1
ఆ రాత్రి –
నాలుకనంటుకుని ఎంతకీ వదలని చేదు రుచిలా –
నల్లమబ్బులకి చిల్లులు పడ్డట్లు అంతులేని వర్షం కురిసింది.
ఆ చీకట్లో, చిత్తడిలో – పార్కింగ్ లాట్ చివరన దిక్కులేని సమాధుల్లా బిక్కుబిక్కుమంటోన్న చెత్తకుండీల ఒడిలో అతడో తోడులేని నీడలా పడున్నాడు. నోటి నుండి కారుతోన్న నురగ. పక్కనే సగం మిగిలున్న గ్రిల్ క్లీనింగ్ యాసిడ్ సీసా, వంటింటి సామాన్లతో నిండున్న ప్లాస్టిక్ సంచీ. వంటిమీది చొక్కా వాంతిలోనూ, వర్షంలోనూ నానిపోయుంది.
బద్ధకపు కస్టమర్లు ఎక్కడబడితే అక్కడ వదిలేసిన ఖాళీ షాపింగ్ కార్టులు ఏరుకుని తోలుకెళ్లే పనిలో అటుగా వచ్చిన సప్లై స్టోర్ కుర్రాడు చూసి, వెంటనే 911 కి ఫోన్ చేశాడు. వాడి కేకలకి మరికొందరు పరుగున వచ్చి గుమికూడారు.
ఐదు నిమిషాల్లోపే అంబులెన్స్ సైరన్లతో వాలిపోయింది. ఆగీ ఆగకముందే అందులోంచి ఒక పారామెడిక్ కిందకి దూకి, అతడి పక్కన కూర్చుని నాడి చూశాడు. బలహీనంగా కొట్టుకుంటోంది.
అతడి భుజంలోకి ఏదో సూది మందు గుచ్చటం, ముఖానికి ఆక్సిజన్ మాస్క్ తగిలించటం, స్ట్రెచర్ మీదకి ఎక్కించటం యాంత్రికంగా, మాటలతో పనిలేకుండా, నిమిషాల్లో జరిగిపోయాయి.
ఎవరో అతడి పేరడిగారు.
ఎవరూ బదులీయలేదు.
అంబులెన్స్ వెనకభాగంలోకి స్ట్రెచర్ మోయబడింది. నిమిషం ఆలస్యం లేకుండా – సైరన్లు మోగిస్తూ, ఎర్రెర్ర ఫ్లాష్ లైట్లు మెరిపిస్తూ, జడివాన చినుకుల్ని చీల్చుకుంటూ ఆ వాహనం దూసుకుపోయింది.
2
ఆ గది నిండా చిక్కటి మందుల వాసన, చిల్లర నాణాలు నాకినట్లు ఏదో లోహపు రుచి. గోడపై వేలాడుతోన్న మానిటర్లు గీతలేవో గీస్తున్నాయి. మంచం పక్కన ఏవేవో యంత్రాలు మంద్రస్వరజోల పాడుతున్నాయి. కిటికీ బయట—మిట్టమధ్యాహ్నం మసక ముసుగులో ఆవలిస్తోంది. వాన పోయింది. ఎండ రాలేదు.
గది మధ్యలో బెడ్ మీద అతడు నిశ్చలంగా ఉన్నాడు.
అతడి దేహం సగం వైర్లతో కప్పేసుంది. ముక్కులోంచి ఫీడింగ్ ట్యూబ్ లోపలకి చొప్పించి ఉంది. దాని పైగా, ముక్కుని, నోటిని కప్పేస్తూ ఆక్సిజన్ మాస్క్. ఛాతీ నిండా అమర్చిన ఎలక్ట్రోడ్స్ సుదూరపు ఆశల్లా మిణుకుమంటున్నాయి. వాటినుండి బయటికొచ్చిన సన్నని తీగలు వంపులు తిరుగుతూ బెడ్ పక్కనున్న యంత్రాల్లోకి పోతున్నాయి. వంట్లోంచి కాంతి మొత్తం గుంజేసినట్లు అతడి చర్మం పాలిపోయింది. ఒక చేతికి ఐవీ గుచ్చబడి ఉంది. మరో చెయ్యి అతడి ఉదరమ్మీద ఉంది. ఆ వేళ్ల చివర్లు అప్పుడప్పుడూ అదురుతున్నాయి – లోపలెక్కడో ప్రాణమొకటి కొట్టుకుంటోందని గుర్తుచేస్తూ.
బెడ్ పక్కనున్న కుర్చీలో గాబ్రియేలా మార్టినెజ్ కూర్చుని ఉంది. ఆమె వేళ్లు అతడి వేళ్లని మృదువుగా నిమురుతున్నాయి. రంగు వెలసిపోయి, కొసలు అరిగిపోయిన పాత హుడీ తొడుక్కుని ఉందామె. చిందరవందరగా ఉన్న జుత్తు ఆమె గుండ్రటి ముఖాన్ని చాలామట్టుకు కప్పేస్తోంది. కళ్లకింద కనపడీ కనడని గీతలు, ఏళ్లుగా ఇళ్లు శుభ్రం చేసే పనిలో కాయలు కాచిన వేళ్లు, చిట్లిన గోళ్ల చివర్లు ఆమె కథ చెబుతున్నాయి. ఆ రోజు తెల్లవారకముందే అతడి భార్య కోసం అడుగుతూ పోలీసుల నుండి ఫోన్ రావటంతో ఆమెకి రాక తప్పలేదు. ఆమె కళ్లలో ఏదో భయం. అవి పదేపదే తలుపుకేసి చూస్తున్నాయి — ఎవరొచ్చి ఏమడుగుతారో అన్నట్లు — కానీ తిరిగొచ్చి అతడిమీదనే వాలుతున్నాయి.
తలుపు తగ్గర నిషా తమాంగ్ కుదురులేని నీడలా కదులుతోంది—కుదిరితే మాయమైపోటానికి సిద్ధంగా, ఎక్కడే శబ్దమైనా తన పేరు పిలిచినట్లు అదిరిపడుతూ. ఆ గదిలో ఉన్న అందర్లోకి తనే వయసులో చిన్నదైనా, తన కళ్ల కింది గోతులు ఆ వయసుకి మించిన జీవితాన్ని సూచిస్తున్నాయి. ఏ డిస్కౌంట్ స్టోర్ లోనో చౌక బేరానికి కొన్న పెద్ద సైజ్ పఫర్ జాకెట్‌లో ఆమె ఆసాంతం మునిగిపోయుంది. అలసట నిండిన ముఖం; అందులో ఏదో అశాంతి, అసౌకర్యం. బెదురు చూపులు. ఆ చూపులు గాబ్రియేలా పైన వాలిన మొదటిసారి వాటిలో గ్రహింపేదో మెదిలింది.
