ఆంక్షలపై ధిక్కార స్వరం

మొదటి నవలతో బూకర్ ప్రైజ్ పొంది చరిత్ర సృష్టించిన అరుంధతీ రాయ్ పూర్తి పేరు సుజన్నా అరుంధతీ రాయ్. భారత దేశం నుండి మానవ హక్కుల, రాజకీయ, సామాజిక కార్యకర్త్యగా విభిన్న అంశాలపై తన గళం వినిపిస్తూ 2024 లో పెన్ పింటర్ ప్రైజ్ గెలుచుకున్న అరుంధతీ “ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్” నవల ఒక వైపు పొగడ్తలను మరో వైపు తీవ్ర నిరసనను ఎదుర్కొంది. కొందరు ఇది పాక్షికంగా రాయ్ ఆత్మకథ అని కూడా అంటారు.

మనుషులు తమ జీవితాలలో తీసుకునే అతి చిన్న నిర్ణయాలు, ఏ మాత్రం ప్రాధ్యాన్యత లేని సంఘటనలు వారి మొత్తం జీవన గతినే మార్చి వేసి జీవితాలను ఎలా అల్లకల్లోలం చేయగలవో ఈ నవల చర్చిస్తుంది. ఇందులో రాయ్ ఒక మళయాళీ సిరియన్ క్రైస్తవ  కుటుంబ నేపథ్యాన్ని తీసుకుని చాలా విషయాలను చర్చిస్తారు. వ్యక్తుల జీవిత గమనాన్ని నిర్దేశించడంలో  కుటుంబం సమాజం పాత్ర , సామాజిక నియమాలను దిక్కరించే మానవ సంబంధాలు, కుటుంబంలోనూ సమాజంలోనూ బలవంతులు దుర్బరులపై చూపే అణీచివేత, వివక్ష, సమాజంలో విభిన్న వర్గాలకు చెందిన మనుషులు, వారి మధ్య సంబంధాలు, లైంగిక సంబంధాల వెనుక ఉన్న మనిషి అసహాయత,  ఆనాటి రాజకీయ వ్యవ్యస్థ మానవ సంబంధాలపై చూపిన ప్రభావం, మానవ సంబంధాలను ప్రభావితం చేసే మానవ అహం, గర్వం, ఇవన్నీ కూడా ఈ నవలలో చర్చకు వచ్చే విషయాలు.

మరో ముఖ్యమైన అంశం ఏంటంటే ఇంత గంభీరమైన చర్చ కూడా పిల్లల నేపథ్యంలో జరుగుతుంది.  ఏడు సంవత్సరాల వయసున్న ఇద్దరి పిల్లల ఆలోచనల ద్వారా ఈ గంభీరమైన విషయాలను ప్రస్తావిస్తారు రచయిత్రి. అంటే పిల్లలు తమ కళ్లతో చూసే ప్రపంచాన్ని, మనసుతో అనుభవించే జీవితాన్ని ప్రపంచంలోని అలజడులను యధావిధిగా వారి బాల్య స్థితి ఆధారంగానే ప్రస్తావించారు. నవల ఎక్కువ భాగం పిల్లలు చెప్పే కథనమే.  వాళ్లు చూస్తున్న సంఘటనలు, ఎదుర్కుంటున్న సమస్యల పట్ల ఉండే స్పందన ను  పిల్లల మెదడు నుండి యధావిధంగా పట్టుకుని అందించారు రచయిత్రి. పెద్ద వారి ప్రపంచం పిల్లలపై ఎటువంటి ప్రభావం చూపుతుందో, వారిలోని ఆలోచనలు ఎలా విస్తరిస్తాయో, వారి వ్యక్తిత్వాన్ని కొన్ని సంఘటనలు ఎలా మార్చివేస్తాయో, కల్లోలానికి గురి చేస్తాయో పాఠకులు కూడా ఆ ఏడేళ్ళ పిల్లల స్థితికి వెళ్ళి అనుభవిస్తారు. పిల్లల కోణంలో కథనాన్ని నడుపుడానికి రచయిత్రి భిన్నమైన శిల్పాన్ని ఎన్నుకునన్నారు. ఇందులో సంఘటనలు ఒక క్రమంలో ఉండవు. కథ ముందుకు వెనక్కు నడుస్తూ  ఒకే సారి ఎన్నో విషయాలను చర్చిస్తుంది. ఈ శైలి ద్వారా కథలో అతి భయంకరమైన గాంభీర్యం పాఠకులులు అనుభవిస్తారు. అందువల్ల  దీన్ని చదవడం కొంత కష్టంగానే ఉంటుంది సాధారణ పాఠకులకు.

1969 నుండి 1993 మధ్యకాలంలో ఈ కథ నడుస్తుంది. బెనన్ జాన్ ఐపె ఓ ప్రముఖ కీటక శాస్త్రవేత్త. ఓ భిన్నమైన చిమ్మట జాతిని అతను కనుగొంటాడు. కాని అతనికి రావలసిన గుర్తింపు రాదు. స్వతహగా అహంకారి అయిన జాన్ తన కోపాన్ని భార్యపై పిల్లలపై చూపిస్తూ ఉంటాడు. భార్యను చిన్న చిన్న విషయాలకు విపరీతంగా కోట్టడం ఇతని నైజం. భార్య శొషమ్మ అతని అహంకారన్ని మౌనంగా భరిస్తూ ఉంటుంది. వీరికి ఇద్దరు పిల్లలు , అమ్ము, చాకో.

చాకో యుక్తవయసుకు వచ్చాక తండ్రి తల్లిని అలా కొట్టడం భరించలేకపోతాడు ఒక రోజు ఆవేశంగా తండ్రి తల్లిని చితకబాదుతుంటే అడ్డు వచ్చి జాన్ చేయి  బలంగా పట్టుకుని  ఆతనిపైకి తన చేయి ఎత్తుతాడు. ఇది జాన్ అహంకారాన్ని దెబ్బతీస్తుంది. తన అధికారం అంతటితో సమాప్తం అని తన కొడుకు ఇప్పుడు తనపై అధికారి అయ్యాడని అతనికి అర్ధం అవుతుంది. కోపంతో చెక్క కుర్చీ ముక్కలు చేసి మౌనంగా ఉండిపోతాడు. ఆ క్షణమే ఆ ఇంటి యజమాని పాత్ర మారుతుంది. సోషమ్మ కొడుకు దగ్గర ఓ భద్రతను అనుభవిస్తుంది. చాకో పట్ల ఆమెలో ఓ స్వాధీనతను అనుభవిస్తుంది. అతను నా సొత్తు అన్న భావం ఆమెలో నాటుకుపోతుంది. చాలా ఉమ్మడి కుటుంబాలలో  మగ బిడ్డపై ఆ ఇంటిలోని పెద్ద తరం స్త్రిలు ఇలాంటి స్వాధీనతను అనుభవిస్తూ అతనికి మరెవ్వరూ దగ్గరవకుండా చూసుకుంటూ కుటుంబ సంబంధాలలో అల్లకల్లోలాన్ని కలిగంచడం తద్వారా మొత్తం కుటుంబం నలిగిపోవడం చాలా మందికి అనుభవమే. ఓ చిన్న సంఘటన ఆ ఇంటిలోని మానవ సంబంధాల గతిని మార్చివేసింది. చాకో ను ఆ ఇంటికి నియంతను చేస్తూ సోషమ్మ ఇంటి యజమానురలిగా మారుతుంది.

అమ్ము తండ్రి అహం నుండి తప్పించుకోవడానికి తనపై కాస్త ఆసక్తి చూపిన ఓ వ్యక్తిని పెళ్ళి చేసుకుని వెళ్లిపోతుంది. ఆమెకు కవలపిల్లలు జన్మిస్తారు. కాని భర్త తాగుబోతు అయి నరకం చూపిస్తుంటే, విడాకులు తీసుకుని  కొడుకు ఎస్తా, కూతురు  రాహెల్ లతో అయిమేనెమ్ లో తన పుట్టింటికి వచ్చేస్తుంది. ఈ పిల్లలే మన నవలలోని ముఖ్య పాత్రలు. ఈ కథంతా వీరి ద్వారానే రచయిత్రి చెప్పిస్తారు. ఆ ఇంట పాపాచి (అమ్ము తండ్రి) చెల్లెలు నవోమి కూడా ఉంటుంది. ఈమె అవివాహిత. ఎప్పుడో ఓ ఐరిష్ చర్చ్ ఫాదర్ ను ప్రేమించి ఆ వివాహం కాక ఆమె ఎప్పటికీ అవివాహితగానే ఉండిపోతుంది. జీవితంపై, మనుషులపై ఆమెలో విపరీతమైన కోపం. ఆ ఇంట తన అధికారాన్ని ఆమె అందిపుచ్చుకోవడానికి రకరకాలుగా ప్రయత్నిస్తూ ఉంటుంది. మనుష్యులను ఏమార్చి తన పని గడుపుకోవడం ఆమె నైజం.

ఆ ఇంట్లో అమ్ము తన ఒంటరి జీవితాన్ని మొదలు పెడుతుంది. అన్న అహం, మేనత్త, తల్లి అధికారం నడుమ తన ఇద్దరు పిల్లలే జీవితంగా ఆమె రోజులు గడుపుతుంది. కాని తనది కాని ఆ ఇంట ఆమెకు నిత్యం వేదన తప్ప ఏమీ మిగలదు. భర్తలు వదిలి పుట్టిల్లు చేరిన స్త్రీగా అమెపై ఏదో ఓ కోణంలో చిన్నచూపు ఎదురవుతూనే ఉంటుంది. తల్లి తన అధికారాన్ని వదలదు, మేనత్త తన ఆధిపత్యాన్ని వదలదు. అన్న తన నిర్ణయాల పట్ల కటువుగా ఉంటాడు.  పైకి గొప్ప భద్రత గల జీవితంగా  కనిపిస్తునే ఉన్న ఆమె  జీవితంలో నిజానికి ఊపిరి ఆడక నరకం చూస్తూ  ఉంటుంది. ఆమె అసహాయత పిల్లల పై కోపంగానూ అధికారంగానూ మారుతూ ఉంటుంది. పిల్లలకు ఆ వాతావరణంలో ఇంటి నుండి బైట గడిపే సమయమే ఆనందానూ హాయిగాను ఉంటుంది. సహజంగా పల్లెటూరి అవడం వల్ల వారు ఆ ప్రకృతి మధ్య వారికి ఆ ఇంటి వాతావరణంలోని వేడిని తప్పించుకునే వెసులుబాటు దొరుకుతుంది.

చాకో కొన్నాళ్లు ఆక్స్వర్డ్ లో చదువుకుని వస్తాడు. అక్కడే మార్గరెట్ అనే యువతిని ప్రేమించి పెళ్ళి చేసుకుంటాడు. వీరికి సోఫీ మోల్ అనే ఓ కూతురు. కాని చాకో సోమరితనాన్ని భరించలేక . మార్గరెట్ అతనికి విడాకులుచ్చి జో అనే వ్యక్తిగి మళ్ళీ పెళ్ళి చేసుకుంటుంది. చాకో తల్లి సహాయంలో తన  సొంత ఊరు వచ్చి ఓ పచ్చళ్ల ఫాక్టరీ పెడతాడు.

సోఫో మోల్ తండ్రి ప్రెమను పిన తండ్రి జో దగ్గరే అనుభవిస్తుంది. కాని ఓ కార్ ఆక్సిడేంట్ లో జో మరణిస్తాడు. దిగులుతో కృంగిపోతున్న కూతురి మనసు మార్చడానికి క్రిస్మస్ సంబరాలకు  మార్గరెట్ ఆమెను సొంత తండ్రి దగ్గరకు చేర్చాలనుకుని, సోఫో మోల్ తో  అయెమేనెమ్ కు వస్తుంది. కన్న కూతురు తనతో ఉండడానికి వస్తుందని విని చాకో ఉబి తబ్బిబవుతాడు. కూతురు ను మాజీ భార్యను విమానాశ్రయం నుండి ఊరికి తీసుకురావడానికి అమ్ము ఆమె పిల్లలతో నగరానికి వస్తాడు. సోఫో మోల్ పట్ల పిల్లలిద్దరిలో ఆసక్తి కలుగుతుంది. కాని తమకు దొరకని స్వాగతం ఆ ఇంటి మగబిడ్డ కూతురికి దొరకడం వాళ్లు గమనిస్తారు. తమ స్థానాన్ని ఆక్రమించుకుని ఆ ఇంట ముఖ్యమైన వ్యక్తిగా మారబోయే ఈ సోఫీ పట్ల వారిలో అయిష్టత ఏర్పడుతుంది. కుటుంబాలలో మగబిడ్డ సంతానానికి ఆడబిడ్డ సంతానానికి  నడుమ ప్రదర్శించే వ్యత్యాసం చిన్ని మనసులను ఎలా గాయపరుస్తుందో ఇక్కడ చర్చకు వస్తుంది.

మామాచీ (అమ్ము తల్లి) కొడుకు కోసం అట్టహాసంగా సోఫీ మోల్, మార్గరెట్ లకు స్వాగతం పలుకుతుంది. కాని ఆమె కోడలిని ఇష్టపడదు. తనకే సొంతం అయిన తన కొడుకు  చాకో కు దగ్గరయిన స్త్రీగా ఆమె మార్గరెట్ ను ప్రత్యర్ధిగానే చూస్తుంది. అత్త కోడళ్ళ మధ్య ఉండే ఈ వైరం వెనుక కొడుకు తనవాడంటూ తల్లి, కాదు తనవాడంటూ భార్య, ఇలా  ఇద్దరు స్త్రీలు తన అభద్రతను అహంకారంగా మార్చుకునే పద్దతే  కారణం. దాన్ని రాహెల్ ఎస్తా ఇద్దరూ గ్రహిస్తారు.

ఎస్తా కాస్త సిగ్గరి. ఎవరితోనూ తొందరగా కలవడు. సోఫీ మోల్ కోసం నగరానికి వెళ్లినప్పుడు సమయం ఉందని వీరంతా సినిమాకు వెళతారు. అక్కడ సినిమా మధ్యలో హాలు బైటికి వస్తాడు ఎస్తా. అతన్ని హాలులో చిరుతిళ్ళు అమ్మే వ్యక్తి  గమనిస్తాడు. బిస్కెట్టు ఆశ చూపి ఎస్తాని తన ఒళ్ళో కూర్చోబెట్టుకుని హస్తప్రయోగం చేసుకుంటాడు. ఆ చిన్న పిల్లవాడికి తనతో ఏదో చేయకూడని పని ఆ షాపు అతను చేయిస్తున్నాడని అర్ధం అవుతుంది. కాని అదేంటో తెలీదు. ఎస్తా ఒక షాక్ కు లోనవుతాడు. అతన్ని వెతుక్కుంటూ వచ్చిన అమ్ము, కొడుకును ఆ షాపతను  ముద్దు చేస్తున్నాడని అనుకుంటుంది. కాని రాహెల్ ఎస్తా కళ్లలోకి చూసిన వెంటనే అతను ఏదో చెప్పలెని వేదన అనుభవిస్తున్నాడని అర్ధం చేసుకుంటుంది. మొదటి నుండి ఆ సోదరులిద్దరిలో ఒక గట్టి బంధం ఉంటుంది. రాహెల్ ఎస్తాను అనుక్షణం కనిపెట్టుకుని ఉండడం ఆ క్షణం నుండి మొదలవుతుంది. చిన్నపిల్లలపై జరిగే లైంగిక అత్యాచారాలు ఎలా మొదలవుతుతాయో ఈ సన్నివేశం వివరిస్తుంది.

ఆ ఇంట్లో వేల్య పాపెన్ అనే పనివాడు నమ్మకంగా పని చేస్తూ ఉంటాడు. తక్కువ జాతికి చెందిన పాపెన్ యజమాని పట్ల విశ్వాసం ప్రదర్శించడం తన ధర్మం అని భావించే పాత తరం వ్యక్తి. ఓ ప్రమాదంలో కన్ను పోగొట్టుకున్న వేల్య పాపెన్ కు మామాచి (అమ్ము తల్లి) గాజు కన్ను అమర్చుకోవడానికి డబ్బు సహాయం చేస్తుంది. అందుకని తాను ఆమెకు జీవితాంతం రుణ పడిపోయానన్నది అతని భావం. ఆ రోజుల్లో విశ్వాసం మాటున జరిగె దోపిడికి వేల్యపాపెన్ జీవితం ఓ ఉదాహరణ. ఇతనికి పెద్ద కొడుకు వేలుతా బలిష్టమైన వ్యక్తి. పైగా అగ్రవర్ణపు వ్యక్తుల దోపిడిని అర్ధం చేసుకుని తమకు మంచి జీవితం కావాలని తపించే వ్యక్తి. ఆ రోజుల్లో కేరళలో కమ్యునిస్టు ఉద్యమం మంచి ఊపులో ఉంది. వేలుతా కార్మికుల ర్యాలీలలో పాల్గొంటూ ఉంటాడు. ఇది ఆ ఊరిలో ఎవరికీ తెలీదు.

సోఫో మోల్ కోసం ఈ కుటుంబం పట్నం వెళ్తున్నప్పుడు వీరి కారుని ఉద్యమకారులు ఆపుతారు. కారు అన్నది ధనిక వర్గానికి చిహ్నం కాబట్టి ఉద్యమకారులు కారులోని వ్యక్తులను అడ్డగిస్తారు. కాని అందులో ఉన్నది పిల్లలు స్త్రీలు అయినందువల్ల వారని వదిలిపెడుతూనే అందులో ఉన్న బేబీ కొచ్చమ్మ (అమ్ము మేనత్త) ను అవహేళన చేస్తూ అవమానిస్తారు. అది ఓ వర్గం మరో వర్గంపై చూపే కోపం అని గ్రహించలేని బేబీ కొచ్చమ్మ అది తనకు జరిగిన అవమానంగా భావించి ఉద్యమకారులపై కోపాన్ని పెంచుకుంటుంది. ఆ కార్మిక ప్రదర్శనలో  వెలుత ను పిల్లలు చూస్తారు. కాని వెలూత వారిని చూసి చూడనట్లు వెళ్లిపోతాడు. పిల్లలిద్దరికీ వేలుత తో మంచి స్నెహం ఉంటుంది. ఈ ఇద్దరు  పిల్లలను అమితంగా ప్రేమిస్తాడు వేలుత. వాళ్లు ఎంత అల్లరి చేసినా వారిని భరిస్తాడు. వాళ్లతో కలిసిపోయి ఆడుకుంటాడు. వేలుత అంటే ప్రాణం పెడతారు ఈ ఇద్దరు పిల్లలు. తమను అంత ప్రేమగా చూసె మరో వ్యక్తి ఆ ఇంట లేకపోవడంతో పిలల్లు వెలుతని ఎంతో ఇష్టపడతారు. అందుకే ఉద్యమకారుల నడుమ అతన్ని చూసాం అని వాళ్లు చెప్పినప్పుడు వేలుత అది తాను కాదని అంటే పిల్లలకు నమ్మకం కలగదు. కాని బేబీ కొచ్చమ్మ పిల్లలు చెప్పినది విని వేలూత ను తనను అవమానించిన వారిలో ఒకరిగా ఎంచుతంది. తనకు జరిగిన అవమానానికి వెలూత కారణంగా భావిస్తూ అతనిపై అమితమైన కోపాన్ని పెంచుకుంటుంది

వేలూత మంచి వడ్రంగి. పారావన్ కులానికి చెందినవాడు. చిన్నప్పటి నుండి అమ్ముని ఇష్టపడతాడు. భర్తతో విడిపోయి ఇద్దరు పిల్లలతో ఆ ఇంట చేరిన అమ్ము ఒంటరితనంతో కుమిలిపోతూ ఉండడం అతను చూస్తాడు. క్రమంగా వీరిద్దరి మధ్య సంబంధం ఏర్పడుతుంది. రాత్రుల్లు చాటుగా కలుసుకుంటూ ఉంటారు. వీరి సంగతి వేలూత తండ్రి వేల్య పాపెన్ కు తెలుస్తుంది. యజమాని కి ద్రోహం జరిగింది అని భావించి అతను మామాచి కి విషయం చెప్పేస్తాడు. దీనితో ఇంట్లో గొడవ జరిగి అమ్ముని గదిలో బంధిస్తారు కుటుంబీకులు. వెలుత కోసం అందరూ వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో ఏడుస్తున్న అమ్ము దగ్గరకు వచ్చిన పిలల్లను ఆమె కోపంతో తన దుఖానికి వాళ్ళే  కారణం అని నిందిస్తుంది. దానితో పిలలిద్దరికీ తల్లిపై ఆ ఇంటిమనుషులపై కోపం వస్తుంది. ఇంటి నుండి పారిపోదాం అనుకుంటారు ఇద్దరూ.

ఇలాంటి సమయాలలో ఆ ఇంటి నుండి పారిపోవడానికి ఓ చిన్న నావ మీద అప్పుడప్పుడు నీటి పాయలపై విహరించడం  ఎస్తా రాహెల్ ల అలవాటు. ఇది ఇంట్లో వారికి తెలియదు.మధాహ్నం అందరూ ఇంట్లో నిద్రపోతుండగా రాహెల్ ఎస్తాలు  నావ తీసుకుని నదిలోకి దిగుతారు. సోఫీ మోల్ కి ముందు ఆ ఇంటికి రావడం ఇష్టముండదు. అందుకని కొత్తల్లో కొంత అయిష్టతతోనే ఆ పిలల్లతో వ్యవహరిస్తుంది. కాని తన వయసున్న వారితో సహజంగా పిల్లలలో ఏర్పడే చనువు ఆమెను వారిద్దరికి దగ్గర చేస్తుంది. ఆమె కూడా వారిద్దరిని వెంపడించి నావపై కి ఎక్కుతుంది. ముగ్గురు కలిసి ఆ ఇంటి నుండి కాసెపు బయట పడదాం అనుకుంటారు. కాని బరువు ఎక్కువ అయి నావ తిరగబడిపోతుంది. ఈత వచ్చిన రాహెల్ ఎస్తాలు నీళ్ళలోంచి బైటపడతారు. కాని ఈత రాని సోఫో మోల్ నీటిలో మునిగి చనిపోతుంది. సోఫీ మోల్ కనిపించకపోవడంలో పిల్లలిద్దరూ భయపడతారు.

నది అవతల వేలూత ఓ చిన్న గుడిసె వేసుకుని అప్పుడప్పుడు సమయం గడుపుతాడు. అక్కడ పక్షవాతంతో మంచాన పడిన వేలూత తమ్ముడు కుట్టయ్యన్ కూడా ఉంటాడు.  ఇది ఆ పిల్లలకి మాత్రమే తెలిసిన రహస్యం. సోపి మోల్ నదిలో మునిగిపోయిందని తెలిసి భయంతో పిల్లలు ఆ గుడిసెలోనె తలదాచుకుంటారు.

పిల్లల కోసం వెతుకుతున్న పోలీసులకు నది అవతల గుడిసెలో వాళ్లు కనిపిస్తారు. పక్కనె అలసి నిద్రపోతున్న వెలుత ని వాళ్లు అరెస్టు చేస్తారు. అసలు పిల్లల విషయం తెలియని వెలూత తానెందుకు అరెస్ట్ అవుతున్నానో తెలీయక ప్రతిఘటిస్తాడు. పోలీసులు అతన్ని విపరీతంగా కోడతారు. సోఫీ మోల్ మరణాకిని కారణం వేలుత అని మిగతా ఇద్దరు పిల్లలని అతనే కిడ్నాప్ చేశాడని బేబీ కొచ్చమ్మ గొడవ లేపుతుంది. కాని పోలీసులకు వారి విచారణలో ఇది తప్పని తెలిస్తుంది. వేలూతకు కమ్యునిస్టు పార్టీతో సంబంధం ఉందని అతన్ని తాము అన్యాయంగా అరెస్టు చేసి విపరీతంగా కోట్టామని తెలుస్తె పార్టీ నాయకులు గొడవ చేస్తారని పోలీసులు భయపడతారు. బేబీ కొచ్చమ్మ తమను తప్పు దారి పట్టించింది కాబట్టి ఆమె ఈ సమస్యకు పరిష్కారం చూపాలని ఒత్తిడి తెస్తారు. జిత్తులమారి అయిన బేబీ కొచెమ్మ పిల్లలలో నెమ్మదస్తుడయిన ఎస్తాను అతను వేలుతా వల్లే తాము నదిలోకి వెళ్లామని, అతనే ఇద్దరిని గుడిసెలోకి బలవంతంగా తీసుకెళ్ళాడని చెప్పాలని లేదంటె అమ్ము కష్టాలపాలవుతుందని బెదిరిస్తుంది. బెదిరిన ఎస్తా వేలూతా తమను కిడ్నాప్ చేశాడని పోలీసులకు సాక్షం ఇస్తాడు. పోలీసులు  విపరీతంగా కొట్టడంతో వేలూతా మరణిస్తాడు. కాని ఎస్తా ఎప్పటికీ మామూలు  మనిషి కాలేకపోతాడు. జీవితాంతం ఒక మౌనంలోకి జారుకుంటాడు. సోఫీ మోల్ మరణం ఆ ఇంటిని కుదిపేస్తుంది.  చాకో పిచ్చివాడవుతాడు. మార్గరెట్ కూతురిని ఆ ఊరి స్మాశానానికి అప్పజెప్పి తిరిగి తన దేశం వెళ్లిపోతుంది.

మరో పక్క బేబీ కొచ్చమ్మ అమ్ము ఆమె పిల్లలే సోఫీ మోల్ మరణానికి కారకులని చాకో మనసు విరిచేస్తుంది. ఆ ఇంటి పై ఆమె ఇప్పుడు పూర్తి ఆధిపత్యం సంపాదిస్తుంది. చాకో అమ్ముని ఇంటి నుండి గెంటేస్తాడు. ఎస్తా తల్లి నుండి విడిపోతాడు. అమ్ము ఉద్యోగ ప్రయత్నం చేసి పిల్లలను దగ్గరకు తెచ్చుకోవాలని తీవ్రంగా ప్రయత్నిస్తుంది. కాని ఉద్యోగ ప్రయత్నాలలో ఉన్నప్పుడే ఓ హోటల్ లో గుండెపోటుతో మరణిస్తుంది. రాహెల్ అమెరికా వెళ్ళి చదువుకుంటుంది. కాని ఆమె జీవితంలో ని నిరాశ ఆమెను వెన్నాడుతూనే ఉంటుంది. ఎవరినీ ప్రేమించలేక, ఏ బంధంలోనూ ఉండలేక ఆమె నలిగిపోతుంది. ఒంటరిగా మిగిలిపోతుంది. బేబీ కొచామ్మ సంరక్షణలో మౌనిలా ఎదురుగాడు ఎస్తా. చిన్నతనంలో అనుభవించిన విషాదం, తెలియని వయసులో చేసిన తప్పు వలన నిరంతం దహించి వేసే పశ్చాత్తాప భావం  నుండి అతను తప్పించుకోలేకపోతాడు. ఇరవై నాలుగు ఏళ్ళ తరువాత రాహెల్ ఎస్తా దగ్గరకు తిరిగి వస్తుంది. అతని దగ్గరే ప్రశాంతతను పొందుతుంది. రాహెల్ రాకతో కొంత తేరుకుంటాడు ఎస్తా కాని అతనిలోని ఆత్మ ఎప్పుడో  మరణించింది.  అన్ని సంవత్సరాలు దూరంగా  ఉన్నా ఒకరి కోసం మరొకరు వెతుకుంటూనే గడిపిన తమ జీవితాలలోని శూన్యాన్ని తమ కలయికతో మాపుకోవాలనే కోరికతో  ఓ  సందర్భంలో ఈ కవల పిల్లలు ఇద్దరూ శారీరికంగా కలుస్తారు. కాని ఏ కలయికా వాళ్లను వారి పాత ప్రేమ, దగ్గరితనం లోకి తీసుకెళ్లలేదని, తాము బాల్యంలోనే  మానసికంగా మరణించి జీవచ్చవాలుగా మిగిలామని వారికి అర్ధం అవుతుంది. .

నవలలో పిల్లల భాషలో చాలా సంభాషణలు ఉంటాయి. అంటే ఇక్కడ ఎన్నో అచ్చు తప్పులు పిలల్లు పలికేటట్లు కొన్ని పదాల సాగతిత, కొన్ని పాటలు, కలిసిపోయి వస్తూ ఉంటాయి. అంటే పూర్తిగా చిన్న పిల్లల మనసులోనించి వచ్చిన కథగా దీన్ని రచయిత్రి మలిచారు. పైగా అంగ్లేయిల ప్రభావం ఇంగ్లీషు భాషపై స్వాతంత్రానంతర పరిస్థితులలోనూ ఈ దేశంలో ఎలా ఉందో ఒక సిరియన్ క్రైస్తవ కూటుంబం నేపద్యంలో ఆమె వ్యంగ్యంగా చెప్పుకొస్తారు. మూడు తరాల కథను ఒకో పొర ఒకో సమయంలో విప్పుతూ ఆమె చెప్పే పద్దతి వల్ల కథను అర్ధం చేసుకోవడం లో కొంత కష్టం ఏర్పడుతుంది. ఒక సంఘటన నడుస్తూ అంతలోనే కొన్ని సంవత్సరాల ముందుకు లేదా వెనక్కు హఠాత్తుగా కథ పరిగెడుతుంది.

కథలో నిత్యం కుటుంబ సమాజంలో మనిషి ఎదుర్కునే దోపిడి ని గమనించవచ్చు. కుటుంబంలో ఆధిపత్య ధోరణులు, పిత్రిస్వామ్య భావజాలం స్త్రీల మధ్య కుటుంబ ఆధిపత్యం కోసం నిత్యం జరిగె పోరు, సమాజంలో వర్గ భేధాలు, స్త్రీ పురుష సంబంధాల మధ్య అంక్షలు, కుల వ్యవస్థ, పిల్లల పై లైంగిక దాడి, ఇవ్వన్నీ ఒకెత్తయితే  అక్కా తమ్ముళ్ల మధ్య లైంగిక సంబంధం  కథలో రావడం కూడా ఈ పుస్తకంపై ఎన్నీ విమర్శలకు దారి తీసింది. ఏ విషయంలోనూ ఆశావాహ దృక్పధం లేకుండా రాసిన అతి విషాద కథ అని కొందరు అభిప్రాయపడ్డారు. ఆ రోజుల్లో కమ్యునిస్ట్ పార్టీ కార్యకర్తల ఆలోచనా లేమీ ఉద్యమ స్పూర్తి లో లేని నిజాయితి ని కూడా నవల ఎత్తి చూపుతుంది.

సమాజంలో ప్రేమపై నియంత్రణ సమాజం విధించడాన్ని ఈ నవల ద్వారా అరుంధతీ రాయ్ ఖండించినట్లు అనిపిస్తుంది. అమ్ము వెలూత సంబంధం తో  మొదలయి ఇద్దరు సోదరుల మధ్య లైంగిక సంబంధం దాకా సాగే ఈ నవలలో మనుషుల లైంగికత పై సమాజం పెట్టే ఆంక్షల పట్ల ప్రశ్నలు సంధించినట్లు అనిపిస్తుంది నవల ముగింపు. సమాజం నిర్ధాక్షిణ్యంగా వేసే ఆంక్షలపై  అరుంధతి సంధించిన ధిక్కారం ఈ నవల ముగింపు అని అనుకోవచ్చు. బాల్యంలోని గాయాలు మనిషి జీవితాలను నాశనం చేస్తాయి. వాటి ప్రభావం జీవితాంతం ఉంటుంది. చైల్డ్ హుడ్ ట్రామా ని దాని పర్యవసానాన్ని కూడా చర్చించిన నవల “ది గాడ్ ఆఫ్ స్మాల్ థింగ్స్”

*

జ్యోతి, పి.

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు