ఆత్మను శుభ్రపరచే వసుధారాణి కవిత్వం

విజయవాడలో జరిగిన “కేవలం నువ్వే” పుస్తకావిష్కరణ సభలో వాడ్రేవు చిన వీరభద్రుడు గారు వసుధారాణి గారి కవిత్వాన్ని టాగోర్, గోథే, జిబ్రాన్, నీషే, రూమీ లాంటి మహామహుల కవిత్వాలతో పోల్చుతూ సారూప్యాలను వివరించారు. ఆ ప్రసంగ పాఠాన్ని వారు క్లుప్తీకరించి ఫేస్ బుక్ లో పెట్టినపుడు ఒకాయన “మీరు అతిగా పొగిడారు” అని కామెంట్ చేసారు. అక్కడ నేను “సార్ అది అతిగా పొగడటం కాదు, భద్రుడు గారు ఇలాంటి పుస్తకాలను ఎలా పరిచయం చేయాలో ఒక నమూనాను ఇస్తున్నారు” అని బదులిచ్చాను.

అక్కడ నేను “నమూనా” అన్న మాట ఎందుకు వాడానంటే – ఈ పుస్తకంలోని కవిత్వం ప్రత్యేకమైనది. మామూలుగా అందరూ రాసే వస్త్వాశ్రయ, ఆత్మాశ్రయ కవిత్వం లాంటిది కాదు. అంతకు మించినది ఏదో ఉంటుంది ఇలాంటి కవిత్వంలో. దాదాపు ఇదే తరహా కవిత్వంతో మూడేళ్లక్రితం మోదుగు శ్రీసుధ గారి “అమోహం” సంపుటి వచ్చింది. దానిపై పరిచయవ్యాసం రాయాలని మూడ్నాలుగు సార్లు ప్రయత్నించి విఫలమయ్యాను నేను. అదే విధంగా భద్రుడి గారి “నీటిరంగుల చిత్రం” పై కూడా.

ఇంతెందుకు చెపుతున్నానంటే- ఇలాంటి కవిత్వాన్ని చదవటం మంచి అనుభవం. గొప్ప ఆత్మానుభూతి కలుగుతుంది.   కానీ చదివిన దానిపై నాలుగు వాక్యాలు రాయటం చాలా కష్టం. ఒక్కో మూడ్ లో ఒక్కో అర్ధాన్ని ఇస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్ధమౌతాయి. హృదయానుభూతిని అక్షరాలలో పెట్టటం చాలా కష్టం. ఉదాహరణకు ఒక కవితను చూద్దాం

నేను నీకు ఒక పూలమాలని అర్పించి పొంగిపోయాను

నీవు నాకోసం పూల తోటనే సృష్టించావు

అడవిపూలతో సుగంధం నింపి పంపావు నాకొరకై

నీవు నా సత్కారాలకై చూస్తావని అనుకోవటం నా అవివేకమంటావా?

నాకోసం ఇంత ఇచ్చిన నీకు మనసైనా అర్పించనీ

ఇవ్వటం నీకేనా? నాకూ తెలుసు

పై వాక్యాలలో నీవు అన్నమాటలో ఎవరున్నారు?

నేను నమ్మే కొత్తలంక బాబా గారా? కావొచ్చు. ఇంతచక్కని జీవితాన్ని, కుటుంబాన్ని, మీలాంటి సజ్జన సాంగత్యాన్ని నాకు ఇచ్చినందుకు.

నా భార్యా? కావొచ్చు. నేను ఆమె మెడలో పూలమాల మాత్రమే వేసాను. నాజీవితాన్ని పూలతోటగా మార్చిందామె.

ఈ సమాజమా? కావొచ్చు. నేనీ సమాజానికి ఇస్తున్నదల్లా “పాఠాలు చెప్పటమే”. కానీ ఈ సమాజం నాకు తిండి బట్ట, సంతోషాల్ని, భద్రతను ఇస్తోంది. నా జీవనాన్ని సంపూర్ణం చేస్తోందీ సమాజం

ఈ ప్రకృతా? కావొచ్చు. పై కవితలో వాచ్యార్ధం తీసుకొంటే అంతే అవుతుంది. ఏ సభలోనో ఎవరో వేసిన ఓ పూలమాలను నా పెరట్లో ఏ చెట్టుకొమ్మకో వేలాడదీసాను అనుకొందాం కాసేపు. అది కొన్నాళ్లకు వాడి ఎండి దానిలోని పూల విత్తనాలు వెదజల్లబడి మొలకెత్తి పూలతోట ఏర్పడవచ్చు. నేను వేసిన మాలను ఈ నేల తీసుకొని సుగంధాలు వెదచల్లే పూలతోటగా తిరిగి అందించింది అని అనుకోవచ్చు.

ఇన్ని అర్ధాలు ధ్వనించే కవితను ఒక బావంలోకో, ఒక చట్రంలోకో కుదించటం అన్యాయమౌతుంది. ఆ అనుభూతిని ఎవరికి వారు అనుభవించాల్సిందే. ఎవరికి వారు అర్ధాలు చెప్పుకోవలసిందే. ఇలాంటి కవిత్వాన్ని సమీక్షకుడు ఎంత గొప్పగా పరిచయం చేసినా అది విఫలయత్నమే అవుతుంది తప్ప సంపూర్ణ దర్శనం కాబోదు. భద్రుడుగారి ప్రసంగాన్ని ఒక నమూనా అన్నది అందుకే. ఇపుడు నేను చూపించేది కూడా ఒక దృక్కోణమే.

***

వియోగం లేదా ఎడబాటు అనేది మానవులనందరినీ నిత్యం జ్వలింపచేస్తూ ముందుకు నడిపించే చోదకశక్తి. ఆ శక్తే లేకపోతే అందరు జఢులమై ఎక్కడ ఉన్నవాళ్ళం అక్కడే ఉండిపోతాం. ఈ వియోగం భారం అనేది మనకు బయటా, లోపలా కూడా ఉంటుంది. బయట ఉండే వియోగ భారం మనకు ఇష్టమైన వస్తువుల్ని, ఆస్తుల్ని, హోదాలను సంపాదించుకోవటానికి ప్రేరేపిస్తుంది. బాహ్యమైన వస్తువులపట్ల వియోగభారం అశాశ్వతం. ఒకసారి కారు కొనేసాకా ఇక కారు కి సంబంధించిన   వియోగభారం ఉండదు.

లోపల ఉండే వియోగ భారాన్ని ఒదిలించుకోవటం దానినుంచి తేలిక పడటం అంత సులువుకాదు. ఒక్కోసారి ఏది మనకు వియోగ భారాన్ని కలిగిస్తుందో కనుక్కోవటం కూడా కష్టం. అది దైవమా, సహచరుడా, సాటిమనిషా, ప్రకృతా, మానవోద్వేగాలా లేక ఇవన్నీ కలగలిపా అనేది కూడా గుర్తించలేం మనం. అయినా ఏదో తెలియని మోయలేని వియోగభారం హృదయాన్ని నిలువనీయదు. ఈ భారం నుంచి విముక్తమవ్వటం కొరకు లోలోపల ఒక యుద్ధమే జరుతుంది. ఆ యుద్ధాన్ని జయించే క్రమంలో ఇదిగో ఇలా “కేవలం నువ్వే” లాంటి కవిత్వం పుడుతుంది. ఒక రవీంద్రనాథ్ టాగోర్ గీతాంజలి పుడుతుంది. ఒక ఖలీల్ జిబ్రాన్ ప్రొఫెట్ పుడుతుంది. ఒక జలాలుద్దీన్ రూమీ మస్నావి పుడుతుంది.

ఇలాంటి కవిత్వాలను వస్త్వాశ్రయమా, ఆత్మాశ్రయమా, సమాజాశ్రయమా అని తర్కించుకోవటం అనవసరం. ఇలాంటి కవిత్వం పూర్తిగా ఆత్మగతమైనవి. వియోగభారాన్ని మోస్తున్న ఒక మనిషి ఆత్మను ఆవిష్కరిస్తాయి. ఆత్మను ఆవిష్కరించటానికి సాహిత్యం వినా మరోమార్గం లేదు మానవజాతికి. భక్తి గీతాలు, సూఫీ కవిత్వం, జెన్ కథలు ఆ పని చేసాయి.

ఈ రోజు రూమీ కవిత్వం ప్రపంచవ్యాప్తంగా విశేషమైన ఆదరణ పొందుతోంది. ఎందుకంటే మానవోద్వేగాలైన ఆనందం, స్వేచ్ఛ, దైవం, స్నేహం, దుఃఖం, మంచి చెడు, సౌందర్యంపట్ల వివశత్వం, పశ్చాత్తాపం, కరుణా లాంటి సామాన్య మానవుల వియోగబారాలన్నింటికీ   “ప్రేమ”   అనే ఒక నిర్ధిష్ట రూపాన్ని ఇచ్చాడు రూమీ. ఈ లౌకిక బంధనాలనుంచి ఆత్మను శుభ్రం చేసుకోవటం, మనల్ని అర్పించుకోవటం, అహాన్ని చంపుకోవటం ద్వారా మాత్రమే   “ప్రేమ”   లో ఐక్యం అవగలమని రూమీ తన కవిత్వంద్వారా చెప్పాడు. ఫై లక్షణాలన్నీ వసుధారాణి కవిత్వంలో కనిపిస్తాయి.

***

కేవలం నువ్వే సంపుటిలోని కవితలలోని వ్యక్తీకరణ విధానాన్ని, శిల్పరీతుల్ని అయిదు కోణాలలో విశ్లేషించుకోవచ్చు. అవి

  1. కవి గొంతుక: నేను నువ్వు అనే రెండు మాటలతో మొత్తం కవితను అంతా నడిపించటం చాలా చోట్ల గమనిస్తాం. ఆ కవితలలో కనిపించే “నేను” ఎవరు కవా? ఒక సమూహమా? ఒక జాతా? అని తరచిచూస్తే అది కవి స్వీయగొంతుక అని అర్ధమౌతుంది. చాలా చోట్ల అది స్త్రీ స్వరమే కూడా. ముందుగా అనుకొన్నట్లు నేను అనేది కవి అయితే నువ్వు మాత్రం అనిర్ధిష్టం.

 

నా రోదనతో నిన్ను మొరలిడాను, నావేదన తీర్చావు

నా వాంఛల్ని నీకు విన్నవించాను, నా కోర్కెలని తీర్చావు

నా మౌనాన్ని నీకు నివేదించాను, నన్నే స్వీకరించావు

ఈ బుద్ది నాకు మొదట కలిగింది కాదేమి?

 “మౌనం నువ్వు సాధన చేయాల్సిన కళ” అంటాడు రూమీ. పై కవితలో “నీవు నన్నే స్వీకరించావు” అనటం కైవల్యాన్ని సూచిస్తుంది. అంటే రూమీ చెప్పిన మౌనాన్ని వసుధారాణి గారు కొంచెం ముందుకు తీసుకువెళ్ళి భారతీయ భక్తిసంప్రదాయంలోని కైవల్యంతో ముడిపెట్టారు.   ఇవి కవి పలుకుతున్న మాటలు.

 నువ్వు నా జీవితంలోకి

వచ్చాకా నా జీవితాదర్శమే

మారిపోయింది

ఇప్పటిదాకా నాకోసం నేను

ఇప్పటినుంచి నీకోసం నేను.  

పై వాక్యాలలో మనల్ని మనం మరొకరికి నిర్నిబంధంగా అర్పించుకోవటం అనే లక్షణం గమనించవచ్చు. ఇది కవి హృదయపు లోతుల్లోంచి పలుకుతోన్న స్వరం.

  1. కథనాత్మక శైలి: కథనాత్మక శైలి పఠితల్ని ఆకర్షిస్తుంది. చెపుతున్న సంఘటననో దృశ్యాన్నో మనో ఫలకంపై చిత్రించుకోవటం ద్వారా చక్కని అనుభూతిని కలిగిస్తుంది. మొత్తం సంపుటిలో నాలుగైదు కవితలు మాత్రమే కథనాత్మకశైలిలో ఉండటం గమనించవచ్చు. ఉన్నవి కూడా ఆ శైలిలో తప్ప వేరేరకంగా చెప్పనలవికానివే కావటం గమనార్హం.

 నిన్నటి ప్రదోష కాల పూజలో దోషం ఏదైనా చేశానా?

ఈరోజు సుప్రభాత వేళకి నీ మోము చిన్నబుచ్చుకుంది

మరీ వేడి పదార్ధాలు, తొందరలో నివేదించానా?

నాసాగ్రం ఎర్రబడి, చుబుకం కందివుంది.

నీకిచ్చిన కర్పూరతాంబూలం తీసుకెళ్లి దేవేరికి సమర్పించావా?

ఎర్రగా ఉండాల్సిన నీ పెదాలు మామూలుగా ఉన్నాయి.

రోజూ నే చేసే సపర్యలన్నిటికి నిజంగా నీ ప్రతిచర్య ఉంటుందా?

ఇవన్నీ నా భావనలేనా ఐతే

ఇంత వింత భావనలతో నను పుట్టించినది నీవే కదూ? విచ్చిన నీ పెదవుల దరహాసం

నా కథని మళ్ళీ మొదటికి తెస్తోంది.

చక్కని ఊహ. పై కవితలో ఒక భక్తురాలు భగవంతునితో సంభాషిస్తోంది. నేనిచ్చిన తాంబూలాన్ని సేవించావా లేక పట్టికెళ్ళి అమ్మవారికి ఇచ్చావా అని అడగటంలో – ప్రేమకన్నా భగవంతునిపై భక్తునికి ఉండే హక్కు ధ్వనిస్తుంది. నా పూజలలో ఉన్న లోపాలేమైనా ఉంటే అది నీ సృష్టిలోని లోపాలే అని భగవంతుడినే తిరిగి నిందించటం కూడా ఇలాంటిదే. ఇవన్నీ భక్తిసారం లోతుల్ని తరచిచూసినవాళ్లు మాత్రమే రాయగలిగే వాక్యాలు. ఈ భావాలను చెప్పటానికి కథనాత్మక శైలిని ఎంచుకోవటం కవి ప్రతిభ.

  1. అలంకారాలు: కవిత్వాన్ని అలంకారయుతంగా చెప్పటం ఒక పద్దతి, ఏ అలంకారాలూ లేకుండా చెప్పటం మరొక పద్దతి. రెండవ పద్దతిలో బలమైన ఊహలేకపోతే ఉత్తవచనంగా మిగిలిపోతుంది. ఈ పుస్తకంలో కొన్ని కవితలు నిరలంకారంగా ఉన్నాయి. మిగిలిన చోట్ల పారడాక్స్/విరోధాభాస అలంకారాన్ని విరివిగా వాడుకోవటం గమనించవచ్చు. ఉపమ, రూపకాలు చాలా అరుదుగా కనిపించాయి.

పరస్పరవ్యతిరేక అర్ధాలు కలిగిన రెండు భావాల్ని కలిపి చెప్పటాన్ని పారడాక్స్ అంటారు. గీతాంజలిలో, రూమీ వాక్యాలలో, భగవద్గీతలో పారడాక్స్ వ్యక్తీకరణలను అనేకం చూడవచ్చు. మిస్టిక్ కవిత్వ ప్రధానలక్షణం పారడాక్స్.

ఈ పుస్తకంలో కొన్ని పారడాక్సికల్ వ్యక్తీకరణలు

అమితమైన ఆనందాన్ని ఇచ్చేది

అంతులేని దుఃఖాన్ని కూడా ఇస్తుంది. (29)

 

గాయమూ

లేపనమూ

రెండూ నువ్వే (12)

ప్రేమికుడొక

స్వేచ్ఛాయుత బంధీ (19)

 

నీకూ నాకూ మధ్య

వారధి ఏమిటంటే

దుఃఖం

నిన్ను నన్నూ విడదీసేది

సుఖం

చిత్రంగా నీతో నా మొరలన్నీ

సుఖం కోసమే (51) ఇదొక గడుసైన విరోధాభాస. నిన్నూ నన్నూ కలిపేది దుఃఖం అనటం ఒకె. నిన్ను నన్ను విడదీసేది సుఖం అనటం కూడా ఒకె. నా మొరలన్నీ సుఖం కోసమే అనటం అంటే విడదీయటం కోసమనా? మరో మెట్టుకు వెళ్ళి ఆలోచిస్తే మనమందరం సుఖాలకోసం ఈశ్వరునికి మొరపెట్టుకోవటం వల్ల ఆయనకు మరింత దూరమౌతున్నాము అన్న సూచన అనన్యమైన ఆలోచన.

 

కళ్ళువిప్పుకుని

మెళకువగానే

ఉన్నాననుకున్నాను

అది నిద్రావస్థ అని

నువ్వు జాగృతం

చేసినాక కానీ

తెలిసింది కాదు. (50) (ఇక్కడ మెళకువ, నిద్రావస్థ, జాగృతం పదాల ప్రయోగం చాలా ఔచిత్యవంతంగా ఉంది)

చక్కని అందమైన ఊహాచిత్రాలు ఈ సంపుటిలో అనేకం ఉన్నాయి

ఆవిర్భావం, అంతం లేని

ప్రవాహంలో

ఆ గడ్డిపువ్వూ, ఆ కొండా

ఆ పాలపిట్టా, నేనూ

అందరం కొట్టుకు పోతున్నాం (67)

 

సంతోషం దుఃఖం

కోపం విచారం

ప్రేమ ద్వేషం

అన్నీ మనసు

ఊదుకొనే గాలిబుడగలే (9) లాంటి ఊహాచిత్రాలు కవికి కల కల్పనా చాతుర్యము, వాటిని అక్షరాల్లో పెట్టగలిగే ఒడుపు ఉన్నతస్థాయివని నిరూపిస్తాయి.

 

నాకున్న నైపుణ్యం ఒక్కటే

నువ్వు ఉన్నావని తెలుసుకోవటం

నాకు ఇప్పటికీ చేతకానిది ఒక్కటే

ఎక్కడున్నావో తెలుసుకోలేకపోవటం (70) ఇది నిరలంకార కవిత. దేవుడున్నాడని నమ్మేవాళ్ళలో కూడా అతను ఎక్కడున్నాడో చెప్పలేకపోవటం ఒక వైరుధ్యం. ఒక్కొక్కరిది ఒక్కొక్క భాష్యం. ప్రతి సామాన్యుడు నిత్యం ఎదుర్కొనే ఈ సార్వజనీన సత్యం వలన పైవాక్యాలలో ఏ రకమైన అలంకారాలు లేకపోయిన లోతైన కవితగా రూపుదిద్దుకొంది.

  1. ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు: మన జీవితాలను నడిపించే ఒక శక్తిని దైవమని నమ్మి అలాంటి దైవంపట్ల చింతన కలిగిఉండటమే ఆధ్యాత్మికత. ఈ సంపుటిలో అనేక కవితలలో జీవితానికి చేసిన ఆధ్యాత్మిక వ్యాఖ్యానాలు కనిపిస్తాయి.

నీవున్నావనే ఆధారాలతో కొందరు

నీవు లేవనే నిరూపణలతో కొందరు

మొత్తం మీద నీ స్మరణలోనే అందరూ (18) ఇదొకరకమైన నిందాస్తుతి అనుకోవచ్చు.

 

అద్భుతాలని

ఎరగా వేసి జీవితంపై

ఆశలు పెంచుతావు

ఇంతలోకే ఉదాసీనత

పెంచే కష్టం చూపి

జీవితం ఇదేనా అనిపిస్తావు. (10) మనమందరం భగవంతుడు ఆడించే బొమ్మలమనీ, ఇదంతా ఆయన లీలా వినోదమనీ చిన్నచిన్న వాక్యాలలో పొదిగారు.

 జీవిత సూక్తులు: ఈ తరహా కవిత్వంలో జీవితసూక్తులు ఉంటాయి. ఉత్తమజీవనం ఎలాసాగించవచ్చో సూచనలుంటాయి. ఇవన్నీ జీవితాన్ని దీప్తిమంతం చేసుకోవటానికి సహాయపడతాయి.

నీకో శత్రువుండాలి

లేకుంటే నీ జీవితానికి

లక్ష్యం లేదు

నీకో మిత్రుడుండాలి

లేకుంటే నీ సంతోషానికి

అర్ధం లేదు

నీవు అజాత శత్రువువే ఐనా

అంతర్గత శత్రువుని గుర్తించు   (6)

 

స్వర్గానికి దారెటు అని

నరకంలో ఉన్నవాడిని ప్రశ్నించకు (58)

 

పగ తెచ్చిపెట్టుకొనేది

అందుకు బోలెడు కారణాలు

మరి ప్రేమో

కారణం లేకుండానే కలిగేది. (44)

***

నేను అనే భావనలో మనందరం కూరుకుపోయి ఉంటాం. అంతసులభంగా ఆ ఊబిలోంచి బయటపడలేం. కనీసం ఈ పుస్తకాన్ని చదువుతున్నంతసేపైనా మనం ఆ బంధనాల్లోంచి బయటపడతాం. కనీసం ఆ కాసేపైనా మనల్ని మనం మనకు ప్రియమైనవారికి అర్పించుకొంటాం. కనీసం ఆ కాసేపైనా మనం తేలికపడతాం. కనీసం ఆ కాసేపైనా మన ఆత్మ శుభ్రపడుతుంది. ఇరవయ్యొకటో శతాబ్దంలో ప్రపంచవ్యాప్తంగా ఈ తరహా కవిత్వం ఒక ఫీనిక్స్ పక్షిలా పైకి లేవటానికి కారణం ఆత్మని శుభ్రపరచుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరికీ కలగటమే.

ఈ తరహా కవిత్వం ఏకాలంలోనైనా, ఏ దేశానికి చెందినదైనా ఇలాగే ఉంటుంది. “కేవలం నువ్వే” పుస్తకాన్ని ఆ పరంపరకు కొనసాగింపుగా, ఈ తరంలో పలుకుతున్న వాళ్లందరి ఉమ్మడి స్వరంగా చూడాలి. ప్రతీ తరంలోనూ ఎవరో ఒకరు గానాన్ని కొనసాగిస్తారు.   ఆ బావజాలపు మాధుర్యాన్ని నేటి తరానికి అందించినందుకు వసుధారాణిగారిని మనం అభినందిద్దాం.
ఈ పుస్తకానికి డా. వాడ్రేవు వీరలక్ష్మి దేవి చక్కని ముందుమాట వ్రాసారు. పుస్తకం గెటప్ బాగుంది. లోపల రత్న పోచిరాజు గారి వాటర్ కలర్ పెయింటింగ్స్ పుస్తకానికి అదనపు అందాన్ని ఇచ్చాయి.

*

 

 

బొల్లోజు బాబా

19 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • ధన్యవాదములు బుల్లోజు బాబా గారు చక్కని ఉపన్యాసం ఇవ్వటమే కాకుకుండా చక్కని సమీక్షను చేశారు.సారంగ వారికి ప్రచురించినందుకు ధన్యవాదములు.🙏🙏💐💐

  • సర్! చాలా మంచి విశ్లేషణ అందించారు.
    “ఇంతెందుకు చెపుతున్నానంటే- ఇలాంటి కవిత్వాన్ని చదవటం మంచి అనుభవం. గొప్ప ఆత్మానుభూతి కలుగుతుంది.   కానీ చదివిన దానిపై నాలుగు వాక్యాలు రాయటం చాలా కష్టం. ఒక్కో మూడ్ లో ఒక్కో అర్ధాన్ని ఇస్తుంటాయి, ఒక్కొక్కరికి ఒక్కో విధంగా అర్ధమౌతాయి. హృదయానుభూతిని అక్షరాలలో పెట్టటం చాలా కష్టం.” నేను ఇలాంటి కష్టాన్నే అనుభవించాను. ఏమీ రాయలేకపోయాను. చదివి ఆనందించటం ! ఆత్మానుభూతి పొందటం!
    మీ విశ్లేషణ చదివి ఏదో తెలియని సుకుమారం గోచరించింది!!! మీకు రచయిత్రి కి ఇద్దరికీ అభినందనలు!!!!

  • చాలా చక్కని విమర్శ చేసారు. అలతి పదాలతో చాలా గాఢమైన ఇంపాక్ట్ కలిగించిన కవితలివి. మీరు చెప్పినట్లు ఎవరి ఆలోచనకు తగ్గట్లు వారు అనుభూతి చెందగల కానరాని నైపుణ్యం తో అల్లిన కవితలివి. ధన్యవాదాలు సర్.

  • ఆహా! ఎంత వివరంగా, విశ్లేషణ తో తెలియచెప్పారో బాబాగారు…రచయిత్రి ఆత్మ ను పదాలలో పొదిగారు.ఉభయులకు అభినందనలు

  • ఆత్మ ను శుభ్రం గా ఉంచుకుంటేనే ఇంత అందమైన వాక్యాలు వ్రాయగలరు

  • వసుధ రాణి కవితలను గురించి ఇలాంటి మంచి సమీక్షలు చదివినప్పుడు నా మనసులో భావాలు నేనే చదువుతున్న ఆనందం. అభినందనలు అండి

  • >> ఆత్మను శుభ్రపరచే ….

    నైనం ఛిందంతి శస్త్రాణి నైనం దహతి పావక:
    న చైనం క్లేదయంత్యాపో న శోషయతి మారుత: (భ.గీ 2-23)

    ఆత్మకి శాంతి కలుగుగాక, ఆత్మని శుభ్రపరిచే కవిత్వం అనేవి ఒక రకమైన అర్థంలేని పదాలండి. ఏ మతం మూలాల్లోంచి చూసినా ఇవి అందరూ రాస్తున్నారని రాసేయడమే కానీ ఇది ఇలా రాయొచ్చా అని ఆలోచించాలి. ఎవరో పోయాక కూడా ఇదే రాయడం పేపర్లలో పుస్తకాల్లో గట్రా. ఫలానా వారు చనిపోయేరు (అయన చేసిన వెథవ పనులు మనకి ఎలాగా అనవసరం అనుకోoడి ఇప్పుడు – ఎలాగా ఆయన పోయాడు కదా?) ఆయన ఆత్మకి శాంతి కలగాలి. పేపరోళ్ళు రాసేరు భాయ్, అందువల్ల మేము సైతం!!

    అబ్బా ఏమి పదాలండి ఇవి? అద్భుతం. బాబాగారు పిల్లలకి పాఠాలు చెప్పే మీరే ఇలా రాస్తే ఎలా?

    • శర్మ దంతుర్తి గారికి
      నమస్తె అండి

      ఇక్కడ ఆత్మ అనే పదప్రయోగం పట్ల మీ ఆక్షేపణను స్వీకరిస్తున్నాను.
      తెలిపినందుకు ధన్యవాదములు

      సాధారణంగా కవిత్వంలో ఆత్మ అనే పదాన్ని ఆధ్యాత్మిక అర్ధం లో కాక బౌద్ధిక అర్ధంలో వాడటం ఎక్కువ.

      కృష్ణ శాస్త్రి కవితాత్మ, ఆత్మ త్యాగం, ఆత్మ స్థైర్యం, చలం వాడిన ఆత్మలోకంలో దివాలా లాంటి అనేక ప్రయోగాలు కనపడతాయి.

      ఆత్మ అనే పదానికి నిఘంటువులో ఈ అర్ధాలు ఉన్నాయి

      1. జీవుఁడు;
      2. బుద్ధి;
      3. బ్రహ్మము;
      4. మనస్సు;
      5. శరీరము;
      6. స్వభావము;
      7. ధైర్యము;
      8. ప్రయత్నము.

      నా పదప్రయోగం ఔచిత్యవంతమనే (2, 4, 6 అర్ధాలలో) భావిస్తున్నప్పటికీ, మీ అభిప్రాయాన్ని గౌరవిస్తున్నాను అండి

      థాంక్యూ

      • బాబా గారు
        తప్పు మీది కాదండి. మన తెలుగువాళ్లందరిదీను. మనకి సులభమైన పదాలు లేవు. ఉదా – థేంక్స్ అనేస్తాం గానీ ధన్యవాదాలు అనలేం అది వాడుకభాష కాదు కనక. అలాగని మనకి మరో మంచి పదం లేదు. హిందీలో అయితే ధన్యవాద్ బదులు షుక్రియా భాయ్ అంటారు. అది బాగానే నప్పుతుంది సందర్భానుసారం.

        అసలీ ఆత్మ శాంతి సంగతి మరో సారి ఆలోచించి చూస్తే ఇది తెలుగు పత్రికలవాళ్ళు కనిపెట్టిన సున్నితమైన వెక్కిరింపు అని మనకి అర్థం అవుతుంది. ఎందుకంటే దాదాపు అందరం పాపులం కనకా, పాపుల్లో రాజకీయనాయకులనే పాపులు మరికొంచెం ఎక్కువకనకాను. ఈ రా. నా లు పోతే వాళ్లకి ఇలా రాస్తారు – ఆత్మ శాంతి అంటూ. వీడు బతికున్న రోజుల్లో ఎందర్ని ఏడిపించాడో, ఎన్ని కుర్చీలని వదలకుండా పట్టుకున్నాడో, వాటికోసం ఎంత, ఎటువంటి గడ్డి తిన్నాడో జనమెరిగిన సత్యం కదా? ఆ గడ్డి తినడంలో ఏ ఏ గాడిద కాళ్ళు పట్టుకున్నాడో (కిందన విశేష వివరణ చూడండి దీని గురించి) తన మనసూ, ఇంద్రియాలూ శరీరం, బుద్దీ అన్నీ ఎలా అమ్ముకుపోయి అసలు తాను ఒక కల్మషంలేని ఆత్మేనా అనిపించే దారిలో బతికి, నా నా ఖంగాళీ చేసుకుని జీవితాన్ని చాలించినప్పుడు – వాడి ప్రవృత్తి, ఇంద్రియాలూ అన్నీ కట్టగట్టుకుని పోతున్నప్పుడు ఏడుస్తూ – మిగతా వాళ్లలో కొంతమందికి సంతోషం కలిగినా – పోతాడు కనక “ఒరే ఈ కుళ్ళిపొయిన వెధవ పోయేడు దరిద్రం వదిలింది మనకి, పోతూ పోతూ వాడి దరిద్రాలన్నీ సంస్కారాలన్నింటినీ వెంటబెట్టుకు పోతున్నాడు కదా, వాటితో పాపం (పాపం ఎందుకంటే మనల్ని ఎంత ఏడిపించినా చచ్చిపోయేడు కనకా ఎంతటి శతృత్వం అయినా చావుతో పోవాలి కనకా) ఎలా నెగ్గుతాడో ముందు ముందు (నరకం దగ్గిరో మరోచోటో) అని వెక్కిరించడానికి “ఫలానా ఆత్మ శాంతి కలుగ్గాక” అని అచ్చేసి మన మీదకి వదిలేరు అని నా అభిప్రాయం. అలా అది జనాల్లోకి చొచ్చుకు పోయింది. శుభలేఖల్లో వేస్తారు చూసారా, “జానక్యా: కమలాంజలి పుటేయా..” అంటూ? అలాగ దాని అర్థం తెలిసినా తెలియకపోయినా మనం అందరం వాడుతున్నాం. ఎవరినైనా అడిగి చూడండి ఈ శ్లోకం అర్థం ఏమిటో – రాముడి పెళ్ళి భాయ్ అంతే. దేవుడి పెళ్ళికి ఊర్లో అందరూ అతిథులే అన్నట్టూ ప్రింటర్ గారి దగ్గిర ఈ శ్లోకం అచ్చు సిథ్థంగా ఉంది. వాడడం సులభం.

        [విశేష వివరణ – దేవకిని రక్షించుకోవడానికి వసుదేవుడు ఎంత బతిమాలినా ఒప్పుకోకపోతే కంసుడి కాళ్ళు పట్టుకుని ఒరే అబ్బా నాకు పుట్టిన పిల్లల్ని నీకు పుట్టగానే ఇచ్చేస్తా అంటూ భార్య ప్రాణం రక్షించుకున్నాడు కదా. అలా వసుదేవుడు కంసుడి చెవిలో పువ్వు పెట్టి బయట పడ్డాక మనకి అర్థం అయినదేమిటంటే కంసుణ్ణి గాడిదని చేసి వసుదెవుడు బాగానే బయటపడ్డాడు. ఇంతకీ వసుదేవుడు కంసుడి కాళ్ళుపట్టుకున్నా గాడిద అయింది కంసుడే కదా – మన రా.నా లాగే. ఇది కష్టే ఫలీ బ్లాగులో శర్మ గారు చెప్పిన కథ.]

        ఇదంతా నా స్వంత సోది మాత్రమే. మీరు పట్టించుకోనక్కర్లేదు.

  • “ ఆగస్టు 25 వ తారీఖు ఆదివారం సాయంత్రం విజయవాడ ఐలాపురం హోటల్ సమావేశ మందిరంలో కవిత్వ వర్షం కురిసింది. రూపెనగుంట్ల వసుధారాణి రాసిన కేవలం నువ్వే పుస్తకావిష్కరణ సందర్భంగా వక్తలు చేసిన ప్రసంగాల పూలవాన అది.

    ఆ సభకు అధ్యక్షత వహించిన నేను ( వాడ్రేవు చిన వీరభద్రుడు ) ఆమె రాసిన కవిత్వానికి నేపధ్యాన్ని వివరించే ప్రయత్నం చేశాను. ప్రాచీన కవుల పేర్లు చెప్తూ కాళిదాసు తర్వాత మరో కవి ఇంతవరకూ లేడు అని చేతివేళ్లలో చిటికెన వేలుతో లెక్క మొదలుపెట్టి అది కాళిదాసు అయితే రెండోది ఇంకెవరూ సమానకవి లేరు కనుక అనామిక అయింది అనే చమత్కార శ్లోకం ఉంది. కానీ అది సరికాదు అదే స్థాయి కవి రవీంద్రనాథ్ ఠాగూర్. అతనిప్రభావానికి లోను కాని భారతీయ కవి లేడు. తనదైన స్వంతముద్ర ఏర్పరుచుకోవచ్చు. అయినా ఆ ప్రభావం గొప్పది. ఆ పరంపర సమున్నతమైనది. అటువంటి పరంపరకు వారసురాలు వసుధారాణి అని చెప్పేను.

    చిన వీర భద్రుడు నలభైనిమిషాల ప్రసంగం చేశాడు. చైనా, జపాన్, పారశీక కవులను తీసుకొచ్చి వేదికముందు ప్రత్యక్షం చేశాడు వేలపేజీలసాహిత్యం, కవిత్వం రాసినవీరంతా ఆ తర్వాత రాసిన ఎపిగ్రామ్స్ గురించి చెప్పాడు. నువ్వు అన్నది ఒక దిగంతరేఖతప్ప మరేదీ కాదు. ఇది ప్రేమకవిత్వం కాదు భక్తి కవిత్వం అసలే కాదు.ఒక వ్యక్తికి సంబంధించినది కాదు. ఇది ఒక సాధన. అంటూ పారశీకకవుల తో సమానమైన కవిత్వం ఇది అంటూ వసుధను వారి సరసన చేర్చాడు. వీరెవరి కవిత్వాలూ తెలియకుండా ఈమె తనంతతాను గా ఇటువంటి అత్యద్భుతమైన ఎపిగ్రామ్స్(ప్రగాఢ భావగర్భితాలైన చిరు కవితలు)రాయడం తనను విభ్రాంతపరచిందన్నాడు. చినవీరభద్రుడి ప్రసంగం వినవలసినదే గాని ఇక్కడ వివరించగలిగినది కాదు. “

    ________________________________

    వసుధారాణి గారి కవిత్వ సంకలనం “కేవలం నువ్వే” ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాలైన నవోదయ బుక్ హౌస్, కాచీగూడా గాని, ఆనంద్ బుక్స్ గుంటూరు వెబ్ సైట్లల్లో కానీ కనిపించడం లేదు. పోనీ నేను చిన్నప్పుడు సదూకున్న నరసరావుపేటకు ఓ టిక్కెట్టు కోయించుకోనా ? ఆడన్నా దొరుకుద్దేవో?! యీ గూగులమ్మలు, యీ ఫేసుబుక్కులు వాడ్రేవు చిన వీరభద్రుడు గారు పుస్తకావిష్కరణ సభలో చేసిన నలభైనిమిషాల ప్రసంగం అచ్చరాల్లో సూపించటం నేదు. రూళ్ల కాయితం, పెనసలు తీసుకుని యూట్యూబు లోని వీడియోని వింటూ రాసుకోమంటారా?

  • ఇల్లాంటివి చదివినప్పుడే తెలుగువాడు తన భాష ఒన్నత్యాన్ని గుర్తించగలడు, వ్యాసకర్తకి జయహో

  • భారవి గారి తండ్రి ఆదర్శప్రాయుడని కాదుగాని కొంత ఆయననుండి గ్రహించవలసినదే,
    ఎంతగా కాలాతీతమవుతుందనిపించినా .
    ఆలోపు వాక్కుకు వయస్సూ బరువూ అన్నిసార్లూ సమాంతరంగా ఎదుగుతాయనీ లేదుగాని-

    ఇంతకూ ‘ సహృదయమే ప్రమాణం ‘ అని కాళిదాసు వాగ్బంధం చేశారు కద.🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు