అసలు సమస్యంతా అతనే!

పోస్ట్‌మాడర్నిజానికి చాలా ముందుగానే ఆ ధోరణిలో వచ్చిన కథగా, తొలినాళ్ల పోస్ట్‌మాడర్నిస్టిక్ కథగా దీన్ని ప్రత్యేకంగా గుర్తించవచ్చు!

ఎ పర్‌ఫెక్ట్ డే ఫర్ బనానాఫిష్ (1948)

జె.డి. శాలింజర్

కథని ఈ లింక్స్‌లో చదవవచ్చు.

ఇంగ్లీష్: A Perfect Day for Bananafish

తెలుగు: Translation-A Perfect Day for Bananafish

న్యూ యార్కర్ పత్రిక 31 జనవరి 1948 సంచికలో ప్రచురించిన ఈ కథ సంచలనాన్ని కలిగించింది.

అందరినీ వేధించే ఒకే ప్రశ్న: కథ చివర్లో సీమోర్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నాడు?

సీమోర్ అనే పాత్ర, రెండో ప్రపంచ యుద్ధంలో పనిచేసి బయటకి వచ్చాక, సాధారణ పౌరజీవితంలో ఇమడలేకపోవడం కథాంశం. కానీ, కథ చివర్లో ఆ పాత్ర ఆత్మహత్య చేసుకోవడం చాలామందికి మింగుడుపడలేదు. అసలు అతను ఎందుకు అలా చేసాడన్నదీ అర్థం కాలేదు. ఆత్మహత్య చేసుకున్న వ్యక్తికి ఆ దిశగా ప్రేరణ కలిగించినదేమిటన్న విషయంగా కథలో అస్పష్టత ఉంది కాబట్టి, పాఠకుల/విమర్శకులలో వివిధ అభిప్రాయాలు ఉన్నాయి. అతని అమాయకత్వం అంతా యుద్ధభీభత్సంతో ఛిద్రమైపోయిందన్న ఆవేదనతో అలా చేసాడని అని కొంతమంది అభిప్రాయపడ్డారు. సీమోర్ భార్య మ్యురియలే దీనికి కారణం అని కొంతమంది అభిప్రాయపడగా, ప్రపంచానికి అతీతంగా ఆధ్యాత్మికంగా సాగే సీమోర్ ఆలోచనలు అతన్ని ఈ ప్రపంచంలో కుదురుకోలేని ఉక్కపోతని కలగజేసాయని కొంతమందీ, ఈ కథలోని బనానాఫిష్ లాంటివాడే సీమోర్ అనీ, భయాల్నో ఆనందాల్నో అతిగా అనుభవించిన అతను చివరికి బనానాఫిష్ పొందే ముగింపు లాంటిదే పొందాడనీ మరికొంతమంది అన్నారు. సిబిల్ లాంటి పిల్లల్లో అమాయకత్వాన్ని చూసి చలించిన సీమోర్- మ్యురియల్సూ, వాళ్ల అమ్మలు, సైకైయాట్రిస్టులూ ఉన్న ఇలాంటి ప్రపంచంలో ఇమడలేననుకున్నాడని ఇంకొంతమంది అన్నారు. కథలో పాటించిన క్లుప్తత వల్ల ఇలాంటి విభిన్నమైన వ్యాఖ్యానాలు రావడం సహజమే కాబట్టి ఈ కథ మీద చర్చ ఆసక్తికరంగా ఉంటుంది.

ఈ కథలోని సీమోర్‌కీ, రచయితకీ కొన్ని విషయాల్లో పోలికలున్నాయి. శాలింజర్ కూడా యునైటెడ్ స్టేట్స్ ఆర్మీలోకి 1942లో తీసుకోబడ్డాడు. యుద్ధంలో పాల్గొన్నాడు. 1945లో మానసికంగా దెబ్బతినడం వల్ల (పూర్తి వివరాలు తెలియవు) కొంతకాలం ఆర్మీ హాస్పిటల్‌లో ఉన్నాడు. ఆ సంవత్సరమే సిల్వియాని (ఈవిడ గురించి వివరాలు కూడా తెలియవు) వివాహం చేసుకున్నాక, ఎనిమిది నెలలలోనే వారిద్దరూ విడిపోయారు. ఈ వివరాలలో కొన్ని కథలోని సీమోర్‌కి సంబంధించిన విషయాలని పోలివుంటాయి. శాలింజర్ వైవాహిక జీవితం విఫలమైనా, రచయితగా మంచి గుర్తింపు పొందడం ప్రారంభించాడు. రచయితగా అంతకుముందు కొన్ని కథలను రాసిన శాలింజర్, సీరియస్ రచయితగా సాగిన ప్రస్థానంలో ఈ కథ మొదటి మైలురాయి.

మూడేళ్ల తర్వాత శాలింజర్ కథాసంపుటి 9 స్టోరీస్‌ ‌లో మొదటి కథ ఇది. ఈ కథాసంపుటికి పెట్టిన పేరు– అందులో తొమ్మిది కథలు ఉన్నాయన్న సంగతి తప్ప ఇంకేమీ తెలియజేయదు. శాలింజర్‌కి అంకెల మీద ఉన్న నమ్మకం కథలో కనిపించినట్టుగానే ఇక్కడా కనిపిస్తుంది. ప్రత్యేకించి, ఆరు అనే అంకె మీద శాలింజర్‌కి ప్రత్యేకమైన ఆసక్తి ఉన్నట్టు కనిపిస్తుంది. ఎ పర్‌ఫెక్ట్ డే ఫర్ బనానాఫిష్ కథలో వచ్చే పులుల సంఖ్య ఆరు. హోటల్లో వీళ్ల రూమ్ నంబర్ 507 లోని అంకెల్ని కూడితే పన్నెండు. సీమోర్ ఆత్మహత్య చేసుకున్న పిస్టల్ కాలిబర్ 7.65 లోని అంకెల్ని కూడితే పద్దెనిమిది!

సంభాషణలే ఈ కథని దాదాపుగా నడిపిస్తాయి. అవి కూడా కథని మొత్తం పాఠకుడికి వివరించే ప్రయత్నం ఏమీ చేయవు కానీ, పాఠకుడి దృష్టిని కథ దాటి బయటకు పోనీవు. సిబిల్ అనే (బహుశా ఏడెనిమిదేళ్ల వయసున్న అమ్మాయి అయివుంటుంది) విషయాలని లోతుగా అర్థం చేసుకోవడంలోనూ, వాటిని వ్యక్తీకరించడంలోనూ ఆశ్చర్యకరమైన స్థాయి ఉన్న పిల్ల. శాలింజర్ రచనల్లో పెద్దవాళ్లల్లో కొరవడే ఈ లక్షణం చిన్నపిల్లల్లోనే ఎక్కువగా కనిపిస్తుంటుంది. ‘సీ మోర్ గ్లాస్’ అనే భాషాపరమైన శ్లేషని వేయడం ఒక ఎత్తైతే, ‘అతన్ని మళ్లీ కలుస్తాను’ అనే అర్థంతో దాన్ని ప్రయోగించడం ఆ పిల్ల వ్యక్తీకరణకి మంచి ఉదాహరణ. సీమోర్ కల్పితకథలోని బనానాఫిష్‌ని తను చూసానని చెప్పడం కూడా ఆ పిల్ల ఊహాత్మక శక్తికి మరో ఉదాహరణ.

ప్రతీకలు

ప్రతీకలు వాడే చోట పోలుస్తున్న వస్తువుతో బాటు, ఉద్దేశింపబడుతున్న వస్తువో, భావనో ఒకటి ఉంటుంది. ఈ కథలో, అలాంటి ప్రతీకలు ఎక్కడెక్కడున్నాయో తెలుస్తూనే ఉన్నా, అవి వేటిని ఉద్దేశించి వాడబడుతున్నాయనేది స్పష్టంగా ఉండదు. అలాంటి అస్పష్టమైన ప్రతీకల్లో మొట్టమొదటిది బనానాఫిష్. బనానా కలుగులోకి దూరి, ఇష్టం వచ్చినట్టు తినేసి, లావయిపోయి బనానా ఫీవర్ తెచ్చుకుని, బయటకి రాలేక చచ్చిపోయే చేపలే బనానాఫిష్ అని సీమోర్ ఒక కల్పితకథని చెబుతాడు. అయితే ఈ బనానాఫిష్ దేనికి ప్రతీక? అందరికీ అంగీకారయోగ్యమైన సమాధానం రాబట్టడం కష్టం. ఇది భౌతిక ప్రపంచంలోని సాధారణమైన మనుషులకి ప్రతీక కావచ్చు. ప్రాపంచిక సుఖాలని అనుభవించి, ప్రాపంచిక కూపాల్లో ఇరుక్కుపోయిన అలాంటి మనుషులు ప్రతీకాత్మకంగా అలాంటి ఒక విష(య)జ్వరంతో మరణిస్తున్నారనేది కావొచ్చు. లేదా, అది సీమోర్‌కే సంబంధించిన ప్రతీక కావచ్చు. యుద్ధమనే బనానా హోల్‌లోకి వెళ్లి, అక్కడి అకృత్యాలన్నీ బలవంతంగానైనా చూసీ చేసీ, బనానా ఫీవర్‌కి గురై అంతిమంగా మరణించవలసిన అగత్యం పట్టిన సీమోరే బహుశా ఆ బనానాఫిష్ కూడా అయివుండవచ్చు.

నీలం రంగు మరో ప్రతీక. ఇది కూడా మరో అస్పష్టమైన ప్రతీక. ఈ రంగు అమాయకత్వానికీ, ఆధ్యాత్మికతకీ ప్రతీకగా సాహిత్యంలో భావించబడుతూ ఉంటుంది. సీమోర్ వేసుకున్న బేతింగ్ సూట్ నీలం రంగులో ఉంటుంది. సిబిల్‌తో కలిసి నీలం రంగులో ఉన్న నీళ్లల్లో ఈతకొడతాడు. నిజానికి సిబిల్ వేసుకున్న పసుపుపచ్చని బేతింగ్ సూట్ కూడా సీమోర్‌కి నీలం రంగులోనే కనిపిస్తుంది!

ఎండ వల్ల చర్మం కమిలిపోవడం (సన్‌బర్న్) కథలో మరో ప్రతీక. మ్యురియల్ దీని తాకిడికి అసలు ఎటూ కదలలేని పరిస్థితిలో ఉంటుంది. సిబిల్‌ పాత్రని ప్రవేశపెట్టిన సన్నివేశంలో ఆమె తల్లి సన్‌బర్న్ లోషన్ సిబిల్‌కి పూస్తూ కనిపిస్తుంది. సీమోర్ తను వేసుకున్న సూట్‌ అంచుల్ని లాగి పట్టుకుంటుంటాడు; లిఫ్ట్‌లో కనిపించిన మహిళ ముక్కు మీద ఆయింట్‌మెంట్ ఉంటుంది. ప్రాపంచిక కల్మషాలనుంచి అందరూ తమని తాము కాపాడుకుంటూ ఉంటారనీ, ఆ రక్షణ పొందడంలో అందరూ పాక్షికమైన విజయాన్ని మాత్రమే సాధిస్తారనీ, అది ఒక్కొక్కరి విషయంలో ఒక్కోరకంగా ఉంటుందనేది బహుశా ఈ ప్రతీక ఉద్దేశం అయివుండాలి. తన డొల్లతనం వల్ల మ్యురియల్ దీనికి ఎక్కువగా గురికాగా, మనస్సు పరిశుభ్రంగా ఉన్న సిబిల్ అసలు దీని బారిన పడలేదు. లిఫ్ట్‌లోని మహిళ ముక్కుకి మాత్రమే (పాక్షికంగా మాత్రమే) రక్షణ ఉంది కానీ మిగతా శరీరానికి కాదు. ఈ కల్మషాల పట్ల ఎక్కువగా భయం ఉన్న సీమోర్ తన డ్రస్సు అంచుల్ని బలంగా దగ్గరకి లాక్కుంటాడు – రక్షణ కోసం.

 పోస్ట్‌మాడర్నిజం

పోస్ట్‌మాడర్నిజం అంటే ఏమిటో వివరించడం నిజానికి కొంచెం కష్టమైన పనే! స్థూలంగా చెప్పాలంటే, కళని బంధించే కళాసూత్రాలని ప్రశ్నించి ధిక్కరించడం ఈ ఉద్యమ లక్ష్యం. ప్రయోగాత్మక ధోరణుల్లో సాంప్రదాయకమైన కథన, పాత్రచిత్రణల మూసల్ని బద్దలుకొట్టడానికి ప్రయత్నం చేస్తుంది. మనకు దృగ్గోచరమయ్యేది ఒక కృత్రిమమైన నిర్మాణమే తప్ప అంతిమ వాస్తవం కాదన్నది ఈ వాదం భావన. ఈ లక్షణాలని దృష్టిలో ఉంచుకొని కథని పరిశీలిస్తే ఆ వాదపు ఛాయలు ఉన్నట్టు కనిపిస్తాయి. రచనల్లో సాధారణంగా కనిపించే కార్యకారణ సంబంధాన్ని ఉపేక్షిస్తూ సీమోర్ ఆత్మహత్యకి సంబంధించిన మోటివ్‌ని ఈ కథ ప్రస్తావించకపోవడం అనేది ప్రాథమిక సూత్రాల ధిక్కారమే కాకుండా, ఒక పాత్ర మనసులోకి ప్రవేశించి వాస్తవాన్ని రాబట్టడం అనేది ఒక మిధ్య అనే విషయాన్ని పరోక్షంగా సూచిస్తున్నట్టు లెక్క. ఈ రకంగా చూస్తే, అరవైల తర్వాత ప్రాచుర్యం పొందిన పోస్ట్‌మాడర్నిజానికి చాలా ముందుగానే ఆ ధోరణిలో వచ్చిన కథగా, తొలినాళ్ల పోస్ట్‌మాడర్నిస్టిక్ కథగా దీన్ని ప్రత్యేకంగా గుర్తించవచ్చు!

అసలు ఆరోజు ఏం జరిగింది?

ఒకరకంగా చూస్తే ఇది ఒక మిస్టరీ స్టోరీ. సీమోర్‌కి పెళ్లయింది. చక్కగా ఉండే భార్య ఉంది. ఇద్దరూ కలిసి సరదాగా బయటకి వచ్చారు. ఆరోజున సీమోర్ సరదాగా ఒక చిన్నపిల్లతో ఆడుకున్నాడు. ఇలా ఉన్నప్పుడు అతను హఠాత్తుగా ఆత్మహత్య చేసుకోవడమేమిటి? శాలింజర్ మిగతా కథల్లో ఈ పాత్రలకి సంబంధించి కొన్ని వివరాలు దొరుకుతాయి కానీ, ఆ వివరాల్లోకి పోదలుచుకోలేదు. సర్వస్వతంత్రమైన కథ దానికదే వివరణ ఇవ్వాలి కానీ, కథ బయటినుంచి ఆ వివరాలని సమకూర్చుకోవడం సరికాదు కాబట్టి ఆ ప్రయత్నం చేయడం లేదు.

మ్యురియల్‌కీ, వాళ్ల అమ్మకీ మధ్య జరిగే ఫోన్ సంభాషణతో కథ ప్రారంభం అవుతుంది. అందంగా ఉండే మ్యురియల్‌కి అందం, అలంకరణల మీద శ్రద్ధ ఎక్కువ. సంభాషణల్లో ఆమె పైపై మెరుగుల మనిషిలాగానూ, లోపల డొల్లగా ఉండే మనిషిగానూ పాఠకుడికి అనిపిస్తుంది. చాలా మామూలు విషయాల గురించి మాట్లాడే మ్యురియల్‌ని ఒంటరిగా వెనక్కి వచ్చేయమని వాళ్ల అమ్మ అడిగినప్పుడు మ్యురియర్ రానంటుంది. దానికి ఆమె చెప్పే కారణం సీమోర్ పట్ల ఉన్న విశ్వాసం కాదు. అది “ఇదే మొదటిసారి మేము రావడం” కాబట్టి. అలా అని, మ్యురియల్‌లో క్రూరత్వం ఎక్కడా కనబడదు. మనిషిలో కొంత స్పార్క్ కూడా ఉంది. మాటల్లో చాతుర్యం అక్కడక్కడా కనిపిస్తూ ఉంటుంది. వాళ్ల అమ్మే స్వయంగా చెప్పినట్టు- సీమోర్ యుద్ధరంగంలో ఉన్నప్పుడు అతనికోసం ఓపిగ్గా ఎదురుచూసింది; వివాహం పట్ల విశ్వాసం చూపించింది. సీమోర్ ప్రవర్తనల గురించి కూడా తన తల్లికి ఉన్నన్ని అభ్యంతరాలు ఆమెకి ఉన్నట్టు అనిపించదు. తనకి సీమోర్ నిక్‌నేమ్ పెడితే, దానిపట్ల ఆమెకి కినుక ఏమీ ఉండదు- కిలకిలా నవ్వడం తప్పించి. సీమోర్ స్వయంగా చెప్పినట్టు, తన ఖాళీ సమయాలలో పేదపిల్లలకి ఏదో చేయాలన్న తపన ఉంది ఆమెకి. పరిమితమైన మానసిక ప్రపంచం ఉన్నట్టు కనిపించే మ్యురియల్‌ని జాగ్రత్తగా పరిశీలిస్తే, సీమోర్ గురించి తల్లి ఎంతగా భయపెట్టినా భయపడదు ఆమె. సీమోర్ పట్ల విశ్వాసం, విధేయత ఉన్న మనిషి. మొత్తం మీద, సమస్యని సృష్టించగల పాత్రగా మ్యురియల్ అనిపించదు.

మ్యురియల్ వాళ్ల అమ్మ అత్యుత్సాహం ఉన్న మనిషి. విపరీతమైన భయాలు కూడా ఉన్న మనిషి. కానీ, సీమోర్ గురించి చెప్పిన విషయాలలో- అతని డ్రైవింగ్ గురించీ, ఆర్మీ హాస్పిటల్ డాక్టర్ చెప్పిన సంగతీ- వాస్తవాల మీద ఆధారపడ్డవే కానీ, ఊహించుకున్న భయాలు కావు. సీమోర్ పట్ల ఆవిడకున్న నిరసన భావన అంతా, తన కూతురి మీద ఉన్న ప్రేమ వల్ల ఉద్భవించినదిగా భావించడానికి ఆస్కారం ఉంది. పైగా, ఈవిడ సీమోర్‌కి సమస్యలని సృష్టించినట్టుగా కథలో ఎక్కడా చెప్పబడలేదు. ఈ పాత్ర కూడా సమస్యని సృష్టించగల పాత్ర అనుకోవడానికి ఆస్కారం లేదు.

చూస్తుంటే, అసలు సమస్యంతా సీమోర్‌లోనే ఉన్నట్టు అనిపిస్తుంది. కథ మొదటి భాగంలో అతని గురించి పరోక్షంగా మనం తెలుసుకోగా, రెండోభాగంలో సీమోర్ ప్రవర్తనని నేరుగా పరిశీలించే అవకాశం లభిస్తుంది. అతని ప్రవర్తన మామూలుగానే ఉందని కొందరికి అనిపించవచ్చు. సమాజంతో సర్దుకుపోలేని విపరీత ప్రవర్తన కొంతమందికి కనిపించవచ్చు. వైవాహిక జీవితం పట్ల అతని అసంతృప్తి (“వెయ్యిచోట్లల్లో ఎక్కడైనా ఉండొచ్చు ఆమె. జుట్టుకి రంగు వేయించుకుంటూ హెయిర్‌డ్రస్సర్ దగ్గర ఉండొచ్చు. పేదపిల్లలకి ఏ బొమ్మలో చేస్తూ రూం‌మ్‌లోనే ఉండొచ్చు.”) లో వైరుధ్యాలున్నా, స్పష్టమైన అభిప్రాయ ప్రకటన ఉంది. సిబిల్‌తో అతని సంభాషణలని గమనిస్తే, అవి మానసిక అస్థిరత ఉన్న మనిషి మాట్లాడిన మాటల్లా అనిపించవు. సిబిల్‌ని ఒక అడల్ట్ కింద జమగట్టి మాట్లాడటం (పిల్లలకి అది నచ్చుతుంది కాబట్టి), సిబిల్‌తో హాస్య సంభాషణ చేయడం (నీలం, పసుపుపచ్చ రంగుల గురించి) – ఇవన్నీ సాధారణమైన మనుషులు చేసే పనులే. కాకపోతే, ఇందులో కొంత తేడానీ, కొంత ఐరనీ (మాట్లాడే మాటకి వేరే అర్థం ఉండటం)ని మనం గమనించవచ్చు. ఉదాహరణకి- ఇంకో పాపని సిబిల్ ఉదహరించినప్పుడు దానికి సీమోర్ ఇచ్చిన వివరణ (“అక్కడ కూర్చుంది నువ్వే అన్నట్టు ఊహించుకున్నాను.”) సవ్యంగా ఉన్నట్టు అనిపించదు. సిబిల్ నిజంగా చిన్నపిల్లే కాబట్టి, ఆ వివరణని పట్టించుకోకుండా తీసిపారేస్తుంది (“ఈసారి తనని నెట్టేసెయ్,” అంటుంది సిబిల్). ఈ సంభాషణ తర్వాత సీమోర్ వెంటనే బనానాఫిష్ ప్రస్తావన తీసుకువచ్చి చిన్నపిల్లల తరహా సంభాషణలోకి దిగిపోతాడు. మళ్లీ అందులో విపరీతమైన విషయాల గురించీ, చావు గురించీ సిబిల్‌తో మాట్లాడటం విడ్డూరంగా ఉంటుంది. సీమోర్ ప్రవర్తన అటూ యిటుగా ఉండటం కొంత అనుమానానికి ఆస్కారం ఇస్తుంది. అల వచ్చినప్పుడు దాన్ని పట్టించుకోకుండా ఉందాం (ఇది ప్రతీకాత్మకం కావచ్చు- ముంచుకువచ్చే అల సంఘనియమాలు అయివుండవచ్చు) అనడం అతని మానసిక స్థితి పట్ల మన అంచనాని సందేహించేలా చేస్తుంది.

అల వచ్చి వెళ్లాక, సిబిల్ పెట్టిన కేకలో ‘ఆనందాతిశయం’ కనిపించాక, సిబిల్‌‌లో కొద్దిగా మార్పు రావడం గమనించాలి. ఈ సంఘటన తర్వాత, సిబిల్ కూడా సీమోర్ ఆటే ఆడటం మొదలుపెడుతుంది. బనానాఫిష్ కనిపించిందంటుంది. దాని నోట్లో ఎన్ని అరటిపళ్లు ఉన్నాయి అనే ప్రశ్నకి అంతకుముందు జరిగిన వాస్తవ సంఘటన (ఆరు పులులు) లో నుంచి ఆరుని తీసుకుని సమాధానమిస్తుంది. వాస్తవాన్ని కల్పనకి అద్దుతుంది. మొదటిసారి, సిబిల్ కూడా సీమోర్ ప్రపంచంలోకి అడుగుపెడుతుంది. బహుశా ఇది గమనించి అప్రమత్తమైన సీమోర్, ఆ సంభాషణని అక్కడికి ముగిస్తాడు. అదికూడా, ఆమె పాదాన్ని ముద్దుపెట్టుకోవడం అనే ఒక విపరీతమైన చర్యతో. చిన్నపిల్లతో గడిపిన ఈ క్షణాల ప్రభావం అతన్నుంచి ఇంకా పూర్తిగా తొలగిపోయినట్టు అనిపించదు. తన కాళ్లవైపు చూస్తున్నదని లిఫ్ట్‌లోని మహిళ మీద చిన్నపిల్లవాడిలా ఆరోపణ చేస్తాడు. నిజానికి అలాంటి సంభాషణ కొద్ది నిమిషాల క్రితం అయితే బానే ఉండేది. ఇక్కడ పరిసరాల స్పృహని సీమోర్ కోల్పోయినట్టు కనిపిస్తాడు. ఏది మామూలు సంభాషణ, ఏది కాదు అనే విషయాల పట్ల పాఠకుడిని కన్‌ఫ్యూజ్ చేసిన సీమోర్, లిఫ్ట్‌లోని మహిళ అలా వెళ్లిపోవడం హాస్యాస్పదం అన్న భావనని పాఠకుడికి కలగజేస్తాడు. ఆమె వెళ్లిపోయాక అతను అనే “నాకున్నవీ అందరిలాగే రెండు మామూలు పాదాలు. ఎవరైనా వాటివైపు నిక్కినిక్కి ఎందుకు చూడాలో నాకు అర్థం కాదు.” మాటలు సీమోర్ మానసిక స్థితి గురించి కొంత స్పష్టతనిస్తాయి. తను మామూలే అనుకునే ఏ మనిషికీ ఆ విషయం గురించి మాట్లాడాల్సిన అవసరం ఉండదు. మామూలు కాదేమో అన్న భయం ఉన్న మనిషే అలాంటి ప్రకటనలకి పూనుకుంటాడు. తన పట్ల తనకి ఎంత నమ్మకం ఉందో, అంతే అపనమ్మకం కూడా ఉన్న పాత్ర సీమోర్. అతని భయాలూ, మానసిక అస్థిరతా, ఉన్మాదం ఇవన్నీ కథలోని అక్షరాల మాటున ఎక్కడో లోతుల్లో దాగిదాగి ఉన్నాయి. తనపట్లే తనకి ఎక్కడో భయాలున్నాయి సీమోర్‌కి.

ఇంతకీ, సీమోర్ ట్రిగ్గర్ ఎందుకు నొక్కినట్టు? ఇది ఎప్పటికీ మిస్టరీనే. ఈ ప్రశ్న వేసుకున్నప్పుడల్లా వచ్చే సమాధానాలు మరిన్ని ప్రశ్నలకి తావిస్తాయి. బహుశా, సమాధానం స్పష్టంగా లేని ప్రశ్నల వల్లే ఈ కథ ఇంకా సజీవంగా చర్చల్లో ఉంది. నిజానికి వాస్తవ ప్రపంచంలో కూడా- ఏ ఆత్మహత్యైనా ఎందుకు జరిగిందంటే సమాధానాలు రాబట్టడం అంత సులువైన పని కాదు. అందులో మనం పసిగట్టలేని, మనకి అర్థం కాని చాలా సంక్లిష్టతలు ఉంటాయి! ఆత్మహత్య మనకి మిస్టరీగానే ఉండవచ్చు. కానీ బాధితుడి లోపల అతనికే అర్థం కాని మిస్టరీలు చాలా ఉండివుంటాయి. సీమోర్ కూడా బహుశా దానికి మినహాయింపు కాదు.

ఏసాప్ కథతో సామ్యం

ముగింపులు వేరే అయినా, ఏసాప్ కథల్లో A Case for Patience అనే ఒక కథకీ, సీమోర్ చెప్పే బనానాఫిష్ కథకీ మధ్య పోలికలు ఉన్నాయి. కథ చివర్లో సీమోర్ ఆత్మహత్య తర్వాత, అసలు బనానాఫిష్ ఎవరన్నది పాఠకుడు ఆలోచించుకోవలసి వస్తుంది. సీమోర్, మ్యురియల్ పాత్రలలో ఎవరు బనానాఫిష్? అసలు ఎవరూ కారా? ఏసాప్ కథ ఈ విషయాన్ని నిర్ణయించడంలో సహాయపడక పోవచ్చు కానీ, ఆ కథని సీమోర్ ఎలా మార్చాడన్నది పరిశీలిద్దాం.

A Case for Patience కథలో ఒక నక్కకి చాలారోజులపాటు ఆహారం దొరక్క కడుపు కుంచించుకుపోతుంది. అది అలా ఆకలితో తిరుగుతున్నప్పుడు, ఒక చెట్టు తొర్రలో దానికి కొంత ఆహారం కనిపిస్తుంది. ఆశగా లోపలికి వెళ్లి అదంతా తినేస్తుంది. తినడం పూర్తయ్యేసరికి, కృశించిపోయి ఉన్న కడుపు పెరిగి పెద్దదై, తొర్రనుంచి బయటపడటం కష్టమైపోతుంది. ఇంతలో దారిన పోతున్న ఇంకో నక్క వచ్చి, కడుపు మామూలుగా తయారయ్యేంతవరకూ అక్కడే ఉండి తర్వాత బయటకు రమ్మని సలహా ఇస్తుంది. కథలో నీతి: కాలమే సమస్యలని పరిష్కరిస్తుంది.

ఈ కథలో చేపలు పై కథలో నక్క కంటే దారుణంగా “పందుల్లాగా” తిని చివరికి బనానా ఫీవర్‌తో చచ్చిపోతాయి. పై కథలోనూ ఈ కథలోనూ ఉన్న నీతి చిన్నపిల్లలకి ఉద్దేశించిందే అయినా, సీమోర్ ఏసాప్ కాదు కాబట్టి, బనానాఫిష్ కథలోని నీతి ఏమిటో చెప్పడు. దాన్ని మనమే కనుక్కోవాల్సి వస్తుంది.

సీమోర్ చెప్పే బనానాఫిష్ కథ తన భార్య మ్యురియల్‌ని ఉద్దేశించినదేమో అని మొదట్లో అనిపిస్తుంది. ఆమె అలంకారాలూ, ఫాషన్ల మీద చూపించే అతిశ్రద్ధ, ఆమే బనానాఫిష్ కావడానికి కావలసిన అర్హతలని సమకూరుస్తుంది. కథ చివర్లో సీమోర్, మ్యురియల్‌ని చంపివున్నట్టయితే, మ్యురియల్ బనానాఫిష్ అయ్యే అవకాశం ఉండేది. అలా కాలేదు కాబట్టి- బనానాఫిష్ మ్యురియల్ కాదు.

కథ చివర్లో చనిపోయాడు కాబట్టి, సీమోరే అసలయిన బనానాఫిష్ అనుకోవడానికి ఆస్కారం ఉన్నా, అతనికి బనానా ఫీవర్ కలిగించగల అంశాలేవీ కథలో కనబడవు. అతని భార్యలాగా, అన్నీ పొందాలన్న ఆతృత ఉన్నవాడు కాదు కాబట్టి. యుద్ధవాతావరణం మిగిల్చిన భయంకరమైన జ్ఞాపకాలొక్కటే మోతాదుకి మించాయి. కానీ, బనానా ఫీవర్‌కి ఇది సరైన కారణం అనిపించదు.

ఈ రెండూ సంతృప్తికరమైన సమాధానాలు ఇవ్వడం లేదు కాబట్టి, ఏసాప్ కథని మరోసారి పరిశీలిస్తే, సీమోర్ కథ ముగింపుని మార్చాడని అర్థం అవుతుంది. బహుశా, ఏసాప్ చెప్పిన నీతి అతనికి నచ్చకపోయి ఉండవచ్చు. అతనికి ఉన్న సమస్యలు అన్నీ యిన్నీ కావు. వివాహ సంబంధమైన సమస్యలతో బాటు, అతను మనుషులతో కలిసే రకం కాదు. లిఫ్ట్ సన్నివేశం ఆ విషయాన్ని తెలియబరుస్తుంది. అతను కేవలం పిల్లలతో మాత్రమే హాయిగా ఉండగలడేమో అనిపిస్తుంది. సిబిల్ కాలిని ముద్దుపెట్టుకున్నప్పుడు, విషయం కొంత వింతగా తయారవుతుంది. అన్ని సమస్యలనీ పరిష్కరిస్తుందని చెప్పుకునే కాలం ఇతన్ని సమస్యలనుంచి ఎలా ఒడ్డుకి పడేయగలదో ఊహించడం కష్టం. చివర్లో చనిపోతాడు కనక ఆ విషయం తెలుసుకునే అవకాశం కూడా లేదు. బహుశా ఓర్పు లేకపోవడం ఇతనికి బనానా ఫీవర్‌గా పరిణమించి ఉండాలి. దీని దృష్ట్యా ఇది ఏసాప్ కథకంటే కొద్దిగా భిన్నమైన కథ.

సీమోర్ కాళ్లకేమైంది?

Dallas E. Wiebe అనే విమర్శకుడు కథని ఒక కొత్తకోణం నుంచి చూస్తాడు. దీనితో ఏకీభవించడం కష్టమే కానీ, తెలుసుకోవడం ఆసక్తికరంగా ఉంటుంది. ఈ విమర్శకుడి ప్రకారం- సిబిల్ ఆరు అరటిపళ్లతో ఉన్న ఒక బనానాఫిష్‌ని చూసానని తెలియజేయడమే కథలోని కీలకమైన అంశం. అదే సీమోర్ ఆత్మహత్యకి కారణం.

ఎలా అన్నది ఈ విధంగా ఆ విమర్శకుడు వివరిస్తాడు.

సిబిల్‌కి బనానాఫిష్ గురించి సీమోర్ చెప్పినప్పుడు అదంతా నమ్మశక్యం కాని కథలాగా ఉంటుంది. మరి ఆ తర్వాత సిబిల్ నీళ్లల్లో సగం మునిగినప్పుడు నిజంగానే తను బనానాఫిష్‌ని చూసానని చెప్పింది దేని గురించి? లేదూ, ఆ అమ్మాయి చూసిందని సీమోర్ అనుకున్నదేమిటి? ఆమె చూసిందో, లేక ఆమె చూసిందని సీమోర్ అనుకున్నదో- అది సీమోర్ కాళ్లు. కాలివేళ్లు స్పష్టంగా కనిపిస్తున్న దృశ్యం. ఈ కాళ్ల గురించే అతను లిఫ్ట్‌లో కూడా ఇబ్బంది పడింది. తనకి ఉన్నది అందరిలాగానే రెండు మామూలు కాళ్లని సీమోర్ అన్నప్పటికీ, అతని కాళ్లకి ఆరు వేళ్లు ఉండటమో, ఉన్నాయని అనుకోవడమో, ఉన్నాయని అందరూ అనుకుంటున్నారని అనుకోవడమో జరుగుతోంది. ఈ వైకల్యం ఉందో లేదో గానీ (ఇంకో ఉదాహరణ- అతనికి టాటూ నిజంగా లేదు కానీ, ఉందన్న భ్రమ ఉంది) అది అతనికి మానసిక అస్థిరతని కలగజేస్తోంది. ఈ అసాధారణత తేటతెల్లం అయ్యాక, సీమోర్ ఆత్మహత్య చేసుకున్నాడు. [కాళ్లకి ఈ ప్రాధాన్యతని ఇవ్వడం (foot fetish) కథలో అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటుంది. సిబిల్ కాలి చీలమండల్ని పదేపదే పట్టుకోవడం, చివరికి ఆమె బనానాఫిష్‌ని చూసానని చెప్పినప్పుడు ఆ కాళ్లని ముద్దుపెట్టుకోవడం వగైరా.]

వ్యతిరేక విమర్శలు

ఈ కథ మీద కొన్ని వ్యతిరేక విమర్శలు లేకపోలేదు. ఆ విమర్శకులు గమనించిన కొన్ని విషయాలు:

  • యుద్ధానంతరం, ఛిద్రమైన మానసిక స్థితికి చేరుకున్న సైనికుడి ఈ కథలో పాఠకులకి అవసరమైనంత వరకూ పాత్రల గురించి చెప్పడం జరిగింది కానీ, దాన్ని దాదాపు హాస్యధోరణిలో చెప్పడం వల్ల కథ ముగింపుకి కొద్దిగా పొసగనట్టు అనిపించినా, ఒక షాక్ మాత్రం కలగజేస్తుంది.
  • శాలింజర్ కథనం కథాసూత్రాలకి లోబడి చెప్పినట్టు ఉండదు. ఒక డిజార్డర్‌ని పద్ధతి ప్రకారం సృష్టిస్తూ పోయి, పాఠకుడిని విభ్రమకి లోను చేసి, చివరికి పాఠకుడే ఒక ప్రత్యామ్నాయ కథనాన్ని సృష్టించుకోవాల్సిన అవసరాన్ని కలగజేస్తాడు.
  • బనానాఫిష్ అనే మెటఫర్ చాలా తెలివైనదే అయినా, కథ మొదటి భాగంలో మ్యురియల్‌నీ, ఆమె తల్లినీ చిత్రించిన తీరువల్ల కథలో దీనిని ఉపయోగించవలసిన సమయానికి మెటఫర్ ప్రభావం బలహీనపడింది. సీమోర్ ఆరోగ్యం గురించి మాట్లాడుకుంటున్న వాళ్ల సంభాషణ మధ్యలో “నీ బ్లూ కోట్ ఎలా ఉంది?”, “నీ బాలే డ్రస్ ఎలా ఉంది?” లాంటి ప్రశ్నలు వేసిన మ్యురియల్ తల్లిని వ్యంగ్యంగా చూపించింది. మ్యురియల్‌ని చాలా మెటీరియలిస్టిక్ వెలుతురులో ఆ భాగం చూపించింది. సీమోర్ వాళ్ల వల్ల దెబ్బతిన్న మనిషిలాగా, మధ్యతరగతి ఆశలకీ నియంత్రణకీ బలి అయిన మనిషిలాగా కనిపిస్తాడు. కథలో తరవాతెక్కడో బనానాఫిష్ అనే మెటఫర్ వచ్చినప్పుడు, దానితో పెద్దగా సాధించగలిగింది అప్పటికి ఏమీ మిగల్లేదు. సమాజం అతన్ని నిర్దయతో చూసిందనడానికి ఎలాంటి ఆధారాలూ కథలో లేవు కాబట్టీ; భార్య, భార్య తల్లీ మాత్రమే కనిపిస్తున్న కారకులయ్యారు కాబట్టీ, ఆ బనానాఫిష్ అనే మెటఫర్ అలా ఏమీ చేయడానికి ఉపయోగం లేని వస్తువుగా మిగిలిపోయింది.

 

ఆత్మహత్యలని విశ్లేషించవలసిన అవసరం

ఆత్మహత్యలకి ప్రేరేపించే కారణాలని విశ్లేషించే పరిశోధనల్లో ఈ కథ కూడా చోటుచేసుకోవడం విశేషం. సీమోర్ ఆత్మహత్య చేసుకోవడం హఠాత్తుగా జరిగినట్టు అనిపించినా, దానికి కారణాలూ సూచనలూ కథలో ఉన్నాయనీ, అలానే బయటి సమాజంలోని వ్యక్తుల్లోనూ అలాంటి సూచనలు గమనిస్తూ ఉండాలనేది ఒక పరిశోధనా పత్రం సారాంశం. ఆత్మహత్యని అర్థం చేసుకోవడానికి సాహిత్యాన్ని కూడా అధ్యయనం చేయవలసి ఉందని ఆ పత్రం చెబుతుంది.

ఆత్మహత్యలకి సంబంధించిన విశ్లేషణల్లో మూడు ముఖ్యమైన విషయాలు ఉన్నాయి. ఒకటి- అలాంటి రిస్క్ ఉన్న అంశాలు (Risk factors); రెండు- హెచ్చరిక సూచనలు (Warning signs); మూడు- ఆత్మహత్యని ప్రోత్సహించే ప్రేరకాలు (Drivers). ఇవి ఈ కథలో ఎలా ఉన్నాయో చూద్దాం.

రిస్క్ ఉన్న అంశాలూ అంటే, ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక కలగడం, ప్రయత్నం చేయడం, చేసి మరణాన్ని పొందడం లాంటి విషయాల తాలూకు సంభావ్యతని పెంచే అంశాలు. సీమోర్ విషయంలో అతని పూర్వచరిత్ర అసలైన రిస్క్ ఫాక్టర్. కాకపోతే, ఈ రిస్క్ ఫాక్టర్ అనే ఒక్క అంశం ద్వారా ఒక్కటే జరగబోయేదాన్ని ఊహించడం కష్టం.

కొన్ని హెచ్చరికలు ముందే కనిపిస్తాయి. సమీప భవిష్యత్తులో ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకునే సంభావ్యత గురించి ఇవి హెచ్చరిస్తాయి. ప్రవర్తనలో మార్పులు (signs- ఇతరులు పసిగట్టేవి), మనిషి లక్షణాలు (symptoms- పేషెంట్‌కి కూడా తెలిసిపోతూ ఉండేవి) అని వీటిని మళ్లీ రెండు రకాలుగా చూడవచ్చు. నిరాశ, నిస్పృహ, కోపం, ప్రతీకార వాంఛ, నిర్లక్ష్యం, సాంఘికంగా దూరం కావడం లాంటివన్నీ ఈ వర్గంలోకి చేరతాయి. ప్రవర్తనలో మార్పుల సంగతికొస్తే- కథ మొదటి భాగంలో దానికి సంబంధించిన వివరాలు చాలా ఉన్నాయి. ఇష్టం వచ్చినట్టు డ్రైవ్ చేసి యాక్సిడెంట్లు చేయడం, నానమ్మ చావు గురించి మాట్లాడటం, చిత్రాలని నాశనం చేయడం- ఇవన్నీ ఆ పాత్ర నిర్లక్ష్యంగా ప్రవర్తించడాన్ని సూచిస్తున్నాయి. మ్యురియల్ వాళ్ల అమ్మ, అక్కడి డాక్టర్ సీమోర్ గురించి చెప్పిన విషయం కూడా గమనార్హం (“అసలు సీమోర్ తన మీద తను పూర్తి కంట్రోల్ కోల్పోవడానికే అవకాశం- చాలా ఎక్కువ అవకాశం, అన్నాడు- ఉందని కచ్చితంగా అన్నట్టుగా తెలుస్తోంది.”). ఇవన్నీ ఇతరులు సమకూర్చి పెడుతున్న పరోక్ష సమాచారం అయితే, ప్రత్యక్షంగా పాఠకుడే పాత్రని పరిశీలించగల అవకాశం ఆ తరువాతి అధ్యాయంలో వస్తుంది. అతను అందరికీ దూరంగా వెళ్లి బీచ్‌లో ఒంటరిగా పడుకోవడం; సిబిల్‌తో తప్పించి ఇతరులతో సరీగ్గా సంభాషించలేకపోవడం; ఆ సిబిల్‌తో కూడా ఇరుక్కుపోవడం, చావు లాంటి విషయాలు మాట్లాడటం; ఉలికిపాటు ప్రవర్తనతో ఇతరుల మీద ఆరోపణలు (లిఫ్ట్‌లోని మహిళతో “అంతేకానీ, అలా దొంగచూపులు చూడొద్దు,” అనడం) ఇవన్నీ పాఠకుడికి ప్రత్యక్షానుభవాలు.

ఆత్మహత్యని ప్రేరేపించే drivers వ్యక్తికి సంబంధించిన పరిస్థితుల ఆధారంగా ఉంటాయి. వీటిని గురించి పేషెంట్‌తో మాట్లాడే సైకైయాట్రిస్ట్ మాత్రమే ఒక అవగాహనకి రాగలడు. ఈ విషయాన్ని వదిలేసినా, ఆత్మహత్యకి సంబంధించిన రిస్క్ ఫాక్టర్స్, వార్నింగ్ సిగ్నల్స్ అన్ని ఉన్నా, ఆత్మహత్య జరగవచ్చునన్న విషయం పసిగట్టలేక మనం ఎందుకు షాక్‌కి గురవుతాం?

దీనికి చాలా కారణాలున్నాయి. సీమోర్‌కి సంబంధించిన సూయిసైడ్ రిస్క్‌ని మామూలు పాఠకులుగా మనం సిస్టమాటిక్‌గా అంచనా వేయలేకపోవడం. ఆత్మహత్యలకి సంబంధించిన పై మూడు విషయాలనీ- రిస్క్ ఫాక్టర్స్, వార్నింగ్ సిగ్నల్స్, డ్రైవర్స్- విడివిడిగా పరిశీలించడం, వాటికున్న వివిధ బలాల ద్వారా మొత్తం రిస్క్‌నీ అంచనా వేయడం నిపుణులు మాత్రమే చేయగలిగిన పని. సాధారణ పాఠకుడిగా మనకున్న కొద్దిపాటి సమాచారంతో మనం ఆ పని చేయలేకపోవచ్చు. ఇంకో కారణం- మ్యురియల్‌నీ, ఆమె తల్లినీ కథలో ప్రదర్శించిన తీరు. మ్యురియల్ తల్లి అత్యుత్సాహం, చొరబాటూ, నియంత్రణా; మ్యురియల్‌కి ఉన్న భౌతిక మమకారం, నిర్లక్ష్యం – ఇవి ఆ పాత్రల పట్ల మనకి కొంత అయిష్టాన్ని కలగజేస్తాయి. అలాంటి అయిష్టమైన పాత్రలు అందిస్తున్న సమాచారాన్ని (అదికూడా, కొంతవరకూ హాస్యధోరణిలో) మనం సీరియస్‌గా పట్టించుకోకపోవడం కూడా ఒక కారణం. మూలసమాచార స్థావరం పట్ల మనకున్న అయిష్టం, స్పందన విషయంలో మనకి కొంత పక్షపాతాన్ని కలగజేసి (సైద్ధాంతిక భాషలో దీన్ని countertransference bias అంటారు.) ముఖ్యమైన సూచనలని మనం విస్మరించేలా చేస్తుంది. అతను సిబిల్‌తో సరదాగా ఆడుకున్న పద్ధతి చూసాక, మనం మొదటి అధ్యాయంలోని పాత్రల పట్ల అయిష్టంగా అనుకున్నదే సరైనదన్న నమ్మక స్థిరపడటం కావొచ్చు. వీటన్నింటిలో ఏదైనా కారణం కావొచ్చు.

కానీ, అలా మన ఊహకి అతీతంగా జరిగిన విషయం పట్ల మనం ఆలోచిస్తాం. కారణాలని అన్వేషిస్తాం. అన్వేషించి కనుక్కున్న కారణాలని మనసు మూలల్లో ఎక్కడో భద్రపరుస్తాం. మనం బయటి సమాజంలోని వ్యక్తులతో మెలగుతున్నప్పుడు ఈ అన్వేషణ ఫలితం ఎక్కడో ఒకచోట ఎవరికో ఒకరికి ఉపయోగపడకుండా పోదు.

‘ది కాచర్ ఇన్ ది రై’ నవలతో సంచలనాత్మకమైన విజయాన్ని సాధించిన శాలింజర్ 1965లో తన చివరి పెద్దకథ/నవలికని రాసిన తర్వాత 2010లో మరణించే వరకూ దాదాపు అందరికీ దూరంగా ఉన్నాడు. అతని ఏకాంతాన్ని గౌరవించి అతనిపాటికి అతన్ని వదిలేయకుండా, డిటెక్టివ్‌లని పెట్టి మరీ విషయసేకరణ చేద్దామనుకున్న లైఫ్ పత్రిక, దొంగచాటుగానైనా సరే అతని ఇంటర్వ్యూ సంపాదించాలనుకున్న పారిస్ రివ్యూ పత్రిక – ఇవన్నీ శాలింజర్ గురించి చెప్పినవాటికంటే, సమాజం అక్రమదారుల్లో ఎలా వ్యక్తిగత జీవితాల్లోకి చొరబాట్లు చేస్తుందనే విషయమే ఎక్కువగా చెప్పినట్టు అనిపిస్తుంది.

మొన్న జనవరి 27 నాటికి శాలింజర్ మరణించి సరీగ్గా పదేళ్లయింది.

*

 

ఎ.వి. రమణమూర్తి

సాహిత్యం, ముఖ్యంగా కథాసాహిత్యం అంటే అభిమానం. వాటికి సంబంధించిన విమర్శ కూడా!
ముప్ఫై యేళ్ల బాంక్ ఉద్యోగం నుంచి ఐ.టి. మేనేజర్‌గా స్వచ్ఛంద పదవీ విరమణ తర్వాత, సాహిత్యాన్ని మరింత దగ్గరనుంచి పరిశీలించే అవకాశం దొరికింది. గత ఐదారేళ్లుగా వర్తమాన కథాసాహిత్యాన్ని నిశితంగా పరిశీలిస్తూ, దానిలో భాగంగా కథాసాహితి వారి కథ-2015 కి గెస్ట్ ఎడిటర్‌‌గా వ్యవహరించారు. శ్రీకాకుళం 'కథానిలయం' కోసం సాంకేతిక సహకారం అందిస్తున్నారు. అడపాదడపా పత్రికల్లో వ్యాసాలూ, సమీక్షలూ. హైదరాబాద్‌లో నివాసం.

1 comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

  • పూర్తిగా సర్వసాక్షి కథనమే గానీ, పాత్రల ఆలోచనలలోకి రచయిత జొరబడకుండా వాళ్ల సంభాషణల ద్వారానే కథ చెప్పించడం నాకు నచ్చే ప్రక్రియ. అయితే, కొన్ని కథల్లో అది అసంపూర్తిగా అనిపిస్తుంది. ఎందుకు అన్న ప్రశ్నకి జవాబు ఈ కథలో దొరకదు. రచయిత ఇతర కథలనిబట్టీ జవాబు చెప్పుకోవచ్చేమో గానీ మీరన్నట్టు దాన్ని వదిలెయ్యడమే మంచి దనిపిస్తుంది. దీన్ని ఆ కాలంలో ప్రచురించిన సంపాదకులకి ఆ కాలంలో ఇది కథా అన్న విమర్శ ఎదురయిందనే నా నమ్మకం. మోడరన్ ఆర్ట్ లో కూడా అన్ని సృజనలూ అందరికీ నచ్చనట్లే ఈ కథ కూడా సర్వజనామోదం కాకపోయి ఉండవచ్చు.

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు