ఆడపిల్లకు అమ్మ చెప్పిన అర్థం – పుష్పలత నవ్వింది

ఉత్తరాంధ్ర మాండలిక సౌందర్యం, లతతో కథను చెప్పించిన తీరు చదువరిని హత్తుకుంటాయి

కొన్ని కథలు చదువుతున్నపుడు మన అనుభవంలోని కొన్ని సంఘటనలు గుర్తుకువస్తాయి. మనల్నీ లేదా మనకు దగ్గరివారినీ కథల్లోని పాత్రల్లో పోల్చుకుంటాం. లోపలెక్కడో దేన్నో అవి కదిలిస్తాయి. కథకు చదువరికీ నడుమ అనుబంధాన్ని నిర్మిస్తాయి. శైలీశిల్ప విన్యాసాలతో నిమిత్తం లేకుండా కథ నచ్చడానికి ఇది ఒక కారణం అవుతుంది. కరుణకుమార్‌ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథ  నన్ను మా ఊరికి తీసుకువెళ్లింది. నా చిన్నతనంలో జరిగిన ఒక సంఘటను గుర్తుకు తెచ్చింది.

పుష్పలత నవ్వింది కథ ఇక్కడ చదవండి!

మా ఇంటి వెనుక ఉండే మంగలి చిట్టెమ్మ భర్త వెంగటముని సన్నాయి వాయించేవాడు. ఊది ఊది ఊపిరి తిత్తులు దెబ్బతిన్నాయి. దగ్గుతూ ఉండేవాడు. బాగా జబ్బుపడడంతో మాకు దగ్గరి పట్టణంలోని డాక్టర్‌కి చూపించారు. టీబీ కావచ్చు. మద్రాసుకి వెళ్లమన్నారు. మద్రాసు మాకు మూడు గంటల ప్రయాణ దూరం. భర్తతో కలిసి చిట్టెమ్మ బస్సులో మద్రాసుకి వెళ్లింది. జనరల్‌ ఆసుపత్రిలో అతను చచ్చిపోయాడు. నడుస్తూ ఆమెతో పాటూ బస్సెక్కి వచ్చిన మనిషి శవమైపోయాడు. ఊరుగాని ఊరు. తోడు లేరు. బస్సు చార్జీలకు మించి డబ్బుల్లేవు. భర్త మరణానికి మించిన గుండె బరువు పని, అతని దేహాన్ని ఇంటికి చేర్చడం. దుఃఖాన్ని తొక్కిపెట్టుకుంది. భర్ల శరీరానికి దుప్పటి చుట్టింది. రిక్షావ్యక్తి సాయంతో భర్తతో బస్సెక్కింది.  కిటికీవార సీట్లో  భర్తను కూర్చోబెట్టింది. తన భుజం మీదకు అతని తలను వాల్చుకుని పైటను ముఖం కనబడకుండా కప్పేసింది. కండెక్టర్‌కీ, తన పక్కన కూర్చున్నవాళ్లకీ ‘జబ్బు చేసిన మనిషికి మత్తుసూది ఇచ్చారు’ అని చెప్పింది. కంటి నుంచి చుక్క జారకుండా, పక్కన ఉన్నది శవం అని తెలియకుండా మూడు గంటలపాటు ప్రయాణించింది. గూడురిక్షా మా సందులోకి తిరిగాక గానీ, భర్త దేహాన్నీ, దుఃఖాన్నీ మోసుకుని ఉగ్గబట్టుకు వచ్చిన చిట్టెమ్మ బద్దలు కాలేదు. మంగలి చిట్టెమ్మ దుఃఖగాదను కథలు కథలుగా చెప్పుకునేవారు. దుఃఖాన్ని దిగమింగుకున్న ఆమె స్థైర్యాన్నీ, ఒంటరిగా మహానగరం నుంచి భర్త శవాన్ని మోసుకొచ్చిన ఆమె తెగువనూ,  శవమని తెలియకుండా ఊరు చేర్చిన ఆమె చాతుర్యాన్నీ వర్ణించి మరీ చెప్పేవారు. మంగలి చిట్టెమ్మకు ఆ శక్తినిచ్చింది మాత్రం లేనితనమే. అదో అనివార్య స్థితి. అదే ఆమెను, ఊరు గొప్పగా చెప్పుకునే పాత్రను చేసింది.  కరుణకుమార్‌ రాసిన ‘పుష్పలత నవ్వింది’ కథలో సత్యవతిలో నాకు మా మంగలి చిట్టెమ్మే కనిపించింది.

మూడెకరాల మాగాణిగల రైతు బిడ్డ లత. తెల్లారి చీకటి తొలగకముందే లేచి పనులు మొదలుపెట్టే అమ్మ, కండలు కరిగించి సేద్యం చేసే నాయన, తన కొడుక్కి చేసుకుంటానంటూ వెంటబడే మేనత్త.. శ్రద్ధగా చదువుకునే లతకి బతుకు సొగసుగానే గడుస్తోంది. అయితే బాధంతా అమ్మా నాయనలకే. పదహారేళ్లు నిండినా లత పుష్పవతి కాలేదు. కూతురు పుష్పవతి అయితే ఊరందరికీ భోజనాలు పెట్టాలని నాయన దాచిన ముప్పయి వేలు బ్యాంకులో మూలుగుతూనే ఉన్నాయి. ఊళ్లో లత వయసు ఆడపిల్లలు తొమ్మిది మంది ఉంటే ఎనిమిదో తరగతి ఎండాకాలం సెలవుల్లోనే ఏడుగురు పుష్పవతులైపోయారు. పెదరైతు కూతురు మంగ ఒక్కటీ లతకి తోడుగా ఉండిపోయింది ఇంతకాలం. ఇప్పుడు మంగ కూడా పుష్పవతి అయిపోవడంతో అమ్మానాయనలు ‘తడిసిపోయిన సొప్పకట్టల్లాగ’ అయిపోయారు. వాళ్ల ఆందోళన చూసి లతకి కూడా దిగులేసింది. ఊరికి వచ్చినప్పుడంతా లచ్చుమత్త, ‘ఎప్పుడు మూల కూకుంటావే, ఎప్పుడు తిరపతిగాడిని పెల్లి సేసుకుంటావే’ అని అడుగుతూ ఉంటే బెంగ పెరిగేది. ఊరూరూ తిప్పి యాపాకు మండలతో మంత్రాలు చదివించారు. సాదువుల దగ్గరకీ, పండాల దగ్గరికీ, సిల్లంగోడి దగ్గరకీ తీసుకువెళ్లి చెప్పిన పూజల్లా చేయించారు. జేబులు ఖాళీ అయినాయిగానీ లత పుష్పవతి కాలేదు. కొడుక్కి చేసుకుంటానని తిరిగిన మేనత్త రావడం మానేసింది. అమ్మలక్కల మాటలు చెవినబడుతున్నాయి. ఆ ఇంటిల్లపాదినీ దిగులు కమ్మేసింది. నాయన గడ్డం పెంచుకుని పరధ్యానంగా ఉంటున్నాడు. ఊరిలోనూ ఎవరితోనూ మాట్లాడడంలేదు. పెద్దరాయిమీద కూర్చుని ఆలోచనలో ఉండిపోతున్నాడు.  అమ్మకీ ముద్ద సగించడం లేదు. అయితే నాయన తీరుగా ఆమె కుంగిపోలేదు.  తనను తాను సమాళించుకుని చేయాల్సిన పనికి పూనుకుంది. ‘‘ ఇప్పుడేటై పోయింది? పిల్ల సంవర్తాడలేదు. మీయప్ప ఇంటికి రావడంలేదు. అంతే కదా. నా కూతురికి ఇరవై సమచ్చరాలా? ముప్పై సమచ్చరాలా? నువ్వలగ పెల్లం సచ్చిన గండడిలాగ ఉండకు’’ అని కర్రల బ్యాగులో గుడ్డలు సర్దుకుని కూతురితో సహా పుట్టింటికి చేరుకుంది. అక్కడి నుంచీ శ్రీకాకుళంకి కూతుర్ని తీసుకువెళ్లి డాక్టర్‌కి చూపించింది. పరీక్షలు చేశాక, ‘పిల్ల పెద్దమనిషవ్వడం కష్టమమ్మా!’ అని డాక్టరమ్మ తేల్చేసింది. ఆ మాటతో అమ్మ కన్నీటి వరదయ్యింది. ‘తిండి, తొంగోడం మానీసి సగం సచ్చిపొయిన’ పెనిమిటిని తలచుకుని బొరోమని ఏడ్చింది. ‘పిల్లలు పుట్టరన్న మాటే గానీ చక్కగా కాపురం చేయచ్చు’ అని డాక్టరమ్మ చెప్పిన మాటలు విన్నాక సత్యవతి ఒక నిర్ణయానికి వచ్చింది. ‘రేపు పెందిల ఊరికెలిపాదాం. ఈ రాత్తిరి నువ్వు పెద్దమనిసై పోయావని నేను ఊర్ల సెప్పేస్తాను.  ఈ యిసయం నువ్వు సచ్చిపోయింఆఎవరికీ సెప్పకూడదు’ అని కూతురితో ఒట్టేయించుకుంది. ఊరు చేరాక కూతురు మైనరు తీరిపోయిందని ప్రకటించారు. నాయనని పట్టడానికి లేకుండాపోయింది. ‘ దేవుడున్నాడే సచ్చవతీ!’ అని  ఆకాశం వైపు చూసి దండం పెట్టుకున్నాడు. విషయం తెలిసి మేనత్త కొడుకుతో సహా వచ్చి వాలిపోయింది.  తొమ్మిది రోజులు వేడుకలు జరిగాయి. ముట్టుబట్టలు అడగడానికి ఊరి చాకలోళ్లు వచ్చారు. మరక అంటని గుడ్డలు నిజం బయట పెట్టేస్తాయి. అమ్మ తెలివిని ఉపయోగించింది. అమ్మమ్మగారి ఊళ్లో పెద్దమనిషి అయ్యింది కాబట్టి అక్కడి చాకలోళ్లకే మైలగుడ్డలు ఇస్తానని ఒప్పుకున్నానంటూ, తమ ఊరి చాకలోళ్లకీ రెండు చీరలు ఇచ్చి పంపించింది. కార్యం ఘనంగా జరిగిపోయింది. ఇక పెండ్లి పెట్టుకుందామని మేనత్త కదిలించింది. అంతే అమ్మ తాచుపాములాగ ఎగిరింది. సమర్తాడలేదని కొడుక్కి వేరే సంబంధాలు చూసినదాని ఇంటికి తన బిడ్డను పంపనని తెగేసి చెప్పేసింది. అత్త వీధిలో నిలబడి అమ్మని తిట్టి తిట్టి కోపంతో అలిగి వెళ్లిపోయింది. మంచి సంబంధం చూసి చేసి పంపిస్తానని కూతురికి నచ్చజెప్పింది. ‘పెల్లి సేసుకుని  ఏ ఇంటికెల్లినా ఇదే బాగోతం కదా?’ అని  బెంగతో అడిగిన కూతురికి సత్యవతి చెప్పిన సమాధానం ఇదీ- ‘‘తులిసి మొక్కకు పువ్వు రాదని దేముడికి పెట్టడం మానేస్తన్నామా. లోకంల సొట్టపిల్లలు గుడ్డి పిల్లలు సెవిటిపిల్లలు పుట్టడం లేదా? ఆల్లకు పెల్లి అవతంది కదా! బగమంతుడు నీకు ఈ అవకరం పెట్టినాడు. ఆడపుట్టుకంటే మొగుడితో పడుకోని పురుడవ్వడమేనా?… నువ్వు బాగా సదువుకోని మంచి ఉజ్జోగం సేసుకుంటే నీకోసం వెయ్య సమందాలొస్తాయి. ఇంటికి ఇల్లరికం అల్లుడొస్తాడు. రాకపోతే లేదు, ఆడదాయి మగోడు లేకపోయినా బతగ్గలదు. నీ సంతోసం నువ్వు సూసుకోవాల.’’

బిడ్డ భవిష్యత్తు సంతోషంగా ఉండాలని అమ్మ ఆడిన అబద్దం వెనుక స్పష్టమైన ఆలోచన ఉందని ఈ ముగింపు మాటలతో అర్ధం అవుతుంది. కూతురు కుంగిపోకుండా చదువు దారి చూపడం ఈ కథలో విశేషం. శ్రమజీవిగా, వ్యూహకర్తగా, వ్యవహర్తగా, దార్శనికురాలిగా సత్యవతి పాత్రను రచయిత కరుణకుమార్‌ అద్భుతంగా చిత్రించారు. ఉత్తరాంధ్ర మాండలిక సౌందర్యం, లతతో కథను చెప్పించిన తీరు చదువరిని హత్తుకుంటాయి. కథ మొత్తం సంవర్త చుట్టూనే నడుస్తుంది. సహజ శారీరక అవకరం కూడా గ్రామీణ ప్రాంతాల్లో జీవితాలను అతలాకుతలం చేసే పెను సమస్యగా ఎలా మారుతుందో ఉద్వేగభరితంగా కథను చెప్పారు కరుణకుమార్‌. ‘పుష్పలత నవ్వింది’   ‘2018 కొత్త కథ’ సంకలనంలో అచ్చయింది. కథాసాహితి వారి ’కథ 2018’ లోనూ చోటుచేసుకుంది.

*

ఆర్‌.ఎం. ఉమామహేశ్వరరావు

6 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • గుర్తుండిపోయే కథకు తగిన సమీక్ష. ఇరువురికీ అభినందనలు!

  • గ్రామీణ ప్రాంతాలలో సహజంగా కనిపించే టెన్షన్ కు తల్లి తీసుకున్న నిర్ణయం, కూతురి భవిష్యత్తును నిర్దేశించిన తీరు రెండూ కథా స్థాయిని తెలుపుతున్నది..

    కథను పరిచయం చేసిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పవలసిన పనిలేదు..పరిచయం చేసినవారు కూడా గొప్ప కథకులే కాబట్టి..

  • కథలో చెప్పిన విషయం, ఆ భాష, ఆ మనుషుల్లో ఉండేభయాలు, ఆ మెచ్యూరిటీ… అద్భుతంగా అనిపిస్తాయి.
    కథని దగ్గర చేసేందుకు రచయిత, ఆ కథని పరిచయం చేసేందుకు మీరు చెప్పిన చిట్టెమ్మ కథ (?) రెండూ మనసుని కదిలిస్తాయి. ప్రాంతాలతో సంబంధం లేకుండా పాఠకుణ్ణి చదివించి, ఆలోచనలో పదేశాయి. థాంక్ యు..

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు