ఇటీవల ఆంధ్రజ్యోతి దినపత్రిక (వివిధ) లో “వాళ్ళు ఇల్లు చేరాలి” కవిత చదివినప్పటి నుండి మనసును పట్టి వేధించే కొన్ని ప్రశ్నలు. ఇలా ప్రశ్నలు వేసుకుంటూ వీటికి మూలాలెక్కడ వున్నాయో అని వెతుకుతూ వున్నాను. కవి గాజోజు నాగభూషణం సమాధానం చెప్పకుండా దాటవేసి మరిన్ని ప్రశ్నల్ని గుప్పించి కవితను ముగించాడు.
వాళ్ళు ఇల్లు చేరాలి !
~
వాళ్ళు ఇల్లు చేరాలి
కళ్ళల్లో కడపటి ఆశల్ని మొలిపించుకొని
గుండెలపై వలస ముద్రల్ని పొడిపించుకొని
ముళ్ళ దారుల్ని, మైలురాళ్ళను, మానవనైజాలను
వెక్కిరిస్తూ, ధిక్కరిస్తూ, దిగులు గుట్టల్ని మోసుకెల్తున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
ఆది మానవుడి ఆకలి వేటకాదీ నడక
ఆధునిక అంతరాల కంచెలపై
పావురాల నెత్తుటి పాదముద్రల పాట.
రాత్రీ పగల్ల కాలగతులను కాల్చుకుంటూ వెళుతున్న
వాళ్ళు ఇల్లు చేరాలి.
కర చాలనాలకు దూరమైన కథ ఇప్పటిదేం కాదు
మూతికి ముంత-ముడ్డికి తాటాకు కట్టిన చేతులే
మూకుమ్మడి సానిటైజర్ స్నానాలు చేయిస్తున్నాయి
రూపం మారిన అన్ టచేబుల్ ఆట.
ఆజ్ఞల గండాలు దాటి అగ్నిపునీతులై
వాళ్ళు వాళ్ళ ఇల్లు చేరాలి.
కాళ్ళల్లో తిరిగిన పిల్లి పిల్లకు కంకెడు
ముద్దవేసిన కారుణ్య మెటు పాయె
చూరులో పిట్టల కోసం వరి గొలుసులు కట్టిన
మానవత్వమేమై పోయే
కంటి రెప్పలకు తాళాలేసుకున్న
మన ఇంటి గుమ్మాలను దాటుకుంటూ
కదిలి పోతున్న కళే బరాల గుంపు
వాళ్ళ వాళ్ళ ఇళ్ళకు చేరాలి.
ఇల్లు చేరాక ఏమౌతుంది ?
ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నొకటి సలపరిస్తుంది.
అటునుంచి ఇటు – ఇటు నుంచి అటు
ఆకలి తరిమే వేటలో
నడక ఆగేదెప్పుడు?
ఆకలి లేని లోకానికి సాగిపోతున్న
కొత్త దారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా ?
– గాజోజు నాగభూషణం
*
అసలు వాళ్లు ఎవరు ? ఈ కరోనా సమయంలోనే వీళ్లెందుకు వెలుగులోకి వచ్చినట్టు? వాళ్లు వాళ్ల ఇళ్లకు వెళ్లడమే వారి సమస్యకు పరిష్కారమా!
*
అసలేం చెప్పిండు కవి అని ఆరా తీయడం మొదలుపెట్టాను. తిరిగి తిరిగి అలసిపోయి మళ్లీ అదే ప్రశ్న కాడ ఆగిపోయాను. ఏమిటా ప్రశ్న?
“ఆకలి లేని లోకానికి సాగిపోతున్న కొత్తదారుల్ని ఈ పాదాలకెవరైనా పరిచయం చేస్తారా? “
ఎంత సులువుగా ప్రశ్న వేసాడు అనిపించింది. నేనేమో భూమి పుట్టుక, దానిపై జీవం పుట్టుక అలా అలా జీవపరిణామక్రమాన్ని తిరిగేసాను. ఏం తేలింది? ఏ జీవికైనా బతకడానికి తిండి కావాలి. అది లేకపోతే, దొరక్కపోతే పుట్టేది ఆకలి. మరి మనిషికి తిండి ఎలా? అప్పుడు ఆదిమానవుడు గుర్తుకొచ్చాడు. అక్కడి నుండి దశల వారిగా మనిషి అంచెలంచెలుగా ఎదిగి వచ్చిన తీరును పరిశీలించాను. చివరికి ఎంత శాస్త్రీయ జ్ఞానాన్ని సంపాదించినా, ఆధునిక సాంకేతికతను అభివృద్ధి చేసినా ఆకలికి మందు కనిపెట్టలేకపోయాడని నిర్ధారించుకున్నాను. అంటే ఆ మందు అమృతం లాంటిదన్నమాట. ఒకసారి తాగితే మళ్లీ ఆకలి వెయ్యకూడదు. కానీ ఏం లాభం?
ఇప్పుడు నా దృష్టి పారిశ్రామిక విప్లవం మీద పడింది. దాని ప్రభావం వల్ల ప్రపంచమెంతగా మారిందో కండ్లముందు చరిత్రంతా గిర్రున తిరిగింది. ఇదంతా ఎవరి కష్టం అని ఆలోచిస్తే “కార్మికులు” ప్రత్యక్షమయ్యారు. ఎవరు వీళ్లు? కవి చెప్పిన “వాళ్లు” వీళ్లేనా? అవునని తెలిసింది. కార్మికుని శ్రమ లేనిదే ఉత్పత్తి లేదని అర్థమైంది.
ఇంకొంచం లోతుకు దిగితే వారిని బానిసల్లా చూసిన సంఘటనలు ఎదురయ్యాయి. రోజుకు 18 గంటలు పనిచేయడమంటే మాటలా? పోరాటం మొదలైంది. ఎంతో మంది కార్మికుల రక్తం ప్రవహించగా ప్రవహించగా చివరికి రోజుకు 8 గంటల పని చేయడాన్ని సాధించుకున్నరు. ఇది జరిగింది చికాగో (అమెరికా) లో 1886 మే 1 న. ఆ రోజును పురస్కరించుకుని “మేడే” జరుపుకుంటున్నాము.
“కార్మికులకు భద్రపరచుకోవడానికీ, పదిలపరచుకోవడానికీ ఏమీ లేదు. వాళ్ల జీవితలక్ష్యం సొంత ఆస్తికి గతంలో వున్న సకల భద్రతలనూ, సకల రక్షణలనూ ధ్వంసం చేయడమే”
– (కమ్యూనిస్ట్ మేనిఫెస్టో, పుట.45)
పైన చెప్పిన పని సాధ్యాసాధ్యాలు ఆచరణ వరకు వచ్చేసరికి వీలుపడలేదని, ఆ దిశగా ముమ్మరమైన అడుగులు పడలేదని తేలిపోయింది.
ఆ తర్వాత వీరి సంక్షేమం కోసం “కార్మిక చట్టాలు” తయారుచేసుకున్నాం. వీటి అమలు బాధ్యతను రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాల చేతుల్లో పెట్టాం. అంటే వారి సంక్షేమం ప్రభుత్వం చేతుల్లోనే వుంది. మరి ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయని ప్రశ్న వేసుకున్నాను. నెలకు రూ. 3000/- లు పెన్షన్ ఇచ్చి చేతులు దులుపుకుంటుందని తెలిసింది. కనీస వేతనం ఇస్తూ ఉపాధిని చూపెట్టాల్సిన ప్రభుత్వమే ఇలా చేస్తే ఏం చేయగలుగుతాం అనిపించింది.
భారతదేశం లాంటి అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంలో ఆకలి, నిరుద్యోగం ప్రధాన సమస్యలు. చదివిన చదువులకు కొలువులు దొరకవని అర్థమైంది. అందుకే చదువుకున్న నిరుద్యోగులు కూడా అసంఘటిత రంగంలోపనిచేయడం మొదలైంది. ఆకలి తీరాలంటే తిండి కావాలి. తిండి పెట్టే రైతు వ్యవసాయం వదిలిపెట్టి నగరాలకు వలసపోతున్నాడు. అడ్డా మీది కూలీ అవతారం ఎత్తుతున్నాడు. వ్యవసాయమే లేనపుడు వ్యవసాయకూలీల అవసరం వుండదు. రైతుల వెనుక రైతుకూలీలు బాట పట్టారు. రైతే లేకపోతే గ్రామీణభారతంలో చేతివృత్తుల అవసరమేముంది? వాళ్లు కూడా నగరానికే వచ్చారు. గ్రామ స్వరాజ్య భావనకు తూట్లు పొడుచుకున్నం. రైతెందుకు వలసెల్లి పోయిండని మళ్లీ ప్రశ్న?
రైతుకు విత్తనాల కోసం, ఎరువుల కోసం పెట్టుబడి కావాలి. అది లేదు. అప్పులు చేసి పంటపండించినా లాభం లేకపోయింది. ఒకదానికొకటి అంతర్గత సహసంబంధమున్న విషయం మెల్లి మెల్లిగా స్ఫురణకు వచ్చింది. అసలు దీనంతటికీ కారణం “పారిశ్రామిక విప్లవం”. కడుపు రగిలిపోయింది. మనసారా తిట్టుకున్నాను. సంప్రదాయ పనిముట్ల స్థానంలో, మనుషులకు ప్రత్యామ్నాయంగా యంత్రాలు వచ్చాయి. మనిషికి ఉపాధి కరువైంది. వెంటనే గోరటి వెంకన్న “పల్లె కన్నీరు పెడుతుందో..” పాట పూర్తిగా అర్థమైంది. అభివృద్ధిని కాదనలేని పరిస్థితి. కాని ఆ ఫలాలు దక్కాల్సిన మనిషి ఉనికికే ప్రమాదం వాటిల్లుతున్నప్పుడు ఎంత జాగ్రత్తగా వుండాలి? ప్రభుత్వాల మీద, వాటి పనితీరు మీద పట్టరాని కోపంతో ఊగిపోయాను. అరే.. ఈ కవి ఎంత పనిచేసాడురా అని కవినీ తిట్టుకున్నాను.
ఇప్పుడు చట్టాలు ఏమి చెబుతున్నాయో, రాజ్యాంగంలో ఏం పొందుపరిచారో, కార్మికుల భద్రత కోసం ఏమేమి చర్యలు తీసుకున్నారో అధ్యయనం చేస్తూ వుండిపోయాను. ఇవేమీ అమలుకు పూర్తిగా నోచుకోనందుకు నొచ్చుకున్నాను. ఫ్యాక్టరీల్లో, భవన నిర్మాణరంగంలో పనిచేసేవారే కార్మికులు కారని 38 రంగాలకు చెందిన వారు వున్నారని తెలుసుకున్నాను. నా అజ్ఞానానికి సిగ్గుపడ్డాను.
విపత్కర పరిస్థితుల్లో యాజమాన్యాలు వలస కార్మికులను వదిలించుకున్న తీరు “ఈ కరోనా సమయం”లో కంటపడింది. పరిస్థితి తీవ్రంగా వున్నప్పుడు, ప్రభుత్వాలెందుకు వారికి తాత్కాలిక వసతిని, ఆకలి తీర్చే ఏర్పాట్లు చేయట్లేదని కుమిలిపోయాను.
కవి చెప్పినట్టు “పిల్లికి కంకెడు ముద్దవేసే కారుణ్యం, పిట్టల కోసం వరిగొలుసులు కట్టిన మానవత్వం” కదిలిపోతున్న కళేబరాల గుంపుల్లాంటి వలస జీవులపై ఎందుకు సన్నగిల్లిందో, ఆధునిక కాలంలో రూపం మార్సుకున్న అంటరానితనం ఎందుకు పడగవిప్పిందో తల్సుకుంటే గుండె తరుక్కపోయింది.
ఉపాధి దొరుకుతదనే ఆశ ఎలాగూ లేదు. అందుకే వాళ్లు మానవనైజాల్ని వెక్కిరిస్తూ ,ధిక్కరిస్తూ , దిగులు గుట్టల్ని మోస్తూ వాళ్లు ఇళ్లకు చేరాలనుకుంటున్నారని కవి అంటున్నాడు.
అయినా ఇళ్లు చేరాక ఏమౌతుంది? ఇప్పుడు సమాధానం దొరకని ప్రశ్నొకటి కవినే కాదు అందరినీ సలపరిస్తుంది. గడ్డుకాలం నుండి బయటపడ్డ తర్వాత వారి బతుకుల్లో వెలుగుపూలు పూయాలని ప్రతి ఒక్కరం కాంక్షిద్ధాం.
*
“poems should represent emotions and histories should represent facts and narrative. Clearly a descriptive poem goes against this notion, indicating that poems veer between description and emotion or try to balance between the two.”
(Aristotle’s “Poetics”)
కవి కవితనంతా కథనాత్మక పద్ధతి (narrative method)లో వస్త్వాశ్రయం(objective mode)గా చెప్పిన విధానం బాగుంది. మధ్య మధ్యలో వర్ణనలు(desciptions), గత చరిత్రలు(history), ఉద్వేగం(emotion)తో కథనాన్ని సమతుల్యం(balance) చేయడానికి పూనుకున్న తీరు ఆకట్టుకుంది. హృదయం ద్రవింపజేసిన కవిత.
కవికి వేలవేల శనార్తులు!
*
బావుంది రాజ్ కుమార్ బాగా రాశారు
sarma sir thank u
చాలా బాగా రాసారు రాజ్ కుమార్ గారు
thank u ravinder anna
This is a very timely article annaa.. మూలాలను శోధించడం బాగుంది. మీరన్నట్టు వలస కార్మికుల సమస్యను కరోనా ఒక్కసారిగా తెరపైకి తెచ్చింది. ఇంతకు ముందంతా కొన్ని specific సందర్భాల్లోనే వీరి గురించి చర్చ జరిగింది. ఇప్పుడు ఒక మొత్తంగా, జాతీయ సమస్యగా చర్చకు వచ్చి మంచి పరిష్కారం దొరుకుతుందేమో చూడాలి.
నాగభూషణం గారి పోయెమ్ కూడా చాలా బాగుంది. ఆర్ద్రత ఉంది. లోతుల్లోంచి వచ్చినట్టు తెలుస్తోంది. Thanks again 🙏
naveen bhai
మీరన్నట్టు వలస కార్మికుల జీవితాలకు ఒక పరిష్కారం (శాశ్వతంగా ) దొరకాలని కోరుకుంటున్నా.
thank u brother
అద్భుతమైన కవితకు మీదైన విశ్లేషణ.. చాలా చాలా బాగుంది సర్ ఇద్దరూ అభినందనీయులు..
తిప్పేస్వామి అన్న
thank u
రాజన్నా! తార్కికంగా భలే విశ్లేషించినవ్
విశ్లేషణానైపుణికి జేజేలు
metta anna
thank u
ఒక మంచి కవిత ప్రాణం పోసుకోవడానికి కవి అనుభవించే సంఘర్షణ ఎట్లా ఉంటుందో అందరికీ తెలిసిందే.వస్తువు సార్వ జనీన సంవేదన అయినపుడు,కవి అంతరంగంతో పాటు,వస్తువు మూలాల్లోకి వెళ్లి విశ్లేషించడం ద్వారా కవిత యొక్క ప్రయోజనాన్ని శాశ్వతం చేసినట్లయ్యింది. తమ్ముడు రాజ్కుమార్ వలస కూలీల వేదనకు మూలాలను శోధిస్తూ,ప్రపంచీకరణ,యాంత్రికీకరణ,మానవీయ విలువల ప్రస్తావన ద్వారా, ఛిద్రమవుతున్న జీవితాల్ని మూల్యాంకనం చేసాడు. నవ్య సమాజ నిర్మాణానికి సాహిత్యం ఉత్ప్రేరకంగా ఎలాపని చేస్తుందో వివిధ ఉదాహరణల ద్వారా బాగా విశ్లేషించాడు. నా కవితను హృదయానికి హత్తు .కున్నందుకు వేల కైమోడ్పులు..
గాజోజునాగభూషణం గారి కవిత చిరస్మరణీయంగా నిలుస్తుంది.వస్తువులో అంతటి ఫోర్స్ ఉంది.శిల్పం లో సింప్లిసిటీ ఉంది.వలసకూలీలపట్ల సానుభూతి,దుఖ్ఖం,గూడుకట్టుకుంది.వ్యవస్థపట్ల పాలకులపట్ల సత్యాగ్రహం వ్యక్తమైనది. దేశవాసులదృష్టిని వలసకూలీల కడగండ్ల వైపు మరలించింది.శ్రామికులపక్షాన ప్రతి పౌరుడూ ఆలోచనను సారించేటట్లు చేసింది.సాహిత్యం నిర్వహించవలసిన కర్తవ్యం యొక్క ప్రాధాన్యతను ధ్వనించింది.ఒక MODEL POEM గా నిలిచింది.నమస్తే.కవికి,విమర్శకునికి అభినందనలు.మల్లెలనరసింహమూర్తి.
మల్లెల వనరసింహమూర్తిగారు నమస్తే.
మీరు చెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నాను.
మీ స్పందనకు శనార్తులు సార్
thank u anna
హృదయానికి హత్తుకునేలా మీ కవిత వుందన్న.
నన్ను కదిలించింది. ఆలోచింపజేసింది. నాలుగు వాక్యాలు రాయకుండా వుండలేకపోయాను.
మీ స్పందనకు శనార్తులు అన్న
thank u sir
నమస్తే అన్నా ఒక కవితను సామాజిక, ఆర్థిక, రాజకీయ కోణాల్లోంచి విశ్లేషించవలసిన అవసరాన్ని, ఆయా విషయాల మధ్య ఉండే గతితార్కిక సంబంధాన్ని పట్టి చూపించిన మీ విమర్శకు వేనవేల వందనాలు.
విశ్లేషణ బాగుంది రాజన్నా..