అసంబద్దత

మూలం: హృషికేశ్ పాండా

హృషికేశ్ పాండా ఒరిస్సా సాహిత్య అకాడమీ అవార్డ్, సరల పురస్కార్, రాజధాని బుక్ ఫెయిర్ అవార్డ్, ఝంకార్ అవార్డ్ పొందిన ఒరియా సుప్రసిద్ధ రచయిత. 1975 ఐ ఏ ఎస్ టాపర్. యూనియన్ గవర్నమెంట్ ట్రైబల్ అఫైర్స్ పదవీ విరమణ. ఎనిమిది నవలలు, ఎనిమిది కథా సంపుటాలు, నాలుగు నాటకాలు , ఎన్నో షార్ట్  ఫిల్మ్స్ లెక్కలేనన్ని వ్యాసాలు ఆయన సాహితీ సంపద. 

 

” ఒక్కోసారి ఒక స్వరం మాటిమాటికీ  వినవస్తూనే ఉంటుంది. ఆశ్చర్య చకితం చేస్తుంది, లోలోపల ముడుచుకుపోతుంది. మరోసారి నువ్వా స్వరాన్ని వెతుక్కుంటావు, అది నిన్ను తప్పించుకుంటుంది.  ఎవరి స్వరం అది?”

టూరిస్ట్ బంగళా బాల్కనీ లో, బకెట్ ఆకారంలో ఉన్న కేన్ కుర్చీలో కూలబడి చిలికా సరస్సును చూస్తూ నేను ఈ రకపు సుదూరపు ఆలోచనల్లో మైమరచిపోయాను.

ఒక మోటర్ బోట్ లంగరు చుట్టూ తిరుగుతూ పడవ ముందు, వెనక భాగాలు మార్చి మార్చి చూపుతోంది. నా భర్త పారాపెట్ గోడ మీద పాదాలు పెట్టి ఓ మందపాటి పుస్తకాన్ని తనలోకి వంపుకుంటున్నాడు.

” నువ్వు చదువుకోవాలనుకుంటే ఈ టూరిస్ట్ బంగళాకి విపరీతంగా డబ్బుకట్టి మరీ ఇంత దూరం రావాలా ? ” నా భర్తను అడిగాను.

నా భర్త పుస్తకంలోంచి మొహం బయటపెట్టి నావైపు చిన్నపిల్లను చూసినట్టు చూసి,  అప్పుడప్పుడు ఇలా తెలివి తక్కువ తనం సరైనదే నన్నట్టూ నవ్వి మళ్ళీ పుస్తకంలో దూరిపోయాడు. కాస్త దూరంలో , ఒక స్తంభం సరుకు దిగే రేవు దగ్గర ఏదో ఒక బోట్ దానికి కట్టేస్తారన్నట్టు ఎదురుచూస్తోంది. సాయంత్రం ఆ స్తంభపు పొడుగాటి నీడ చిలికా సరస్సులో అలలపై రెపరెపలుగా కదులుతోంది.

“ఎవరి స్వరం ఇది? ఎక్కడి నుండో వినబడుతూ అంతలోనే ఆగిపోతోంది?” ఆశ్చర్యపోయాను, నాకు నేను చెప్పుకున్నాను, “చాల్లే మూసుకో, నువ్వో గొప్ప వేదాంతిని అనుకుంటున్నావా?”

కింద టూరిస్ట్ ల గడబిడ , పక్షులు కిలకిలా రావాలు, ” ఈ స్థలం ఇంత అధ్వానంగా మారిపోయింది? ”

నా భర్త దృష్టిని మళ్ళిస్తూ అన్నాను. “కిందటి సారి మనం వచ్చినప్పుడు ఇక్కడ ఎంత ప్రశాంతంగా ఉండేది!”

” మూడేళ్ళు కిందటి మాట కదా ” మళ్ళీ ఓ నవ్వు విసురుతూ అన్నాడు నా భర్త.

అతను మళ్ళీ నవ్వుతాడు, డాంబికంగా , పారాపెట్ గోడ కిందకు మొహం వంచి నా చెయ్యిపట్టుకుని లాగాడు దాన్ని ముద్దు పెట్టుకుందుకు, అదేదో సమాజం నన్ను ముద్దుపెట్టుకుందుకు అనుమతించనట్టు. మళ్ళీ తన పుస్తకం లోకి వెళ్ళిపోయాడు.

నీరెండ వెలుగులు అలల మీద కంపిస్తున్నాయి. – నేను మళ్ళీ మళ్ళీ అదే వాక్యాన్ని గురించి ఆలోచిస్తున్నాను.  ” ఏం ఆలోచిస్తున్నావు?” నా భర్త ,  నేను ఏమీ లేదన్నట్టుగా తల ఊపడం.

” ఆకలిగా ఉందా?” మళ్ళీ అడిగాడు.

” ఆకలా? దాహమా? ఈ మధ్య మరీ ఎక్కువ బీర్ తాగుతున్నావు. మన చిన్నా కూడా అంటున్నాడు, పప్పా మరీ తిండిబోతు అవుతున్నాడని”

రేవు వైపు ఒక చిన్న బోట్ వస్తోంది. లంగరు వేసిన బోట్  నెమ్మదిగా చుట్టూ తిరుగుతోంది, ఒకవేళ దానికే గనక బలం ఉంటే ఎటో తప్పించుకు పోదామన్నట్టు. బోట్ నుండి జనం దిగుతున్నారు నిశ్శబ్దంగా, ఎవరో కిలకిలారావాలనూ, పోచుకోలు మాటలనూ నిశ్శబ్దంలోకి తుడిచేస్తున్నట్టు. గాలిలో తేలుతూ వచ్చింది వేణునాదం. నేను ఒక స్తంభం అనుకుని పొరబడినది ఒక వేణునాద గాయకుడు. అతను వేణువుపై పాడుతున్నాడు, టూరిస్ట్ లు ఆసక్తిగా అతని చుట్టూ చేరిపోయారు. వారందరూ ఈ వైపుకు కదులుతున్నారు. ప్రతివాళ్ళూ  లాన్ లోకి చేరి వెయిటర్ కోసం అరుస్తున్నారు. ఆ గుంపు మధ్య నుండి వేణునాద గాయకుడిని చూస్తున్నాను.

బహుశా అతనిప్పుడు పక్కలకు జరిగి, ఎడమ మోచేతి మీద ఆని, ఒక చేత్తో పట్టుకుని వేణువు ఊదుతున్నాడు. ఎవరో శ్రోతల్లోంచి అరుస్తున్నారు, “హే ఇంత వరకూ ఎవరూ ఒక చేత్తో వేణువు ఊదడం నేను చూడనే లేదు.”

ఇప్పుడు వేణు నాదం సద్దుమణిగింది. అక్కడి గందరగోళం వేల వేల భాషల అస్తవ్యస్త సంకరంలా వర్ణమయంగా ఉంది.

ఈ టూరిస్ట్ లు నిర్మలమైన పచ్చని గరికను అతిక్రమించడం చాలదన్నట్టు వైర్ ఫెన్సింగ్ మరో పక్కన గడ్డిని మేస్తున్న ఆవు ఒకటి ఉండుండి దాని వైపు దురాశా దృక్కులను విసురుతోంది.

నాకు కోపం వచింది. నా కళ్ళు రిలీఫ్ కోసం అన్నట్టు నా భర్తవైపు తిరిగాయి. పూర్తిగా  రెండు నిమిషాలు రెప్పవాల్చకుండా చూసాక అతను ఉన్నట్టుండి నన్ను గుర్తించినట్టు తలపైకెత్తి ఒక చిరునవ్వు నవ్వి  కింద లాన్ లోజన సమూహాలను చూసి పరిహాసంగా, ” ఓహ్ వాళ్ళు ఎంజాయ్ చేస్తున్నారు.” అన్నాడు.

” ఆ రేవు వైపు వెళ్ళి వస్తాను ” అన్నాను.

” వెళ్ళు. వేదాంతివి అయిపో. – కాని ఆ వేణువూదే వాడికోసం పడిపోకు. నీకు తెలుసా, కృష్ణ భగవానుడి మొదలుకుని ప్రతి వేణువూదే వాడూ ఒక మోసగాడే.”

అంటూ పెద్దగా నవ్వడం మొదలుపెట్టాడు.

మళ్ళీ వేణునాదం మొదలైంది. ఆ స్వరాలు సుపరిచితాలుగా అనిపిస్తున్నాయి. మామూలు ఇళ్ళలో పాడుకునే రాగమా? ఒరియా శాస్త్రీయ గానమా ? ఒడిస్సీదా లేక చంపూ దా? లేదు, అదేమిటో స్పష్టం అవడం లేదు. నేను లాన్ చేరే సరికి ఆ వేణుగానం ఆగిపోయింది. కేవలం హడావిడి శ్రోతల చప్పట్ల శబ్దం. నేను లాన్ దాటి మొహం వేళ్ళాడేసుకుని రేవు వైపుసాగాను, జనసమూహాన్ని చూడటం తప్పించుకుంటూ  వాళ్ళ ఆనందోత్సాహాలను పెద్ద గమనించకుండా, చిలిక సరస్సు అలల మాదిరే నన్ను అలరిస్తున్నా, అవి శాంతపరచలేవు. ఓహ్ వాళ్ళు ఎంత ఆనందంగా ఉన్నారు. అయినా ప్రతి టూరిస్ట్ ప్రాంతం లో నేను, నాకు తెలీదు కాని, నేను ఎందుకు కలవరంగా ఉంటాను? అదేదో నాకే తెలియని దాన్ని నేను వెదుక్కుంటున్నట్టు, తప్పకుండా అదేదో నా దారిలో ఉన్నట్టూ. రేవు రెండు గోడల పక్కనా ఒళ్ళూ పై తెలియకుండా సిగ్గూ శరమూ వదిలేసిన జంటలు కౌగిళ్లలో,  లోలోపల అసహ్యం పుట్టిస్తున్న నా చిరాకును పట్టించుకోకుండా.

షాకై చటుక్కున వెనక్కు తిరిగి గబగబా బంగళా వైపు నడిచాను, దారిలో నాగుపామును చూసినట్టుగా. మలి సంధ్య నీడ లాన్ ను ఆ చివరి నుండి ఈ చివరి వరకూ కమ్మేసింది. లాన్ లో జన సమూహం ఒక  చిన్నారి పాప గీసిన వలయంలా కూచుని ఒకరినొకరు తోసుకుంటూ ఓ కాగితం ముక్క చూడాలని ప్రయత్నిస్తున్నారు. వాళ్ళా పేపర్ స్కాన్ చేసి సమూహంలో, సగం బట్టతల, సగం నెరిసిన జుట్టుతో, మంగోలియన్ గడ్డం ఉన్న చుబుకంతో, ఆదర పూర్వక చిరునవ్వుతో ఉన్న ఒకతన్ని ఉత్సాహపరుస్తూ , “ఓహ్ ఎంత చక్కని చిత్తరువు.” అంటున్నారు.

లాన్ లో అక్కడా ఇక్కడా కూచున్న జనం ఇక్కడికి రాడం, గుంపులో చేరి అట్టహాసంగా నవ్వడం మొదలెట్టారు. ఒకరకమైన వెర్రితనం రాజ్యమేలుతోంది. వెయిటర్ గ్లాస్ లకొద్దీ బీర్ తెస్తూనే ఉన్నాడు. అవి ఆర్డర్ చేసిన వాళ్ళకు చేరక ముందే  దారిలోనే అయిపోతున్నాయి. ఏం చెయ్యలేక వెయిటర్ మధ్యలోనే అడ్డుకున్న వాళ్ళ రూమ్ నంబర్లు వ్రాసుకుంటున్నాడు. గొడవ సాగుతూనే ఉంది, ” బాబూ కాస్త ఇటు మా వైపుకూడా వచ్చి వెళ్ళు.”

లోటస్ యోగా పోజ్ లో ఉన్న ఒక వ్యక్తి తన సీట్ మీదనుండి లేచి, మొక్కుతీర్చుకుందుకు అప్పుడే తిరుపతి గుడిలో నీలాలు సమర్పించినట్టు అద్దంలా మెరుస్తున్న నున్నటి గుండుతో చిత్తరువు వైపు చూసి గట్టిగా నవ్వుతున్నాడు. ఒక తెల్లావిడ చేతులు ఊపుతూ నన్ను ఆమెతో చేరమని సైగ చేస్తోంది. నేను బహుశా ఆమె పిలుపుకు ఎదురు చూస్తున్నానేమో. నేను చాలా సిగ్గరిని, నా అంతట నేను వెళ్ళాలని ఉన్నా వెళ్ళను. ” ఆగండి, వస్తున్నాను” అన్నాను ఇంగ్లీష్ లో.

ఆ స్త్రీ ఆ గుంపులో తోసుకుంటు వెళ్ళడానికి నాకు సాయపడి, సగం బట్టతల ఇత్యాదులున్న్ ఆమనిషి కార్టూన్ పేపర్ నాకు అందించింది. తన చిత్రం తనే చూసుకుని అతను నవ్వకుండా ఆగలేకపోతున్నాడు. ఆర్టిస్ట్ మాత్రం తలకిందకు వంచుకుని మొహాల స్కెచ్ లు గబగబా పెన్సిల్ లైన్లతో వేస్తూనే ఉన్నాడు.

” మార్పు సహజం అయినా, బాగా తెలిసిన, ఏమీ మారని మనిషి మొహంలో ఏముందని అంత ప్రత్యేకత?”

ఆ ఆలోచన నేను ఆలోచిస్తున్న దాన్ని వదిలేసేలా చేసింది.

ఆ గుంపు సగం బట్టతల ఇత్యాదులున్న మనిషిని మరచిపోయి ఇప్పుడు ఆ లావుపాటి స్త్రీ చిత్రం లో ఆమె కాళ్ళు ప్రదర్శనలో పెట్టే ముల్లంగి దుంపల్లా ఉండటం చూసి పడి పడి నవ్వుతున్నారు. ఆమె భర్త కూడా లావుగా ఉండి అర్ధవలయాకారపు కళ్ళద్దాలతో గట్టిగా నవ్వుతున్నాడు. అతను బహుశా ఇన్నేళ్ళుగా ఈ విషయం భార్యకు చెప్పే అవకాశం కోసం ఎదురు చూసాడులా ఉంది. ఈ రోజు అతనికి దక్కింది.  నేనింకా ఆ వేణువు వాయించే అతనిని, ఆ చిత్రకారుడిని దగ్గరగా చూడనే లేదు. కాని ఎందుకో తెలిసిన వాడిలా అనిపిస్తున్నాడు. అప్పుడే కెమెరా పట్టుకున్న మనిషి ఆ గుంపుకు ఏదో సంజ్ఞ చేస్తున్నాడు, నాలుగైదు భాషల్లో ఆరేడు సార్లు అయ్యాక  ఆ చిత్రకారుడి ముందునుండి జరగమని తన ప్రయత్నంలో విజిల్ వేస్తూ చప్పట్లు కొడుతూ అరుస్తున్నాడు కెమెరా మనిషి. కొందరు వాలంటీర్లు స్థానికులు , విదేశీయులు కూడా ముందుకు వచ్చి గుంపును క్రమశిక్షణలో పెట్టాలని చూస్తున్నారు.

ఆ చిత్రకారుడు అరుస్తున్నాడు, ” నా ఫొటో  తీసుకోవాలనుకుంటున్నావా? ” అని నవ్వుతూ “దానికన్నా ముందు నా బాకీ తీర్చు, ఒక రెండు పెగ్గుల విస్కీ, పది మిల్లీ లీటర్ల సోడా”.

నేను మొదటి సారి అతన్ని పూర్తిగా చూడగలిగాను. ముందు చిరిగిన షూస్ మోటర్ టైర్ ముక్కలతో కుట్టి రిపేర్ చేసి ఉండటం, మోకాళ్ళ దగ్గర చిరిగిపోయిన పైజామా. కెమెరా ఫ్లాష్ ఒక్కసారి మిరుమిట్లు గొలిపేలా మెరిసింది. అతని మొహం స్పష్టంగా కనబడింది. అతని వేణుగాన స్వరారోహణ నిష్కపటం. అతని సంతకం దృఢంగా, నిశ్చయంగా ఉంది. అతను సన్నబడ్డాడు. అతను శుష్కించిపోయాడు. పలచగా పెరిగిన గడ్డం, రంగు తగ్గింది. జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చింది. అతని మొహంలో దైవిక కళ ఏ మాత్రం లేదు. అతనిప్పుడు మనిషిలా అనిపిస్తున్నాడు ఎందుకో. ఇదివరలో , మంత్ర ముగ్ధులను చేసే అతని లోతైన కళ్ళు నాకు గుర్తున్నాయి. అవి కెమెరా లెన్స్ ల లా ఉండేవి. ఆ కళ్ళలో ఏదైనా దృశ్యం పడితే చాలు ఆక్టోపస్ లాటి రెటీనా తోటలో బంధీ అయిపోయేది. ఆ రెటీనా యజమాని -శుభంకర్.

శుభంకర్ కాక ఆ చిత్రకారుడు ఇంకెవరవుతారు. శుభంకర్ నా చర్మపు ప్రతి అణువు నుండీ ప్రసరించాడు. నా శరీరంలో ప్రతి నాళం నుండీ ఇంకా మచ్చిక కాని మండుతున్న కోరికల జ్వాలలు  వణికిపోతూనే ఉన్నాయి.

2

నా అరచేతిని నెమ్మదిగా ముక్కు మీద రాసాను.అందరూ అనే వారు నా ముక్కు చివర కాస్త వంపుతిరిగి ఉంటుందని, చాలా కొంచం అదీ కుడి వైపుకు. శుభంకర్ ఒకసారి నాతో అన్నాడు, స్వర్గంలో ఉండే రంభ ముక్కు కూడా నాలాగే వంపుతిరిగి ఉంటుందని. ఆ నిర్ణయానికి రాడానికి ముందు శుభంకర్ ఎన్నో శిల్పాలను చిత్రాలను అధ్యయనం చేసి ఉంటాడు. అది నమ్మకపోయేంత ధైర్యం నాకు లేదు. ఆ రోజుల్లో శుభంకర్ ముందు నేనెంత?

