పురాణ, ఇతిహాసాల్లోని కథల్ని తీసుకొని రచనలు రావటం మనకి కొత్తకాదు. ప్రాచీన సాహిత్యంలో అలాంటి సందర్భాలు, ఆధునిక సాహిత్యంలో అలాంటి సందర్భాలు చాలానే ఉన్నాయి. ఇందులో మార్కెట్ కోసం రాసిన రచనలు కూడా కోకొల్లలు. కానీ ప్రాచీన సాహిత్యంలోని సందర్భాలకీ, ఆధునిక సాహిత్యంలోని సందర్భాలకీ చాలా వ్యత్యాసం ఉంది.
ఆధునిక సాహిత్యం నూతన సామాజిక అభివృద్దిలో భాగంగా వెలువడటం మొదలయ్యాక, కొత్త చారిత్రిక, రాజకీయ చూపుతో పురాణ, ఇతిహాసాలను చూడటం మొదలయింది. దీనికి కారణం ఆధిపత్యంగా వస్తున్న ఒక వాహకానికి ప్రత్యామ్నాయంగా చూడటానికి అవసరమైన నేపథ్యం కావాల్సి రావటం. ఈనాడు చాలా మందికి పురాణ, ఇతిహాస సాహిత్యంలోని కథల్ని మళ్లీ కొత్తగా చెప్పటం ఎందుకు అనే అభిప్రాయం ఉంది. అలా అనేవారికి నూతన సాంస్కృతిక, రాజకీయ ఆలోచనల గురించి అవగాహన అయినా లేదనుకోవాలి.
లేకుంటే దాన్ని అర్థం చేసుకోలేక పోయారనైనా అనుకోవాలి. ఇతిహాసాల పునర్ మూల్యాంకనం వలన మన సమాజం మీద ఉన్న ప్రాచీన ఆలోచనల మీద కొత్త చూపు, కొత్త దృక్పథం ప్రసరించేలా చేయటం ఆధునిక రచయితలు చేసిన పని. పురాణ, ఇతిహాస సాహిత్యాన్ని తిరిగి రాసిన వాళ్లందరూ ఆధునిక రచయితలు అనుకోవటానికి లేదు. ముందే అనుకున్నట్లు పాత సంప్రదాయాల మీద ప్రేమతోనో, మార్కెట్ కోసమో రాసే రచయితలు ఎలాంటి ఆధునిక ప్రజా జీవితానికి ప్రయోజనకారులు కాదు. కొత్త ఆలోచనతో రాసినంత మాత్రాన, అలా రాసినవాళ్ళూ ఒరగబెట్టేది లేదు. కొత్త ఆలోచనలతో పాటు, ఆధునిక దృక్పథం అవసరం. సమిష్టి విలువలు కూలిపోతున్న ఈ కాలంలో అది మరీ అవసరం.
అది గుర్తించటం వలనే నరేష్కుమార్ సూఫీ హిడింబి అనే నవల రాశాడు. ఈ నవల అరిగిపోయిన భారతకథనే కొత్తగా ప్లే చేయటం కాదు. ఇందులో ఒక వ్యూహం ఉంది. నూతన ప్రజా దృక్పథ ఆలోచన ఉంది. అది ప్రజల వైపు నుంచి చూస్తే కానీ మనకి అర్థం కాదు. ముఖ్యంగా ఆదివాసీ ఆలోచన నుంచి చూడాలి. ఈనాటి రాజకీయ సామాజిక స్థితి గతులు ఏమిటో రచయితకి బాగా తెలుసు. అయితే వాటిని చెప్పటానికి కొత్త పాత్రలతో, కథతో చెప్పవచ్చు.
కానీ ఎందుకు భారత కథలోని ఒక పాత్రని ఎంచుకొని రచన చేయాలి? ఇక్కడ ఉంది ఈ నవల అసలు ఉద్దేశ్యం. భారతీయ ప్రజల చింతన అనేది పురాణ, ఇతిహాసాల చుట్టూ ముడిపడి ఉంది. అయితే ఆ చింతన ఏ జన జీవితానికి సంబంధించిన చింతన అనుకున్నప్పుడు అది అప్పటి సమాజంలో నడుస్తున్న ఆధిపత్య విలువలే అని తెలుస్తోంది. అయితే ఇప్పటికీ ఆ విలువలని ఆ చింతన ద్వారా పదిలం చేయాలనుకుంటున్నప్పుడు దానికి భిన్నమైన చింతనని ముందుకు తేవాల్సి ఉంటుంది.
అంటే ఆ విలువల ధ్వంసం ద్వారా నూతన విలువలని, అందరికీ సమాన ప్రతిపత్తి, గౌరవం అనేది ముఖ్యమని చాటి చెప్పటం. అందుకే భారతకథలోని హిడింబి పాత్ర తీసుకొని రచయిత ఆదివాసీ జీవన స్థితిని చెప్పాలనుకున్నాడు. ఇది సమకాలీన ఆధునిక భావన. భారతకథలో మిగతా పాత్రలకన్నా హిడింబి పాత్ర భిన్నమైనది. కుంతి, ద్రౌపతి, సుభద్ర ఇలా మిగతా ఏ పాత్రలనైనా తీసుకోండి, హిడింబి స్థితి గతులు లేవు వాటికి. హిడింబి ఒక గిరిజన (ఆదివాసీ) అవటం, ఆమె యోధురాలు అవటం వలన ఆ పాత్ర ఆధారంగా ఈ నవల రాయటంతో సూఫీ అస్తిత్వవాదం నుంచి మరికొంత ముందుకు వెళ్లి, అసురుల కథనే కాదు.
గిరిజనుల (ఆదివాసుల) కథను కూడా చెప్పాలనుకున్నాడు. అయితే కేవలం హిడింబి కథనే చెప్పాలనుకుంటే రచయిత నవల దాకా వెళ్లి ఉండేవాడు కాదు. ఈ నవల అసలు ప్రధాన ఉద్దేశ్యం కూడా ఆధిపత్యం చేసే జాతికీ, దోపిడీకి గురవుతున్న జాతికీ మధ్య గల సమాజాన్ని, మైదాన ప్రాంత ప్రజల రాజ్య విస్తరణ కాంక్ష వలన గిరిజనులు (ఆదివాసులు) ఎలా తమ ప్రాంతాలను కోల్పోయారు? ఆ యుద్ధాల వలన ఎలా సాంస్కృతిక దోపిడీకీ గురయ్యారు? ఎలా ప్రాచీన జాతులు కనుమరుగయ్యాయి వంటి అంశాలను చెప్పదలుచుకున్నాడు. ఎవరైనా ఈ నవలని భారతంలోని పాత్ర తీసుకొని అందులోంచి రాసిన రచన అనుకుంటే అది పొరపాటే.
ఇది ఒక ఆదివాసీ నవల. గోపీనాథ్ మహంతి రచనలు ఎలాంటి గిరిజనుల (ఆదివాసుల) జీవితాల గురించి చెప్పిన నవలలో, అలాగే నరేష్కుమార్ సూఫీ భారతకాలం నాటి గిరిజనుల (ఆదివాసుల) ఆహార అలవాట్లు, వారి సంస్కృతి, వారి జాతి నియమాలు, వారి జీవన విధానం, వారి నైపుణ్యాలు వంటి అనేక అంశాలు రాశాడు. ఇతిహాసక నేపథ్యం ఉన్న గిరిజన సామాజిక నవల హిడింబి. అలాగే సమకాలీన రాజకీయ కథ కూడా. ఇంకా రెండు భిన్న జాతుల మధ్య ప్రేమ కథ. ఈ నవలతో భారతంలోని గిరిజన పాత్రల వైపు చూపు మళ్ళేలా చేశాడు సూఫీ . పురాణ, ఇతిహాసాల ఆధునిక పునర్ మూల్యాంకనం మన సాహిత్యంలో తగ్గిపోతున్న దశలో ఈ నవల రావటం మనం హర్షించదగిన విషయం.
పుస్తకం కోసం: ఝాన్సీ పబ్లిషర్స్, 6300019394 వాట్సాప్, అన్ని ప్రముఖ పుస్తక కేంద్రాలలో —
అడివిని కబళించే మైదానం కుట్ర చెప్పాలనుకున్నాను
-నరేష్కుమార్ సూఫీ
- ఇప్పటి వాతావరణంలో ఈ నవల ఏం చెప్పాలని ప్రయత్నిస్తుంది?
* ఆదివాసీల మనుగడ ఎప్పుడూ పోరాటమే. వాళ్ల జీవితంలో ఏదీ సులువుగా దొరకదు. ఆహారమైనా, ఆరోగ్యమైనా, అయినా వాటికోసం కూడా పోరాడాలీ తమ హక్కులు సాధించుకోవాలని కూడా తెలియని ప్రజలు వాళ్లు. కానీ, వాళ్లకి ఇవికూడా పెద్ద ప్రమాదాలు కాలేదు. అభివృద్ధి సాధించాం అనుకునే ఈ మైదాన ప్రాంతమే వాళ్లకి పెనుముప్పు అయ్యింది. గిరిజనుల పాదాలకింద ఉన్న సంపదనీ, వాళ్ల భూమినీ దోచుకునే క్రమంలో మనం వాళ్లని ఎంత క్షోభకి గురి చేస్తున్నామో, మనకే గుర్తు చేసే ప్రయత్నం అనుకుంటున్నాను.
ఇంతకు ముందే చెప్పినట్టు దీని మూల ఆలోచన నాది కాదు. మామిడి హరికృష్ణగారు ఓ సందర్భంలో తాను చెయ్యాలనుకుంటున్న విజువలైజేషన్ ప్రాజెక్ట్ కోసం ఈ సబ్‌జెక్ట్ చెప్పారు. కొన్ని కారణాలవల్ల అది కుదరలేదు.
ఇప్పుడు ఉన్న పరిస్థితి కేవలం ఈ శతాబ్దానిది కాదు, కేవలం భారతదేశానిది మాత్రమే కాదు. అడవులనాశ్రయించి బతుకుతున్న గిరిజనులందరిదీ అమెరికా, సౌతాఫ్రికా, ఆస్ట్రేలియా, భారతదేశం ఇలా ప్రతీ చోటా జరుగుతూ వస్తున్నదే. కేవలం డెవలప్‌మెంట్ అనే ఒక్క మాటతో దోపిడీని కూడా లీగలైజ్ చేసి మరీ కొల్లగొడుతున్నారు. ఆ విషయాన్ని గుర్తు చేయటానికి ఇది ఒక కారణం అవ్వొచ్చు అనే ఆలోచన. మన భారతదేశ జానపదకథలు పురాణాలుగా కొనసాగుతున్న క్రమంలో ఇలాంటి థీమ్‌లో అయితే అన్నిరకాల పాఠకులూ రిసీవ్ చేసుకుంటారని అనిపించింది. ఇది ఏ ఒక్క సామాజిక వర్గమో, కులమో, మతమో చేస్తున్న విధ్వంసం కాదు. మైదాన ప్రాంతవాసులుగా మనమంతా ఈ దోపిడీలో భాగమయ్యే ఉన్నాం. అని గుర్తించగలిగితే చాలనీ… హిడింబి ఆ పని చేయగలదనీ చిన్న నమ్మకమూ, ఆశా కూడా.
- మీరు ముఖ్యంగా కవి. నవల వైపు ఎందుకు దృష్టి పెట్టాలనిపించింది?
* కవిత్వంతోనే మొదలయ్యాను, నిజానికి కవిగానే కొనసాగుతున్నాను కూడా… వచనం వైపుగా దృష్టి కావాలని, ‘ఇలా కూడా రాయాలనీ’ మొదలైంది కాదు. లోపల ఉండే సఫకేషన్‌ని పోగొట్టుకునే ప్రయత్నమే రచన అనేది న (వ్యక్తిగత) అభిప్రాయం. దాని పరిధి కొన్ని నిమిషాలకన్నా ఎక్కువగా మనల్ని వెంటాడుతున్నప్పుడు కథలు రాసుకున్నాను. ఇక హిడింబి విషయానికి వస్తే ఈ కాన్వాస్, పెయిన్, చర్చించాల్సిన విషయం చాలా పెద్దది. కవితలోనో, చిన్న వ్యాసంలోనో చెప్పటంకంటే కథగా అయితేనే దీన్ని చర్చలోకి తేగలనూ అనిపించింది.
- తెలుగులో ఇప్పుడున్న నవలల మధ్య “హిడింబి”ని ఎలా అర్థం చేసుకోవచ్చో రచయితగా మీకొక expectation వుందా?
* ఉన్నది కాబట్టే… రాయగలిగాను అనుకుంటున్నా. ఇప్పుడు తెలుగులో వస్తోన్న నవలలమధ్య హిడింబి తన స్థానాన్ని తీసుకోగలదనే అనుకుంటున్నాను. కొత్త తరం ఇప్పుడు “ప్రేమకథల మీదే దృష్టి పెట్టింది” అనేది అపోహలా అనిపిస్తుంది నాకు. ఎందుకంటే ప్రేమకథలు కాని పుస్తకాలకి కూడా మంచి రిసీవింగ్ ఉంది. ఛాయా వేస్తున్న అనువాద సాహిత్యం, ఝాన్సీ వాళ్లు వేసిన పొట్టేలు, ఎన్నెలపిట్ట వాళ్లు వేసిన కులం, మహద్ లాంటి పుస్తకాలన్నీ సీరియస్ సాహిత్యంలో భాగమే. కాబట్టి నేను హిడింబి ద్వారా ఏం చెప్పాలనుకున్నానో చదివే వాళ్లకి చేరుతుందనే నమ్మకం ఉంది.
*
Thank You Narayana <3