| సొడలు సొడలు పోతున్న కాలపు యవ్వనాన్ని చేప పొలుసుల్లా రాల్చేసుకుంటున్న ఎర్రని సూర్యాస్తమయాల వొంటరి వసంతం. నీడనిచ్చే జీవితపు చివరి గడియల్ని గులకరాళ్లు పోగేసుకుని లెక్కలేసుకుంటూ తన గోడు ఎల్లబోసుకుంటది.ఎంతజెప్పినా ఇనని మావుల మన్సులు పోతాపోతా రఖం కట్టేపోతరు. 1. పాదులు తీత్తాంటడొకడు.వాడిదో ఎర్రితనం.ఆకుపచ్చ జుబ్బా , రంగురంగుల కుల్ల తొడిగి మురిసిపోవాలనేదే చివరి కోరిక. ఎవనికి పట్టిన తీట జెప్పు?ఎవని నెత్తిమీద వాడే చెయ్యేసుకుని బూడిదయ్యే రకాలున్నంతకాలం! 2. ఆశ ఎప్పటికీ శాశ్వతం.ఉఫ్ మని ఊదినప్పుడు చింతనిప్పుల్లా మనసు పొరల కింద ధగధగమని మెరుస్తూ కండ్లల్ల సూర్యోదయాన్ని కన్నట్టుంటది. కోడి ముక్కు రాకినట్టుండే మనస్తత్వం కానే కాదు.అందుకేనేమో పచ్చని చెట్లనడ్మ రామచిలుకలా ఎగరాలనుకుంటడు! పశిగడుగుల నీళ్లైనా పాదులు తీశినకాన్నే పారబొయ్యాలంటడు.అదో తత్త్వమైనట్టు ..పచ్చదనం నిండిన మాటలు మూటలు గట్టి పొద్దంతా రికాం లేకుండ నపరింత పంచిపెడుతనే వుంటడు. 3. చేయి సలువే అనుకుంట..పట్టిందల్లా పచ్చని మొలకై ఇగురెక్కుతాంటది. ఎంత సంబురపడుతడో!పసిపోరనిలెక్క కేరింతలు కొడుతూ ఎగిరిదున్కుతాంటడు. ఎవడిపిచ్చి వాడికానందమని తొవ్వపొంటి పోయేటోల్లు గులుక్కుంటనే దబ్బ దబ్బ నడ్శిపోతరు.అతనెవరి దెప్పిపొడుపుల్ని లెక్కజేయడు.అతనంటే ఎవరికీ పట్టింపు లేదు.మనుషులనే జాతి ఏర్పాటుజేయని వనప్రేమికుడు. ఆదిమానవుడికి ముత్తాతలెక్కుంటడు. ఆకులుసుట్టు అతన్ని సూత్తాంటె ..గుప్పెడు మట్టయ్యేలోగా పచ్చని చెట్టవ్వాలనుంది.ఆకుపచ్చ జుబ్బా..రంగులకుల్ల తొడుక్కొని ప్రపంచమంతా చుట్టేయాలనుంది. * చిత్రం: సత్యా బిరుదరాజు  | 
 
            







Add comment