” ఆ ముక్కు లక్షణాలు- అలరించడం, దృష్టి మళ్ళించడం. అందుకే ఆమెను  విష్ణు మూర్తి, శివుడి ధ్యానం భగ్నం చేసేందుకు, బ్రహ్మ సృష్టిని తారుమారు చెయ్యడానికి పంపించాడు. నేను ఏ ఋషినీ కాను.కేవలం ఒక పశువును. అసంబద్ధమైన మర్త్యుడిని. నేను నీ అందానికి అభిమంత్రించబడటం వెనక ఏదైనా విచిత్రం ఉందా? ” అన్నాడు. నేనతన్ని నమ్మలేదు. కాలేజిలో ఎందరో అమ్మాయిలకు ఇలాటి తియ్యటి మాటలు దరువేసేవాడు. వాళ్ళు వాటిని సీరియస్ గా తీసుకుని పిచ్చివాళ్ళయారు. శుభంకర్ మరోసారి వాళ్ళను చూస్తే గుర్తుపట్టేవాడే కాదు.

కాలేజీ లో చేరాక చాలా మటుకు నిశ్శబ్దంగా ఉండేవాడు. మామూలుగా తల వంచుకుని మొహం దించుకుని అన్యమనస్కంగా ఎక్కడో తనలోని ఒక భాగాన్ని వదిలేసినట్టు ఉండేవాడు, కొంచం పొట్టిగా, మొహం మీద గడ్డం , మీసం జాడే లేకుండా కనిపించేవాడు. అతని జుట్టు చిందరవందరగా, బిరుసైన స్టీల్ వైర్ ముక్కల్లా పైకి లేచి ఉండేది.  అతను జన్మతహ మితభాషి. ఆరోజులనించే నేను అతని స్వభావాన్ని గమనించి అతను మామూలు సగటు మనిషి కాదనుకున్నాను.

వెనక బెంచీలో కూచుని క్లాస్ లో జరిగే ప్రతి వెధవ పనికీ శిల్పి గా ఉండేవాడు. అయినా ప్రతిసారీ ఏదో విధంగా నేరదృశ్యం నుండి తప్పించుకునేవాడు. కాని అతను ఏం అవబోతున్నాడో తెలుసుకునే లోగానే అతను వయసులోనూ పొడుగులోనూ ఎదిగి పోటీ పడి మొదటిగా నిలిచి మొదటి స్థానం గెలిచి డ్రమాటిక్ సొసైటీ సెక్రటరీగా ఆపైన కాలేజి యూనియన్ ప్రెసిడెంట్ అయ్యాడు. ఈ లోగా అతను అమ్మాయిల హాస్టల్ కి రాడం మొదలుపెట్టాడు, పాటలు పాడేవాడు, వేణువు ఊదేవాడు, బొమ్మలు గీసేవాడు, నాటకాల్లో హీరో అయిపోయాడు, బయాలజీ ప్రాక్టికల్స్ లో అమ్మాయిలకు బొద్దింక నాడీ మండలం ( ఎలాగూ ఎందుకూ పనికి రాదు) బొమ్మలు గీసేవాడు హైబిస్కస్ పూల బీడు వోయిన యుటెరస్ , అర్ధం కాని బాక్టీరియా ఉత్పత్తి వ్యవస్థ లను బొమ్మలు వెయ్యడం, ఇలా ఎన్నో విషయాల వంకతో లేడీస్ హాస్టల్ కు వచ్చేవాడు అనేకంటే అది అతనికి తప్పనిసరి అయిపోయిందనాలి.

ఆ కాలంలో దాదాపు హాస్టల్ లో ఉండే వారందరూ అతను భవిష్యత్తులో ఒరిస్సాలో శాంతినికేతన్ స్థాయిలో ఒక యూనివర్సిటీ  ఏర్పరుస్తాడని నమ్మేవారు. ఈ విధమైన ప్రజాదరణ లో అతను అడుగులు వేస్తున్నా నాకు నా స్వంత తీర్పు ఉండనే ఉంది. పుట్టినప్పటి నుండి ఏదో ఒక బిడియాన్ని మోసుకుంటూ తిరుగుతున్నాడని. నన్ను నేను కొంతమేరకు ఒక వేదాంతిననే అనుకునేదాన్ని. అందుకే ముందు సమస్యను నా దృష్టికోణం లో పెట్టి ప్రతిదీ విశ్లేషిస్తూ ఒక నిర్ణయానికి వచ్చేదాన్ని. ఇవన్నింటినీ క్రోడీకరిస్తే మా హాస్టల్ అమ్మాయిలు వాళ్ళ జీవితంలో యవ్వనారంభ నీతి నియమాలు, ఇంకా వారి శారీరిక కోరికలను అదుపులో ఉంచుతున్న ఈ సమయం లో శుభాంకర్ చేసే చిన్న చిన్న సూచనలు వాటన్నింటినీ గాలికి వదిలేసేలా చేసి, చిటికెలో సాంప్రదాయిక పాపాలు, మరిన్ని పాపాలు, పాత పాపాలను మరింతగా పొదిగి వాళ్ళను పైన్ చెట్ల కింద బట్టలు విప్పేలా చేసేవి.

నా అనుమానం నా క్లిష్టమైన మానసిక సంఘర్షణ ఫలితం కావచ్చు, ఒక నైరాశ్యత ఫలితమూ కావచ్చు. ఇది సాధ్యమే. తప్పకుండా సాధ్యమే. కాని శుభంకర హాస్టల్ లో అడుగుపెట్టిన క్షణమే నేను పెరట్లోకి పారిపోయి సలాంది నదీ తీరాన కూచునే దాన్ని. అయినా దూరంగా ఉండాలని నేను ఎంతగా కూడగట్టుకుని ప్రయత్నించినా మళ్ళీ మళ్ళీ శుభంకర్ నా మనసును ఆక్రమించేవాడు. ఇక్కడ నన్ను ఒప్పుకోనివ్వండి, ఏళ్ళు గడిచిపోయాయి గనక, నేనిప్పుడు ఒప్పుకున్నా మానినా ఏం తేడా కొడుతుంది గనక, కనీసం నా అంతరాత్మ ముందు ( నాభర్త ముందు లేదా శుభంకర్ ముందు కాదు) నేను శుభంకర్ ని ప్రేమించడం మొదలుపెట్టాను, ఒక విధంగా నాకే అర్ధం కాని రీతిలో ఎవరికీ వివరించలేని విధంగా, వివరించలేని కారణాల వల్ల శుభంకర్ కూడా నాతో ప్రేమలో ఉన్నాడని నమ్మాను. ఇంకా చాలా మంది అమ్మాయిలు కూడా ఇలాటి భావనలే పెంచి పోషిస్తున్నారు.

ఒకరోజు శుభంకర్ విజిల్ వేస్తూ మా గదిలోకి గబగబా వచ్చాడు. నేను నా నైట్ డ్రెస్ లోకి మారి నా బెడ్ మీద ఉండి కిటికీలోంచి కనిపించే ఆకాశంలో మబ్బులను చూస్తున్నాను. అతను గదిలోకి రాగానే నేను  తిరిగి నా డ్రెస్ లో మిస్ అయిన బటన్ దాచుకుందుకు గోడవైపు తిరగాల్సింది. కాని ఏదో నిగూఢమైన లజ్జ వల్ల అందమైన, చెక్కినట్టున్న శుభంకర్ మొహం వైపు చూడలేకపోయాను. అందుకే నా మొహాన్ని స్వీడన్ పెట్రోలియమ్ కంపెనీ చీఫ్  ఎగ్జిక్యూటివ్ వ్రాసిన చాణక్య నీతికీ మాకియవిలి నీతికీ గల సామ్యాలు, బేధాలు అనే పుస్తకం తో కప్పుకున్నాను. ఆ సమయంలో నా ముగ్గురు రూం మేట్స్ వాళ్ళ చేతులు చూసి వాళ్ళ భవిష్యత్తు చెప్పమని అతన్ని పీడిస్తున్నారు.

” ఇంకేం మిగిలింది? ధాన్యంకొట్టు నిండేలా గంపెడంత మంది పిల్లలు, తెల్లారింది మొదలు అర్ధరాత్రి వరకూ జలగల్లా వేళ్ళాడుతూ, రాత్రిళ్ళు ప్రేమకోసం – అదీ ఎండిపోయిన పొదుగుతో ఉన్న ఆవు తన దూడ కోసం చూపే ప్రేమలా-రెండు నిమిషాల విరామం.

అందరి నవ్వుల గలగల ధ్వనితో నేను పుస్తకం కిందకు దించాను. శుభంకర్ నా చిత్రాన్ని అప్పటికే గీసేసాడు, దాన్లో నా మొహం పుస్తకం మూసేస్తూ ఉంది, అయినా నా చేతుల సందుల్లోంచి నా డ్రెస్ కి ఒక బటన్ లేకపోడం స్పష్టంగా తెలుస్తోంది. నేను కోపంగా ఉన్నట్టు కనిపించాలనుకున్నాను కాని శుభంకర్ తో ఎవరు కోపంగా ఉండగలరు?

” అవునూ, నా బొమ్మ గీసేముందు నా అనుమతి తీసుకోవాలిగా, ” అన్నాను.

నేనీ మాటలు అంటుంటే నా రూం మేట్స్ అనని కామెంట్స్ విన్నాను,

” నువ్వేమైనా మిస్ యూనివర్స్ వా నీ స్కెచ్ గియ్యడానికి అనుమతి పొందడానికి”

శుభంకర్ నా ప్రశ్నకు జవాబివ్వలేదు, “పేపర్ తిప్పి వెనకాల చూడు” అన్నాడు.

పేపర్ వెనకాల వైపున ఏ మాత్రం తడబాటు లేకుండా పిల్ల వాడి చేతివ్రాతతో ఉంది,

” రాత్రి కిందకు దిగి వచ్చినప్పుడు

రోజు వారీ వెట్టిచాకిరీ జీవనానికి విసిగిపోయి

చుక్కలు కనురెప్పలు వాలుస్తాయి

స్వర్గలోకపు అందగత్తెల అజాపజా

కనుచూపు మేరలో ఉండదు.

నువ్వు , రజత కన్యగా

భీకరమైన వరద నీటి పొంగు మీద

ప్రయాణిస్తూ

నీ స్వప్నాలను దూరాన ఉన్న పాలపుంతల్లా మెరిపిస్తూ

జీవనారణ్యంలో, నా సజీవజ్ఞాపకాలు

కొమ్మలూ, ఆకులను తప్పుకుంటూ మరింత ముందుకు

పోయేందుకు సాయపడవూ?

శుభంకర్ తో ప్రేమలో పడకపోయి ఉంటే ఆ మాటలకు అర్ధం నాకు హృదయం లేదని, అతనిలాటి మాటలు ఎందరో అమ్మాయిలతో గుసగుసలాడి  మర్చిపోయినా.

ఇప్పుడతను అరుస్తున్నాడు మరో రెండు పెగ్గుల విస్కీ పది మిల్లీలీటర్ల సోడా అంటూ. నాకు అతన్ని బతికుండగానే కాల్చెయ్యాలనిపించింది. అయినా, శుభంకర్! ఇంతమంది జనంలో నువ్వు నువ్వుగా.

చాలా మంది అమ్మాయిలు మనసుల్లో రహస్యంగా శుభంకర్ ను పెళ్ళాడాలని కోరుకున్నారన్నా పెద్ద ఆశ్చర్యం కాదు. వారిలో ఒకరు మాకు రెండేళ్ళ సీనియర్. ఆమె పచ్చని శరీరచాయ ఆమె వయసును తెలుసుకోడం అసాధ్యం అనిపించేలా ఉండేది. కాని శుభంకర్ కన్నా తప్పకుండా పెద్దదే. ఆ పిల్ల తండ్రి, ఆ తండ్రి చిన్నతమ్ముడు, తల్లి సోదరుడు, అమ్మమ్మ, కజిన్ అందరూ పెద్ద రాంక్ లో ఉన్న ఆఫీసర్లే. స్థానిక జిల్లా కౌన్సిల్ కు అధ్యక్షులు, కోపరేటివ్ బాంక్ ప్రెసిడెంట్, సోషల్ వెల్ఫేర్ కమిటీ ముఖ్య అధ్యక్షులు, ఒక రాజకీయపార్టీ యువ విభాగానికి సెక్రటరీ. వారి సౌజన్యంలో రాష్ట్ర స్థాయిలో శుభంకర్ చిత్రప్రదర్శన జరిగింది.( ఆ చిత్రాల హక్కులన్నీ ఆ పిల్ల స్వంతం చేసుకుంది).  శుభంకర్ కు మొదటి బహుమతి వచ్చింది.  ఆ బహుమతి వచ్చాక అతను తన దారిని కోల్పోయి పూర్తిగా చిత్రాలు వెయ్యడం మానుకున్నాడు. అతను సరైన పనే చేసాడు. కాని అతనా ప్రదర్శనలో ఎందుకు పాల్గొన్నాడు? అతనికి డబ్బు అవసరం. ఆ శుభంకర్ నావాడు. లేత ఎండలో నిద్రపోయే వాడు, గాయపడిన యుద్ధరంగం లో ఉండి వెన్నెలగా అనుకునేవాడు,  వంచన చేసే విస్తార్యత గల విపరీతమైన శిశిరంలో, నిద్రను కప్పుకున్న శుభంకర్ నా వాడు. కాని చిత్రకళా ప్రదర్శనలో పాల్గొన్న అతను నా వాడు కాదు.

అతని కన్నా పెద్దదైన ఆ స్త్రీని, ఉద్యోగమూ తలిదండ్రుల ఆస్థీ ఉందని శుభంకర్ పెళ్ళి చేసుకున్నాడని కొందరన్నారు. ఆ తరువాత , ఒకరోజున శుభంకర్ ఎవరికీ చెప్పకుండా  ఢిల్లీ వెళ్ళిపోయి, కుతుబ్ మీనార్ దగ్గర సన్నటి రేకు లతో చేసిన బొమ్మ పక్షుల అమ్మకం షాప్ పక్కన కూచుని పది రూపాయలకు టూరిస్ట్ ల రేఖా చిత్రాలు అప్పటికప్పుడు గీస్తున్నాడని చెప్పుకున్నారు.

ఆ సమయానికి నార్వే లేదా స్విట్ౙర్లాండ్ ధనికుడైన వ్యాపారి ఏకైక కుమార్తె  రేఖా చిత్రాలు వివిధ భంగిమల్లో  పెన్సిల్ తో ఒక నెలపాటు గీసాక, ఆమె ప్రేమలో పడి పెళ్ళాడి ఆమె దేశం వెళ్ళిపోయాడు. అది నా పెళ్ళి సమయం లో విన్నాను.

ఈ హడావిడికి, గోలకునాభర్త చివరకు కిందకు దిగివచ్చాడు, నేను ఈ లోకంలో లేను. లెఖ్కలేనన్ని నిట్టూర్పుల మధ్య అంతులేని వేదనల్లో నన్ను నేను దూరంగా విసిరేసుకున్నాను. నేను నిల్చోలేకపోతున్నాను, శుభంకర్ ను కళ్ళెత్తి చూడలేకపోతున్నాను. శుభంకర్ నన్ను చూసాడా? మర్చిపోయాడా? అతని మనసులో ఏం ఉందో నాకు తెలియదు. అతనికి నా మనసులో ఏముందో కూడా తెలియదు. లేదూ శుభంకర్, సర్వజ్ఞుడికి సర్వం తెలుసా? తెలిసి నిశ్శబ్దంగా ఉన్నాడా? అది అతని ఆత్మ గౌరవాన్ని కించపరుస్తుందని అడిగితే కాని ఏదీ చెప్పడు గనక. అయితే సంభాషణ నీ వైపు నుండి మొదలవకపోడం నీ ఈగోని గాయపరుస్తుంది గనక- అనేది నూతన యవ్వనదశలో లక్షణమా? ఇంకా శుభంకర్ అతని హృదయంలో చిన్న యౌవనారంభపు హృదయాన్ని దాచుకున్నాడా? అతనికి తెలుసు, నాకు తెలుసు అతనికి తెలుసని, చిలికా సరస్సులో, ఎలాటి చుక్కని కాని, తెడ్లు కాని లేని అతి చిన్నగా ఊగే పడవల్లా ప్రతి నిమిషం మునుగుతూ నేను కూచుని, నానావిధాలైన పుకార్లలో తేలిపోడానికి సిద్ధంగా ఉన్నాను. చుట్టాలు పక్కాలు, కాలేజ్, ఉనికి, సోషల్ స్టేటస్, స్థాయి, నా శీలం, శుభంకర్ తో లేచిపోడం. ఇహ చిరు నవ్వులు నవ్వడం నా వల్ల కాలేదు. ఇంత జరిగాక ఎలా నవ్వగలను? అతను లేకుండా? నా దగ్గర ఒక పడవ వాడు, ఒక అవివేకి, ఆ పడవవాడు ఆనందంతో పొంగిపోతూ ఒక శ్కాండినేవియన్ టూరిస్ట్ తన కలర్ ఫొటో తీసి పంపించాడని చెప్తున్నాడు. శుభంకర్ నన్ను, మునులనూ ఋషులనూ తప్పుదారి పట్టించే అతని రంభను, గుర్తించడానికి నిరాకరిస్తున్నాడు. కాని నన్ను గుర్తించడానికి నిరాకరించినదెవరు? కాదు శుభంకర్ కాదు, చూడూ ఇక్కడ నన్ను గుర్తించలేనిది శుభంకర్ కాదు సమయం మాత్రమే.

3

శుభంకర్ ఇక్కడేం చేస్తున్నాడు? ఎంతో నైపుణ్యత ఉంచుకుని ఈ పనికిరాని అనాగరికుల మధ్య.

ఈ మనిషి శుభంకర్ కాదు. అది సమయం. కనికరం లేకుండా, నల్లగా, అసహ్యంగా, అభేధ్యమైన సమయం. శుభంకర్ డియర్, కాలిపోయిన నిప్పు కణికలను మళ్ళీ సమయానికి ఇవ్వు- దాని బూడిద రంగు నీడ, దాని నల్లదనం, దాని శూన్యత.

శుభంకర్ ఒక చూపు నా మీద విసురుతున్నాడు. మతిమరుపు మనిషి, ఒక సన్యాసి అతని ధ్యానాన్ని పరిత్యజించినట్టు. శుభంకర్ నన్ను శపిస్తున్నాడా? నేను బూడిదగా మారిపోతానా? నా భర్త వైపు చూసాను. ఆరడుగుల పొడుగు, ఎనభై ఆరు కిలోల బరువు రెండు బాటిళ్ళ బీర్ తో తాజాగా ఉత్సాహం కనబరుస్తున్నాడు.

ఈ నీడ లేని జీవితం లో ఎంతో నైపుణ్యత ఉంచుకుని, శుభంకర్ ఏం చెయ్యగలడు?

సాయంత్రం వేళ యూకలిప్టస్ పొడవైన నీడలు, మసక బారుతున్న ఊగే పడవల లాగే హనీమూన్ హిల్.

“అది పాములతో నిండి ఉంటుంది” పొద్దున పడవాడు అన్న మాట.

నేనూ, నా భర్తా కలిసి మా గదికి తిరిగి వస్తున్నాం. అతను బీర్ ఆర్డర్ చేసాడు. నేనొక్కమాటా అనలేదు. మళ్ళీ కిందకు వచ్చాను. అలల్లా ఉన్న ఆ దేవ వృక్షం ఆకుల అంచులను అరచేతితో స్పర్శిస్తూ ” రంభకున్నలాటి ముక్కు, ఒక కుదుపు కుదిపి , ఊపేసి, అలరిస్తూనే వ్యాకులపెట్టే ముక్కు…

నాన్సెన్స్. శీలం లాటి భావాల పట్ల నాకు నమ్మకం లేకపోయినా, నేను నాభర్తకే కట్టుబడి ఉన్నాను.  వ్యామోహతలేని ఆడనెమలి అందాలను చూస్తున్నాను. చిలికా సరస్సు చుట్టూ ఉన్న వేలాది దోషపూరిత భయాలలో, అతన్ని పనిలో పెట్టుకుని రూపాయి రూపాయికి ముళ్ళు వేసి లాభపడే వ్యాపారస్తుడి తో ఇక్కడ ఒక పడవ నడిపే మనిషి, విదేశీ యాత్రికుడి దయాదాక్షిణ్యాలలో మునిగిపోయాడు.

నాకు ఆరాటంగా ఉంది. అయోమయంగా ఉంది. విచారంగా ఉంది. రేపు శుభంకర్ కనబడకపోతే? ఆ ఊహతో వణికి పోయాను. టూరిస్ట్ బంగళా వెయిటర్ ద్వారా ఆ ఆర్టిస్ట్ గురించి కొంత సమాచారం సేకరించాలని ప్రయత్నిస్తున్నాను. అతని అభిప్రాయం ప్రకారం – హామీ కూడా – ఆ రాత్రి శుభంకర్ టూరిస్ట్ బంగళాలోనే ఉంటున్నాడు.

మర్నాడు ఉదయం, నిద్ర వదిలించుకోడానికి కళ్ళు నులుముకుంటూ నేను బాల్కనీలో  కూచున్నాను. అలాగే ప్రసిద్ధి పొందిన చిలికా సరస్సుపై సూర్యోదయం చూసేందుకు కూడా.

శుభంకర్ రేవు వైపు నుండి తిరిగి వస్తున్నాడు, ఏళ్ళక్రితం, కాలేజిలో చేరినప్పటి లానే  తల వంచుకుని.  “ఈ మనిషే నిన్న వేణువు ఊదుతున్నాడు.” అన్నాడు నా భర్త.

“గోపికలు ఇంత తొందరగా నిద్రలేస్తారా?” అన్నాను.

“ప్రటి టూరిస్ట్ కూడా అలరించే ఒక ఆశ్చర్యం జరగాలని చూస్తాడు, అవునా?” మా బాల్కనీ కింద శుభంకర్ అదృశ్యమైన కాస్సేపటికి రిసెప్షన్ కౌంటర్ నుండి ఏదో హడావిడి వినబడింది. నేనూ నా భర్తా కిందకు దిగాం. రూం రెంట్ కట్టడానికి శుభంకర్ దగ్గర డబ్బుల్లేవు. దగ్గరలో రూం నుండి ఒక కాకినలుపు నైజీరియన్ బయటకు వచ్చి ఏమైందని అడిగి తెలుసుకుని, శుభంకర్ బిల్ చెల్లించాడు. మానేజర్ గనక శుభంకర్ కి క్షమాపణ చెబితే రెట్టింపు డబ్బు చెల్లిస్తానని అన్నాడు. మేనేజర్ క్షమించమని అడిగాడు. శుభంకర్ సిగ్గుతో తలదించుకోలేదు. ( నిజంగా అతనీ విషయంలో సిగ్గుపడాలని నేను అనుకున్నానా? ఎవరికి తెలుసు? నాకు తెలీదు.) అతని ఈగో పెరగలేదు. అతను బద్ధుడైనట్టూ కనబడలేదు. అతను ఆవిరై పోలేదు. తన ఉనికిని కాని, సమ్ముఖం కాని అతను శాసించలేదు. ఒక విపరీతమైన స్థితిలో ఒక వ్యవస్థ లేక అతనిక్కడ ఉన్నాడా? ఏమో ఎవరికి తెలుసు.

శుభంకర్, చేతులు జేబుల్లో  పెట్టుకుని కనిపించని మనిషి చెప్పేది  ఏదో వింటున్నట్టు ఫోజ్ పెట్టి వీధిలోకి నడిచాడు. అతనికి వీడ్కోలు చెప్పేందుకు చాలా మంది తమ తమ గదుల నుండి బయటకు వస్తున్నారు. వారి సంపత్తు ముందు  శుభంకర్ దరిద్రం మరింత కొట్టొచ్చినట్టూ అచ్చం నైలాన్ వలలో పడిన చిన్న చేపలా అనిపించింది. శుభంకర్ అతిధులతో కరచాలనం చేస్తున్నాడు. అమ్మాయిలా అనిపించే ఒక స్త్రీ అతని బుగ్గమీద ముద్దుపెట్టుకోడంతో అతని మొహం ఎర్రబారింది. లేదు అతను సిగ్గుతో గులాబీ రంగుకు మారలేదు. అతని రంగు ఎంతగా మారిపోయి తగ్గిపోయిందంటే అది గులాబీ రంగుకు రాడం ఇహపైన అసాధ్యం. నేనూ, నాభర్తా చేతులు పట్టుకుని మెట్లు ఎక్కుతున్నాం. నా భర్త మెరిసే తెల్లని తెలుపు కుర్తా పైజమాలో ఉన్నాడు. ఏ మాత్రం మురికి సోకలేదు, ఎందుకంటే రాత్రి పడుకునే ముందు టవల్ చుట్టుకున్నాడు. ముందు బాల్కనీ నుండి శుభంకర్ వెళ్ళడం చూస్తున్నాను ఏ మాత్రం అలికిడి లేకుండా.

ఆ రాత్రికి మునుపు టూరిస్ట్ అభిమాను లు అతనితో లేరు. అతను వెళ్ళిపోయేప్పుడు వారిలో ఎవరూ అనుసరించరని అతనికి తెలియదా?

ముందు క్రోటన్స్ , గులాబీ పొదల నుండి, తరువాత బోగన్ విల్లా , నూరువరహాల గుబుర్ల నుండి, చివరికి కొబ్బరి, తుమ్మ చెట్లనుండి వాలిన ఆకుల మధ్యనుండి కొంచం కొంచం నిశ్చయంగా మాయం అవుతున్నాడు. అతి రాజసం గల స్టీల్ గేట్ భయపెడుతూ నా మొహం మీద మూసుకుంది. నాలోని  అహంభావం, అవగాహన లేని బలవత్తరమైన శాసనం లా  శుభంకర్ నుండి చూపు మరల్చుకున్నాను. అతను నా శీలాన్ని నిమ్మళంగా, సుఖంగా, నాకు తెలిసేలోగా  దొంగిలించినట్టు నేను ఏకాంతాన్ని చుట్టుకున్నాను. చివరికి నా విషాదం కూడా నన్ను వదిలేసి వెళ్ళిపోయింది.

రాకుమారుడూ బహిష్కరించబడ్డాడు. బెల్జార్ లోని నిప్పు ఆక్సిజెన్ చాలక దీపంకొడిగట్టింది. నేలంతా వెన్నెల కిరణాలు పరచుకున్నాయి. పవిత్రమైన తెల్లని ఎండ మెరుపులో మల్లెలు కదంబాలు మెరుస్తున్నాయి. ప్రవహిస్తున్న మేఘం ఒకటి ఎగిరి వచ్చి రెక్కలు విదిలించి గుప్పెడు చినుకుల పాపం నేలకు రాల్చింది. శుభంకర్ వర్షాన్ని ఎగతాళిగా చూస్తాడు, మండించే ఎండలను అస్సలు లెక్కచెయ్యడు. ఇప్పటిలానే నెమ్మదిగా వెళ్ళిపోతాడు. కొత్తగా పెళ్ళాడిన వాళ్ళు మూడు నెలల పసి కూనలను యౌవనం లో భార్యను వదిలి రోడ్ ప్రమాదంలో మరణిస్తున్నారు. అయినా ఎప్పటిలానే సూర్యుడు తూర్పున ఉదయిస్తున్నాడు.  జ్యోతిష్యులు ఇదివరకులానే జాతకాలు చదివి భవిష్యత్తు చెప్తున్నారు, బహిష్ఠులు అయే అమ్మాయిలు ఉదయం న్యూస్ పేపర్ల మధ్య పసుపు రంగు కాగితాల్లో ప్రకటనలకు ఆకర్షితులై సానిటరీ నాప్ కిన్ లు కొంటున్నారు. శుభంకర్ ఈ టూరిస్ట్ బంగళా  రోజు విడిచి రోజూ వస్తాడేమో , రెండు పెగ్గుల విస్కీ కోసం ప్రపంచంలో అతి కురూపి చిత్రాన్ని కూడా గీస్తాడేమో. కారణం లేకుండా అలల్లోకి ఈదుకుంటూ వెళ్ళి యాభై ఏళ్ళ అమెరికన్ స్త్రీని తలకిందులైన బోట్ నుండి తప్పిస్తాడేమో.

నా జీవితం లో ఎప్పుడో ఒకప్పుడు ఏదో ఒక మూల దట్టమైన ఏకాంతాపు చీకటి ఉండేఉంటుంది.  చిన్న కాలబిలం లో ఎంత వెలుతురును కుక్కినా వెలుగు వెనక్కు రాదు. చీకటే రాజ్యమేలుతుంది. నేను ప్రసిద్ధి చెందిన నవలల కొలతగా , శీలం లేనిదాన్నని మీరు అనుకుంటే, నా భర్తకు ఒక కొత్త నైలాన్ చీర కొనమని చెప్పండి. అది నన్ను కట్టుకోనివ్వమని చెప్పండి. వెంటనే నా మీద నాలుగు లీటర్ల కిరోసిన్ పోసి వెగించిన అగ్గిపుల్ల విసరండి. సతీ సావిత్రి లాగా హిందూ పతివ్రత గా నేను సరితూగనని ఓపెన్ గా ఒప్పుకోడం నాకు అవసరమా?

మరో సారి నేను కిందకు వెళ్ళి నా మొహం చూపిస్తాను. శుభంకర్ అస్పష్టంగా చూపుకు దూరం అవుతున్నాడు. ఏదో ఒక సమయంలో నేను శుభంకర్ కి చెప్పే ఉంటాను- చెప్పలేనిది, అతన్ని కాల్చి చంపేసి అతని పాపపు భారాన్ని నా తలమీద  మొయ్యాలని ఉందని. అయితే అతన్ని కాల్చడం వల్ల ఎలా  అతని పాపపు భారం నేను భరిస్తానో నాకు తెలీదు. లేదు. నేనేమీ చెయ్యలేదు. అతనికి చెయ్యి ఊపాలని చెయ్యెత్తినప్పుడు నా భర్త మెట్లు ఎక్కుతూ నా వైపు వస్తున్నాడు. నేను నా మేలి ముసుగులోనికి చెయ్యి దూర్చి నా జుట్టు సవరించుకున్నాను.

నా భర్తా,  నేనూ వెనుక ఉన్న  మరో బాల్కనీ లోకి వచ్చాము. సూర్యరశ్మి చిలికా సరస్సు మీద నాలుగు రంగులుగా చీలింది, మెరుస్తున్న వెండిలా, నీలం , వెలసిపోయిన ఆకుపచ్చ, బాధాకరమైన పసుపు రంగుగా. ఇదివరకు లానే మోటర్ బోట్ ఆగకుండా ఊగుతూనే ఉంది, దూరతీరాలకు ఎక్కడో తెలియని చోటికి వెళ్ళిపోవాలన్నట్టూ. కాని లంగరు లొంగడం లేదు, తప్పించుకోడం అసాధ్యం.

*

చిత్రం: రాజశేఖర్ చంద్రం 

స్వాతీ శ్రీపాద

Add comment

Enable Google Transliteration.(To type in English, press Ctrl+g)

‘సారంగ’ కోసం మీ రచన పంపే ముందు ఫార్మాటింగ్ ఎలా ఉండాలో ఈ పేజీ లో చూడండి: Saaranga Formatting Guidelines.

పాఠకుల అభిప్రాయాలు