గది మధ్యలో నిఠారుగా, నిట్రాటలా నిల్చుని ఉంది ఇష్తర్ మాలిక్. ఆమె తలకి చుట్టుకున్న హిజాబ్ కిందనుండి తొంగి చూస్తోన్న నాలుగైదు తెల్లవెంట్రుకలు ఫ్లోరసెంట్ లైట్ వెలుగులో వెండిపోగుల్లా మెరుస్తున్నాయి. ఆమె చూపులు స్థిరంగా ఉన్నాయి, ముఖం భావరహితంగా ఉంది. వేళ్లు మాత్రం స్వల్పంగా వణుకుతున్నాయి. ఆ వేళ్ల మధ్యలో అప్రమేయంగా దొర్లుతోన్న తస్-బీహ్ పూసలు లయబద్ధంగా ప్రార్ధిస్తున్నాయి. ఆమె దృష్టి అప్పుడప్పుడూ మిగిలిన ఇద్దరు మహిళల మీదకీ మార్చిమార్చి ప్రసరిస్తోంది.
ఆ ముగ్గురి మధ్యా ఉద్విగ్నభరిత స్తబ్ధత, చేతికందేంత చిక్కగా అలముకునుంది. ఎవరి దేవుడ్ని వారు, ఎవరి కారణాలతో వారు – అతడికోసం వేడుకొంటున్నారు.
అంతలో—గది తలుపు తెరుచుకుంది. ముగ్గురూ అటు చూశారు.
నర్స్ లోపలికొచ్చి శబ్దం కాకుండా తలుపు వేసింది. అతడి వద్దకి నడిచి పరీక్షగా చూసింది. తర్వాత ఆ ముగ్గురికేసీ చూసింది, తలుపు దిశగా తలపంకిస్తూ.
ముగ్గురూ ఒకరినొకరు చూసుకున్నారు, ముందుగా ఎవరు కదులుతారో అంచనా వేస్తున్నట్లు.
గాబ్రియేలా తన హుడీ జేబులోంచి చెక్కపై చెక్కిన చిన్న శిలువ బయటికి తీసి భద్రంగా మంచం పక్కనున్న బల్ల మీద ఉంచింది.
నిషా—ఓ క్షణం తటపటాయించి—మంచం వైపుకి నడిచింది. జాకెట్ పాకెట్‌లోంచి నాలుగంగుళాల ఇత్తడి వినాయకుడి విగ్రహం తీసి శిలువ పక్కనే పెట్టింది.
ఇష్తర్ ఆమెననుసరించింది. తన చేతిలోని తస్-బీహ్ ఆ రెండింటి పక్కనా జాగ్రత్తగా అమర్చింది.
తర్వాత ముగ్గురూ పక్కపక్కనే నిలబడ్డారు, నిశ్శబ్దంగా అతడినే చూస్తూ. ఆ క్షణాన – కనపడని కారణమేదో వారిని కలిపింది. అది అపరాధ భావనో, భయమో, లేక మానవత్వమో. ఏదైనా – ఆ మౌన ప్రార్ధనలు అతడి చుట్టూ అదృశ్యపు ఆశీర్వాదాల్లా ఆవరించాయి.
కాసేపటి తర్వాత, ఒకరిననుసరించి మరొకరు చప్పుడు చేయకుండా గదిలోంచి వెళ్లిపోయారు.
నర్స్ ముందుకి వంగి అతడి ఫీడింగ్ ట్యూబ్‌ని సర్దింది. ఆమె చేతులు చకచకా కదులుతూ తమ పని తాము చేసుకుపోయాయి – వైటల్స్ సేకరించటం, వివరాలు క్లిప్‌బోర్డ్ మీద నమోదు చేయటం, మానిటర్స్ పరీక్షంచటం. ఇది మరో రకం ప్రార్ధన. యంత్రాల ఊతంతో అతడిని ఈ లోకంలో ఉంచేందుకు మనుషులు చేస్తోన్న మహాయజ్ఞం.
3
అతడి కళ్లు మెల్లిగా తెరుచుకున్నాయి.
పక్కనే ఉన్న నర్స్ వెంటనే గమనించి, పరుగున వెళ్లి డాక్టర్‌ని పిలుచుకొచ్చింది.
“గుడ్ మోర్నింగ్,” డాక్టర్ నవ్వు ముఖంతో పలకరించాడతడిని. “గాభరా పెట్టావు కానీ, గట్టి పిండానివే. అయినా మూడు వారాలు పట్టింది నిన్ను స్పృహలోకి తేవటానికి.”
అతడి ముఖంలో అయోమయం. వళ్లింకా స్వాధీనంలో లేదు. కళ్లు మాత్రమే తిప్పగలుగుతున్నాడు.
“చాలా ప్రమాదకరమైన రసాయనాలు మింగేశావు. గొంతు, జీర్ణవ్యవస్థ బాగా దెబ్బతిన్నాయి.” డాక్టర్ గొంతులో మృదుత్వంతో మిళితమైన యధాలాపం. “నాలుక బాగా వాచిపోయింది. ప్రస్తుతానికి మాట్లాడలేవు … బహుశా ఎప్పటికీ కూడా.”
అతడి స్పందన కోసం వేచిచూశాడు డాక్టర్. అతడు కళ్ల రెప్పలు ఆడించటం తప్ప ఏమీ చేయలేని స్థితిలో ఉన్నాడు.
డాక్టర్ కొనసాగించాడు. “వాసన, రుచి కూడా శాశ్వతంగా పోయినట్లే.”
అతడు గుటక మింగబోయి విఫలమై, మళ్లీ కళ్లాడించాడు.
“కానీ ముఖ్యమైన విషయమేంటంటే—నీ ప్రాణానికి ప్రమాదం లేదు. ప్రస్తుతానికి ట్యూబ్‌తో నీకు ఆహారం అందిస్తున్నాం. లేచి తిరగటానికి ఇంకొంత కాలం పడుతుంది. ఆ తర్వాత ఇంటికి వెళ్లిపోవచ్చు కానీ, వైద్యం కొనసాగించాల్సుంటుంది … ఫాలోఅప్స్, చెకప్స్, వగైరా.”
అతడేమీ మాట్లాడలేదు—కళ్లతో కూడా. ఒక కన్నీటి చుక్క మాత్రం రాలి బుగ్గపైకి పాకింది.
నర్స్ ముందుకి వంగి సున్నితంగా దాన్ని తుడిచింది.
ఆమెకి ఏవో సలహాలు, సూచనలు ఇచ్చి, అతడి భుజమ్మీద ఓ సారి సుతారంగా తట్టి, డాక్టర్ వెళ్లిపోయాడు.
అతడు శక్తి కూడదీసుకుని మెడ కాస్త కదిలించగలిగాడు. తల అటూ ఇటూ తిప్పుతూ పరిసరాలు పరికించసాగాడు. పైనున్న ఫ్లోరసెంట్ లైట్, గోడకున్న మానిటర్స్, వాటి పక్కనున్న కిటికీ, దానికవతల పగటి వెలుగులో తడుస్తూ తలలూపుతోన్న చెట్లు, బెడ్ పక్కనే ఐవీ స్టాండ్, దాని పక్కన సైడ్ టేబుల్, దాని మీదున్న మూడు వస్తువులు …
అతడి దృష్టి వాటి మీద ఆగిపోయింది.
కాసేపు తదేకంగా చూశాక, విశ్వప్రయత్నమ్మీద చెయ్యి కదిలించి వాటినందుకున్నాడు. మూడిటినీ కలిపి అరచేతి గుప్పిట్లో బంధించి ముఖం ముందుకి తెచ్చుకున్నాడు.
స్పర్శ—అతడికి ఇంకా మిగిలున్న ఇంద్రియ జ్ఞానం. అది ఏవేవో జ్ఞాపకాల్ని తట్టి లేపింది.
4
‘స్టార్ హోటల్’
అది—రాజమండ్రి దగ్గర్లో—ఊర్లో అందరి పేర్లూ అందరికీ తెలిసేంత చిన్న గ్రామంలో, దారి పక్క పూరిపాకలో అతడి తండ్రి నడిపిన టిఫిన్ సెంటర్. ఆ ఊరి మీదుగా వెళ్లే బస్సులు, లారీలు అక్కడో తప్పనిసరి హాల్ట్ వేసేవి.
అందులో చిన్నప్పటినుండీ కాళ్లకి చెప్పులు, వంటిపై చొక్కా లేకుండా చకచకా దోశెలు పోస్తూ, చట్నీ కలుపుతూ, కస్టమర్లతో హుషారుగా కబుర్లు చెబుతూ పెరిగాడతడు. మట్టి, పేడ కలగలసిన వాసన. ఉదయం, సాయంత్రం అటుగా వచ్చిపోయే గేదెల మందల పలకరింపులు. చుట్టుపక్కల పొలాల్లో రైతుల పాటలు, కొట్లాటలు. లారీ డ్రైవర్లూ, బస్సుల్లో వచ్చే ప్రయాణీకులు మోసుకొచ్చే విశేషాలు – ఇవే అతడికి తెలిసిన లోకం.
పద్నాలుగేళ్లొచ్చేసరికి టిఫిన్ సెంటర్ ఒక్కడే చూసుకోగలిగే స్థాయికొచ్చాడు. పదహారేళ్లకి, అతడి టిఫిన్స్ రుచి – ముఖ్యంగా, అతడు పెట్టే ‘స్టార్ హోటల్ స్పెషల్ సాంబార్’ రుచి – ఊరూవాడా పాకింది. ఆ ప్రాంతంలో అతడి పేరు తెలీని వారు లేకుండాపోయారు. ఓ సారి, కార్లో వచ్చిన ఓ ఎన్నారై అన్నాడు – నిజంగానో లేక నవ్వులాటకో – “నువ్వుండాల్సింది ఈ స్టార్ హోటల్లో కాదోయ్, ఏ ఫైవ్ స్టార్ హోటల్లోనో. అమెరికాలో ఐతే ఇలాంటి ఇండియన్ ఫుడ్ ఎంత వెదికినా దొరకదు.”
పైకి ఆ మాటలు నవ్వుతూ కొట్టిపారేసినా, అతడి మనసులో అవి నాటుకుపోయాయి.
తర్వాత కొన్నేళ్లకి, క్రూయిజ్ షిప్‌లో వంటవాడిగా పనిచేసే అవకాశం సంపాదించాడు. ఆరేడు నెలలు సముద్రంలో గడిపి, కొత్తరకాల వంటల్లో ఆరితేరాడు. ఓ రోజు నౌక శాన్ ఫ్రాన్సిస్కోలో లంగరేసింది. ప్రయాణీకులకక్కడ రెండ్రోజుల విడిది. వాళ్లతో పాటు అతడూ ఆ మహానగరంలోకెళ్లాడు – తాత్కాలిక విజిటర్ వీసా మీద.
తిరిగి నౌకలోకి పోలేదు. అమెరికన్ సమాజంలోకి అదృశ్యమైపోయాడు.
తనకన్నా ముందే అమెరికాలోకి అచ్చం ఇలాగే వచ్చేసి ఓ భారతీయ రెస్టారంట్‌లో వంటవాడిగా కుదురుకున్న రాజమండ్రి స్నేహితుడి సాయంతో అతడూ ఓ ఉద్యోగం సంపాదించాడు. అలా – అమెరికాలో అతడి రహస్య జీవనం మొదలయింది. అప్పుడతడికి ఇరవై రెండేళ్లు. ఆ తర్వాత రెండేళ్లలో ఎన్ని రెస్టారంట్లలో పనిచేశాడో అతడికే గుర్తులేదు. అక్రమ వలసదారుడిగా, అవకాశాలు అడుక్కోవటమే తప్ప చట్టబద్ధంగా పనిచేసే హక్కులేదు. దాన్ని అడ్డుపెట్టుకుని దోచుకున్న వాళ్లెందరో. ఒక రెస్టారంట్ ఓనర్ జీతం ఇవ్వకుండా ఎగ్గొట్టేవాడు. మరొకడు, జీతం పెంచమంటే వెళ్లగొట్టటమే కాక – ఇమ్మిగ్రేషన్ డిపార్ట్‌మెంట్‌కి పట్టిస్తానంటూ బెదిరించాడు. అలాంటివెన్నో తట్టుకుంటూ నెట్టుకొచ్చాడు. వంటగదుల్లోనే పడుకున్నాడు. పగలంతా వంటపని. రాత్రిళ్లు శుభ్రం చేసే పని. అతడి వంట రుచి ఆయా రెస్టారంట్లకి పేరు తెచ్చిందే తప్ప, అది లొట్టలేస్తూ తిన్నవారికి మాత్రం అతడి పేరు తెలీదు.
ఆ రెండేళ్లలో కష్టపడి కొంత వెనకేశాడు. ఎవరి సహాయంతోనో ఓ బ్యాంక్ అకౌంట్ తెరిచాడు, క్రెడిట్ కార్డ్ సంపాదించాడు. తనకంటూ పెద్దగా ఖర్చులుండేవి కాదు. నెలనెలా ఇండియాలో తల్లిదండ్రులకి చేతనైనంత సొమ్ము పంపేవాడు. అతడు అమెరికా వచ్చాక తండ్రి మంచాన పడ్డాడు, ‘స్టార్ హోటల్’ మూతపడింది. ఇప్పుడు వాళ్లకి అతడే ఆధారం. వాళ్ల ఆరోగ్యాల కోసం కొన్ని సార్లు అప్పులు చేసి మరీ పంపాల్సొచ్చింది. ఇన్నింటి మధ్యలో – ఉద్యోగాలు, వాటి కోసం ఊర్లూ మారుతూ పోయాడు. అమెరికా ఆరంభంలో ఉన్నంత ఆకర్షణీయంగా కనపడటం మానేసే సమయంలో –
ఇష్తర్ మాలిక్ కనపడింది.
నిజానికి—మొదట అతడే ఆమెకి ‘వినపడ్డాడు’.
అప్పటికి నాలుగు నెలలుగా అతడు మిల్పిటస్ నగరంలో, ఎక్కువగా టేక్-అవుట్స్ మీద ఆధారపడే ఓ చిన్న రెస్టారంట్‌లో పని చేస్తున్నాడు. అతడి దమ్ బిర్యానీ ఒక్కటే దాన్ని నిలబెడుతోంది. “హైదరాబాద్‌లో కూడా ఇటువంటి దమ్ బిర్యానీ దొరకదు” అనే మాట ఆ నోటా ఈ నోటా బే ఏరియా అంతా పాకటంతో, కస్టమర్లు వరుసలు కట్టేవారు; డోర్ డాష్ ఆర్డర్లు ముంచెత్తేవి. ఆ ఘుమఘుమల వార్త ఇష్తర్ మాలిక్ వరకూ పాకింది.
ఒక రోజు ఆమె వచ్చి, తక్కిన అందరి మాదిరిగానే, దమ్ బిర్యానీ తెప్పించుకుని రుచి చూసింది. తీరికగా, ఒక్కో మెతుకూ ఆస్వాదిస్తూ తినేసి – వెళ్లిపోయింది.
వారం తర్వాత మళ్లీ వచ్చింది. ఈ సారి బిర్యానీ కోసం కాదు.
వెనక తలుపు గుండా కిచెన్‌లోకి వచ్చి అతడిని పలకరించింది. ఆమె ముఖంలో నవ్వు, మొహమాటం, మరే ఇతర భావం లేవు. ఎకా ఎకీ అసలు విషయంలోకి దిగిపోయింది.
“నేనో రెస్టారంట్ తెరుస్తున్నాను. నీ బిర్యానీ నా మెనూలో ఉండాలి. వచ్చేస్తావా?”
అక్రమ వలసదారులని ఉద్యోగంలోకి తీసుకోవటం నేరం. ఆ సంగతి అందరికీ మల్లే ఆమెకీ తెలుసు. కొత్తగా వచ్చే రెస్టారంట్ పాతవాటిని మరపించాలంటే గొప్ప వంటవాడు అవసరం. చెయ్యితిరిగిన వాడే కాకుండా, ఇచ్చింది పుచ్చుకుని, ఎదురు చెప్పక పనిచేసేవాడు ఆమెకి అవసరం. అందుకే రిస్క్ తీసుకోటానికి సిద్ధమయింది. తను ఏం ఆశిస్తోందో, బదులుగా ఏం ఇవ్వగలదో చెప్పింది.
ఇష్తర్ మాటల్లోని సూటిదనం – దొంగ నవ్వులు, డొంకతిరుగుడు, పొగడ్తలు, పటాటోపపు ప్రమాణాలు లేని సూటిదనం – అతడికి నచ్చింది. ఆమె ఆఫర్ ఒప్పుకోటానికి పెద్దగా ఆలోచించలేదు. వెంటనే ఆమె దగ్గరకి మారిపోయాడు.
ఇష్తర్ అతడి చేతిలో ఓ చక్కటి వంటిల్లు పెట్టింది. దానికతడే రాజు. ప్రశ్నలేవీ వేసేది కాదు. అడిగినవన్నీ తెచ్చిచ్చేది. కిచెన్ శుచిగా ఉంచటం, నాణ్యమైన దినుసులతో రుచికరంగా వండటం అతడి పని. చెప్పిన మొత్తం నెలనెలా ఠంచనుగా ఇచ్చేసేది. అంతకు మించి ఒక్క డాలర్ కూడా అదనంగా ఇచ్చేది కాదు.
అతడు ఎప్పటికన్నా ఎక్కువగా కష్టపడ్డాడు. ఇష్తర్ తనపై ఉంచిన నమ్మకాన్ని అతడు వమ్ముచేయదలచుకోలేదు. పైగా – అతడికంటూ ఓ కల కూడా ఉంది: ఎప్పటికైనా అమెరికాలో తనదంటూ ఓ రెస్టారంట్ పెట్టాలి. దానికోసం కొన్నేళ్ల స్థిరత్వం అవసరం.
ఆ కల నిజమవ్వాలంటే అతడికి ఇంకోటీ అవసరం: గ్రీన్‌కార్డ్. అది లేకుండా ఎన్ని కలలు కన్నా, అవన్నీ పొగలాగా తేలిపోయేవే.
పాత పరిచయస్తుడైన మరో వంటవాడి దగ్గరి బంధువు స్నేహితుడి ద్వారా అతడికి గాబ్రియేలా మార్టినెజ్‌తో ‘పెళ్లి’ కుదిరింది. ఆమె అతడికన్నా నాలుగేళ్లు పెద్దది. అయినా అవేవీ వారికి అడ్డు కాలేదు. ఆమెకి డబ్బవసరం, అతడికి గ్రీన్ కార్డ్ అవసరం. వాళ్లది పరస్పర అవసరాల కోసం చేసుకుంటున్న దొంగపెళ్ళి. చట్టరీత్యా, అమెరికన్ పౌరులని వివాహం చేసుకున్నవారికి మూడు నాలుగేళ్లలో గ్రీన్‌కార్డ్ లభిస్తుంది. గాబ్రియేలా తల్లిదండ్రులు అక్రమంగా మెక్సికోనుండి వచ్చి అమెరికాలో స్థిరపడ్డ వలసదారులు. ఆమె ఇక్కడే పుట్టటంతో జన్మతః అమెరికా పౌరసత్వం ఉంది.
అమెరికా వచ్చాక ముక్కునబెట్టిన ఆంగ్లంతో తిప్పలుపడి ఆమెతో అతడు కుదుర్చుకున్న ఒప్పందం: గ్రీన్ కార్డ్ వచ్చేదాకా నెలకి వెయ్యి డాలర్లు, వచ్చాక ఏకమొత్తంగా మరో పదివేలు.
వాళ్ల పెళ్లి ఆర్భాటం లేకుండా, ఒకరిద్దరు స్నేహితుల సమక్షంలో, కౌంటీ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగింది. అతడు అద్దెకి తెచ్చుకున్న సూట్, అరువు తీసుకున్న బూట్లు తొడుక్కున్నాడు. ఆమె రంగు వెలసిన జీన్స్ పాంట్ పైన తెల్ల గౌన్‌లాంటిదొకటి ధరించింది. ఆమె ముఖంలో ఆనందం లేదు, అవసరమే ఉంది. అతడి ముఖంలో మాత్రం ఆశ, భవిష్యత్తుపై ఏదో భరోసా. తప్పనిసరి ఫోటోల కోసం పోజిచ్చినప్పుడూ ఆమె నవ్వలేదు. దానికతడేమీ అనుకోలేదు. వేర్వేరు ప్రపంచాలనుండి దిగిపడ్డ గ్రహాంతరవాసుల్లా పక్కపక్కనే నిలబడి తంతు పూర్తిచేశారు. సంతకం చేసేప్పుడు ఆమె వేళ్లు వణికాయి – ఎంతో భారం మోస్తున్నట్లు. సంతకాల తడి ఆరకముందే ఆమె వెళ్లిపోయింది. ఆమె కొట్టుకొచ్చిన చవక అత్తరు పరిమళం మాత్రం కాసేపక్కడే తచ్చాడింది.
పెళ్లయ్యాక – మూడేళ్లకి పైగా, ప్రతి నెలా క్రమం తప్పకుండా గాబ్రియేలాకి డబ్బు పంపాడతడు. బదులుగా ఆమె అవసరమైన కాగితాలు, సంతకాలు, అఫిడవిట్లు పంపింది. అతడి గ్రీన్ కార్డ్ తతంగం మొదలవటానికి సహకరించింది. అంతకు మించి వారికి మధ్య వేరే సంబంధం లేదు. ఫోన్లు, మెసేజ్‌లు, కలుసుకోటాలు – ఏవీ లేవు.
ఇదిలా జరుగుతోండగా—అతడికి నిషా తమాంగ్‌తో పరిచయం అయింది.
ఆమెని తొలిసారి చూసినప్పుడు మెరుపులు మెరవలేదు, పూలు రాల్లేదు, ప్రపంచం స్లో మోషన్లో నడవలేదు. ఏదో సౌత్ ఏషియన్ గ్రోసరీ స్టోర్‌లో తన స్పెషల్ బిర్యానీలోకి అవసరమైన మసాలా పొడులు కొనటానికి వెళితే అక్కడ కేషియర్ కౌంటర్లో కనపడింది. మరుసటి రోజు, ముందటి రోజు మర్చిపోయిన పొడి కొనటానికి వెళ్లాడు. మూడో రోజు, ఆమె కోసం వెళ్లాడు. నాలుగో రోజు తనే అతడి రెస్టారెంట్‌కి వచ్చింది. ఐదో రోజు ఇద్దరూ కలిసి సినిమాకెళ్లారు.
నిషా కథ ఇంచుమించు అతడిలాంటిదే. నేపాల్ నుండి అక్రమంగా వచ్చింది. ఉదయం నుండి మధ్యాహ్నం దాకా ఓ గుజరాతీ మోటెల్‌లో రూమ్ క్లీనింగ్ సర్వీస్, ఆ తర్వాత గ్రోసరీ స్టోర్లో కేష్ కౌంటర్ చూసే ఉద్యోగం. ఆమె తల్లిదండ్రులు ఖాట్మండూ శివార్లలోని మురికివాడలో ఉంటారు. కూతురు అమెరికాలో చదువుకుంటోందనే భ్రమలోనూ, చదువుకునే పిల్ల ఏం చేసి తమకి నెల నెలా డబ్బు పంపుతోందనే అనుమానం రాని అమాయకత్వంలోనూ వాళ్లున్నారు.
అతడి చేతి వంట నిషాని మెప్పించింది. అందులో విశేషమేమీ లేదు. ఆమె తన పేరు పలికే తీరు అతడ్ని మురిపించింది. తన వచ్చీ రాని హిందీని ఆమె పరిహాసం చేస్తే ఉడుక్కోకుండా నవ్వాడు. రోజూ ఆమెని కలవాలని తపించాడు. కొద్దిరోజుల్లోనే ఆమెతో—లేదా ఆమెని ప్రేమించటం అనే భావనతో—ప్రేమలో పడ్డాడు. ఆమె అడగకపోయినా చిన్నా పెద్దా సహాయాలు చేయటం మొదలు పెట్టాడు. మొదట్లో అతడిచ్చే బహుమతులు తీసుకోటానికి నిషా మొహమాట పడింది. అతడు కొత్త ఐఫోన్ బహుమతిచ్చినప్పుడు, “ఎందుకివన్నీ?” అనింది, కానీ తీసుకుంది. అతడు కొనిచ్చిన పాత కారులో డాబుసరిగా డ్రైవింగ్ సీట్లో కూర్చుని తీసుకున్న ఫోటోని ఆమె తల్లిదండ్రులు చూసి ఆనందంతో తబ్బిబ్బైతే, ఆ సంగతి అతడికి చెప్పి వాటేసుకుని ఏడ్చింది. అతడు ఏడవలేదు. అలాంటి క్షణాలకోసం ఏమిచ్చినా తక్కువే అనుకున్నాడు.
ఓ రోజు నిషా పదివేల డాలర్లు అప్పడిగింది. అతడికది చాలా పెద్ద మొత్తం. తనదగ్గరున్న కాస్తకి, వాళ్లనీ వీళ్లనీ అడిగి జమచేసిన మరికాస్త కలిపి మొత్తం పదివేలూ ఆమె చేతిలో పెట్టాడు.
తర్వాతో రోజు, తన గ్రీన్ కార్డ్ పెళ్లి గురించి ఆమెతో చెప్పాడు. అది తన బాధ్యతనుకున్నాడు. అర్ధం చేసుకుంటుందనుకున్నాడు. విన్నాక నిషా ఏమీ మాట్లాడలేదు.
పెళ్లి వార్త ఆమెని మార్చలేదు. ఆ తర్వాత జరిగిన విషయం—అదీ ఆమెని మార్చేసింది.
గ్రీన్ కార్డ్ వ్యవహారం ఆఖరి దశకొచ్చింది. యుఎస్‌సిఐఎస్ ఫీల్డ్ కార్యాలయంలో చివరి ఇంటర్వ్యూకి అతడు గేబ్రియాలాతో కలిసి హాజరు కావాల్సి ఉంది. ఇద్దరూ భార్యాభర్తలుగా కలిసే ఉంటున్నారని ఇంటర్వ్యూ ఆఫీసర్‌కి రుజువు చేస్తే తప్ప గ్రీన్ కార్డ్ రాదు. ఇంటర్వూకి రావటానికి గేబ్రియేలా మొరాయించటం మొదలు పెట్టింది. ఏదో ఓ కారణం చెబుతూ ప్రతిసారీ వాయిదా వేసేది – ఓ సారి తల్లికి బాగోలేదు, మరోసారి తనకి బాగోలేదు, ఇంకోసారి ఇంకేదో. ఆర్నెల్లుగా అదే తంతు. ఆ ఆరు నెలలూ గేబ్రియేలాకి నెలవారీ సొమ్ము పంపటం మాత్రం తప్పలేదు.
ఇదంతా తెలిసినప్పుడు నిషా బయటికి ఏమీ అనలేదు. కానీ ఆమె తీరులో తేడా వచ్చింది. బహుశా, అతడికి అర్ధం కానిదేదో ఆమెకి అర్ధం అయుండొచ్చు. అతడితో తనకి భవిష్యత్ లేదనుకుందో, అతడికే భవిష్యత్ లేదనుకుందో.
ఆమె నుండి ఫోన్లు, వాట్సాప్ సందేశాలు తగ్గిపోయాయి. క్రమంగా రాకపోకలూ తగ్గిపోయాయి.
ఓ రోజు ఆమె ఫోన్ పనిచేయటం ఆగిపోయింది.
సాకుల్లేవు. సంజాయిషీల్లేవు. సందేహాల్లేవు. సమాధానాల్లేవు.
నిషా అతడి జీవితంలోంచి నిశ్శబ్దంగా నిష్క్రమించింది—పదివేల డాలర్ల చేబదులు తిరిగివ్వకుండానే.
అయితే, అతడు ఆ పదివేల గురించి బాధపడలేదు. ఆమె జ్ఞాపకాలతోనే బాధపడ్డాడు. తన ఇష్టాలు, కష్టాలు, కలలు చెప్పుకునేందుకు ఇప్పుడెవరూ లేనందుకు బాధపడ్డాడు.
కానీ అప్పులకి, అవి ఇచ్చినవాళ్లకి అతడి బాధలతో సంబంధంలేదు. తీర్చమని ఒత్తిడి పెరిగిపోయింది. తల్లిదండ్రుల మందుల ఖర్చులు పెరిగాయి. గేబ్రియేలా నెలవారీ అలవెన్స్ పంపక తప్పని పరిస్థితి. లేకపోతే ఆ వంకతో అసలుకే ఎసరు పెడుతోందేమోననే భయం. జీతం పెంచమని ఇష్తర్‌ని అడిగాడు, ఓ రోజు కిచెన్‌లో ఉల్లిపాయలు తరుగుతూ.
“నేను చేసేది వ్యాపారం, దానధర్మాలు కాదు,” అందామె—నిర్మొహమాటంగా.
తిరస్కారాన్ని దిగమింగి ఉల్లిపాయలు కోయటంలో మునిగిపోయాడు. వేలు తెగింది. నొప్పేయలేదు. ఆ కత్తికన్నా లోతుగా అతడిని మరేదో కోసేసింది. రేపటిపై నిరాశ. నేటిపై నిరాసక్తత. జీవితంపై నిర్వేదం. ఓదార్చేవారు లేని ఒంటరితనం. అందులోంచి డిప్రెషన్. సన్న సెగమీద మూతపెట్టి ఉడికిస్తే మెల్లిమెల్లిగా తన్నుకొచ్చి గుప్పున బయటపడ్డ ఆవిరిలా—ఓ రాత్రి అది ఆకస్మాత్తుగా బయటపడింది.
ఆ రాత్రి … అతడు కిచెన్‌లోకి ఏవో సామాన్లు కొనుక్కురావటానికి అలవాటుగా ఎప్పుడూ వెళ్లే రెస్టారంట్ సప్లై స్టోర్‌కి వెళ్లాడు. కావలసినవి కొని, డబ్బు చెల్లించాక బయటికొచ్చాడు. అప్పుడే చిరుజల్లు మొదలయింది. వెళ్లాల్సిన దిశగా కాకుండా మరో దిశలోకి మళ్లాడు. నిర్మానుష్యంగా ఉన్న పార్కింగ్ లాట్ చివర్లో చెత్తతో నిండిన రెండు డంప్‌స్టర్స్.
పెరుగుతున్న వర్షంలో తడుస్తూ—సరాసరి వాటిదగ్గరికెళ్లి ఆ రెండింటి మధ్యా కూర్చుని, చేతిలో ఉన్న సామాన్ల సంచీ తెరిచాడు. దాన్లోంచి గ్రిల్ క్లీనింగ్ యాసిడ్ సీసా అందుకున్నాడు. వణికే వేళ్లతో దాని మూత తెరిచి, ఏమీ ఆలోచించకుండా గట గటా సగం తాగేశాడు.
ఆ క్షణంలో అతడికి ఎవరూ గుర్తుకురాలేదు. ఎవరి మీదా కోపం రాలేదు. గుండెలో వేదన. గొంతులోంచి యాసిడ్ దిగుతోంటే—ఘాటైన వాసన, తట్టుకోలేని చేదు. కణకణ మండే నిప్పు కణికెలు మింగినట్లు మంట.
తర్వాత … చిమ్మ చీకటి.
5
చిక్కటి వెలుగు.
నిన్న స్పృహలోకి వచ్చినప్పట్నుండీ, అతడు మెలకువలో ఉన్నప్పుడు ఎక్కువసేపు ఆ వెలుతురుకేసే చూస్తున్నాడు. సీలింగ్‌కి వేలాడుతోన్న ఫ్లోరసెంట్ లైట్ బల్బ్‌పైనే అతడి దృష్టి తచ్చాడుతోంది. అతడిలానే అది కూడా నిశ్సబ్దంగా, నిశ్చలంగా, నిరాసక్తంగా ఉంది. గదిలో ఉన్న యంత్రాలు నిర్వికారంగా తమ పని తాము చేసుకుపోతున్నాయి. గోడ మీది మానిటర్ అతడి గుండెలయని గీస్తోంది. గది బయట కారిడార్లోంచి నర్సుల మాటలు, పాదరక్షల శబ్దాలు, చక్రాల కుర్చీల కదలికలు లీలగా వినిపిస్తున్నాయి. గదిలో మాత్రం కాలం సైతం ఊపిరి బిగబట్టినట్లుంది.
అలా ఎంతసేపున్నాడో … తలుపు తెరుచుకున్న శబ్దానికి కష్టంగా తల అటు తిప్పాడు.
ద్వారంలో నిషా నిలబడుంది.
తెరిచిన తలుపుని ఒక చేత్తో అలాగే పట్టుకుని, అడుగు ముందుకేయటం మర్చిపోయినట్లు, అతన్ని చూస్తూ కాసేపు అక్కడే ఉండిపోయింది.
అతడి ఛాతీ బరువెక్కింది. తనొచ్చింది! ఏ మూలనో ఓ ఆశ తలెత్తింది.
నిషా మెల్లిగా, అడుగులో అడుగేసుకుంటూ, అతన్ని సమీపించింది.
అతడు కళ్లతో నవ్వటానికి ప్రయత్నించాడు. అదొక్కటే ప్రస్తుతం అతడు చేయగలిగింది. ముఖం ఇంకా స్వాధీనంలోకి రాలేదు. నాలుక వాపు తగ్గలేదు. గొంతులోంచి ఏ శబ్దమూ రావటం లేదు.
ఆమె కళ్లలో నీళ్లు. వాటిని తుడుచుకునే ప్రయత్నం చేయకుండా, ముందుకొంగి, వణికే పెదాలతో అడిగింది.
“ప్లీజ్. నా పేరు బయటికి రానీయొద్దు. తెలిస్తే నన్ను డిపోర్ట్ చేసేస్తారు.”
ఆ విన్నపం అతడి గుండెలో గునపంలా దిగింది. కళ్లలో నవ్వు మాయమయింది. ఆశ పొగమంచులా కరిగిపోయింది.
రెప్పలాడించాడు, ప్రమాణం చేస్తున్నట్లు.
నిషా ఇబ్బందిగా నవ్వి కళ్లు తుడుచుకుంది. వెంటనే వెనక్కి తిరిగి వెళ్లిపోయింది—వచ్చిన పని ఐపోయినట్లు.
ఆమె అటు వెళ్లీ వెళ్లగానే గదిలో గేబ్రియేలా అడుగుపెట్టింది. సరాసరి అతడి పక్కకొచ్చి నిలబడి, అలవాటున్నట్లు అక్కడున్న యంత్రాలు, వాటి మీదున్న సంఖ్యలు పరీక్షించింది. తర్వాత అతడి దుప్పటి సరిచేసి, కుర్చీలాక్కుని కూర్చుంది.
అతడు ఆమె కళ్లలోకి చూశాడు.
ఆమె తలుపు వైపుకోసారి చూసింది, ఎవరూ రావటం లేదని రూఢి చేసుకుంటున్నట్లు. తర్వాత చెప్పింది –
“అయామ్ రియల్లీ సారీ. కావాలని ఇన్నాళ్లు సాగదీయలేదు. అమ్మ ఆరోగ్యం …” అంటూ ఆగిపోయి, తనని తానే మందలిస్తోన్నట్లు తల అడ్డంగా ఊపుతూ కొనసాగించింది. “వంకలు చెప్పను. నేనలా చెయ్యకుండా ఉండాల్సింది. నాదే తప్పు.”
అతడింకా ఆమె కళ్లలోకే చూస్తున్నాడు. ఆ కళ్లలో బాధ, భయం. వాటిని మించి – పశ్చాత్తాపం.
“ఐ ప్రామిస్. ఈసారి వాయిదా వెయ్యను. ఇంటర్వ్యూ ఎప్పుడైనా నీతో వస్తాను.” అంటూ అతడి చేతిని తన చేతిలోకి తీసుకుని నిమిరింది. తర్వాత పైకి లేచి అతడి నుదుటిపై శిలువ గుర్తు వేసి, పెద్ద భారమేదో దించుకున్నట్లు గాఢంగా నిట్టూర్చి, వెనుదిరిగింది.
గేబ్రియేలా గది తలుపు దాటబోతోండగా నర్స్ లోపలికొస్తూ ఎదురయింది. గుర్తుపట్టినట్లు ఓ నవ్వు నవ్వి, తలుపు శబ్దం కాకుండా మూసి మంచం దగ్గరికొచ్చింది. పల్స్ పరీక్షించి అంతా బాగుందన్నట్లు తలూపి చెప్పింది, “మీ భార్య—అసలు రెస్ట్ తీసుకుంటున్నట్లు లేరు. విజిటింగ్ అవర్స్ తర్వాత కూడా ఇక్కడే హాల్‌లో ఉంటున్నారు.”
అతడి కళ్లలో ఆశ్చర్యం; గుండె లోతులో ఎక్కడో తడి.
నర్స్ చకచకా తన పనులు తాను చేసుకుపోయింది. టెంపరేచర్ చూడటం, ఇతర రీడింగ్స్ తీసుకోవటం, ఐవీ లైన్ సరిచేయటం. వెళుతూ, తలుపు గది మూసిందల్లా మళ్లీ తెరిచి, ముఖం లోపలకి పెట్టి నవ్వుతూ చెప్పింది, “ఈ రోజు మీకు విజిటర్ల వరదలా ఉంది.”
ఆ మాటలు పూర్తి కాకుండానే గదిలోకి ఇష్తర్ అడుగుపెట్టింది. వచ్చి కుర్చీలాక్కుని అతడి పక్కనే కూర్చుంది. ఆమె ముఖంలో నవ్వు లేదు. కళ్లలో నీళ్లు లేవు. ఎప్పటిలాగే భావరహితమైన ఇష్తర్. రెండు చేతులూ పొందికగా ఒడిలో పెట్టుకుని సూటిగా అతడి ముఖంలోకి చూస్తూ కూర్చుంది. అతడి ఉఛ్వాస నిశ్వాసాలని కొలుస్తున్నట్లు, ఊపిరిని తూస్తున్నట్లు, అతడిని ఓ నీడలా కాకుండా నిజంలా చూస్తున్నట్లు—చూసింది.
ఆఖరుకి మాట్లాడింది—మెల్లిగా, స్పష్టంగా—ఏదో ఘనకార్యం చేసినట్లు కాకుండా, యాంత్రికంగా, చిట్టాపుస్తకం చదువుతున్నట్లు. “నీ పేరెంట్స్ అవసరాలు నేను చూసుకుంటున్నాను. వాళ్ల గురించేమీ వర్రీ అవొద్దు.”
అతడి కళ్లు పెద్దగా అయ్యాయి.
“నువ్వు కోలుకున్నాక—రెండు నెలలో, నాలుగు నెలలో—ఎప్పుడైతే అప్పుడు,” ఆమె కొనసాగించింది, “మళ్లీ ఉద్యోగంలో చేరిపో. అప్పటిదాకా ఏదోలా మేనేజ్ చేస్తాను.”
అతడి కంట్లోంచి ఓ నీటిచుక్క బయటికొచ్చి, బుగ్గ మీదుగా కిందికి జారింది.
6
మూడు నెలల తర్వాత ఓ సాయంత్రం –
అతడు ఇష్తర్ రెస్టారంట్ కిచెన్‌లో నిలబడి ఉన్నాడు. గాయాలు చాలావరకూ మానాయి కానీ మాట ఇంకా రావటం లేదు. కాగితాల మీద రాసి చూపటం లేదా సైగల భాష ద్వారా నెట్టుకొస్తున్నాడు. బాగా వదులైపోయిన పాత ఏప్రన్ తొడుక్కుని పనిచేస్తున్నాడు. అలవాటైన పరిసరాలు – అంతకు ముందులాగే ఉన్నాయి. ఆ వంటింటి సాంగత్యం అతడికి ఏదో సాంత్వన ఇస్తోంది.
ప్రస్తుతం అతడు తన స్పెషల్ దమ్ బిర్యానీ వండుతున్నాడు. నాలుగు నెలలుగా ఇష్తర్ రెస్టారంట్ నత్తనడక నడిచింది. దాన్ని తిరిగి గాడిన పడేసే పనిలో ఉన్నాడిప్పుడు. అయితే అదంత తేలిగ్గా లేదు.
బాణలిలో తాలింపు ఘాటు అతడి కళ్లని మండిస్తోంది. కానీ వాసన మాత్రం తెలీటం లేదు. అంచనా మీద మోతాదులు ఎంచి అలవాటుగా కలుపుతున్నాడు. స్పూన్‌తో కొంచెం తీసుకుని చవి చూశాడు. రుచి తెలీలేదు.
డైనింగ్ హాల్ నుండి తలుపు నెట్టుకుని సర్వర్ కుర్రాడు వంటింట్లోకి వచ్చాడు, బటర్ చికెన్ బౌల్ పట్టుకుని.
“ఇందులో ఉప్పెక్కువైందట. కస్టమర్ కంప్లైంట్”, సర్వర్ చేతిలోని బౌల్ అతడి ఎదురుగా పెట్టాడు.
అతడు తలూపి కాస్త మీగడ తీసుకుని ఎదురుగా ఉన్న బటర్ చికెన్ గిన్నెలో వేశాడు. తర్వాత కారం, గరం మసాలా జోడించి కలిపాడు. ఓ స్పూన్‌తో దాన్ని తీసుకుని రుచి చూడబోయి – మనసు మార్చుకుని వదిలేసి, మరో బౌల్‌లో బటర్ చికెన్ నింపి సర్వర్ చేతికందించాడు. ఆ కుర్రాడు అతడికేసి ఓ సారి చూసి, ఏమీ మాట్లాడకుండా వెళ్లిపోయాడు.
అతడు కిచెన్ కౌంటర్ని ఆనుకుని వెనక్కి తిరిగి నిలబడ్డాడు. కళ్లలో నీళ్లు ఉబికాయి—తాలింపు ఘాటుకి కాదు. ముంజేత్తో వాటిని తుడిచేసుకున్నాడు.
వంటింట్లో ఓ మూలనుండి ఇష్తర్ అతడినే మౌనంగా చూస్తోంది.
కస్టమర్లందరూ వెళ్లి పోయి, ఆఖరి టేక్-అవుట్ ఆర్డర్స్ కూడా ఐపోయి, రెస్టారంట్ మూసేసే సమయానికి – ఓ గిన్నెలో సెగలు కప్పుతోన్న దాల్ మఖానీ పట్టుకొచ్చి అతడి ముందున్న టేబుల్ మీద పెట్టింది ఇష్తర్. తలెత్తి చూశాడు.
“తిను.”
స్పూన్‌తో కొంచెం తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
“ఏమైనా తెలుస్తోందా?”
తల అడ్డంగా ఊపాడు.
ఆమె తల పంకించి, స్టూల్ లాక్కుని అతడి పక్కనే కూర్చుంది.
“వేరెవరో ఆడదానికోసం ఇర్ఫాన్ నన్నొదిలేసి పోయాక … ఒంటరితనం, ముగ్గురు పిల్లలు, ఎన్నో ప్రశ్నలు. చాలా కాలం ఏం తిన్నా కాగితాలు నమిలినట్లుండేది. రుచి అనేది గతించిన జ్ఞాపకంలా అనిపించేది. జీవితం ముగిసిపోయినట్లుండేది.”
స్పూన్ గిన్నెలో పెట్టి ఆమెకేసి చూశాడు. ఆమె గొంతులో అంతకు ముందెన్నడూ వినిపించని మార్దవం.
“ఒక మధ్యాహ్నం పిల్లల్ని స్కూల్ నుండి ఇంటికి తీసుకొస్తుంటే,” ఆమె కొనసాగించింది, “దారిలో మొబైల్ ఫుడ్ ట్రక్ కనిపించింది. ఎందుకనిపించిందో, అక్కడ ఆగి ఆలూ టిక్కీ తీసుకున్నా.”
ఎక్కడో చూస్తూ, ఏదో గుర్తు చేసుకుంటున్నట్లుగా నవ్విందామె.
“వేడి వేడిగా ఉందది. చిన్న బైట్ తిన్నా. నోరు కాలింది. ఏడుపొచ్చింది. కాలినందుక్కాదు, రుచి తెలిసినందుకు. ఎన్నాళ్ల తర్వాతో … నేను నిజంగా తిన్న తిండి. హఠాత్తుగా—కలలోంచి మేలుకున్నట్లూ, జీవితం మళ్లీ మొదలైనట్లూ అనిపించింది. అక్కడే కూర్చుని ఏడ్చేశాను.”
కొద్ది క్షణాలాగి, మళ్లీ కొనసాగించింది, అతడికేసి చూస్తూ.
“అప్పుడర్ధమయింది—రుచికరమైన భోజనం మన ఆకలి తీర్చటమే కాదు, మనసుల గాయాలూ మానుస్తుందని. అందుకే ఈ రెస్టారంట్ పెట్టా.”
ఇద్దరి మధ్యా కాసేపు మౌనం కాలక్షేపం చేసింది.
“నీకూ ఆ రోజొస్తుంది,” మౌనాన్ని ఛేదిస్తూ ఇష్తర్ మాట్లాడింది. “అందాకా—పోరాడుతూనే ఉండు. నీ నాలుక మర్చిపోయినా, నీ చేతులు మర్చిపోవు. వాటితోనే వండు.”
7
మరునాటి ఉదయం—అతడొక్కడే వంటగదిలో ఉన్నాడు.
రెస్టారంట్ ఇంకా తెరవలేదు. శబ్దాలేవీ లేవు.
చుట్టూ దాల్చినచెక్క, ధనియాలు, లవంగాలు, వెల్లుల్లి, అల్లం, మాంసం, ఇంకేవేవో వాసనలు—కనపడని దెయ్యాల్లా అతడి ఊహల్లో తేలుతున్నాయి.
ఆ రోజు—ఎన్నో ఏళ్ల తర్వాత ‘స్టార్ హోటల్ స్పెషల్ సాంబార్’ పెట్టుకున్నాడు, తన కోసం—చేతివేళ్ల చివర్లనుండి చిన్ననాటి జ్ఞాపకాలు చల్లుతూ.
కస్టమర్లు లేరు. ఆర్డర్లు లేవు. అతడు, ఎదురుగా ఓ బౌల్ నిండా సెగలు కక్కుతోన్న సాంబార్. పక్కనే ప్లేట్‌లో ఇడ్లీలు.
తన ప్రతి కదలికా కోల్పోయినదాన్ని తీసుకొస్తుందేమోనన్నట్లు—మెల్లిగా, దీక్షగా ఇడ్లీ తుంచి సాంబార్‌లో ముంచి రుచి చూశాడు.
నథింగ్.
ఉప్పు, కారం, వేడి … ఏదీ లేదు. నాలుకపై ఏదో పాకినట్లు లీలామాత్రపు స్పర్శ. అంతే.
అతడి కళ్లు నిండాయి. ఓ కన్నీటి చుక్క బయటికొచ్చింది. ఈ సారి దాన్ని తుడుచుకోలేదు.
మరో ఇడ్లీ ముక్క తీసుకోబోతూండగా, బుగ్గ మీంచి కన్నీటి చుక్క రాలి సాంబార్ బౌల్‌లో పడింది.
ఓ క్షణం దాన్నే చూసి, స్పూన్‌తో కలిపి తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
ప్రస్తుతానికి … అదొక్కటే అతడికి తెలిసిన రుచి.
*
Add comment