నీరూ,నిప్పూ,నింగీ,నేలా, గాలీ
ఒక్కటే అందరికీ
మనుషులే వేర్వేరు –
మనుషులు ఒక్కటికాలేనంతవరకు
ఏదీ ఒక్కటి కానే కాదు.
ఆకలికీ కులముంది.
ఆ ఒడ్డున నిన్ను తాకిన ఆ నీరే
ఈ ఒడ్డున నన్నూ తాకింది.
అయినా నీటికీ జంధ్యముంది.
నేల పొత్తిళ్లలోనే
నేనూ నీలానే పెరిగాను
అయినా నేను మైలపడ్డాను.
ఈ దేశం కుల రాచపుండు.
ఆకలికి కులముంది.
*** *** ***
ఆకలి మాట్లాడటమంటే
ఈ దేశం హింస గురించి,
అణచివేత గురించి,దోపిడీ గురించీ
అంటరానితనం,వెలివేతల
గురించీ,అసమానతల గురించీ
అనేకానేక వివక్షతల గురించీ
మాట్లాడ్డం.
పాలు ఎర్రబడ్డ రొమ్ములు
మాట్లాడ్డం.
గుడిసెలో చీకటి మాట్లాడ్డం.
మనిషిని మనిషిగా
గుర్తించని వైనాన్ని గురించీ
దోవంతా పరచుకున్న
పల్లెరు గాయాల గురించి
మాట్లాడ్డం.
*** *** ***
ఆకలి మాట్లాడితే
ఈ దేశం
సిగ్గుతో తలదించుకుంటుంది.
జాతీయ జెండా
కళ్లనీళ్లెట్టుకుంటుంది.
130 కోట్ల ఎడారులున్న దేశమిదని
ఆకలి తీర్పురాస్తుంది.
ప్రమాద హెచ్చరికలు జారీ చేస్తుంది.
రోడ్డుపక్క మైలురాళ్ళెన
దేహాలు మాట్లాడతాయి
దేవాదాసీలు,మాతంగులు,
బసివినులు,
మెహబూబ్ కి మెహిందీ లు
మాట్లాడతాయి.
పందులు తినే రంపపు పొట్టు
మాట్లాదుద్ది.
మట్టి ఉండలు మాట్లాడతాయి.
మర్మాంగాలు చిట్లి నెత్తురోడుతున్న
సోమాలియా బాల్యం
మాట్లాడుతుంది.
ఆఫ్రికాలు మాట్లాడతయ్
అడవుల్లో తుపాకులు
మాట్లాడతయ్.
నలుపెక్కిన కలలు
కథలు చెబుతయ్.
హిమాలయాల్లా బిరుసెక్కిన
కన్నీటి సంద్రాలు మాట్లాడతయ్.
అవమానాలు శవాలు
మాట్లాడతయ్.
బూడిద పిడక కచ్చలు
మర్రికాయలు
నూకగంజినీళ్లు మాట్లాడతయ్.
పొయ్యెక్కని పిడతలు
మాట్లాడతయ్.
నోటికింది ముంత
ముడ్డిన యాలాడే తాటాకులు
మాట్లాడతయ్.
ఎంత వెట్టిజేసినా విముక్తమవ్వని
బానిస చరిత్ర మాట్లాదుద్ది.
నెమరువేసుకోడానికేముంది?
పునర్ముద్రణ లేని కాలం ఓ
మౌన సంపుటి.
లోలోనో దీనుల పాటల దీపపు
గాధల అగాధం.
పిట్టలు పలకరించని చెట్టు.
ఇంటిని చూడని దీపం.
పొద్దుతిరుగుడు బతుకు.
ఎక్కడో లయతప్పిన నాదం.
వేదాంగం ఓ పగిలిన మృదంగం.
తామరాకు మీద
మంచు పువ్వు ఏకాంతం.
మోసుకొస్తుందో
మృత్యు సంగీతం.
రెప్పపడని రేతిరి మధ్య
నిద్ర ఎంత కుమిలి పోయిందో..!?
ఎన్నెన్ని ఒంటరి క్షణాలు
ఏయే దారులుగా
దాహంగా చీలిపోయాయో..!
దిక్కులేని నీడలకింద
ఏ ఋతువుల్ని ఆరబోయాలి ?
పాటల ఆనవాల్లేని
వసంతాలతో పనేంటి?
ఏ స్పర్శా వెలిగించలేని
పరిమళాల్ని
ఏ స్వప్న శాలకు
ముఖచిత్రం చేయను?
ఏ అంతరాంతర
సీతాకోక దుఃఖంలోంచి
నేనవ్వగలను?
నేనింతా ఓ చేప కన్నీరే!?
చూపులు కాలిపోయాక
ఇక్కడ మనిషి చుట్టూ
ఎన్ని సుఖ స్వప్న సౌందర్య
తీరాలున్నా ..
మరిన్ని తిరన్నాళ్లున్నా
ప్రతి మాటా రక్తం కక్కుకుంటోంది.
మట్టికూడా మరణాన్ని
మోయలేక మూగబోతుంది.
*** *** ***
ఇంకా..ఆకాశం కింది ఏ క్షణాలూ
నావికావని
ఓ మీమాంస తేలుతుంది.
మృత్యువుకి మాటలు
నేర్పటం నా భాష.
చరిత్రకు ‘మైలు’రాయవ్వడం
నా అస్తిత్వం.
నేనున్నాను కాబట్టి లేను.
లేనని తీర్మానించినచోట
నేనుండేతీరుతాను.
ఎన్ని యుద్ధాలు జతకూడితే
నేను.
ఎన్నెన్ని మరణాలు సజీవమైతే
నేను.
నా కాలికింద ఏ కలలూ కదలాడవు.
నా కలలో ఏ కథలూ కడతేరవు.
నా నడకకు నేల లేదు!
నా నేలకు నాడి లేదు!
నా నోటికి కాళ్ళు లేవు!
నా చెప్పులకు మాటలు రావు!
నా కన్నీటికి చెప్పుల్లేవు.
మాట్లాడని లోకాల శోకాలూ
నావే…మూగ శ్లోకాల లోకాలూ
నావే!?
దేవుడి రథం కింద శవమైన
దేశం నాది!
బండరాళ్లను పరమాన్నంగా
భోంచేసే పవిత్ర దేశం నేను!?
దేశం పట్టని జీవం నేను!
వేదం తాకని వేదన నేను!
వాదం గెలవని సందేహం నేను!
దేహానికిలొంగని దాహాన్నేను.
దాహానికి దొరకని
శోకాలకు లొంగని శాపం నేను!
షాపాలకు తలయెత్తని పాపాల
ఆకలి కూపం నేను!
ఈ బాధకు ఎన్ని రంగులో..
ఈ జాతికి ఎన్ని రుచులో..
ఈ మాటకు ఎన్ని వాసనలో..
ఈ రాతకి ఎన్ని గాయాలో..
ఈ ‘గీత’కు ఎన్ని అబద్ధాలో..
ఎన్ని నిర్వచనాల్లో బంధించినా
జీవితం ఇంకా ఖాళీగానే..!?
*** *** ***
ఆకలి మాట్లాడకపోతే
చారిత్రక తప్పిదమౌతుంది.
ఆకలి మాట్లాడితే
అది అసలైన మనిషవుతుంది.
మా ఆకలీ, కన్నీళ్లు,
అవమానాలూ,అణచివేతలే
ఈ దేశానికి రాజ్యాంగాన్నిచ్చింది.
ఆకలి మాట్లాడితే ఆయుధమౌతుంది.
సామాజిక విప్లవమౌతుంది.
ఒక యుద్ధమౌతుంది.
కనుతెరువని వేదనొకటి
ఆత్మగౌరవమై చిగురిస్తుంది.
కన్నీటి ఖడ్గమౌతుంది.
కన్నీళ్లే సృజనకు చిరునామా.
ఆకలి నా గాయాల కిరీటం.
ఆకలి నా పోరాట కెరటం.
ఆకలి నా జ్ఞాన కిరణం.
ఆకలి నా ధిక్కారం
ఆకలి నా రాజ్యాధికార సమూహం.
ఆకలి నా ఓటమి గెలుపుల
చారిత్రక శాసనం.
*
Add comment