1956 తరువాత తెలంగాణ వ్యాప్తంగా అనేక స్పిన్నింగ్ మిల్లులు అజంజాహీ మిల్లు, DBR మిల్లు, అంతర్గాం స్పిన్నింగ్ మిల్లు, సిర్పూర్ సర్ సిల్క్, పలు పంచధార పరిశ్రమలు, ఫిరంగుల ఫ్యాక్టరీ, రామగుండం ఎరువుల ఫ్యాక్టరీ, దక్కన్ ఐరన్ ఫ్యాక్టరీ, దక్కన్ గ్లాస్ ఫ్యాక్టరీ, A. P. Steels, HMT, ఆల్విన్ వాచ్ కంపనీ లాంటి ఎన్నో చిన్న, మధ్య తరహా పరిశ్రమలు నిర్లక్ష్యానికి గురై, ఖాయిలాపడి మూతపడ్డాయి. తత్ఫలితంగా ఎన్నో కుటుంబాలు వీధిన పడి సంసారాలు కూలిపోయాయి. ఎంతో మంది నిరుద్యోగాన్ని భరించలేక ఆత్మహత్యలపాలయ్యారు. తెలంగాణ సమాజం ఇంత సంక్షోభానికి గురైనా ఈ తెర వెనుక కుట్రను చాలా తక్కువ మంది కథకులే పట్టించుకున్నారు. అట్లా తెలంగాణ జీవితాల నిండా పర్చుకున్న ఈ కనపడని హింసను కథలోకి ఒంపి అద్భుతమైన కథ రాసిన విశిష్ట కథకులు గొరుసు జగదీశ్వర రెడ్డి. ఆ కథ పేరే ‘గజ ఈతరాలు ’. ఈ కథ ఆదివారం ఆంధ్రజ్యోతిలో 12 డిసెంబర్ 1999 లో ప్రచురింపబడింది.
తెలిసిన వారి పెళ్ళిలో భోజనం చేస్తుంటే అక్కడ అనుకోకుండా కనిపించిన విమల టీచర్ పూర్ణమ్మ బావిలో దూకి ఆత్మ హత్య చేసుకుందని చెప్పేసరికి కథకుడు తింటున్న జాంగ్రీ ఒక్కసారి చేదెక్కిపోతుంది. షాక్ తగిలినట్టు నమలడం ఆపేసి ఆమెకేసి అలా చూస్తుండిపోతాడు. పూర్ణమ్మ బావిలో దూకి చనిపోయిందంటే అతనికి నమ్మ బుద్ధి కాదు. ఎందుకంటే ఆమె గజఈతరాలు. కొన్ని వందల మందికి ఈత నేర్పిన వనిత. ఏటికి ఎదురీదే మనస్తత్వం. జీవితాన్ని మొండి ధైర్యంతో ఎదుర్కోగలదు. అలాంటి పూర్ణమ్మ ఎంతలోతైన బావిలోనైనా ఈదుకొచ్చింది కానీ కన్ను తడవకుండా సంసారాన్ని ఈదలేక ఆత్మహత్య చేసుకుంది.
కొడుకు పుట్టిన ఆరునెళ్లకే భర్త కూలి పనికి బళ్ళారి పోయి అక్కడే ఇంకొకరితో కలిసి కాపురం పెట్టేసరికి పూర్ణమ్మ ఇక భర్త రాడని కొడుకు రాజు తోడిదే లోకంగా బతుకుతుంది. ఎంత కష్టమున్నా వాడికి చదువు చెప్పించి పెద్దవాడిని చేస్తుంది. తాను చదువుకున్న చదువుతో కొడుకు ఒక వాచ్ కంపనీలో ఉద్యోగం సంపాదించుకుంటాడు. కొన్ని రోజులు బాగానే జరుగుతుంది. ఇంతలో పూర్ణమ్మకు గుండె రోగం వస్తుంది. ESI కార్డుతో తల్లిని దవఖానలో చూపిస్తాడు. కానీ దురదృష్టం కొద్ది కంపెనీ ఖాయిలా పడి మూత పడుతుంది. రాజు మరో ఉద్యోగం కోసం ఎక్కడెక్కడో తిరుగుతాడు కానీ ఎక్కడా పని దొరకదు. పిల్లలకు కాన్వెంట్ ఫీజులు కట్టలేక, ఇంటి కిరాయి కట్టలేక, తిండి గింజలు కొనలేక రాజు నానా తిప్పలు పడుతుంటాడు. “సర్కారు నౌకరో, సర్కారు నౌకరో అంటని సస్తి సర్కారు నౌకర్ల మన్నువడ నడిమిట్ల నౌకరి దీసిరిగదనే ముండకొడుకులు. ఊర్ల యాడ కష్టం జేస్కున్నా గింత బువ్వ దొరుకుతుండె” అని ఏడుస్తూ పూర్ణమ్మ కొడుకు దగ్గర ఉండలేక ఊరికి వచ్చేస్తుంది. ఊరికి వచ్చిన పూర్ణమ్మ ఎవరితో మాట, ముచ్చట లేకుండా తనలో తానే కుంగిపోతుంది. నా కొడుకు నౌకరీ దీసిరి, నా కొడుకు బతుకుల ఇంగుళం పోసిరి, నా కొడుకు నోటికాడి బుక్కను గుంజిరి అని మనాదితో కుమిలిపోతుంది. చివరికి ఏ అర్ధ రాత్రో లేచి రెండు కాళ్ళకు రెండు బండ రాళ్ళను కట్టుకొని బావిలో దూకి బలవంతంగా ప్రాణం తీసుకుంటుంది.
కథకుని బలమంతా ఎక్కడ దాగుందంటే ఇందులో చెప్పిన కథ చారెడు. చెప్పకుండా వదిలేసింది బండెడు. కథంతా ఒక పల్లె పరిమళంతో నిండి పోయి ఒకనాటి తెలంగాణను మన కళ్ల ముందుంచుతుంది. సంసారపు బండిలో ఒక గీరె విరిగిపోయినా బతుకుపోరులో పూర్ణమ్మ దాన్ని ఒక్కెద్దుతోనే లాక్కుపోతుంది. వ్యవసాయ కూలిగా, మేస్త్రి దగ్గర మాల్ అందించే మనిషిగా, పండ్లు అమ్ముకునే చిరు వ్యాపారిగా, ఇవేవీ కుదరనప్పుడు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టుకొచ్చి అమ్ముకుంటుంది. ఒకనాడు అడవిలో కట్టెలు కొట్టుకొని వస్తుండగా చౌకీదార్ల కళ్ళలో పడి వాళ్ళ నుంచి తప్పించుకోవడానికి నానా యాతన పడుతుంది. ఎందుకంటే చౌకీదారు గొడ్డలి లాక్కుంటే మళ్ళీ కొనడం చాలా కష్టమైన పని అని ఆమెకు తెలుసు. కథ వెంట నడుస్తుంటే ఎన్నెన్నో దృశ్యాలు మనల్ని ఉక్కిరిబిక్కిరి చేస్తుంటాయి.
నడుముకు కిరోసిన్ డబ్బా, మునగ బెండు కట్టి పిల్లలకు ఈత నేర్పడం, వెన్నెల రాత్రుల్లో రకరకాల ఆటపాటలు, పొడుపు కథలు విప్పడం, అత్తా కోడళ్ళ పంచాయితీ, తారు రోడ్డు మీద ఎడ్ల బండ్లలో తరలి పోతున్న కర్బూజ, పుచ్చ కాయల్ని దొంగిలించడం, కాళ్ళకు పల్లేరుగాయలు కుచ్చుకోవడం, వాగు నీటి చెలిమెల తియ్యదనం… ఇలా ఎన్నో జ్ఞాపకాల పూవులు మనసును ప్రకృతి ఒడిలో ఊయలలూగిస్తాయి.
నిజానికి పుట్టిన ప్రతీ జీవి ఏదో ఒకనాడు తనువు చాలించక తప్పదు. కానీ బతికినన్ని రోజులు ఎంత ఆత్మ గౌరవంతో బతికామన్నది చాలా ముఖ్యమైనది. ఈ కథ తెలంగాణలోని నిరుద్యోగ సమస్యను చాలా ప్రతిభావంతంగా చర్చించిన కథ. ఉద్యోగాల లేమి అప్పుడే కాదు ఇప్పటికీ అలాగే ఉంది. స్వాతంత్ర్యం వచ్చి ఎన్నేండ్లు జరిగిపోయినా, ఎన్ని ప్రభుత్వాలు మారినా ఉపాధి కల్పన అనేది దేవతా వస్త్రం మాదిరిగానే జీవితాలను ఎద్దేవా చేస్తుంది.
పూర్ణమ్మ పాత్ర రూప కల్పన కథకుని కథా సామర్థ్యానికి ఒక మచ్చు తునక. కథ పూర్ణమ్మ చుట్టే నడిచినా మన చుట్టూ కూడా ఎంత ముళ్ళ కంచె నిర్మితమై ఉందో అర్థం అవుతుంది. ఒక నిప్పుల వాన దేహాన్ని సాంతం తొలుస్తుంది. పైగా కథలోని ఎన్నో సంఘటనలకు కథకుడు ఒక సజీవ సాక్షి. కాబట్టి కథ చదువుతుంటే మనం కథలో ఉండం. మనం కూడా కథకునితో పాటు వనపర్తికి వెళ్ళి ఆయా ప్రదేశాల్లో అదృశ్యంగా సంచరిస్తుంటాం.
“భోగం దాని బొడ్డు సుట్టె ఎన్నియల్లో
సోమిరెడ్డి పాపి కండ్లు ఎన్నియల్లో…” లాంటి బొడ్డెమ్మ పాటలతో పాటు
“చెక్క వచ్చి చెంప దగిలే నా సామి
సెప్పరాని దుక్కమొచ్చే నా సామి…” లాంటి శ్రమైక జీవన సౌందర్యపు పాటలు మనసును ఏ తీరాలకో చేర్చి మురిపింపజేస్తాయి. వీటితో పాటు కథకుడు వాడిన అతి సహజాతి సహజమైన తెలంగాణ తెలుగు సొగసులైతే హృదయాన్ని పల్లీయుల వాకిట్లో నిలబెట్టి మన నాలుక మీద తేనె చుక్కలను ఒక్కొక్కటే వదిలి పోతాయి. ఈ కథలోని బలం వస్తువుతో పాటు భాష కూడా. శైలీ, శిల్పాలు కూడా బాగా నప్పడం వలన పాఠకుడు ఏ మాత్రం గందరగోళానికి గురి కాకుండా నేరుగా కథను ఒరుసుకుంటూ సాగిపోతాడు.
ఈ కథ జిందాతిలిస్మాత్ లాంటి కథ. నొప్పితో పాటు, పరిష్కారాన్ని కూడా డిమాండ్ చేస్తుంది. ఎన్నిసార్లు గద్దెనెక్కామన్నది కాదు, ఎన్ని జీవితాలకు పిడికెడు మెతుకులు అందించాం? ఎన్ని ఆత్మహత్యల్ని నివారించగలిగాం? ఎన్ని బతుకుల్లో వెన్నెలలు పూయించామని ప్రభుత్వాలు ఆత్మ విమర్శ చేసుకునేలా చేస్తుందీ కథ. నాస్టాల్జియాతో పాటు నాలుగు కాసుల మానవత్వాన్ని, యంత్రానికీ, మనిషికీ మధ్యనుండే అనుబంధాన్ని ప్రపంచీకరణ నేపథ్యంలో విప్పి చెప్పే కథ. నమ్ముకున్న నేల అకస్మాత్తుగా కాళ్ళ కింది నుండి జారిపోతే ఏ లోయలోకి జారిపోతామో అనుభవ పూర్వకంగా చెప్పిన కథ.
*
నిజమే. కథలో మనమూ. కథకునితోబాటు.అన్ని ప్రాంతాలను చుట్టివస్తాం. మూతపడిన కంపెనీకార్మికుల బ్రదుకుల్లోని కడగండ్లను వివిధ కోణాలనుంచి విశ్లేషించిన కథలుగొరుసు జగదీశ్వర రెడ్డిగారి కథలు. గజఈతరాలు .. లోని ప్రతి కథా మనల్ని చాలాకాలం వెన్నాడుతూనే ఉంటుంది. శ్రధర్ గారి విశ్లేషణ చాల బావుంది.
నమస్తే మేడం.
మీ అభిమానానికి కృతజ్ఞత అనేది చిన్న మాట.
అనేక ధన్యవాదాలతో….
‘గజ ఈతరాలు’ ఈ కథని కథ అంటే ఎందుకో నాకంతగా రుచించదు. ఇది అంతకుమించి ఉంటుందని నా భావన. ఆనాటి తెలంగాణ సామాజిక జీవనాన్ని, నిరుద్యోగ పర్వాన్నీ దృశ్యమానం చేసిన ఓ అద్భుతమైన డాక్యుమెంటరీ అని చెప్పాలి. పాఠకుని మనోఫలకంపై పాత్రలను సజీవంగా రూపు కట్టించే కథకుని శైలి అంటే నాకు అమితమైన ఇష్టం. ఈ కథ గురించి శ్రీధర్ గారు చాలా చక్కగా విశ్లేషించారు. నిజానికి ఇందులో కథానాయిక పూర్ణమ్మది బలమైన పాత్ర. అంత బలమైన పాత్రను ఆత్మహత్యకు పురికొల్పిన కథకునిపై నిజానికి కోపం రావాలి. కానీ ఇది కథ కాదు సుమా, యథార్థ ఘటన అనిపించేట్టుగా ఉండే కథనం మనల్ని పూర్ణమ్మ మరణానికి కన్నీకు కార్చేలా చేస్తుంది. గొరుసు గారు ఈ కథే కాదు, ఏ కథ రాసినా అంతే. ఒక్కమాటలో చెప్పాలంటే ఆయన కథలు చదవని వారు ఒక అమూల్య అనుభవాన్ని కోల్పోయినట్టే!
మురళీ .. ఏడిపించావు పో! జీవితాలకీ వ్యవస్థకీ మధ్య ఉన్న సంకెళ్ళని బాగా అర్థం చేసుకున్నావు. నీలోని ఉత్తమాభిరుచికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ప్రేమతో …
ఒక గొప్ప కథను గుర్తు చేశారు. మీ విశ్లేషణ ఆ కథకు న్యాయం చేసింది. ధన్యవాదాలు.
సార్, ధన్యవాదాలు. మీ “తూరుపు గాలుల” ముందు నేను గడ్డిపోచనే. మీ అభిమానానికి పాత్రుడనైనందుకు గర్వంగా ఉంది.
తెలుగు కథా ప్రపంచంలో గొప్పకథల ప్రస్తావన వచ్చినపుడు తప్పక చెప్పుకోవలసిన కథల్లో గజఈతరాలు కూడా చెప్పుకోదగ్గ గొప్పకథ .వనపర్తి లోని రాయగడ్డ వీధిలో సందడి సందడిగా మొదలైన జీవితం ప్రపంచీకరణ ప్రభావంతో ఏవిధంగా అతలాకుతలం ఐయిందో చక్కని శైలితో సాగిపోయే సముద్రమంత విషాదం ఈ కథ.ఈదగలిగి ఉండి కూడా పూర్ణమ్మ బావిలో బలవంతంగా చావడం ప్రతి పాఠకుడికి రెప్పని తడి చేస్తుంది.కథ చదివాక పూర్ణమ్మ అనే పేరు విన్నా ఆసంఘటనలు,ఆ పాత్రలే మనల్ని చాలా కాలం బలంగా వెంటాడుతాయి.అద్భుతమైన తెలంగాణా యాసతో కథకు జీవం పోయటమే కాక ప్రపంచీకరణ పర్యవసానాన్ని ఈ కథ ద్వారా హృద్యంగా చెప్పారు గొరుసు జగదీశ్వరరెడ్డి గారు.గొప్ప కథను చక్కగా విశ్లేషించారు శ్రీధర్ గారు.ధన్యవాదాలు.
రమణా .. నేనెవరో తెలియకుండానే నా కథలను గుండెలో దాచుకున్నావు. పరోక్షంగా అందే ప్రేమ ఎంత మధురమో కదా! కృతజ్ఞతలతో …
విశిష్ట కథకులు గొరుసు జగదీశ్వరరెడ్డి గారు అద్భుతంగా ఆవిష్కరించిన “గజ ఈతరాలు పూర్ణమ్మ” ని నేటి తరం పాఠకులకు పరిచయం చేస్తున్న శ్రీధర్ వెల్దండి గారికి నెనర్లు.
రామయ్య గారూ.. మీ అభిమానాన్ని తట్టుకోడానికి భీముడి కంటే, హనుమంతుడి కంటె ఎక్కువ బలం ఉండాలి. లేదంటే, మీ ప్రేమాగ్నిలో శలభంలా మాడి మసై పోవడం ఖాయం. “గజ ఈతరాలు” కథ ఆయువు పట్టుని శ్రీధర్ గారు సునాయాసంగా పట్టుకోబట్టే కథ మరింత వన్నె తిరిగింది. ఉప్పెన లాంటి మీ ప్రేమ ను కొంత తగ్గించగలిగితే కొంత కాలం ఈ నేలమీద మనగలుగుతానని సారంగ ముఖంగా మనవి చేస్తున్నాను. లేదంటే హుద్ హుద్ తుపాన్ తాకిడికి కూకటి వేళ్ళతో ఒరిగిపోయిన తరువునవక తప్పదు. అర్థం చేసుకుంటారని ఆశిస్తూ, ధన్యవాదాలతో …
“ ఊర్లందరికీ ఈత నేర్పి ఈదరాకుంట రెండుగాళ్ళకు బండరాళ్ళను గట్టుకున్నది కొడుకా …. బలిమి సావు సచ్చే కొడుకా, గింత గాచ్చారం ఎందుకొచ్చనో కొడుకా …. ” సాయమ్మలో జ్నాపకాల గనులు కరుగుతున్నాయి. ఆమె ధు:ఖాలాపన తీగలుగా సాగి నన్ను చుట్టుకుంటుండగా పూర్ణమ్మ చావుకు కారణం తెలిసింది.
ఇలాంటి ధు:ఖాలాపన, దావానలాలలో పాలమూరు వలసపక్షుల నొగ్గేసి తనే జనారణ్యం లోనో అజ్నాతవాసం ఎందుకు చేస్తున్నాడు? శమీవృక్షం మీది గాండీవాన్ని మళ్లీ అందుకుని నారిసారించడానికి జంకుతున్నాడెందుకు ? ఆంద్రజ్యోతి తిర్పతి ఆర్.ఎం. ఉమా వచ్చి పాంచజన్యాన్ని పూరిస్తే కాని తను మళ్లీ సాహితీ కదనరంగానికి కదలి రాడా?
గొరుసన్న మీద సంధిస్తున్న పాత నిందారోపణలే, పాత నేరారోపణలే మళ్లీ మరొక్కసారి :
తళుకుబెళుకుల భాగ్యనగరం మింగేసిన గొరుసన్న సాహితీ పునరుజ్జీవనం, ‘గజయీతరాలు’ పుస్తకం పునర్ముద్రణ పొంది పాఠకులకు అందుబాటులోకి రావాలనేది నా లాంటి నేలక్లాసు ప్రేక్షకుడి / పాఠకుడి చిరుకోరిక.
కారా మాస్టారు, రాచకొండ బాబు ( రావిశాస్త్రి ), బీనాదేవి, రంగాజీ ( రంగనాయకమ్మ ), కృష్ణక్క, చలసాని ప్రసాద్, భరాగో, త్రిపుర ల లాంటి ఎందరెందరో సాహితీ యోధుల సాన్నిహిత్యాని పొందిన గొరుసన్న నేడు – – – మౌనంగా మిగిలాం.. నిస్సహాయంగా మిగిలాం… చివరకిలా మిగిలాం అంటే వొర్చుకోవాలా ?
( మళ్లీ మళ్లీ రచనలు చెయ్యమని గొరుసన్నతో గొడవెట్టుకోవద్దని మందలించిన త్రిపుర తండ్రికి క్షమార్పణలతో )
గొరుసు గారి కథను ఈ రూపంలో చదివే అవకాశాన్ని కల్పించిన శ్రీదర్ వెల్దండి గారికి ధన్యవాదాలు. కథ చదవాలనుకునే వారు ‘గజ ఈతరాలు’ అనే నీలం రంగు అక్షరాలపై టచ్ చేస్తే కథ పి.డి.యఫ్ డౌన్లోడవుతుంది.
ధన్యవాదాలు శ్రీనివాసరావు గారూ. “నీడనివ్వని చెట్టు ” లాంటి గొప్ప కథలు మీరు మరిన్ని రాయాలని కోరుతూ …
థ్యాంక్యూ సార్
నేను ఈకథ కథ_99లో తొలి సారి చదివిన. ఆ తర్వాత చాలా సార్లు చదివిన. తెలుగు కథల్లోని ఉత్తమ కథల్లో గజ ఈతరాలు తప్పకుండా ఉంటుంది. శ్రీధర్ సార్ కథ ఆత్మ పట్టుకున్నారు
ధన్యోస్మి 🙂
మెల్లగామెల్ల్లగా రచయిత కొత్త రచనల కోసం ఎదురుచూడటం అలవాటు అయ్యింది…
నావి ఎదురు చూసేంత గొప్ప కథలు కాదు లెండి సత్యోదయ్ గారూ. మీ స్పందనకు కృతజ్ఞతలు.
చెప్పులో రాయి, చెవిలో జోరీగ, కంటిలో నలుసు, కాలిలో ముల్లులా వేధించి వెంటాడి చంపుకు తినగా తినగా ( మరి అందరూ; ముక్కెంగా నాలాంటి నేలక్లాసు ప్రేక్షకుడు; తిర్పతి ఆంధ్రజ్యోతి ఆర్. ఎం. ఉమా లంతటి శక్తిమంతులు, ఓ పద్దతిగా ఉండేవాళ్లూ కాలేరుకదండి ) – – – పరాయోళ్ల కధల ఐద్రాబాదు సిన్న ఉమా ( జి. ఉమామహేశ్వర్ ) సిఫార్స్ చేసి సాయం పట్టగా – – – బాపుగారు వేసిన ముఖచిత్రం కల గజ ఈతరాలు పుస్తకం e-బుక్కుని కినిగే లో దొరికేలా చేసారు గొరుసన్న.
ఇప్పటికి దీంతో సర్దుకోండి సత్యోదయ్ గారు .
కాలం ఎప్పుడూ ఒకలా ఉండదంటగా. ఏవో గుర్రం ఎగిరినా ఎగరొచ్చంటగా. వోపికపడితే వచ్చే శతాబ్ధం నాటికైనా ” గజ ఈతరాలు ” కథల పుస్తకం ప్రింటు కాపీలు పాఠకులకు అందుబాటులోకి తెస్తాడు గొరుసన్న అని నా ప్రఘాడ విశ్వాసం.
http://kinige.com/book/Gaja+Eetaralu
పుస్తకం.నెట్ లో కాకుమాని శ్రీనివాసరావు గారి గజ ఈతరాలు – గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు పుస్తక సమీక్ష నుండి ( http://pustakam.net/?p=7251 )
“అది నేను, నా రక్తం, నా గడచిన జీవితపు ఛాయ” అంటాడు చలం తన రచనల గురించి చెబుతూ. గొరుసు జగదీశ్వరరెడ్డి కథలు చదువుతున్నప్పుడు ఇవే మాటలు గుర్తుకువస్తాయి. ఈ కథల్లో రచయిత ఆత్మీయతే కాదు, రక్తమాంసాలూ ఉన్నాయి. కథాశిల్పం పట్ల గొప్ప అవగాహన, నైపుణ్యం ఉన్న కథకుడు. మానవాళిపట్ల అపారమైన ప్రేమగలిగిన రచయిత గొరుసు.
తనకు చిన్నప్పటినుండీ తెలిసిన గజఈతరాలు పూర్ణమ్మ కాళ్ళకు తాళ్లతో బండరాయి కట్టుకొని బావిలోకి దూకి ఆత్మహత్య చేసుకోవటం విని గుండెలో ముల్లుగుచ్చుకొన్నట్లు అనుభవించిన విషాదాన్ని మనలో పలికించడానికి తన బాల్యాన్ని ఆలంబనం చేసుకొని గొప్ప పనితనంతో చెక్కిన కథాశిల్పం “గజ ఈతరాలు” ఎంతో కాలం గుర్తుండి పోతుంది.
కనుమరుగవుతున్న పల్లెలు, గల్లంతైన జీవితాలు మూటగట్టుకొని వలసకూలీలుగా మారిన పాలమూరు పేదలు – – – ప్రభుత్వరంగసంస్థల మూసివేత వెనకనున్న కుట్ర – – – కంపెనీ మూతపడటంతో జీవచ్చవాలుగా మారి రోడ్డునపడ్డ కూలీల, కార్మికుల ఆత్మఘోష – – – ప్రపంచీకరణ చేసిన గాయాలు – – – వ్యవస్థలో అమలవుతున్న దోపిడీ – – – ఉసుళ్ల వంటి మనుషులు ఆకలి మంటలోపడి జీవనార్పణ చేసుకునే విధ్వంసం; రకరకాల ఆకళ్ళతో నిండిన సమాజం అన్నెం పున్నెం ఎరుగని అడుక్కుతినే బాలికలను బలిచేయటం; వైద్యం ఖరీదైనవస్తువుగా మారిన సామాజిక సందర్భంలో పేదరోగుల జీవితాల్లోని ఆకలి తాండవాన్ని – – – సమాజంలోని “మంచి” యొక్క నిస్సహాయత లను దశాబ్దాల క్రితమే ఎలుగెత్తి చూపిన కథకుడు గొరుసు జగదీశ్వరరెడ్డి.
రచయిత పది అత్యుత్తమ కధల సంకలనం “గజ ఈతరాలు” లోని దాదాపు అన్ని కథల్లోను మానవజీవన వైఫల్యాలు, సరళీకృత ఆర్థిక విధానాలు వాటి పరిణామాలు చేసిన మానని గాయాలు కనిపిస్తాయి. కథలన్నీ చదివాక మనం ఏది కోల్పోయామో గుర్తుచేసుకుని హృదయం పెనుగులాడుతుంది. కథలనీ మనం పోగొట్టుకొన్న జీవన సౌందర్యాన్ని గురించి చెబుతూ, మళ్లీ దాన్ని అందుకోవాలన్న ఆశను కల్పిస్తూసాగడం వలన ఈ కథాసంకలనం అత్యుత్తమ సాహిత్య ప్రయోజనాన్ని సాధించగలిగింది.
గొప్ప కథ.. కదిలించే విశ్లేషణ.. గొరుశ్ర్శీధర్లకి నమోనమో..
శీనూ , నీది చోడవరం ఎటకారం కాకపోతే .. ఇంటిపేర్లు ముడేసినంత సులువుగా మనుషుల పేర్లు ముడేయటం కాదూ 🙂 పేర్లు ముడేయడం వరకైతే పర్లేదు .. పిలకలో, జుట్లో ముడేస్తేనే పేచీ మరి . తమరు తక్కువోరేటండీ, తిమ్మిని బొమ్మిని చేసీగల్రు , బొమ్మిని తిమ్మిని చేసీగల్రు 🙂
Sridher garu adbhuthamaina kathani.,meeru marintha adbhuthanga parichayam chesaru.naku chala ishtamaina katha gaja eetha ralu.apptlo ee katha chadivi edchesanu.abhinandanalu.
నమస్తే మేడం . ఈ కథ వచ్చినప్పుడు నాకు బాగా గుర్తుంది. శ్రీధర్, మీరు కలిసి నాతో “కొత్త ఏడాదికి మంచి గిఫ్ట్ ఇచ్చావు ” అన్నారు. స్పందించినందుకు ధన్యవాదాలు.
కెనడా లో ఈ కథ చదివి సినిమా తీస్తానని గొరుసు గారిని అనుమతి అడిగిన దర్శకులు ఇంద్రగంటిమోహనకృష్ణ గారు తీసివుంటే ఇలాంటి గొప్ప కథ జనబాహుళ్యం లోకి మరింతగా చేరువయ్యి ఉండేది. రెప్పలచాటున కన్నీటి ముసురును తేగల ఈకథలో హాస్యరసం కూడా ఉండటం కూడా విశేషం.
ప్రియమైన శ్రీ నెమలిదిన్నె రమణారెడ్డి గారూ !
మీ నోట్లో గుప్పెడు పందార బొయ్యాలి, ఇంతటి తియ్యని మాట చెప్పినందుకు.
గజయీతరాలు కథ చదివి సినిమా తియ్యాలనుకున్న ప్రస్థావన తీసుకొచ్చిన దర్శకులు ఇంద్రగంటి మోహనకృష్ణ గారిని గొరుసన్న ఆపి ఉండి ఉంటాడు “వద్దండి, మీ చేతులు కాలతాయేమో నండీ “ అంటూ. నేను ఊహించుకోగలను. ఆర్ట్ సినిమాలు చూడటం, వాటిని ఆ దర్శకుల ప్రతిభనీ తలుచుకోవటం లాంటి ఉత్తమ అభిరుచి ఉన్న గొరుసన్నకు వినయం వొందనాలతో ముడుచుకుపోవటం ఓ వీక్నెస్.
గొరుసన్నను పీడించి, పెద్దలు ఇంద్రగంటి శ్రీకాంత శర్మ గారితో మాట్లాడి ( కవి, పండితుడు, కథారచయిత, పత్రికా సంపాదకుడు ఎప్పుడు ఫోను చేసినా నాలాంటి దారేబొయ్యే దానయ్యకు కూడా ఎంతో వోరిమితో గురువర్యుడిలా ఎన్నో విషయాలు చెప్పే ఇంద్రగంటి శ్రీకాంత గారిని వినమ్రపూర్వకంగా అభ్యర్దించి ) మోహనకృష్ణ గారి ప్రతిపాదనను ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాలు చెయ్యమంటారా ?
( కాకుంటే మాయమ్మ గజయీతరాలు మీద సిల్మా మొదట ఏ బెంగాలీ బాసలోనో, ఏ మళయాళీ బాసలోనో వీలుంటే బ్లాక్ అండ్ వైట్ లో మార్కస్ బార్ట్లేలాంటోరిని కెమెరామెన్ గా పెట్టుకుని తీసి అవార్డ్లు తెచ్చుకున్నాక తెలుగులోకి డబ్బింగ్ చేస్తే మాలాంటోళ్లం ఆహా ఒహో అంటూ చూసేస్తాం )
~ ఇట్లు ఓ నేలక్లాసు ప్రేక్షకుడు / పాఠకుడు
( aka త్రిపుర గారి బెంగళూరు బెమ్మ రాచ్చసుడు )
ఒక గొప్ప కథకి చక్కటి విశ్లేషణ …….
థాంక్యూ మన్ ప్రీతం .
సత్యోదయ్ గారు! గొరుసు జగదీశ్వరరెడ్డి గారి ‘గజ ఈతరాలు’ కధల సంకలనం ప్రింటు కాపీ అజో విభో కందాళం ఫౌండేషన్ ( AVKF Books తెలుగు పుస్తక మణిహారం ) వారి వద్ద దొరికే అవకాశం ఉన్నట్లుంది. ప్రయత్నించి చూడండి.
https://www.avkf.org/BookLink/view_authors.php?cat_id=2306
కథల ప్రేమికుడు గొరుసు. కథా సాహిత్యం మీద అంత ఇష్టం ఉంది కనుకనే తను రాసిన ప్రతి కథనీ ఎంతో ఒబ్బిడిగా, ఒడుపుగా, తనదైన సొంపుతో రాస్తూ వచ్చాడు. తను రాసిన అన్ని కథలు నాకు ఇష్టమే అయినా.. అన్నిటికంటే ఒక ఎత్తు పైనే ఉంటుంది గజఈతరాలు. ఈ కథ చదివినవారు ఒక ప్రకంపనకి గురవుతారు. అదొక భూప్రకంపన వంటిది. సాధారణంగా భూమి కంపించిన అనుభవం ఎవరికైనా ఎదురైతే ఎప్పటికీ మరిచిపోరు. ఈ కథ కూడా అంతే! నేను ఎన్నో ఏళ్లక్రితం చదివినా ఇంకా పచ్చిగానే నాలో ముద్రపడి ఉంది ఈ కథ. గొరుసుకీ, ఈ కథని మళ్లీ పరిచయం చేసిన శ్రీధర్‌గారికీ అభినందనలు.
ఒమ్మీ .. పొగిడితే ఆయుక్షీణం అట. నువ్వు కలకాలం కళకళ లాడుతూ ఉండాలి గనక, బలవంతంగా నోరు కట్టేసు కుంటున్నా 🙂 ప్రేమతొ …
సమీక్ష చాలా బావుంది. కథాసారంతో పాటు సున్నితమైన అంశాలన్నీ స్పృశించారు శ్రీధర్ గారు. కథా రచయిత శ్రీ గొరుసు జగదీశ్వర్ రెడ్డిగారు జీవం తొణకిసలాడే తెలంగాణ మాండలీకంలో ఆర్తికలిగి ఆలోచింపజేసే కథలను రాశారు. వారు అంత సహజంగానూ ఉత్తరాంధ్ర మాండలీకంలో చక్కటి కథలను రాయడం విశేషం. శ్రీధర్ గారు ఒక మంచికథను అంతే ఆర్తితో సమీక్షించారు.
నిజమే రమణరావు గారు, శ్రీధర్ గారు కథ లోతుపాతుల్ని చక్కగా అవగాహన చేసుకున్నారు. ఒక రచనను పరిచయం చేయడం కూడా ఒక కళ. ఇక నా కథలపై మీ స్పందనకు హృదయపూర్వక ధన్యవాదాలు. నిజానికి నాకు తెలంగాణ మాండలీకం పై ఉండే సాధికారత ఉత్తరాంధ్ర భాష మీద లేదేమోనని ఒక బెరుకు నాలో ఉంది సార్. కథ మన నిత్య జీవితాన్ని కళాత్మకంగా చూపించే ఒక ప్రక్రియ. అలా చూపించడానికి నావంతు కృషి నేను చేశానంతే . కృతజ్ఞతలతో …
గొరుసు జగదీశ్వర్ రెడ్డిగారు సహజమైన ఉత్తరాంధ్ర మాండలీకంలో కూడా కొన్ని మంచి కథలను రాయడం విశేషం.
శ్రీధర్ గారి పరిచయ వాక్యాల్లో నాకు అర్థంకాని దొకటుంది. అది, “ఈ తెర వెనుక కుట్రను చాలా తక్కువ మంది కథకులే పట్టించుకున్నారు.” అన్నది. పరిశ్రమలు మూతపడడం వల్ల జరిగిన పరిణామాలు కథలో కనిపించాయి గానీ, ఈ కుట్ర ప్రస్తావనే కథలో గానీ మిగిలిన పరిచయ వాక్యాల్లో గానీ కనిపించలేదు. ఎవరి కుట్రవల్ల పరిశ్రమలు మూతపడ్డాయి? మూతపడ్డ పరిశ్రమలు ఏదో ఒక రంగానికే పరిమితం కాకపోవడం వల్ల ఇన్ని పరిశ్రమలు మూతపడడానికి కుట్ర ఎలా జరిగింది? కథలో ఆ ప్రసక్తి లేకపోవడం వల్ల పరిచయ వాక్యాల్లో కొద్దిగా విశదీకరిస్తే బావుండేది.
కథ అంతా తెర ముందరే ఉండడం వల్ల తెర వెనుక కుట్రని కథకుడు కూడా పట్టించుకోలేదని నాకు అనిపిస్తోంది – కుట్ర అన్న పదానికి నాకు తెలిసిన “మోసము. వంచన, కుత్సితపు ఆలోచన” అర్థాలు కాక వేరొక అర్థం ఉండివుంటే తప్ప.
శివకుమార్ తాటికొండగారికి,
ముందుగా మీ స్పందనకు ధన్యవాదాలు.
ఈ కథ దాదాపు 20 ఏళ్ల క్రితం రాసింది. అప్పటికి సాఫ్ట్‌వేర్ రంగం పుంజుకోలేదు. కేవలం ప్రభుత్వ రంగ సంస్థలు, వాటిపై ఆధారపడే లఘు పరిశ్రమలు తప్పించి ఇతరత్రా చాలా తక్కువ. ప్రపంచీకరణ ప్రవేశించే నాటికి తొలిగా వేటు పడ్డది ఆల్విన కంపెనీ పైనే. కాబట్టి మీరన్న తెర వెనక జరిగిన కుట్ర గురించి అప్పట్లో వార్తాపేపర్లు చదివే వారందరికీ ఆ నిజం తెలిసిందే! నిజానికి ‘గజ ఈతరాలు’ కథకంటే ముందు నేను ఆంధ్రప్రభ వారపత్రకలో ‘ఖాయిలా బతుకులు’ అనే కథ రాశాను. అందులో ప్రపంచీకరణతో పాటు, పరిశ్రమ తెరవెనక జరిగిన కుట్రల (ఒకటి అరా కాదు, వందలు) గురించి విపులంగా సమీక్షించాను. అయితే, అది చదివిన కొందరు కథలో ఆర్ధ్రత లోపించి, డాక్యుమెంటరీలా తయారైందన్నారు. దానివల్ల కేవలం పూదండలో దారంలా పరిశ్రమ మూసివేతవెనకున్న కుట్రను చూచాయిగా చెప్పి కథకే ఎక్కువ ప్రాధాన్యమివ్వడం జరిగింది ఇందులో. గమనిస్తే, చివర పేరాలో లక్ష్మి మాటల్లో ఆ కుట్ర వెనకున్న రహస్యం కొంత అవగతమవ్వాలి. నగరంలోకి ప్రవేశించిన ప్రపంచీకరణ చీకటి నీడలు క్రమేపీ పల్లెసీమకు ఎలా పాకాయో చెప్పే ప్రయత్నమే ‘గజ ఈతరాలు’ కథ. అందుకు నాకు తెలిసిన నేపథ్యాన్ని ఎంచుకుని, అసలు విషయాన్ని మమేకం చేయడం జరిగింది.
ఆ తర్వాత ‘బతుకు గోస’ అనే కథలో టెక్నిక్‌తో కంపెనీ దివాళా వెనకుండే పూర్తి అంశాలను ప్రస్థావించాను. అలాగే ‘చీడ’ అనే కథలో నగరంలోని కుటుంబాల్లో గ్లోబలైజేషన సృష్టించిన కలకలం వివరించే ప్రయత్నం చేశాను. కథను చదివి, మీ అభిప్రాయం పంచుకున్నందుకు మరోసారి కృతజ్ఞతలు చెబుతూ …
సారీ సర్, మీ ఇంటి పేరు తాడికొండ కు బదులు తాటికొండ అని ఉంది.
గొరుసు గారికి – మీ ప్రతిస్పందనకు ధన్యవాదాలు. ఇరవయ్యేళ్ల క్రితం పరిశ్రమల మూతల వెనుక కుట్రల సంగతి నాకు తెలియదు – అప్పటికి ఇండియా వదిలేసి చాలా కాల మయింది. హైస్కూలు కాలం దాటిన తరువాత నేను మళ్లీ తెలుగు కథలని శ్రధ్ధగా చదవడం మొదలుపెట్టింది ఈ శతాబ్దంలోనే అని చెప్పవచ్చు. అందుకని, ఈనాడు ఈ కథని కథగానే చదవడానికి అవకాశం కలిగింది. అందువల్ల నా పరిశీలన గానీ, వ్యాఖ్య గానీ పూర్తిగా కథకు సంబంధించినవే తప్ప నేపథ్యానికి సంబంధించినవి కావు. ఈ శతాబ్దం మొదలుపెట్టిన తరువాత వచ్చిన వార్షిక కథా సంకలనాల్లో ప్రపంచీకరణ దుష్ప్రభావాలని నేపథ్యంగా, కులవృత్తుల మీద కొట్టిన దెబ్బల గూర్చి, వలసల గూర్చి, సెజ్‌ల గూర్చి కథలు చదివాను. మీ ప్రతిస్పందనలో గూడా “ప్రపంచీకరణ ప్రవేశించేనాటికి తొలివేటు పడ్డది ఆల్విన్ కంపెనీ పైనే” అని వున్నది. శ్రీధర్ గారి పరిచయంలో “నిర్లక్ష్యానికి గురై” అని వున్నది. ఈ రెండు వర్ణనలకీ పొసగట్లేదన్నది నా వ్యాఖ్య. కంపెనీని నడిపే కన్నా దాన్ని మూసెయ్యడమే లాభకరం అని యాజమాన్యం నిర్ణయిస్తే అది సాధారణ వ్యాపారసూత్రాన్ని పాటించడమే తప్ప వేరొకటి కాదు గదా? అప్పుడది కుట్ర కిందకు రాదు. మీరు ఉటంకించిన కథలని నేను చదవలేదు. వాటిల్లో, ఈ యాజమాన్యాలు కంపెనీలని దోచేసి కార్మికుల నోళ్లల్లో మట్టి గొట్టారని సాక్ష్యాధారాలతో నిరూపించారేమో నాకు తెలియదు. అలా అయితే, అది తప్పనిసరిగా కుట్ర కిందే వస్తుందంటాను. శ్రీధర్ గారు పేర్కొన్న అన్ని కంపెనీల్లో అది జరగడం నిజంగా విచారకరం. మీరన్నట్లుగానే, కథలో “దొంగలు దొంగలు వూర్లు పంచక తిన్నట్లు ఎవడెవడు జతగట్టి దోస్కతినెనో…” అన్న వాక్య మున్నది. అలా దోచక తినడమే జరిగిందని మీరు పేర్కొన్న మిగతా కథల్లో ఉండివుంటే ఆ “కుట్ర” గూర్చిన నిర్ధారణ జరిగినట్లే. ఆ కథల పిడియెఫ్‌లు వుంటే పంపగలరు. నా ఈమెయిల్ అడ్రస్ అఫ్సర్ గారు మీకు ఇవ్వగలరు.
అలా కాక, ప్రపంచీకరణ యాజమాన్యాలచేత కంపెనీలని మూయించేలా చేసింది, “ఈ ప్రపంచీకరణే ఒక కుట్ర” – అని మీరు చెప్పదలచుకున్నారేమో నాకు తెలియదు. అలా చెప్పాలని మీరు అనుకోకపోవచ్చు కానీ, నేనిలా అనడానికి కారణం, ప్రపంచీకరణ నేపథ్యంలో నష్టపోయిన జీవితాల గూర్చి కథా వార్షిక సంకలనాల్లో కొంచెం ఎక్కువగా చూడడం. సమాజంలో ఏ పరిణామ మయినా అందరికీ ఒకేలా మేలు చెయ్యాలని ఎక్కడా నిబంధన లేదు. నిబంధనల చట్రంలో ఇమడకుండా ఈ పరిణామం నిరంతరం కొనసాగుతూనే వుంటుంది. ఇది కొత్త నీరు వచ్చి పాత నీరునీ, ఆటోమొబైల్ వచ్చి జట్కా బండినీ తోసెయ్యడం లాంటిది. అందుకని ఈ కోణం నించీ కూడా ఆలోచించానని చెప్పడానికే ఈ పేరా.
తాడికొండ శివకుమార్ గారికి, మీ వైపు నుండి మీ స్పందన నిజమే. బాధితుల్లో నేనూ ఒకడిని గనక రాయకుండా ఉండలేనితనం నాతో ఆ కథలు రాయించింది. మీ మెయిల్ కు ఆ కథలు పంపుతాను. ధన్యవాదాలు .
గొరుసు గారూ – మన చర్చ అంతా కథ గూర్చి గాక దానిలోని ఒక అంశం గూర్చిన వర్గీకరణ మీదే గదా! ఈ కథకి అస్తిత్వం పునాది కాబట్టి పాత్రలు తమకి తెలిసిన ప్రపంచంలోనే మసలుతాయి. అది సహజం. దానికి మీ అనుభవమే ఆలంబన కావడం కథకు అదృష్టమూ, మీకు రెండోదీను.
నేను పనిచేసిన మొదటి కంపెనీలో ఒకరోజున మేము లంచ్ చేస్తున్నప్పుడు అక్కడే వున్న వైస్ ప్రెసిడెంటుని ఒకతను రిసెషన్ కీ, డిప్రెషన్ కీ తేడా ఏమిటని అడిగాడు. అడిగింది 1991 అమెరికన్ కంపెనీలు ఉద్యోగులకి ఉద్వాసన చెబుతున్న గడ్డు రోజుల్లో, రిసెషన్ దేశంలో నడుస్తోంది అని ఎకానమిస్టులు నిర్ణయించిన తరువాత. ఆయన, నీ పక్కింటి ఉద్యోగం పోతే అది రిసెషన్, నీది పోతే అది డిప్రెషన్ అని జవాబిచ్చారు. ఆ జవాబుని నేనెన్నడూ మరచిపోలేను.
నిజమే … మీ వైస్ ప్రెసిడెంట్ జవాబు వెంటాడేదే సార్ 🙂
వర్ధమాన యువ సాహితీ కృషీవరులు – – – యీ వంశన్నలు ( డా. వంశీధర రెడ్డి ), యీ చందుతులసీలు, యీ చైతన్య పింగళి తల్లులు, రాయలసీమలోని మారుమూల దేవమాశ పల్లె బడుగు పుట్టాపెంచల్దాస్ లు, కళింగవీరులు బమ్మిడి జగదీశ్వరరావు, చింతకింది శ్రీనివాసరావులు, యీ ఇండ్ల చంద్రశేఖర్ లకు కానీ;
తననే తలుచుకుని మురిసిపొయ్యే త్రిపుర గారి సత్తెకాలపు రామడుగు రాధాకృష్ణమూర్తి నాయనకు కానీ, త్రిపుర గారి రమణజీవి బాబుకు, విరసం విశాఖ కృష్ణక్కకు కానీ, బెజవాడ పి. సత్యోతక్కయ్య, కాకినాడ అక్కయ్య వాడ్రేవు వీరలక్ష్మిదేవి, చెన్నై సోదరి రాయదుర్గం విజయలక్ష్మి, మహిత కధ సామాన్య లకు కానీ;
ఖమ్మం అమాయకులు సీతారాం, ప్రసేన్, వి.వి. రమణమూర్తులకు – – – అమాయక కవులు నామాడి శ్రీధర్, గాలి నాసర రెడ్డి, గాలిఅద్దం ఎమ్.ఎస్. నాయుడు లకు – – – త్రిపుర గారి మూలా సుబ్రతో, వాగ్మూలం కధ స్వాతి తల్లులకు, రిషీ వ్యాలీ రాధా మండువలకు, కర్నూలు సాహితీ పెద్దలు ఇంద్రకంటి వెంకటేశ్వర్లు లకు కానీ;
తన సొంతవాళ్లు అన్నట్లు ఫీలయ్యే ఆ రాజీ – పూడూరి రాజిరెడ్డిలకు, త్రిపుర గారి భగవంతాలకు, తిర్పతి జ్యోతిపేపరాయన ఆర్.ఎం. ఉమాలకు, పరాయోళ్లు కధల సిన్న ఉమా లకు కానీ;
విరసం నేత వరవరరావు, ఎన్.వేణు గోపాల్, పర్స్పెక్టివ్ పబ్లికేషన్స్ ఆర్కె అన్న , జి.ఎస్. రామ్మోహన్, శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర రావు, చరితా ప్రింటర్స్ సుబ్బయ్యన్నలకు కానీ;
ఇంకా సాహిత్యాన్ని సరస్పతి తల్లి ప్రసాదంగా భావించి కళ్లకద్దుకునే సాధారణ పాఠకులకు కానీ, ఆ క్యూ వరసలో సివరాఖరన నిలుచున్న నాలాంటి ఓ నేలక్లాసు పాఠకుడికి కానీ;
మా యమ్మ గజయీతరాలు పాదాలు చూసి కన్నీళ్లు పెట్టుకునే అవుకాశం “గజయీతరాలు” కధల పుస్తకం దయచెయ్యటం ద్వారా ఇవ్వటం లేదంటే ( రీప్రింటు పుస్తకం ఇవ్వటానికి మనసొప్పకపొయ్యినా, కనీసం జిరాక్స్ కాపీ అయినా ఇవ్వటం లేదంటే ) – – – అదే దేశం కాని దేశంలో, అమిరికాలో ఉన్న ప్రియమైన శ్రీ తాడికొండ శివకుమార్ గారికి ఇవ్వటానికి గొరుసన్నకు మనసు కరుగుతున్నదంటే అదే కుట్ర కింద వొస్తుందో క్లియర్ కట్ క్లారిటీ కోసం గొరుసన్న గారి రాచకొండ బాబుని, కారా మాస్టారుని అడుగుతాను.
~ ఇట్లు, గొరుసన్న గారి తంపులమారి రావయ్య
రామయ్యగారూ, మీరు పైన ప్రస్తావించిన రచయితల, ఇంకా మీరు ప్రస్తావించని వేలాది మంది రచయితలకు తమ రచనలపట్లవున్న అంకితభావం, అనుభవం, సహానుభూతి, ప్రజ్ఞ, రచనా నైపుణ్యం పట్ల నాకు నూటికి నూరు పాళ్లు గౌరవంవున్నది. వాటిలో శకల అవగాహనలు వుండవచ్చు, లేదా విహంగ వీక్షణ అవగాహనలు కూడా వుండవచ్చు. ఇవన్నీ కలసి గత 70 ఏళ్లుగా (కాలరేఖలో అక్కడకి మాత్రమే గీత గీసాను.) తెలుగు యువత, ప్రజలలో ఏ మేరకు వారు ఆశించిన మార్పు (లేదా కనీసం 10 శాతం అయినా) తీసుకువచ్చాయో మీకేమైనా అవగాహన వున్నదా? లేకపోతే, కేవలం కళకు పరమార్థం కళ మాత్రమేనా? ఆ రచనలు చదివిన పాఠకులు తెలుగు జనాభాలో ఎంతమంది వుండివుంటారు? లేదా, ఇంకా ముందు తరాలకి మార్గదర్శకంగా వుండేవిధంగానే మిగిలిపోతాయంటారా? నేర ప్రవృత్తి, వికృత మనస్తత్వం, మూఢభక్తి, లంచగొండితనం, స్వీయకేంద్ర, ప్రయోజన ధోరణి మరింత ్ప్రబలినాయి కదా, మరి, ఈ రచనల ప్రభావం అణుమాత్రమూ లేదంటారా? లేదా, వీటన్నింటినీ మ్రింగేస్తూ తన మహాప్రవాహంలో లాక్కెళ్లిపోతున్న వ్యవస్థకు మూలం ఎక్కడుంది? ఆ మహారాక్షసిని ప్రభావితం చేసే చర్యలు ఏం తీసుకోవాలి? (సాహిత్యపరంగా)
ఇంకో విచిత్రమేమంటే వీరి రచనలు గాకుండా, కుల, మత, వర్గ, అస్తిత్వ, భావజాల పోరాటాల పేరుమీద వచ్చే విద్వేష రచనల ప్రభావం అతి తీవ్రంగా సమాజంపైన కనిపిస్తోంది. మీరు ఆయా విద్వేష రచయితల ఫేస్ బుక్ పేజీలు మీరు గమనిస్తే హేయ విద్వేష భావజాల మురుగు కంపు కొడుతూవుంటాయి. దురదృష్టం ఏమంటే అదంతా అస్తిత్వ పోరాటాలుగా ప్రచారం కావడం.
మరి, లోపం మనలోనే వున్నట్లయితే ఎక్కడుంది?
ప్రియమైన శ్రీనివాసుడు గారూ!
జీవనపర్యంతం అంకితభావంతో, అదో యజ్నంలాగానో, ఉద్యమం లాగానో సాహితీ సేవలందించిన నాటి, నేటి తరం పెద్దలందరికీ పేరుపేరునా నమస్కరిస్తూ . . .
వారి కృషివల్ల ప్రజలలో ఏ మేరకు వారు ఆశించిన మార్పు తీసుకువచ్చాయో ? అనే మీ మౌలిక ప్రశ్నకు ఓ సామాజిక ఆత్మ విమర్శ, సింహావలోకనం చేసుకోవాల్సిన అవసరం ఉన్నదనుకుంటా ( అదెప్పుడూ అనేకవిధాలుగా జరుగుతూనే ఉన్నదని నమ్ముతూ ). కాదనను. కానీ ఆ పెద్దల శ్రమ పూర్తిగా వృధా అయ్యిందనుకోవాలన్నా మనసొప్పటం లేదు.
రచయితలారా మీరు ఎటువైపు? అని ప్రశ్నిస్తున్న విద్యార్ధులు, యువత కాలం నాడైనా, యీనాడైనా ఉన్నారని నా విశ్వాసం.
“విద్వేష రచనల ప్రభావం తీవ్రంగా సమాజంపైన కనిపిస్తూ – – – నేర ప్రవృత్తి, వికృత మనస్తత్వం, మూఢభక్తి, లంచగొండితనం, స్వీయకేంద్ర, ప్రయోజన ధోరణి మరింతగా ప్రబలటాన్ని “ . . . అవును అడ్డుకోవాలి సాహిత్యం ద్వారా, సామాజిక సామూహిక పోరాటాల ద్వారా.
ఇంగ్లీష్ మీడియం కాన్వెంట్లు ఇస్తున్న మమ్మీ డాడీ కల్చర్ . . . విజనీర్లు డాకటేర్ల కాలేజీ సీట్ల పరుగుపందాలకు ఉపయోగపడుతున్న కార్పొరేట్ కాలేజీలు . . . మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్లు, చిన్న పిల్లల దగ్గర ఉండీ అందరికీ సులభంగా అందుబాటులో ఉన్న అశ్లీల దృస్యాల దుష్ప్రభావం, వ్యక్తిత్వ వికాసం అనేది బతుకు తెరువుకు పనికిరాని టైం వేస్ట్ పని అని తల్లిదండ్రులు నమ్మేలా చేస్తున్న పోటీ పరుగుల బతుకుల గురించి కూడా ఆలోచించాలనుకుంటా.
త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు భమిడిపాటి జగన్నాధ రావు గారిని పలకరించటానికని ( ఆఫీసు పనిమీదే ) వెళ్లి నాగపూర్ లోని ఆ వర్గం వారి కేంద్రానికి వెళ్లి నేనిలాంటి వాడిని, చూడటానికి మీ ముంగిట్లోకి రానిస్తారా అని అడిగితే మీలాంటి ఓ స్నేహ హస్తం సాదరంగా నన్ను లోనికి ఆహ్వానించింది – మనం కుడి, ఎడమలమై ప్రయాణిస్తున్నా మనందరి ధ్యేయం ఒకటే . . . సర్వ మానవ సమానత్యం, సకల జనుల సౌభాగ్యం అంటూ.
అలాంటి మేధో మధనానికి మీలాంటి మిత్రులు ఎంతో ఉపయోగపడతారు. నేను ఓ నేలక్లాసు వోడిని. కట్ అండ్ పేస్ట్ లు మాత్రమే తెలిసిన వాడిని.
Katha Manchigundi sir. Katha gurinchi telvani vallu sridhar sir vishleshana chuste kathanu kachitanga chadavaalane interest vastundi. Nenu 29.12.2018 rojuna evng gaja eetharalu katha chaduvuthunte net connection poindi. Thellavarujamuna 3gantalaku lesi ee katha chadivaanu sir. Antha baagaa vundi
ధన్యవాదాలు.
” కధ మంచిగుంది సార్. కధ గురించి తెల్వని వాళ్లు శ్రీధర్ సార్ విశ్లేషణ చూస్తే కధను కచ్చితంగా చదవాలనే ఇంటరెస్ట్ వస్తుంది.
నేను 29-12-2018 రోజున ఈవినింగ్ “గజ ఈతరాలు” కధ చదువుతుంటే నెట్ కనెక్షన్ పోయింది. తెల్లవారు ఝామున మూడు గంటలకు లేసి యీ కధ చదివాను సార్. అంత బాగా వుంది ”
~ నకీర్తి శ్యామల
“గజ ఈతరాలు” కథ విశ్లేషణపై స్పందించిన సాహితీ మిత్రులందరికీ ధన్యవాదాలు. నిజానికి “గజ ఈతరాలు” కథతో పాటు ప్రపంచీకరణ నేపథ్యంగా వెలువడిన అన్ని కథలపై ఆరోగ్యకరమైన చర్చ జరగాల్సి ఉన్నది. ఇంత మంచి చర్చ జరిగిందంటే దాని గొప్పదనం కథది, ఆ కథా రచయిత గొరుసు గారిది. ప్రచురించిన సారంగకు, గొరుసుకు, సహృదయ విమర్శకులకు మరో సారి కృతజ్ఞాతలు…
గ్రేట్ గొరుసు గారూ.
ధన్యవాదాలు అనిల్ గారు.
గొరుసు గారి గజ ఈతరాలు కథ గుండెలను ఒరుసుకుంటూ సాగుతుంది. ఇది అనుభవం, వాస్తవంల మేలి కలబోతలకు రూపమా..కల్పనలో ఇంత జీవమెక్కడిది..
నర్సన్ గారూ .. ధన్యవాదాలు. మీరన్నది నిజమే. కల్పనకు అంత జీవమెక్కడిది. తట్టు తగిలినప్పుడు వచ్చే ఆక్రందనకు, తట్టు తగిలినట్టు ఊహించి చేసే ఆక్రందనకు మధ్య తేడా కనిపెట్టారు మీరు. (తట్టు అంటే మీకు తెలియదనుకోను – నడుస్తున్నప్పుడో , పరిగెడుతున్నప్పుడో అనుకోకుండా దారిలోని రాయి మన కాలి వేళ్ళకు తగలి రక్తం రావడం)