నీ అరచేతిలో
‘ఆకేసి పప్పేసి
నెయ్యేసి… కలిపి కలిపి
నీకో ముద్ద, నాకో ముద్ద’ తినిపించుకొని,
మణికట్టు మీదుగా
కొండకు పోయే దారేదని
చక్కిలిగింతల వాగులై
మనం కిలకిలమని నవ్వుకొని,
ఆదాటుగా ఎవరొచ్చి
వెచ్చని అరచేతులతో కళ్ళుగప్పినా
తడిమి చూసి నువ్వే అనుకోవడం,
‘చుకుచుకు పుల్ల… చిటారు పుల్ల’
ఇసుక బద్దలో నీ పాట ఆగిన చోటల్లా
నేనాగిపోయి వెతుక్కోవడం,
‘వానా వానా వల్లప్పా…’ అని
పసి ఇంద్రధనుస్సులు వాకిళ్ళలో
చెల్లప్పలై అల్లిబిల్లి తిరిగి
ఎన్నాళ్ళయ్యింది చెప్పు,
ఆటల్లో మనం చినుకులమై జారిపోయి?
చెరో ప్రపంచంలోకి చెదిరిపోయాక,
వేళాకోళంగా మట్టిలో దాచిన
మామిడి టెంక, మొలకెత్తి
పెరిగి పెరిగి పిందెలేసింది
ఇప్పుడు దాని చల్లని నీడలో
‘దాగుడుమూతా దండాకోర్’
ఆడుతున్న పిల్లల్లో, ఎప్పటికీ
ఒక నువ్వు
ఒక నేను!
*








nice