“ఆగాగు..యాడికి వోతున్నరు..”
కదిలితేనేదప్ప
మనుషులుగా గుర్తింపబడని రెండుఅస్థి పంజరాలు..
” సాబ్..ఊరికివోతున్నం..
” ఎంతదూరముంటది “
” సాబ్.. నలభై కిలోమీటర్లుంటది.
ఇప్పటికి రెండొందలు నడిచొచ్చినం”
వెనక్కిజూశాడతను, గాజుకళ్ళతో..
మన పిచ్చిగాని
దూరాల్ని కిలోమీటర్లతో కొలుస్తామా..
పగిలిన కాళ్ళబొబ్బల్తోనో
ఇంకిన కళ్ళబావుల్తోనో
చెమట ఉప్పుదేరిన శరీరాలతో
కొలుస్తాంగాని..
“పిల్లాడు ఆకల్తో ఉన్నట్టున్నడు “
“సాబ్..వాడికిపుడు ఏఆకలీలేదు.
వాడు ఆకలితోనే చచ్చిపోయిండు “
గడ్డి పరక మెలిదిరిగిపోయింది
పక్షి అరవడం మానేసింది
ఆకాశంభోరుమంది
“సాబ్..వీణ్ణి ఊరికి దీస్క పోనీయండి
సావుదినాలన్నజెయ్యాలెగదా..
మీరు ఆగమంటే ఆగిపోతం.
ఊరికివోయి చేసేదేమున్నది
మారెండు పానాలు వాడే దీస్కపోయిండు “
గొంతుపూడుకుపోయింది.
2
ఊపిరిజెండా
తన తల్లి రూపాన్ని
గుండెల్ల ఎంతగ భద్రపర్చిండో
తనతల్లి కలలసాకారంకోసం
తన అడుగుల నెంతగచెక్కుకున్నడో
తల పగిలి రక్తమోడుతున్నా
తల్లినే యాదిజేసుకున్నడు
ఇపుడా తల్లి
చౌరస్తాలో నిలబడి
తన కొడుకేడని ప్రశ్నిస్తున్నది
అందమైన కలలతో
యూనివర్శిటీల అడుగుపెట్టినోడు
మాయమెట్లవుతడని
మాయాజాలపు పొరలవిప్పుతున్నది
భూమి మింగిందా
ఆకాశం మింగిదా
నదిలగలిసిండా
సముద్రమే గలుపుకున్నదా
తేల్చి చెప్పండని అడుగుతున్నది
రాసినపెన్నూ
చదివినపుస్తకమూ
దిగినఫోటోలు
తిరుగాడిననేలా
తనను జ్ఞాపకాలై నడిపిస్తున్నాయనీ
ఎంతమంది జ్ఞాపకాలను
ఎంతకాలం తుడిచివేస్తారనీ
మీ మతాలనూ, మీచట్టాలనూ
రక్త మంటిన మీ సింహాసనాలనూ ప్రశ్నస్తోంది
ఇది పురాతనజ్ఞానదేశమనీ
జ్ఞానమంటే ప్రశ్నించడం కూడానని
తనకొడుకు చచ్చిండో బతికిండో
మనిషో శవమో తనను చేరేదాక
తాను ప్రశ్నిస్తూనే ఉంటాననీ
కత్తుల పహరాలమధ్య
నిశ్చలజ్వాలలా మండుతూనే ఉంటాననీ
తన ఊపిరాగిపోయేలోపు
తన ఊపిరిజెండాను
ఉరికొచ్చే తరానికి కాగడాగ అందిస్తాననీ
గడప గడపకూ సందేశం పంచుతోంది
మా..తుఝే సలాం
రెండు సంవత్సరాలుగా కొడుకుఆచూకి కోసం అలుపెరుగని పోరుజేస్తున్న నజీబ్ తల్లికి…
Baavunnaayi