ఆజ్ మౌసమ్ బడా బేయిమాన్ హై

“మమ్మీ యూనిక్ పర్సన్. నీకు తప్పకుండా నచ్చుతుంది. షి యీజ్ క్లవర్, బ్యూటిఫుల్ అండ్ వెరీ సెడక్టివ్ టూ.”

మమ్మీ గురించి చెప్పడానికి నేను సెడక్టివ్ అనే పదాన్ని ఎందుకు వాడానో నాకే తెలీదు. అనేశాక నాలుక్కర్చుకున్నాను. లక్కీగా కరణ్ ఆ మాటని పెద్దగా పట్టించుకున్నట్టు కనిపించలేదు. నేనన్నదాంట్లో తప్పేమైనా వుందేమో అనే కంగారులో మొబైల్ డిక్షనరీ ఓపెన్ చేసి చూశాను. “టెంప్టింగ్ అండ్ అట్రాక్టివ్” అని చూపించింది గూగూల్. ఆ క్షణానికి కాస్త రిలీఫ్ గా అనిపించిందిలే గానీ, అది మనసులో ఏ మూలో చేరి డిస్టర్బ్ చేస్తానే వుంది. టెక్నికల్లీ నాదేం తప్పు కాదు అని చెప్పుకోడానికి డిక్షనరీ చూశానంతే. సెక్సీగా కనిపించే ప్రయత్నం చేస్తూ, ఎదుటివాళ్లని ఆకర్షించేవాళ్లని ఉద్దేశించి ఆ పదాన్ని చాలాసార్లు వాడాం నేనూ నా ఫ్రెండ్సూ.

“నాకు నచ్చడానికి బ్యూటిఫుల్ గా ఉండాల్సిన అవసరం లేదు. తను మీ అమ్మ అనే ఒక్క రీజన్ చాలు” అన్నాడు కరణ్. ఇంకేదైనా సందర్భంలో అయితే అతని సమాధానం నన్ను కాస్త ఇబ్బంది పెట్టివుండేది. కన్సర్న్ చూపించడం వరకూ ఓకే. అంతకుమించిన ఏ ఫీలింగైనా యాక్సెప్ట్ చేయడానికి నేను రెడీగా లేను. కరణ్ తన ఆన్సర్ లో సెడక్టివ్ అనే పదాన్ని స్కిప్ చేయడం నన్ను చాలా ఇంప్రెస్ చేసింది.

*****

కరణ్ నా ఫ్రెండు. దాదాపు రెండేళ్లయ్యిందేమో మాకు పరిచయం అయ్యి. బెస్ట్ ఫ్రెండ్ అని చెప్పలేను. ఎందుకంటే వాడు నాకున్న ఏకైక ఫ్రెండు. అసలిన్నాళ్లూ వాడిని మమ్మీకి పరిచయం చెయ్యకపోవడమే చాలా ఆశ్చర్యం. ఇంటికొస్తానని వాడూ అనలేదు. రమ్మని నేనూ పిలవలేదు. ఇప్పుడైనా పిలవాలనే ఆలోచన వచ్చుండేది కాదేమో. ఈరోజు మమ్మీ బర్త్ డే. తనని సర్ప్రైజ్ చేయడానికి కేక్ ఆర్డర్ చేశాను. కూల్ కేక్ ముందే తీసుకెళితే ఫ్రెష్ గా వుండదన్నాడు బేకరీ వాడు. “ఆ టైమ్ కి నేను తీసుకొచ్చి ఇస్తాలే” అన్నాడు కరణ్. నో చెప్పడానికి నా దగ్గర కారణం ఏమీ లేదు. ముగ్గురుంటే ఇంకాస్త సందడిగా బానే ఉంటుంది కదా అనిపించి, డిన్నర్ కి స్టే చేయడానికి ప్రిపేరై రమ్మని చెప్పాను కరణ్ కి.

అసలు విషయం చెప్పలేదు కదూ. మా ఇంట్లో అమ్మా నేనూ ఇద్దరమే. నాకు ఊహ తెలియకముందే డాడీ చనిపోయారు. ఈ ఇన్ఫర్మేషన్ కి కొనసాగింపుగా “మా అమ్మ నన్ను చాలా కష్టపడి పెంచింది” అనే స్టేట్మెంట్ నా నుండీ మీరు  ఎక్స్పెక్ట్ చేస్తారని తెలుసు నాకు. నన్ను పెంచడానికి మమ్మీ కష్టపడిందని నాకెప్పుడూ అనిపించలేదు. నా విషయంలోనే కాదు, అసలు మమ్మీ ఎప్పుడూ దేనికీ పెద్దగా కష్టపడడం నేను చూడలేదు. మిగతావాళ్లకి తెలియని విద్యేదో తనకి తెలుసు. తను నవ్వుతూ అడిగిందంటే ఎదుటివాళ్లు దేనికైనా నో చెప్పడం ఇంపాజిబుల్.

ప్రమ్లత్తయ్య మాటల్లో చెప్పాలంటే మమ్మీ అందం నాకు రాలేదు. హైస్కూల్లో నాతోపాటు చదివిన సమీర మాటల్లో చెప్పాలంటే మా అమ్మ హీరోయిన్ లా ఉంటుంది. మమ్మీ టాలెంటుకీ, తన గ్లామర్ కీ ఏమైనా సంబంధం ఉండుంటుందా? ఏమో. లేకపోవచ్చు. తను ఏం చేసినా “ఈ పని చేయడం ఇంత ఈజీనా” అన్నట్టు ఎఫర్ట్ లెస్ గా కనబడుతుంది. నేను ఆపసోపాలు పడి చేసే ఏ పనైనా మమ్మీ చేతిలో పెడితే, అది ఎప్పుడు మొదలైందో ఎప్పుడు అయిపోయిందో కూడా తెలియకుండా చక్కబెట్టేస్తుంది. చిన్నప్పుడు పుస్తకాలకి అట్టలు వేయడం దగ్గర్నించీ, ఇప్పుడు రికార్డులు రాసిపెట్టడం వరకూ తన ఎఫిషన్సీ మీద డిపెండ్ అవ్వడం నాకొక డెఫిషన్సీగా మారిపోయింది.

పెద్దగా ఎవరితోనూ కనెక్ట్ అవ్వని నేను కరణ్ తో ఫ్రెండ్ షిప్ చేయడానికి కారణం కూడా ఇదే అయ్యుండాలి. వాడు కూడా అచ్చు మమ్మీలాగే. ఏ పని చేసినా కుదురుగా చేస్తాడు. అదేదో సినిమాలో గులాబీ మొక్కకి అంటు కట్టినట్టు హీరో రౌడీలని శ్రద్ధగా కొడతాడే.. అలాగన్నమాట. నాకన్నా అందమైన అమ్మాయిలు చాలామంది పరిచయం వుండుండాలి వాడికి. వాళ్లని కాదనుకోని నాతో టైమ్ స్పెండ్ చేసేంత స్పెషాలిటీ నాలో ఏమీ లేదు.

‘మమ్మీ నీకు తప్పకుండా నచ్చుతుంది’ అని నేను అన్నమాట అక్షరం కూడా బీరుపోలేదు. కరణ్ గాడు మా ఇంటి గుమ్మం దాటి లోపలికి అడుగు పెట్టిన పది నిముషాల తర్వాత ఎవరైనా వచ్చి చూస్తే వాళ్లిద్దరికీ ఆరోజే పరిచయం అయ్యిందంటే నమ్మరు గాక నమ్మరు. కేక్ కట్ చేశాక మొదటి ముక్క వాడికే పెట్టుద్దేమో అనిపించింది నాకు. లక్కీగా అలా జరగలేదు. కరణ్ బర్త్ డే సాంగ్ పాడుతుంటే కోరస్ ఇచ్చి, నా వాటాకొచ్చిన పీస్ తినేయడంతో నా పాత్ర ముగిసిపోయింది. వాళ్లిద్దరూ ముచ్చట్లలో పడిపోయారు. కిచెన్ లో ఏ వస్తువు ఎక్కడుంటే స్పేస్ కలిసొస్తుందో వాడు సలహాలిస్తున్నాడు. వాడేసుకొచ్చిన టర్కోయిస్ కలర్ షర్ట్ మీదకి ఎలాంటి ట్రౌజర్స్ బావుంటాయో మమ్మీ చెపుతోంది. నా ప్రస్తావన ఎక్కడా రాకపోయినా, వాళ్లిద్దరూ నా అప్రయోజకత్వం గురించే మాట్లాడుకుంటున్నట్టు అనిపించింది నాకు.

మామూలుగా అయితే నాకు ఒళ్లు మండిపోయుండాలి. కానీ, మమ్మీ రోజుటి కన్నా హ్యాపీగా ఉంది.  పైగా, నాకు అంత మంచి ఫ్రెండ్ ఉన్నాడనే విషయం మమ్మీకి తెలియడం నేను గర్వపడాల్సిన విషయమేగా. ఇలా తెచ్చిపెట్టుకున్న కారణాలతో ఉత్సాహంగా ఉండే ప్రయత్నం చేశాలే గానీ, కరణ్ నన్ను నెగ్లెక్ట్ చేశాడు అనే నిజం నా పాజిటివ్ వైబ్స్ కి అడ్డం పడుతూనే ఉంది.

“పిల్లోడు భలే క్యూట్” అంది మమ్మీ కరణ్ వెళ్లిపోయాక. “అండ్ యువార్ టూ సెడక్టివ్” అన్నాన్నేను. మమ్మీ పెద్దగా నవ్వేసింది. సెడక్టివ్ అనే పదాన్ని ఏ అర్థంలో వాడానూ అన్నది ఆలోచించలేదు నేను ఈసారి.

****

“ఇలాంటి అయితేనే నీతో కంఫర్టబుల్ గా ఉండగలను” అని కచ్చితంగా కరణ్ తో ఎప్పుడూ అనలేదు నేను. కానీ వేరేవాళ్ల గురించి మాట్లాడుకునేటప్పుడు నేనేం చెపుతున్నాను అన్నదాన్ని బట్టి వాడికి కొంత క్లారిటీ వచ్చివుండాలి. అందుకే ఫ్రెండ్ అనే పదాన్ని దాటిపోయే మాటలేవీ మా మధ్య ఎప్పుడూ రాలేదు. రెండు రోజులకే లవ్ లో పడిపోయి, నాలుగు రోజులకి బ్రేకప్ చెప్పేస్కునే కాజువల్ రిలేషన్స్ నాకు ఇష్టం ఉండవు. ఇలాంటి విషయాల్లో తన ఒపీనియన్ ఏంటన్నది నేనెప్పుడూ అడగలేదు.

ఒక్కసారి మాత్రం అన్నాడు, “మరీ దూరంగా అబ్జర్వర్ లా ఉండిపోతే, అవతలివాళ్లు మన సోల్ మేట్ అవునా కాదా అన్నది ఎలా తెలుస్తుంది? రిస్క్ తీసుకోని కాస్త దగ్గరవ్వాలి కదా” అని. ఆ మాట వినగానే వాణ్ని కొట్టినంత పని చేశాను నేను. మళ్లీ ఎప్పుడూ అలాంటి మాట్లాళ్లేదు వాడు. మిగతావాళ్ల కన్నా నాకెక్కువ వేల్యూస్ ఉన్నట్టు కనిపించడంలో నాకేదో ఆనందం ఉండుండాలి. లేదా, లవ్ అనే ట్యాగ్ తగిలిస్తే ఎక్కువరోజులు కలిసుండం అనే భయమైనా ఉండుండాలి.

నామీద ఆశలు పెట్టుకోని, వేరే అమ్మాయిలతో డిస్టెన్స్ మెయింటెయిన్ చేస్తున్నాడేమో. చివరికి నాకే ఫీలింగూ లేదని తెలిస్తే హర్ట్ అవుతాడేమో అని అనుమానం వస్తూంటుంది నాకు అప్పుడప్పుడూ. కానీ, నా వైపు నుండీ ఎలాంటి ఎంకరేజ్మెంట్ లేనప్పుడు ముందుకుముందే గిల్టీగా ఫీలవ్వాల్సిన అవసరం నాకేంటి.

పొజెసివ్ గా ఫీలయ్యి, “నువ్వు ఫలానా వాళ్లతో ఎందుకు క్లోజ్ గా ఉన్నావ్” అని వాడు నాతో గానీ, నేను వాడితో గానీ ఎప్పుడూ అనలేదు. అలా అనాల్సిన అవసరం నాకు వస్తే, మా ఇద్దరి మధ్యా స్నేహం కంటే ఏదో అదనంగా  ఉందని ఒప్పుకున్నట్లే. ఆ “ఏదో” లేదు అని ఎస్టాబ్లిష్ చేయడానికి తంటాలు పడుతుంటాను నేను. కరణ్ ఏ అమ్మాయి గురించి మాట్లాడినా “తన నవ్వు భలే ఉంటుంది కదా, తనకి నువ్వంటే ఇంట్రస్ట్ ఉన్నట్టుంది, తను భలే మంచిది” అంటాను. వాడు జస్ట్ నవ్వి ఊరుకుంటాడు. ఒక్కోసారి ఇదంతా మేనేజ్ చేయడం భారంగా అనిపిస్తుంది నాకు. వాడికీ బాధ లేదు కదా అని నిట్టూరుస్తాను.

మొనాటనస్ గా నడిచే ఈ ట్రాక్ ఒక చిన్న కుదుపుకి లోనైంది మా మమ్మీ వల్ల. బైదవే, మా ఇంటికి వచ్చినప్పుడు గానీ, ఆ తర్వాత మమ్మీ ప్రస్తావన వచ్చినప్పుడు గానీ కరణ్ ఒక్కసారి కూడా “ఆంటీ” అనే మాట వాడలేదు. నాతో అయితే “మీ మమ్మీ” అంటాడు, మమ్మీతో మాట్లాడేటప్పుడు “మీరు.. అండీ..” అని సరిపెడతాడు. వీకెండ్స్ లో వాడు మా ఇంటికి రావడం అన్నది కామన్ అయిపోయింది.

*****

“డ్రై క్లీనింగ్ కి ఇచ్చిన సిల్క్ శారీ విషయం గుర్తు చేయమన్నారు మీ మమ్మీ. నీకిమ్మని ఇదిగో ఈ రిసీట్ కూడా ఇచ్చారు” అన్నాడు కరణ్.

“తను నీకెక్కడ కలిసింది” అడిగాను.

“కలవడం కాదు. నేనే మీ ఇంటికెళ్లాను.”

“ఎందుకు?”

“మమ్మీకి బుక్స్ చదివే అలవాటు ఉండేదటగా. నా కలెక్షన్ గురించి చెప్పగానే చాలా ఎక్సయిట్ అయ్యారు.”

“సో, మమ్మీకి బుక్స్ ఇవ్వడానికి నేను లేనప్పుడు మా ఇంటికెళ్లావ్. గంట క్రితం నేను ఇంట్లో బయల్దేరినప్పుడు గుర్తుకురాని సిల్క్ శారీ నిన్ను చూడగానే మమ్మీకి గుర్తుకొచ్చింది. అంతేనా?” అడిగాను నేను.

కరణ్ రిప్లై ఇచ్చేలోగానే నేను చేసిన తప్పేంటో నాకు అర్థమైంది. గబగబా నోటికొచ్చిన అబద్ధం చెప్పేశాను. “పొద్దున వర్కవుట్స్ చేస్తుంటే యాంకిల్ స్ప్రెయిన్ అయ్యింది. ఈరోజు కాలేజీకి డుమ్మా కొట్టేద్దాం అనుకున్నా. కానీ ప్రాక్టికల్స్ గుర్తొచ్చి, అలానే కుంటుకుంటూ బస్టాప్ కి వచ్చా. నువ్వొస్తున్నట్లు ఒక్కమాట చెపితే నీ సొమ్మేం పోయింది. దర్జాగా నీతో కలిసి బండిమీద వచ్చేదాన్నిగా. అయినా, ఏ పని ఎవరికి చెప్పాలో ఎవరికి చెప్పకూడదో మమ్మీకి తెలియదు. ఈ చీరల గోల నీకెందుకు తగిలించినట్టు” ముద్దుగా విసుక్కుంటున్నట్టు పోజు పెట్టాను.

“ఇందులో తన తప్పేముంది? నేను మీ ఇంటికి వెళ్లుండకపోతే, పాపం తనే వెళ్దామనుకున్నారట షాప్ కి. ఇంత చిన్నపని కోసం అంత దూరం వెళ్లడమంటే కష్టం కదా” అన్నాడు జాలిగా.

“నిజమే పాపం. ఇంత చిన్నపనికి అంత దూరం వెళ్లడమంటే కష్టం కదా” కరణ్ ని ఇమిటేట్ చేశాన్నేను. అంతటితో ఆగలేదు. “అంతేలే, మీరు మీరు ఫ్రెండ్స్. మీ మధ్యతరగతి స్నేహాలు నాలాంటి పూర్ ఫెలోకి అర్థం కావు” అని కూడా అన్నాను. కరణ్ కి నా మాటల్లో వ్యంగ్యం కానీ, కనీసం నిష్టూరం కానీ కనిపించినట్టు లేదు. లేదా కనిపించనట్టు నటించాడో. పైకి మాత్రం నేనేదో పెద్ద జోకేసినట్టు పకపకా నవ్వాడు.

“నా మాటలు రాంగ్ ఇంప్రెషన్ క్రియేట్ చేసుంటే సారీ. నేను లేనప్పుడు మా ఇంటికి వెళ్లినందుకు నువ్వు సంజాయిషీ ఇవ్వాల్సిన అవసరం లేదు. వియార్ ఆల్ అడల్ట్స్.” అన్నాను.

తను ఇచ్చిన ఆన్సర్ లో అడల్ట్ అనేదాన్ని స్కిప్ చేయలేదు కరణ్. “అడల్ట్ అనే మాట ఎందుకొచ్చింది ఇక్కడ? అయినా నేనొకటడుగుతాను చెప్పు.  ఇప్పటికిప్పుడు కాకపోయినా ఫ్యూచర్ లో అయినా మనం లవర్స్ గా మారే అవకాశం ఉందని అనిపిస్తుందా నీకు?” అడిగాడు.

“లేదు.”

“ఏం లేదు?”

“మనం ఎప్పటికీ లవర్స్ గా మారే ఛాన్స్ లేదు. నేనిలా అంటున్నందుకు దయచేసి అఫెండ్ అవ్వొద్దు. కానీ, మన మధ్య ఆ కెమిస్ట్రీ ఎప్పుడూ లేదు.” మమ్మీని వాడికి పరిచయం చేసుండకపోతే, ఈ సమాధానం ఇంత గట్టిగా చెప్పుండేదాన్ని కాదేమో అని అనిపించింది నాకు.

“ఇందులో అఫెండ్ అవ్వడానికేముంది? నిజం చెప్పాలంటే నా ఒపీనియన్ కూడా అదే. ఇద్దరికీ క్లారిటీ ఉందన్న విషయం ఇద్దరికీ తెలిసుండడం మంచిదని అడిగానంతే”, కూల్ గా చెప్పాడు కరణ్. వాడి గొంతులో నిరాశ లేదు. వాడి రెస్పాన్స్ నన్ను నాకేమంత సంతోషాన్నివ్వలేదని గ్రహించిన దాఖలాలు కూడా లేవు.

****

తెల్లారితే కార్తీకమాసం. “ఆ పూజల గోల మొదలైందంటే మళ్లీ నెలవరకూ ఇంట్లోకి నాన్‌-వెజ్ తేనివ్వవు. అందుకని ఈరోజు చికెన్, మటన్ అన్నీ చేసుకోవాల్సిందే” అన్నాను అమ్మతో. “పొద్దున్నే ఇల్లంతా కడిగాను. పైగా ఇంటి నిండా పూజ సామాను పెట్టుకోని అవేం పాడు పనులు” అంటుందేమో అనుకున్నా. వెంటనే సరే అంది. కరణ్ ని కూడా పిలిచాం. ఏదో పనుందట. ముందు రావడం కుదరదనీ, కరెక్ట్ గా భోజనం టైముకి వస్తాననీ చెప్పాడు.

“ఈ చీర నాకెలా ఉంది?” అద్దంలో చూసుకుంటూ అడిగింది మమ్మీ. నెమలి పింఛం రంగు చీర. నిజంగా చాలా బావుంది. మొన్న కొన్న కొత్తచీర కాదని, పెట్టెలో నుండీ దీన్నెందుకు బయటకి తీసిందో. కరణ్ ఫేవరెట్ కలర్ ఏంటో గుర్తు చేస్కోవడానికి ట్రై చేశాను. బహుశా మమ్మీకి తెలుసేమో.

“యూ లుక్ సెడక్టివ్. ఇవాళ కరణ్ గాడు నీకు ప్రపోజ్ చేసినా ఆశ్చర్యం లేదు”. కావాలనే అన్నాను.

“అన్నీ పిచ్చిమాటలు” నవ్వుతూ వంటిట్లోకి వెళ్లిపోయింది. మిడ్ నైట్ వరకూ వెబ్ సిరీస్ చూసి ఉన్న ఎఫెక్ట్ తో నేను నా రూమ్ లోకి వెళ్లి ముసుగుతన్ని పడుకున్నాను. లేచేసరికి మమ్మీ, కరణ్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చోని ఉన్నారు. మమ్మీ బుక్ చదువుతోంది. వాడు ఎవరితోనో చాటింగ్ చేస్తున్నాడు. మేం ముగ్గురం కలిసి గతంలో స్పెండ్ చేసిన టిపికల్ టైమ్స్ లాగా గడవలేదు ఆరోజు. మమ్మీ ఎందుకో గానీ మూడీగా ఉంది. పెద్దగా మాట్లాడలేదు. కరణ్ మాత్రం చాలా ఉత్సాహంగా కనిపించాడు. మేమిద్దరం కనీసం ఊ కొడుతున్నామో లేదో కూడా పట్టించుకోకుండా నాన్-స్టాప్ గా మాట్లాడుతూనే ఉన్నాడు.

ఆరోజు ఇంకో విశేషం కూడా చోటు చేసుకుంది. వెళుతూ వెళుతూ “థేంక్స్ ఫర్ ద లంచ్ ఆంటీ” అన్నాడు కరణ్. వాడు ‘ఆంటీ’ అని పిలవడం అదే మొదటిసారి అని గమనించినట్టు లేదు మమ్మీ. ‘వెల్ కమ్’ అని వినబడీ వినబడనట్టు చెపుతూ లోపలికెళ్లిపోయింది. తను వెళుతూ ఉండగా గమనించాను నేను. ఉదయం అద్దంలో చూసుకుంటూ మురిసిపోయిన చీర కాదు తను కట్టుకుంది.

“సాయంత్రం కలుద్దాం. నీతో ఒక ఇంపార్టెంట్ మేటర్ డిస్కస్ చేయాలి” బైక్ దగ్గరకి వెళుతూ చెప్పాడు కరణ్. ఏమై ఉంటుందా అని ఆలోచించడం మొదలు పెట్టాల్సిన నా మెదడు అసలు వాడి మాటల్ని సరిగ్గా రిజిస్టర్ చేసుకోను కూడా లేదు. మమ్మీ ఎందుకలా ఉందా అనే ఆలోచన సబ్ కాన్షస్ మైండ్ లో రన్ అవుతోంది. ఏమనుకున్నాడో ఏమో బైక్ దాకా వెళ్లినవాడు మళ్లీ వెనక్కి వచ్చాడు. “సాయంత్రం కలవడం వీలవ్వుద్దో లేదో, ఇప్పుడే చెప్పేస్తా” అన్నాడు సిగ్గుపడుతూ. నాకు విషయం అర్థమైంది. వాడు ఎవరితోనో లవ్ లో పడ్డాడు.

“ఎవరు?” అడిగాను.

“సింధు” అంటుంటే వాడి మొహంలో ఆనందం దాగడం లేదు.

“ఎవరు, మన కృష్ణవేణి వాళ్ల చెల్లెలా?”

“అవును”

“ఎప్పటినుండీ?”

“టూ మంత్స్. ఎగ్జాక్ట్ గా చెప్పాలంటే… ఆంటీ బర్త్ డే సెలెబ్రేట్ చేసుకున్నాం కదా. ఆ రోజు ఇంటికి వెళుతుంటే,  లైబ్రరీ ముందు నిలబడి, ఆటో కోసం వెయిట్ చేస్తూ కనిపించింది సింధు. ఆగాలా వద్దా అని నాకేమో డైలమా..” చెప్పుకుపోతున్నాడు. ఇంతలో వాడి ఫోన్ కి ఏదో నోటిఫికేషన్ వచ్చింది. ఎదురుగా ఒక మనిషి ఉందన్న సోయి లేనట్టు మొబైల్లో ఏదో టైప్ చేసుకుంటూ వెళ్లిపోయాడు. తలుపు దగ్గరకి వేసి లోపలికొచ్చాను నేను.

“తిండి విషయంలో నీకు మీ నాన్న పోలికే వచ్చింది. తనూ ఇంతే. పండగపూట నాన్-వెజ్ వండనంటానని ఆ ముందురోజు నాలుగైదు రకాలు చేయించేవాడు” పెళ్లి ఫోటోని చీరచెంగుతో తుడుస్తూ చెపుతోంది మమ్మీ. ఫోటోలో మమ్మీ వంటిమీద నెమలిపింఛం రంగు చీర నన్ను వెక్కిరిస్తోంది. తిథుల ప్రకారం చూస్తే నాన్న చనిపోయింది ఈ రోజే.

*

శ్రీధర్ బొల్లేపల్లి

4 comments

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • చాలాబాగుంది మిత్రమా. కొన్ని క్షణాలపాటు ప్రపోజ్ చేస్తాడేమో అనిపించేలా రాశావ్, ఎనీహౌ

    వాన కురుసద్దేమోనని రోజూ గొడుగు సంకనేశుకుని తిరిగితే ఏదోఒకరోజు పక్కూరికిపొయ్యి కురిసిందన్నట్టుంది ఆ పిల్ల క్యారెట్టరు. అభినందనలు.

  • మీ కథ నాకు నచ్చలేదు ఆడాళ్లు ఇద్దరూ ఈ తరంలో ఉన్న ఈ తరానికి పనికిమాలిన వాళ్ళు. కూతురిని ఒక ఆల్మోస్ట్ పురుష ద్వేషి లాగా తయారు చేసింది ఆ తల్లి .పిల్లేమో కనీసం అమ్మకి ఉపయోగపడేటట్టుగా అయినా ప్రవర్తించకుండా వాడిని వదిలేసేసుకుంది పోనీ తనకైనా వాడితో కలిసి బతకాలని అవకాశం ఉన్నా కూడా ఆ అవకాశం పోగొట్టుకుంది. కరణే ప్రాక్టికల్ పర్సన్ ఫర్ దీజ్ టైంస్.

    • మీకు పాత్రలు నచ్చలేదా? కథ నచ్చలేదా? అన్నది నాకు అర్ధం కాలేదు. ఆ పాత్రల మీద మీకు కోపం వస్తే కథ బావున్నట్టే. ఎందుకంటే ఉత్తమ పాత్రలు, ఆదర్శ పాత్రలు ఉన్న కథ కాదు యిది. మనుషుల్లో వుండే dark angles, వాటికి కారణాలు అన్వేషించే ప్రయత్నం యిది. అంతే.

      తల్లి తప్పేమీ కనిపించలేదు నాకు. కూతురిలో ఆత్మన్యూనత లేకుండాచూడల్సిన బాధ్యత ఆమెకి ఉందని మనకి అనిపించవచ్చు. కానీ, అది ఆవిడ అవగాహనకి అందని విషయం. ఉద్దేశపూర్వకంగా ఆమె చేసిన తప్పు ఏమీలేదు. కూతురి విషయానికొస్తే.. మనందరం‌ పరిస్థితుల చేతుల్లో పసిపాపలం. తనలో ఉన్న లోపాన్ని భూతద్దంలో చూసుకుంటూ, దానికి తల్లిని నిందించే అభాగ్యురాలు ఆ పిల్ల.
      Thank you for your feedback 🙏

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు