అసహనాన్ని ప్రకటించడమే ధిక్కారం!

కొత్త కాలానికి కొత్త ఊహలు చేస్తున్న ఉద్యమ కవి దొంతం చరణ్. రాసే వాక్యానికీ, బతుక్కీ మధ్య ఎడం వుండకూడదని నమ్మే చరణ్ కొత్త పుస్తకం 19 న ఆవిష్కరణ! చరణ్ కి అభినందనలు!

1. శివారెడ్డి గారు అన్నట్లు గానే మీ మొదటి పుస్తకానికీ రెండో పుస్తకానికీ మధ్య సరళత పెరిగింది. సూటిగా చెప్పటం ఉంది. మీరీ మార్పును కావాలనే మీ కవిత్వంలోకి తీసుకువచ్చారా?

తర కవుల కవిత్వ ప్రభావం నా కవిత్వం పైన ఉందో లేదో నాకు తెలియదు కాని, నాపైన మరియు నా కవిత్వం పైన వుంటే అదికంగా అది paintings ప్రభావమే. ముఖ్యంగా నా మొదటి పుస్తకంలో. ప్రపంచవ్యాప్తంగా Art లో dark art అనే format ఒకటి వుంటుంది. ఉన్నది ఉన్నట్టు నగ్నంగా చెప్పడం. లేదా భయంకరంగా అనిపించేలాగ చూపించడం. త్వరగా అట్రాక్ట్ అయ్యేలా చేయటం. లేదా అతి త్వరగా ఇందులో ఇంకేదో వుంది అనే ఆలోచనల్లో పడేయటం. ఒక్కోసారి భయాందోళనలకు గురి చేయడం. ఇలాంటి లక్షణాలతో వుండేవి dark art. ఇవన్నీ నా మొదటి పుస్తకంలో వుంటాయి. కొంచం మార్మికత కూడా వుంటుంది. అర్దం అయ్యి, అర్థం కాని ఒకానొక స్థితి. బహుశా నేను మొదటి పుస్తకంలో రాసిన కన్ని కవితలు అందరికీ అర్దం కాకపోవచ్చు. ప్రజల కోసమే రాసినప్పటికీ ఆ ప్రజకు ఏమాత్రం అర్థం కాకపోవచ్చు. ఆర్ట్ అందరికీ అర్దం కావాలనే రూల్ లేదు. అదొక ఆర్ట్. అంతే. కాని ఏ ప్రజ కోసం రాస్తామో ఆ ప్రజకు చేరేలా, అర్దం అయ్యేలా వుండాలని అదే ఆర్ట్ లో ఇంకో మార్గాన్ని ఎంచుకున్నాను. భయంకరమైన imaginaries ద్వారా చెప్పడం అనే format నుంచి తప్పించుకొని, సరళంగా సామాన్యమైన ప్రజకు అర్దం అయ్యేలా రాయడం అలవాటు చేసుకున్నాను. కావాలనే కొన్ని నెలలుగా నాలో ఉన్న అగ్నిని వెలిగించకుండా వాయిదా వేసుకుని.. దాదాపు ఎనిమిది నెలల తర్వాత మళ్లీ కవితలు రాయడం మొదలుపెట్టాను. 2022 లో నాలో దాచేసుకున్న అగ్ని మొత్తం, 2023 లో నేను రాసిన ప్రతీ కవితలో ప్రతిబింబించింది. భయంకరమైన కవిత్వం లోంచి ప్రజా కవిత్వంలోకి వెళ్ళాలని, చెరబండరాజు లాగ పాటలు రాయాలని నా ఆలోచన. అది ఎప్పటికి సాధ్యపడుతుందో కూడా స్పష్టంగా చెప్పలేను.
2. ఊహ చేయటమే ధిక్కరణ అని మీ కవిత్వం ద్వారా చాటుతున్నారు. ఆచరణ లేకుండా కేవలం ఊహ మాత్రం చేస్తే చాలంటారా?
నియంతృత్వ ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మనం ఎలాంటి పరిమితులతో ఊహ చేసినా అదొక హెచ్చరికగానే నిలుస్తుంది. ఊహ చేయటం అనేది అనేక ధిక్కరణలో అది మొదటిది. కాకపోతే ఆ పరిమితులు మరీ దిగజారే స్థాయిలో వుండకూడదు. మన భాషలు, మన పరిమితులు వెరైనప్పటికీ మన లక్ష్యం ఒకటై వుండాలి. ఆచరణ లేకుండా ఊహ మాత్రమే చేస్తూ ఒక మూలన కూర్చుంటాం అనే వాదన మంచిది కాదు. ఊహ లేని జీవితం చెడ్డది. ఆచరణ లేని కవిత్వ ప్రయాణం ఇంకాస్త పైస్థాయి చెడ్డది. ఊహ లేని ఆచరణ, ఆచరణ లేని ఊహ, రెండూ ప్రమాదకరమే. రెండూ మోసపూరితమే.
3. ఈ సంపుటిలో సంఘటనాత్మక కవిత్వం ఎక్కువగా చోటు చేసుకుంది. సంఘటనల ద్వారా తిరుగుబాటు కవిత్వాన్ని చెబితే అది ఎంతవరకూ సఫలం అవుతుంది అంటారూ?
రుగుతున్న ప్రతీ అమానవీయ సంఘటనల మీద కవిత్వం రాసి.. చివరికి కొడవలి పట్టమనే అంటాన్నేను. సంఘటనల మీద తిరుగుబాటు కవిత్వం రాస్తే సఫలం అవుతుంది. ఎంతవరకూ ఎప్పటి వరకూ అని నేను చెప్పలేను. ప్రస్తుతానికి అదొక అవసరం. అదొక అనివార్యం.
4. మీ కవిత్వమంతా తిరుగుబాటుదారుల స్పూర్తితో నిర్మించినట్లుగా ఉంటుంది.  ఉద్యమాల కన్నా ఉద్యమకారులే మిమ్మల్ని ఎక్కువగా ప్రభావితం చేశారు అంటారా?
వును. నాకు నక్సలైట్ పోరాటం పరిచయం అవ్వకముందే కామ్రేడ్ ఆర్కే గొంతు తెలుసు. సరిగ్గా గుర్తు లేదు కానీ, బహుశా అతని ప్రసంగం తర్వాతే నాకు నక్సలైట్ల పోరాటం తెలిసింది అని నేను ఇప్పటికీ భావిస్తున్నాను. అట్లాగే, అమరుల బంధు మిత్రుల సంఘం కంటే ముందే నాకు వరవరరావు గొంతు తెలుసు. అతని ద్వారానే నాకు శవాల స్వాధీన కమిటీ తెలిసింది. హెలెన్ బోలిక్ అమరత్వం లేకపోతే టర్కీలో జానపద పాటల్ని రద్దు చేశారని, అందుకోసం మూడు వందల రోజులు అక్కడి యువకులు కొందరు నిరాహార దీక్ష చేపట్టి మరికొందరు అమరులు అయ్యారని నాకు తెలిసేది కాదేమో అనిపిస్తుంది. నా జీవితంలో కొందరి పోరాటవ్యక్తుల వల్లే కొన్ని ఉద్యమాలు పరిచయం అయ్యాయి అనేది వాస్తవం.
5. మొదటి నుంచీ మీ కవిత్వం తిరుగుబాటు నేపథ్యంలో ఉండటానికి గల కారణాలు ఏమిటి?
అమానవీయం పట్ల నిశబ్దంగా, సహనంగా వుండాలనే ఫిలాసఫీ నాలో లేదు. అసహనాన్ని ఏదో ఒక రకంగా ప్రకటించడమే ధిక్కారం అని భావించి బతికినవాడిని. ప్రస్తుతం జ్ఞాపకాలను సైతం రద్దు చేసే ప్రభుత్వాల గురించి రాస్తున్నాను గాని, ఇలాంటివి ఎన్నో నా చిన్ననాడే నేను ఎదుర్కున్నాను. అందుకే ఈ లోకంలో కుటుంబ వ్యవస్థ, ప్రభుత్వ వ్యవస్థ రెండూ వేరువేరుగా నాకు అనిపించలేదు. చిన్ననాటి నుంచే తిరుగుబాటు లక్షణం ఉండటం కారణంగా కావొచ్చు తిరుగుబాటు కవితలనే ఎక్కువగా రాస్తున్నాను. ఇక మీదట కూడా తిరుగుబాటు కవిత్వం రాయడానికే నేను ఎక్కువగా ఇష్టపడతాను. నాకున్న సృజనాత్మక శక్తిని పోరాట కవితలు రాయడం కోసమే ఎక్కువగా ఉపయోగిస్తాను.
*

గూండ్ల వెంకట నారాయణ

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • కవికి తాను ఎక్కడ నిలబడాలో తెలియడం కంటే మించిన స్పష్టత నిబద్ధత మరేవీ లేవు. ఊహనీ ఆచరణనీ విడదీసి చూడలేం.
    కవిత్వానికి గీటురాయి సృజనాత్మక ఆచరణే అని ముక్కుసూటిగా చెప్పిన చఱణ్ కి అభినందనలు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు