ఆత్మగౌరవపోరాటాల ‘చంద్రవంక’

తెలుగు సమాజంలో వెనుకబడిన ప్రాంతాల నుండి విప్లవ భావజాల సాహిత్యం వెలువడడం పెద్ద ఆశ్చర్యమేమి కాదు. కానీ, సామాజిక మూలాలను పట్టుకొని అంబేద్కరైట్‌ దృక్పథంతో ఈ ప్రాంతాల నుండి బహుజన విముక్తి సాహిత్యం వెలువడడం నిజంగా ఒక కొత్త మలుపు. అస్తిత్వవాదాలకు తెలుగు సాహిత్యంలో నాలుగు దశాబ్దాల చరిత్ర ఉంది. వారి బాధలను వారే వ్యక్తీకరించుకోవాల్సిన చారిత్రక అనివార్యత ముందుకు వచ్చింది. ఇలాంటి నేపథ్యం నుండి వెలువడిరదే దుగ్గినపల్లి ఎజ్రాశాస్త్రి రచించిన చంద్రవంక నవల. తనదైన దళిత జీవిత మూలాలను తడుముతూ, నాలుగు దశాబ్దాల సామాజిక ఉద్యమాలను కళ్లముందుంచాడు ఎజ్రాశాస్త్రి. పేరులో శాస్త్రి ఉన్నా ఇతడేం బ్రాహ్మడు కాదు. అచ్చమైన నిఖార్సయిన దళిత రచయిత. ఇప్పటికే లబ్దప్రతిష్టుడైన ఎజ్రా కలం నుండి వెలువడి అద్భుతమైన నవల ‘‘చంద్రవంక’’. ఇప్పటికే పలు కవితా సంపుటాలు, రెండు నవలలు రాసి ఉన్న ఈ రచయిత, సమాజాన్ని అంబేద్కరైట్‌ దృక్పథంతో చూస్తాడు. తాను అర్థం చేసుకున్న జీవితానికి తాత్విక సొగసులు అద్ది కళాత్మకంగా మన ముందు పెడతాడు.

ఎజ్రాను కన్న ఒంగోలు నుండే కళ్యాణరావు రాసిన సంచలన నవల ‘అంటరాని వసంతం’ వచ్చింది. అది దళిత సమస్యకు పరిష్కార మార్గంగా విప్లవోద్యమాన్ని`భూపంపకాన్ని డిమాండ్‌ చేసింది. అది ఆ కాలపు విప్లవోద్యమ ప్రభావానికి ప్రతిబింబం. కళ్యాణ రావులాగే ఎజ్రా కూడా దళిత సమాజం నుండే రచయితగా అందివచ్చాడు. దళిత విముక్తికి విప్లవోద్యమాన్నో, కమ్యూనిజాన్నో పరిష్కార మార్గంగా ఎంపిక చేసుకోలేదు. అంబేద్కరిజం దళితులకే కాదు, ఈ దేశానికి కూడా శరణ్యమన్న భావన ఎజ్రా రచనల్లో కనిపిస్తుంది. అందుకే తాను చంద్రవంక నవలలో నాటి కారంచేడు మొదలుకొని, చుండూరు, దండోర ఉద్యమం, ‘‘ఓట్‌ హమారా`రాజ్‌ తుమారా’’ అనే నినాదమిచ్చి బహుజనులకు రాజ్యాధికార మార్గాన్ని చూపిన కాన్షీరాం దాకా ఈ నవలలో ఇతివృత్తంగా చిత్రించాడు ఎజ్రా.

తెలుగు సినిమాల్లోలాగే తెలుగు సాహిత్యంలో కూడా స్త్రీలను కావ్య నాయకులను చేయడానికి అంతగా అంగీకారం కనిపించదు. ఈ చంద్రవంక నవలలో మాత్రం ఎజ్రా ఒక అణగారిన సామాజిక వర్గం నుండి వచ్చిన యువతిని కథానాయికగా తీసుకొని కథను నడిపించాడు. నిజానికి ఇది సాహసం. ఎందుకంటే సామాజిక ఉద్యమాల్లో సైతం మహిళలకు అన్యాయమే జరిగింది. స్త్రీల నాయకత్వంలో ఉద్యమాలు మరింత సామాజిక బాధ్యతతో ముందుకు సాగేవి. ఈ పుస్తకానికి ముందుమాట రాస్తు విమర్శకులు దార్ల వెంకటేశ్వరరావుగారు సైతం ఈ ప్రస్తావన చేశారు. ఈ సమాజంలో స్త్రీల నాయకత్వంలో ఉద్యమాలు జరిగితే అవి ఎలా విజయవంతంగా గమ్యానికి చేరగలవో చూపించాడు రచయిత ఎజ్రా. ఇట్లా కావ్యనాయికగా చంద్రవంకను తీర్చిదిద్దడానికి రచయిత ఆ పాత్రలోకి పరకాయ ప్రవేశం చేసినట్టుగా మనకు కనిపిస్తుంది. ఆ పాత్రతో పాఠకులు మమేకం అవుతారు. ఈ సమాజ విముక్తి కోసమే జీవితాన్ని ధారపోసిన అనేకమంది మహిళా నాయకురాళ్ళు గుర్తుకు వస్తారు. వారి త్యాగానికి ఈ నవల సముచిత స్థానం కల్పించదనుకోవచ్చు.

చంద్రవంకలో నాలుగు దశాబ్దాల సామాజిక ఉద్యమాల చరిత్ర ఉంది. దేశాన్ని ఆలోచింపజేసిన కారంచేడు, చుండూరు మారణ హోమాల నేపథ్యంలో కవిత్వం, కథలు వెలువడినంతగా నవలలు వెలువడలేదు. ఒకటి రెండు నవలల్లో ఈ సంఘటనలను స్పృశించినా సమగ్రం కాదు. చంద్రవంక నవలలో ఈ రెండు దళిత ఆత్మగౌరవపోరాటాలను రచయిత కళ్లముందుంచాడు. అందుకు కారణం రచయిత ఈ ఉద్యమాలతో ప్రత్యక్షంగా పరిచయం కలిగినతనం మనకు అర్థమవుతుంది. చరిత్ర యొక్క బాహ్య స్వరూపాన్ని సామాజిక శాస్త్రాలు అందిస్తే, సాహిత్యం చరిత్ర యొక్క ఆత్మను కళాత్మకంగా పట్టిస్తాయన్న మాటను నిజం చేసింది ఈ నవల. ఈ నవల చదువుతున్నంత సేపు పాఠకుడు దళిత వాడల్లోకి, వారి జీవిత గాథల్లోకి వెళ్లి వస్తాడు. నేటికి దళితుడు స్వతంత్రంగా జీవించడానికి, తనకు దక్కాల్సిన హక్కులను దక్కించుకోవడానికి ఒక పెద్ద యుద్ధమే చేయాలి. అలాంటి పచ్చిగాయల కుండవంటి జీవితాన్ని సామాజిక బాధ్యతతో నవలీకరించిన తీరు చంద్రవంకలో కనిపిస్తుంది.
తెలుగులో చారిత్రక నవల అనగానే పౌరాణిక, రాచరిక పాత్రలను ఇతివృత్తంగా తీసుకున్నవే గుర్తుకు రావడం పరిపాటి. ఆ మూసను బద్ధలు కొట్టి ఆధునిక దళిత చరిత్రను రికార్డు చేసిన నవలగా చంద్రవంక తలెత్తుకొని నిలబడిరది. ఆత్మగౌరవ ఉద్యమాలను చారిత్రక కోణంలో చూసిన తీరు రచయితలోని విశాలత్వానికి నిదర్శనం. ప్రస్తుతం దళితేతరులకే కాదు, దళిత యువతకు సైతం తమ చరిత్ర మూలాలు తెలియవు. ఇలాంటి సమయంలో ఒక నవల ద్వారా చరిత్రను పదిలం చేసే పని పెట్టుకున్నాడు ఎజ్రా. ఇది చరిత్రను కళాత్మకంగా అందించిన కావ్యం చంద్రవంక. ఆత్మగౌరవ పోరాటాలను అక్షరీకరించిన ఉద్యమ నవల చంద్రవంక.

ఈ నవలలో రచయిత వాడిన భాష, విజయ్‌, చైతన్య వంటి పాత్రల చిత్రీకరణ, సంభాషణలు, సన్నివేశాలు ప్రధాన కథకు బలాన్ని పెంచాయి. ప్రజల్లో వాడుకలో ఉన్న భాషను వాడడం వల్ల పాఠకుడు రచయిత వేలు పట్టుకొని నడుస్తుంటాడు. దగాపడ్డ దళిత వాడలను కళ్లార చూసి కన్నీళ్లు పెట్టుకుంటాడు. నెత్తురోడుతున్న మాలమాదిగ వాడల దు:ఖాన్ని అక్షరాలకు ఎత్తిన తీరు పాఠకుడి స్మృతిపథం నుండి చెరగిపోదు. ఆనాడు కారంచేడు దళిత మహాసభలో పాల్గొన్న నాయకత్వం కూడా పాఠకుడి కళ్ల ముందు మెదులుతారు. గద్దర్‌, శివసాగర్‌, ఉసా, కత్తిపద్మారావు, బొజ్జాతారకం, జి.లక్ష్మీనర్సయ్య, ఉషాఎస్‌.డానీ వరకు అందరిని గుర్తుపెట్టుకొని ఎజ్రా వారి కృషికి సైతం పట్టంగట్టాడు. నాడు ఉద్యమంలో ఊపందుకున్న నినాదాలు, పాటందుకున్న పోరుపరవళ్లు ప్రతీ ఒక్కటీ జాగ్రత్తగా నవలలోకి తీసుకొచ్చాడు రచయిత. కారంచేడు, చుండూరు మాత్రమే కాదు, ఆ తరువాత ముందుకొచ్చిన సామాజిక న్యాయ ఉద్యమ డిమాండ్‌ను సైతం అత్యంత బాధ్యతతో, ప్రేమతో నవలలో ఇమిడ్చాడు ఎజ్రా. ఎమ్మార్పీఎస్‌ ఆవిర్భావ సమయంలో వచ్చిన అనుకూల వ్యతిరేక స్పందనలను మందకృష్ణ మాదిగ, కృపాకర్‌ మాదిగ వంటి వారి నాయకత్వ పాత్రను సజీవంగా చిత్రించాడు. ఇట్లా ప్రధాన సామాజిక చరిత్రలతో కరచాలనం చేసిన నవలగా చంద్రవంక నిలుస్తుంది.

ఇంతటితోటే రచయిత ఆగిపోయి ఉంటే అదొక ఉద్యమకారుడి డైరీ మాత్రమే అయ్యింది. కానీ, మాదిగ సాంస్కృతిక మూలాలను పట్టుకున్న తీరు పాఠకుడిని కట్టిపడేస్తుంది. పాట పాడడంలో, డప్పు కొట్టడంలో ఉండే సౌందర్యాన్ని కవితాత్మకంగా వర్ణించాడు. అలాగే నేటికి దేశంలో దళితుల పాలిట శాపంగా మారిన సఫాయి కర్మచారిల సమస్యను, మనిషి చనిపోతే కనీసం పాతిపెట్టడానికి స్మశానం కూడా లేకపోవడం, ఆరడుగుల నేల కోసం కూడా అగ్రవర్ణాల జాలి దయల మీద బతికే దైన్యాలు, చర్చిల ఆస్తులను అన్యాక్రాంతం చేస్తున్న వైనం, కాలం మారిన మాతంగుల పేరుతో నేటికి దళిత మహిళలను దేవుడి భార్యలుగా మార్చే దుర్నితి, చిలకమ్మ అనే దళిత బాలిక రేప్‌, ఎంబీసీ కులాల్లో సైతం గూడుకట్టుకున్న దళిత వ్యతిరేకత వీటన్నింటిపై దళిత చైతన్యంతో తిరగబడిన చంద్రవంక పాత్ర పాఠకుల మనసు దోచుకుంటుంది.

పరిమితమైన పాత్రలతో కథను నడుపుతూ ఆలోచనరేకిత్తించే సన్నివేశాలతో చంద్రవంక నవలకు ప్రాణం పోశాడు రచయిత. గతానికి వర్తమానానికి ఎడతెగని సంభాషణగా ముందుకు నడిపాడు. ఈ క్రమంలో దళిత జీవిత సంఘర్షణను`చైతన్యాన్ని ఏకకాలంలో పాఠకుల ముందుంచాడు. ఈ కాలానికి అవసరమైన మంచి నవలగా చంద్రవంక మిగులుతుంది. సామాజిక ఉద్యమాల చరిత్రకు నిలువెత్తు ఆధారమవుతుందనే గొప్ప ఆశను కలిగిస్తున్నది. నవలను ఇవాళ్టి రాజకీయ సందర్భమైన బహుజనోద్యమం వద్ద ఆపేయడం రచయిత యొక్క సామాజిక అవగాహనను, రాజ్యాధికారంతోనే బహుజనుల బతుకులు మారుతాయనే అంబేద్కరైట్‌ స్పృహకు ఇది మచ్చుతునక.

*

పసునూరి రవీందర్

16 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • Jai Bhim Ejra shastri , Jai Bhim Pasunuri Ravi Garu, writers always awake society through their writings… oka sira chukka lakshala medhallaku kadhalika.. Hats off All Society Reforming writers…

  • యజ్రా అన్న రాసిన అనేక పుస్తకాల్లో, చంద్రవంక గురించి విన్నాను. కానీ కథా వస్తువు తెలుసుకునే ప్రయత్నం చెయ్యలేదు. కానీ పసునూరి వారి విశ్లేషణ చదివిన తరువాత ఇంత విలువైన గ్రంథాన్ని మిస్ అయిపోయేవాడిని అనే భావనకు గురయ్యాను.
    365 రోజులు, రౌండ్ ది క్లాక్ దళితవాడలో జరిగిన చారిత్రక అన్యాయాలు దోపిడీలు, తిరుగుబాట్లు, డిస్కవరీ చేస్తూ, వర్తమాన దళిత సమస్యలను,అంశాలను అన్వేషిస్తూ ప్రయాణిస్తున్న ఎజ్రా అన్న కలానికి సలాములు.

    పేరు విని పేజీ తిప్పేసిన పుస్తకo లో సాధారణ ఇంకు రాతలు కాదని, రుధిర క్షేత్ర దిక్కార పోలికేకల సాముగరిడీల వీరగాథలని, రక్తాన్ని మరిగించే నిప్పుల అక్షరాల కొలిమి అని అద్భుతమైన విశ్లేషణ అందించిన పసునూరి అన్నకు కృతజ్ఞతభినందనలు 💐💐✊✊

    • అన్నా ధన్యవాదాలు. చాలా ఆత్మీయమైన స్పందనను తెలియజేశారు. జై భీమ్ లు.

  • నవల ఎలావుందో ఈ వ్యాసం చదివితే తెలుస్తుంది. దళిత జీవితాలను అంబేడ్కర్ భావజాల దృక్పథంతో చైతన్య స్రవంతి భూమికగా కథను నడపడం ఎజ్రా విజయం సాధించారు. అని తెలుస్తుంది అందుకు వారికి, ఇంత అద్భుత వ్యాసం రాసిన పసునూరి రవీందర్ కూ జై భీములతో అభినందనలు. – భూతం ముత్యాలు

  • లోతైన విశ్లేషణ అన్న ధన్యవాదాలు

    • థాంక్యూ శ్రీనివాస్ గారు. జై భీమ్

  • అన్న…చంద్ర వంక నవలపై అద్భుతమైన సమీక్ష
    అందించారు.. దళిత పోరాటాల సమైక్య గళం చంద్ర వంక.. రచయిత దుగ్గిన పల్లి ఎజ్రా శాస్త్రి అన్నకు శుభాకాంక్షలు

  • మీరు విశ్లేషించిన తీరుతో చంద్రవంక నవల చదవాలనే ఆసక్తి కలిగింది అన్నా. ఎక్కడ దొరుకుతుంది పుస్తకం.

  • మంచి విశ్లేషణ అందించారు పసునూరి.చంద్రవంక
    ఒక చారిత్రక నేపథ్యాన్ని రికార్డు చేసింది. కారంచేడు,చుండూరు ఉద్యమాల కొనసాగింపు
    అంబేడ్కరైట్ బహుజన విముక్తి అనడం సరైన దారి.
    ఇరువురుకీ అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు