బాబాసాహెబ్ అంబేడ్కర్ వైస్రాయ్ కౌన్సిల్ లో లేబర్ మెంబర్ గా వున్నప్పుడు డిల్లీలోని ఆయన నివాస గృహానికి ప్రతి సోమవారం గుర్తు తెలీని వ్యక్తి వచ్చి వరండాలో వున్న ఆయన ఫోటోకి పూలమాల వేసి వెళ్తూ వుండేవాడు. అది గమనించిన బాబాసాహెబ్ అది ఎవరో తెల్సుకోవాలని అక్కడ వుండే సహాయకులను అడిగితే ‘మద్రాసీ’ అయిన ఒక నల్లటి కుర్రాడు వచ్చి రోజూ ఆపని చేస్తున్నాడని చెప్పారు. ఆ అబ్బాయిని చూడాలని అంబేడ్కర్ కు కుతూహలం ఏర్పడింది. ఐదో వారం కూడా ఆవ్యక్తి వచ్చి ఫోటోకి పూల దండేసి సాష్టాంగ నమస్కారం చేసి వెళ్తున్నప్పుడు బాబాసాహెబ్ తన వీరాభిమానిని కనిపెట్టేశారు.
ఆ అభిమాని పేరు ‘నందనార్ హరి’ డిల్లీలోని అకౌంటెంట్ జనరల్ ఆఫీసు వుద్యోగి. అక్కడ వుద్యోగం చేసుకుంటూ ఆంధ్రాలో దళితుల సమస్యల మీద అధికారులకు, నాయకులకు వినతి పత్రాలు అందచేస్తూ వుండేవాడు. పశ్చిమ గోదావరి జిల్లా, పాలకొల్లు దగ్గరి గ్రామమైన ‘చించినాడ’కు చెందిన నందనార్ హరి అసలు పేరు ‘నల్లి నందియ్య’. చిన్నప్పుడే ఆయన తండ్రి మరణించడంతో చించినాడ పక్కనే వుండే యలమంచిలి అనే తన అమ్మమ్మగారి వూర్లో పెరిగాడు. తర్వాత తూర్పు గోదావరి జిల్లా రాజోలు తాలూకా కడలి గ్రామానికి చెందిన ‘మాణిక్యమ్మ’ని వివాహం చేసున్నాడు. ఆయన తల్లి కూలీనాలీ చేసి కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక చిన్న పూరిపాకలో నివసించేది. పేద దళిత కుటుంబంలో పుట్టిన నందియ్యకి చదువుకోవాలనే ఆశ వున్నప్పటికీ దుర్భర దారిద్ర్యం కారణంగా ఆయన కుటుంబానికి నందియ్యని చదివించే స్థోమత లేదు. అయితే పిఠాపురంలో రఘుపతి వెంకటరత్నం నాయుడు గారు అనాధలకు హాస్టల్ స్థాపించి వారికి ఉచిత విద్య అందిస్తూ అనాధ శరణాలయాన్ని నడుపుతున్నారని తెలిసి అక్కడకెళ్ళి తను కూడా ఒక అనాధనని చెప్పి చదువు మొదలుపెట్టాడు నందియ్య. అయితే రఘుపతి వెంకటరత్నం నాయుడు గారి నీతి బోధనలు విన్నాక తను అబద్ధం చెప్పి మోసం చేసి అక్కడ చేరానని పశ్చాత్తాపం చెంది తన తప్పును గురువుగారికి చెప్పాడు. దయార్ద్ర హృదయుడైన రఘుపతి వెంకటరత్నం నాయుడు సత్యాన్ని నిజాయితీగా ఒప్పుకున్న నువ్వేరా ‘సత్య హరిచ్చంద్రుడివి’ అని నందియ్య పేరును ‘హరిచ్చంద్రుడు’ గా మార్చారు. హరి కాకినాడ పిఠాపురం రాజావారి కళాశాలలో పీ.యూ.సి వరకు చదివాడు. అయితే ఆయన తన యింటిపేరు ‘నల్లి’కి బదులు తన తల్లిదండ్రులు పెట్టిన ‘నందియ్య’ అనే పేరును ‘నందనార్’ గా మార్చుకోవడం విశేషం.
తమిళనాడులో ఎనిమిదవ శతాబ్దానికి చెందిన నయనార్ల శైవ భక్తి సంప్రదాయంలో అంటరాని భక్తుడైన ‘నందనార్’ కులాన్ని ధిక్కరించి మిగిలిన నయనార్లతో సమానంగా దేవాలయ ప్రవేశాన్ని, శివ భక్తుడిగా గౌరవాన్ని పొందిన ఒకేఒక అంటరాని పరయా కులస్తుడు. దళిత ధిక్కార సాహిత్యంలో ఒక ముఖ్యమైన చిహ్నంగా మిగిలిపోయిన నందనార్ పేరుని తన ఇంటిపేరుగా మార్చుకోవడం హరికి గల గొప్ప చారిత్రక, సామాజిక స్ప్రుహకి నిదర్శనం. అప్పటినుంచి ఆయన ‘నందనార్ హరిచ్చంద్రుడు’గా, తన మిత్రులకు ‘నందనార్ హరి’గా గుర్తింపబడ్డాడు. తన రికార్డులలో కూడా ఆయన ‘నందనార్ హరి’గానే మార్పులు చేయించుకుని తన సామాజిక నిబద్ధతను చాటుకున్నాడు.
నందనార్ హరికి ముందునుంచి సామాజిక స్పృహ ఎక్కువే! ఆయనకి ‘జొన్నల మోహనరావు’ అనే గొప్ప చైతన్యవంతుడైన ఆత్మీయ మిత్రుడు వున్నారు. జొన్నల మోహనరావు దళితులలో ముందుగా చదువుకుని గ్రాడ్యుయేట్ అయిన వ్యక్తి. ఆయన అంబేడ్కర్ ప్రసంగాలను తెలుగులోకి అనువదించి తన జ్ఞానంతో, చైతన్యంతో అంబేడ్కర్ కు దగ్గరవాడయ్యాడు. నందనార్ హరి ఆంధ్రాలోని ఆది ఆంధ్ర మహాసభతో కల్సి పనిచెయ్యడం, గ్రంధాలయాల్లో కుసుమ ధర్మన్న సాహిత్యం, ఆయన నడిపిన ‘జయభేరి’ పత్రిక సంచికలు చదవడం, తన యీడు వారితో దళిత సమస్య, వర్తమాన రాజకీయాలు చర్చించడం క్రమం తప్పకుండా చేస్తుండేవాడు. దేశవ్యాప్తంగా అంబేడ్కర్ పేరు దళితుల నాయకుడిగా, మేధావిగా అప్పటికే బాగా గుర్తింపు వుండడంతో నందనార్ హరి, ఆయన మిత్రులు ఎలాగైనా అంబేడ్కర్ ను ఓసారి ఆంధ్రాకి ఆహ్వానించాలి అని నిర్ణయించుకున్నారు.
స్వాభావికంగా అంబేడ్కర్ ఎవరినీ తొందరగా నమ్మే మనిషి కాదని, తను వెళ్లి అడిగితే ఒప్పుకోరు అనుకున్న నందనార్ హరి ఎలాగైనా బాబాసాహెబ్ అంబేడ్కర్ దృష్టిలో పడాలని ఆలోచించి ప్రతి సోమవారం డిల్లీలోని ఆయన నివాస గృహానికి వెళ్లి వరండాలో వుండే ఆయన ఫోటోకి పూల దండ వెయ్యడం మొదలుపెట్టాడు. చివరకు అంబేడ్కర్ కంట పడిన నందనార్ హరి తన గురించి చెప్పి ఆంధ్రా ప్రాంతంలో మాల మాదిగలు కుల వివక్ష, అవిద్య, పేదరికం వంటి దుర్భరమైన అవస్థలు అనుభవిస్తున్నారని మీరు వీలు చూసుకుని ఓసారి ఆంధ్రాని సందర్శించాలని ప్రాధేయ పడ్డాడు. అంబేడ్కర్ నందనార్ హరిలోని నిజాయితీ, తన మనుషుల సమస్యల పరిష్కారం కోసం ఆయనలో కనిపించిన తపనలను అర్ధం చేసుకుని ఆయన నివాసాన్ని తన బంగ్లాలోకి మార్చారు. తన నిజాయితీతో, మంచి ప్రవర్తనతో అంబేడ్కర్ ని మెప్పించాడు హరి. ఆంధ్రాకి తప్పకుండా వస్తాను అని ఆయన చెప్పడంతో నందనార్ హరికి ఎక్కడలేని సంతోషం కలిగింది, వెంటనే బైలుదేరి ఆంధ్రాకి వచ్చి తన మిత్రులకు బాబాసాహెబ్ అంబేడ్కర్ ఇక్కడికి వస్తామన్నారని చెప్పి వారితోకలిసి ఏర్పాట్లు ప్రారంభించాడు.
అంబేడ్కర్ 1944, సెప్టెంబర్ చివరి వారంలో ఆంధ్ర ప్రాంతాన్ని సందర్శించినప్పుడు నందనార్ హరితోపాటు ఈలి వాడపల్లి, కోనాడ సూర్య ప్రకాశరావు, జొన్నల షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ నాయకులు వాసే నాగేశ్వరరావు, ఘంటా అరుణ్ కుమార్ మొదలైన వారు ఆయనతోపాటు వున్నారు. తూర్పు గోదావరి జిల్లాలో మొదటి గ్రాడ్యుయేట్ అయిన పాము రామమూర్తి అంబేడ్కర్ ఇంగ్లీష్ లో చేసిన ఉపన్యాసాలను తెలుగులోకి అనువదించాడు. అంబేడ్కర్ పర్యటించిన కాకినాడ, రాజమండ్రి, రామచంద్రాపురం, ఏలూరు, గుడివాడ, విశాఖపట్నం, అనకాపల్లి మొదలైన ప్రాంతాలతో పాటు మద్రాసు ప్రెసిడెన్సీ అంతటా షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ బలోపేతమైంది. ఆంధ్రా దళితులు తనపై చూపిన ప్రేమకు, గౌరవానికి బాబాసాహెబ్ అంబేడ్కర్ కదిలిపోయారు. అనకాపల్లిలో అక్కడి ఆహ్వాన సంఘంలో వున్న ధనికులు ఆయనకు ఇరవై నాలుగు ఎడ్లతో పూల రధాన్ని ఏర్పాటు చేస్తే అంబేడ్కర్ ‘అందులో కూర్చోడానికి నేనేమన్నా పెళ్లి కొడుకునా?’ అని చమత్కరించి ఆది ఆంద్ర మహాసభ కార్యకర్తలు ఒక దుప్పటిని నాలుగు పక్కల పైకిలేపి మధ్యలో కర్ర పైకెత్తి పట్టుకుని దాని నీడలో ఆయన్ని తీసుకెళ్తే కంటతడి పెట్టుకున్నారట.
అంబేడ్కర్ తర్వాత నందనార్ హరిని దక్షిణ భారత దేశంలో యుద్ధ ప్రచారకునిగా నెలకు ఐదు వందల రూపాయల జీతానికి వుద్యోగం యిప్పించారు(ఇదే వుద్యోగం ఆరోజుల్లో కవి గుర్రం జాషువా కూడా చేశారు) బాబాసాహెబ్ ఆంధ్రా పర్యటనకు ముఖ్య కారకుడు నందనార్ హరి హరిజన సేవక్ సంఘ్ వారు నడిపే హాస్టళ్లకు వెళ్లి అక్కడ వుండి చదువుకునే దళిత విద్యార్ధులను అంబేడ్కర్ షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ పార్టీ రాజకీయాల వైపు నడిపించేవాడు. ఎన్నో చైతన్యవంతమైన పాటలు రాసి వారితో పాడించి, కుల వ్యతిరేక భావాలను పెంపొందించే పుస్తకాలు, పత్రికలు, కరపత్రాలు వారికి పంచి యిచ్చేవాడు. అప్పటిదాకా గాంధీజీ హరిజనోద్ధరణ ప్రభావంతో ‘రఘుపతి రాఘవ రాజారాం’ అనిపాడే దళిత విద్యార్ధులు ‘బాబాసాహెబ్ అంబేడ్కర్ కి జై’ అనడం ప్రారంభించారు. నందనార్ హరి ప్రోత్సాహంతో సెలవులొస్తే గ్రామగ్రామాన చైతన్య కార్యక్రమాలు చెయ్యడం ఆరంభించారు. 1946లో అదేపని మీద నెల్లూరు హాస్టల్ కి వచ్చి విద్యార్ధులతో మాట్లాడి తిరిగి విజయవాడ వెళ్తున్నప్పుడు దారిలో ఒంగోలు వద్ద రైలు ప్రమాదంలో నందనార్ హరి మృతి చెందాడు. చనిపోయేనాటికి కేవలం ఇరవై ఎనిమిది సంవత్సరాలే! నందనార్ హరి గురించి ఎండ్లూరి చిన్నయ్య, బి. విజయ భారతి కొంతవరకు రాశారు, కానీ వారుకూడా ఆయన జీవిత విశేషాలు తెలియజెయ్యలేదు. అయితే చనిపోయేనాటికి ఆయనకి పెళ్ళయ్యింది. ఆయన భార్య మాణిక్యమ్మ, నాలుగేళ్ల కొడుకు ‘హరి గంగాధర్’ వున్నాడు. ఆ అబ్బాయి పెద్దైనాక డాక్టరయ్యాడు. డా. హరి గంగాధర్ వెస్ట్ ఇండీస్, ఇంగ్లండులలో కొంతకాలం పనిచేసి ఇండియాకి తిరిగొచ్చి ‘కోల్ ఇండియా’ సంస్థలో పనిచేసి రిటైరయ్యాక ప్రస్తుతం కాకినాడలో స్థిరపడ్డారు. నందనార్ హరి భార్య మాణిక్యమ్మ 2005లో మరణించారు.
తన ప్రజల కష్టాల పరిష్కారం కోసం ఎంతో నిబద్దతతో పనిచేసిన నందనార్ హరి అతి చిన్నవయసులోనే మరణించడం ఆనాటి ఆది ఆంధ్ర మహాసభ వుద్యమానికి, షెడ్యూలు కాస్ట్ ఫెడరేషన్ పార్టీకి తీరనిలోటు. టెలిగ్రాం ద్వారా నందనార్ హరి మరణం గురించి తెలుసుకుని బాబాసాహెబ్ అంబేడ్కర్ కన్నీరు విడిచారు. సామాజిక పరిణామ దిశలో తన యింటి పేరుని మార్చుకున్న అరుదైన వుద్యమకారుడు నందనార్ హరి. ఆయన వార్ ప్రాపగాండిస్ట్ గా ఆంధ్రా, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు అధికారి హోదాలో వుండికూడా తన వూరిలో వున్న పూరిపాక కేంద్రంగా అనేకమంది వుద్యమకారులను తయారుచేశాడు. అక్కడ కూర్చోడానికి కుర్చీకూడా లేనిస్తితిలో హరి ఆరుబైట కొబ్బరితోటల్లో సమావేశాలు జరిపి వుద్యమాన్ని ముందుకు నడిపించిన కార్యసాధకుడు. హరి గ్రామగ్రామాన విస్తృతంగా పర్యటించి యువతను దళిత వుద్యమంలోకి సమీకరించాడు. అప్పటిదాకా గాంధేయ వాద హరిజనోద్ధరణ లేదా కమ్యూనిస్టు పార్టీ గ్రామస్థాయి కేడర్ గా పనిచేస్తున్న దళిత యువతను అంబేడ్కర్ సామాజిక విప్లవ సిద్ధాంతంవైపు అడుగులు వేయించిన గొప్ప చైతన్య దీప్తి నందనార్ హరిచ్చంద్రుడు ప్రాతఃస్మరణీయుడు.
*
నిజమైన అంబేడ్కరీయునికి అక్షర నివాళి అద్భుతం… జైభీములు
“ధర్మన్నఅంబేద్కర్ ఆలోచనలతో ప్రభావితుడై అంబేద్కర్ గురించి ఆంధ్రదేశంలో విస్తృతంగా ప్రచారం చేశాడు. ఆంధ్రదేశానికి అంబేద్కరును తొలిగా పరిచయం చేసింది ఈయనే.[5] అణగారిన జాతులకు గొంతుకనిస్తూ, అంబేద్కర్ భావాలను ప్రచారం చేయటానికి జయభేరి అనే పక్ష పత్రికను స్థాపించాడు” ఇది కరెక్ట్ కాదా ?
అయితే, కే.గంగయ్య వ్రాసిన “EMERGENCE OF DALIT MOVEMENTS IN ANDHRA AND DR. B.R. AMBEDKAR’S INFLUENCE అనే వ్యాసం లో మీరు చెప్పినట్లుగానే ఉంది.
good information, thank you madam.