండెల్లో మౌనంగా మ్రోగిస్తుందీ కథ. ఎక్కడో కొండ కోనల్లో బిక్కు బిక్కుమంటూ నివసించే అడవి బిడ్డల జీవన చిత్రాన్ని కళ్ళకు కట్టినట్లు చూపించే ఈ కథ ఇప్పటికీ ప్రాసంగికతను కోల్పోలేదు. అడవిమీద, అక్కడి వనరుల మీద, అక్కడి జీవుల మీద మరింత ఒత్తిడి, విధ్వంసం పెరిగిన ప్రస్తుత స్థల కాలాల్లో ఈ కథ కర్తవ్యాన్ని బోధిస్తుంది. కథ మన హృదయమంతా నిండి నిప్పు రాజేసిన తర్వాత మనం కూడా సాయుధులమైపోతాం.

*

శ్రీధర్ వెల్దండి

తెలంగాణా కథా సాహిత్య విమర్శకి ఇప్పుడే అందివచ్చిన దివ్వె వెల్దండి శ్రీధర్. కథా విశ్లేషణలో నలగని దారుల్లో సంచరిస్తున్నవాడు.

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలా చక్కటి విశ్లేషణ సార్..!
    ఇవ్వడమే కానీ మన నుండి తీసుకోని తనం గోండులది,
    యిస్రు, కుర్దు ఒక్కొక్కలది ఒక్కో పోరాటం .

    మీ విశ్లేషణ చాలా బాగుంది…!

    Congratulations sir ..💐💐💐💐💐

  • గొప్ప కథను పరిచయం చేసినందుకు ధన్యవాదాలు సార్ .ఆదివాసి జీవితంలోని సమస్యలను,వాటి పరిష్కారల గురించి అద్భుతంగ విశ్లేషించారు.బి.ఎస్ రాములు సార్ కథల్లో ఇది ఎందుకు విలక్షణమైనదో చెప్పడం మరింత నచ్చింది.ఫారెస్టు అధికారుల దోపిడి,యిస్రూలోని ఆవేదనను చూపించిన గొప్ప వ్యాసం సార్

  • అడవిలో వెన్నెల లోని వస్తువు , అందులోని వర్ణనలు ప్రత్యేకంగానే ఉన్నాయి, అక్కడి వనరుల మీద జీవితాల మీద మరింత ఒత్తిడి ,విధ్వంసం తీవ్రమౌతున్న ప్రస్తుత తరుణంలో ఈ కథ ప్రాసంగికత మరింత పెరిగింది అన్న మీ వ్యాఖ్య అక్షర సత్యం
    గుండెబోయిన శ్రీనివాస్.

  • ప్రముఖ తెలంగాణ రచయిత శ్రీ బి.ఎస్.రాములు గారి ఈ కథ ఎప్పుడో, ఎక్కడో చదివిన జ్ఞాపకం. ఎంతో గొప్ప కథకు శ్రీధర్ గారి అంతే గొప్ప విశ్లేషణా నీరాజనం. మళ్లీ ఆ కథను చదివే భాగ్యం కలుగజేయడమే గాకుండా, ఆ కథలోని గొప్పదనాన్ని కొత్తగా అర్థం చేసుకునేలా చేసిన శ్రీ శ్రీధర్ గారికీ, రచయిత గారికీ అభినందనలు.

  • మంచి విశ్లేషణ
    వెల్దండి శ్రీధర్ గారికి అభినందనలు

  • అడవిలో వెన్నెల ఒక అద్భుత రచన . నెడుతున్న చరిత్రకు అక్షర రూపం. మూడు దశాబ్దాల క్రితపు రచనపై శ్రీధర్ రాసిన విశ్లేషణ గొప్పగా ఉంది . ఇది బి ఎస్ రచన అని కాదు గాని సాన్యజన జీవితాన్ని వారి దృష్టి నుండి రాసిన కథ . ఇప్పుడు మల్లి ఆయా పాత్రలు స్వభావాన్ని అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ చేసిన విశ్లేషణ అంట గొప్పగా ఉంది . అసలు కథ చదవని వారికి కూడా మూల ఖాతాదారం అందుతుంది .

  • మంచి కథ ఎన్నుకొన్నారు .అడవిలో వెన్నెల ఒక అద్భుత రచన . నెడుతున్న చరిత్రకు అక్షర రూపం. మూడు దశాబ్దాల క్రితపు రచనపై శ్రీధర్ రాసిన విశ్లేషణ గొప్పగా ఉంది . ఇది బి ఎస్ రచన అని కాదు గాని సాన్యజన జీవితాన్ని వారి దృష్టి నుండి రాసిన కథ . ఇప్పుడు మల్లి ఆయా పాత్రలు స్వభావాన్ని అంతరంగాన్ని ఆవిష్కరిస్తూ చేసిన విశ్లేషణ అంట గొప్పగా ఉంది . అసలు కథ చదవని వారికి కూడా మూల ఖాతాదారం అందుతుంది .

  • కథల ద్వారా మానవ సంబంధాల్లోని స్థితిగతులు, సుఖదుఃఖాలు, సంస్కృతి చరిత్ర మానవీయ విలువలను సమాజానికి అందించవచ్చు. ఆదివాసీ,అటవీ ప్రాంత ప్రజల జీవన విధానం,పేదరికం తునికాకు తెంపేక్రమంలో కూలీల పెంపుదల పోరాటాలు సారా వ్యతిరేక పోరాటాలు ఉద్యమం కోసం కుటుంబాన్ని పిల్లలను, తల్లిదండ్రులను వదిలి ఉద్యమంలో పూర్తికాలం కార్యకర్తలుగా వెళ్లిన క్రమాలు, స్త్రీలు ఉద్యమంలో ఎదుర్కొన్న కష్టాలు, అవమానాలు,హింసలు,అత్యాచారాలు, నిర్బంధాలు, త్యాగాలు, సంఘర్షణలు రాములు గారి కథల్లో చూడవచ్చు. అడవిలో ఎంత క్రూరమృగాన్నయిన చీల్చి చెండాడగలిగిన గిరిజనుడికి రెండు కాళ్ళ జంతువునుండి తప్పించుకోలేక పోతున్నాడని,అడవిలో పుట్టిన మాకు అడవిపై ఎందుకు హక్కులేదని ప్రశ్నించిన తీరు బి. ఎస్ రాములు గారి కథల్లో చూడొచ్చు సమగ్రమైన సమాచారం ఇచ్చినందుకు శ్రీధర్ గారికి సారంగ నిర్వాహకులకు ధన్యవాదములు.

  • కథ కళ్ళకు కట్టినట్లుగా గోండుల జీవితాలను చక్కగా విశ్లేషిస్తూ సాగిన మీ రచన కు అభినందనలు .

  • అడవి లో వెన్నల కథ విశ్లేషణ బాగుంది

  • గొప్పకథను గొప్పగా విశ్లేషించారు . చాలా బావుంది.
    ఈ కథ లోనిది నాకు తెలియని జీవితం. 👍

  • అవును సార్…మీరన్నట్లుగానే బి.ఎస్.రాములు గారి కథల్లో “ఆడిగాచిన వెన్నెల”కథ గిరిజన జీవితాన్ని చిత్రించిన వెన్నెల పుష్పం.

  • బాగుంది మాస్టారు అడవిలో వెన్నెల పై మీరు రాసిన విశ్లేషణ..
    మంచి సామాజిక ఇతివృత్తం గల కథలపై…మీ దృష్టి అభినందనీయం..మాలాంటి పాఠకులకు విలువైన సమాచారం.

  • స్పందించిన పాఠకులకు హృదయపూర్వక ధన్యవాదాలు..

  • అద్భతం శ్రీధర్ గారు..
    మీ విశ్లేషణ🙏
    సీతారాం గారి గురించి.. ఆయన రచనాశైలి.. కథలు..
    రంగడు లచ్చిపాత్రల చిత్రణ…ప్రతీది పాఠకులకు… తెలిపే..మీ ప్రయత్నం
    అభినందనీయం 👌💐💐💐 మీ నుండి మరిన్ని… ఇలాంటి సందేశాత్మక కథల విశ్లేషణలు ఆశిస్తున్నాము👍

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు