“కలిశావా ?”
“కలిశాను ”
” ఎందుకు కలిశావు ?”
“ఎందుకు కలియకూడదు?”
“అతను నీకు చేసిన అన్యాయం మరచి పోయావా ?”
” దాన్ని నేనెప్పుడో మరచిపోయాను . అయినా ఎప్పుడో పదేళ్ల క్రితం జరిగిన సంగతి . ఇంకా దాన్నే పట్టుకుని వేళ్ళాడితే ఎలా ? సరేలే ! ఆయన నిన్ను కూడా అడిగాడు ”
” నువ్విలా ఉండబట్టే అసిస్టెంట్ జనరల్ మేనేజర్ కావలసినవాడివి . ఇంకా సీనియర్ మేనేజర్ గానే అఘోరించావు . నీతో పాటు చేరిన వాళ్ళు అందరూ చీఫ్ మానేజర్లు , ఏ జి ఎమ్ లు అయిపోయారు . సరే ! నా సొద ఎప్పుడూ ఉండేదే కానీ ఇంట్లోనే ఉన్నావా ? నేనొస్తున్నాను రెండు ఎత్తులు వేద్దాము ”
” ఇంట్లోనే ఉంటాను . రా త్వరగా ”
ఫోన్లో నన్ను ముక్క చివాట్లు పెట్టింది నా మిత్రుడు రఘు రామ్ . మేమిద్దరమూ ఒకటవ తరగతి నుండి డిగ్రీ దాకా క్లాసుమేట్స్ మి . అది చాల దన్నట్టు ఇద్దరికీ ఒకే బ్యాంకు లో రెండేళ్లు తేడాగా ప్రొబేషనరీ అధికారులు గా ఉద్యోగాలు కూడా వచ్చాయి . విధి నిర్వహణ లో భాగంగా కాస్త దూరం అయినా మా ఇద్దరి స్నేహానికి అంతరాయం మాత్రం ఎప్పుడూ ఏర్పడలేదు .
రుఘురామ్ చాలా లౌక్యం తెలిసిన వాడు . బాగా ఎక్స్ట్రావెర్ట్ . ఎవరితోనైనా ఇట్టే కలిసిపోతాడు . అందుకే నా కంటే రెండేళ్లు వెనుక చేరినా వుద్యోగం లో నన్ను దాటుకుని చాలా ముందుకు వెళ్ళిపోయాడు .అతడిని చూస్తే నాకెప్పుడూ అసూయ కలగలేదు . ” నా మిత్రుడే కదా! ” అన్న స్నేహ వాత్సల్యం తప్పిస్తే . ప్రాథమిక స్థాయి నుండి కలిసే ఉండటం వలన , నా కంటే వయసులో రెండేళ్లు పెద్ద కావడం వలన నన్ను బాగు చెసే అధికారం ఏదోతనకు ఉన్నట్టు రఘురాం అనుకుంటాడు
ఈ బాగు చెయ్యడం అనే కాన్సెప్ట్ ఏమిటో నాకు ఎంత వయసు వచ్చినా నాకు అర్ధం అయ్యీ ,కాని బ్రహ్మ పదార్ధం లాగా మిగిలిపోయింది . పెద్దిభొట్ల సుబ్బరామయ్య గారి కథ లో కథానాయకుడు ఇంగువ అంటే ఏమిటో తెలుసుకోవడానికి కథ చివరి దాకా ప్రయత్నం చేసినట్టు , బహుశా నా జీవితం చివరి చరణం దాకా నేను ప్రయత్నం చేస్తూనే ఉండాలేమో . లేకపోతే ఏమిటి ? ఇంకో ఐదారేళ్లలో రిటైర్ కాబోతున్న నాకు ఎవరితోనైనా ఘర్షణ అవసరమా ? ఘర్షణ అవసరం అయిన సందర్భాల లోనే నేను ఘర్షణ పడను
ఫోన్లో రఘురామ్ కలిశావా అని అడిగినది మా బ్యాంకు కి ఛైర్మెన్ గా పనిచేసి రిటైరయి హైద్రాబాద్ లో విశ్రాంత జీవితం గడుపుతున్న రామ్ రావు అనే వ్యక్తిని . రామ్ రావు అసలు పేరు రామారావే .. కానీ ఎవరో జ్యోతిష్కుడు చెప్పాడని తన పేరుని రామ్ రావు అని రాసుకుంటాడు . అందరినీ అలాగే రాయమంటాడు . పిలవమంటాడు . అతడు మా బ్యాంకు కి చైర్మన్ గా వచ్చిన తరువాత ఇచ్చిన మొదటిసర్క్యులర్ తన పేరు గురించే . అందరూ ఎదురుగా చైర్మన్ గారు అని పిలిచినా పరోక్షంగా రామ్ రావు అనే పిలుస్తారు . అయన మీద మరీ కోపం వస్తే మాత్రం రామారావు అని పిలుచుకుంటారు
ఆయన చైర్మన్ గా పనిచేసిన మూడు సంవత్సరాల కాలం మా బ్యాంకు సిబ్బంది మొత్తం వత్తి తీసిన బాంబు మీద కూర్చుని వున్నట్టే ఎప్పుడూ టెన్షన్ టెన్షన్ గా తన్యత తో ఉండేవారు . మేనేజర్లకు వారానికి మూడు సార్లు సమీక్షలు పెట్టేవాడు . నాలుగుసార్లు ఫోన్ లో తాట తీసేవాడు . ఎప్పుడూ టార్గెట్లు ,అఛీవ్మెంట్లు తప్పిస్తే మరొక మాట ఉండేది కాదు . ఆయన మా బ్యాంకు కి మరొక ప్రభుత్వ రంగ బాంక్ నుండి డిప్యుటేషన్ మీద వచ్చాడు . తన మాతృ బ్యాంకు లో హెచ్ ఆర్ లో పనిచేసేవాడు . కానీ ఆయనకు మానవ సంబంధాలు నిర్వహించడం అస్సలేమాత్రం తెలియదు .గట్టిగా అరచి , అధికారం చలాయించి , అందరినీ అదుపులో ఉంచాలని ప్రయత్నం చేసేవాడు . ఆయన దురదృష్టమో , మాకొచ్చిన పోయే కాలమో తెలియదు కానీ ఆయన వున్న మూడేళ్లు దేశం అంతా గడ్డుకాలం . అంత గడ్డు సమయం లో కూడా మా బ్యాంకు అభివృద్ధి బాగానే ఉండేది కానీఅభివృద్ధి లో వేగం లేదని ఆయన పదే , పదే చిందులు తొక్కేవాడు . మేనేజర్లు అందరూ హృదయస్ఫూర్తిగా పనిచేయడం లేదని ఆయనకో సందేహం ఉండేది . అందుకే అయన ప్రతి మేనేజర్ మీద మరొక మేనేజర్ తో నిఘా వేయించేవాడు . ఆయన హయం లోనే మా బ్యాంకు కోర్ బ్యాంకింగ్ సొల్యూషన్స్ కి మళ్లింది . ఆ మార్పు అంత ఒక భయంకరమైన పీడకల
ఏ మేనేజర్ అయినా సెలవు అడిగితే నెల వారీ లక్ష్యాలు సాధించావా ? అని అడిగేవాడు . లేదు అంటే ” అది రీచ్ అయ్యాక సెలవు అడుగు అనేవాడు ” ఫోన్ పెట్టేసాక ఆ మేనేజర్ బండ బూతులు తిట్టుకునే వాడు . ఆ వత్తిడి తట్టుకోలేక ఇద్దరు ముగ్గురు మేనేజర్లు రాజీనామా చేసి వెళ్లిపోయారు కూడా
ఆయన తాను పనిచేసిన మూడేళ్ళలో రెండు సార్లు ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాడు . రెండు సార్లు నేను హాజరై రాత పరీక్షలో మంచి మార్కులు తెచ్చుకుని , ఇంటర్వ్యూ బాగా చేసినా నాకు ప్రమోషన్ ఇవ్వలేదు . నా కంటే జూనియర్లకు , నా కంటే లెస్సెర్ పెర్ఫార్మెర్లకు
ప్రమోషన్ ఇచ్చి నాకు మాత్రం మొండి చేయి చూపించాడు . ఆయన వెళుతూ వెళుతూ నన్నొక్కడినే నేను పనిచేస్తున్న ప్రదేశం నుండి దాదాపు రెండొందల యాభయ్ కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు .
తీరికగా ఆలోచిస్తే ఆయనకు ఎందుకో నామీద కొంత అసూయ, కొంత ద్వేషము వుండేదనుకుంటాను . ఆ అసూయ కీ , ద్వేషాని కీ , కారణం ఎంత ఆలోచించినా నాకు అర్ధం కాలేదు . బుచ్చిబాబు తన చివరకు మిగిలేది నవలలో చెప్పినట్టు కొంతమందికి , కొంత మంది పట్ల అకారణ అనుగ్రహము , మరి కొంత మంది పట్ల అకారణ ఆగ్రహము కలుగుతుందేమో . మా చైర్మన్ కి నా పట్ల అకారణ ఆగ్రహము .రుణ మంజూరు లో నేను కొంచెం లిబరల్ గా ఉంటానని పేరు . అలా అని నేనేమీ బ్యాంకు విధి విధానాలు తప్పేవాడిని కాను .తూ చ తప్పకుండా పాటించేవాడిని . లిబరల్ గా ఉండటం దానికి అదే చెడ్డ లక్షణం కాదని నా నమ్మకం .
అప్పటికీ ఒక సారి చాలా పోలైట్ గా ” సర్ ! నా పని తీరు నచ్చక పోతే ఎలా పని చేస్తే నచ్చుతుందో చెప్పండి . అలాగే పని చేస్తాను . లేదంటే నన్ను ఏ బ్రాంచ్ కి అయినా ఆఫీసర్ గా పంపించేయండి ” అన్నాను . ఆయన ” అవును ” అని కానీ ” కాదు ” అని కానీ ఏదీ మాట్లాడకుండా ఒక చిన్న చూపు చూసి వెళ్ళిపోయాడు . ఆ చూపు నన్ను చాలా రోజులు గుచ్చుకుంది . నిజానికి లోపం ఏమిటో తెలిస్తే సరిదిద్దుకోవచ్చు . లోపం తెలియకపోతే మనం ఏమి చేయగలం
ఆయన మా బ్యాంకు నుండి వెళ్ళిపోయిన తరువాత కూడా మా ఉద్యోగ సంఘ నాయకులు కొంత మంది తో ఆయన మాట్లాడుతూ ఉండేవాడు అనుకుంటాను . ఒకసారి రాజశేఖర్ అనే నా మిత్రుడు ఒక విషయం నాకు చెప్పాడు . అది నమ్మాలని అనిపించలేదు కానీ , జరిగిన సంఘటనలు అన్నీ బేరీజు వేసుకుని ఆయన నా పట్ల ప్రవర్తించిన విధానం తూకం వేసుకుంటే రాజశేఖర్ చెప్పింది నిజమే అనిపించింది . నేను చిన్నగా నవ్వి ఊరుకున్నాను ఆ తరువాత ఆ సంగతి నేను పూర్తిగా మర్చిపోయాను .
ఆ తరువాత కొన్నాళ్ళకు రఘురామ్ నాకు రాజశేఖర్ చెప్పిన విషయాన్ని మళ్ళీ కొత్తగా చెప్పాడు . మళ్ళీ కొత్తగా విని
” ఈ సంగతి నేకెప్పుడో తెలుసు” అన్నాను
” మరి నాకు చెప్పలేదేమి?” అన్నాడు రఘురామ్
” చెప్పడానికి ఏమి వుంది ఇందులో . ఆయనకు సమయం దొరికింది అయన చేయదలచుకున్న పని ఆయన చేసాడు . దానివలన నాకు అన్యాయం జరిగినదా ? న్యాయం జరిగినదా ? అన్న విషయం ఆయనకు అనవసరం కదా ! అయినా రామ్ రావు లాంటి వాళ్ళు ఈ సమాజం లో చాలా మంది వుంటారు . నిజానికి ప్రతి మనిషి లోనూ ప్రతీకార భావం అతడికి తెలియకుండానే ఇన్ బిల్ట్ గా ఉంటుంది . దాన్ని మనం పెద్దగా పట్టించు కోకూడదు ” అన్నాను
రఘురామ్ నావైపు కోపంగా చూసాడు . రాజశేఖర్ , రఘురామ్ ఇద్దరూ చెప్పిన విషయం ఇది
రామ్ రావు స్వర్ణకార సామాజిక వర్గానికి చెందిన వాడు . చిన్నప్పటినుండీ చాలా పేదరికం లో పెరిగాడు . నోట్లోకి నాలుగు వేళ్ళు కూడా పోని కుటుంబం కావడం తో ప్రభుత్వం ఏర్పాటు చేసిన బి సి హాస్టల్ లో ఉండి చదువుకుని , బి సి స్టడీ సర్కిల్ లో శిక్షణ తీసుకుని , పోటీ పరీక్షలు రాసి బ్యాంకు వుద్యోగం సంపాదించాడు . అది అతడి మొదటి విజయం . మొదటి పోస్టింగ్ విజయనగరం జిల్లా రాజాం లో క్లర్క్ గా చేరాడు . ఆ తరువాత ఏమి జరిగిందో తెలియదు కానీ ఒడిస్సా బదిలీ అయ్యాడు . అక్కడ మొదటిసారి ప్రమోషన్ కి అర్హత సాధించాడు . చాలా బాగా ప్రిపేర్ అయి , తాను పనిచేసిన మేనేజర్ల దగ్గర మంచి మార్కులు వేయించుకుని రిటెన్ టెస్ట్ రాసి ఇంటర్వ్యూ కి హాజరయ్యాడు . ఆయనకు ప్రమోషన్ వస్తుందనే అందరూ అనుకున్నారు . కానీ చివరి నిమిషం లో తప్పి పోయింది . అలా తప్పిపోవడానికి ప్రధాన కారణం గణేష్ చతుర్వేది . ఒడియా బ్రాహ్మిణ్ . ఒక బ్రాహ్మిణ్ కారణంగా తాను ప్రమోషన్ కోల్పోయాడు అన్న కారణంగా అతడికి బ్రాహ్మిణ్స్ అంటే పడదట . అతడు స్నేహం కూడా సామజిక వర్గం తెలుసుకుని మరీ స్నేహం చేశాడట . అందుకే నాకు ప్రమోషన్ ఇవ్వలేదని , దూరంగా రెండు వందల యాభయి కిలోమీటర్ల దూరం ట్రాన్స్ఫర్ చేసాడన్నది , రఘురామ్ , రాజశేఖర్ చెప్పిన విషయాల సారాంశం
నా కెందుకో ఇప్పటికీ ఆ విషయం నమ్మబుద్ది కాదు . ఎప్పుడో కెరీర్ మొదట్లో ఒక చిన్న ఎదురుదెబ్బ తగిలితే అది గుర్తు పెట్టుకుని , తనకి ప్రమోషన్ ఇచ్చే అధికారం వచ్చిందాకా వేచి చూసి , బదులు తీర్చుకుంటాడా ? నేను నమ్మను . కానీ రాజశేఖర్ అయితే ” అన్నా ! మందు తాగుతున్నప్పుడు స్వయంగా చెప్పాడు . అబద్దం చెప్పడు ” అంటాడు
ఆ తరువాత నాకూ రెండు ప్రమోషన్లు వచ్చాయి . మొన్నామధ్య ఒక అర్ధ రాత్రి నేను మంచి నిద్రలో వున్నప్పుడు పక్కనే పెట్టుకున్న ఫోన్ మోగింది . నిద్రమత్తులోనే చేతిలోకి తీసుకుని ” హలొ ” అన్నాను . అటునుండి రామ్ రావు . నా నిద్రమత్తు వదిలి పోయింది . ఫోన్ పట్టుకుని ముందు గదిలోకి వచ్చాను .
” సర్ ! ఏంటి మీరిలా ? ” అన్నాను
” ఏమీ లేదు మురళి . నీతో ఒకసారి మాట్లాడాలి అనిపించింది . నీ రచనలు అన్నీ చదువుతున్నాను . నేను మీ దగ్గర పనిచేసినప్పుడు నిన్ను సరిగ్గా చదవలేక పోయాను . ” అన్నారు
” నా పిచ్చి రాతలన్నీ చదువుతున్నందుకు సంతోషం సర్ ”
” నో నో అవి పిచ్చి రాతలు కాదు . నీ రచనలలో మంచి డెప్త్ ఉంటుంది . నీలాగా తెలుగు వచనం రాసేవాళ్ళు ఇప్పటి తరం లో ఎవరూ లేరు . ముఖ్యంగా నీ భాష బావుంటుంది ”
నేనేమీ మాట్లాడలేదు
” మురళీ ! ఇలా అర్ధరాత్రి లేపి నిన్ను ఇబ్బంది పెట్టడం లేదు కదా . కొన్ని చూడటానికి చాలా చిన్న చిన్న సంగతులు లాగే ఉంటాయి . మన దృష్టిని ఆకర్షించను కూడా ఆకర్షించవు . కానీ అనుభవం లోకి వస్తే కానీ అవి ఎంత గొప్ప విషయాలో మనకు అర్ధం కాదు . అవి చిన్న చిన్న సంగతులే ! కానీ అవి పెద్ద పెద్ద విషయాలు కూడా . ప్రేమ ద్వేషం లాంటివి కూడా ”
ఆయన ఏమి చెపుతున్నాడో నాకు లీలగా అర్ధం అయ్యీ కానట్టు ఉన్నది
” అవునూ నీకు హైదరాబాద్ తో ఎక్కువ సంబంధాలు వున్నాయి కదా . ఆ రోజులలో ఎప్పుడు సెలవు అడిగినా హైదరాబాద్ వెళ్ళాలి అనేవాడివి కదా . ఈ సారి హైదరాబాద్ వస్తే నన్నొక సారి కలవు . ఒక ఫోన్ చేస్తే నేనే వచ్చి కలుసుకుంటాను . ఇక్కడే విజయ్ నగర్ కాలనీ లో ఉంటున్నాను ” అన్నారు
” సరే సర్ ” అన్నాను
ఆ అర్ధరాత్రి సంభాషణ అంతటితో ఆగి పోయింది . ఆ తరువాత మరొక రెండు సార్లు రామ్ రావు ఫోన్ చేసారు . చేసిన ప్రతి సారీ ఇంటికి రమ్మని ఆహ్వానించాడు
నేను ఆలోచనలలో ఉండగానే రఘురామ్ వచ్చాడు . వస్తూనే ” నీకసలు బుద్ది లేదురా ” అంటూ దండకం మొదలు పెట్టాడు .
“శాంతా ! రఘు వచ్చాడు కాఫీ తీసుకుని రా ” అని చదరంగం మ్యాట్ పరిచాను టేబుల్ మీద ఆడటానికి . మా ఇద్దరికీ చదరంగం అంటే మహా పిచ్చి . ఏ కాస్త ఖాళీ సమయం దొరికినా చదరంగం బల్ల ముందు వాలిపోతాము . శాంత అయితే మా ఇద్దరికీ గ్యారీ కాస్పరోవ్ , విశ్వనాథన్ ఆనంద్ అని పేరు పెట్టింది
నా రాజు కి చెక్ చెపుతూ ” ఇంతకూ ఏమంటాడు రామ్ రావు . హైదరాబాద్ లో ఎక్కడ ఉంటున్నాడు ? ఎలా వున్నాడు ? ” అని ప్రశ్నల వర్షం కురిపించాడు .
” విజయ్ నగర్ కాలనీ లో వుంటున్నారు . భార్య పోయిందట . యిద్దరు పిల్లలు అమెరికా కి రెక్కలు కట్టుకుని వెళ్లిపోయారు . బోలెడంత పెన్షన్ వస్తుంది . పెద్ద ఇల్లు . వుండేవాళ్ళు ఎవరూ లేరు . ఒక వంట మనిషి, తాను మాత్రమే . తాను ఛైర్మెన్ గా వున్నప్పుడు మనం గజ గజ లాడే వాళ్ళం చూడు అలా గజ గజ లాడతాడు . ఆ వంటమనిషి కి ”
” ఇంతకూ ఏం మాట్లాడాడు ? ఎందుకు అర్ధ రాత్రి మరీ ఫోన్ చేసి ఆహ్వానించాడ ట ? ”
” మేమేమీ మాట్లాడుకోలేదు ఇదుగో ఇలా ఒక రెండు గంటలు చెస్ ఆడుకున్నాము . ఏమాట కామాటే చెప్పుకోవాలి . గొప్ప ప్లేయర్ రా బాబూ నన్ను గుక్క తిప్పుకోనివ్వకుండా చెక్ పెట్టేశాడు . చివరికి చదరంగం ఆట అయిపోయిన తరువాత రాజునీ, మంత్రినీ , బంటునీ ఒకే
డబ్బా లో సర్దుతూ , ” జీవితం ఇంతే మురళీ ! ఆట ముగిశాక రాజు , బంటు కలిసి ఒకే డబ్బా లో నిద్రించినట్టు , జీవితం లో మనుషులు ఎన్నుకున్న కెరీర్ అనే ఆట ముగిసాక మనుషులు అందరూ ఒకే నెల మీద పడుకుని , ఒకే ఆకాశాన్ని కప్పుకోవాలి . ఆ ఆకాశం కింద వర్ణ , వర్గ , లింగ వివక్ష ఏదీ ఉండదు . ఈ సత్యం తెలిసేసరికి జీవితం చేయి జారి పోయింది ” అన్నాడు
” బహుశా ! ఒక గిల్ట్ ఫీలింగ్ కూడా ఆయనకు ఉన్నదేమో ”
రఘు ఏమీ మాట్లాడలేదు
మా ఆట కూడా ముగిసింది . రాజునూ , మంత్రినీ , బంటునూ ఒకే బాక్స్ లో సర్దేశాము
*
అద్భుతమైన సందేశం అండీ..
వంశీ కృష్ణ గారు… ఏమీ అనుకోకపోతే కథలో ..రాజాం… విజయనగరం జిల్లా అని రాశారు. అది ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో. ద గ్రేట్ టెలుగు బిజినెస్ మ్యాన్ … జీఎంఆర్..గారి సొంత ఊరు. వీలైతే మార్చండి. కథ బాగుంది. అభినందనలు.
వంశీ కృష్ణ గారు… ఏమీ అనుకోకపోతే కథలో ..రాజాం…విజయనగరం జిల్లా అని రాశారు. అది ఉన్నది శ్రీకాకుళం జిల్లాలో. ద గ్రేట్ తెలుగు బిజినెస్ మ్యాన్ … జీఎంఆర్..గారి సొంత ఊరు. వీలైతే మార్చండి. కథ బాగుంది. అభినందనలు.