రోజూ బడికి వెళ్ళాల్సిన మాస్టారిప్పుడు బారుకు వెళుతున్నారు.
కరోనా కాదుగాని పరీక్షలకు ముందే బడులు మూసుకున్నాయి. బడులు తెరవకముందే వోపెన్ బారుదుకాణాలు బారుగానే తెరచుకున్నాయి. ఖాళీగా కూర్చోబెట్టి జీతాలిచ్చి మేపడం యెందుకని అనుకున్నారేమో అధికారులు- బడిలో వుద్యోగం బహిరంగ బారు దగ్గరికి మారింది.
“ఏం మాస్టారూ… మీకూ గొంతెండిపోతోందా?” క్యూలో వున్న పెద్దమనిషి కుషీగా అడిగాడు.
“ఆరు వారాలయి అందరికీ గొంతెండిపోతోంది, మాస్టారు మనిసి కాడేటి?” నవ్వకుండా సీరియస్సుగానే అన్నాడు తోపులాటకు పెద్దమనిషి మీద పడుతూ చిన్నమనిషి.
“ఏటి తాగక ముందే జూగిపోయి మీద పడిపోతన్నావేటి? అంత కిక్కెక్కీసిందేటి?” అంటూనే తన ముందున్న మరో మనిషి మీద పడ్డాడు పెద్దమనిషి.
అంతా వొకర్ని వొకరు తోసుకుంటూ వుంటే “దూరం దూరంగా వుండండి… సామాజిక దూరం పాటించండి” అని మాస్టారు క్లాసులో అరిచినట్టే అరిచారు. గొంతునొప్పి పుట్టింది.
పిల్లలు విన్నట్టు పెద్దవాళ్ళు వినలేదు.
“మీకే చెప్పేది, యిలా అయితే కరోనా వొస్తుంది” హెచ్చరికగా అన్నారు మాస్టారు.
“కరోనా లిక్కరే గదా… క్వార్టరు వేసుకుంటే సరిపోతుందా?, ఆఫు వేసుకోవాలా మాస్టారు?” బుద్దిగానే అడిగాడో బక్కపల్చటి మనిషి.
“ఫుల్లేసుకోవాలి” అన్నాడు బట్టతల మనిషి.
“మేసారూ అమ్మవొడి డబ్బులు యెప్పుడు వొస్తాయి… యియ్యేడు?” పిల్లాడు డౌట్ అడిగినట్టే అడిగాడు ముసిలి మనిషి.
“అమ్మ వొడి అన్నార్రా… అయ్యా పంచి అన్లేదు” కిసుక్కున నవ్వాడు బక్కపల్చటి మనిషి. ముందుకీ వెనక్కీ తోస్తుంటే వుయ్యాల వూగుతున్నట్టు వుందన్నాడు.
“మీయావిడ డబ్బులు నీవి కావేట్రా?” పెద్దమనిషి నిజంగా పెద్దమనిషిలాగే అడిగాడు.
“మరి?” అని వొరుసలో వున్నోళ్ళందరూ వొంత పాడారు.
వాళ్ళ మాటల్ని పట్టించుకోకుండా “దూరం దూరంగా వుండండి” అన్నారు మాస్టారు.
“ఇప్పుడు యింటికి తాగెలితే మా ఆవిడ అచ్చం యిలాగే అంటాది…” చిన్నమనిషి పెద్దగా సిగ్గుపడ్డాడు. ఆ మాటతో అందరూ నవ్వారు.
“ఇంతకీ అమ్మవొడి డబ్బులు యెప్పుడొస్తాయో చెప్పినావ్ కావ్ బావ్” అన్నాడు బట్టతల మనిషి.
“మనం బేగి మద్యం కొంటే… గవరమెంటుకి బేగి బేగి డబ్బులొస్తే… అమ్మవొడి అనీసి యిస్తాది… పిల్లల సదువులకని పదేను వేలు” అన్నాడు వొలాం మనిషి.
“ఓస్… మన డబ్బులు మనకే యిస్తాదే మరేటి?” అందులో గొప్పతనం లేదన్నట్టుగా అన్నాడు పీనుగు మనిషి.
“ఆడు ఆడి …నడిపేట్లోంచి తెచ్చిగాని యిస్తాడేటి? మనడబ్బులు మనకే యిస్తాడు గాని” తప్పిన క్యూలోంచి మళ్ళీ క్యూలోకి చేరుతూ అన్నాడు బక్క పల్చటి మనిషి.
“అలగ యిచ్చిన యింకొక నంజికొడుకుని సూపించిమి” ఆవేశపడుతూ అన్నాడో కుర్ర మనిషి.
“ఏ నంజికొడుకు యిస్తే ఆ నంజికొడుకే గొప్పోడు. మగానుబావుడు. దేవుడు” ఆకాశంకేసి చూస్తూ చేతులు జోడించాడు ముదర మనిషి.
క్యూ అంతకంతకూ పెరిగిపోతోంది. మరింత తోసుకొని జనం వొకరి మీద వొకరు పడుతున్నారు. మాస్టారు వెళ్ళబోతే, “అటెందుకు బాబూ… మీరెక్కడ నిలబడినా జీతమొస్తాది” అన్నాడు. మంచి మాటే అన్నాననుకున్నాడు వొలాం మనిషి. ఆ మాట మాస్టారుకు చివుక్కుమన్నట్టే వుండి వినపడనట్టే వుండిపోయారు.
“మనం యెంత నిలబడినా కాలు నొప్పులు తప్ప జీతాలు రావు” అన్నాడు బానకడుపు మనిషి.
“ఆ నొప్పులు పోడానికే మందు… డాక్టరు పీజు లేకుండా” నవ్వుతూ అన్నాడు యేనుగు మనిషి.
“అమ్మవొడి నెలకు యెంత పడతందో లెక్కెయ్యిమీ” అన్నాడు ముసిలి మనిషి.
“ఎంత? పదేనేలు. పన్నెండు నెల్లు. నెలకి వెయ్యి. పన్నెండేలు. పోను మూడేలు. పన్నెండుకి సర్దు. రొండొందల యాబై. మొత్తం పన్నెండొందల యాబై..” పెద్దమనిషి చెప్పడం పూర్తి కాలేదు.
“అంతేమరి. మనదగ్గర వారానికి కొట్టేసింది నెలకి యిస్తన్నాడన్న మాట” ఆలోచనగా అన్నాడు చిన్నమనిషి.
“నీ నెత్తికాయ్… నాల్రోజులల్ల మనం తాగింది మనకి నెలకి యిస్తున్నట్టు. మనం రొండు నెల్లుకు తాగింది మనకు పన్నెండు నెల్లుకు యిస్తున్నట్టు. కాదేటి? నిన్న పాతిక యియ్యాల మల్ల యాభై పెర్సెంటు పెంచేసినారు, రేపు వొంద పెర్సెంటు పెంచినా పెంచుతారు. ఏమన్నా అంటే తాగుడు మాన్పించడానికి అనీసి తాగుబోతోడి కంటే అన్యాయంగా మాట్లాడతన్నారు… యీల యమ్మావోలి…” తిట్టుకున్నాడు యేనుగు మనిషి.
“గవర్నమెంటు బాగానే మనదగ్గిర గుంజతంది, రేపుట్నుంచి యెలగ బతకడమో?” నిట్టూర్చాడో నీరసం మనిషి.
“మనకాడ గుంజిన డబ్బుల్తోటి యీ మేస్టార్లనీ ఆ పోలీసుల్నీ అందర్నీ పెంచొద్దేటి” గీరగా మీసం తిప్పుతూ అన్నాడు బక్కపల్చటి మనిషి.
“అమ్మవొడి డబ్బులు ఆల సొంత సొమ్మయినట్టు యీ ఆడనంజలతోటి జట్టి…” అన్నాడు బట్టతల మనిషి.
అలాంటి మాటలు మాట్లాడితే క్లాసులో అయితే వీపు వొంచి దబీదబీమని గుద్దేవారు మాస్టారు. ఇప్పుడు తన వీపు మీదకు రాకుండా వుండాలన్నట్టు నోటి మీద వేలేసుకున్నట్టుగా వుండిపోయారు.
“కూ కదల్డం లేదు, కొద్దిగ కదిలినట్టు సూడిమీ మేస్టగోరూ, ఆ అమ్మినోడు యేటి కునుకుతన్నాడేటి?” అన్నాడు ముసిలి మనిషి.
విధి లేనట్టుగా మాస్టారు వెళ్ళబోయారు.
ఇంతలో జనం తోసుకున్నారు. “నాను ముందు” అంటే “నాను ముందు” అని. క్యూ లేదు. గ్యూ లేదు.
పంటి బిగువున పట్టీ పట్టీ పట్టలేక వొదిలినట్టు “వొరే కరోనా వొచ్చి చస్తార్రా. ఒక్కడికి వున్నా చాల్రా. అందరికీ అంటుకొని చస్తార్రా” గిలగిల గింజుకున్నారు మాస్టారు.
అప్పుడొక పోలీసోడు చేతిలో దుడ్డుకర్ర వూపుకుంటూ లార్డు కర్జనులాగ వొచ్చాడు. ఆగాడు. ఖైనీ పేకెట్టు చింపి అరచేతిలో వేసి తీరికగా నలిపి పెదవంచున పెట్టుకున్నాడు. ఆనక “ఆ లంజకొడుకులకీ బుద్ధి లేదు, యీ లంజకొడుకులకీ బుద్ధి రాదు, కరోనా అంటిన దాక” అని, “పిల్లలకి చెప్పినట్టు చెపితే పెద్దోళ్ళు వింటారేటి మేస్టూ? అయినా పిల్లలే బెత్తం లేకపోతే మీ మాట ఖాతరు చెయ్యరు?” అని తన చేతిలో దుడ్డు కర్రను మాస్టారి చేతిలో పెట్టాడు.
మాస్టారు అర్థంకానట్టు చూసారు.
“ఇది దుడ్డుకర్ర కాదు. బెత్తం. మీరు మాస్టారు కాదు. పోలీసు. మీరు అర్జునుడు కాదు. నేను కృష్ణుడూ కాదు. ఇది మాత్రం కురుక్షేత్రమే” అన్నాడు పోలీసు. అని నవ్వాడు.
మాస్టారికి జ్ఞానోదయం అయినట్టే వుంది కాని అవలేదు. అది ముఖంలో కనిపిస్తోంది. అది చూసి “ఇదే మీకు ట్రైనింగ్ అనుకోండి. పుచ్చలు పగలగొట్టీయండి. వీపులు చీరీయండి” అన్నాడు పోలీసు.
చేతిలో కర్రను యెన్నడూ చూడనట్టు చూస్తున్నారు మాస్టారు.
“రూల్స్ బ్రేక్ చెయ్యడంలోనే రూలింగ్ వుంటాది” పోలీసోడు ఫుల్ పవర్స్ మనవేనన్నట్టు చూసాడు.
మాస్టారి చేతులు వణుకుతున్నాయి. చేతిలోని దుడ్డుకర్ర వూగుతోంది. జనం తోసుకు రాసుకు పూసుకోవడంలో దుమ్మూ ధూళీ రేగుతోంది. పొగలాగ.
క్యూ వెతికినా కనిపించడం లేదు.
అలా చూస్తుంటే తన చేతులు దురద పెడుతున్నట్టు గోక్కున్నాడు పోలీసు. “క్వార్టర్ వేసుకుంటారేటి?” అని, ధైర్యం వస్తాది” వెటకారంగా నవ్వాడు. కాదు, రెచ్చగొట్టాడు. “కాసేపు యీ పశువుల్ని పిల్లలనుకోండి… దున్నేయండి… వూ…” అని ముందుకు తోసాడు.
మాస్టారు దుడ్డుకర్ర బలంగా యెత్తి కొట్టారు. జనం మీద కాదు. జనం నిలబడ్డ నేలమీద. బుగ్గి అగ్గిలా రేగుతోంది. కళ్ళ నిప్పులు కాలుతున్నాయి.
అలా కొడుతూ మాస్టారు కదా- మనసులో యిలా అనుకున్నారు.
‘ఈ దెబ్బల్లో వొక్క దెబ్బ యీ దేశాన్ని యేలే వాళ్ళమీద… యీ రాష్ట్రాన్ని యేలే వాళ్ళమీద… పడితే యెంత బాగుణ్ణు. కరోనా కంట్రోలు అయిపోను’
ఆమాట అనుకోవడంవల్లో యేమో జనం కూడా అప్పటికి క్యూలోకి వచ్చారు?!
*
కధ బాగుంది. నేటి పరిస్థితులకు అద్దం పట్టింది.
నవ్వూ, కన్నీళ్ళు తెప్పించే సంభాషణలు.తూకమేసినట్లున్న బమ్మిడి భాషణలు.
చాలా బాగా రాశావు గా రాసిన తీరు ఆసక్తిగా చదివింప చేసింది జగదీశ్వరరావు
ఎంత సిగ్గుచేటైన విషయం. లిక్కర్ కోసం తోపులాట, దానికి కర్రలతో కాపలా కాయడమూనా?
ప్రస్తుత దౌర్ భాగ్య పరిస్తితికి దర్పణం ఈ కథ మనను కదిలించి కలత పడేలా చేసింది ..
రచయితకు అభినంధనలు..
సందర్భోచితమైన కథ! సరిగ్గా రాశారు.
రావి శాస్త్రి, కాళీ పట్నం మేస్టారు — ఇద్దరూ కలిసి జంట కథకులు గా ఏర్పడి కథ రాస్తే ఎలాగుంటుందో అలాగుంది ఈ కథ. బమ్మిడి జగదీశ్వర రావు గారికి అభినందనలు.
సాహిత్య జీవితంలో నా రచనకు ఇచ్చిన పెద్ద కితాబుల్లో ఇదొకటి. మీ అందరి అభిమానానికి కృతజ్ఞతలు!
నిజం మేసారూ! ఏలినోళ మీద ఒక్క దెబ్బైనా పడాల. ఎలాగైనా. అప్పుడు గాని లైన్లోకి రాదు దేశం.